శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

కోవిడ్‌-19 వ్యాప్తి ప‌ర్య‌వేక్ష‌ణ మ‌రియు నియంత్ర‌ణ‌ల‌కు డిజిట‌ల్ నిఘా

- వైరస్, రోగి మరియు రోగి యొక్క క్లినికల్ కోర్సు అనే మూడు స్థాయిలలో నిఘా

Posted On: 24 APR 2020 6:31PM by PIB Hyderabad

సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) మరియు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ అండ్ ఇంటిగ్రేటెడ్ బయాలజీ (ఐజీఐబీ) మరికొన్ని సంస్థలతో కలిసి న‌వ్య క‌రోనా వైర‌స్ వ్యాప్తిని డిజిట‌ల్‌, మరియు పరమాణువు నిఘాపై పనిచేయ‌నున్నాయి. కోవిడ్‌-19 వైర‌స్ జీవశాస్త్రం, ఎపిడెమియాలజీ మరియు వ్యాధి ప్రభావాన్ని అర్థం చేసుకోనే దిశ‌గా ఈ నిఘా వ్య‌వ‌స్థ ప‌ని చేస్తోంది.
అంతుచిక్క‌ని ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం వెతికేలా..
కొందరు వ్యక్తులు భయంకరమైన న‌వ్య‌ కరోనా వైరస్ బారిన పడినా వారిలో ఎలాంటి లక్షణాలు గానీ అనారోగ్యం గానీ వారిలో ఎందుకు క‌నిపించ‌డం లేదు? మ‌రికొందరు ఎందుకు వీటి ల‌క్ష‌ణాల‌తో బాధపడతూ మరణం అంచు వ‌ర‌కు వెళుతున్నారు? మరి కొందరు ఈ వైరస్ బారిన ప‌డిన‌ప్ప‌టికీ కోలుకుని ఎలా బయటప‌డుతున్నారు? అనే ప్ర‌శ్న‌ల‌తో పాటుగా వైరస్ చాలా వేగంగా పరివర్తన చెందుతుందా.. లేదా మార్పు చాలా స్వ‌ల్పంగా ఉందా.. దీనివ‌ల్ల వైర‌స్‌కు వ్యాక్సిన్ లేదా ఔష‌ధాల అభివృద్ధి దిశ‌గా జ‌రుగుతున్న ప్రయత్నాలు నిష్ఫ‌లంగా మారుతాయా? లేక మార్పు చాలా త‌క్కువ‌గా ఉందా? ఇలాంటి అనేక ప్రశ్నల‌కు స‌రైన స‌మాధానం లేదు. వీటికి ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలు సమాధానాల్ని వెతుకుతూ ఉన్నారు. ప్ర‌స్తుత న‌వ్య కరోనా వైరస్‌కు సంబంధించి ఈ రోజు వ‌ర‌కు కూడా శాస్త్రవేత్తల‌కు తెలియ‌ని చాలా అంశాలకు డిజిటల్ మ‌రియు మాలిక్యులర్ నిఘాతో కొంత క్లూ ల‌భించ‌గ‌ల‌దని భావిస్తున్నారు. కోవిడ్‌-19 వైర‌స్‌పై డిజిట‌ల్ నిఘాకు గాను ఐజీఐబీలో ఒక ప్ర‌త్యేక కేంద్రాన్ని స్థాపించనున్నారు. కోవిడ్‌-19 వైర‌స్ కార్య‌కలాపాల‌తో పాటు చికిత్సకు సంబంధించిన వ్య‌వ‌హారాల్లో నిమ‌గ్న‌మై ఉన్న ప్రయోగశాలలు, పరిశోధనా కేంద్రాలు మరియు ఆసుపత్రులు క్లౌడ్ షేరింగ్ ద్వారా తమ వ‌ద్ద ఉన్న స‌మాచారాన్ని పంచుకొనేలా చ‌ర్య‌లు చేప‌ట్టనున్నారు.
కోవిడ్‌-19 వైర‌స్ స్థితిగ‌తుల‌పై మూడు స్థాయిల‌ నిఘా..
న‌‌వ్య క‌రోనా వైర‌స్ గురించిన స‌మాచారం, క‌రోనా రోగి మరియు రోగి యొక్క క్లినికల్ కోర్సు అనే మూడు స్థాయిలలో ఈ నిఘా కార్య‌క్ర‌మం జరుగుతుంది. వైరస్ స్థాయి నిఘాలో క‌రోనా వైరస్ యొక్క జన్యుస్థితి దాని ప‌రివ‌ర్త‌న‌కు సం‌బంధించిన అంశాల‌ను ప‌ర్య‌వేక్షించ‌నున్నారు. ఇందులో సీసీఎంబీ ప్ర‌ధాన పాత్ర‌ను పోషించ‌నుంది. క‌రోనా వైర‌స్ జన్యు శ్రేణులను గురించిన స‌మాచారాన్ని సీసీఎంబీ విశ్లేషించి అందించనుంది. “మేము క‌రోనా వైర‌స్‌కు సంబంధించి జీనోమ్ సీక్వెన్సింగ్ మరియు నమూనాల‌ పరీక్షలపై సమాచారాన్ని అందిస్తాము. మేము విస్తృతమైన పరీక్షలు చేస్తున్నాము, క‌రోనా వైర‌స్ ఎలా వ్యాపిస్తోంది, ఐసోలేట్స్ మ‌రియు అనేక రకాల సంబంధిత సమాచారాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగించే నమూనా ఫలితాలను మేము అందించగలము” అని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా ఇండియా సైన్స్ వైర్‌కు తెలిపారు.
ఎండ్-టు-ఎండ్ నెట్‌వర్క్‌ ఏర్పాటు..
డిజిట‌ల్ నిఘాలో రెండో భాగం కోవిడ్‌ రోగి స‌మాచారానికి సంబంధించి ఉండ‌నుంది. ఇందులో రోగుల వివ‌రాలు క్లినికల్ నమూనాల విశ్లేష‌ణ‌లు జ‌రుప‌నున్నారు. క్లినికల్ కోర్సు వివరాలు అంటే క్లినికల్ కేర్ డేటా లేదా ఫలితాలకు దారిచూపే హాస్పిటల్ డేటా పైనా దృష్టి పెట్ట‌నున్నారు.  కోవిడ్‌కు చికిత్స పొందుతున్న వారిలో కొంతమంది రోగులకు వెంటిలేటర్లు అవసరమవుతాయి, మరికొందరు స్వయంగా కోలుకోగలుగుతున్నారు. దీనిలో గ‌ల కార‌ణాల‌పై కూడా శోధ‌న జ‌ర‌పేలా  నిఘా కార్య‌క్ర‌మాలు జ‌ర‌ప‌నున్నారు. వైర‌స్ కార‌ణంగా కొంతమంది రోగులలో ప్రాణాంతక సైటోకిన్ వ్య‌వ‌స్థ అభివృద్ధి అవుతుండ‌గా, చాలా మంది క‌రోనా వైర‌స్ ఇన్‌ఫెక్ష‌న్‌ను స‌మ‌ర్థంగా ఎదుర్కొని బ‌య‌ట‌ప‌డ‌గ‌లుగుతున్నారు. “ఈ విష‌యాలపై దేశ వ్యాప్త ప్రాతినిధ్యం కోసం నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్‌సీడీసీ) వారితో క‌లిసి ప‌ని చేస్తున్నాము. దీనికి తోడు దేశవ్యాప్తంగా ఉన్న స్థానిక‌ ఆసుపత్రులతో కూడా క‌లిసి ప‌ని చేస్తున్నాము. ఆయా విష‌యాల‌పై స‌మ‌గ్ర‌మైన అంతిమ స‌మాచారం పొందేందుకు దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని ఆసుపత్రుల వారి నుంచి స‌మాచారాన్ని మేము అడుగుతున్నాము. ఈ విష‌యాల‌న్నింట‌ని స‌మ్మిళితం చేసేందుకు గాను మేము ఎండ్-టు-ఎండ్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తాము ”అని ఐజీఐబీ సంస్థ డైరెక్టర్ డాక్టర్ అనురాగ్ అగర్వాల్ తెలిపారు. లక్షణాలు లేకుండానే వైర‌స్ సోకిన వ్యక్తులు మరియు తేలికపాటి వైర‌స్ ప్రభావాన్ని అనుభవించే వ్యక్తులను గుర్తించే పరీక్ష డేటాను ఉపయోగించ‌నున్నారు. ఆసుపత్రి నెట్‌వర్క్ వెలుప‌ల ఇన్‌ఫెక్ట్ అయి వ్యక్తుల స‌మాచారాన్ని కూడా ఈ అధ్య‌యనంలో జ‌త చేయనున్నారు.
నైతిక‌ పరంగా పూర్తి గోప్యత‌..
ఈ నిఘా కార్య‌క్ర‌మం ద్వారా వైర‌స్ వ్యాప్తి చెందుతున్న జనాభాను మరియు వైర‌స్ వ్యాప్తి నియంత్ర‌ణ‌లో ఉన్న జనాభాను పర్యవేక్షించవ‌చ్చు. కోవిడ్‌-19 డిజిట‌ల్ నిఘాలో భాగంగా ప్రతిదీ బహిరంగం చేయ‌ని రహస్య రూపంలోనే జరుగుతుందని అన్నారు. నైతిక‌ పరంగా ఇది గోప్యంగాను మరియు ప్రభుత్వం ప్రకారం ప్రాప్యత పొందటానికి అర్హత ఉన్న ఏ వ్యక్తికైనా ఈ స‌మాచారం అందుబాటులో ఉంటుంద‌ని డాక్ట‌ర్ అగ‌ర్వాల్ తెలియ‌జేశారు. ఇందులోని స‌మాచారం ఎవ్వ‌రూ డౌన్‌లోడ్ చేసుకొనే వెసులుబాటు లేకుండా ఉంటుంది. ఎందుకంటే ఇందులో కొంత డేటా గోప్య‌త‌కు సంబంధించింది కావడం వ‌ల్లే డౌన్‌లోడ్‌కు అనుమ‌తించ‌రు. అయిన‌ప్ప‌టికీ ప్రభుత్వంలో ఎవరైనా సరైన కారణాల వల్ల డేటాను పరిశీలించాలనుకుంటే, ఈ స‌మాచారం
అందించబడుతుంది మరియు ఇందుకు గోప్యత స్థాయి కూడా భిన్నంగా ఉంటుంది. వైరల్ జీనోమ్ పబ్లిక్ డిపాజిట్లలో ఉంటుంది; హాస్పిటల్ కోర్సు మరియు అందుకు సంబంధించిన‌ ఏదైనా సమాచారం పూర్తిగా గుర్తించబడుతుంది. కానీ ఇందులో మేము గుర్తించిన డేటాను మాత్రమే స్వీకరిస్తాము ” అని డాక్టర్ అగర్వాల్ అన్నారు. ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ఆరోగ్య సేథు యాప్‌తో అనుసంధానించడానికి వీలుగా ఈ డేటాను ప్రభుత్వానికీ అందించనున్నారు. గరిష్ఠ‌ సంఖ్యలో ప్రజలకు ప్రయోజనాలను అందించాలనే ఆలోచన‌తో ఇలా చేయ‌నున్న‌ట్టుగా ఆయ‌న తెలిపారు. "కోవిడ్‌-19కు సంబంధించి వివిధ విభాగాల‌పై ఎవ‌రైనా స‌మాచారాన్ని అందించడానికి అస‌క్తిగా ఉన్నా.. లేదా ఈ డిజిట‌ల్ నిఘా ప్రయత్నంలో పాలు పంచుకోవ‌డాని‌కి ఎవరైనా సిద్ధంగా ఉంటే మా వైపు నుండి వారికి స్వాగతం పలుకుతున్నాం" అని డాక్టర్ అగర్వాల్ అన్నారు.

***



(Release ID: 1617998) Visitor Counter : 303