రక్షణ మంత్రిత్వ శాఖ
పశ్చిమ నావికాదళ స్థావరంలో అల్ట్రావయొలెట్ క్రిమిసంహారిణి రూపకల్పన
యూవీ-సీ కాంతిని ఉపయోగించుకుని సూక్ష్మజీవుల అంతం
సమర్ధవంతమైన క్రిమి సంహారిణిగా అధ్యయనాల్లో వెల్లడి
Posted On:
28 MAY 2020 8:16PM by PIB Hyderabad
దేశంలో లాక్‌డౌన్‌ను దశలవారీగా సడలిస్తూ చివరకు, సంపూర్ణంగా ఎత్తివేసే పరిస్థితులు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాపార, పారిశ్రామిక కార్యకలాపాలకు సంబంధించి "కొత్త సాధారణ స్థితి" ఏంటి అన్న ప్రశ్న ఇప్పటికే సిద్ధంగా ఉంది. ముఖ్యంగా డాక్‌యార్డులు, ఇతర నావికా సంస్థలు వంటి భారీ స్థాయిలో ఉత్పత్తులు, కార్యకలాపాలు చేపట్టే సంస్థల్లో పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది ప్రశ్నగానే ఉంది. ఈ తరహా సంస్థల్లో లాక్‌డౌన్ తొలగింపు తర్వాత సిబ్బంది పెద్దసంఖ్యలో విధులకు హాజరవుతారు. ఆ సంఖ్య క్రమంగా పెరుగుతూ ఉంటుంది. సిబ్బంది ఉపయోగించే రక్షణ కవచాలు, పనిముట్లు, ఇతర వ్యక్తిగత వస్తువులను క్రిమిరహితం చేయాల్సిన అవసరాన్ని ఇది మరింత పెంచుతుంది.
భారీ సంస్థల్లో పెరుగుతున్న శానిటైజేషన్ అవసరాల కోసం ముంబయిలోని నావల్ డాక్‌యార్డు 'అల్ట్రావయొలెట్ శానిటైజేషన్ బే'ను రూపొందించింది. పనిముట్లు, దుస్తులు, ఇతర సామగ్రిని ఇది క్రిమిరహితం చేస్తుంది. తద్వారా, కరోనా వైరస్‌కు కళ్లెం పడుతుంది. క్రిములను చంపే యూవీ-సీ లైటింగ్ కోసం.., అల్యూమినియం షీట్లు, విద్యుత్ పరికరాలను ఉపయోగించి ఒక పెద్ద సాధారణ గదిని 'యూవీ బే' గా మారుస్తారు.
వస్తువులను క్రిమిరహితం చేయడానికి, 'యూవీ బే' గా మారిన గది యూవీ-సీ కాంతిని ఉపయోగించుకుంటుంది. సార్స్, ఇన్‌ఫ్లుయెంజా వంటి శ్వాస కోశ వ్యాధి కారకాలపై యూవీ-సీ ప్రభావం ఉంటుందని ప్రఖ్యాత పరిశోధన సంస్థలు చేపట్టిన అధ్యయనాల్లో నిర్ధరణ అయింది. ఒక నిమిషం లేదా అంతకంటే ఎక్కువ సేవు "యూవీ-సీ తీవ్రత 1 J/cm2" ప్రభావంలోకి సూక్ష్మజీవులు వచ్చినప్పుడు వాటి క్రియాశీలత గణనీయంగా తగ్గిందని కూడా తేలింది. దీంతో, ఇది సమర్ధవంతమైన క్రిమి సంహారిణిగా మారింది.
కరంజా నావల్ స్టేషన్‌లోనూ దాదాపు ఇలాంటి ఏర్పాటే ఉంది. అక్కడ యూవీ-సీ స్టెరిలైజర్‌తోపాటు, ఒక ఇండస్ట్రియల్ ఓవెన్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఇది చిన్నపాటి వస్తువులను 60 డిగ్రీలకు వేడి చేస్తుంది. ఈ ఉష్ణోగ్రత దగ్గర సూక్ష్మజీవులు దాదాపుగా చనిపోతాయి. సంస్థలోకి వచ్చే, బయటకు వెళ్లే ద్వారాల్లో ఈ ఏర్పాటు చేశారు. దీనివల్ల కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుతుంది.
(Release ID: 1627563)
Visitor Counter : 313