జల వనరులు, నదుల అభివృద్ధి మరియు గంగా నది శుద్ధి మంత్రిత్వ శాఖ

దేశవ్యాప్తంగా 2017-18 నుంచి 2019-20 మధ్య వరదలు, నదుల నిర్వహణ-కార్యకలాపాలు, సరిహద్దు సంబంధిత పనుల (FMBAP)కు మంత్రిమండలి ఆమోదం

Posted On: 07 MAR 2019 2:35PM by PIB Hyderabad

 ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రిమండలి- ‘‘దేశవ్యాప్తంగా 2017-18 నుంచి 2019-20 మధ్య మొత్తం రూ.3,342.00 కోట్లతో సాగే వరదలు, నదుల నిర్వహణ-కార్యకలాపాలు, సరిహద్దు సంబంధిత పనుల’’ (FMBAP)కు ఆమోదం తెలిపింది.
ప్రయోజనాలు:
     దేశమంతటా ప్రభావవంతంగా వరదల నిర్వహణ, భూమికోత నివారణ, సముద్ర కోత నిరోధం వంటి పనులను ఈ పథకం (FMBAP) కింద చేపడతారు. ఈ ప్రతిపాదనలకు సమ్మతి లభించడం వల్ల దేశంలోని అనేక పట్టణాలు, గ్రామాలు, పారిశ్రామిక సంస్థలు, సమాచార సంధాన కూడళ్లు, వ్యవసాయ క్షేత్రాలు, మౌలిక సదుపాయాలు వంటివాటికి వరదలు, భూమి కోత నుంచి ముప్పుతప్పి ప్రయోజనం చేకూరుతుంది. అలాగే పరీవాహక ప్రాంత శుద్ధి పనులద్వారా నదుల్లో పూడిక, మడ్డి తగ్గుతుంది.
నిధుల కేటాయింపు విధానం:
     దేశంలోని సాధారణ కేటగిరీ కిందకు వచ్చే రాష్ట్రాల్లో చేపట్టే పనులకు నిధుల కేటాయింపులో 50% (కేంద్రం): 50% (రాష్ట్రం) వాటా యథాతథంగా కొనసాగుతుంది. ఈశాన్య రాష్ట్రాలతోపాటు సిక్కిం, జమ్ముకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు 70% (కేంద్రం): 30% (రాష్ట్రం) వాటా కూడా కొనసాగుతుంది. సరిహద్దు ప్రాంతాల్లో కార్యకలాపాలు పొరుగు దేశాలతో ముడిపడి ఉండటంతోపాటు ద్వైపాక్షిక విధానాలకు అనుగుణంగా నదీ నిర్వహణ కార్యకలాపాలు, సరిహద్దు ప్రాంతాల పనుల (RMBA) కింద వాటా ప్రత్యేకంగా ఉంటుంది. అందువల్ల ఈ పథకాలు/పనులకు కంద్ర ప్రభుత్వం 100% నిధులను సహాయ ప్రదానం లేదా కేంద్ర సాయం కింద అందజేస్తుంది.
ముఖ్యాంశాలు:
     పన్నెండో పంచవర్ష ప్రణాళికలో కొనసాగుతున్న వరదల నిర్వహణ కార్యక్రమం (FMP), నదీ నిర్వహణ కార్యకలాపాలు, సరిహద్దు ప్రాంతాల పనుల (RMBA) విలీనం చేయడంద్వారా ‘‘ఎఫ్ఎంబీఏపీ’’ పథకం రూపొందించబడింది. ఆయా రాష్ట్రాల్లోని కీలక ప్రాంతాలకు వరదల నుంచి తగు రక్షణ కల్పించడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. ఇందులో భాగంగా సంబంధిత రంగాల్లో గరిష్ఠ స్థాయి నిర్మాణ, నిర్మాణేతర చర్యల మేళవింపుతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారుల సామర్థ్యం పెంపుపై దృష్టి సారిస్తారు.
          ఈ పథకం కింద చేపట్టే పనులవల్ల సరిహద్దు ప్రాంతాల్లో విలువైన భూమికి వరదల నుంచి, భూమికోత నుంచి రక్షణ లభించడమేగాక శాంతియుత పరిస్థితుల నిర్వహణ సాధ్యమవుతుంది. తదనుగుణంగా ప్రస్తుతం దీనికింద కొనసాగుతున్న ప్రాజెక్టులతోపాటు, ఇప్పటికే FMP కింద ఆమోదం పొందిన పనులను కూడా పూర్తిచేయడం కొత్త పథకం లక్ష్యం. అలాగే జల-వాతావరణ పరిశీలనలతోపాటు పొరుగుదేశాలతోగల ఉమ్మడి నదుల పరిధిలో వరదల ముందస్తు అంచనా కూడా ఈ పథంలో అంతర్భాగంగా ఉంటుంది. అంతేగాక పొరుగుదేశాలతో ఉమ్మడి నదులపై జలవనరుల ప్రాజెక్టులకు సంబంధించి పథకాల సమగ్ర నివేదిక రూపకల్పన, అధ్యయనం, పరిశీలన కూడా ఈ పథకంలో భాగమే. ఈ మేరకు నేపాల్లో చేపడుతున్న పంచేశ్వర్ బహుళార్థసాధక ప్రాజెక్ట్, సప్తకోసి-సన్ కోసి ప్రాజెక్ట్ వంటి వాటివల్ల రెండు దేశాలకూ ప్రయోజనం చేకూరుతుంది.
********


(Release ID: 1568188) Visitor Counter : 116