ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

న‌వ్య క‌రోనా వైర‌స్ (కోవిడ్‌-19)పై చ‌ర్య‌లు, త‌దుప‌రి సంసిద్ధ‌త‌పై ఇండియన్ మెడికల్ అసోసియేషన్‌తో మంత్రి డాక్ట‌ర్ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ స‌మీక్ష‌

ఐకమత్యం, కచ్చితత్వం, ఉత్సాహం-వృత్తి నైపుణ్యాలే
కోవిడ్‌-19పై విజయానికి సాధనాలు: డాక్టర్ హర్షవర్ధన్

Posted On: 01 APR 2020 7:00PM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా కోవిడ్‌-19పై ఆందోళన, నియంత్రణ చర్యలు, సంసిద్ధతలపై కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా సమీక్షించారు. ఈ మేరకు ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ సీనియర్‌ సభ్యులు, రాష్ట్రశాఖల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలు, నగరాలకు చెందిన డాక్టర్లు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశంలో ప్రస్తుత పరిస్థితి, చికిత్స-ఇతర విధానాలు,వివిధ మార్గదర్శకాల గురించి వారికి మంత్రి వివరించారు. ప్రపంచ మహమ్మారి (కోవిడ్‌-19) నిరోధం, నియంత్రణ, నిర్వహణ దిశగా రాష్ట్రాలతో సంయుక్తంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అనేక చర్యలను తెలియజేశారు. వీటన్నిటినీ అత్యున్నత స్థాయిలో నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు గుర్తుచేశారు. ముఖ్యంగా గౌరవనీయులైన ప్రధానమంత్రి క్రమం తప్పకుండా అన్ని కేంద్ర మంత్రత్వ శాఖలు, రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంతాల ఉన్నతాధికారులతో సమీక్షిస్తూ స్వయంగా పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.

   దేశవ్యాప్తంగా అందుబాటులోగల వైద్య, ప్రయోగశాలల సదుపాయాలతోపాటు డాక్టర్లు, సిబ్బంది సంసిద్థతపై డాక్టర్‌ హర్షవర్ధన్‌ ఈ సమావేశంలో సమీక్షించారు. రాష్ట్ర/జిల్లా/స్థానిక స్థాయులలో అధికార యంత్రాంగానికి తోడ్పడగల కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేసి, మరింత చురుకైన పాత్ర పోషించాల్సిందిగా ఐఎంఏ, ప్రాంతీయశాఖల సభ్యులను కోరారు. గడచిన మూడు నెలలుగా దేశంలోని వివిధ రకాల వైద్య నిపుణులు, సిబ్బంది అందిస్తున్న సేవలను డాక్టర్‌ హర్షవర్దన్‌ కొనియాడారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో కోవిడ్‌-19పై విజయానికి ఐకమత్యం, కచ్చితత్వం, ఉత్సాహం-వృత్తి నైపుణ్యాలే సరైన సాధనాలని ఆయన స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రభుత్వం అన్నివిధాలా వారికి వెన్నుదన్నుగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. దిగువస్థాయిలో మార్గనిర్దేశం కోసం టెలిమెడిసిన్‌ మార్గదర్శకాలను కూడా విడుదల చేశామని డాక్టర్‌ హర్షవర్దన్‌ తెలిపారు. కోవిడ్‌-19ను పారదోలేందుకు చిత్తశుద్ధితో కృషిచేస్తున్నామని, అందుబాటులోగల అన్ని మార్గాల్లోనూ అందుకు శాయశక్తులా కృషిచేస్తామని పునరుద్ఘాటించారు. ఈ నేపథ్యంలో దిగ్బంధం నిబంధనలను పౌరులంతా తప్పక గౌరవించాలని విజ్ఞప్తి చేశారు. కోవిడ్‌-19 గొలుసుకట్టు సంక్రమణను విచ్ఛిన్నం చేయడానికి ఇదే సరైన మార్గమన్నారు. దీంతోపాటు స్వచ్ఛంద దిగ్బంధ చికిత్సకు వెనుకాడరాదని అనుమానిత వైరస్‌ బాధితులకు ఆయన స్పష్టం చేశారు.

****



(Release ID: 1610120) Visitor Counter : 166