రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
భారతీయ ఔషధ, వైద్య పరికరాల పరికరాల పరిశ్రమలో పెట్టుబడులకు జపాన్ కంపెనీలకు ఆహ్వానం
పెట్టుబడిదారులకు ఉన్న భారీ అవకాశాలను వివరించిన భారత ఔషధ విభాగం
పెట్టుబడులు పెట్టాలంటూ జపాన్ సంస్థలను ఆహ్వానించిన వివిధ రాష్ట్రాలు
కొవిడ్ తర్వాత ఎదురయ్యే సవాళ్లు, అందివచ్చే అవకాశాలపై వెబినార్ ద్వారా చర్చ
Posted On:
22 MAY 2020 5:54PM by PIB Hyderabad
భారత్, జపాన్ మధ్య వ్యాపార, వాణిజ్య సహకారం కోసం వైద్య పరికరాలు, ఏపీఐ సెక్టార్‌పై వెబినార్ జరిగింది. 'సవాళ్లు&వర్ధమాన అవకాశాలు' పేరిట శుక్రవారం ఉదయం 11.30 గం.కు వెబినార్ నిర్వహించారు. భారత ఔషధ విభాగం మరియు రసాయనాలు &ఎరువులు మంత్రిత్వ శాఖ భాగస్వామ్యంతో, టోక్యోలోని భారత దౌత్య కార్యాలయం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ప్రస్తుత కొవిడ్ పరిస్థితుల్లో భారత్, జపాన్ మధ్య సంబంధాలను మెరుగు పరుచుకునే అవకాశాలపై తన ఆలోచనలను జపాన్‌లో భారత రాయబారి సంజయ్ కుమార్ వర్మ వెల్లడించారు. రంగాల వారీగా విశ్లేషణను, భారత ఔషధ&వైద్య పరికరాల పరిశ్రమలో పెట్టుబడి అవకాశాలను ఫార్మాస్యూటికల్స్ సెక్రటరీ డా. పీడీ వాఘేలా ప్రదర్శించారు. దేశంలో వ్యాపారం, వాణిజ్యాన్ని వృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలను కూడా ఆయన వివరించారు. ఔషధ, వైద్య పరికరాల భారీ స్థాయి ఉత్పత్తిని ప్రోత్సహించేలా తమ విభాగం చేపట్టిన కార్యక్రమాలను ఫార్మాస్యూటికల్స్ జాయింట్ సెక్రటరీ నవదీప్ రిన్వా వివరించారు. ఉత్పత్తితో జతపరిచిన ప్రోత్సాహక పథకాలు, ఔషధ/వైద్య పరికరాలను భారీగా ఉత్పత్తి చేసే పార్కుల అభివృద్ధి పథకాల గురించి చెప్పారు. ఆయా పథకాల ప్రయోజనాలను పొందాలని పెట్టుబడిదారులకు సూచించారు.
జపాన్ ప్రతినిధులు
కొవిడ్ ముగిసిన తర్వాత ఔషధ, వైద్య పరికరాల రంగాల్లో తర్వాత ఎదురయ్యే సవాళ్లు&అవకాశాలు, ప్రపంచ సరఫరా గొలుసుపై దాని ప్రభావం వంటి అవకాశాలపై భారత ఫార్మాస్యూటికల్స్ ట్రేడర్స్ అసోసియేషన్, జపాన్ ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ డివైజెస్ అసోసియేషన్ సభ్యులు చర్చించారు. భారత్, జపాన్ మధ్య సహకారం.. ఏపీఐలు, వైద్య పరికరాల సరఫరా గొలుసును స్థిరీకరిస్తుందని సూచించారు. ఏపీఐ సెక్టార్, వైద్య పరికరాల రంగంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించే మెళకువలను, అందివచ్చే అవకాశాలను గురించి చెన్నై జేఈటీఆర్‌వో ప్రతినిధి వివరించారు.
భారత ఆర్థిక వ్యవస్థ స్థిరత్వం, బలం గురించి జపాన్ ఆర్థిక, వాణిజ్య శాఖ మంత్రి మోనా కేసీ ఖాందార్ ప్రస్తావించారు. కొవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి, పెట్టుబడుల వాతావరణాన్ని మెరుగుపరచడానికి భారత ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపన, సంస్కరణల ప్యాకేజీలను గురించి మాట్లాడారు.
జపాన్ సంస్థలకు అనుబంధ సంస్థలుగా ఉన్న నిప్రో ఇండియా కార్పొరేషన్, ఐసాయ్ ఫార్మాస్యూటికల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు 'భారత్‌లో తయారీ' కార్యక్రమంపై వివరణాత్మక ప్రదర్శన ఇచ్చారు. 'భారత్‌లో తయారీ' కార్యక్రమంపై వారి అనుభవాలను వివరించారు.
భారతదేశంలో ఔషధ, వైద్య పరికరాల పరిశ్రమలో భవిష్యత్తు వృద్ధి అవకాశాలను, ముందుకు దూసుకెళ్లే మార్గాలపై.. ఎక్కువమంది భారత ఔషధ, వైద్య పరికరాల అసోసియేషన్ల ప్రతినిధులు వివరించారు.
గుజరాత్, తెలంగాణ, హిమాచల్‌ప్రదేశ్, గోవా రాష్ట్రాల్లో ఉన్న పెట్టుబడి అవకాశాలపై ఆయా రాష్ట్రాల ప్రతినిధులు వివరాలు అందించారు.
తమ రాష్ట్రాల్లో అందిస్తున్న ప్రోత్సాహకాల ప్యాకేజీలు, పన్ను రాయితీలు, సులభతర వ్యాపార ప్రోత్సాహకాలు, భూముల లభ్యత, మౌలిక సదుపాయాలు, నియంత్రణ విధానాలను వివరించారు. తమ రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా జపాన్ సంస్థలను ఆహ్వానించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని మెడ్‌టెక్ జోన్, వోక్‌హార్డ్, సన్ ఫార్మా, పాన్ ఏసియా బయోటెక్ ప్రతినిధులు, జపాన్ సంస్థలకు చెందిన ప్రతినిధులు భారీ సంఖ్యలో వెబినార్‌లో పాల్గొన్నారు. బిజినెస్ టు గవర్నమెంట్ (B2G), బిజినెస్ టు బిజినెస్ (B2B) నెట్‌వర్కింగ్‌లో భాగంగా ఈ వెబినార్ జరిగింది.
(Release ID: 1626234)
Visitor Counter : 320