Security
రక్షణ రంగ దశాబ్దం
మెరుగైన సామర్థ్యం, అధిక ఉత్పాదకత, బలమైన విశ్వసనీయత
Posted On:
17 JUN 2026 11:26AM
భారత రక్షణ రంగం 2014 నుంచి 2026 మధ్యకాలంలో సమూలంగా మారింది. దేశం తన సామర్థ్యాన్ని, ఉత్పాదకతను, ప్రపంచవ్యాప్త విశ్వసనీయతను నిర్మించుకున్న దశాబ్దం ఇది. సంస్కరణలు, అధిక పెట్టుబడులు, స్వయంసమృద్ధికి ఇచ్చిన బలమైన ప్రోత్సాహం ద్వారా ఇది సాధ్యమైంది. రక్షణ బడ్జెట్ 2013–14లో రూ.2.53 లక్షల కోట్ల నుంచి 2026–27లో రూ.7.85 లక్షల కోట్లకు పెరిగింది. స్వదేశీ రక్షణ ఉత్పత్తి 2014–15లో రూ.46,429 కోట్ల నుంచి 2025–26 నాటికి రూ.1.78 లక్షల కోట్లకు చేరుకుంది. రక్షణ ఎగుమతులు 2013–14లో రూ.686 కోట్ల నుంచి 2025–26లో రికార్డు స్థాయిలో రూ.38,424 కోట్లకు పెరిగాయి. ఈ ఎగుమతులు 80కి పైగా దేశాలకు చేరుకున్నాయి. రక్షణ కొనుగోలు ప్రక్రియ(డీఏపీ)-2020, సానుకూల స్వదేశీకరణ జాబితాలు(2020), రక్షణ రంగ నైపుణ్యాల ఆవిష్కరణలు వంటి సంస్కరణలు దేశీయ తయారీ, ఆవిష్కరణలు, ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని బలోపేతం చేశాయి. స్వదేశీకరణ, ఆధునీకరణ బలంతో ఈ సమయంలో రక్షణ దౌత్యం కూడా సరికొత్త శిఖరాలకు చేరింది.
భారత రక్షణ రంగ పరివర్తన
గడిచిన 12 ఏళ్లలో భారతదేశం ఒక సాహసోపేతమైన దార్శనికత, పట్టుదలతో కూడిన చర్యల ద్వారా రక్షణ సామర్థ్యంలో సరికొత్త శకానికి నాంది పలికింది. ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా మార్గదర్శకత్వంలో ప్రభుత్వం విస్తృతమైన విధాన సంస్కరణలకు నాయకత్వం వహించింది. దేశీయ ఆవిష్కరణలను ప్రోత్సహించింది. ఒక సజీవ రక్షణ పర్యావరణ వ్యవస్థను నిర్మించింది.
రక్షణ కొనుగోలు ప్రక్రియ(డీఏపీ)-2020, రక్షణ కొనుగోలు నియమావళి(డీపీఎం)-2025 వంటి మైలురాయి లాంటి చర్యల ద్వారా ప్రభుత్వం ప్రక్రియలను సరళీకృతం చేసింది. స్వదేశీ భాగస్వామ్యాన్ని పెంచింది. ప్రైవేటు రంగానికి, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల భాగస్వామ్యానికి తలుపులు తెరిచింది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ అత్యాధునిక రక్షణ సాంకేతికతలను అభివృద్ధి చేయడం ద్వారా ఆలోచనలను యుద్ధరంగానికి సిద్ధంగా ఉండే వ్యవస్థలుగా మార్చడానికి పరిశ్రమలతో కలిసి పని చేయడంలో కీలకపాత్ర పోషించింది.
ఆధునీకరణ, స్వదేశీ తయారీకి మద్దతుగా రక్షణ బడ్జెట్లు గణనీయంగా పెరిగాయి. పరిశ్రమలు, అంకుర సంస్థలు, విద్యాసంస్థల నుంచి విస్తృత భాగస్వామ్యంతో పరిశోధన, అభివృద్ధి నిధులు రెండింతల కంటే ఎక్కువయ్యాయి. సృజన్ దీప్, సానుకూల స్వదేశీకరణ జాబితాలు, సరళీకృత విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వంటి మైలురాయి లాంటి కార్యక్రమాలు ప్రైవేటు రంగ భాగస్వామ్యానికి కొత్త అవకాశాలను సృష్టించాయి.
ఈ రోజు రక్షణ ఎగుమతులు విపరీతంగా పెరిగి, 80కి పైగా దేశాలకు చేరుకున్నాయి. వ్యూహాత్మక భాగస్వామ్యాలు, స్వదేశీ వేదికల ద్వారా భారతదేశం తన పోరాట సన్నద్ధతను పెంపొందించుకుంటూ, బాధ్యతాయుతమైన ప్రపంచ రక్షణ శక్తిగా ఎదుగుతోంది.
లక్ష్యంతో కూడిన ప్రయత్నాల ఈ దశాబ్దం భవిష్యత్తు విజన్ 2047 సాధనకు తోడ్పడేలా, స్వయంసమృద్ధి, భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే రక్షణ పర్యావరణ వ్యవస్థకు బలమైన పునాది వేసింది.
పార్ట్ ఏ: రక్షణ సామర్థ్య దశాబ్దం: సైనిక బలం, ఆవిష్కరణలకు ఊతం
భారతదేశం స్వదేశీ ఆవిష్కరణలు, సాంకేతిక పురోగతి, వ్యూహాత్మక సంస్కరణల ద్వారా తన రక్షణ రంగాన్ని నిలకడగా మార్చుకుంది. దేశీయ తయారీ, పరిశోధన సామర్థ్యాలను విస్తరిస్తూనే సైనిక సన్నద్ధతను బలోపేతం చేసింది. ఈ మార్పు భారతదేశాన్ని మరింత స్వయంసమృద్ధి, సాంకేతిక సామర్థ్యం, ప్రపంచవ్యాప్త విశ్వసనీయత కలిగిన రక్షణ శక్తిగా తీర్చిదిద్దుతోంది.
పెరుగుతున్న రక్షణ బడ్జెట్లు
సైనిక సన్నద్ధత, ఆధునీకరణ, స్వదేశీ తయారీ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి భారతదేశం తన రక్షణ వ్యయాన్ని గణనీయంగా విస్తరించింది. మొత్తం రక్షణ బడ్జెట్ ఆర్థిక సంవత్సరం 2013–14లో రూ.2.53 లక్షల కోట్ల నుంచి ఆర్థిక సంవత్సరం 2026–27లో రూ.7.85 లక్షల కోట్లకు పెరిగింది. ఇది జాతీయ భద్రత, వ్యూహాత్మక స్వయంసమృద్ధిపై ప్రభుత్వానికి ఉన్న నిరంతర దృష్టిని ప్రతిబింబిస్తుంది. మూలధన వ్యయం కూడా 2014–15లో రూ.94,587.95 కోట్ల నుంచి 2026–27లో రూ.2.19 లక్షల కోట్లకు భారీగా పెరిగింది. రక్షణ బడ్జెట్‌లో మూలధన వ్యయం అంటే దీర్ఘకాలిక సేకరణలు, ఆధునీకరణ, ప్రధాన సైనిక ఆస్తుల సృష్టి కోసం కేటాయించిన నిధులను సూచిస్తుంది. ఇది ప్రాథమికంగా భవిష్యత్తు సైనిక సామర్థ్యాలను నిర్మించడానికి ఉపయోగించే బడ్జెట్ పెట్టుబడి భాగం.
ఇది మౌలిక సదుపాయాల అభివృద్ధి, అధునాతన ఆయుధ వ్యవస్థలు, సాంకేతిక ఆధునీకరణకు ఇచ్చే బలమైన ప్రాధాన్యతను ప్రముఖంగా చూపుతుంది. ఆత్మనిర్భర్ భారత్ చొరవ కింద విధాన సంస్కరణలు, అధిక ప్రైవేటు రంగ భాగస్వామ్యం, వ్యాపార నిర్వహణ సౌలభ్యం రక్షణ తయారీని మరింత వేగవంతం చేశాయి. భారతదేశాన్ని అభివృద్ధి చెందుతున్న ప్రపంచ రక్షణ ఉత్పత్తి, ఎగుమతి కేంద్రంగా నిలిపాయి.
పరిశోధన, ఆవిష్కరణలు, భాగస్వామ్యం ద్వారా రక్షణ సామర్థ్యం బలోపేతం
రక్షణ పరిశోధన, అభివృద్ధి కేటాయింపులు 2014–15 ఆర్థిక సంవత్సరంలో రూ.13,716.14 కోట్ల నుంచి 2026–27 ఆర్థిక సంవత్సరంలో రూ.29,100.25 కోట్లకు పెరిగాయి. ఇది 112% కంటే ఎక్కువ వృద్ధిని సూచిస్తుంది. ఆవిష్కరణలలో విస్తృత భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి 2022-23లో ప్రభుత్వం రక్షణ పరిశోధన, అభివృద్ధి బడ్జెట్‌లో 25% నిధులను పరిశ్రమలు, అంకుర సంస్థలు, విద్యాసంస్థల కోసం కేటాయించింది. 2024లో రక్షణ శాఖ దీని కోసం రూ. 1,757 కోట్ల వ్యయం చేసింది.
పారదర్శక రక్షణ పర్యావరణ వ్యవస్థను పెంపొందించడానికి రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ ప్రయోగశాలలలోని కొన్ని ప్రపంచ స్థాయి పరిశోధన, అభివృద్ధి సౌకర్యాలను ప్రైవేటు పరిశ్రమల కోసం అందుబాటులోకి తెచ్చారు. దీనిని సులభతరం చేయడానికి రక్షణ మంత్రిత్వ శాఖ అవసరమైన ప్రామాణిక నిర్వహణ విధానాలను రూపొందించింది. 24 రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ ప్రయోగశాలల పరీక్షల మౌలిక సదుపాయాలను రక్షణ పరీక్షల పోర్టల్‌లో ఉంచింది.
రక్షణ రంగ నైపుణ్యాల ఆవిష్కరణలు(ఐడెక్స్)
భారతదేశ రక్షణ, ఏరోస్పేస్ రంగాలలో ఆవిష్కరణలు, సాంకేతిక అభివృద్ధి, స్వయంసమృద్ధిని పెంపొందించడంలో ఐడెక్స్ ఒక కీలకమైన శక్తిగా ఎదిగింది. ఈ చొరవ స్వదేశీ రక్షణ సాంకేతికతలను అభివృద్ధి చేయడంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, అంకుర సంస్థలు, వ్యక్తిగత ఆవిష్కర్తలు, పరిశోధనా సంస్థలు, విద్యాసంస్థలతో కూడిన పరిశ్రమలను చురుకుగా భాగస్వామ్యం చేస్తుంది. ఈ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ తన అధునాతన పరీక్షల మౌలిక సదుపాయాలను రక్షణ పరీక్షల పోర్టల్ ద్వారా ప్రైవేటు పరిశ్రమలకు అందుబాటులోకి తెచ్చింది. ఇది ఆవిష్కర్తలకు కీలకమైన పరీక్షల, ధ్రువీకరణ సౌకర్యాలను పొందేలా చేస్తుంది.
ఐడెక్స్ పథకం 2021–22 నుంచి 2025–26 కాలానికి ₹498.78 కోట్ల బడ్జెట్ కేటాయింపుతో ఆమోదం పొందింది. దీనికి అదనంగా, 2023–24 నుంచి 2025–26 కాలానికి ₹750 కోట్ల కేటాయింపుతో అదితి (ఐడెక్స్ ద్వారా వినూత్న సాంకేతికతల అభివృద్ధిని వేగవంతం చేయడం) పథకం ఆమోదించబడింది. రెండు పథకాలు రక్షణ ఆవిష్కరణల సంస్థ ద్వారా ఆర్థిక సహాయాన్ని అందిస్తాయి, ఆవిష్కర్తలు రక్షణ అవసరాల కోసం అత్యాధునిక సాంకేతికతలను అభివృద్ధి చేయడంలో సహాయపడతాయి. మార్చి 2026 నాటికి ఐడెక్స్ 676 స్టార్టప్‌లు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, ఆవిష్కర్తలను భాగస్వామ్యం చేయగా, 551 డిజైన్, అభివృద్ధి ఒప్పందాలు జరిగాయి. ఈ విజయాలు భారతదేశ స్వదేశీ రక్షణ ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థ వేగవంతమైన వృద్ధిని, పెరుగుతున్న పరిపక్వతను ప్రతిబింబిస్తాయి.
అభివృద్ధి, ఉత్పత్తి భాగస్వామ్య(డీసీపీపీ) నమూనా
డీసీపీపీ నమూనా అనేది రక్షణ సాంకేతికతల అభివృద్ధి, ఉత్పత్తిలో భారతీయ పరిశ్రమలతో సహకారాన్ని బలోపేతం చేయడానికి రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ రూపొందించిన ఒక చట్రం. ఈ నమూనా కింద రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ పోటీ ప్రక్రియ ద్వారా ప్రభుత్వ, ప్రైవేటు రంగాల నుంచి సామర్థ్యం గల తయారీ భాగస్వాములను గుర్తిస్తుంది. ఉత్పత్తికి అవసరమైన సాంకేతికతలను బదిలీ చేస్తుంది. ఉపవ్యవస్థలు, వ్యవస్థలు, పరికరాలను ఉత్పత్తి చేయగల 2,200కు పైగా పరిశ్రమల బలమైన వ్యవస్థ మద్దతుతో, ఈ నమూనా స్వదేశీ రక్షణ తయారీని గణనీయంగా విస్తరించింది. మార్చి 2026 నాటికి 134 కంపెనీలు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థతో డీసీపీపీలుగా లేదా ఉత్పత్తి సంస్థలుగా భాగస్వామ్యం కలిగి ఉన్నాయి. 2,180 సాంకేతిక బదిలీ ఒప్పందాలు జరిగాయి. 2,780 కంటే ఎక్కువ మేధో సంపత్తి హక్కులను భారతీయ పరిశ్రమల ఉపయోగం కోసం అందుబాటులో ఉంచారు.
సాంకేతిక అభివృద్ధి నిధి(టీడీఎఫ్)
టీడీఎఫ్ అనేది స్వదేశీ రక్షణ ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి, ప్రభుత్వ, ప్రైవేటు పరిశ్రమల, ముఖ్యంగా అంకుర సంస్థలు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ ద్వారా అమలు చేస్తున్న రక్షణ మంత్రిత్వ శాఖ చొరవ. ఈ పథకం క్లిష్టమైన రక్షణ సాంకేతికతల అభివృద్ధికి మద్దతుగా రూ.50 కోట్ల వరకు గ్రాంట్లను అందిస్తుంది. ఇది చెప్పుకోదగ్గ ఫలితాలను ఇచ్చింది. కొన్ని సాంకేతికతలు విజయవంతంగా అభివృద్ధి చెందాయి. పీఎస్ఎల్వీ మిషన్లలో భాగంగా రెండు ప్రాజెక్ట్ వ్యవస్థలు అంతరిక్షంలోకి దూసుకెళ్లాయి. భారతదేశ డీప్-టెక్ పర్యావరణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి, అత్యాధునిక, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలపై దృష్టి పెడుతూ ఈ పథకం కింద అదనంగా రూ.500 కోట్ల నిధి మంజూరయింది. జూన్ 2026 నాటికి టీడీఎఫ్ పథకం కింద మొత్తం రూ.334 కోట్ల వ్యయంతో 80 ప్రాజెక్టులు అమలులో ఉన్నాయి.
డీఆర్‌డీఓ ఇండస్ట్రీ అకాడెమియా – సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(డీఐఏ-సీఓఈ)
రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ రక్షణ, భద్రతా అవసరాల కోసం క్లిష్టమైన, భవిష్యత్ సాంకేతికతలను అభివృద్ధి చేయడంలో సహకార నిర్దేశిత పరిశోధన కోసం డీఆర్‌డీఓ ఇండస్ట్రీ అకాడెమియా – సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వ్యవస్థ ద్వారా ఒక విధానాన్ని, యంత్రాంగాన్ని అభివృద్ధి చేసింది. మొత్తం 15 డీఐఏ-సీఓఈలను స్థాపించారు. ఇవి దాదాపు 82 గుర్తించిన పరిశోధనా విభాగాలలో అనువాద పరిశోధనా కార్యకలాపాలను నడిపిస్తున్నాయి. పరిశ్రమలకు సులభతరం చేయడానికి రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ తన ప్రయోగశాలలలో ఇండస్ట్రీ ఇంటరాక్షన్ గ్రూపులను ఏర్పాటు చేసింది.
సాంకేతిక స్వయంసమృద్ధి కోసం మానవ సామర్థ్య నిర్మాణం
సాంకేతిక స్వయంసమృద్ధిని నిర్మించడానికి ప్రతిభ, పరిశోధన, సంస్థాగత సామర్థ్యంపై నిరంతర పెట్టుబడులు అవసరం. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ 2020 జనవరిలో ఐదు యువ శాస్త్రవేత్తల ప్రయోగశాలలను స్థాపించింది. ఆరో ప్రయోగశాల 2026లో ఏర్పాటు కావాల్సి ఉంది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ తన పరిశోధనా నెట్‌వర్క్‌ను క్రమబద్ధీకరిస్తూ ప్రయోగశాలల సంఖ్యను 36కు పరిమితం చేసింది. కొత్తగా ఎంపికైన శాస్త్రవేత్తలు ప్రయోగశాలల్లో చేరడానికి ముందు డిఫెన్స్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీలో రక్షణ సాంకేతికతపై రెండేళ్ల ఎంటెక్ ప్రోగ్రామ్‌ను పూర్తి చేస్తారు. అధిక విలువైన ప్రాజెక్టులలో ప్రాజెక్ట్ ఆధారిత మానవ వనరుల పరిచయం ప్రత్యేక నైపుణ్యం లభ్యతను మరింత బలోపేతం చేసింది.
భారతదేశం రక్షణ వ్యవస్థ అంతటా నైపుణ్యాభివృద్ధి, పరిశోధన అవకాశాలను కూడా విస్తరించింది. ప్రతి సంవత్సరం 3,500 మందికి పైగా ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ ప్రయోగశాలలలో పెయిడ్ అప్రెంటిస్‌లుగా చేరుతున్నారు. ఒక పెయిడ్ ఇంటర్న్‌షిప్ పథకం ఇప్పుడు ఇంజనీరింగ్ విద్యార్థులకు రక్షణ పరిశోధనలో ఆచరణాత్మక అనుభవాన్ని అందిస్తోంది. 15 డీఆర్‌డీఓ ఇండస్ట్రీ-అకాడెమియా సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా 52 సంస్థలలో రూ.967 కోట్ల విలువైన 281 ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని పిల్ఖువాలో ఉన్న రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ నైపుణ్యాభివృద్ధి కేంద్రం సిబ్బందికి అగ్నిమాపక భద్రతా సాంకేతికతలు, అగ్నిమాపక పద్ధతులలో శిక్షణ ఇస్తుంది. ఈ కార్యక్రమాలన్నీ కలిసి భారతదేశ భవిష్యత్తు రక్షణ సామర్థ్యాల కోసం నైపుణ్యం కలిగిన ప్రతిభావంతుల బలమైన శ్రేణిని సృష్టిస్తున్నాయి.
స్వయంసమృద్ధిని ప్రోత్సహించడానికి రక్షణ కొనుగోలు సంస్కరణలు
భారతదేశ అత్యున్నత రక్షణ కొనుగోలు సంస్థ అయిన రక్షణ కొనుగోలు మండలి(డీఏసీ), రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్‌కు కీలక చోదకశక్తిగా నిలిచింది. రక్షణ కొనుగోలు ప్రక్రియ 2020 సంస్కరణల ద్వారా, ఇది స్వదేశీ కొనుగోలు, దేశీయ తయారీ, అధిక స్వదేశీ కంటెంట్‌కు ప్రాధాన్యత ఇచ్చింది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ రూపొందించిన, భారతీయ పరిశ్రమలు తయారు చేసిన రూ.6 లక్షల కోట్లకు పైగా విలువైన వ్యవస్థలకు రక్షణ కొనుగోలు మండలి అవసరాల అంగీకారాన్ని(ఏఓఎన్) ఇచ్చింది. వీటిలో చాలావరకు సైన్యంలో చేరాయి లేదా చేర్చే ప్రక్రియలో ఉన్నాయి. ప్రధాన ఆమోదాలలో రూ.62,000 కోట్ల విలువైన 97 లైట్ కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ తేజాస్ మార్క్-1ఏ యుద్ధ విమానాలు, దాదాపు రూ.62,700 కోట్ల విలువైన 156 లైట్ కాంబాట్ హెలికాప్టర్లు(ఎల్‌సీహెచ్) ప్రచండ్, 26 రాఫెల్ మెరైన్ విమానాలు మొదలైనవి ఉన్నాయి.
కొనుగోలు సంస్కరణల దశాబ్దం: వేగవంతం, సరళీకృతం, మరింత స్వదేశీకరణ
భారతదేశం రక్షణ కొనుగోళ్లను ఆధునీకరించడానికి, స్వయంసమృద్ధిని బలోపేతం చేయడానికి 2014 నుంచి 2026 వరకు ప్రధాన కొనుగోలు సంస్కరణలను చేపట్టింది. వేగవంతమైన నిర్ణయాలు, అధిక స్వదేశీ భాగస్వామ్యం, దేశీయ పరిశ్రమల విస్తృత భాగస్వామ్యంపై విధానపరమైన చర్యలు దృష్టి పెట్టాయి.
రక్షణ కొనుగోలు నియమావళి(డీపీపీ) 2016
ఇది భారత సాయుధ దళాల రక్షణ కొనుగోళ్లను నియంత్రించే కీలకమైన చట్రంగా పనిచేసింది. రక్షణ రంగంలో మేక్ ఇన్ ఇండియా చొరవను ప్రోత్సహిస్తూనే, కొనుగోలు ప్రక్రియలను క్రమబద్ధీకరించడం, సరళీకరించడం దీని ముఖ్య ఉద్దేశం.
రక్షణ కొనుగోలు ప్రక్రియ(డీఏపీ) 2020
ఇది స్వదేశీ తయారీని బలోపేతం చేయడానికి, మూలధన కొనుగోళ్లను సరళీకరించడానికి ప్రధాన సంస్కరణలను పరిచయం చేసింది. ఇది భారతీయ కంపెనీలకు అవకాశాలను పెంచింది. రక్షణ వ్యవస్థల దేశీయ డిజైన్, అభివృద్ధి, ఉత్పత్తిని ప్రోత్సహించింది.
రక్షణ కొనుగోలు మాన్యువల్(డీపీఎం) 2025
ఇది రాబడి కొనుగోళ్లలో పారదర్శకతను, సామర్థ్యాన్ని మెరుగుపరిచింది. వేగవంతమైన ఆమోదాలు, స్వదేశీ ప్రాజెక్టులకు జరిమానాల సడలింపు, దీర్ఘకాలిక ఆర్డర్ల భరోసా ద్వారా దాదాపు రూ. లక్ష కోట్ల విలువైన కొనుగోలు ప్రక్రియలను క్రమబద్ధీకరించింది.
రక్షణ కొనుగోలు ప్రక్రియ(డీఏపీ) 2026 (ముసాయిదా)
ఈ ముసాయిదా సరళమైన కొనుగోలు వర్గాలను, స్వదేశీ డిజైన్, అభివృద్ధికి బలమైన మద్దతును ప్రతిపాదిస్తోంది. దేశీయ తయారీ సామర్థ్యాలను మరింత బలోపేతం చేయడానికి 60 శాతం వరకు అధిక స్వదేశీ భాగస్వామ్య అవసరాలను కూడా ఇది సిఫార్సు చేస్తోంది.
గడిచిన దశాబ్దంలో భారతదేశం అధిక పెట్టుబడులు, స్వదేశీ ఆవిష్కరణలు, ప్రధాన విధాన సంస్కరణల ద్వారా తన రక్షణ సామర్థ్యాలను గణనీయంగా బలోపేతం చేసుకుంది. పెరిగిన రక్షణ వ్యయం, పెరుగుతున్న పరిశ్రమల భాగస్వామ్యం, పరిశోధన, అభివృద్ధిపై ఉన్న బలమైన దృష్టి స్వయంసమృద్ధి వైపు ప్రయాణాన్ని వేగవంతం చేశాయి. ఐడెక్స్, టీడీఎఫ్, డీఆర్‌డీఓ-పరిశ్రమ భాగస్వామ్యాలు వంటి కార్యక్రమాలు ఒక సజీవ రక్షణ ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థను సృష్టించాయి. కీలకమైన రక్షణ కొనుగోళ్లు, కొనుగోలు సంస్కరణలతో కూడిన ఈ ప్రయత్నాలు సాంకేతికంగా అధునాతనమైన, భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే, ప్రపంచవ్యాప్తంగా పోటీ పడగల రక్షణ రంగాన్ని నిర్మిస్తున్నాయి.
పార్ట్ బీ: ఉత్పాదకత పరివర్తన: పారిశ్రామిక, విస్తరణ పురోగతి దశాబ్దం
నిరంతర విధాన, పారిశ్రామిక సంస్కరణల ద్వారా భారతదేశ రక్షణ ఉత్పాదకత విస్తరిస్తోంది. విస్తరణ, దృఢత్వం, స్వదేశీ సామర్థ్యంపై ప్రధానంగా దృష్టి పెట్టారు. ఒక బలమైన దేశీయ వ్యవస్థ దిగుమతులపై ఆధారపడే పరిస్థితిని మారుస్తోంది. ఇటీవలి సంవత్సరాలలో రక్షణ కొనుగోళ్లు వేగవంతమయ్యాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.2,09,050 కోట్ల విలువైన 193 రక్షణ ఒప్పందాలు జరిగాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రూ.1.82 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు ముగిశాయి. ఈ మార్పు ఉత్పత్తి సామర్థ్యాన్ని, వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని బలోపేతం చేస్తుంది.
కొనుగోలుదారు నుంచి నిర్మాణదారుగా నిర్మాణాత్మక మార్పు
2025-26లో భారతదేశ రక్షణ ఉత్పత్తి రూ.1,78,000 కోట్లుగా ఉంది. ఈ మైలురాయి మునుపటి ఆర్థిక సంవత్సరం ఉత్పత్తి అయిన రూ.1,54,071 కోట్ల కంటే 15.6 శాతం వృద్ధిని సూచిస్తుంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య రూ.84,643 కోట్లుగా ఉన్నప్పటి నుంచి చూస్తే ఇది అద్భుతమైన 110 శాతం పెరుగుదల. సాయుధ దళాలను ఆధునీకరించడం, బలమైన రక్షణ పారిశ్రామిక వ్యవస్థను నిర్మించడం పట్ల ప్రభుత్వానికి ఉన్న బలమైన నిబద్ధతను ఇది ప్రతిబింబిస్తుంది.
ఈ స్థిరమైన పెరుగుదల ఆత్మనిర్భర్ భారత్ దార్శనికత కింద భారతదేశ రక్షణ పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థ పెరుగుతున్న బలాన్ని కూడా చాటిచెప్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రక్షణ రంగ సంస్థలు, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం ఉత్పత్తిలో దాదాపు 76 శాతం వాటాను అందించగా, ప్రైవేటు రంగం వాటా 24 శాతానికి పెరిగింది. ఇది పరిశ్రమల విస్తృత భాగస్వామ్యాన్ని సూచిస్తుంది.
దశాబ్ద కాలంలో భారత రక్షణ ఎగుమతుల్లో మార్పు
భారతదేశ రక్షణ ఎగుమతులు 2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ.686 కోట్ల నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.38,424 కోట్లకు పెరిగాయి. ఇది పన్నెండేళ్లలో 5500 శాతానికి పైగా వృద్ధిని సూచిస్తుంది. మేక్ ఇన్ ఇండియా చొరవ, రక్షణ స్వయంసమృద్ధికి లభించిన ప్రోత్సాహం వల్ల ఈ మార్పు సాధ్యమైంది. భారతదేశం క్రమంగా ఒక ప్రధాన దిగుమతిదారు నుంచి రక్షణ తయారీ దేశంగా మారుతోంది. గతంలో 65-70 శాతం దిగుమతులపై ఆధారపడటంతో పోలిస్తే, ప్రస్తుతం దాదాపు 65 శాతం రక్షణ పరికరాలు దేశీయంగానే తయారవుతున్నాయి.
భారతీయ రక్షణ ఉత్పత్తులు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 80కి పైగా దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. రక్షణ ఎగుమతిదారుల సంఖ్య 145 సంస్థలకు విస్తరించింది. ఇది విస్తృత పారిశ్రామిక భాగస్వామ్యాన్ని ప్రతిబింబిస్తుంది. పెరుగుతున్న ఎగుమతులు భారతీయ రక్షణ వ్యవస్థలు, సాంకేతికతలపై అంతర్జాతీయంగా పెరుగుతున్న నమ్మకాన్ని తెలియజేస్తున్నాయి. ప్రభుత్వం 2029 నాటికి రక్షణ ఎగుమతుల్లో రూ.50,000 కోట్ల లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఇది అభివృద్ధి చెందుతున్న ప్రపంచ రక్షణ ఎగుమతిదారుగా భారతదేశ స్థానాన్ని బలోపేతం చేస్తుంది.
రక్షణ పారిశ్రామిక సామర్థ్యం విస్తరణ
వరుస విధాన సంస్కరణలు, ప్రైవేటు రంగం నుంచి పెరిగిన భాగస్వామ్యం ద్వారా భారతదేశం తన రక్షణ తయారీ రంగాన్ని నిలకడగా విస్తరించింది. గత దశాబ్దంలో దేశం ఒక బలమైన స్వదేశీ రక్షణ వ్యవస్థను నిర్మించింది, ఇందులో ప్రస్తుతం 16 ప్రభుత్వ రక్షణ రంగ సంస్థలు, దాదాపు 500 లైసెన్స్ పొందిన రక్షణ కంపెనీలు, సుమారు 17,000 సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఉన్నాయి. ఈ రంగంలో పెరుగుతున్న పారిశ్రామిక సామర్థ్యం, వ్యాపార నిర్వహణ సౌలభ్యాన్ని ప్రతిబింబిస్తూ, రక్షణ పారిశ్రామిక లైసెన్సుల సంఖ్య మూడు రెట్లు పైగా పెరిగింది - 2015లో 258 నుంచి మార్చి 2026 నాటికి 834కు చేరుకుంది. ఈ విస్తరిస్తున్న వ్యవస్థ దేశీయ ఉత్పత్తి సామర్థ్యాలను బలోపేతం చేయడంతో పాటు ఆవిష్కరణలను పెంపొందిస్తోంది. రక్షణ తయారీలో భారతదేశ స్వయంసమృద్ధి లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్తోంది.
ఈ పదునైన పెరుగుదల రక్షణ తయారీలో పెరుగుతున్న పెట్టుబడిదారుల నమ్మకాన్ని, విస్తరిస్తున్న ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ కాలంలో ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఎగుమతుల్లో 151 శాతం పెరుగుదలను నమోదు చేశాయి. దేశీయ సామర్థ్యంలో స్థిరమైన పెరుగుదల సరఫరా గొలుసులు, సాంకేతికత శోషణ, పారిశ్రామిక పోటీతత్వాన్ని రక్షణ రంగమంతటా బలోపేతం చేసింది.
మీకు తెలుసా
2021 అక్టోబర్‌లో భారత ప్రభుత్వం 200 ఏళ్ల నాటి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డును రద్దు చేసి, దాని 41 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను ఏడు కొత్త రక్షణ రంగ ప్రభుత్వ రంగ సంస్థలుగా పునర్వ్యవస్థీకరించింది. రక్షణ తయారీలో సామర్థ్యం, జవాబుదారీతనం, పోటీతత్వం, సాంకేతిక సామర్థ్యాన్ని మెరుగుపరచడం ఈ సంస్కరణ ముఖ్య ఉద్దేశం. ఈ పునర్నిర్మాణం భారతదేశ స్వదేశీ రక్షణ ఉత్పత్తి వ్యవస్థను బలోపేతం చేసింది. ఆత్మనిర్భర్ భారత్ దార్శనికత కింద రక్షణ రంగ తయారీ సామర్థ్యాన్ని గణనీయంగా పెంపొందించింది.
ప్రాంతీయ తయారీని నడిపిస్తున్న రక్షణ పారిశ్రామిక కారిడార్లు
రక్షణ పారిశ్రామిక కారిడార్లు రక్షణ తయారీకి కీలక వృద్ధి కేంద్రాలుగా ఆవిర్భవించాయి. ప్రాంతీయ సరఫరా గొలుసులను బలోపేతం చేస్తూ, సమగ్ర పారిశ్రామిక వ్యవస్థలను పెంపొందిస్తున్నాయి. 2026 ఏప్రిల్ నాటికి, ఉత్తరప్రదేశ్ రక్షణ పారిశ్రామిక కారిడార్ రూ.42,057 కోట్ల విలువైన పెట్టుబడి హామీలను ఆకర్షించింది. పరీక్షల, ఆవిష్కరణల సామర్థ్యాలను పెంపొందించడానికి డిఫెన్స్ టెక్నాలజీ అండ్ టెస్ట్ సెంటర్ స్థాపన మద్దతుతో రూ.4,409 కోట్ల వాస్తవ పెట్టుబడులు వచ్చాయి. ఇదే సమయంలో తమిళనాడు రక్షణ పారిశ్రామిక కారిడార్ రూ.32,699 కోట్ల విలువైన పెట్టుబడులను ఆకర్షించగా, వాస్తవ పెట్టుబడులు రూ.6,446 కోట్లకు చేరుకున్నాయి. మొత్తంగా ఈ కారిడార్లు పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేస్తున్నాయి. దేశీయ తయారీ సామర్థ్యాన్ని విస్తరించడంతో పాటు కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తున్నాయి.
ఆత్మనిర్భర్ భారత్ కింద కీలక రక్షణ రంగ సంస్కరణలు
రక్షణ ఉత్పత్తుల తయారీలో వ్యాపార నిర్వహణ సౌలభ్యం: 2015కి ముందు పారిశ్రామిక లైసెన్స్ ప్రారంభ కాలపరిమితి ఏడేళ్లుగా ఉండేది. దీనిని మూడేళ్ల వరకు పొడిగించే అవకాశం ఉండేది. 2015లో ప్రభుత్వం దీనిని 15 ఏళ్ల ప్రారంభ కాలపరిమితిగా సవరించింది. దీనిని 18 ఏళ్ల వరకు పొడిగించే అవకాశం కల్పించింది. ఈ మార్పు కొత్త, ఇప్పటికే ఉన్న లైసెన్సులకు వర్తిస్తుంది. దీంతో పాటు ఆర్మ్స్ యాక్ట్ కింద కంపెనీలకు మంజూరు చేసిన లైసెన్సులు ఇప్పుడు ఆ కంపెనీ జీవితకాలం వరకు చెల్లుబాటు అవుతాయి. అయితే ఆ కంపెనీ తయారీ సౌకర్యాన్ని ఏర్పాటు చేసి, ఆమోదం పొందిన తేదీ నుంచి 7 ఏళ్లలోపు ఇతర నిబంధనలను నెరవేర్చాలి. దీనిని మూడేళ్ల వరకు (మొత్తం 10 ఏళ్లు) పొడిగించవచ్చు.
నవీకరించిన రక్షణ ఎగ్జిమ్ పోర్టల్: ఈ పోర్టల్ అప్లికేషన్ల పూర్తి ప్రాసెసింగ్, ఆటోమేటెడ్ కంపెనీ వెరిఫికేషన్, సరళీకృత రిజిస్ట్రేషన్, రియల్-టైమ్ ట్రాకింగ్, సురక్షిత చెల్లింపుల అనుసంధానాన్ని ప్రారంభిస్తుంది. ఇది ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా లక్ష్యాలకు మద్దతు ఇస్తూ పారదర్శకత, సామర్థ్యం, నియంత్రణల కట్టుబాట్లను పెంపొందిస్తుంది. భారతదేశాన్ని రక్షణ తయారీ, ఎగుమతులకు ప్రపంచ కేంద్రంగా నిలుపుతుంది.
పరిశ్రమల ద్వారా స్వదేశీకరణ: రక్షణ మంత్రిత్వ శాఖ ఆగస్టు 2020లో సృజన్ డిఫెన్స్ పోర్టల్‌ను ప్రారంభించింది. ఈ పోర్టల్‌లో ప్రభుత్వ రక్షణ రంగ సంస్థలు, సర్వీస్ ప్రధాన కార్యాలయాలు స్వదేశీకరణ కోసం సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, అంకుర సంస్థలతో కూడిన పరిశ్రమలకు రక్షణ వస్తువులను అందిస్తాయి. స్వదేశీకరణకు ప్రాధాన్యత ఇవ్వడం కోసం, ఆత్మనిర్భర్ భారత్ చొరవ కింద 2021లో రక్షణ మంత్రిత్వ శాఖ సానుకూల స్వదేశీకరణ జాబితాలను కూడా ప్రవేశపెట్టింది. ఈ చొరవ దేశీయ తయారీని బలోపేతం చేసింది. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించింది. స్వదేశీ రక్షణ సామర్థ్యాన్ని విస్తరించింది. మే 2026 నాటికి ప్రభుత్వ రక్షణ రంగ సంస్థల 5,012 వస్తువులతో కూడిన ఐదు సానుకూల స్వదేశీకరణ జాబితాలను ప్రకటించారు. సృజన్ పోర్టల్‌లో, గత ఐదేళ్లలో సానుకూల స్వదేశీకరణ జాబితాల 3,204 వస్తువులతో సహా 15,700 కంటే ఎక్కువ రక్షణ వస్తువులు స్వదేశీకరణ జరిగింది. ప్రభుత్వ రక్షణ రంగ సంస్థలు రూ.9782 కోట్ల విలువైన దేశీయ ఆర్డర్లను ఇచ్చాయి. ఇది సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, అంకుర సంస్థలు, పరిశోధనా సంస్థలు, భారతదేశ రక్షణ తయారీ సామర్థ్యానికి ఊతాన్నిచ్చింది.
సృజన్ దీప్: రక్షణ ఉత్పత్తి శాఖ రక్షణ పరిశ్రమల డిజిటల్ డేటాబేస్ అయిన సృజన్ దీప్‌ను (రక్షణ సంస్థలు, పారిశ్రామికవేత్తల వేదిక) అభివృద్ధి చేసింది. ఈ పోర్టల్ రక్షణ తయారీదారులు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, సేవలు, సాంకేతికత ప్రదాతల సమగ్ర నిక్షేప కేంద్రంగా పనిచేస్తుంది. వీరు రక్షణ వ్యవస్థకు తోడ్పడుతున్నారు. ప్రతి పరిశ్రమకు లేదా విక్రేతకు పోర్టల్‌లో ఒక 'ప్రత్యేక సూచన సంఖ్య' కేటాయించారు. దీనిని అన్ని ప్రయోజనాల కోసం, నవీకరణల కోసం, భవిష్యత్తు సూచన కోసం ఉపయోగిస్తారు. ఈ డేటాబేస్ రక్షణ మంత్రిత్వ శాఖలోని వివిధ సంస్థలకు అందుబాటులో ఉంటుంది. అత్యవసర సమయాల్లో సరఫరా గొలుసు దృఢత్వాన్ని, వనరుల సమీకరణను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. మే 2026 నాటికి 41,000 మందికి పైగా విక్రేతలు, ప్రభుత్వ రక్షణ రంగ సంస్థలకు, వివిధ రక్షణ సంస్థలకు సరఫరా చేసే వారి 2,70,000 ఉత్పత్తులను సృజన్ దీప్‌లో అప్‌లోడ్ చేశారు.
రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ): 2001 మేలో రక్షణ పరిశ్రమ ప్రైవేటు రంగ భాగస్వామ్యం కోసం తెరుచుకుంది. రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని 2020లో కొత్త రక్షణ పారిశ్రామిక లైసెన్స్ కోరుకునే కంపెనీల కోసం ఆటోమేటిక్ రూట్ ద్వారా 74 శాతం వరకు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం లభించే అవకాశం ఉన్న చోట ప్రభుత్వ రూట్ ద్వారా 100 శాతం వరకు పెంచారు. 2026 మార్చి నాటికి రక్షణ రంగంలో పనిచేస్తున్న కంపెనీల ద్వారా రూ. 6,670.59 కోట్ల విలువైన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం నమోదైంది. రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ప్రోత్సహించడానికి అసలైన విదేశీ ఉత్పత్తుల తయారీదారులతో కలిసి సముచిత రక్షణ సాంకేతికతల ఉమ్మడి అభివృద్ధిని, ఉమ్మడి ఉత్పత్తిని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది.
పార్ట్ సీ: ఆవిష్కరణ నుంచి కార్యాచరణ శ్రేష్ఠత వైపు
గడచిన ఒక దశాబ్దంలో భారత రక్షణ వ్యవస్థ గణనీయమైన మార్పునకు గురైంది. ఈ పురోగతి కార్యాచరణ విజయాలు, స్వదేశీ వేదికలు, అధునాతన మౌలిక సదుపాయాలు, ఎదుగుతున్న ఆవిష్కరణ వ్యవస్థ అంతటా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ప్రయత్నాలు రక్షణ రంగ స్వయంసమృద్ధి దార్శనికతను ముందుకు తీసుకెళ్తూనే జాతీయ భద్రతను బలోపేతం చేశాయి.
వ్యూహాత్మక ప్రభావం కోసం కార్యాచరణ సన్నద్ధత
- అంతరిక్షంలోని ఉపగ్రహాన్ని ధ్వంసం చేయగల తన సామర్థ్యాన్ని భారతదేశం 2019 మార్చి 27న మిషన్ శక్తి ద్వారా నిరూపించింది. తద్వారా యాంటీ శాటిలైట్ సామర్థ్యాలు కలిగిన ఎంపిక చేసిన దేశాల సమూహంలో చేరింది.
- మిషన్ దివ్యస్త్ర కింద వివిధ లక్ష్యాలకు బహుళ యుద్ధశీర్షికలను మోసుకెళ్లగల సుదూర శ్రేణి క్షిపణిని భారతదేశం 2024 మార్చి 11న విజయవంతంగా పరీక్షించింది.
- ఆపరేషన్ సిందూర్ సమయంలో ఆకాశ్ వైమానిక రక్షణ క్షిపణులు, బ్రహ్మోస్ క్షిపణులు, యాంటీ డ్రోన్ వ్యవస్థలు, వైమానిక నిఘా వేదికల వంటి స్వదేశీ వ్యవస్థలు సాయుధ దళాలకు మద్దతుగా నిలిచాయి.
- వైమానిక ముప్పులను ఎదుర్కోవడానికి క్షిపణి ఇంటర్‌సెప్టర్లు, స్వల్ప శ్రేణి వైమానిక రక్షణ ఆయుధాలు, లేజర్ ఆధారిత సాంకేతికతలను మిళితం చేసే అధునాతన వైమానిక రక్షణ వ్యవస్థను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ 2025 ఆగస్టు 23న విజయవంతంగా పరీక్షించింది.
తర్వాతి-తరం రక్షణ సాంకేతికతలు
- స్వదేశీ తేజస్ యుద్ధ విమానం 2019 ఫిబ్రవరిలో తుది కార్యాచరణ అనుమతిని పొందింది. 83 విమానాలను భారత వైమానిక దళంలోకి చేర్చడానికి ఆమోదం లభించింది.
- అర్జున్ ఎంకే-1ఏ యుద్ధ ట్యాంకు 2021 ఫిబ్రవరిలో భారత సైన్యంలోకి చేరింది.
- రక్షణ అవసరాల కోసం 2022లో నిఘా, సైబర్ భద్రత, లాజిస్టిక్స్, స్వయంప్రతిపత్తి వ్యవస్థలు, యుద్ధరంగ మద్దతుతో సహా 75 కృత్రిమ మేధ ఆధారిత సాంకేతికతలను ప్రవేశపెట్టారు.
- నెక్స్ట్ జనరేషన్ సుదూర శ్రేణి క్షిపణుల కోసం అధునాతన ప్రొపల్షన్ వ్యవస్థలను అభివృద్ధి చేయడంలో భారతదేశం ముఖ్యమైన పురోగతిని సాధించింది.
- రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ 2026 జనవరి 9న స్క్రామ్‌జెట్ కనెక్ట్ పైప్ టెస్ట్ సౌకర్యం వద్ద యాక్టివ్ కూల్డ్ స్క్రామ్‌జెట్ ఫుల్-స్కేల్ కంబస్టర్ సుదీర్ఘ కాల పరిమితి భూతల పరీక్షను 12 నిమిషాల కంటే ఎక్కువ సమయం పాటు విజయవంతంగా నిర్వహించింది. ఇది హైపర్సోనిక్ క్షిపణి అభివృద్ధిలో ఒక ముఖ్యమైన మైలురాయిని నమోదు చేసింది.
- భవిష్యత్తు హై-స్పీడ్ క్షిపణి సాంకేతికతల అభివృద్ధికి మద్దతుగా హైదరాబాద్‌లో కొత్త హైపర్‌సోనిక్ విండ్ టనల్ స్థాపించారు.
యువ, భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే సాయుధ దళాల నిర్మాణం
సాయుధ దళాలలోకి యువతీ యువకులను అగ్నివీరులుగా నాలుగేళ్ల సేవా కాలం కోసం నిరాయుధులుగా చేర్చుకోవడానికి అగ్నిపథ్ పథకం 2022 జూన్ 15న ప్రారంభమైంది. ఈ పథకం ఆధునిక దృక్పథంతో కూడిన యువ, సాంకేతిక పరిజ్ఞానం ఉన్న, పోరాటానికి సిద్ధంగా ఉండే సైనిక శక్తిని సృష్టించే లక్ష్యాన్ని కలిగి ఉంది. అగ్నివీరులు ఐజీఎన్ఓయూ, ఎన్ఐఓఎస్ వంటి సంస్థల భాగస్వామ్యం ద్వారా సైనిక శిక్షణ, ప్రత్యేక నైపుణ్యాభివృద్ధి, విద్యా అవకాశాలను పొందుతారు. ఈ పథకం సర్వీసు తర్వాత జాతీయంగా గుర్తింపు పొందిన నైపుణ్య ధ్రువీకరణ పత్రాలను, ఉపాధి మార్గాలను కూడా అందిస్తుంది. అగ్నిపథ్ భవిష్యత్తు యుద్ధ సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్న యువ, నైపుణ్యం, క్రమశిక్షణ, సాంకేతిక ఆధారిత శక్తిని నిర్మించడం ద్వారా భారతదేశ రక్షణ సామర్థ్యాన్ని పెంపొందిస్తోంది.
భారతదేశ రక్షణ రంగంలో మార్పు పరిశోధన, ఆవిష్కరణలు, వ్యూహాత్మక సామర్థ్య అభివృద్ధిపై ఉన్న నిరంతర నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. యుద్ధరంగానికి సిద్ధంగా ఉన్న వ్యవస్థల నుంచి భవిష్యత్తు సాంకేతికతలు, సహకార ఆవిష్కరణల వ్యవస్థల వరకు, దేశం దీర్ఘకాలిక భద్రత కోసం మరింత బలమైన పునాదిని నిర్మించుకుంది. ఈ విజయాలు ఎదురవుతున్న సవాళ్లను ఆత్మవిశ్వాసంతో, స్వదేశీ బలంతో ఎదుర్కొనే భారతదేశ సామర్థ్యాన్ని పెంపొందిస్తున్నాయి.
పార్ట్ డీ: 12 ఏళ్లలో నమ్మకమైన శక్తి - భారతదేశ రక్షణ దౌత్యం, నిబద్ధత
గత దశాబ్దంలో భారతదేశ రక్షణ దౌత్యం జాతీయ భద్రత, వ్యూహాత్మక ప్రభావానికి ఒక ముఖ్యమైన స్తంభంగా రూపాంతరం చెందింది. దేశం వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని కాపాడుకుంటూనే ప్రధాన ప్రపంచ శక్తులతో భాగస్వామ్యాలను విస్తరించింది. రక్షణ సహకారం ఇప్పుడు కేవలం సైనిక మార్పిడిలకే పరిమితం కాకుండా సాంకేతిక సహకారం, పారిశ్రామిక భాగస్వామ్యాలు, ఉమ్మడి తయారీ వరకు విస్తరించింది. ప్రాంతీయ, బహుపాక్షిక భద్రతా వేదికలలో కూడా భారతదేశం తన పాత్రను బలోపేతం చేసుకుంది. క్వాడ్, షాంఘై సహకార సంస్థ(ఎస్‌సీఓ), ఆసియాన్ రక్షణ మంత్రుల సమావేశం-ప్లస్(ఏడీఎంఎం-ప్లస్) ద్వారా భారతదేశం సముద్ర భద్రత, ఉగ్రవాద నిరోధం, నియమబద్ధమైన అంతర్జాతీయ వ్యవస్థ కోసం వాదిస్తోంది. ఈ చర్యలు భారతదేశం పెరుగుతున్న వ్యూహాత్మక ఆత్మవిశ్వాసాన్ని, మరింత సంక్లిష్టంగా మారుతున్న భౌగోళిక రాజకీయ వాతావరణంలో బాధ్యతాయుతమైన భద్రతా భాగస్వామిగా పెరుగుతున్న విశ్వసనీయతను ప్రతిబింబిస్తాయి.
భారత్-అమెరికా
భారతదేశం, యునైటెడ్ స్టేట్స్ గత దశాబ్దంలో కీలకమైన రక్షణ ఒప్పందాలపై సంతకాలు చేశాయి. వీటిలో 2016లో లాజిస్టిక్స్ ఎక్స్ఛేంజ్ మెమోరాండం ఆఫ్ అగ్రిమెంట్(ఎల్ఈఎంఓఏ) ఉంది. రెండు దేశాలు 2018లో కమ్యూనికేషన్స్ కంపాటబిలిటీ అండ్ సెక్యూరిటీ అగ్రిమెంట్(సీఓఎంసీఏఎస్ఏ)పై కూడా సంతకాలు చేశాయి. బేసిక్ ఎక్స్ఛేంజ్ అండ్ కోఆపరేషన్ అగ్రిమెంట్(బీఈసీఏ) 2020లో కుదిరింది. భారతదేశాన్ని యునైటెడ్ స్టేట్స్ ఒక ప్రధాన రక్షణ భాగస్వామిగా గుర్తించింది. ఇది స్ట్రాటజిక్ ట్రేడ్ అథరైజేషన్-1 హోదాను కూడా పొందింది.
ఈ పరిణామాలు భారతదేశం-అమెరికా రక్షణ భాగస్వామ్యాన్ని వ్యవస్థాగతీకరించాయి. క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీ(ఐసీఈటీ)పై కార్యక్రమం 2023లో ప్రారంభమైంది. ఇది 2025లో ట్రాన్స్‌ఫార్మింగ్ ది రిలేషన్‌షిప్ యుటిలైజింగ్ స్ట్రాటజిక్ టెక్నాలజీ(ట్రస్ట్) కింద కొనసాగింది. ఈ చట్రం కృత్రిమ మేధ, సెమీకండక్టర్లు, అంతరిక్ష సాంకేతికతలలో సహకారాన్ని విస్తరించింది. రెండు దేశాలు 2025 అక్టోబర్‌లో కౌలాలంపూర్‌లో 10 ఏళ్ల రక్షణ భాగస్వామ్య చట్రంపై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం ఉమ్మడి విన్యాసాలు, సాంకేతిక సహకారం, ఇండో-పసిఫిక్ భద్రతా సహకారాన్ని బలోపేతం చేసింది.
భారత్-రష్యా
మారుతున్న ప్రపంచ భౌగోళిక రాజకీయాలు ఉన్నప్పటికీ రష్యాతో భారతదేశ రక్షణ భాగస్వామ్యం బలంగా కొనసాగింది. ఈ భాగస్వామ్యం మిలిటరీ అండ్ మిలిటరీ టెక్నికల్ కోఆపరేషన్‌పై ఇండియా-రష్యా ఇంటర్‌గవర్నమెంటల్ కమిషన్‌లో స్థిరపడింది. దీని 21వ, 22వ సమావేశాలు 2024, 2025 డిసెంబర్‌లలో జరిగాయి. ఎస్-400 వైమానిక రక్షణ వ్యవస్థలపై సహకారాన్ని ఇరు పక్షాలు పునరుద్ఘాటించాయి. సుఖోయ్-30ఎమ్‌కెఐ యుద్ధ విమానాల ఆధునీకరణకు కూడా వారు మద్దతు ఇచ్చారు. ఈ భాగస్వామ్యం ఆత్మనిర్భర్ భారత్ కింద ఉమ్మడి రక్షణ ఉత్పత్తికి అవకాశాలను విస్తరించింది. ఇంద్ర విన్యాసాలు రెండు దేశాల మధ్య ఒక ప్రధాన త్రివిధ దళాల సైనిక విన్యాసాలుగా కొనసాగుతున్నాయి. రష్యాతో రక్షణ సహకారాన్ని బలోపేతం చేస్తూనే భారతదేశం వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని కాపాడుకుంది. ఈ భాగస్వామ్యం ఉమ్మడి ఉత్పత్తి, సాంకేతిక సహకారంపై ఎక్కువగా దృష్టి పెడుతోంది. భారతదేశం దేశంలోనే మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్‌హాల్ సామర్థ్యాలను కూడా విస్తరించింది.
భారత్-యూరోపియన్ యూనియన్
యూరోపియన్ యూనియన్, భారతదేశం 2026 జనవరి 27న యూరోపియన్ యూనియన్-ఇండియా సదస్సు సందర్భంగా భద్రత, రక్షణ భాగస్వామ్యంపై సంతకాలు చేశాయి. యూరోపియన్ యూనియన్ ప్రతినిధి కాజా కల్లాస్, విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ సంతకం చేసిన ఈ ఒప్పందం శాంతి, భద్రత, రక్షణపై సహకారం కోసం ఒక సమగ్ర చట్రాన్ని నిర్దేశిస్తుంది - ఇందులో సముద్ర భద్రత, సైబర్ రక్షణ, ఉగ్రవాద నిరోధం, అంతరిక్ష రంగాలు ఉన్నాయి.
ఈ భాగస్వామ్యం వార్షిక ఇండియా-యూరోపియన్ యూనియన్ భద్రత, రక్షణ చర్చల ద్వారా నిశ్చితార్థాన్ని వ్యవస్థాగతీకరిస్తుంది, ఉమ్మడి అభివృద్ధి, సరఫరా గొలుసు బలోపేతం కోసం ఇండియా-యూరోపియన్ యూనియన్ డిఫెన్స్ ఇండస్ట్రీ ఫోరమ్‌ను అందిస్తుంది.
భారత్-ఫ్రాన్స్
భారతదేశం-ఫ్రాన్స్ రక్షణ సంబంధాలు భారతదేశ అత్యంత లోతైన వ్యూహాత్మక పారిశ్రామిక భాగస్వామ్యాలలో ఒకటిగా రూపాంతరం చెందాయి. 2016 నాటి రాఫెల్ ఒప్పందం భారత వైమానిక దళ పోరాట సామర్థ్యాలను బలోపేతం చేసింది. ప్రాజెక్ట్ 75 కింద మొత్తం ఆరు కల్వరీ-క్లాస్ స్కార్పెన్ జలాంతర్గాములు సరఫరా చేయబడ్డాయి. ముంబైలోని మజాగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ ఫ్రెంచ్ సహకారంతో ఈ జలాంతర్గాములను నిర్మించింది. ఆరవ జలాంతర్గామి 2025 జనవరిలో సైన్యంలో చేరింది. రక్షణ కొనుగోలు మండలి 2023లో 26 రాఫెల్-మెరైన్ విమానాలను ఆమోదించింది. దస్సాల్ట్-టాటా ఫ్యూజ్‌లేజ్ ఉమ్మడి భాగస్వామ్యం ఏరోస్పేస్ తయారీ సహకారాన్ని విస్తరించింది. సాఫ్రాన్-హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ భాగస్వామ్యం ఇంజిన్ సాంకేతిక సహకారాన్ని బలోపేతం చేసింది. ఈ కార్యక్రమాలు హొరైజన్ 2047 రక్షణ పారిశ్రామిక రోడ్‌మ్యాప్, ఉమ్మడి ఉత్పత్తి లక్ష్యాలకు మద్దతు ఇస్తున్నాయి.
భారత్-జపాన్
భారత్, జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక, ప్రపంచ భాగస్వామ్యం గత దశాబ్దంలో గణనీయమైన రక్షణ ప్రాధాన్యతను సంతరించుకుంది. కొనుగోలు, క్రాస్-సర్వీసింగ్ ఒప్పందం(2020) సాయుధ దళాల మధ్య పరస్పర లాజిస్టిక్స్, సరఫరా మద్దతును సాధ్యం చేసింది. జిమెక్స్ విన్యాసాలు నౌకాదళ పరస్పర కార్యాచరణను బలోపేతం చేస్తూనే ఉన్నాయి. వీటిలో తాజాది 2025లో యోకోసుకాలో జరిగింది. రక్షణ మంత్రి, జపాన్ రక్షణ మంత్రి మధ్య జరిగిన ద్వైపాక్షిక సమావేశం(మే 2025) ప్రాంతీయ శాంతి పట్ల ఉమ్మడి నిబద్ధతను పునరుద్ఘాటించింది.
భారత్-యూఏఈ
భారత్-యూఏఈ రక్షణ సంబంధాలు కేవలం లావాదేవీల స్థాయి నుంచి వ్యూహాత్మక భాగస్వామ్యం వైపు నిర్ణయాత్మకంగా మారాయి. దుబాయ్ ఎయిర్ షో(నవంబర్ 2025)లో భారతదేశం ఉమ్మడి పరిశోధన, అభివృద్ధి, ఉమ్మడి ఉత్పత్తి అవకాశాలను చురుకుగా ప్రోత్సహించింది. యూఏఈ అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ 2026 జనవరిలో భారతదేశ పర్యటన సందర్భంగా ద్వైపాక్షిక వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యం కోసం ఒక లెటర్ ఆఫ్ ఇంటెంట్‌పై సంతకం చేశారు. ఇది రక్షణ పారిశ్రామిక సహకారం, ప్రత్యేక కార్యకలాపాలు, ఉగ్రవాద నిరోధంలో సహకారాన్ని నిర్దేశిస్తుంది.
భారత్-ఆస్ట్రేలియా
2020లో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంగా మారిన భారత్-ఆస్ట్రేలియా రక్షణ సంబంధాలు విస్తృతిలో, వ్యవస్థాగతంగా వేగంగా వృద్ధి చెందాయి. ప్రారంభ ఆస్ట్రేలియా-ఇండియా రక్షణ మంత్రుల చర్చలు(కాన్‌బెర్రా, అక్టోబర్ 2025) ఈ భాగస్వామ్యానికి ఐదేళ్లు పూర్తయినట్లు గుర్తించాయి. సముద్ర డొమైన్ అవగాహన, సైనిక విన్యాసాలు, రక్షణ పరిశ్రమ అనుసంధానంపై నిబద్ధతను ముందుకు తీసుకెళ్లాయి.
షాంఘై సహకార సంస్థ(ఎస్‌సీఓ) - రక్షణ మంత్రుల సమావేశం
2017లో ఎస్‌సీఓలో చేరినప్పటి నుంచి భారతదేశం ఈ వేదికను ఉగ్రవాద నిరోధానికి మద్దతు ఇవ్వడానికి నిరంతరం ఉపయోగించుకుంటోంది. పాకిస్తాన్ వైఖరిని ఎండగడుతోంది. వరుస చర్యల ద్వారా ఉగ్రవాద నిరోధక నిధుల చట్రాల కోసం భారత్ వాదించింది. కింగ్‌డావో(జూన్ 2025)లో భారతదేశం ఉగ్రవాదాన్ని సహించేది లేదని పునరుద్ఘాటించింది. సామూహిక విధ్వంసక ఆయుధాల ముప్పులకు వ్యతిరేకంగా ఉమ్మడి చర్యకు పిలుపునిచ్చింది. తన సూత్రప్రాయమైన, వ్యూహాత్మకంగా స్వతంత్ర ఎస్‌సీఓ వైఖరిని బలోపేతం చేసింది.
ఆసియాన్ / ఏడీఎంఎం-ప్లస్ - కౌలాలంపూర్‌లో
ఏడీఎంఎం-ప్లస్‌లో భారతదేశ చురుకైన భాగస్వామ్యం ఆసియాన్ దేశాలలో దాని పెరుగుతున్న రక్షణ విశ్వసనీయతను ప్రతిబింబిస్తుంది. కౌలాలంపూర్‌లో(నవంబర్ 2025), భారతదేశం ఇండో-పసిఫిక్‌లో నౌకాయాన స్వేచ్ఛను పునరుద్ఘాటించింది. ఆసియాన్ భాగస్వాములు దాని స్థిరీకరణ పాత్రను గుర్తించారు. యాక్ట్ ఈస్ట్ పాలసీ ద్వారా ప్రేరణ పొందిన వియత్నాం, ఫిలిప్పీన్స్, ఇండోనేషియాలతో రక్షణ సంబంధాలు పెట్రోల్ నౌకల బహుమతి, సామర్థ్య పెంపొందింపు, బ్రహ్మోస్ సహకారం ద్వారా లోతైనవిగా మారాయి.
క్వాడ్ సహకారం
2017లో పునరుద్ధరించి, 2021లో లీడర్స్ సదస్సుగా మారిన క్వాడ్‌లో భారతదేశం ఒక కేంద్ర స్తంభంగా ఆవిర్భవించింది. ఎక్సర్‌సైజ్ మలబార్ - 2020లో ఆస్ట్రేలియా మళ్లీ చేరినప్పటి నుంచి ఇప్పుడు నాలుగు దేశాల కార్యక్రమంగా మారింది. పెరుగుతున్న కార్యాచరణ ప్రధాన్యతను ప్రతిబింబిస్తాయి. 2025 క్వాడ్-ఎట్-సీ మిషన్ నలుగురు భాగస్వాముల మధ్య మొదటి ఉమ్మడి తీరరక్షక దళ విన్యాసాన్ని గుర్తించింది. క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో(జూలై 2025) భారత్ స్వరం ఉగ్రవాదం, దక్షిణ చైనా సముద్ర స్థిరత్వం, క్లిష్టమైన ఖనిజాలపై ఫలితాలను ప్రభావితం చేసింది.
ఇండో-పసిఫిక్ భాగస్వామ్యాలు
ఇండో-పసిఫిక్‌లో విశ్వసనీయమైన భద్రతా దేశంగా భారతదేశం ఆవిర్భవించడం 2015లో ప్రతిపాదించిన సాగర్ (ప్రాంతంలోని అందరికీ భద్రత, వృద్ధి) దార్శనికతపై ఆధారపడింది. 2025 మార్చిలో ప్రారంభించిన మహాసాగర్ సిద్ధాంతం ద్వారా ఇది మరింత బలోపేతమైంది. స్థిరమైన నౌకాదళ ఉనికి, బహుపాక్షిక విన్యాసాలు, తీరప్రాంత దేశాలతో సామర్థ్య పెంపొందింపు భాగస్వామ్యాల ద్వారా భారతదేశం హిందూ మహాసముద్ర ప్రాంతమంతటా నికర భద్రతా ప్రదాతగా తనను తాను నిలుపుకుంది.
భారతదేశం విస్తరిస్తున్న రక్షణ భాగస్వామ్యాలు సైనిక సన్నద్ధతను, పారిశ్రామిక సామర్థ్యాన్ని, వ్యూహాత్మక ప్రభావాన్ని బలోపేతం చేశాయి. ద్వైపాక్షిక ఒప్పందాలు ఇప్పుడు ఉమ్మడి ఉత్పత్తి, అధునాతన సాంకేతికత లభ్యత, బలమైన కార్యాచరణ సమన్వయానికి మద్దతు ఇస్తున్నాయి. ఇదే సమయంలో బహుపాక్షిక నిశ్చితార్థం ప్రాంతీయ భద్రత, ఇండో-పసిఫిక్ స్థిరత్వాన్ని రూపొందించడంలో భారతదేశ పాత్రను పెంపొందించింది. దేశం వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని లోతైన ప్రపంచ సహకారంతో ఎక్కువగా సమతుల్యం చేస్తోంది. భారతదేశం ఇప్పుడు ఒక నమ్మకమైన రక్షణ భాగస్వామిగా, విశ్వసనీయ భద్రతా ప్రదాతగా, అభివృద్ధి చెందుతున్న రక్షణ తయారీ కేంద్రంగా గుర్తింపు పొందుతోంది. స్వదేశీ సామర్థ్యాలు పెరుగుతూ ఉన్నందున, రక్షణ దౌత్యం భారతదేశ దీర్ఘకాలిక వ్యూహాత్మక ఆకాంక్షలు, సాంకేతిక పురోగతి, 2047 నాటికి అగ్రగామి ప్రపంచ శక్తిగా ఎదగాలనే ఆశయానికి కేంద్రంగా ఉంటుంది.
భారతదేశ రక్షణ దశాబ్దం, 2047 వైపు మార్గం
గత పన్నెండేళ్లలో భారతదేశ రక్షణ ప్రయాణం కేవలం సైనిక ఆధునీకరణకు మించి అనేక విషయాలను ప్రతిబింబిస్తుంది. ఇది స్వదేశీ బలం ద్వారా తన భవిష్యత్తును సురక్షితం చేసుకోవాలని నిశ్చయించుకున్న దేశం ఎదుగుదలను సూచిస్తుంది. యుద్ధనౌకలు, యుద్ధ విమానాల నుంచి డ్రోన్లు, క్షిపణులు, అధునాతన ఎలక్ట్రానిక్స్ వరకు భారతదేశం తన వ్యూహాత్మక సామర్థ్యాలను దేశీయంగా నిలకడగా విస్తరించింది. ఈ పరివర్తన దేశ పారిశ్రామిక, సాంకేతిక రంగాన్ని కూడా పునర్నిర్మించింది. అంకుర సంస్థలు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, ప్రైవేటు కంపెనీలు, ప్రభుత్వ రంగ సంస్థలు జాతీయ భద్రతలో చురుకైన భాగస్వాములుగా మారాయి. రక్షణ తయారీ పరిమిత ప్రభుత్వ రంగానికి సంబంధించిన పరిధి నుంచి విస్తృత ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థగా రూపాంతరం చెందింది. ఈ సమయంలో భారతదేశ ప్రపంచ స్థాయి కూడా మారింది. దేశం ఇండో-పసిఫిక్ అంతటా, దాని వెలుపల మరింత ఆత్మవిశ్వాసం ఉన్న భద్రతా భాగస్వామిగా ఆవిర్భవించింది. దాని రక్షణ దౌత్యం సాంకేతిక సహకారం, సముద్ర భద్రత, పారిశ్రామిక సహకారం, వ్యూహాత్మక విస్తరణను ఎక్కువగా మిళితం చేస్తోంది. భారతదేశం 2047 వైపు పయనిస్తున్నప్పుడు రక్షణ సన్నద్ధత ఆవిష్కరణలు, ఆటుపోట్లకు తట్టుకునే సామర్థ్యం, స్వయంసమృద్ధి ద్వారా నడుస్తోంది. గత దశాబ్దంలో నిర్మించిన పునాది భారతదేశాన్ని కేవలం స్పందించే దేశంగా కాకుండా అభివృద్ధి చెందుతున్న ప్రపంచ భద్రతా వ్యవస్థను రూపొందించే దేశంగా నిలుపుతుంది.
***
(Explainer ID: 158948)
आगंतुक पटल : 104
Provide suggestions / comments