• Sitemap
  • Advance Search
Economy

భారత బొమ్మల పరిశ్రమ వ్యవస్థ బలోపేతం స్థానిక హస్తకళల నుంచి ప్రపంచ మార్కెట్ల వరకు

Posted On: 07 JUL 2026 5:38PM

భారత బొమ్మల పరిశ్రమ సాంస్కృతిక వారసత్వం, ఆవిష్కరణలు, ఉత్పాదక వృద్ధి అద్భుత కలయికను ప్రతిబింబిస్తోంది. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన సాంప్రదాయ బొమ్మలు కళాకారులకు అండగా నిలుస్తూ, హస్తకళలను కాపాడుతూ, జీవనోపాధిని అందిస్తున్నాయి. యువ జనాభా, పెరుగుతున్న ఆదాయాలు, విద్యాసంబంధిత బొమ్మల పట్ల పెరుగుతున్న ఆసక్తి వల్ల దేశీయంగా ఏర్పడిన భారీ డిమాండ్ కొత్త అవకాశాలను సృష్టిస్తోంది. నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ టాయ్స్, అంతర్జాతీయ ప్రదర్శనలు, ఓడీఓపీ వంటి ప్రభుత్వ కార్యక్రమాలు దేశీయ ఉత్పాదక రంగాన్ని బలోపేతం చేశాయి. జీఐ ట్యాగ్ పొందిన ఉత్పత్తులు, స్వదేశీ బొమ్మలను ప్రోత్సహించే చర్యలు ప్రపంచ మార్కెట్లో పోటీతత్వాన్ని, మార్కెట్ ప్రాప్యతను పెంచాయి. దీని ఫలితంగా బొమ్మల ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి. భారతదేశం బొమ్మల నికర ఎగుమతిదారుగా అవతరించింది. ఈ రంగం నాణ్యమైన, సాంస్కృతిక మూలాలు ఉన్న బొమ్మలకు ప్రపంచ కేంద్రంగా స్థిరపడుతోంది.

భారత బొమ్మల పరిశ్రమ: మూలాల నుంచి అవకాశాల వరకు
భారత బొమ్మల పరిశ్రమ ఉత్పాదకత, ఎగుమతులు, ఆవిష్కరణల రంగంలో కీలక భాగస్వామిగా ఎదుగుతోంది. అనుకూలమైన జనాభా పరిస్థితులు, మారుతున్న వినియోగదారుల ప్రాధాన్యతలు, నిరంతర ప్రభుత్వ విధానాల మద్దతుతో ఈ రంగం కొత్త ఊపును సంతరించుకుంది. సురక్షితమైన, పర్యావరణహిత, విద్యాసంబంధిత బొమ్మలకు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్ భారతీయ తయారీదారులు, కళాకారులు, వ్యవస్థాపకులకు కొత్త అవకాశాలను కల్పించింది. సంపన్న హస్తకళా వారసత్వ పునాదులపై ఈ పరిశ్రమ దేశీయ, ప్రపంచ మార్కెట్లలో తన స్థానాన్ని క్రమంగా బలోపేతం చేసుకుంటోంది.

సింధు లోయ నాగరికత నాటి మట్టి బండ్ల నుంచి నేటి ఆధునిక విద్యాసంబంధిత, ఎలక్ట్రానిక్ బొమ్మల వరకు భారతదేశ బొమ్మల సంప్రదాయానికి దాదాపు 5,000 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ గొప్ప వారసత్వం దేశ సృజనాత్మకత, అభ్యసనం, హస్తకళా నైపుణ్య సంస్కృతిని ప్రతిబింబిస్తోంది. దీంతో పాటు హరప్పా, మొహెంజొదారో తవ్వకాలలో బయటపడిన ఆధారాలు ప్రాచీన భారతదేశ ప్రతిభను చాటిచెప్పే బొమ్మల తయారీ సంప్రదాయాన్ని వెల్లడిస్తున్నాయి. ఒకప్పుడు దేశవ్యాప్తంగా గ్రామీణ వర్క్‌షాప్‌లలో చేతితో చేసిన చెక్క బొమ్మలను తయారుచేసేవారు. రామాయణ, మహాభారత గాథల ఆధారంగా రూపొందించిన రంగురంగుల బొమ్మలు కూడా ఈ సంప్రదాయంలో భాగమయ్యాయి. ఇవన్నీ కలిసి పిల్లలను భారతదేశ సంపన్న వారసత్వం, విభిన్న సాంస్కృతిక సంప్రదాయాలతో ముడిపెట్టాయి.

సాంప్రదాయ హస్తకళలకు ఆధునిక సాంకేతికత, డిజైన్, వ్య‌వ‌స్థాప‌క‌త‌ తోడవుతున్నాయి. ఈ మార్పు భారతదేశాన్ని నాణ్యమైన బొమ్మల తయారీకి ఎదుగుతున్న కేంద్రంగా నిలుపుతోంది.

భారత బొమ్మల పరిశ్రమలో ఎదుగుతున్న అవకాశాలు
సరఫరా పరంగా చూస్తే ఈ-కామర్స్ వేదిక‌ల వేగవంతమైన విస్తరణ ఉత్పత్తుల లభ్యతను సులభతరం చేసింది. తయారీదారుల మార్కెట్ పరిధిని విస్తరించింది. డిమాండ్ పరంగా, భారతదేశ సుదీర్ఘ బొమ్మల తయారీ సంప్రదాయం ఒక ప్రత్యేక ప్రయోజనాన్ని అందిస్తోంది, సాంప్రదాయ బొమ్మలు దేశీయ, అంతర్జాతీయ కొనుగోలుదారులను ఆకర్షిస్తూనే ఉన్నాయి. పలు అంశాలు భారత బొమ్మల పరిశ్రమ వృద్ధి అవకాశాలను బలోపేతం చేస్తున్నాయి.

* ఒక పెద్ద, పెరుగుతున్న వినియోగదారుల విభాగం దీనికి ప్రధాన చోదక శక్తిగా ఉంది. భారతదేశ జనాభా 140 కోట్లు దాటగా, అందులో గణనీయమైన భాగం 25 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారే ఉన్నారు. పెరుగుతున్న ఆదాయాలు, కొనుగోలు శక్తి బొమ్మలపై చేసే ఖర్చును మరింత పెంచుతున్నాయి.
* వేగవంతమైన పట్టణీకరణ, మారుతున్న జీవనశైలి కూడా ఆధునిక, వినూత్న, బ్రాండెడ్ ఉత్పత్తులకు డిమాండ్‌ను పెంచుతున్నాయి.
* పిల్లల అభ్యసన, మానసిక వికాసానికి తోడ్పడే విద్యాసంబంధిత, నైపుణ్య ఆధారిత, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్(స్టెమ్‌) బొమ్మలను ఎంచుకోవడానికి తల్లిదండ్రులు మొగ్గు చూపుతున్నారు.
* సాంకేతికత, డిజిట‌లీక‌ర‌ణ‌ ఈ రంగానికి కొత్త అవకాశాలను సృష్టిస్తున్నాయి. కృత్రిమ మేధస్సు, అగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ వంటి సాంకేతికతలతో కూడిన స్మార్ట్ బొమ్మలు సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వినియోగదారులలో ప్రాచుర్యం పొందుతున్నాయి.

 

A blue circle with white circles with black textAI-generated content may be incorrect.



పెరుగుతున్న ఎగుమతులు, బలపడుతున్న పోటీతత్వం
భారత బొమ్మల పరిశ్రమ గత దశాబ్ద కాలంలో అంతర్జాతీయ వాణిజ్యంలో గణనీయమైన పురోగతిని సాధించింది, ఇది దేశ వృద్ధి చెందుతున్న పోటీతత్వాన్ని, ఉత్పాదక సామర్థ్యాలను ప్రతిబింబిస్తుంది.

2017-18లో మొత్తం బొమ్మల ఎగుమతులు(హెచ్ఎస్ఎన్ 9503, 9504, 9505) 152.7 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. 2025-26 నాటికి ఇవి 384.7 మిలియన్ డాలర్లకు చేరాయి. ఇది 151.9 శాతానికి పైగా వృద్ధిని సూచిస్తుంది. అత్యంత గణనీయమైన విస్తరణ ఎలక్ట్రానిక్, నాన్-ఎలక్ట్రానిక్ బొమ్మల(హెచ్ఎస్ఎన్‌ 9503) విభాగంలో కనిపించింది. ఇదే కాలంలో వీటి ఎగుమతులు 77.35 మిలియన్ డాలర్ల నుంచి దాదాపు 160% పెరిగి 200.89 మిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అమెరికా ప్రధాన ఎగుమతి గమ్యస్థానంగా అవతరించింది. అక్కడికి పంపే ఎగుమతులు 26.7 మిలియన్ డాలర్ల నుంచి నాలుగు రెట్లు పైగా పెరిగి దాదాపు 111.9 మిలియన్ డాలర్లకు చేరాయి. ఇతర ప్రధాన మార్కెట్లలో బ్రిటన్, పోలాండ్, నెదర్లాండ్స్, జర్మనీ ఉన్నాయి.

A graph of blue columns and numbers



వీడియో గేమ్‌ కాన్సోల్‌లు, మెషీన్లు, ఇతర పరికరాల(హెచ్ఎస్ఎన్‌ 9504) ఎగుమతులు దాదాపు మూడు రెట్లు పెరిగాయి. 2017-18లో 15.68 మిలియన్ డాలర్లుగా ఉన్న ఇవి 2025-26 నాటికి 46.75 మిలియన్ డాలర్లకు విస్తరించాయి. ఇది భారతీయ తయారీ గేమింగ్, వినోద ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్‌ను తెలియజేస్తుంది. యూఏఈ, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్ ప్రధాన గమ్యస్థానాలుగా ఉండగా, అమెరికా అతిపెద్ద మార్కెట్‌గా కొనసాగుతోంది.

అదేవిధంగా పండుగలు, కార్నివాల్స్ లేదా ఇతర వినోద వస్తువుల(హెచ్ఎస్ఎన్‌ 9505) ఎగుమతులు 2017-18లో 59.69 మిలియన్ డాలర్ల నుంచి 2025-26 నాటికి దాదాపు 130% పెరిగి 137.03 మిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అమెరికా, జర్మనీ, బ్రిటన్, నెదర్లాండ్స్, స్వీడన్ ఈ ఉత్పత్తుల ప్రధాన గమ్యస్థానాలలో ఉన్నాయి. ఇది ప్రపంచ పండుగ, వినోద వస్తువుల మార్కెట్లలో భారతదేశ పెరుగుతున్న ఉనికిని స్పష్టం చేస్తోంది.

దిగుమతుల పరంగా చూస్తే వీడియో గేమ్ కాన్సోల్‌లు, పండుగ-వినోద వస్తువుల దిగుమతులు స్వల్ప వృద్ధిని నమోదు చేసినప్పటికీ సాంప్రదాయ, విద్యాసంబంధిత బొమ్మల దిగుమతులు 66% మేర భారీగా తగ్గాయి. ఈ తగ్గుదల ఈ రంగ దేశీయ ఉత్పాదక సామర్థ్యాలను గణనీయంగా బలోపేతం చేసింది. దీని ఫలితంగా భారతదేశం 2025-26లో ప్రధాన బొమ్మల విభాగాలలో(హెచ్ఎస్ఎన్‌ 9503, 9504, 9505) 152 లిమియన్ డాలర్ల వాణిజ్య మిగులును సాధించింది. దిగుమతులు ఎగుమతుల కంటే ఎక్కువగా ఉన్న 2017–18 నాటి 213.01 మిలియన్ డాలర్ల వాణిజ్య లోటుతో పోలిస్తే ఇది ఒక గొప్ప పురోగతి.

ఎగుమతులు దిగుమతుల కంటే ఎక్కువగా ఉండటంతో ఏర్పడిన ఈ వాణిజ్య మిగులు దేశీయ ఉత్పాదకతను బలోపేతం చేసింది. ఆర్థిక వృద్ధికి తోడ్పడింది, విదేశీ మారకద్రవ్య ఆదాయాన్ని పెంచింది.

మొత్తంగా ఈ ప‌రిణామాలు ఉత్పాదకత, ఉపాధి, ఆర్థికాభివృద్ధి రంగాలలో బొమ్మల పరిశ్రమ పెరుగుతున్న సహకారాన్ని హైలైట్ చేస్తున్నాయి.

భారత బొమ్మల పరిశ్రమ ఆర్థిక ప్ర‌భావం
కేవలం పిల్లల కోసం ఉత్పత్తులను తయారు చేయడమే కాకుండా బొమ్మల పరిశ్రమ భారత ఆర్థిక వ్యవస్థలో ఒక ముఖ్యమైన భాగస్వామిగా ఎదుగుతోంది.

ఈ రంగం గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో వ్యవస్థాపకతను ప్రోత్సహిస్తూ కళాకారులు, తయారీదారులు, వ్యాపారులు, చిన్న వ్యాపారాలకు జీవనోపాధి అవకాశాలను కల్పిస్తోంది. ఇది మహిళలు, సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ఆర్థిక భాగస్వామ్యాన్ని కూడా పెంపొందిస్తుంది. స్థానిక తయారీ, వ్యవస్థాపకతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టడం ఈ రంగ ఆర్థిక సహకారాన్ని మరింత పెంచింది.

ఆటలు, బొమ్మల విభాగంలో(ఎన్ఐసీ కోడ్ 324) ఉపాధి రెట్టింపు కంటే ఎక్కువగా పెరిగింది. 2018-19లో 8,685గా ఉన్న ఉద్యోగుల సంఖ్య 2023-24 నాటికి 17,693కి చేరింది. దేశవ్యాప్తంగా స్థానిక పరిశ్రమల అభివృద్ధికి తోడ్పడుతూనే, ఉత్పాదక ఉపాధిని సృష్టించడంలో ఈ రంగానికి ఉన్న సామర్థ్యాన్ని ఇది స్పష్టం చేస్తోంది.

బొమ్మల పరిశ్రమ భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న ప్రభుత్వ కార్యక్రమాలు
ఈ రంగ ఆర్థిక, సాంస్కృతిక ప్రాధాన్యతను గుర్తించిన ప్రభుత్వం, దేశీయ తయారీని బలోపేతం చేయడానికి, స్వదేశీ బొమ్మలను ప్రోత్సహించడానికి పలు కార్యక్రమాలను ప్రవేశపెట్టింది. ఈ ప్రయత్నాలు ఆవిష్కరణలు, నాణ్యత, ప్రపంచ మార్కెట్లో ఉనికిని పెంపొందించే ఒక శ‌క్తివంతమైన వాతావరణాన్ని సృష్టించడంలో సహాయపడుతున్నాయి.

నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ టాయ్స్(ఎన్ఏపీటీ)-2020
భారతీయ విలువలు, సంస్కృతి, చరిత్ర ఆధారంగా బొమ్మల రూపకల్పనను ప్రోత్సహించడానికి ఎన్ఏపీటీని రూపొందించారు. ఇది బొమ్మలను ఒక అభ్యసన వనరుగా ఉపయోగించడాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ కార్య‌క్ర‌మం బొమ్మల నాణ్యతను పర్యవేక్షిస్తుంది. ప్రమాణాలు లేని, సురక్షితం కాని ఉత్పత్తుల దిగుమతులను నిరోధిస్తుంది. దీంతోపాటు ఇది స్వదేశీ బొమ్మల క్లస్టర్లను ప్రోత్సహిస్తుంది, స్థానిక తయారీని పెంచుతుంది, బొమ్మల తయారీదారులకు ప్రోత్సాహకాలను అందిస్తుంది.

ఈ వ్యూహంలో ఒక ముఖ్యమైన భాగం 2020లో బొమ్మల కొరకు క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్(క్యూసీఓ)ను ప్రవేశపెట్టడం. దిగుమతి చేసుకునే బొమ్మల నాణ్యత, భద్రతకు సంబంధించిన ఆందోళనలకు ప్రతిస్పందనగా క్యూసీఓని అమలు చేశారు.

మే 2026 నాటికి ఐఎస్‌ 9873/ఐఎస్‌ 15644 ప్రకారం బొమ్మల భద్రత కోసం దేశీయ తయారీదారులకు 1786 లైసెన్సులను, విదేశీ తయారీదారులకు 56 లైసెన్సులను బీఐఎస్ మంజూరు చేసింది.

ఇది భారతీయ భద్రతా ప్రమాణాల అనుసరణను తప్పనిసరి చేసింది, దేశీయ, విదేశీ తయారీదారులిద్దరికీ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్‌ను త‌ప్ప‌నిస‌రి చేసింది.

* జౌళి మంత్రిత్వ శాఖ పరిధిలోని డెవలప్‌మెంట్ కమిషనర్(హ్యాండీక్రాఫ్ట్స్) వద్ద నమోదైన కళాకారులు తయారు చేసి విక్రయించే ఉత్పత్తులకు ఇది మినహాయింపు ఇస్తుంది.

* భౌగోళిక గుర్తింపు(జీఐ) ట్యాగ్ కలిగిన ఉత్పత్తుల నమోదిత యజమానులకు, అధీకృత వినియోగదారులకు కూడా ఈ మినహాయింపును వర్తింపజేశారు.

భారతదేశంలో విక్రయించే బొమ్మలు నిర్దేశిత భౌతిక, రసాయన, విద్యుత్ భద్రతా అవసరాలకు అనుగుణంగా ఉండేలా చూడటం ఈ చర్య లక్ష్యం. క్యూసీఓ అమలు దేశీయ తయారీదారులకు సమాన అవకాశాలను కల్పించడంలో కూడా సహాయపడింది.

ఈ విధాన చట్రంలో భాగంగా బొమ్మలపై మోస్ట్-ఫేవరెడ్ నేషన్(ఎంఎఫ్ఎన్‌) టారిఫ్ 2020లో 20% నుంచి 60 శాతానికి పెరిగింది. ఇది 2023లో మరింతగా 70 శాతానికి చేరింది. కేంద్ర బడ్జెట్ ఆర్థిక సంవత్సరం 2025-26లో ఎలక్ట్రానిక్ బొమ్మల భాగాలపై(హెచ్ఎస్‌ 95030091) టారిఫ్‌ను 20% గా సవరించారు. ఎంఎఫ్ఎన్‌ టారిఫ్ అనేది మెజారిటీ డబ్ల్యూటీఓ వాణిజ్య భాగస్వాముల నుండి వచ్చే దిగుమతులకు వర్తించే ప్రామాణిక కస్టమ్స్ సుంకం. పెరిగిన టారిఫ్‌లు దిగుమతి చేసుకునే బొమ్మల ధరల ప్రయోజనాన్ని తగ్గించి, దేశీయ తయారీని, పెట్టుబడులను ప్రోత్సహిస్తాయి.

ఈ చర్య స్థానిక ఉపాధికి మద్దతు ఇస్తుంది, బొమ్మల పరిశ్రమను బలోపేతం చేస్తుంది, భారతదేశ వాణిజ్య సమతుల్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

టాయ్ బిజ్ ఇంటర్నేషనల్ బీ2బీ ఎగ్జిబిషన్
ఈ ప్రదర్శన 2026 జూలై 4-7 తేదీలలో న్యూఢిల్లీలో జరిగింది.

బొమ్మల తయారీదారులు తమ ఉత్పత్తులను దేశీయ, అంతర్జాతీయ కొనుగోలుదారులకు ప్రదర్శించడానికి ఈ ఎగ్జిబిషన్ ఒక వేదికను కల్పిస్తుంది. దేశంలోనే అతిపెద్ద బొమ్మల వాణిజ్య ప్రదర్శనలలో ఒకటిగా, ఇది వ్యాపార నెట్‌వర్కింగ్‌ను సులభతరం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తయారీదారులు, బొమ్మల డీలర్లు, సంభావ్య కొనుగోలుదారుల మధ్య ప్రత్యక్ష పరస్పర చర్చలకు కూడా ఇది వీలు కల్పిస్తుంది. ఇది మార్కెట్ విస్తరణకు అవకాశాలను సృష్టిస్తుంది. ప్రపంచ మార్కెట్లలో భారత బొమ్మల పరిశ్రమను ప్రోత్సహిస్తుంది.

టాయ్‌కాథన్
2021లో ప్రారంభించిన టాయ్‌కాథన్ ఆత్మనిర్భర్ భారత్ సంకల్పానికి మద్దతు ఇస్తుంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, డిజైనర్లు, నిపుణులు, అంకుర సంస్థ‌లు కలిసి వినూత్న బొమ్మలు, ఆటలను ఉమ్మడిగా అభివృద్ధి చేయడాన్ని ఇది ప్రోత్సహిస్తుంది. ఈ కార్య‌క్ర‌మం భారతీయ సంస్కృతి, వారసత్వం, స్థానిక జానపద కథలు, నాయకులు, విలువలతో ప్రేరణ పొందిన డిజైన్లను ప్రోత్సహిస్తుంది.

ఎలక్ట్రానిక్ బొమ్మల విభాగాన్ని బలోపేతం చేయడానికి, ప్రభుత్వం 2025లో మొదటిసారిగా ఎలక్ట్రానిక్ టాయ్ హాకథన్‌ను కూడా నిర్వహించింది. సృజనాత్మకత, అభ్యసనం, పిల్లల వికాసాన్ని పెంపొందించే వినూత్న, విద్యాసంబంధిత ఎలక్ట్రానిక్ బొమ్మలను ఈ కార్యక్రమం ప్రదర్శించింది.

ఈ-టాయ్స్ ల్యాబ్
నోయిడాలోని సీ-డాక్‌లో ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ఈ-టాయ్స్ ల్యాబ్ భారతదేశ స్వదేశీ ఎలక్ట్రానిక్ బొమ్మల పరిశ్రమను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ఎలక్ట్రానిక్ బొమ్మల రూపకల్పన, అభివృద్ధి, నమూనా తయారీ, ఉత్పత్తి పరీక్షలలో ఆచరణాత్మక శిక్షణను అందిస్తుంది. ఎస్సీ/ఎస్టీ, ఈశాన్య ప్రాంతాల అభ్యర్థులతో కూడిన ఎంపిక చేసిన యువ ఇంజనీర్లు ఒక సంవత్సరం శిక్షణ పొందుతారు.

ఈ కార్య‌క్ర‌మం ఈ-టాయ్స్ ల్యాబ్‌లో ఆరు నెలల పరిశోధనను, ఆరు నెలల పరిశ్రమ శిక్షణను మిళితం చేస్తుంది. ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని బొమ్మల తయారీతో అనుసంధానించడం ద్వారా ఇది ఆవిష్కరణలు, వ్యవస్థాపకత, సాంకేతిక ఆధారిత బొమ్మల అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది.

మానక్ మంథన్
2026 ఏప్రిల్‌లో బీఐఎస్‌ సంస్థ ఐఎస్‌ 9873 (పార్ట్ 1):2025 పై ఒక మానక్ మంథన్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇది బొమ్మల యాంత్రిక, భౌతిక భద్రతా అవసరాలపై దృష్టి సారించింది. వివిధ పరిశ్రమలలో భారతీయ ప్రమాణాల అవలంబనను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్న ఒక బీఐఎస్ కార్యక్రమం ఇది. బొమ్మల తయారీదారులు, ఇతర వాటాదారులలో అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం ప్రయత్నించింది. ఇది పిల్లల కోసం సురక్షితమైన, నాణ్యమైన, నమ్మకమైన బొమ్మల ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది.

ఓడీఓపీ (ఒక జిల్లా, ఒక ఉత్పత్తి)
దేశంలోని ప్రతి జిల్లా నుంచి ప్రత్యేకమైన ఉత్పత్తులను గుర్తించి, బ్రాండింగ్ చేసి, మద్దతు ఇవ్వడం ద్వారా జిల్లా ఆధారిత ఉత్పత్తులను ప్రోత్సహించడం ఓడీఓపీ కార్యక్రమం ముఖ్య లక్ష్యం. సమతుల్య ప్రాంతీయ అభివృద్ధిని పెంపొందిస్తూనే తయారీ, ఎగుమతులు, ఉపాధిని పెంచడానికి ఈ కార్యక్రమం కృషి చేస్తుంది. ఇది దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో కొత్త ఆలోచనలు, సాంకేతికత స్వీకరణ, పోటీతత్వాన్ని కూడా ప్రోత్సహిస్తుంది.

ఈ కార్యక్రమం కింద పలు సాంప్రదాయ, స్వదేశీ బొమ్మల ఉత్పత్తులను కూడా గుర్తించారు. ఇది ఉత్పత్తి వైవిధ్యం, బ్రాండింగ్, ప్యాకేజింగ్, నైపుణ్యాభివృద్ధి, నాణ్యతా ప్రమాణాల నిర్ధారణను ప్రోత్సహిస్తూ ఉభయతారక విధానాన్ని అవలంబిస్తుంది. ఈ-కామర్స్, అంతర్జాతీయ ప్రదర్శనలు, కొనుగోలుదారుల అవసరాలు, ఎగుమతి ధ్రువీకరణలపై అవగాహన ద్వారా మార్కెట్ ప్రాప్యతను కూడా ఇది సులభతరం చేస్తుంది. ఈ కార్యక్రమం నిధులు, మార్కెటింగ్, సాంకేతిక పరిజ్ఞానం పెంపుదల, పథకాలపై అవగాహన కల్పించడంలో సహాయపడుతుంది.

భౌగోళిక గుర్తింపు(జీఐ) ట్యాగ్ పొందిన బొమ్మలు
అనేక సాంప్రదాయ భారతీయ బొమ్మలు వాటి ప్రత్యేక హస్తకళా నైపుణ్యానికి, ప్రాంతీయ గుర్తింపునకు గుర్తింపుగా జీఐ హోదాను పొందాయి. జీఐ ట్యాగింగ్ శతాబ్దాల నాటి సంప్రదాయాలను కాపాడటంలో సహాయపడుతుంది, మెరుగైన గుర్తింపు, మార్కెట్ ప్రాప్యత ద్వారా కళాకారులకు కొత్త అవకాశాలను సృష్టిస్తుంది. ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంతో ముడిపడి ఉన్న ప్రత్యేక లక్షణాలు, కీర్తిని గుర్తించే చట్టపరమైన రక్షణ నుంచి జీఐ ట్యాగ్ పొందిన ఉత్పత్తులు ప్రయోజనం పొందుతాయి. ఈ రక్షణ వాటి మార్కెట్ విలువను పెంచుతుంది. అనధికారిక వినియోగాన్ని నిరోధిస్తుంది. స్థానిక ఉత్పత్తిదారులకు మద్దతు ఇస్తుంది. ఇది గ్రామీణ ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహిస్తూనే సాంప్రదాయ జ్ఞానాన్ని, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడటంలో కూడా సహాయపడుతుంది. జీఐ ట్యాగ్ పొందిన బొమ్మలలో కర్ణాటకకు చెందిన చన్నపట్న బొమ్మలు, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ చర్మపు బొమ్మలు, తమిళనాడు తంజావూరు బొమ్మలు మొదలైనవి ఉన్నాయి.

వాణిజ్యం, మార్కెట్ అభివృద్ధి
జీఎస్‌టీ తగ్గింపు

బొమ్మలపై జీఎస్‌టీని 12% నుంచి 5 శాతానికి తగ్గించడం వినియోగదారులకు బొమ్మలను మరింత చౌకగా, అందుబాటులోకి తెచ్చింది. ఇది ఆటల ద్వారా బాల్య అభ్యసనాన్ని ప్రోత్సహిస్తుంది. విద్యాసంబంధిత, వికాస బొమ్మల విస్తృత వినియోగాన్ని పెంపొందిస్తుంది. ఈ చర్య బొమ్మల మార్కెట్లో డిమాండ్‌ను పెంచడం ద్వారా దేశీయ తయారీదారులు, ఎంఎస్ఎంఈలకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది.

స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు
భారతదేశం భారత్-యూఏఈ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం(సీఈపీఏ), భారత్-ఆస్ట్రేలియా ఆర్థిక సహకార వాణిజ్య ఒప్పందం(ఈసీటీఏ), భారత్-యూరోపియన్ స్వేచ్ఛా వాణిజ్య అసోసియేషన్(ఈఎఫ్‌టీఏ) వాణిజ్య ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం, భారత్-ఒమన్ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం, భారత్-న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, భారత్-బ్రిటన్ సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం వంటి వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు చేసింది. ఈ ఒప్పందాల ప్రకారం.. భాగస్వామ్య దేశాలు భారతీయ బొమ్మల ఎగుమతులకు సుంకం లేని మార్కెట్ ప్రాప్యతను కల్పిస్తాయి.

ఎగుమతి కేంద్రాలుగా జిల్లాలు(డీఈహెచ్‌)
జిల్లాల ప్రత్యేక ఉత్పత్తులు, నైపుణ్యాలు, వనరులను ఉపయోగించుకోవడం ద్వారా వాటిని ఎగుమతి వృద్ధి కేంద్రాలుగా మార్చడం డీఈహెచ్‌ కార్యక్రమం ల‌క్ష్యం. ఇందులో రాష్ట్ర ఎగుమతుల ప్రోత్సాహక కమిటీలు(ఎస్ఈపీసీ), జిల్లా ఎగుమతుల ప్రోత్సాహక కమిటీలు(డీఈపీసీ) ముఖ్యమైన వాటాదారులుగా ఉన్నాయి. ఈ కమిటీలను 36 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో ఏర్పాటు చేశారు. ఇవి భారత ఎగుమతులను బలోపేతం చేయడానికి, సమతుల్య సమగ్ర వృద్ధిని ప్రోత్సహించడానికి కృషి చేస్తాయి.

ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా అన్ని జిల్లాలలో జీఐ ఉత్పత్తులు, వ్యవసాయ క్లస్టర్లు, బొమ్మల క్లస్టర్లతో సహా ఎగుమతి సామర్థ్యం ఉన్న ఉత్పత్తులను, సేవలను గుర్తించింది. బొమ్మల ఎగుమతి సామర్థ్యం ఉన్న 10 కంటే ఎక్కువ జిల్లాలను గుర్తించారు. ఇది స్థానిక పరిశ్రమలను బలోపేతం చేయడం, మార్కెట్ సంబంధాలను సులభతరం చేయడం, ఉపాధి, ఆర్థికాభివృద్ధిని నడపడం ద్వారా ప్రతి జిల్లా ఎగుమతి సామర్థ్యాన్ని ఉపయోగించుకుంటుంది.

భారత బొమ్మల పరిశ్రమ: భ‌విష్యత్తు వైపు
భారత బొమ్మల పరిశ్రమ తన సంపన్న సాంస్కృతిక వారసత్వాన్ని ఆధునిక పురోగతితో విజయవంతంగా మిళితం చేస్తూ ఉత్పాదకత, ఎగుమతులు, ఉపాధి రంగాలలో కీలక భాగస్వామిగా ఎదుగుతోంది. వ్యూహాత్మక విధానపరమైన జోక్యాలు, స్వదేశీ ఉత్పత్తిని ప్రోత్సహించే కార్యక్రమాల మద్దతుతో ఈ రంగం దిగుమతులపై ఆధారపడే స్థితి నుండి ప్రపంచ స్థాయి పోటీతత్వానికి మారింది.

ఈ క్రమంలో భారత బొమ్మల పరిశ్రమ దేశ ప్రత్యేక ఆటల వారసత్వాన్ని కాపాడుతూనే, ప్రపంచ మార్కెట్లలో తన స్థానాన్ని బలోపేతం చేసుకుంటోంది.

 

***

(Explainer ID: 159155) आगंतुक पटल : 10
Provide suggestions / comments
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Bengali , Assamese , Tamil , Kannada , Malayalam