ఆర్థిక మంత్రిత్వ శాఖ

మహారాష్ట్రలో రాష్ట్ర రహదారుల అభివృద్ధికి 177 మిలియన్ డాలర్ల రుణానికై ఏడీబీ, భారత్ ఒప్పందం

Posted On: 28 MAY 2020 1:04PM by PIB Hyderabad

మహారాష్ట్రలోని దాదాపు 450 కిలోమీటర్ల (కి.మీ.ల‌) రాష్ట్ర రహదారులు మరియు ప్రధాన జిల్లా రహదారులను అభివృద్ధి చేయడానికి ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) మరియు భారత ప్రభుత్వం ఈ రోజు 177 మిలియన్ డాలర్ల రుణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. మహారాష్ట్ర రాష్ట్ర రహదారి అభివృద్ధి ప్రాజెక్టు‌కు గాను కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి (ఫండ్ బ్యాంక్ మరియు ఏడీబీ) శ్రీ సమీర్ కుమార్ ఖరే భారత ప్రభుత్వం త‌ర‌ఫున ఈ ఒప్పందంపై సంత‌కం చేయ‌గా.. ఏడీబీ భార‌త రెసిడెంట్ మిష‌న్ కంట్రీ డైరెక్టర్ శ్రీ కెనిచి యోకోయామా ఆసియా అభివృద్ధి బ్యాంకు త‌ర‌పున ఈ ఒప్పందంపై సంత‌కం చేశారు.
ద్వితీయ శ్రేణి న‌గ‌రాలు ప‌ట్ట‌ణాల అభివృద్ధి..
ఈ రుణ ఒప్పందంపై సంతకం చేసిన తరువాత శ్రీ సమీర్ కుమార్ ఖరే మాట్లాడుతూ తాజా  ప్రాజెక్ట్ రాష్ట్రంలోని వివిధ గ్రామీణ ప్రాంతాలు మరియు పట్టణ కేంద్రాల మధ్య అనుసంధాన‌త‌ను మెరుగుపరుస్తుందన్నారు. గ్రామీణ వర్గాల ప్ర‌జ‌ల‌కు మెరుగైన మార్కెట్లు, ఉపాధి అవకాశాలు మరియు సేవలను అందిపుచ్చుకోవ‌డానికి వీలు కల్పిస్తుందని వివరించారు. మెరుగైన ర‌వాణా సౌక‌ర్యాలు రాష్ట్రంలోని ప్రధాన పట్టణ కేంద్రాల వెలుపల అభివృద్ధి మరియు జీవనోపాధి అవకాశాలను ద్వితీయ శ్రేణి నగరాలు మరియు పట్టణాలకూ.. విస్తరింప‌జేస్తుంద‌ని వివ‌రించారు. తద్వారా ఆదాయ అసమానతలు తగ్గుతాయ‌ని తెలిపారు.
పనితీరు - ఆధారిత నిర్వహణ బాధ్యతల ప్రోత్సాహం..
ఈ ప్రాజెక్టు అంతర్జాతీయ ఉత్తమ విధానాల్ని అనుసరించి చేప‌డుతున్నందున ‌వృద్ధులు, మహిళలు, పిల్లలు వంటి ప్ర‌మాదం ఎక్కువ‌గా పొంచివున్న సమూహాలను రక్షించేలా చ‌ర్య‌లు ఉంటాయ‌ని యోకోయామా అన్నారు. మేటి రహదారి భద్రతా ఆడిట్ ఫ్రేమ్‌వర్క్‌తో అభివృద్ధి చేయడం వ‌ల్ల‌ రహదారి భద్రతా చర్యలను కూడా ఈ ప్రాజెక్ట్ బలోపేతం చేస్తుందని యోకోయామా అన్నారు. ఈ ప్రాజెక్టు‌కు సంబంధించి మరిన్ని వివరాలను శ్రీ కెనిచి యోకోయామా తెలియజేస్తూ కాంట్రాక్టర్లకు ఐదు సంవత్సరాల పనితీరు - ఆధారిత నిర్వహణ బాధ్యతలను ప్రోత్సహించడం ద్వారా రహదారుల‌ నిర్వహణ వ్యవస్థను నవీకరించడం ఈ ప్రాజెక్ట్ యొక్క మరో విశేష లక్షణమ‌ని ఆయ‌న అన్నారు. ఈ ప్రాజెక్టుల కింద చేప‌ట్టే ప‌నుల ఆస్తి నాణ్యత మరియు సేవా స్థాయిలను కొనసాగించడానికి ఈ త‌ర‌హా విధానాన్ని తీసుకువ‌స్తున్న‌ట్టుగా ఆయ‌న తెలిపారు.
450 కిలోమీట‌ర్ల ర‌హ‌దారుల న‌వీక‌ర‌ణ‌..
మొత్తం మీద ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా మ‌హారాష్ట్రలోని ఏడు జిల్లాల‌లోని రెండు ప్ర‌ధాన జిల్లా రోడ్లు, 11 రాష్ట్ర రహదారులను న‌వీక‌ర‌ణ చేప‌ట్ట‌నున్నారు. వీటి మొత్తం పొడువు 450 కిలో మీట‌ర్లు. వీటిని రెండు లేన్ల ప్రమాణాలకు అప్‌గ్రేడ్ చేయ‌నున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో చేప‌ట్టే న‌వీక‌ర‌ణ ప‌నులు
మ‌హారాష్ట్రలోని జాతీయ రహదారులు, అంతరాష్ట్ర రహదారులు, ఓడ రేవుల‌కు చేరే ర‌హ‌దా‌రులు, విమానాశ్రయాలు, రైలు కేంద్రాలకు, జిల్లాల ప్ర‌ధాన కేంద్రాల‌కు, పారిశ్రామిక ప్రాంతాల‌కు, వివిధ సంస్థల‌ సమూహాల క్ల‌స్ట‌ర్ల‌కు మరియు రాష్ట్రంలోని వివిధ ప్ర‌ధాన వ్యవసాయ ప్రాంతాల‌కు కూడా అనుసంధాన‌త‌ను పెంచ‌నుంది.
సిబ్బందికి అధునాత అంశాల‌పై శిక్ష‌ణ‌..
ఈ ప్రాజెక్టులో భాగంగా మహారాష్ట్ర పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ ప్రాజెక్టు సిబ్బందికి  రహదారి రూపకల్పన, రహదారి నిర్వహణ ప్రణాళిక మరియు రహదారి భద్రతలో వాతావరణ మార్పుల అనుసరణ మరియు విపత్తులను ఎదుర్కొని నిలిచేలా ర‌హ‌దారుల నిర్మాణం త‌దిత‌రాల‌పై
మెరుగైన శిక్షణ ఇవ్వడంపై కూడా దృష్టి సారించనున్నారు.
పెద‌రిక నిర్మూల‌న‌కు క‌ట్టుబ‌డుతూనే..
క‌టిక పేదరికాన్ని నిర్మూలించడానికి తన ప్రయత్నాలను కొనసాగిస్తూనే సంపన్నమైన, అన్ని వ‌ర్గాల వారు భాగ‌స్వామ్యం చేసేలా,  స్థితిస్థాపకంగా మరియు స్థిరమైన ఆసియా మరియు పసిఫిక్ సాధించడానికి ఏడీబీ కట్టుబడి ఉంది. 1966 లో స్థాపించబడిన ఏడీబీ త‌న మొత్తం 68 మంది సభ్యుల‌లో 49 మందిని ఈ ప్రాంతం నుంచే క‌లిగి ఉంది. 


(Release ID: 1627440) Visitor Counter : 250