పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ

56 సీఎన్‌జీ స్టేషన్లను జాతికి అంకితం చేసిన మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్

- ఆన్‌లైన్ వేడుక ద్వారా 11 రాష్ర్టాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల‌లో స్టేష‌న్ల ప్రారంభం
- త్వరలో దేశ జనాభాలో 72 శాతం మేర ప్ర‌జ‌ల‌కు చేరువకానున్న సీజీడీ నెట్‌వర్క్

Posted On: 29 MAY 2020 2:59PM by PIB Hyderabad

పర్యావరణ అనుకూలమైన 'కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్‌జీ) యొక్క విస్తరణను విస్తరిస్తూ కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు మరియు ఉక్కు శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్, ఆన్‌లైన్ వేడుక ద్వారా శుక్రవారం (29వ తేదీ) 48 సీఎన్‌జీ స్టేషన్లను జాతికి అంకితం చేశారు. దీనికి తోడు దేశంలోని 8 సీఎన్‌జీ స్టేషన్లను కూడా ప్ర‌జా వినియోగానికి ప్రారంభించారు. ఈ 56 స్టేషన్లు 11 రాష్ట్రాలు / కేంద్ర‌పాలిత ప్రాంతాలైన -గుజరాత్, హర్యాణా, జార్ఖండ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, న్యూఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్లలో విస్తరించి ఉన్నాయి. ఇవి 11 ప్ర‌యివేటు, ప్ర‌భుత్వ రంగ సంస్థలకు చెందినవిగా ఉన్నాయి. దేశంలో స‌హ‌జ వాయువు నెట్‌వర్క్ విస్తరణలో వాటాదారులందరి కృషిని ప్రశంసించిన శ్రీ ప్రధాన్, దేశంలోని 72% జనాభా త్వరలో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (సీజీడీ) నెట్‌వర్క్ ప‌రిధిలోకి రానుంద‌ని ఆయ‌న తెలిపారు. ఇది భౌగోళిక విస్తీర్ణంలో 53 శాతానికి స‌మాన‌మ‌ని అన్నారు.
గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ వైపు పయనం..
మ‌న దేశం గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ వైపు పయనిస్తోందని అన్నారు. పీఎన్‌జి స్టేషన్ల సంఖ్య 25 లక్షల నుంచి 60 లక్షలకు పెరిగింది; 28 వేల పారిశ్రామిక గ్యాస్ కనెక్షన్లు 41 వేలకు, సీఎన్‌జీ వాహనాల సంఖ్య 22 లక్షల నుంచి 34 లక్షలకు పెరిగింద‌ని ఆయ‌న తెలిపారు. దేశంలో గ్యాస్ మౌలిక సదుపాయాల విస్తరణలో ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేటు సంస్థలు కూడా స‌హృదయపూర్వకంగా పాల్గొంటూ  వ‌స్తున్నాయ‌ని ఇది ఎంతో‌ సంతృప్తికరంగా ఉందని అన్నారు. మ‌న దేశంలో ఇంధన సామర్థ్యం, స్థోమత, భద్రత, ప్రాప్యత దిశ‌గా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి చెప్పారు. రానున్న రోజుల్లో పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ, ఎల్‌ఎన్‌జీతో పాటు ఎల్‌పీజీ వంటి అన్ని రకాల ఇంధనాలు ఒకే చోట అందుబాటులోకి రాగ‌ల‌వ‌‌ని అశాభావం వ్య‌క్తం చేశారు. డీజిల్ స‌రఫ‌రా కోసం ప్రభుత్వం ఇప్పటికే మొబైల్ డిస్పెన్సర్‌లను ప్రారంభించిందని రానున్న రోజుల్లో పెట్రోల్ మరియు ఎల్‌ఎన్‌జీ ఇంధ‌నాలు కూడా ఇదే విధంగా అందుబాటులోకి తేవాల‌ని యోచిస్తున్న‌ట్టు మంత్రి వివ‌రించారు. భవిష్యత్తులో ఇంధనం ప్ర‌జ‌ల ఇంటి గుమ్మం వ‌ద్ద‌కే అందుబాటులోకి రాగ‌ల‌ద‌ని మంత్రి శ్రీ ప్రధాన్ అన్నారు.
భారత్‌ ప్రపంచంలో 3 వ అతిపెద్ద ఇంధన వినియోగదారు..
ఈ సంద‌ర్భంగా పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ తరుణ్ కపూర్ మాట్లాడుతూ భారతదేశం ప్రపంచంలో 3 వ అతిపెద్ద ఇంధన వినియోగదారుగా ఉంద‌ని అన్నారు. ఇంధ‌న విభాగంలో 15 శాతం గ్యాస్ వాటా కలిగి ఉండటానికి ఎంతో కృషి చేస్తోంద‌ని తెలిపారు. దేశంలో ఆర్థిక కార్యకలాపాలు, వినియోగ స్థాయి పెరిగేకొద్దీ ఇంధన వినియోగం పెరుగుతుందని ఆయన అన్నారు. పర్యావరణ అనుకూలత‌‌తో పాటు ఇంధన సామర్థ్యం, ఆర్థికంగా సమర్థవంతంగా ఉండటం కార‌ణంగానే ప్రభుత్వం గ్యాస్‌ను ఇంధనంగా ప్రోత్సహిస్తూ మద్దతుగా నిలుస్తోంద‌ని ఆయ‌న అన్నారు. ఈ వర్చువల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ, గ్యాస్ కంపెనీలు, ఓఎంసీలు మరియు ఇతర వాటాదారులు పాల్గొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని నివారించడానికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించడం వలన ఈ స్టేషన్లలో పనులు కొంత ప్ర‌భావిత‌మ‌య్యాయి. అయితే గత నెలలో ఆంక్షలు కొంత‌ సడలించిన తరువాత వీటి ఏర్పాటు ప‌నులు వేగవంతం అయ్యాయి. అన్ని భద్రత మరియు సామాజిక దూర నిబంధనలను నిర్ధారిస్తు ఈ ప‌నులు ముందుకు సాగాయి. దీంతో ఈ స్టేషన్ల ప్రారంభం కనీస ఆలస్యంతో పూర్త‌య్యాయి. స‌రికొత్త‌గా ప్రారంభ‌మైన సీఎన్‌జీ స్టేష‌న్ల‌తో భారతదేశం యొక్క సీఎన్‌జీ నెట్‌వర్క్ విస‌ర్తించింది. దేశంలో రోజువారీ వాహనా‌ల‌ను నింపే సామర్థ్యం దాదాపు 50,000 వాహనాలకు పైగా పెరిగింది.

 


(Release ID: 1627768) Visitor Counter : 322