ఆర్థిక మంత్రిత్వ శాఖ
నెలకు 15 వేల రూపాయల వరకు ఆదాయం కలిగి ఉన్న అసంఘటిత రంగ శ్రామికుల కోసం ‘ప్రధాన మంత్రి శ్రమ-యోగి మాన్ ధన్’ పేరిట ఒక బృహత్తర పెన్షన్ పథకాన్ని ప్రవేశ పెట్టాలని ప్రతిపాదించిన ప్రభుత్వం; దీనితో ఈ రంగం లో 10 కోట్ల మంది శ్రామికులు మరియు పనివారు లబ్ది పొందనున్నారు
Posted On:
01 FEB 2019 1:36PM by PIB Hyderabad
నెలకు 15 వేల రూపాయల వరకు ఆదాయం కలిగి ఉన్న అసంఘటిత రంగ శ్రామికుల కోసం ‘ప్రధాన మంత్రి శ్రమ-యోగి మాన్ ధన్’ పేరిట ఒక బృహత్తర పెన్షన్ పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. కేంద్ర ఆర్థిక శాఖ, కార్పొరేట్ వ్యవహారాలు, రైల్వేలు మరియు బొగ్గు శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ నేడు పార్లమెంటు లో 2019-20 సంవత్సర తాత్కాలిక బడ్జెట్ ను ప్రవేశపెడుతూ, భారతదేశం యొక్క జిడిపి లో సగం అసంఘటిత రంగం లో చెమటోడ్చి పని చేస్తున్నటువంటి 42 కోట్ల మంది వర్కర్ల నుండే లభిస్తోందన్నారు. వీరిలో వీధి వీధికి తిరిగి వస్తువులు, సరకులు అమ్మేవారు, రిక్షా కార్మికులు, నిర్మాణ రంగ శ్రామికులు, వ్యర్థాలను ఏరుకొనే వారు, వ్యవసాయ కూలీలు, బీడీ కార్మికులు, చేనేతకారులు, తోలు వస్తువులు తయారు చేసేవారి తో పాటు, ఇదే విధమైన అనేక వృత్తుల వారు ఉన్నారు. ప్రభుత్వం వీరికి వీరి యొక్క వృద్ధాప్యం లో ఒక సమగ్రమైనటువంటి సామాజిక భద్రత కవచాన్ని సమకూర్చవలసిన అవసరం ఉంది. కాబట్టి, ‘ఆయుష్మాన్ భారత్’ లో భాగంగా అందిస్తున్న ఆరోగ్య రక్షణ మరియు ‘ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన’, ఇంకా ‘ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన’ లలో భాగంగా సమకూర్చుతున్న జీవిత మరియు వైకల్య రక్షణ లకు తోడుగా మా ప్రభుత్వం ‘ప్రధాన మంత్రి శ్రమ-యోగి మాన్ ధన్’ పేరుతో ఒక బృహత్తరమైన పెన్షన్ పథకాన్ని ప్రారంభించాలని ప్రతిపాదిస్తోందన్నారు.
ఈ పెన్షన్ పథకం 60 ఏళ్ళ వయస్సు వచ్చినప్పటి నుండి 3 వేల రూపాయల నెలవారీ పింఛను అందించేందుకు ఉద్దేశించిందని శ్రీ గోయల్ అన్నారు. అయితే, దీని కోసం వారు పని చేసే కాలం లో చిన్నపాటి మొత్తాన్ని నెలవారీ ప్రాతిపదికన తమ వంతు వాటాగా సమకూర్చవలసి ఉంటుందని ఆయన తెలిపారు. 29 ఏళ్ళ ప్రాయం లో పెన్షన్ యోజన లో చేరే అసంఘటిత రంగ శ్రామికుడు తనకు 60 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు ప్రతి ఒక్క నెలకు కేవలం 100 రూపాయలు సమకూర్చవలసి ఉంటుందని వివరించారు. 18 ఏళ్ళ వయస్సు లో పెన్షన్ పథకం లో చేరే శ్రామికుడు ప్రతి ఒక్క నెలకు 55 రూపాయలు కడితే సరిపోతుందన్నారు. ప్రభుత్వం ఆ శ్రామికుని పెన్షన్ ఖాతా లో ప్రతి నెలా సమానమైనటువంటి వాటా ను జమ చేస్తుందని ఆయన చెప్పారు. రానున్న అయిదు సంవత్సరాల కాలం లో ‘ప్రధాన మంత్రి శ్రమ-యోగి మాన్ ధన్’ తాలూకు లబ్దిని అసంఘటిత రంగం లో కనీసం 10 కోట్ల మంది శ్రామికులు పొందగలుగుతారన్న అంచనా ఉంది. తత్ఫలితంగా ఇది ప్రపంచం లో అతి భారీ పెన్షన్ పథకాల లో ఒకటిగా మారే అవకాశం ఉంది. ఈ పథకం కోసం 500 కోట్ల రూపాయల మొత్తాన్ని కేటాయించడమైంది. అవసరమైతే అదనపు నిధులను కూడా అందిస్తారు. ఈ పథకాన్ని ప్రస్తుత సంవత్సరం నుండే అమలులోకి తీసుకురానున్నారు.
***
(Release ID: 1562552)