జల శక్తి మంత్రిత్వ శాఖ
ప్రపంచ తాబేళ్ళ దినోత్సవం సందర్భంగా జలజీవుల సంరక్షణకు పిలుపునిచ్చిన కేంద్ర జల శకక్తి మంత్రి శ్రీ గజేంద్రసింగ్ షెకావత్
“ జీవవైవిధ్యం భారతీయ సంస్కృతిలో ప్రధాన అంతర్భాగం” : శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్
‘అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం’ నిర్వహణ
Posted On:
23 MAY 2020 8:20PM by PIB Hyderabad
నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా (ఎన్ఎంసిజి), వైల్డ్ లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యుఐఎల్) దానికి చెందిన బయో డైవర్సిటీ కన్సర్వేషన్ ఇనిషియేటివ్, ఫేస్ -2 ప్రాజెక్టు భాగస్వామి తో కలసి ఈరోజు ప్రపంచ తాబేళ్ళ దినోత్సవాన్ని ఎంతో మంది పాల్గొన్న వెబినార్ ద్వారా నిర్వహించారు. ఎన్.ఎం.సి.జి డైరక్టర్ జనరల్ శ్రీరాజీవ్ రంజన్ మిశ్రా, డాక్టర్ ధనంజయ్ మోహన్ , డైరక్టర్ డబ్ల్యు. ఐ.ఐ, పలు పాఠశాలల విద్యార్థులు, ఎన్.ఎం.సి.జి, డబ్ల్యుఐఐ టీమ్ సభ్యులు, ఐదు గంగా రాష్ట్రాల నుంచి గంగా ప్రహారీ మెంటార్లు ఈ ఆన్‌లైన్ ఉత్సవాలలో పాల్గొన్నారు.
ప్రపంచ తాబేళ్ళ దినోత్సవం సందర్భంగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెఖావత్ ఒక ప్రత్యేక సందేశమిస్తూ, “జీవ వైవిధ్యం అనేది భారతీయ సంస్కృతిలో కీలక భాగం, అంతేకాదు, తాబేళ్ళ ప్రాధాన్యతను గుర్తించి అనాదిగా మన సంస్కృతిలో తాబేళ్ళను పూజిస్తూ వస్తున్నాం.” అని ఆయన అన్నారు. “తాబేళ్ళు మన జలవనరులను శుభ్రపరుస్తున్నాయి. ఈ పని చేసినందుకు అవి మన నుంచి ఏమీ ఆశించడం లేదు. వీటిని , ఇతర ప్రాణులను పరిరక్షించడానికి ఎన్.ఎం.సి.జి పలు చర్యలు చేపట్టింది. వన్యప్రాణుల పరిరక్షణ కేంద్రాల ఏర్పాటు , దీనిపై ప్రజలలో అవగాహన పెంపొందించే చర్యలు చేపడుతున్నది.”
అని కూడా ఆయన చెప్పారు.
గంగా క్వెస్ట్‌క్విజ్‌కు సంబంధించిన వివరాలు ఈ సమావేశంలో తెలియజేశారు. ఇందులో పాల్గొనేందుకు ఆఖరు తేదీని మే 30 2020 కి పొడిగించినట్టు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలోని ప్రజలు ఎక్కువమంది ఇందులో పాల్గొనేందుకు వీలుగా ఈవిషయం తెలియజేశారు.దీని గురించి వివరిస్తూ శ్రీ మిశ్రా, ‘గంగా క్వెస్ట్ క్విజ్ అనేది కేవలం ఆసక్తికరమైన పోటీ మాత్రమే కాదు, ఇది ఒక అవగాహనా కార్యక్రమం, గంగా నదితో ప్రజలను అనుసంధానం చేసే కార్యక్రమం. పది సంవత్సరాల వయసు పైబడిన వారందరూ ఈ గంగా క్వెస్ట్ క్విజ్‌లో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాను’ అని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా ప్రపంచ తాబేళ్ల దినోత్సవ చిత్రలేఖన పోటీలు, నినాదాల పోటీలు, వ్యాసరచన పోటీలలో గెలుపొందిన వారి వివరాలు వెల్లడించారు. ఆన్‌లైన్ ప్లాట్‌ఫాం ద్వారా ఈ పోటీలను నిర్వహించారు. దేశ ,విదేశాలనుంచి పెద్ద సంఖ్యలో పిల్లలు ఈ ఆన్‌లైన్ పోటీలలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ప్రపంచ తాబేళ్ల దినోత్సవం సందర్భంగా తాబేళ్లపై పిల్లల కథల పుస్తకం,“ బిన్ వెతంకె కరే సఫాయి” పేరుతో ఒక పుస్తకాన్ని శ్రీ షెకావత్ విడుదల చేశారు. ఈ పుస్తకంలో తాబేళ్లకు సంబంధించిన ఆసక్తిదాయక విషయాలను కథల రూపంలో తెలియజేశారు. . వినూత్నశైలిలో రాసిన ఈ పుస్తకాన్ని శ్రీ షెకావత్ అభినందించారు. ఈ పుస్తకంలో తాబేళ్ళు నదీ పర్యావరణ పరిరక్షణలో పోషిస్తున్న కీలక పాత్రను ప్రత్యేకంగా కథల రూపంలో ప్రస్తావించారని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ మన నదుల పరిరక్షణలో భాగంగా తాబేళ్ళను సంరక్షించాలని పిలుపునిచ్చారు.
ఈ వెబినార్‌లో పిల్లలకు, తాబేళ్ళకు సంబంధించిన ఆసక్తికర సమాచారం తెలియజేసే పోస్టర్ స్లొరీ ని ప్రదర్శించారు. ఈ పోస్టర్ స్టోరీలో తాబేళ్లకు సంబంధించిన ఆసక్తికర విషయాలు, వాటికి ఎదురౌతున్న ముప్పుగురించి వివరించారు.
గంగా నదీ పరివాహక ప్రాంతంలో తాబేళ్లపై ఒక డాక్యుమెంటరీని కూడా , ఈ వెబినార్‌లో పాల్గొన్న వారికోసం ప్రదర్శించారు. గంగా నదిలో గల వివిధ రకాల తాబేళ్ళ గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు దీనిని ప్రదర్శించారు.
ఈ వెబినార్‌లో మాట్లాడుతూ శ్రీ మిశ్రా, జీవవైవిధ్యాన్ని కాపాడడంపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించేందుకు డబ్ల్యు.ఐ.ఐ, అలాగే గంగా ప్రహారీలు సాగిస్తున్న కృషిని అభినందించారు. గంగా నది ప్రాంతంలో తాబేళ్ల సంరక్షణ, జీవ వైవిధ్య పరిరక్షణకు అన్ని వర్గా లప్రజలు చేతులు కలపాలని ఆయన పిలుపునిచ్చారు. డాక్టర్ మోహన్, తాబేళ్ల దినోత్సవం జరపడానికి గల ప్రాధాన్యతను , వాటి సంరక్షణలో గంగా ప్రహారీల పాత్ర గురించి వివరించారు.
గంగా నది జీవవైవిధ్యాన్నికాపాడడం అనేది, నమామి గంగే కార్యక్రమంలోని ప్రధాన అంశాలలో ఒకటి. అందువల్ల అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని నిన్న అత్యంత ఉత్సాహంతో ఎన్ఎంసిజి, డబ్ల్యుఐఐలు వెబినార్‌ద్వారా , మన పరిష్కారాలు ప్రకృతిలోనే ఉన్నాయన్న నినాదంతో నిర్వహించడం జరిగింది. జీవవైవిధ్యం, పర్యావరణ పరిరక్షణపై ప్రజలలో మరింత అవగాహన పెంచేందుకు శ్రీ మిశ్రా,డాక్టర్ మోహన్, ఎన్ఎంసిజి బృందం, వివిధ సంస్థలకు సంబంధించిన నిపుణుల బృందం, గంగా ప్రహారీలు ఈ ఈవెంట్‌లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ డిజి, ఎన్ఎంసిజి , “ మనమందరం కలిసికట్టుగా గంగానది పునరుజ్జీవనానికి కృషి చేయాలి. జీవవైవిధ్యానికి, మన జీవనానికి మధ్య ఉన్న సంబంధాన్ని ప్రజలు మరింత బాగా అర్థం చేసుకోవడం, ప్రజలలో చైతన్యం తీసుకురావడం ద్వారా ఇది సాధ్యం. గంగా పరిరక్షణ కృషి ఒక జనాందోళన్ గా మారాలి” అని ఆయన అన్నారు. గంగా నదిని శుభ్రపరచడంలో ఎన్.ఎం.సి.జి చెప్పుకోదగిన విజయం సాధించింది. “ అయినా, నీటి నాణ్యత గణనీయంగా పెంచేందుకు మనందరం నిరంతర కృషి జరపాలి” అని ఆయన అన్నారు.
ఈ ఈవెంట్ ను పురస్కరించుకుని డబ్ల్యుఐఐ డైరక్టర్ డాక్టర్ మోహన్ మాట్లాడుతూ, గంగా ప్రహారీలు, జీవవైవిధ్యంపై కృషి చేస్తున్న సంస్థలు,మీడియా సంస్థలు, నదుల జీవవైవిధ్యాన్ని మరింతగా కాపాడేందుకు పెద్ద ఎత్తున ప్రజలలో అవగాహన పెంచే కార్యక్రమాలను చేపట్టాలని పిలుపునిచ్చారు.“ పరిష్కారం ప్రకృతిలోనే ఉందని చెప్పడం సులభం, కానీ మనం ప్రకృతి వ్యతిరేక కార్యకలాపాల ప్రభావాన్ని గణనీయంగా తగ్గించాల్సి ఉంది ” అని ఆయన అన్నారు.
పద్మవిభూషణ్ డాక్టర్ అనిల్ పి.జోషి మాట్లాడుతూ, గ్రామాలలో జీవవైవిధ్య పరిరక్షణపై అవగాహన కల్పించడంలో గంగా ప్రహారీలు సాగిస్తున్న విజయవంతమైన కృషిని అభినందించారు. 41 శాతంపైగా ఉభయ చరాలు 31 శాతం పైగా కోరల్, 33 శాతం పైగా వివిధ చేపల రకాలు ప్రస్తుతం అంతరించి పోయాయన్నారు. జీవవైవిధ్య పరరిరక్షణను మనం అత్యంత తీవ్రమైన అంశంగా పరిగణించాలని ఆయన సూచించారు.
దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన గంగా ప్రహారీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డబ్ల్యుఐఐ డెహ్రాడూన్ వారు తమకు సేంద్రీయ వ్యవసాయంలో ఇచ్చిన శిక్షణ అనుభవాలను , దీనివల్ల కలిగిన ఆర్థిక, పర్యావరణ సానుకూల పరిణామాలను వారు వివరించారు.
(Release ID: 1626547)
Visitor Counter : 288