రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

అండమాన్, నికోబార్ కమాండ్ కమాండర్ ఇన్ చీఫ్ గా రేపు బాధ్యతలు చేపట్టనున్న లెఫ్టనెంట్ జనరల్ మనోజ్ పాండే

నేడు పదవీ విరమణ చేస్తున్న ప్రస్తుత కమాండర్ ఇన్ చీఫ్ లెఫ్టనెంట్ జనరల్ పొదలి శంకర్ రాజేశ్వర్

Posted On: 31 MAY 2020 6:22PM by PIB Hyderabad

అండమాన్, నికోబార్ కమాండ్ (సిన్ కాన్) 15వ కమాండర్ ఇన్ చీఫ్ గా లెఫ్టనెంట్ జనరల్ మనోజ్ పాండే జూన్ 1వ తేదీన అధికార బాధ్యతలు చేపడుతున్నారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ పాత విద్యార్థి అయిన ఆయన 1982లో ఇంజనీరింగ్ కార్ప్స్ లో (ద బోంబే సాపర్స్) జనరల్ ఆఫీసర్ గా చేరారు. కాంబర్లీ (యునైటెడ్ కింగ్ డమ్) స్టాఫ్ కాలేజి గ్రాడ్యుయేట్ ఆయన. ఆ తర్వాత ఆయన మహోలోని ఆర్మీ వార్ కాలేజి, ఢిల్లీలోని నేషనల్ డిఫెన్స్ కాలేజి (ఎన్ డిసి) హయ్యర్ కమాండ్ కోర్స్ చేశారు.

37 సంవత్సరాల విశిష్ట సర్వీసులో ఆయన ఆపరేషన్ వినయ్, ఆపరేషన్ పరాక్రమ్ పోరాటాల్లో క్రియాశీలమైన పాత్ర పోషించారు. జమ్ము కశ్మీర్ లో వాస్తవాధీన రేఖ వద్ద ఇంజనీర్ రెజిమెంట్ కమాండ్ చేయడంతో పాటు, వాస్తవాధీన రేఖ వెంబడి మోహరించి ఉండే ఇన్ ఫాంట్రీ బ్రిగేడ్ పోరాట దళానికి ఇంజనీర్ బ్రిగేడ్ గాను, పశ్చిమ లదాఖ్ లో వాస్తవాధీన రేఖ వెంబడి అత్యున్నతమైన శిఖరాల్లో మోహరించిన మౌంటెన్ డివిజన్, ఈశాన్య రాష్ర్టాల్లో శత్రుసేనల చొరబాటు నిరోధక విభాగంలో కూడా పని చేశారు. సైనిక సిబ్బందికి నియోగించే అత్యంత ప్రధానమైన కార్యకలాపాలకు ఆయన ప్రత్యేకంగా నియమితులయ్యారు. ఇథియోపియా, ఎరిట్రియా దేశాల్లో ఐక్యరాజ్య సమితి శాంతిదళాల చీఫ్ ఇంజనీర్ గా పని చేశారు. ప్రస్తుత నియామకానికి ముందు ఆయన క్రమశిక్షణ, సాంప్రదాయిక , సంక్షేమ వ్యవహారాలు పర్యవేక్షించే సైనికదళ ప్రధాన కార్యాలయం డైరెక్టర్ జనరల్ గా ఉన్నారు.

కాగా అండమాన్, నికోబార్ కమాండ్ కు (సిన్ కాన్) 14వ కమాండర్ ఇన్ చీఫ్ గా పని చేసిన లెఫ్టనెంట్ జనరల్ పొదలి శంకర్ రాజేశ్వర్ -పివిఎస్ఎం, ఎవిఎస్ఎం, విఎస్ఎం, ఎడిసి- మే 31వ తేదీన పదవీ విరమణ చేశారు. నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన విశిష్ట సర్వీసులో ఆయన ఎన్నో మైలురాళ్లు అధిగమించి ఎంతో ఉన్నతమైన వారసత్వాన్ని అందించారు. 2019 డిసెంబర్ 1వ తేదీన ఆయన ఆ నియామక పత్రం స్వీకరించారు.  

సిన్ కాన్ లో పని చేసిన కాలంలో ఎఎన్ సి దళం పోరాట సంసిద్ధతను మెరుగుపరచడంపై ఆయన దృష్టి సారించారు.  2020 ఫిబ్రవరి 13 నుంచి 21 తేదీల మధ్య కాలంలో ఇండో థాయ్ కోఆర్డినేటెడ్ పెట్రోల్ (కోర్పత్) 29వ ఎడిషన్ ను విజయవంతంగా నిర్వహించారు.

లెఫ్టనెంట్ జనరల్ రాజేశ్వర్ నిర్దేశకత్వంలో కరోనా మహమ్మారిని ఎదుర్కొనడంలోను, దీవుల్లోని ప్రజలందరికీ అవసరమైన ఊరట కలిగించడంలోను అండమాన్, నికోబార్ యంత్రాంగానికి సమన్వయపూర్వక సహకారం అందించడంలో  ఈ దళం సిబ్బంది చురుగ్గా పని చేయడంతో పాటు అందుబాటులో ఉన్న వనరులు కూడా ఆ కార్యకలాపాలకు సమర్థవంతంగా వినియోగించారు.

ఆయన అందించిన విశిష్ట సేవలకుగాను లెఫ్టనెంట్ జనరల్ రాజేశ్వర్ కు పరమ విశిష్ట సేవా పతనం (పివిఎస్ఎం) 2020 జనవరి 26వ తేదీ బహూకరించారు. 2019 నవంబర్ లో భారత  రాష్ట్రపతి గౌరవ ఎయిడ్-డి-కాంప్ (ఎడిసి)గా నియమించారు.

***
 



(Release ID: 1628260) Visitor Counter : 304