జల శక్తి మంత్రిత్వ శాఖ

2020-21లో 13 లక్షల గ్రామీణ గృహాలకు టాప్ కనెక్షన్లు ఇవ్వాలని అస్సాం నిర్ణయం

Posted On: 31 MAY 2020 4:02PM by PIB Hyderabad

జలశక్తి మంత్రిత్వ శాఖ పరిశీలన, ఆమోదం కోసం అస్సాం వార్షిక కార్యాచరణ ప్రణాళిక ప్రతిపాదించింది. జలజీవన్ మిషన్ (జెజెఎం) కింద 2020-21 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం రూ.1407 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. రాష్ట్రంలోని మొత్తం 63 లక్షల ఇళ్లలో 13 లక్షల ఇళ్లకు 13 లక్షల టాప్ కనెక్షన్లు ఇవ్వాలని అస్సాం భావిస్తోంది. రాష్ట్రంలో గల పుష్కలమైన భూగర్భ, ఉపరితల  జలవనరులను పరిగణనలోకి తీసుకుంటే జలజీవన్ మిషన్ లక్ష్యాన్ని చేరడం అంత కష్టం ఏమీ కాదు.
ప్రప్రథమంగా అందుబాటులో ఉన్న ఫలాలపై అంటే ఇప్పటికే నీటి సరఫరా పథకలు గల ప్రాంతాలపై దృష్టి కేంద్రీకరించడం ద్వారా ఆశించిన ఫలాలు సాధించాలని రాష్ట్రం భావిస్తోంది. అలాగే ఇప్పటివరకు నీటి సరఫరా సదుపాయం అందుబాటులో లేని బలహీన, నిరాదరణకు గురవుతున్న వర్గాల కుటుంబాలన్నింటికీ ప్రాధాన్యతా క్రమంలో టాప్ కనెక్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామీణ సమాజం క్రియాశీల భాగస్వామ్యంతో గ్రామీణ కార్యాచరణ ప్రణాళిక (విఏపి) సమర్థవంతంగా అమలుపరిచేందుకు కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంది. ఎంజిఎన్ఆర్ఇజిఎస్, ఎస్ బిఎం (జి), పంచాయతీ రాజ్ సంస్థలకు 15వ ఆర్థిక సంఘం నిధులకల్పన, జిల్లా ఖనిజాభివృద్ధి నిధి, కాంపా, ప్రాంతీయ అభివృద్ధి ప్రణాళిక నిధి వంటి గ్రామీణాభివృద్ధికి అందుబాటులో ఉన్న గ్రామీణ స్థాయి వనరులన్నింటినీ పూర్తి స్థాయిలో సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా ప్రస్తుత నీటి వనరులు దీర్ఘకాలిక మన్నిక కలిగి ఉండేలా పటిష్ఠం చేయాలని కూడా రాష్ట్రప్రభుత్వం భావిస్తోంది.

ప్రణాళిక రూపకల్పన సమయంలోనే నాణ్యత కొరతగా ఉన్న ప్రాంతాలు, ఆశావహ జిల్లాలు, ఎస్ సి/ ఎస్ టి జనాభా అధికంగా ఉన్న ప్రాంతాలు, గ్రామాలు, సన్సద్ ఆదర్శ్ గ్రామీణ్ యోజన పరిధిలోని గ్రామాల్లో ప్రాధాన్యతా ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని రాష్ట్రం భావిస్తోంది.

అన్నింటికీ మించి నీటి సరఫరా వ్యవస్థలు దీర్ఘకాలిక మన్నిక కలిగి ఉండేలా చూసేందుకు వాటి ప్రణాళిక, అమలు, సమర్థవంతమైన నిర్వహణ, పనితీరు వంటి అంశాల్లో స్థానిక గ్రామీణ సమాజం/  గ్రామ పంచాయతీలు, వాటి సబ్ కమిటీలు/  వినియోగ బృందాలు అన్నింటినీ భాగస్వాములను చేస్తారు. నీటి నాణ్యతపై నిఘా విధించడంలో స్థానిక సమాజం భాగస్వామ్యాన్ని జల్ జీవన్ మిషన్ ప్రోత్సహిస్తుంది. స్థానిక సమాజాన్ని భాగస్వామిని చేయడం, సాధికారం చేయడం దిశగా పిహెచ్ఇ శాఖ చిత్తశుద్ధితో కృషి చేస్తుంది. ఇందుకోసం సకాలంలో కిట్ల సేకరణ, సమాజానికి కిట్ల సరఫరా, ప్రతీ గ్రామంలోనూ కనీసం ఐదుగురు మహిళలను ప్రత్యేకంగా గుర్తించడం, క్షేత్రస్థాయి కిట్ల సమర్థ వినియోగం విషయంలో మహిళలకు శిక్షణ ఇవ్వడం, జలవనరుల నాణ్యతపై ప్రయోగశాలలు నిర్వహించే పరీక్షా నివేదికలు సమన్వయపరచడం వంటివన్నీ కార్యాచరణలో భాగంగా పొందుపరిచారు.

ప్రపంచాన్ని కోవిడ్-19 మహమ్మారి కుదిపేస్తున్న ప్రస్తుత వాతావరణంలో ప్రజలు బహిరంగ నీటి సరఫరా వ్యవస్థలు, కుళాయిల వద్ద భారీ సంఖ్యలో గుమిగూడకుండా నివారించడం కూడా ప్రధానం. ఆ అంశాన్ని దృష్టిలో ఉంచుకునే రాష్ట్రప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ప్రతీ ఒక్క ఇంటికీ టాప్ కనెక్షన్లు ఇచ్చే విధంగా నీటి సరఫరా వ్యవస్థలను నిర్మించడం కోసం కృషి చేస్తోంది. దీని వల్ల సామాజిక దూరం పాటించడం సాధ్యమవుతుంది. అలాగే స్థానిక ప్రజలకు ఉపాధి లభించి గ్రామీణ ఆర్థిక రంగం ఉత్తేజితం అవుతుంది.

కోవిడ్-19 మహమ్మారి సృష్టించిన కల్లోలం నేపథ్యంలో తాము పని చేస్తున్న పట్టణాల నుంచి సొంత గ్రామాలకు తిరిగి వచ్చిన వలస కూలీలకు ఉపాధి కల్పించడం అత్యంత ప్రధానంగా మారింది. వలస కార్మికులందరూ పాక్షిక, పూర్తి నైపుణ్యాలున్న వారు కావడం వల్ల నీటి సరఫరా వ్యవస్థల నిర్మాణం, తగినన్ని భూగర్భ జలవనరులు ఉండేలా జల వనరుల సంరక్షణ వ్యవస్థల అభివృద్ధి, ప్లంబింగ్, ఫిటింగ్ వంటి పనుల్లో వారి సేవలను ఉపయోగించుకోవచ్చు. తద్వారా నీటి భద్రత సాధించడం, వ్యవసాయానికి తగినంత తీరు అందుబాటులో ఉంచడంతో పాటు గ్రామీణ గృహాలన్నింటికీ మంచినీరు అందించడం కూడా సాధ్యమవుతుంది.

జల్ జీవన్ మిషన్ అమలుతో ఇంటింటికీ నీటి సరఫరా అందుబాటులో ఉండాలని ఆశిస్తూ కనీసం తమకు ఇలాంటి వసతి అందుబాటులోకి వస్తుందని గత ఏడాది వరకు ఊహించని గ్రామీణులందరి కల సాకారం అవుతుంది. అయితే రాష్ర్టాల క్రియాశీల మద్దతుతో జలవనరుల మంత్రిత్వ శాఖ గ్రామీణ ప్రజలకు నిరంతర, దీర్ఘకాలిక ప్రాతిపదికన తగినంత మంచినీరు అందుబాటులోకి తెచ్చే విధంగా ఆ కార్యక్రమం ముందుకు నడిపిస్తోంది.

2024 నాటికి మొత్తం 18 కోట్ల గ్రామీణ గృహాలకు నీటి టాప్ కనెక్షన్లు కల్పించడం లక్ష్యంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ గత ఏడాది జల్ జీవన్ మిషన్ ప్రకటించారు. గ్రామీణ ప్రజల జీవితాలు మెరుగుపరచడం కోసం ప్రతీ ఒక్క ఇంటికీ టాప్ కనెక్షన్లు కల్పించాలని రాష్ట్రప్రభుత్వాలు గట్టిగా కృషి చేస్తున్నందు వల్ల జల్ జీవన్ మిషన్ రాష్ర్టాలన్నింటికీ ప్రయోజనం చేకూర్చుతుంది. “సమానత్వం, సమ్మిళితత్వం” ప్రాతిపదికన ఈ పరివర్తిత కార్యక్రమం కృషి చేస్తుంది.  
 



(Release ID: 1628261) Visitor Counter : 198