ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

ప్రపంచవ్యాప్తంగా... భారత్‌లోనూ నవ్య కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) కేసులు

అత్యధికంగా నమోదైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ 2020 మార్చి 5వ తేదీన రాజ్యసభలో తనంతటతానుగా చేసిన ప్రకటన

Posted On: 05 MAR 2020 12:07PM by PIB Hyderabad
  1. నవ్య కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధం-నియంత్రణకు భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి ఫిబ్రవరి 7న రాజ్యసభలో, 10న లోక్‌సభలో నేను ప్రకటన చేశాను. తదనుగుణంగా దేశంలో తాజా పరిస్థితిని గౌరవ సభ్యులకు నేడు వివరిస్తున్నాను.
  2. మానవులు, జంతువులలో అనారోగ్యానికి కారణమయ్యే కరోనా రకం వైరస్‌ల సమూహం చాలా పెద్దది. మధ్యప్రాచ్యంలో ఈ వైరస్‌ల వ్యాప్తివల్ల 2003లో ‘సార్స్‌’ (SARS), 2014లో ‘మెర్స్‌’ (MERS)కు అనేకమంది బలయ్యారు.
  3. చైనాలో నవ్య కరోనా వైరస్‌ వ్యాప్తి వెలుగులోకి వచ్చిన 2019 డిసెంబరు 31 నుంచి ఆ దేశంలోనేగాక భారత్‌సహా వివిధ దేశాల్లో పెద్దసంఖ్యలో కేసులు నమోదయ్యాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనికి కోవిడ్‌-19 (COVID-19) అని పేరుపెట్టింది.
  4. చైనాలో మార్చి 4నాటికి 80,270 నిర్ధారిత కేసులకుగాను మృతుల సంఖ్య 2,981కి చేరగా, 78దేశాల్లో 12,857 నిర్ధారిత కేసులకుగాను 220మంది మరణించారు.
  5. ఈ వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) 2020 జనవరి 30న ‘అంతర్జాతీయ ఆందోళనకర ప్రజారోగ్య అత్యవసర స్థితి’ ప్రకటించింది. దీనివల్ల ప్రపంచానికి వాటిల్లే ముప్పును ఫిబ్రవరి 28న ‘అత్యధిక స్థాయి’కి పెంచి, అన్నిదేశాలూ సన్నద్ధం కావాలని కోరింది. కానీ, దీనికి చాలాముందుగా జనవరి 17 నుంచే భారత ప్రభుత్వం కార్యాచరణకు సంసిద్ధం కావడం విశేషించి ప్రస్తావనార్హం.
  6. జ్వరం, దగ్గు, శ్వాసలో ఇబ్బంది దీని ప్రధాన లక్షణాలు. ఒక వ్యక్తికి కోవిడ్‌-19 సోకిన నాటినుంచి 14 రోజుల మధ్య వ్యాధి ముదిరే అవకాశం ఉంది. ఇది సోకినట్లు అనుమానం ఉన్నవారికి, సోకే సంభావ్యతగలవారికీ తప్పనిసరి ఏకాంత చికిత్సద్వారా వ్యాప్తిని నిరోధించవచ్చు.
  7. మన దేశంలో మార్చి 4నాటికి నిర్ధారిత కేసులు 29 కాగా, వీరిలో కేరళకు చెందిన ముగ్గురికి పూర్తిగా నయమై, ఆస్పత్రినుంచి ఇళ్లకు వెళ్లారు. గత 3రోజులుగా నిర్ధారణ అయిన 3 ప్రయాణ సంబంధ కేసులలో ఢిల్లీ, తెలంగాణలలో ఒక్కొక్కటి నమోదవగా ఈ ఇద్దరూ ప్రస్తుతం కోలుకుంటున్నారు. రాజస్థాన్‌ పర్యటిస్తున్న ఇటలీ బృందంలోని ఓ జంటకు వ్యాధి నిర్ధారణ కాగా- వారు ఢిల్లీ తిరిగివచ్చేలోగా మరో 14 మందికి, వారి బస్సు నడిపిన భారతీయ డ్రైవరుకూ వైరస్‌ సోకినట్లు తేలింది. వీరందరూ ఇప్పుడు కోలుకుంటున్నారు.
  8. ప్రపంచవ్యాప్తంగా వ్యాధి తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా అన్ని మంత్రిత్వ శాఖలూ సమష్టిగా దీన్ని ఎదుర్కొనాలి. ఈ మేరకు సంసిద్ధత, ప్రతిస్పందనలను గౌరవనీయ ప్రధానమంత్రి నిరంతరం స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
  9. భారత్‌కు కరోనా ముప్పులేకుండా ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో భాగంగా మొట్టమొదట 2020 జనవరి 17న ప్రయాణ నిషేధం విధించింది. పరిస్థితిని బట్టి ఈ సూచనపత్రాన్ని దాదాపు రోజూ నవీకరిస్తున్నాం. ఈ చర్యల వివరాలను దిగువన చూడవచ్చు:
  • ఇటలీ, ఇరాన్‌, దక్షిణకొరియా, జపాన్‌ తదితర దేశాలవారికి 2020 మార్చి 3వ తేదీన అంతకుముందు జారీచేసిన వీసాలు పొంది ఇంకా బయల్దేరనివారు భారత్‌లో ప్రవేశించడంపై తక్షణ నిషేధం విధించబడింది.
  • అలాగే 2020 ఫిబ్రవరి 5న, అంతకుముందు జారీచేసిన వీసాలపై ఇంకా బయల్దేరని చైనా పౌరులు భారత్‌లో ప్రవేశించడంపై విధించిన నిషేధం కొనసాగుతుంది.
  • ఇక  ఫిబ్రవరి 1న, అంతకుముందు భారత వీసాలు పొందిన విదేశీపౌరులు చైనా, ఇరాన్‌, ఇటలీ, దక్షిణకొరియా, జపాన్‌ దేశాలకు వెళ్లి ఇంకా బయల్దేరనట్లయితే భారత్‌లో వారి ప్రవేశంపై తక్షణ నిషేధం విధించబడింది.
  • ఐక్యరాజ్యసమితి, ఇతర అంతర్జాతీయ సంస్థల దౌత్యవేత్తలు, అధికారులతోపాటు పైన పేర్కొన్న దేశాల విమాన సిబ్బందికి ప్రవేశ నిషేధంనుంచి మినహాయింపు ఇచ్చినా, వారు విమానాశ్రయ ప్రవేశద్వారంవద్ద పరీక్ష చేయించుకోవడం తప్పనిసరి.
  • అంతర్జాతీయ విమానాల్లో భారత్‌ వచ్చినవారు ఇక్కడ బసచేసే చిరునామాసహా వ్యక్తిగత వివరాలు నింపిన స్వీయ ధ్రువీకరణ పత్రాలను అందజేయాలి.
  • చైనా, ఇరాన్‌, దక్షిణకొరియా, ఇటలీ, జపాన్‌సహా కోవిడ్‌-19 ప్రభావిత దేశాలకు వెళ్లవద్దని భారత పౌరులందరికీ సూచించబడింది.
  1. కొన్ని దేశాలనుంచి మన దేశంలోని 21 విమానాశ్రయాలకు చేరుకునేవారికి జనవరి 18 నుంచి కరోనా నిర్ధారణ పరీక్షలు చేపట్టగా, నిన్నటినుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులద్వారా దేశంలో ప్రవేశించే ఏ దేశ పౌరులకైనా పరీక్షలు తప్పనిసరి చేశాం. ఈ మేరకు మార్చి 4నాటికి 6,241 విమానాల్లో భారత్‌ వచ్చిన 6,11,167 మందికి విమానాశ్రయాల్లో ప్రత్యేక వైద్యబృందాలు పరీక్షలు నిర్వహించాయి.
  2. దేశంలోని 12 పెద్ద, 65 చిన్న ఓడరేవులద్వారా మార్చి 4వ తేదీనాటికి భారత్‌ వచ్చిన 16,076 మందికి పరీక్షలు నిర్వహించబడ్డాయి.
  3. ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, పశ్చిమబెంగాల్‌, సిక్కిం, బీహార్‌ రాష్ట్రాల పరిధిలో భారత్‌తో భౌగోళిక సరిహద్దుగల దేశాలనుంచి వచ్చేవారికి అక్కడి సమీకృత తనిఖీ కేంద్రాల్లో రాష్ట్రాల సహకారంతో పరీక్షలు నిర్వహించేలా కేంద్రం ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు తనిఖీ కేంద్రాలవద్ద 11,20,259 మందికి పరీక్షలు నిర్వహించబడ్డాయి.
  4. చైనాలోని హుబెయ్‌ రాష్ట్రంలో దిగ్బంధం దృష్ట్యా అక్కడి భారత విద్యార్థులు, వుహాన్‌లో పనిచేసే 654మంది భారతీయులతోపాటు ఏడుగురు మాల్దీవ్స్‌ పౌరులను  ప్రభుత్వం జనవరి 31, ఫిబ్రవరి 1 తేదీల్లో రెండు ప్రత్యేక విమానాలద్వారా స్వదేశం తీసుకువచ్చింది. వీరందరినీ  వివిధ ప్రదేశాల్లోని ప్రత్యేక సైనిక పరీక్ష కేంద్రాల్లో ఉంచి, 14 రోజులపాటు పూర్తిస్థాయి పరీక్షలు నిర్వహించి, వైరస్‌ సోకలేదని నిర్ధారణ అయ్యాక ఫిబ్రవరి 26న ఇళ్లకు పంపాం.
  5. అంతేకాకుండా ఇదే రోజున వుహాన్‌ నుంచి 76 మంది భారతీయులుసహా 112 మందిని భారత వాయుసేన ఢిల్లీకి తీసుకువచ్చింది. ఇందుకోసం వెళ్లిన విమానాల్లో వైరస్‌ నిర్ధారణ పరికరాలు, వ్యక్తిగత రక్షణ సామగ్రి తదితర ఉపకరణాలను భారత్‌ సౌహార్దపూర్వకంగా చైనాకు అందజేసింది. తీసుకొచ్చిన వారందర్నీ 14 రోజులు ప్రత్యేక పరీక్ష కేంద్రాల్లో ఉంచగా, వీరిలో ఎవరికీ వైరస్‌ సోకలేదని తేలడం శుభపరిణామం.
  6. చైనాలోని ఇతర ప్రాంతాల్లోగల భారతీయుల శ్రేయస్సుదృష్ట్యా భారత రాయబార, కాన్సులేట్‌ కార్యాలయాలు వారితో నిరంతర సంప్రదింపులు కొనసాగిస్తున్నాయి.
  7. మరోవైపు కొందరికి కోవిడ్‌-19 సోకినందువల్ల జపాన్‌లో నిలిపివేసిన పర్యాటక ఓడ ‘డైమండ్‌ ప్రిన్సెస్‌’లో  చిక్కుకున్న 124 మందిని ఫిబ్రవరి 27న ఎయిరిండియా విమానాలద్వారా భారత్‌ తరలించాం. మనేసర్‌లోని ప్రత్యేక సైనిక పరీక్ష శిబిరంలో ఉంచిన వీరిలో ఎవరికీ వైరస్‌ సోకలేదన్న సమాచారం ఎంతో సంతోషం కలిగిస్తోంది.
  8. కోవిడ్‌-19 వ్యాపించిన దేశాల్లో ప్రయాణించి తిరిగివచ్చినవారుసహా వారితో కలసి గడపినవారినీ నిరంతర నిఘాలో ఉంచాం. ముఖ్యంగా వీరిలో జ్వరం, దగ్గు, శ్వాస ఇబ్బందులున్నవారిపై ప్రత్యేక శ్రద్ధపెట్టాం. ఆ మేరకు సమీకృత నిఘా వ్యవస్థద్వారా మార్చి 4నాటికి దేశవ్యాప్తంగా 28,529 మంది జాడ కనిపెట్టి సామూహిక వైరస్‌ నిఘా కేంద్రాలకు తరలించాం.
  9. అనుమానిత వైరస్‌ పీడితుల అన్వేషణ, వారిపై నిఘా కోసం రాష్ట్రాలకు మద్దతుగా పలు ఉపయుక్త అంశాలతో ఆరోగ్య మంత్రిత్వశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. వ్యక్తిగత పరిరక్షణ సరంజామా ఎగుమతిపై నిషేధం కూడా విధించాం. కేంద్ర ప్రభుత్వం వద్ద ఈ నిల్వలు కూడా తగినమేర ఉన్నాయి.
  10. కోవిడ్‌-19 నిర్ధారణలో పుణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ ప్రయోగశాల ప్రధాన పరీక్ష కేంద్రంగా సేవలందిస్తోంది. ఇక్కడ అవసరమైన అన్ని అదనపు సదుపాయాలూ కల్పించాం. దీంతోపాటు నమూనాల పరీక్ష కోసం మరో 15ప్రయోగశాలలను అనుమతించగా, మరో 19 ఏర్పాటవుతున్నాయి.
  11. ముప్పు సమాచారం అందరికీ అందేవిధంగా వివిధ ప్రాంతీయ భాషల్లో రూపొందించిన సరంజామాను రాష్ట్రాలకు పంపాం. రేడియో, టీవీలద్వారా కోవిడ్‌-19పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ఢిల్లీలో 011-23978046 నంబరుగల ఫోన్‌తో 24 గంటలూ పనిచేసే సహాయ కేంద్రం ఏర్పాటు చేశాం. ఇప్పటిదాకా మొత్తం 9,200 మంది ఫోన్‌చేయగా, ఇందులో 667 విదేశీ కాల్స్‌ కావడం గమనార్హం.
  12. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన, ప్రాంతీయ, స్థానిక కార్యాలయాలతో నిరంతర సంబంధాలద్వారా కోవిడ్‌-19పై భారత ప్రభుత్వం తాజా సమాచారం సేకరిస్తోంది.
  13. వ్యాధి నివారణలో కీలక సామర్థ్యాలు, సదుపాయాల కల్పన, ఆస్పత్రుల సంసిద్ధత, ప్రయోగశాలల్లో పరీక్షలు తదితర అన్ని అంశాలపైనా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. ప్రపంచమంతటా ప్రత్యేకించి దేశీయంగా కోవిడ్‌-19 సంబంధిత తాజా పరిస్థితులను నిత్యం పరిశీలిస్తూ తదనుగుణ చర్యలు తీసుకుంటోంది.
  14. ప్రపంచవ్యాప్తంగా పలు వ్యాధుల వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో మనకు కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. వైరస్‌ బాధితులతో సంబంధాలున్నవారి అన్వేషణ కోసం వివిధ ప్రదేశాల్లో వందలాది మందిని కనుగొని, వైద్య పరిశీలనలో ఉంచాల్సి వస్తోంది.
  15. ఇరాన్‌లో కోవిడ్‌-19 మూల స్థావరాలైన టెహ్రాన్‌, క్వామ్‌ నగరాల్లో చిక్కుకున్న భారత యాత్రికులు, విద్యార్థుల సమస్య ఎంతో ఆందోళన కలిగిస్తోంది. వారి శ్రేయస్సు దృష్ట్యా భారత ప్రభుత్వం ఇరాన్‌ అధికారవర్గాలతో నిత్య సంప్రదింపులు సాగిస్తోంది. అవసరమైతే వారిని స్వదేశం తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది.
  16. ప్రయాణ, పర్యాటకాలతో ముడిపడిన కేసుల నిర్వహణ, నియంత్రణకు తోడు స్థానికంగా వ్యాప్తి నిరోధం దిశగా అధికస్థాయిలో కార్యకలాపాలు వనరుల వినియోగం అవసరమవుతోంది. ఆ మేరకు నియంత్రణపై కార్యాచరణ ప్రణాళికను రాష్ట్రాలన్నిటికీ అందించాం. దీంతోపాటు అన్ని రాష్ట్రాలు, ఆస్పత్రుల కోసం వివిధ మంత్రిత్వ శాఖల తోడ్పాటుతో కోవిడ్‌-9 నియంత్రణంపై మార్చి 6న జాతీయస్థాయి కార్యాచరణ సదస్సు నిర్వహించాం. ఇప్పుడివి జిల్లాస్థాయిలోనూ జరుగుతున్నాయి.
  17. జిల్లాల్లో క్షేత్రస్థాయిలో నియంత్రణ కార్యకలాపాలకోసం కలెక్టర్‌ను ప్రధాన అధికారిగా ప్రకటించాం. తదనుగుణంగా సూక్ష్మస్థాయిలో అన్ని వ్యవహారాలనూ పర్యవేక్షించే బాధ్యతను రాష్ట్రాలకు అప్పగించి, మార్గనిర్దేశం చేస్తున్నాం.
  18. దేశంలో కోవిడ్‌-19 వ్యాప్తి నిరోధానికి కేంద్ర ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నదని ఈ సందర్భంగా సభకు తెలియజేస్తున్నాను.

*****


(Release ID: 1607088) Visitor Counter : 269