• Sitemap
  • Advance Search
Social Welfare

పీఎం స్వనిధి: వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూత

పీఎం స్వనిధి గురించి తరుచుగా అడిగే ప్రశ్నలు

Posted On: 30 MAY 2026 8:39PM

1. పీఎం స్వనిధి అంటే ఏమిటి?

పీఎం స్వనిధి అనేది వీధి వ్యాపారులకు మూలధన సహాయాన్ని, ఆర్థిక భాగస్వామ్యం, సామాజిక భద్రతను అందించే కేంద్ర ప్రభుత్వ పథకం

2. దీనిని ఎందుకు ప్రవేశపెట్టారు?

కోవిడ్‌19 మహమ్మారి సమయంలో తీవ్రంగా దెబ్బతిన్న వీధి వ్యాపారులకు నిర్వహణ మూలధనాన్ని అందించే లక్ష్యంతో పీఎం‌-స్వనిధిని ప్రారంభించారు. అసంఘటిత కార్మిక శక్తిని కలిగి, అనధికారిక శ్రామిక శక్తిలో కీలక భాగమై ఉండి, సాధారణంగా బ్యాంకింగ్ రుణ సదుపాయాలు పెద్దగా లేని వీధి వ్యాపారుల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన మొట్టమొదటి మైక్రో-క్రెడిట్ పథకం ఇది. వారి వ్యాపార వృద్ధికి తోడ్పాటునందిస్తూనే, వారిని ఆర్థిక సమేళనం పరిధిలోకి తీసుకురావడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం.

3. పీఎం స్వనిధి ఎప్పుడు ప్రారంభమైంది. ఏ మంత్రిత్వ శాఖ దీన్ని అమలు చేస్తుంది?

ఈ పథక 2020 జూన్ లో ప్రారంభించారు. కేంద్ర గృహా, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు ఆర్థిక సేవల విభాగం సంయుక్తంగా దీనిని అమలు చేస్తున్నాయి.

4. పీఎం స్వనిధి పథకం కింద రుణ వ్యవధిని ఎప్పటి వరకు పొడిగించారు?

ఈ పథకం సాధించిన విజయాలు, సానుకూల ఫలితాల ప్రభావాన్ని పరిగణలోకి తీసుకుని పీఎం-స్వనిధి పునర్వ్యవస్థీకరణను, పొడిగింపును కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఇందులో భాగంగా.. ఈ పథకం కింద రుణ వ్యవధిని మార్చి 2030 వరకు పొడిగించింది.

5. వీధి వ్యాపారులు/చిరు వ్యాపారులు అంటే ఎవరు?

వీధి, ఫుట్‌పాత్, నడకదారి మొదలైన ప్రాంతాలలో తాత్కాలికంగా నిర్మించిన నిర్మాణాల ద్వారా గానీ, లేదా ఒక చోటు నుంచి మరొక చోటుకి తిరుగుతూ గానీ వస్తువులు, సరుకులు, ఆహార పదార్థాలు, లేదా రోజువారీ వినియోగ వస్తువులను విక్రయించే లేదా ప్రజలకు సేవలను అందించే ఏ వ్యక్తినైనా వీధి వ్యాపారిగా పరిగణిస్తారు. వారు విక్రయించే వస్తువులలో కూరగాయలు, పండ్లు, తినడానికి సిద్ధంగా ఉండే వీధి ఆహారం మొదలైనవి ఉంటాయి. అలాగే వారు అందించే సేవలలో మంగలి షాపులు, చెప్పులు కుట్టే వారు, బట్టలు ఉతికే/ఇస్త్రీ సేవలు వంటివి ఉంటాయి.

6. పీఎం స్వనిధి ద్వారా ఎలాంటి ఆర్థిక సహాయం, ప్రయోజనాలు అందుతాయి?

వీధి వ్యాపారులు పూచీకత్తు లేని మూలధన రుణాలు దశాల వారీగా రూ.15,000, రూ.20,000; రూ.50,000 వరకు రుణాలను పొందవచ్చు. ఈ పథకం ద్వారా అర్హులైన వ్యాపారులకు వడ్డీ రాయితీ, రుణ హామీ మద్దతు, రూ.30,000 వరకు రుణ పరిమితి కలిగిన  యూపీఐ అనుసంధానిత రూపే క్రెడిట్ కార్డును అందిస్తుంది.

7. సకాలంలో లేదా ముందుగానే రుణాన్ని తిరిగి చెల్లించినట్లయితే ఏమైనా పోత్సాహాకాలున్నాయా?

అవును. ఉన్నాయి. పీఎం స్వనిధి రుణాలను సకాలంలో లేదా ముందుగానే తిరిగి చెల్లించినట్లయితే ఏడాదికి 7 శాతం వడ్డీ రాయితీ లభిస్తుంది. అలాగే.. సకాలంలో చెల్లించిన వ్యాపారులకు తర్వాతి విడతల్లో మరింత ఎక్కువ మొత్తంలో రుణాలు పొందేందుకు అర్హత పొందుతారు.  

8. రుణ ఆమోదానికి ఎంత సమయం పడుతుంది?

రుణ దరఖాస్తు, ఆమోద ప్రక్రియను సులభతరం చేయడం కోసం పీఎం - స్వనిధి పూర్తి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ను వినియోగిస్తుంది. రుణ ధృవీకరణ, ఇతర నిబంధనలకు లోబడి.. రుణ ఆమోదానికి సగటున సుమారు 23 రోజుల సమయం పడుతుంది.

9. సిఫార్సు పత్రం లేదా విక్రయ ధృవీకరణ పత్రం ఉన్న వీధి వ్యాపారులు రుణం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవచ్చు?

చెల్లుబాటు అయ్యే సిఫార్సు లేఖ లేదా విక్రయ ధృవీకరణ పత్రం కలిగిన వీధి వ్యాపారి.. పోర్టల్ ద్వారా లేదా మొబైల్ యాప్ లో, లేదా పట్టణ స్థానిక సంస్థల సహాయంతో పీఎం స్వనిధి రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

10. పీఎం స్వనిధి ద్వారా ఎంత మంది వీధి వ్యాపారులు ప్రయోజనం పొందారు?

ఇప్పటి వరకు పీఎం స్వనిధి కింద 75.5 లక్షలకు పైగా వీధి వ్యాపారులు 112 లక్షలకు పైగా రుణాలను పొందారు.

11. ఈ పథకం కింద పంపిణీ చేసిన మొత్తం ఆర్థిక సహాయం ఎంత?

దేశవ్యాప్తంగా వీధి వ్యాపారులకు రూ.17,800 కోట్లకు పైగా రుణాలు పంపిణీ చేశారు. లబ్ధిదారులు వడ్డీ రాయితీలు, డిజిటల్ క్యాష్‌బ్యాక్ ప్రోత్సాహకాల ద్వారా దాదాపు రూ.800 కోట్లు అందుకున్నారు.

12. పీఎం స్వనిధి వీధి వ్యాపారులలో డిజిటల్, ఆర్థిక సమ్మిళితాన్ని ఎలా ప్రోత్సహిస్తుంది?

ఈ పథకం రూ.1,600 వరకు క్యాష్‌బ్యాక్ ప్రోత్సాహకాలు, ఆర్థిక అక్షరాస్యత మద్దతు ద్వారా డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తుంది. 55 లక్షలకు పైగా వ్యాపారులు దాదాపు రూ.8.96 లక్షల కోట్ల విలువైన 841 కోట్లకు పైగా డిజిటల్ లావాదేవీలను పూర్తి చేశారు.

13. స్వనిధి సే సమృద్ధి అంటే ఏమిటి, అది లబ్ధిదారులకు ఎలా మద్దతు ఇస్తుంది?

స్వనిధి సే సమృద్ధి కార్యక్రమం లబ్ధిదారుల కుటుంబాల వివరాలను సేకరించి, వారిని ఎంపిక చేసిన ఎనిమిది కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలతో అనుసంధానిస్తుంది. ఈ కార్యక్రమం కింద 50 లక్షలకు పైగా కుటుంబాల వివరాలు సేకరించి, 1.52 కోట్లకు పైగా సంక్షేమ ప్రయోజనాలను మంజూరు చేశారు.

14. పీఎం స్వనిధి పథకం కింద ఎలాంటి శిక్షణ, సామర్థ్య పెంపు మద్దతు అందించబడుతుంది?

ఈ పథకం కింద ఆర్థిక అక్షరాస్యత, డిజిటల్ అక్షరాస్యత మరియు ఎఫ్ఎస్ఎస్ఏఐ సహకారంతో ఆహార భద్రతా పద్ధతులపై శిక్షణను అందిస్తుంది. ఇప్పటి వరకు సుమారు 6 లక్షల వీధి ఆహార విక్రేతలకు ఆహార భద్రత, పరిశుభ్రతా ప్రమాణాలపై శిక్షణ ఇవ్వడం జరిగింది.

15. జీవనోపాధి, ఆర్థిక సాధికారతపై పీఎం స్వనిధి ఎలాంటి ప్రభావాన్ని చూపింది?

2023 మరియు 2025లో నిర్వహించిన స్వతంత్ర అధ్యయనాల ప్రకారం.. ఈ పథకం లబ్ధిదారులలో మెరుగైన వ్యాపార స్థిరత్వం, అధిక ఆదాయాలు, బలమైన ఆర్థిక చేరిక కనిపించినట్లు తేలింది. దాదాపు 95 శాతం మంది లబ్ధిదారులు ఈ పథకం ద్వారా మొదటిసారిగా అధికారికంగా బ్యాంకింగ్/ సంస్థాగత రుణాన్ని పొందగలిగారు. సుమారు 30 శాతం మంది లబ్ధిదారులు పీఎం స్వనిధి రుణాలతో పాటు అదనపు రుణ సదుపాయాన్ని కూడా పొందారు. లబ్ధిదారుల వార్షిక ఆదాయాలు సగటున దాదాపు 20 శాతం పెరిగాయి.

16. పీఎం స్వనిధి పథకం సామాజిక సమ్మిళితాన్ని, పట్టణ జీవనోపాధులను ఎలా బలోపేతం చేసింది?

లబ్ధిదారులలో దాదాపు 46 శాతం మంది మహిళలు కాగా, సుమారు 70 శాతం మంది అట్టడుగు వర్గాలకు చెందినవారు. ఈ పథకం సూక్ష్మ పరిశ్రమలను, స్థానిక సరఫరా గొలుసులను బలోపేతం చేయడంతో పాటు, వ్యాపారులను పట్టణ స్థానిక సంస్థలతో అనుసంధానించింది.

 

****

(Explainer ID: 158737) आगंतुक पटल : 19
Provide suggestions / comments
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , हिन्दी , Kannada