ఆర్థిక మంత్రిత్వ శాఖ
వ్యవసాయం-అనుబంధ రంగాల కోసం 16 సూత్రాల కార్యాచరణ ప్రణాళిక (పాదరక్షలు, ఫర్నీచర్‘పై దిగుమతి సుంకం పెంపు)
Posted On:
01 FEB 2020 2:35PM by PIB Hyderabad
వ్యవసాయం, అనుబంధ రంగాల కోసం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 16 సూత్రాల కార్యాచరణ ప్రణాళికను 2020-21 కేంద్ర బడ్జెట్‘లో ప్రతిపాదించారు. ఇందులో భాగంగా ‘పీఎం-కుసుమ్’ పథకాన్ని 20 లక్షల మంది రైతులకు వర్తింపజేస్తామని ప్రకటించారు. అలాగే వ్యవసాయ రుణాల పంపిణీ లక్ష్యాన్ని రూ.15 లక్షల కోట్లుగా ప్రతిపాదించారు. రైతుల కోసం ప్రత్యేకించి ‘కిసాన్ రైలు’, ‘కిసాన్ ఉడాన్’ పథకాలను ప్రారంభిస్తామని తెలిపారు. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో గిట్టుబాటు మద్దతు నిధిద్వారా గిడ్డంగుల నిర్మాణాన్ని ప్రోత్సహిస్తామని ప్రకటించారు. ‘ధాన్యలక్ష్మి’ పేరిట సమితుల స్థాయిలో స్వయంసహాయ బృందాల మహిళల ఆధ్వర్యాన గ్రామీణ స్థాయిలో ధాన్యాగారాల ఏర్పాటును ప్రతిపాదించారు. మత్స్య రంగంలో యువత పాత్రను పెంచే దిశగా 3,447 మంది ‘సాగర మిత్ర’ కార్యకర్తలను నియమించనున్నారు. గిడ్డంగులలోని సరకుల యాజమాన్య హక్కు బదిలీ-NWR ద్వారా రైతులకు రుణ సదుపాయం కల్పించనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఇందుకోసం జాతీయ ఎలక్ట్రానిక్ వ్యవసాయ మార్కెట్‘ను NWRతో సంధానిస్తామని ఆమె చెప్పారు. బీడు భూముల్లో సౌరశక్తి ఉత్పాదన కేంద్రాల ఏర్పాటుసహా బహుళ అంచెల వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహిస్తామని ప్రకటించారు. దేశవ్యాప్తంగా నీటి కొరతను ఎదుర్కొంటున్న 100 జిల్లాల్లో సమస్య పరిష్కారం కోసం సమగ్ర చర్యలను బడ్జెట్‘లో ప్రతిపాదించారు. నీలి ఆర్థిక వ్యవస్థ ప్రగతి దిశగా 2022-23నాటికి 200 లక్షల టన్నుల చేపల ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ ఏడాది స్వచ్ఛభారత్ కోసం రూ.12,300 కోట్లు కేటాయించింది. ‘ఉడాన్’ పథకానికి మద్దతుగా 2024 నాటికి దేశవ్యాప్తంగా మరో 100 విమానాశ్రయాలను ప్రభుత్వం అభివృద్ధి చేయనుంది. అలాగే రవాణా మౌలిక వసతుల కల్పన కోసం వచ్చే ఆర్థిక సంవత్సరంలో 1.7 లక్షల కోట్ల రూపాయలు కేటాయించామని ఆర్థిక మంత్రి చెప్పారు. విద్యుత్, పునరుత్పాదక ఇంధన రంగానికి 2020-21లో 22వేల కోట్ల రూపాయలు అందిస్తామని ఆమె తెలిపారు.
**********
(Release ID: 1601621)
Visitor Counter : 204