జల శక్తి మంత్రిత్వ శాఖ

జల్‌ జీవన్‌ మిషన్‌ కింద బిహార్‌ వార్షిక కార్యాచరణ ప్రణాళికకు ఆమోదం

1832.66 కోట్ల రూపాయలు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం
కోటిన్నర గృహాలకు 2020-21 నాటికి కొళాయి కనెక్షన్లు
మహిళల్లో జీవన సౌలభ్యాన్ని పెంచడంలో జేజేఎం కీలక పాత్ర

Posted On: 30 MAY 2020 4:45PM by PIB Hyderabad

బిహార్‌ ప్రభుత్వం, జల్‌ జీవన్‌ మిషన్‌ (జేజేఎం) కింద వార్షిక కార్యాచరణ ప్రణాళికను కేంద్ర జల్‌ శక్తి మంత్రిత్వ శాఖ ఆమోదం కోసం సమర్పించింది. 2020-21 నాటికి తమ రాష్ట్రంలోని ప్రతి ఇంటికి కొళాయి నీటిని అందించాలన్నది బిహార్‌ లక్ష్యం. ఈ భారీ లక్ష్యాన్ని సాధించేందుకు తగిన ప్రణాళికను ఆ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసుకుంది. 2020-21 నాటికి మొత్తం 38 జిల్లాల్లోని 100 శాతం ఇళ్లకు కొళాయి కనెక్షన్లు ఇచ్చేలా కార్యాచరణ రూపొందించింది. ఆసక్తి ఉన్న జిల్లాలు, ఎస్సీ/ఎస్టీ గ్రామాల్లో 100 శాతం "ఫంక్షనల్ హౌస్‌హోల్డ్ ట్యాప్ కనెక్షన్లు" (ఎఫ్‌హెచ్‌టీసీ) అందించడంపై బిహార్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. బిహార్‌లో భూగర్భ, ఉపరితల జలాల లభ్యత సమృద్ధిగా ఉండడంతో ఈ దిశగా ప్రయత్నాలు చేస్తోంది.

కోటిన్నర గృహాలకు 2020-21 నాటికి కొళాయి కనెక్షన్లు
    రాష్ట్రంలో కొళాయి కనెక్షన్లు లేని కోటిన్నర గృహాలకు 2020-21 నాటికి కొళాయి కనెక్షన్లు ఇచ్చేందుకు బిహార్‌ ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం 1832.66 కోట్ల రూపాయలు కేటాయించింది.

ఇంటి ఆవరణలోకే నీటిని అందించడం చాలా సమస్యలకు ఏకదశ పరిష్కారం
    మండుతున్న ఎండలు, కొవిడ్‌-19 విలయం మధ్య, శుద్ధమైన తాగునీటి లభ్యత ప్రాధాన్యమైన అంశం. చేతులు కడుక్కోవడం, పరిశుభ్రత పాటించడానికి శుద్ధమైన నీరు అవసరం.  గ్రామీణ ప్రాంతాలన్నీ నీటి కోసం దాదాపుగా చెరువులు, బావులపై ఆధారపడి ఉంటాయి. అక్కడ సామాజిక దూరం పాటించేలా చూడటం కష్టం. ప్రతి ఇంటి ఆవరణలోకే నీటిని అందించడం ఈ సమస్యకు ఏకదశ పరిష్కారం. కరోనా వైరస్‌ విస్తరిస్తున్న ఈ సమయంలో, గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి కొళాయి కనెక్షన్‌ ఇవ్వటం ప్రజల జీవన సౌలభ్యాన్ని పెంచుతుంది. ముఖ్యంగా మహిళలు, బాలికలను చాకిరీ నుంచి విముక్తి చేసి, సురక్షిత జీవనం సాగించేలా చేస్తుంది.

    గత కాలంతో పోలిస్తే నీటి లభ్యతలో గుర్తించదగిన వృద్ధి ఉన్నా ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉంది. ప్రతి ఇంటికి కొళాయిల ద్వారా నీటిని అందించడంతోపాటు.., నీటి సంరక్షణ, వర్షపు నీటి నిల్వ, వ్యర్థ జలాల నిర్వహణ, భూగర్భ జలాల పరిమిత వినియోగం అంశాలకు కూడా బిహార్ సమాన ప్రాధాన్యం ఇవ్వవలసిన అవసరం ఉంది.

ప్రతి కుటుంబానికి ప్రతిరోజు 55 లీటర్ల తాగునీరు
    రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో జల్‌ జీవన్‌ మిషన్‌ (జేజేఎం)ను ప్రారంభించారు. 2024 లోగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటి ఆవరణలోకి కొళాయి నీటిని ఇవ్వాలన్నది లక్ష్యం. నిర్దేశిత నాణ్యత ప్రకారం ప్రతి కుటుంబానికి ప్రతిరోజు 55 లీటర్ల తాగునీటిని దీర్ఘకాలిక ప్రణాళికపై అందించాలన్నది పథకం ఉద్దేశం. ఇంటి వద్దకే సేవలను అందించేలా నిబంధన రూపొందించి, గ్రామీణ ప్రాంత ప్రజల జీవన విధానాన్ని మెరుగుపరచేలా కేంద్ర ప్రభుత్వం చేసే ప్రయత్నం ఇది. 

గ్రామీణ సంఘాలే ఈ పథకంలో కేంద్ర బిందువులు 
    ఈ కార్యక్రమాన్ని అమలు చేయడానికి వివిధ స్థాయుల్లో సంస్థాగత ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పీహెచ్‌ఈలు, గ్రామీణ నీటి సరఫరా విభాగాలు, స్థానిక సంఘాలు ఇందులో కీలక పాత్ర పోషిస్తాయి. గ్రామీణ నీటి సరఫరా పథకాన్ని అమలు చేయడానికి గ్రామ పంచాయతీలు, గ్రామీణ నీటి శుద్ధి కమిటీలు, వినియోగ సంఘాలను ప్రోత్సహిస్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే గ్రామీణ సంఘాలే ఈ పథకంలో కేంద్ర బిందువులు కాబట్టి, వాటికే యాజమాన్య బాధ్యతలు అప్పగిస్తారు. నీటి నాణ్యత విషయంలోనూ ఈ కమిటీలు ముఖ్య పాత్ర పోషిస్తాయి.

గ్రామీణ ప్రజల్లో జీవన సౌలభ్యాన్ని పెంచడంలో జేజేఎం కీలక పాత్ర
    రోజువారీ అవసరాల కోసం నీటిని తెచ్చేందుకు గ్రామీణ మహిళలు, బాలికలు చాలా సమయాన్ని, శక్తిని వెచ్చిస్తున్నారు. దీనివల్ల మహిళలు ఆదాయాన్ని పొందగలిగే అవకాశాలను కోల్పోతున్నారు. బాలికలు పాఠశాలలకు గైర్హాజరవుతున్నారు. వారిలో ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. గ్రామీణ ప్రజల్లో, ముఖ్యంగా మహిళల్లో జీవన సౌలభ్యాన్ని పెంచేందుకు జేజేఎం కీలక పాత్ర పోషిస్తుంది. మహిళలు తమ  అవసరాలు, ఆకాంక్షలను తీర్చుకోడానికి తమ తమ గ్రామాల్లో జేజేఎంను ముందుండి నడిపించాల్సిన అవసరం ఉంది.



(Release ID: 1627958) Visitor Counter : 293