Rural Prosperity
సరస్ మేళా 2026
గ్రామీణ మహిళా సంఘాలను జాతీయ మార్కెట్లకు అనుసంధానించే మహోత్సవం
Posted On:
21 OCT 2026 11:03AM
గ్రామీణ మహిళా పారిశ్రామికవేత్తలను విశాలమైన మార్కెట్లు, కొనుగోలుదారులు, నూతన వ్యాపార అవకాశాలతో అనుసంధానించేందుకు దీన్‌దయాల్ అంత్యోదయ యోజన - జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ (డీఏవై-ఎన్ఆర్ఎల్ఎం) ఆధ్వర్యంలో ‘సరస్ మేళా’ నిర్వహిస్తున్నారు. ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతం వెలుపల మొట్టమొదటిసారిగా విజయవాడలో జాతీయ స్థాయి సరస్ మేళాను నిర్వహించడం విశేషం. 34 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి మహిళా పారిశ్రామికవేత్తలను ఒకే వేదికపైకి తెస్తున్న ఈ ప్రదర్శన, ‘లఖ్‌పతి దీదీ’ లక్ష్య సాధనకు అనుగుణంగా గ్రామీణ మహిళల్లో సుస్థిర జీవనోపాధి మరియు ఆదాయ వృద్ధికి ఊతమిస్తోంది. వ్యాపార ప్రతిభను మెరుగుపరచుకోవడానికి, సంస్థాగత మద్దతు పొందడానికి ఈ మేళాలోని ప్రత్యేక పెవిలియన్లు తోడ్పడుతున్నాయి. అంతేకాకుండా, ఈసరస్ వంటి డిజిటల్ వేదికల ద్వారా కేవలం ఈ ప్రదర్శనలకే పరిమితం కాకుండా, గ్రామీణ మహిళలు తమ ఉత్పత్తులను నిరంతరం విస్తృత మార్కెట్లకు తీసుకెళ్లే అవకాశం లభిస్తోంది.
గ్రామీణ మహిళా పారిశ్రామికవేత్తలకు ఆశాకిరణం
భారతదేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ సాంప్రదాయ నైపుణ్యాలు, హస్తకళలు మరియు అపారమైన వ్యాపార ప్రతిభతో సమృద్ధిగా ఉంది. మహిళా స్వయం సహాయక సంఘాలు ఈ నైపుణ్యాలను వెలికితీసి స్థానిక ఆర్థిక రంగాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. చేనేత వస్త్రాలు, చేతివస్తువుల నుంచి ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు, స్థానిక గృహోపయోగ వస్తువుల వరకు వీరు రకరకాల ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. అయితే, ఉత్పత్తులను తయారు చేయడమే కాకుండా, వాటిని విక్రయించడానికి తగిన వినియోగదారులు, మార్కెట్ సమాచారం, సరైన అవకాశాలు గ్రామీణ పారిశ్రామికవేత్తలకు ఎంతో అవసరం. సరస్ మేళాలు మహిళా నేతృత్వంలోని ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు, సంస్థాగత కొనుగోలుదారులకు చేరువ చేస్తూ ఈ రంగానికి వేదికను అందిస్తున్నాయి.. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే దీన్‌దయాల్ అంత్యోదయ యోజన - జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ నేతృత్వంలో గత మూడు దశాబ్దాలుగా సరస్ మేళాలు క్రమంగా విస్తరించాయి. ఇవి కేవలం ప్రదర్శనలుగానే కాకుండా, ఉత్పత్తులను విక్రయించడానికి, వినియోగదారుల ప్రాధాన్యతలను గ్రహించడానికి, కొత్త వ్యాపార సంబంధాలను ఏర్పరచుకోవడానికి ఒక సమర్థవంతమైన వేదికగా ఉపయోగపడుతున్నాయి.

Image: SARAS Melas providing a national platform to traditional arts
|

ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో జాతీయ సరస్ మేళాను నిర్వహించడం ఈ ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయి. ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతం వెలుపల జాతీయ స్థాయి సరస్ మేళా జరగడం ఇదే మొదటిసారి. ఈ కార్యక్రమం 2026 అక్టోబర్ 13 నుండి అక్టోబర్ 31 వరకు విజయవాడలోని పున్నమి ఘాట్‌లో వైభవంగా సాగుతోంది. దేశవ్యాప్తంగా ఉన్న 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి సుమారు 1,500 మంది మహిళా స్వయం సహాయక సంఘాల పారిశ్రామికవేత్తలు, లఖ్‌పతి దీదీలు తమ ఉత్పత్తులను ప్రదర్శించేందుకు ఇక్కడ 650కి పైగా స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఈ మేళాలో ప్రాచీన చేనేత వస్త్రాలు, చేతివృత్తుల వస్తువులు, ప్రకృతి సిద్ధమైన, ప్రాసెస్ చేసిన వివిధ రకాల ఆహార ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు ‘ఇండియా ఫుడ్ కోర్ట్’, సాంస్కృతిక ప్రదర్శనలు, ప్రత్యేక శిక్షణా వేదికలు సందర్శకులకు సరికొత్త అనుభూతిని అందిస్తున్నాయి.
జాతీయ సరస్ మేళాను వికేంద్రీకరించడం అనేది సమగ్ర అభివృద్ధి వైపు వేసిన ముందడుగు. జాతీయ స్థాయి వేదికలను రాజధానికే పరిమితం చేయకుండా దేశంలోని ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లడం ద్వారా స్థానిక ఉత్పత్తులకు, కొనుగోలుదారులకు అనుసంధానం ఏర్పడుతుంది. ఇది మహిళా సాధికారతకు, స్థానిక నైపుణ్యాల వృద్ధికి ఎంతో దోహదపడుతుంది. బ్రిక్స్, జీ20 వంటి అంతర్జాతీయ సదస్సులను దేశంలోని వివిధ నగరాల్లో నిర్వహించినట్లే, జాతీయ స్థాయి కార్యక్రమాలను కూడా వికేంద్రీకరించి నిర్వహించవచ్చని ఈ మేళా రుజువు చేస్తోంది.
గ్రామీణ జీవనోపాధి నుండి మార్కెట్ సౌలభ్యం వరకు: డీఏవై -ఎన్ఆర్ఎల్ఎం పాత్ర
గ్రామీణ ప్రాంతాల్లో పేదరికాన్ని నిర్మూలించి, మహిళల ఆర్థిక సాధికారతను పెంపొందించడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అత్యంత ముఖ్యమైన పథకం డీఏవై-ఎన్ఆర్ఎల్ఎం. ఇది స్వయం సహాయక సంఘాలు మరియు వాటి సమాఖ్యల ద్వారా పనిచేస్తూ, ఆర్థిక చేరిక మరియు స్థిరమైన జీవనోపాధికి గొప్ప ఊతాన్ని ఇస్తోంది. ఈ మిషన్ మహిళలకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ, సాంకేతిక పరిజ్ఞానం, రుణాలు మరియు వ్యాపార అవకాశాలను అందిస్తుంది. అంతేకాకుండా, బ్రాండింగ్, గుర్తింపు, భౌతిక, డిజిటల్ మార్కెట్లతో అనుసంధానించడం ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలకు బలమైన వ్యాపార వ్యవస్థను నిర్మిస్తోంది.

Image: SHG women receive branding and marketing knowledge under DAY-NRLM
|

మార్కెట్ అనుసంధానం ఎంతో కీలకం, ఎందుకంటే వ్యాపార విజయం కేవలం వస్తువులను ఉత్పత్తి చేయడంతోనే ఆగిపోదు. మహిళలకు తమ స్థానిక ప్రాంతాలకు మించి ఉత్పత్తులను విక్రయించే అవకాశాలు కావాలి. వినియోగదారుల అభిప్రాయాలు, ఉత్పత్తుల నాణ్యత పెంపు, నేరుగా కొనుగోలుదారులతో మాట్లాడే సదుపాయం ద్వారా వారు మరింత నేర్చుకుంటారు. సరస్ మేళాలు ఈ అవసరాలకు అనుగుణంగా ఒక సమర్థవంతమైన వారధిగా నిలుస్తున్నాయి. ఇవి స్వయం సహాయక సంఘాల మహిళలను, సాధారణ వినియోగదారులను, సంస్థాగత కొనుగోలుదారులను ఒకే చోటికి చేరుస్తున్నాయి. దీనివల్ల పారిశ్రామికవేత్తలు నేరుగా అమ్మకాలు జరుపుకోవడమే కాకుండా, మార్కెట్ అవసరాలను అర్థం చేసుకుంటూ దీర్ఘకాలిక వ్యాపార భాగస్వామ్యాలను ఏర్పరచుకోగలుగుతున్నారు.
65 మంది లబ్ధిదారుల నుండి జాతీయ స్థాయి మార్కెట్ వరకు
సరస్ మేళా ప్రయాణం 1999లో ఢిల్లీలో కేవలం 65 మంది లబ్ధిదారులతో చిన్నగా ప్రారంభమైంది. కాలక్రమేణా ఈ వేదిక విపరీతంగా విస్తరించి జాతీయ, ప్రాంతీయ, రాష్ట్ర మరియు జిల్లా స్థాయిలలో నిర్వహించబడుతోంది. ఇప్పటివరకు మొత్తం 117 జాతీయ సరస్ మేళాలు దిగ్విజయంగా పూర్తయ్యాయి. వార్షిక విక్రయాలు రూ.200 కోట్లకు పైగా నమోదవ్వడం దీని ఘనతకు నిదర్శనం. ప్రతి రాష్ట్రం మరియు కేంద్రపాలిత ప్రాంతం కూడా ఏడాదికి కనీసం రెండు రాష్ట్ర స్థాయి సరస్ మేళాలను నిర్వహిస్తున్నాయి. దేశవ్యాప్తంగా సంవత్సరానికి సగటున 50 వరకు ప్రాంతీయ, జిల్లా స్థాయి మేళాలు జరుగుతుండటంతో స్థానిక మహిళలకు మెరుగైన ఉపాధి మరియు అమ్మకపు అవకాశాలు దక్కుతున్నాయి.
లఖ్‌పతి దీదీ: సుస్థిర జీవనోపాధి వైపు అడుగులు
‘లఖ్‌పతి దీదీ’ అనేది డీఏవై-ఎన్ఆర్ఎల్ఎం కింద అమలు చేయబడుతున్న అత్యంత ప్రాధాన్యత కలిగిన పథకం. ఇది స్వయం సహాయక సంఘాల నెట్‌వర్క్ ద్వారా మహిళలు వివిధ రకాల జీవనోపాధి మార్గాలను ఎంచుకుని స్థిరమైన ఆదాయాన్ని పొందడానికి సహాయపడుతుంది. కనీసం నాలుగు వ్యవసాయ లేదా వ్యాపార చక్రాలలో నిలకడగా ప్రతి సంవత్సరం కనీసం రూ.1 లక్ష లేదా అంతకంటే ఎక్కువ నికర ఆదాయాన్ని పొందే స్వయం సహాయక సంఘాల మహిళను ‘లఖ్‌పతి దీదీ’గా పిలుస్తారు. ఈ కార్యక్రమానికి జాతీయ స్థాయిలో గొప్ప ఆదరణ లభించింది. 2023 ఆగస్టులో ప్రభుత్వం మొదట రెండు కోట్ల మంది లఖ్‌పతి దీదీలను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆ తర్వాత 2024-25 మధ్యంతర బడ్జెట్‌లో ఈ లక్ష్యాన్ని మూడు కోట్లకు పెంచారు. ప్రభుత్వ కృషితో 2025 డిసెంబర్ నాటికే మూడు కోట్ల లఖ్‌పతి దీదీల లక్ష్యం నిరాటంకంగా పూర్తయింది.
అనంతరం 2026 ఫిబ్రవరిలో ప్రభుత్వం ఈ లక్ష్యాన్ని మరింత విస్తరిస్తూ ఆరు కోట్ల మంది లఖ్‌పతి దీదీలను తీర్చిదిద్దాలని నిర్దేశించింది. ఈ తదుపరి దశలో మహిళల ఆదాయాన్ని స్థిరంగా నిలబెట్టుకోవడం మరియు వారి చిన్న తరహా పరిశ్రమలను మరింత విస్తరించడంపై దృష్టి సారిస్తున్నారు. ఈ ప్రయాణంలో మార్కెట్ సౌలభ్యం, ఉత్పత్తుల నాణ్యత, గుర్తింపు మరియు నిలకడైన విక్రయ అవకాశాలు ఎంతో అవసరం. కేవలం జీవనోపాధి స్థాయి నుంచి వ్యాపార వేత్తలుగా ఎదిగే ఈ క్రమంలో సరస్ మేళాలు మహిళలకు కొండంత అండగా నిలుస్తున్నాయి. ఇవి పెద్దమొత్తంలో ఆర్డర్లు పొందడానికి, సంస్థాగత విక్రయాలకు మరియు దీర్ఘకాలిక వ్యాపార సంబంధాలకు దారితీస్తున్నాయి. విజయవాడ మేళాలో విజయవంతమైన పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేక స్థలాలు, వ్యాపార శిక్షణ మరియు సంస్థాగత మద్దతు ద్వారా ఈ లక్ష్యాలకు ప్రాణం పోస్తున్నారు.
విజయవాడ సరస్ మేళా: జాతీయ స్థాయి ఉత్పత్తుల సమాహారం
విజయవాడ జాతీయ సరస్ మేళా భారతదేశ నలుమూలల సంస్కృతి, సాంప్రదాయాలు మరియు విశిష్ట ఉత్పత్తులను ఒకే చోటికి చేర్చింది. పంజాబ్ యొక్క ఫుల్కారీ, జమ్మూ కాశ్మీర్ పష్మీనా శాలువాలు, తెలంగాణ ఇక్కత్ మరియు తేలియా రుమాళ్ళు, మిజోరం పౌంచెయ్ వంటి ప్రముఖ వస్త్ర రకాలు ఇక్కడ లభిస్తాయి. వీటితో పాటు మీనాకారీ, ధోక్రా మెటల్ క్రాఫ్ట్, ఇత్తడి, చెక్క కళాఖండాలు మరియు సాంప్రదాయ చిత్రలేఖనాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

Image: The 16-feet tall installation: "SHAKTI"
|

ఈ మేళాలో మరో ప్రధాన ఆకర్షణ “శక్తి - లఖ్‌పతి దీదీల ఆత్మ” అనే ప్రత్యేక పవిలియన్. ప్రాచీన హస్తకళలను కాపాడుతూ, తమ నైపుణ్యాన్నే జీవనోపాధిగా, ఆత్మగౌరవంగా మలుచుకున్న మహిళల ఐక్యతా శక్తికి ఇది నిదర్శనం.
ఈ మేళాకు నాబార్డ్, ఎన్‌ఐఆర్‌డిపిఆర్ వంటి ప్రముఖ ప్రభుత్వ సంస్థల మద్దతు లభిస్తోంది. ఇది కేవలం ప్రత్యక్ష విక్రయాలకే కాకుండా, వ్యాపార శిక్షణ, నైపుణ్య ప్రదర్శనలు మరియు విపణి అనుసంధానాలకు మేలైన అవకాశాలను కల్పిస్తోంది. సాధారణ సందర్శకులతో పాటు, సొంతంగా వ్యాపారాలను స్థాపించి విజయవంతంగా నడపాలనుకునే మహిళలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతోంది.
ఉత్పత్తులు, నైపుణ్యాలు మరియు అవకాశాల సంగమం
విజయవాడ జాతీయ సరస్ మేళా సాధారణ వ్యాపార ప్రదర్శనల శైలికి భిన్నంగా అనేక వినూత్న కార్యక్రమాలతో రూపుదిద్దుకుంది. ప్రత్యేకమైన థీమ్స్, విజ్ఞాన మార్పిడి మరియు భాగస్వామ్య వేదికలు ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలు పరస్పరం నేర్చుకోవడానికి, అనుభవాలను పంచుకోవడానికి, ప్రభుత్వం మరియు ప్రైవేట్ భాగస్వాములతో నేరుగా చర్చలు జరపడానికి మంచి అవకాశం ఏర్పడింది.
లఖ్‌పతి దీదీ పెవిలియన్: వ్యాపార విజయ గాథలు
లఖ్‌పతి దీదీ పెవిలియన్‌లో వ్యాపార రంగంలో అద్భుత విజయాలు సాధించిన మహిళలను ప్రత్యేకంగా పరిచయం చేస్తున్నారు. అందులో ఏడాదికి రూ.10 లక్షలకు పైగా సంపాదించే మహిళలతో పాటు, ఏకంగా రూ.1 కోటి టర్నోవర్ సాధించిన సాధకురాళ్ళు కూడా ఉన్నారు. వీరు తమ వ్యాపార నమూనాలు, మార్కెట్ వ్యూహాలు మరియు అనుభవాలను ఇతర ఎస్.హెచ్.జీ సభ్యులతో పంచుకుంటున్నారు. వ్యవసాయం, ఆహార సంస్కరణ, హస్తకళలు, చేనేత మరియు సేవా రంగాలలో వారు సాధించిన పురోగతి ఇతరులకు ప్రేరణగా నిలుస్తోంది. తోటి మహిళల విజయ గాథలు ఇతర సభ్యులలో ఆత్మవిశ్వాసాన్ని నింపి, సరికొత్త వ్యాపార ఆలోచనలకు శ్రీకారం చుడుతున్నాయి.
లెర్నింగ్ అండ్ నాలెడ్జ్ పెవిలియన్: వ్యాపార నైపుణ్యాల శిక్షణ
మంచి ఉత్పత్తులకు సరైన వ్యాపార మెళకువలు జతకావాలి. అందుకోసమే ఈ పెవిలియన్ పనిచేస్తోంది. ఇక్కడ వర్క్‌షాప్‌లు, నిపుణుల ప్రసంగాలు, మాస్టర్‌క్లాస్‌లు, అనుభవజ్ఞుల శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. ప్యాకేజింగ్, బ్రాండింగ్, బిజినెస్ ప్రపోజల్స్ తయారీ, ఇ-కామర్స్, సోషల్ మీడియా మార్కెటింగ్ వంటి ఆధునిక అంశాలపై అవగాహన కలిగిస్తున్నారు. నాబార్డ్, ఎఫ్ఐసిసిఐ, సిఐఐ, ఐటిసి హిందూస్థాన్ యూనిలీవర్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థల ప్రతినిధులతో చర్చా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ద్వారా గ్రామీణ మహిళలకు కార్పొరేట్ స్థాయిలో అవగాహన లభిస్తోంది.
కన్వర్జెన్స్ పెవిలియన్: బహుముఖ ప్రభుత్వ మద్దతు
ఒక సంస్థను విజయవంతంగా నడపడానికి కేవలం విక్రయ అవకాశాలు మాత్రమే సరిపోవు. రుణాలు, సాంకేతికత, నాణ్యతా ప్రమాణాలు మరియు ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఎంతో అవసరం. కన్వర్జెన్స్ పెవిలియన్ ద్వారా మహిళలకు వివిధ ప్రభుత్వ శాఖలు, బ్యాంకింగ్ సంస్థలు, సాంకేతిక సంస్థల తోడ్పాటును అందిస్తున్నారు. గిరిజన సంక్షేమ శాఖ, ఎమ్ఎస్ఎమ్ఈ మంత్రిత్వ శాఖ, జౌళి శాఖ, ఓఎన్డీసీ, జేఈఎమ్ (గవర్నమెంట్ ఇ-మార్కెట్‌ప్లేస్) మరియు టీఆర్ఐఎఫ్ఈడీ వంటి సంస్థలు ఇక్కడ అవసరమైన సమాచారాన్ని, సేవలను నేరుగా అందిస్తున్నాయి.
డెమో పెవిలియన్: ప్రత్యక్ష నైపుణ్య ప్రదర్శన
ఏదైనా ఒక విశిష్ట ఉత్పత్తి వెనుక కళాకారుల శ్రమ, నైపుణ్యం మరియు సమయం దాగి ఉంటాయి. సందర్శకులకు ఈ తయారీ విధానాన్ని ప్రత్యక్షంగా చూపించేందుకు డెమో పెవిలియన్ ఉపయోగపడుతోంది. మహిళా పారిశ్రామికవేత్తలు ఇక్కడ కుండల తయారీ, ఎంబ్రాయిడరీ, సూదిపని, అద్దాల అలంకరణ వంటి సాంప్రదాయ కళలను ప్రత్యక్షంగా ప్రదర్శిస్తున్నారు. ఈ ప్రాక్టికల్ డెమోలు హస్తకళల గొప్పతనాన్ని చాటిచెప్పడమే కాక, నేరుగా నేర్చుకోవాలనుకునే వారికి చక్కటి అవకాశాన్ని ఇస్తున్నాయి.

Image: Live fibre-making demonstration
|

ఇండియా ఫుడ్ కోర్ట్: సంప్రదాయ రుచులు - మహిళా సాధికారత
ఆహారం అనేది ప్రజలను త్వరగా ఆకట్టుకునే అద్భుతమైన మార్గం. ఇండియా ఫుడ్ కోర్ట్‌లో ఏర్పాటు చేసిన 50 ఆహార స్టాళ్ల ద్వారా దేశంలోని వివిధ ప్రాంతాల సాంప్రదాయ రుచులను అందిస్తున్నారు. 28 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 200 మందికి పైగా తొలితరం మహిళా క్యాటరింగ్ పారిశ్రామికవేత్తలు ఇక్కడ విభిన్న వంటకాలను వడ్డిస్తున్నారు. బీహార్ లిట్టీ చోఖా, హైదరాబాదీ దమ్ బిర్యానీ, అస్సాం మష్రూమ్ పిఠా, పంజాబ్ మక్కే ది రోటీ-సర్సో కా సాగ్, కేరళ అట్టపాడి వన సుందరి, ఛత్తీస్‌గఢ్ చౌసేలా వంటి రకరకాల ప్రాంతీయ వంటకాలు సందర్శకులకు నోరూరిస్తున్నాయి. ఇది మహిళల్లో వంట నైపుణ్యాన్ని ఒక వ్యాపారంగా మార్చడానికి ఎంతగానో దోహదపడుతోంది.

Image: Regional delicacies being served at the Food Court
|

సాంస్కృతిక ప్రదర్శనలు: సంస్కృతుల సమ్మేళనం
వివిధ ప్రాంతాల నుండి వచ్చిన కళాకారుల సాంప్రదాయ సంగీత, నృత్య ప్రదర్శనలు మేళాకు విచ్చేసిన సందర్శకులకు సంపూర్ణ జాతీయ ఉత్సవ అనుభూతిని ఇస్తున్నాయి. ఇవి ప్రదర్శనలోని ఉత్పత్తుల వెనుక ఉన్న సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తూ, భారత్ లోని వైవిధ్యాన్ని కళ్ళకు కట్టినట్లు చూపుతున్నాయి.
డిజిటల్ సేవలు: ప్రత్యక్ష విక్రయాల నుండి ఇ-కామర్స్ వరకు
సరస్ మేళాలో విక్రయాల వేగాన్ని పెంచడానికి డిజిటల్ చెల్లింపులు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఫుడ్ కోర్ట్ సహా పలు స్టాళ్లలో యూపీఐ డిజిటల్ లావాదేవీలు అందుబాటులో ఉన్నాయి. నగదు చెల్లింపులు కోరుకునే పెద్దలు, సందర్శకుల కోసం కూపన్ వ్యవస్థను కూడా సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు.

Image: The eSARAS website
|

మేళా ముగిసిన తర్వాత కూడా వ్యాపారం నిరంతరం సాగాలనే ఉద్దేశంతో డిజిటల్ నెట్‌వర్క్‌ను అనుసంధానించారు. భౌతిక ప్రదర్శనలతో పాటు సరస్ గ్యాలరీ మరియు eSARAS ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ను వినియోగంలోకి తెచ్చారు. దీనివల్ల కొనుగోలుదారులు ఎక్కడి నుంచైనా నేరుగా మహిళా పారిశ్రామికవేత్తల ఉత్పత్తులను ఆర్డర్ చేసుకునే వెసులుబాటు లభించింది.
మరింత పారదర్శకత కోసం 2025లో ప్రత్యేకంగా ‘సరస్ మేళా డిజిటల్ యాప్’ను ప్రవేశపెట్టారు. ఇది స్వయం సహాయక సంఘాల సభ్యుల నమోదు, హాజరు మరియు మేళా నిర్వహణ సమాచారాన్ని సులభతరం చేస్తుంది. భౌతిక మేళాలు నేరుగా వినియోగదారులకు చేరువ చేస్తే, డిజిటల్ మార్గాలు దీర్ఘకాలిక మార్కెటింగ్ ప్రాప్యతను అందిస్తున్నాయి.
రాష్ట్ర స్థాయికి జాతీయ మార్కెట్ ప్రాప్యత
విజయవాడలో జాతీయ సరస్ మేళా నిర్వహణ అనేది జాతీయ స్థాయి అవకాశాలను దక్షిణాది ప్రాంతాలకు విస్తరించడంలో భాగమే. ఇది స్థానిక కొనుగోలుదారులకు కొత్త ఉత్పత్తులను పరిచయం చేయడమే కాకుండా, వివిధ రాష్ట్రాల మహిళలకు కొత్త మార్కెటింగ్ అనుభవాలను అందిస్తోంది. డీఏవై-ఎన్ఆర్ఎల్ఎమ్, ‘లఖ్‌పతి దీదీ’ ప్రాజెక్టుల ప్రధాన లక్ష్యమైన మహిళల ఆర్థిక స్వావలంబనకు ఇటువంటి కార్యక్రమాలు నిజమైన తోడ్పాటునందిస్తాయి.
ఢిల్లీ వెలుపల జాతీయ సరస్ మేళా జరగడం ‘సేవా పక్షోత్సవాల’ సందర్భంలో ఒక చారిత్రాత్మక ఘట్టం. ‘వోకల్ ఫర్ లోకల్’ మరియు ‘ఆత్మనిర్భర్ భారత్’ స్ఫూర్తితో గ్రామీణ మహిళల కష్టానికి, ప్రతిభకు సరైన విలువనిచ్చేందుకు ఈ మేళా దోహదపడుతోంది. గ్రామీణ మహిళలు నైపుణ్యం నుండి వ్యాపార వేత్తలుగా ఎదిగి, సుస్థిరమైన మార్కెట్ సాధికారతను పొందేందుకు సరస్ మేళా నిజమైన దిక్సూచిగా నిలుస్తోంది
References
Ministry of Rural Development
https://www.esaras.in/
https://x.com/esarasaajeevika?lang=en
https://www.pib.gov.in/PressReleaseDetail.aspx?PRID=2322458®=48&lang=1
Ministry of Electronics & Information Technology
https://play.google.com/store/apps/details?id=com.esaras&hl=en_IN
President’s Secretariat
https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=2323813®=48&lang=2
Government of Telangana
https://www.efms.serp.telangana.gov.in/Livelihoods/SARAS/Views/SarasHome.aspx
PIB Research
(Explainer ID: 160539)
आगंतुक पटल : 10
Provide suggestions / comments