రక్షణ మంత్రిత్వ శాఖ
ప్రభుత్వ అధికారులతో కలిసి కోవిడ్ -19పై పోరాటం చేస్తున్న భారతదేశ సైనిక దళాలు
Posted On:
27 MAR 2020 7:11PM by PIB Hyderabad
కోవిడ్ 19 ప్రభావం వున్న దేశాల్లో చిక్కుకొని తీవ్ర ఆందోళనకు గురైన పలువురు భారతీయులను అక్కడనుంచి భారతదేశానికి తరలించడంలో భారతదేశ సైనిక దళాలు కీలక పాత్ర పోషించాయి. ఆ విధంగా దేశంలోకి తీసుకొచ్చిన 1,073 మందిని రక్షణ శాఖ వైద్య కేంద్రాల్లోని క్వారంటైన్లలో వుంచారు. సైనిక దళాలకు చెందిన వైద్య సేవల విభాగం తన వద్ద వున్న అన్ని వనరులను కోవిడ్ 19పై పోరాటానికి వినియోగిస్తోంది.
మన సైనిక దళాలు మనేసార్, జైసల్మేర్, జోద్‌పూర్, చెన్నై, హిందాన్, ముంబాయిలలో ఆరు క్వారంటైన్ సౌకర్యాలను ఏర్పాటు చేశాయి. వీటిలోనే ఈ 1,073 మందిని వుంచి వైద్యుల పరిశీలనలో వుంచారు.
వీటికి సంబంధించి మూడు కోవిడ్ 19 పాజిటివ్ కేసులు బైటపడ్డాయి. వీటిలో రెండు హిండాన్‌లో వుంటే ఒకటి మనేసార్కు సంబంధించినది. వారిని అక్కడనుంచి ఢిల్లీలోని సప్ధర్ జంగ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ క్వారంటైన్లకు తోడుగా కొలకత్తా, విశాఖపట్నం, కొచి, దుండిగల్ (హైద్రాబాద్), బెంగళూరు, కాన్పూర్, జైసల్మేర్, జొర్హాట్, గోరఖ్ పూర్ లలో కూడా క్వారంటైన్లను సిద్ధం చేశారు. అవసరమైతే వీటిని 48 నుంచి 72 గంటల్లో అందుబాటులోకి తీసుకొస్తారు.
కోవిడ్ 19పై పోరాటంలో భాగంగా భారతదేశ సైనిక దళాల సేవల గురించి వివరించడానికిగాను వైద్య సేవల విభాగ లెప్టినెంట్ జనరల్ అనూప్ బెనర్జీ మీడియాతో మాట్లాడారు. కోవిడ్ 19 చికిత్సను అందించడానికిగాను 29 సర్వీసు ఆసుపత్రులను సిద్ధం చేశామని అన్నారు. అంతే కాదు ఐదు ఆసుపత్రులలో కోవిడ్ 19 పరీక్షలను నిర్వహించవచ్చని వివరించారు. మరో ఆరు ఆసుపత్రులు త్వరలోనే సిద్దమవుతాయని ఆయన అన్నారు.
ఇంతవరకూ ఒకే ఒక సైనికునికి కోవిడ్ 19 పాజిటివ్ అని తేలిందని అతను కూడా ఇరాన్ నుంచి వచ్చిన తన తండ్రి కారణంగా దాని బారిన పడ్డాడని ఇప్పుడు అతను కోలుకున్నాడని లెప్టినెంట్ జనరల్ బెనర్జీ తెలిపారు.
అలాగే సైనిక దళాల విషయంలో తీసుకుంటున్న జాగ్రత్తల గురించి వివరించారు.
ఇరుగు పొరుగు దేశాలైన మాల్దీవులు, నేపాల్ దేశాల్లో కోవిడ్ 19పై సమరానికి సంబంధించి అక్కడ వైద్య కేంద్రాలను ఏర్పాటు చేయడానికిగాను భారతీయ సైనిక దళాల వైద్య సేవల విభాగాలు కృషి చేశాయని తెలిపారు. ఇందుకోసం మాల్దీవులకు 14 మంది సభ్యుల వైద్యాధికారుల బృందం వెళ్లి వచ్చిందని చెప్పారు. అలాగే నేపాల్‌కు ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ వెళ్లి అక్కడ వారికి సాయం అందించిందని అన్నారు. అలాగే అవసరమైతే ఇతర దేశాల్లో కూడా సహకారం అందించడానికి సిద్ధంగా వున్నామని అన్నారు.
వైరస్ బారినపడకుండా వైద్య సిబ్బందికి భద్రత కల్పించే పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్ మెంట్ ( పిపిఇ) అందుబాటు అనేది ఒక సవాలుగా మారిందని ఆయన తెలిపారు. జాతీయస్థాయిలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా వీటి కొరత వుందని అన్నారు. అందుకే వీటిని సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి వీలుగా అడ్వయిజరీ విడుదల చేసినట్టు చెప్పారు. రానున్న రోజుల్లో ఈ కొరతను అధిగమించడానికి చర్యలు తీసుకుంటామని ప్రజలకు సేవలందించడానికి వీలుగా వైద్యపరమైన వనరులను మరిన్ని ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వంనుంచి ఆదేశాలు వచ్చాయని ఆయన వివరించారు.
అత్యవసర పరిస్థితుల్లో రైలు బోగీల్లో కూడా వైద్య ఆరోగ్య సౌకర్యాలను ఏర్పాటు చేస్తామని సైనిక దళాల వైద్య విభాగం తెలిపింది. అంతే కాదు సామాజిక దూరం, కోర్సుల మరియు శిక్షణ కార్యక్రమాల రద్దు, మాస్కుల వినియోగం, ముందు జాగ్రత్త చర్యలు, మార్గదర్శకాలు మొదలైన వాటికి సంబంధించి పలు అడ్వయిజరీలను విడుదల చేశారు.
***
(Release ID: 1608700)
Visitor Counter : 140