పర్యటక మంత్రిత్వ శాఖ

ఏప్రిల్ 9వ తేదీ వరకు స్ట్రాండెడ్ ఇన్ ఇండియా" పోర్టల్ ద్వారా 1,194 పర్యాటకులకు సహాయం

కోవిడ్-19 నేపథ్యంలో పర్యాటక సంబంధమైన విషయాలపై తన భాగస్వాములతో నిరంతరం సంప్రదిస్తున్న కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ

Posted On: 10 APR 2020 6:04PM by PIB Hyderabad

కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ తన పోర్టల్ "స్ట్రాండెడ్ ఇన్ ఇండియా" ద్వారా పర్యాటకులకు నిరంతరం సహాయ సహకారాలందిస్తోంది.   ఏప్రిల్ 9వ తేదీ వరకు 1194 మంది పర్యాటకులకు ఈ పోర్టల్ సహాయం అందించింది.  దీనికి అదనంగా పర్యాటక మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న ఉచిత హెల్ప్ లైన్ 1363 నెంబరు కు మార్చి 22వ తేదీ నుండి ఏప్రిల్ 9వ తేదీ వరకు 779 ఫోన్ కాల్స్ వచ్చాయి.  

దీనితో పాటు, కోవిడ్-19 కారణంగా తక్షణ మరియు దీర్ఘకాల సమస్యల ప్రభావం పర్యాటక మరియు ఆతిధ్య పరిశ్రమ రంగాలపై ఎలా ఉంటుందనే విషయమై పరిస్థితిని అర్ధం చేసుకోడానికి పర్యాటక మంత్రిత్వ శాఖ అధికారులు సంబంధిత రంగాల ప్రతినిధులతో 24 గంటలూ పనిచేస్తున్నారు.   నిజానికి, లాక్ డౌన్ కారణంగా ఎటువంటి పర్యటనలు లేకపోవడంతో, పర్యాటక పరిశ్రమ బాగా దెబ్బతింది.  అందువల్ల, ఇప్పుడు ఎలా ముందుకు వెళ్లాలనే విషయమై, పరిస్థితిని అంచనా వేసి, ఆత్మ పరిశీలన చేసుకోవలసిన అవసరం ఉంది.  అడ్వెంచర్ టూర్ ఆపరేటర్స్ అసోసియేషన్ అఫ్ ఇండియా నిర్వహించిన వెబ్ సదస్సులో పర్యాటక మంత్రిత్వశాఖ డైరెక్టర్ జనరల్ శ్రీమతి మీనాక్షీ శర్మ మాట్లాడుతూ, ఈ మహమ్మారి వ్యాప్తి చెందకుండా అరికట్టవలసిన ఆవశ్యకత గురించి తెలియజేశారు .  ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో,  ప్రజల కనీస అవసరాలు తీర్చే విషయమై ప్రభుత్వం తీవ్రం కృషి చేస్తోందని ఆమె చెప్పారు.  పర్యాటక శిబిరాలను ఎలా శుభ్రపరచాలీ, ట్రెక్కింగ్ వసతి గృహాలను ఎలా నిర్వహించాలీ వంటి విషయాలపై మార్గదర్శకాలను రూపొందించాలని అసోసియేషన్ ప్రతినిధులు మంత్రిత్వ శాఖకు విజ్ఞప్తి చేశారు.  మార్గదర్శకాలు రూపొందించవలసిన అవసరం ఉందని శ్రీమతి శర్మ అంగీకరించారు.   కోవిడ్-19 తీవ్రత క్రమంగా తగ్గిన తర్వాత దేశీయంగా పర్యాటక సామర్ధ్యాన్ని అంచనా వేయవలసి ఉందని ఆమె నొక్కి చెప్పారు.  ఈ విషయంలో సామాజిక మాధ్యమం ప్రభావాన్ని పరిగణలోకి తీసుకోవాలని ఆమె సూచించారు. 

ఇటువంటి వెబ్ ఆధారిత సదస్సులను ఎఫ్.ఐ.సి.సి. మరియు ఇతర పర్యాటక సంబంధమైన సంస్థలు నిర్వహించనున్నాయి. ఇటువంటి ప్రతి వేదికపైన "ఇంక్రెడిబుల్ ఇండియా" ను ప్రోత్సహించడానికి అనువైన ప్రణాళికలపై విస్తృతంగా చర్చిస్తున్నారు.   ఈ వెబ్ ఆధారిత సదస్సులకు లభిస్తున్న ఆదరణ గమనిస్తే, ప్రస్తుత పరిస్థితి నుండి బయటకు రావడానికి కలిసి పనిచేయాలనే విషయంలో, పరిశ్రమలు, పౌరులు చాలా సానుకూలంగా ఉన్న విషయం తెలుస్తోంది. 

*******


(Release ID: 1613085)