పర్యటక మంత్రిత్వ శాఖ

"దేఖో అప్నాదేశ్‌" వెబ్‌నార్ సీరిస్‌ను ప్రారంభించిన కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ

- సిరీస్‌లో భాగంగా మొద‌ట‌ ‘సిటీ ఆఫ్ సిటీస్- ఢిల్లీ పర్సనల్ డైరీ’ అందుబాటులోకి..
- భారత విభిన్న విశేషమైన చరిత్ర, సంస్కృతిని ప్రదర్శించేలా "దేఖో అప్నాదేశ్‌"
వెబ్‌నార్ సిరీస్ కొనసాగించేందుకు కృషి చేస్తాంః ప‌ర్య‌ట‌క మంత్రి ప‌టేల్‌

Posted On: 14 APR 2020 4:20PM by PIB Hyderabad

కోవిడ్‌-19 వైర‌స్ భార‌త్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా మానవ జీవితాలపై ప్రధానంగా ప్ర‌భావాన్ని చూపుతోంది. వైర‌స్ వ్యాప్తి కార‌ణంగా దేశీయంగానూ విదేశాల నుంచి ఎటువంటి ప‌ర్య‌ట‌న‌లు సాగ‌డం లేదు. దీంతో పర్యాటక రంగం ఎక్కువగా ప్రభావితమవుతుంది. ఈ అసాధార‌ణపు   కాలంలో మానవ సంబంధాన్ని కొనసాగించడానికి సాంకేతికత ఉపయోగపడుతోంది. సాంకేతిక పరిజ్ఞానం ఉప‌యోగించి ఆయా ప‌ర్య‌ట‌క ప్ర‌దేశాల‌కు సంబంధించిన వివిధ ఆక‌ర్ష‌ణీయ‌మైన అంశాల‌ను ఆస‌క్తిగ‌ల ప‌ర్య‌ట‌కుల‌కు ప‌రిచ‌యం చేసేందుకు క‌రోనా వ్యాప్తి క‌ట్ట‌డైన తరువాత‌ తేదీల‌లో ప్రయాణాలను ప్లాన్ చేసుకొనేందుకు వీలుగా కేంద్ర ప‌ర్య‌ట‌క అభివృద్ధి శాఖ వినూత్న ఆలోచ‌న‌తో ముందుకు వ‌చ్చింది. "దేఖో అప్నాదేశ్‌" పేరుతో మంగ‌ళ‌వారం నుంచి కొత్త‌గా వెబ్‌నార్ సిరీస్‌ను ప్రారంభించింది. ఇన్క్రెడిబుల్ ఇండియాలో (అద్భుత భార‌తం) భాగ‌మైన ప‌లు గ‌మ్య స్థానాలు, మ‌న‌దేశ సంస్కృతి మరియు వారసత్వం గురించిన‌ లోతైన  విస్తార‌మైన సమాచారాన్ని అందించే విధంగా ఈ వెబ్‌నార్ సిరీస్‌ను ప్రారంభించారు. ఢిల్లీ న‌గ‌ర చ‌రిత్ర, ప్రాముఖ్య‌త‌ను గురించి వివ‌రిస్తూ రూపొంచిందిన ‘సిటీ ఆఫ్ సిటీస్- ఢిల్లీ పర్సనల్ డైరీ’ వెబ్‌నార్‌ను మంగ‌ళ‌వారం ప్రారంభించారు.
భార‌త గొప్ప‌ద‌నాన్ని తెలియ‌జేస్తాం..
భారతదేశం యొక్క విభిన్న విశేషమైన చరిత్ర, సంస్కృతిని ప్రదర్శించేలా ప‌ర్య‌ట‌క శాఖ
వెబ్‌నార్ల‌ను అందుబాటులోకి తెస్తోంద‌ని కేంద్ర పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి (స్వ‌తంత్ర హోదా) ప్రహ్లాద్ సింగ్ పటేల్ తెలిపారు. మ‌న దేశ‌పు స్మారక చిహ్నాలు, వంటకాలు, కళలు, నృత్య రూపాలతో సహా విభిన్న గొప్ప చరిత్ర మరియు సంస్కృతిని వెబ్‌నార్ల‌లో క‌ళ్ల‌కు క‌ట్టే విధంగా అందుబాటులోకి తెస్తున్న‌ట్టు మంత్రి వివ‌రించారు. దీనికి తోడు భార‌త్‌కే సొంత‌మైన వివిధ ప్ర‌కృతి స‌హ‌జ దృశ్యాలు, పండుగలు, అతి గొప్పదైన‌ భారతీయ నాగరికత గురించి అనేక ఇతర అంశాల‌ను ఈ సిరీస్ ద్వారా వెలుగులోకి తేనున్న‌ట్టు ఆయ‌న తెలిపారు. పర్యాటకుల‌కు అవగాహన మరియు సామాజిక చరిత్రను తెలియ‌జేయ‌డం ప్ర‌ధాన అంశాలుగా వీటిని రూపొందిస్తున్నారు. పర్యాటక మంత్రిత్వ శాఖ కోసం నిర్వ‌హించిన ఇండియా సిటీ వాక్స్ సెషన్‌ల‌లో ఔత్సాహికుల నుంచి విశేష స్పంద‌న ల‌భించింది. 5,546 మంది ఉత్సాహంగా వీటిలో పాల్గొన్నారు. అంతే కాకుండా తమ ఆస‌క్తిని తెలియ‌ప‌రిచేలా అనేక ఆసక్తికరమైన ప్రశ్నల‌ను వారు వేయ‌డం గ‌మ‌నార్హం. వెబ్‌నార్ త్వరలో పబ్లిక్ డొమైన్‌లో అందుబాటులో ఉంటుంది. ఇది ఇన్‌స్టాగ్రామ్ మరియు ఫేస్‌బుక్‌లోని ప‌ర్య‌ట‌క మంత్రిత్వ శాఖ యొక్క సోషల్ మీడియా హ్యాండిల్స్- ఇన్క్రెడిబుల్ ఇండియాలో అందుబాటులో ఉంటుంది.
తదుపరి వెబ్‌నార్ గురువారం (ఏప్రిల్ 16 న) ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉండనుంది. ఈ వెబ్‌నార్‌లో ఔత్సాహిక సందర్శకులను డిజిట‌ల్ వేదిక‌పై అద్భుతమైన
కోల్‌కతా నగర సంద‌ర్శ‌నకు తీసుకువెళ్ల‌నున్నారు. 


(Release ID: 1614392) Visitor Counter : 169