ఉప రాష్ట్రపతి సచివాలయం
మహావీర్ జయంతి సందర్భంగా ప్రజలకు ఉప రాష్ట్రపతి శుభాకాంక్షలు
నాడు పోస్టు చేయడమైనది:
05 APR 2020 3:45PM by PIB Hyderabad
భగవాన్ మహావీర్ జయంతి సందర్భంగా ఉప రాష్ట్రపతి శ్రీ ఎం.వెంకయ్యనాయుడు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ భూమి మీద నడయాడిన అత్యంత జనారాధ్య అధ్యాత్మికవేత్తలలో ఆయన ఒకరని తన సందేశంలో పేర్కొన్నారు. ప్రపంచం కోవిడ్-19 మహమ్మారిని ఎదుర్కొంటున్న వేళ అలాంటి మహనీయుల జీవిత ప్రేరణతో ఈ సంక్షోభాన్ని అధిగమిద్దామని పిలుపునిచ్చారు. ఆయన సందేశం పూర్తిపాఠం ఇలా ఉంది:-
“పవిత్ర మహావీర్ జయంతి సందర్భంగా దేశ ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ భూమి మీద నడయాడిన అత్యంత జనారాధ్య అధ్యాత్మికవేత్తలలో భగవాన్ మహావీర్ కూడా ఒకరు. ఆ మహనీయుడు ప్రబోధించిన సత్యం, అహింస, నిజాయితీ, నిస్వార్థం, త్యాగంవంటి ఆదర్శాలతో కూడిన సందేశం నిత్యనూతనం, సార్వజనీనం. విశ్వజనీన ప్రేమతత్వ సందేశంతోపాటు పశుపక్ష్యాది సకల జీవరాశులూ సమానమేనని, అన్నిటినీ సమాన గౌరవంతో, ప్రేమతో గౌరవించాలని ఆయన ప్రబోధించారు. భగవాన్ మహావీరుని జీవితంనుంచి మనమంతా స్ఫూర్తి పొందాలి... ఆయన ఆచరించిన నిష్టాగరిష్ఠత, జీవితంపట్ల సానుకూల దృక్పథానికి ఆయనిచ్చిన ప్రాముఖ్యం సదా అనుసరణీయాలు. ప్రత్యేకించి... కోవిడ్-19 వ్యాప్తితో ప్రపంచం ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ప్రస్తుత భయానక పరిస్థితుల్లో ప్రేమ, సహనం, శాంతితో కూడిన ఆయన ప్రబోధాలు తక్షణ ఆచరణీయాలు. మానవాళిని వెంటాడుతున్న ఈ పెనుసవాలు నుంచి స్వీయ రక్షణ కోసమేగాక ప్రపంచమంతటినీ కాపాడేందుకు మనమంతా ఏకతాటిపై నిలిచి ముందడుగు వేయాలి. ఈ సంక్షోభ దుష్ప్రభావాలను అధిగమించడంలో మనకన్నా దుర్బలులైనవారికి తోడ్పాటునిద్దాం. సోదరభావం-మానవత్వంతో కూడిన సందేశ వ్యాప్తికి తోడ్పడటంతోపాటు కరుణ, తాదాత్మ్యాలతో మహనీయుడైన ‘భగవాన్ మహావీర్’కు నివాళి అర్పిద్దాం.”
*****
(రిలీజ్ ఐడి: 1611370)
సందర్శకుల సూచీ సంఖ్య : : 128