• Sitemap
  • Advance Search
Social Welfare

సంక్షేమం నుంచి మహిళ‌ల‌ నేతృత్వంలో అభివృద్ధి దిశ‌గా..

Posted On: 02 JUN 2026 3:35PM

భారతదేశం 2014 నుంచి 2026 మధ్య కాలంలో అన్ని రంగాలు, సంస్థలలో తన దృష్టిని ‘మహిళల సంక్షేమం’ నుంచి ‘మహిళల నాయకత్వంలో అభివృద్ధి’ వైపు మళ్లించింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవితకాల విధానం మహిళలకు ఆరోగ్యం, విద్య, పోషకాహారం, జీవనోపాధి, ఆర్థిక సేవలు, నాయకత్వ అవకాశాలను మెరుగుపరిచింది. స్వయం సహాయక సంఘాలు(ఎస్‌హెచ్‌జీలు), వ్యాపార దృక్ప‌థం, డిజిటల్ పరిజ్ఞానాన్ని ప్రోత్సహించే కార్యక్రమాలు మహిళల ఆర్థిక భాగస్వామ్యాన్ని గణనీయంగా పెంచాయి. మరుగుదొడ్లు, గృహ వసతి, స్వచ్ఛమైన వంట గ్యాస్, తాగునీటి కుళాయిల సౌకర్యం వారి గౌరవాన్ని, రక్షణను, జీవన ప్రమాణాలను పెంపొందించింది. పాలన, ప్రభుత్వ సంస్థలు, నిర్ణయాధికార ప్రక్రియల్లో పెరుగుతున్న మహిళల భాగస్వామ్యం దేశ నిర్మాణంలో వారి విస్తరిస్తున్న పాత్రను ప్రతిబింబిస్తోంది.

భారతదేశ వృద్ధి పథంలో కేంద్ర బిందువుగా మహిళలు
గడిచిన పన్నెండేళ్లలో భారతదేశంలో మహిళల అభివృద్ధి రంగంలో ఒక విప్లవాత్మక మార్పు వచ్చింది. కేవలం సౌకర్యాలు, మద్దతు అందించే స్థాయి నుంచి భాగస్వామ్యం, అవకాశాలు, నాయకత్వాన్ని పెంపొందించే స్థాయికి ప్రాధాన్యతలు మారాయి. మహిళలను ఇప్పుడు కేవలం లబ్ధిదారులుగా మాత్రమే చూడటం లేదు. వారు దేశ వృద్ధి, ప్రగతిని పరుగులు తీయించడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు.

ఈ మార్పు జీవితకాల అవసరాల ఆధారంగా చేపట్టిన వివిధ కార్యక్రమాల ద్వారా సాధ్యమైంది. ఆడపిల్లల రక్షణ, విద్యతో మొదలైన ఈ ప్రయత్నాలు ఆరోగ్యం, పోషకాహారం, నైపుణ్యాలు, వ్యవస్థాపకత, నాయకత్వం వరకు నిరంతరాయంగా సాగుతున్నాయి. ప్రస్తుతం నిరంతర భాగస్వామ్యం, స్పష్టమైన ఫలితాల సాధనపై ప్రధానంగా దృష్టి పెట్టారు.

ఈ మార్పులు అన్ని రంగాలలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎక్కువ మంది ఆడపిల్లలు పాఠశాలల్లో కొనసాగుతూ ఉన్నత విద్య వైపు అడుగులు వేస్తున్నారు. ఆర్థిక సమ్మిళితం మహిళలకు బ్యాంకింగ్, రుణ సదుపాయాలను విస్తృతం చేసింది. ఇది వారి జీవనోపాధిని, ఆర్థిక స్వాతంత్య్రాన్ని బలోపేతం చేసింది. ఆరోగ్యం, పోషకాహారం, పారిశుద్ధ్యం, స్వచ్ఛమైన వంట గ్యాస్ అందుబాటులోకి రావడం వల్ల వారి ఆత్మగౌరవం, జీవన నాణ్యత మెరుగయ్యాయి.

మహిళలు సామాజిక, రాజకీయ రంగాలలో కూడా తమ ఉనికిని చాటుకుంటున్నారు. స్థానిక సంస్థల పాలన, సామాజిక సంస్థలు, నిర్ణయాధికార ప్రక్రియల్లో వారి భాగస్వామ్యం నిరంతరం పెరుగుతోంది.

పుట్టుకతోనే గౌరవం: రక్షణ, బాల్యదశలో సంరక్షణ
పుట్టినప్పుడు అందించే సంరక్షణ శిశువు జీవితానికి, తల్లి ఆరోగ్యానికి బలమైన పునాది వేస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశం ఆరోగ్య సేవలు, పోషకాహార మద్దతు, ఆసుపత్రి ప్రసవాల వ్యవస్థల ద్వారా ప్రసవకాల, బాల్యదశలో సంరక్షణను బలోపేతం చేసింది.

బేటీ బచావో బేటీ పడావో: భారతీయ కుమార్తెల సాధికారతకు ఒక దశాబ్దం

 

    


2015 జనవరి 22న ప్రారంభమైనది ఈ కేంద్ర ప్ర‌భుత్వ‌ పథకం. తగ్గుతున్న బాలల లింగ నిష్పత్తిని అరికట్టడం, లింగ వివక్షతో కూడిన పిండ నిర్ధారణ పరీక్షలను నిరోధించడం, ఆడపిల్లల మనుగడ, రక్షణ, విద్యను ప్రోత్సహించడం దీని ముఖ్య ఉద్దేశం.

ఈ కార్యక్రమం ఆసుపత్రి ప్రసవాలను పెంచడం, సెకండరీ విద్యలో ఆడపిల్లల నమోదును ఎక్కువ చేయడం, పాఠశాల చదువు మధ్యలో ఆపేసే వారి సంఖ్యను తగ్గించడం, ప్రసవ పూర్వ సంరక్షణ నమోదును బలోపేతం చేయడంపై దృష్టి పెట్టింది. సురక్షితమైన బహిష్టు పరిశుభ్రత, నిర్వహణపై కూడా అవగాహన కల్పిస్తోంది. ఈ పథకం సమాజంలో ఆలోచనా విధానాన్ని మార్చడానికి, లింగ సమానత్వాన్ని తీసుకురావడానికి ఆడపిల్లల సాధికారత జాతీయ ఉద్యమంగా మారింది.

ఈ పథకం పీసీపీఎన్‌డీటీ(గర్భధారణ పూర్వ, ప్రసవ పూర్వ రోగనిర్ధారణ పద్ధతుల) చట్టాన్ని కఠినంగా అమలు చేయడంతో పాటు లింగ వివక్షతో కూడిన సామాజిక నిబంధనలను సవాలు చేయడానికి, ప్రవర్తనా మార్పును తీసుకురావడానికి నిరంతర ప్రజా అవగాహన ప్రయత్నాలను సమగ్రం చేస్తుంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్-5) ప్రకారం భారతదేశ జనాభాలో ప్రతి 1,000 మంది పురుషులకు మహిళల సంఖ్య గతంలో ఉన్న 943 (జనగణన 2011) నుంచి 1,020కి పెరిగింది. ఇది ఒక ముఖ్యమైన జనాభా మార్పును సూచిస్తుంది.

ప్రధానమంత్రి మాతృ వందన యోజన(పీఎంఎంవీవై)
తల్లి ఆరోగ్యం, బాల్యదశ సంరక్షణ ప్రాధాన్యతను గుర్తిస్తూ 2017లో పీఎంఎంవీవై పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇది గర్భిణులు, పాలిచ్చే తల్లులకు మద్దతుగా నిలిచే ఒక ప్రసూతి లబ్ధి పథకం.

ఈ పథకం కింద మహిళలు మొదటి కాన్పుకు రూ.5,000 రెండు విడతల్లో, రెండవ కాన్పులో ఆడపిల్ల పుడితే రూ.6,000 పొందుతారు. ఈ నగదు బదిలీలు గర్భధారణ ముందస్తు నమోదు, ప్రసవ పూర్వ తనిఖీలు, టీకాలు వేయించడం వంటి కీలక ఆరోగ్య మైలురాళ్లతో ముడిపడి ఉంటాయి.

ప్రత్యక్ష న‌గ‌దు బదిలీ ద్వారా సకాలంలో సహాయం అందుతోంది. గర్భస్రావం లేదా మృతశిశువు జన్మించిన సందర్భాలలో కొత్తగా అర్హత పొందే నిబంధనలు కూడా ఉన్నాయి. ఈ ఆర్థిక సహాయం పాక్షిక వేతన నష్టపరిహారంగా కూడా పనిచేస్తుంది. ఇది తల్లుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, ఆసుపత్రి సంరక్షణను ప్రోత్సహించడానికి, లింగ సమానత్వాన్ని పెంపొందించడానికి సహాయపడుతుంది.

కీలక విజయాలు, పరిధి:
పథకం ప్రారంభం నుంచి నమోదైన లబ్ధిదారుల సంఖ్య: 4.92 కోట్లు (30 ఏప్రిల్, 2026 నాటికి)
పథకం ప్రారంభం నుండి లబ్ధి పొందిన వారి సంఖ్య: 4.28 కోట్లు (30 ఏప్రిల్, 2026 నాటికి)
మొత్తం పంపిణీ చేసిన సొమ్ము: ₹20,150 కోట్లు

సురక్షిత మాతృత్వం వైపు రక్షీ సంగ్మా ప్రయాణం
రక్షీ ఎన్. సంగ్మా మేఘాలయలోని నార్త్ గారో హిల్స్ పరిధిలోని బెల్పారా గ్రామానికి చెందిన గృహిణి, చిన్న రైతు. ఆమె ఎంతో కష్టమ్మీద కుటుంబాన్ని పోషించేది. గర్భధారణ సమయంలో ఆర్థిక ఇబ్బందులు, వైద్య సదుపాయాలు సరిగ్గా లేకపోవడంతో ఆమె పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది.

ఆమె పీఎమ్‌ఎమ్‌వీవై పథకం కింద సహాయం కోరింది. సరైన సమయంలో ఆమెకు ఎంతో అవసరమైన ఉపశమనం లభించింది. ఈ ఆర్థిక సహాయం వల్ల ఆమె ఎలాంటి అదనపు ఆర్థిక భారం లేకుండా పౌష్టికాహారం, క్రమం తప్పకుండా ప్రసవ పూర్వ తనిఖీలు, అవసరమైన వైద్య సంరక్షణను పొందగలిగింది. సరైన సంరక్షణ, నిరంతర పర్యవేక్షణతో రక్షీ ప్రభుత్వ వైద్య శాలలో ఆరోగ్యకరమైన బిడ్డకు సురక్షితంగా జన్మనిచ్చింది.

ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్(పీఎంఎస్ఎంఏ)
గర్భిణులకు సకాలంలో అందే వైద్య సంరక్షణ సురక్షితమైన ప్రసవానికి, ప్రాణాంతక ఆరోగ్య ప్రమాదాల నివారణకు మధ్య పెద్ద వ్యత్యాసాన్ని చూపుతుంది. 2016లో ప్రారంభమైన పీఎంఎస్ఎంఏ ప్రతి నెల 9వ తేదీన ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో ఉచిత, నాణ్యమైన ప్రసవ పూర్వ తనిఖీలను అందించడం ద్వారా ఈ అవసరాన్ని తీరుస్తుంది. ఈ కార్యక్రమం ముఖ్యంగా గర్భధారణ రెండవ, మూడవ త్రైమాసికంలో ఉన్న మహిళలపై దృష్టి పెడుతుంది. ఇది అధిక ప్రమాదం ఉన్న గర్భాలను ముందుగానే గుర్తించి, తగిన చికిత్స అందించడానికి వీలు కల్పిస్తుంది.

కీలక విజయాలు, పరిధి:
- పీఎంఎస్ఎంఏ పథకం కింద 7.4 కోట్లకు పైగా గర్భిణులకు వైద్య పరీక్షలు
- 8,812 మంది స్వచ్ఛంద సేవకుల నమోదు
- దేశవ్యాప్తంగా పీఎంఎస్ఎంఏ సేవలను అందిస్తున్న 22 వేలకు పైగా కేంద్రాలు
- 6.85 కోట్లకు పైగా ప్రసవ పూర్వ తనిఖీలు, ప్రత్యేక పర్యవేక్షణ కోసం 1.03 కోట్ల అధిక ప్రమాదం ఉన్న గర్భాల గుర్తింపు
- పీఎంఎస్ఎంఏ అదనంగా అధిక ప్రమాదం ఉన్న గర్భాల కోసం డిజిటల్ ట్రాకింగ్, ఫాలో-అప్ మద్దతును కూడా ప్రవేశపెట్టింది.
- ఇది మాతృ మరణాల నిష్పత్తిని ప్రతి లక్ష సజీవ జననాలకు 88కి (2021-2023) గణనీయంగా తగ్గించింది. గతంలో ఇది (2014-15) 130 గా ఉండేది.

 


జనని సురక్షా యోజన(జేఎస్‌వై)
జనని సురక్షా యోజన జాతీయ ఆరోగ్య మిషన్ కింద షరతులతో కూడిన నగదు సహాయాన్ని, సామాజిక అవగాహనను అందిస్తుంది. ఈ పథకం పేద గర్భిణులు, ముఖ్యంగా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలు, ఎస్సీ/ఎస్టీ వర్గాల మహిళలు ఆసుపత్రులలో ప్రసవించేలా ప్రోత్సహిస్తుంది. ఆశా కార్యకర్తలు లబ్ధిదారులను ఆరోగ్య సేవలకు అనుసంధానించడంలో సహాయపడతారు. ఈ ఉమ్మడి ప్రయత్నాలు ఆసుపత్రి ప్రసవాలను పెంచాయి. ప్రసూతి ఆరోగ్య సంరక్షణను మెరుగుపరిచాయి. ఇంట్లో ప్రసవాల వల్ల వచ్చే ప్రమాదాలను తగ్గించాయి.

జనని శిశు సురక్షా కార్యక్రమం (జేఎస్‌ఎస్‌కే)
2014లో జేఎస్‌ఎస్‌కే పథకాన్ని ప్రసవ పూర్వ, ప్రసవానంతర గర్భధారణ సమస్యలన్నింటికీ వర్తింపజేశారు. చికిత్స కోసం ప్రభుత్వ ఆరోగ్య సంస్థలను ఆశ్రయించే అనారోగ్యంతో ఉన్న నవజాత శిశువులు, పిల్లలందరికీ (ఏడాది వయస్సు వరకు) ఇటువంటి అర్హతలను కల్పించారు. ఈ కార్యక్రమం సాధించిన ముఖ్యమైన విజయాలు:
- ఆర్థిక సంవత్సరం 2024-25లో జేఎస్‌ఎస్‌కే లబ్ధిదారులు: 1.99 కోట్ల మంది గర్భిణులు; 16.85 లక్షల మంది అనారోగ్యంతో ఉన్న శిశువులు.

ఈ పెట్టుబడులు స్పష్టమైన ఫలితాలను ఇస్తున్నాయి:
- మొదటి త్రైమాసిక ప్రసవ పూర్వ సంరక్షణ తనిఖీలు 59% (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్-4, 2015-16) నుంచి 76.2%కి (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్-6, 2023-24) పెరిగాయి.
- జాతీయ స్థాయిలో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ ప్రసవ పూర్వ సంరక్షణ(ఏఎన్‌సి) తనిఖీలను పూర్తి చేసిన మహిళల వాటా 51% (2015-16) నుంచి 65.2%కి (2023-24) పెరిగింది.
- ఆసుపత్రి ప్రసవాలు జాతీయ స్థాయిలో 79% (2015-16) నుంచి 90.6% కి (2023-24) గణనీయంగా పెరిగాయి.

విద్య, నైపుణ్యాలు, ఆకాంక్షల వృద్ధి
2014 నుంచి ఆడపిల్లల విద్య కేవలం పాఠశాల ప్రవేశాల స్థాయిని దాటి ముందుకు సాగింది. ప్రస్తుతం విద్యా నిరంతరాయత, ఉన్నత చదువులు, అర్థవంతమైన ఫలితాలపైనే దృష్టి కేంద్రీకరించింది. ఎక్కువ మంది ఆడపిల్లలు పాఠశాలల్లో కొనసాగుతూ, ఉన్నత విద్యలోకి ప్రవేశిస్తూ విలువైన నైపుణ్యాలను పొందుతున్నారు.

ఈ మార్పు జాతీయ విద్యా విధానం(ఎన్‌ఇపీ) 2020లో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ విధానం గతంలో ఆడపిల్లల విద్యా ప్రయాణాన్ని పరిమితం చేసిన వ్యవస్థాగత అడ్డంకులను తొలగిస్తుంది. విద్యా వ్యవస్థ అంతటా లింగ సమగ్రతను ఒక ప్రధాన సూత్రంగా చేర్చారు.
- జెండర్ ఇన్‌క్లూజన్ ఫండ్(లింగ సమగ్రత నిధి) వెనుకబడిన ఆడపిల్లలకు లక్ష్యిత మద్దతును అందిస్తుంది.
- సౌకర్యవంతమైన అభ్యాస మార్గాలు పాఠశాల మధ్యలో మానేసే వారి సంఖ్యను తగ్గిస్తాయి. నిరంతర విద్యా భాగస్వామ్యానికి మద్దతు ఇస్తాయి.
- బహుళ విద్యా విభాగాలు ఆడపిల్లలు తమకు నచ్చిన విభిన్న విద్యాంశాలను అభ్యసించడానికి అనుమతిస్తాయి.

పాఠశాల & పునాది విద్య
సమగ్ర శిక్ష, కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాలు
2018-19లో ప్రారంభమైన సమగ్ర శిక్ష పాఠశాల విద్యకు ఒక సమగ్ర విధానాన్ని అందిస్తుంది. ఇది ప్రీ-ప్రైమరీ నుంచి పన్నెండో తరగతి వరకు అభ్యాసాన్ని ఒకే సమగ్ర చట్రం కిందకు తెస్తుంది. ఈ పథకం పాఠశాల వ్యవస్థ అంతటా ప్రవేశాలు, మౌలిక సదుపాయాలు, డిజిటల్ అభ్యాసం, విద్యార్థులు పాఠశాలల్లో కొనసాగేలా చేయడాన్ని బలోపేతం చేసింది.

ఆడపిల్లలకు ఈ మెరుగుదలలు ఎంతో ముఖ్యమైనవి. సమీపంలోని పాఠశాలలు, పనిచేసే మరుగుదొడ్లు, సురక్షితమైన తరగతి గదులు, శిక్షణ పొందిన ఉపాధ్యాయులు, వసతి గృహాల మద్దతు వంటివన్నీ ఆడపిల్లల విద్య ప్రారంభ సంవత్సరాల తర్వాత కూడా కొనసాగుతుందా లేదా అనేదానిని ప్రభావితం చేస్తాయి.
- 2024-25లో భారతదేశంలో 14.71 లక్షల పాఠశాలలు, 1.01 కోట్ల మంది ఉపాధ్యాయులు, 24.69 కోట్ల మంది విద్యార్థులు ఉన్నారు. మహిళల నమోదు 2014-15 లో 1.57 కోట్లు(32%) ఉండగా, ఇప్పుడు అది 11.93 కోట్లకు(48%) పెరిగింది.
- 2018-19, 2025-26 మధ్యకాలంలో 4,073కి పైగా పాఠశాలలను అప్‌గ్రేడ్ చేశారు. స్మార్ట్ క్లాస్ రూమ్‌లతో సహా 1.49 లక్షలకు పైగా ఐసీటీ, డిజిటల్ లెర్నింగ్ కార్యక్రమాలకు మద్దతు లభించింది. నైపుణ్య విద్య కూడా క్రమంగా విస్తరించింది. వృత్తి విద్యా కోర్సులను అందించే పాఠశాలల సంఖ్య 9,477 నుంచి 25,000కి పెరిగింది. ఇది విద్యార్థులకు చిన్న వయస్సులోనే ఉపాధి నైపుణ్యాల అవగాహన కల్పించడానికి సహాయపడుతుంది.

నేడు పాఠశాల వాతావరణం ఆడపిల్లలకు ఎంతో అనుకూలంగా మారింది. 2024-25లో:
- 99.3% పాఠశాలల్లో తాగునీటి సదుపాయం ఉంది. 2014-15 లో 95.72% పాఠశాలల్లో తాగునీటి సౌకర్యం ఉండేది.
- 97.3% పాఠశాలల్లో బాలికల మరుగుదొడ్లు అందుబాటులో ఉన్నాయి. 2014-15 లో 92.09% పాఠశాలల్లో ప్రత్యేక బాలికల మరుగుదొడ్డి సౌకర్యం ఉండేది.
- 93.6% పాఠశాలల్లో విద్యుత్ సౌకర్యం ఉంది.
- 89.5% పాఠశాలల్లో గ్రంథాలయాలు ఉన్నాయి.

 



కాలక్రమేణా పాఠశాల విద్యలో నిరంతరాయత కూడా మెరుగైంది. ప్రాథమిక, మాధ్యమిక స్థాయిలలో పాఠశాల మధ్యలో మానేసే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది.

ఈ బలోపేతమైన వ్యవస్థలో కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాలు(కేజీబీవీలు) వసతి గృహాల విద్య అవసరమైన ఆడపిల్లలకు ప్రత్యేక మద్దతును అందిస్తాయి. ఇవి సమగ్ర శిక్ష చట్రంలో భాగం. ఇవి ముఖ్యంగా విద్యాపరంగా వెనుకబడిన బ్లాకులలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వంటి సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ఆడపిల్లలపై దృష్టి పెడతాయి. ఆరో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు వర్తించే ఈ వసతి గృహ పాఠశాలలు ఆడపిల్లలు ప్రాథమిక విద్య నుంచి ఉన్నత మాధ్యమిక విద్య వరకు నేర్చుకోవడానికి, పురోగమించడానికి అనుకూలమైన వాతావరణాన్ని అందిస్తాయి.

కేజీబీవీల విస్తృతి, పరిధి చెప్పుకోదగ్గవిగా ఉన్నాయి:
- పనిచేస్తున్న కేజీబీవీ పాఠశాలల సంఖ్య 4,996(2022) నుంచి 5,316(2026)కి పెరిగింది.
- విద్యార్థినుల నమోదు 6.07 లక్షల(2020-21) నుంచి 7.58 లక్షల(2025-26) కు పెరిగింది.

వసతి గృహ పాఠశాల నుంచి సివిల్ సర్వీసెస్ వరకు (ఉత్తరప్రదేశ్)
ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాకు చెందిన కుమారి నిధి తన విద్యా ప్రయాణాన్ని కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయంలో ప్రారంభించింది. అనేకమంది ఆడపిల్లల లాగే ఆమె కూడా అవకాశాలు పరిమితంగా ఉన్న నేపథ్యం నుంచి వచ్చింది. నిరంతర మద్దతు, క్రమశిక్షణతో కూడిన విద్యా వాతావరణంతో ఆమె తన చదువును కొనసాగించి, 2023 యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో 39వ ర్యాంక్ సాధించింది. ప్రస్తుతం ఆమె సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్(ఎస్‌డీఎం)గా సేవలందిస్తోంది. విద్యావకాశాలతో పాటు నిరంతర ప్రోత్సాహం తోడైతే ఎలాంటి అద్భుతాలు సాధించవచ్చో ఆమె ప్రయాణం నిరూపిస్తోంది.

పాఠశాల మైదానం నుంచి ప్రపంచ వేదిక వరకు(ఉత్తరప్రదేశ్)
ఉన్నావ్‌లోని కేజీబీవీ-గంజ్ మురాదాబాద్‌కు చెందిన అర్చన నిషాద్ చిన్న వయస్సులోనే క్రీడల్లో తన ప్రతిభను చాటుకుంది. పాఠశాల స్థాయిలో ప్రారంభమైన ఆమె క్రీడా ప్రయాణం క్రమంగా ఒక తీవ్రమైన లక్ష్యంగా మారింది. ఆమె 2023లో అండర్-19 మహిళల క్రికెట్ ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టులో సభ్యురాలిగా దేశానికి ప్రాతినిధ్యం వహించింది. సరైన సమయంలో లభించే ప్రోత్సాహం తరగతి గదిని దాటి ఎంతటి ఉన్నత శిఖరాలకు చేర్చుతుందో ఆమె ప్రయాణం తెలియజేస్తోంది.

ఉప‌కార వేత‌నాలు, ఆర్థిక సహాయం
ఎక్కువ మంది ఆడపిల్లలు పాఠశాల విద్యను పూర్తి చేస్తున్న తరుణంలో, ఉన్నత చదువులు వారికి అందుబాటులో ఉంచడానికి ఆర్థిక సహాయం ఎంతో కీలకమవుతోంది. కుటుంబాలపై అదనపు భారం పడకుండా యువతులు తమ చదువును కొనసాగించడానికి వివిధ ఉప‌కార వేత‌నాలు సహాయపడుతున్నాయి.

 


కళాశాల, విశ్వవిద్యాలయ విద్యార్థుల కోసం ఉద్దేశించిన సెంట్రల్ సెక్టర్ స్కాలర్‌షిప్ పథకం ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల ప్రతిభావంతులైన విద్యార్థులకు మద్దతు ఇస్తుంది. ఇందులో 50% స్కాలర్‌షిప్‌లు ఆడపిల్లలకే కేటాయించారు. 2023-24 లో ప్రారంభమైన నేషనల్ స్కాలర్‌షిప్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్ పథకం ద్వారా ఎంపికైన విద్యార్థులకు ఏడాదికి రూ.1.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఇందులో ఏటా 3,000 మంది మహిళలు లబ్ధి పొందుతున్నారు.

ఏఐసీటీఈ ప్రగతి స్కాలర్‌షిప్ సాంకేతిక విద్యలో మహిళలకు అవకాశాలను మరింత విస్తృతం చేస్తోంది. 2014-15 నుండి ఈ పథకం ద్వారా డిప్లొమా, డిగ్రీ కోర్సుల కోసం ఏటా 10,000 స్కాలర్‌షిప్‌లను అందిస్తున్నారు. 2024-25 నాటికి దాదాపు 36 వేల మంది విద్యార్థినులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు.

ఈ నిరంతర మద్దతు స్పష్టమైన ఫలితాలను ఇస్తోంది. 2014-15 నుంచి 2022-23 మధ్య కాలంలో ఉన్నత విద్యలో అదనంగా 12 లక్షల మందికి పైగా మహిళలు చేరారు.

సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్(స్టెమ్‌) & ఉన్నత విద్యలో మహిళలు
చాలాకాలం వరకు సైన్స్, టెక్నాలజీ రంగాలు చాలా మంది ఆడపిల్లలకు దూరంగా అనిపించేవి. మహిళలకు అవకాశాలను విస్తృతం చేయడం ద్వారా స్టెమ్ రంగాల్లోకి వారు సులభంగా ప్రవేశించే మార్గాలు ఏర్పడ్డాయి.

విజ్ఞాన్ జ్యోతి పథకం 9 నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థినులకు మార్గదర్శకత్వం, ల్యాబ్ ప్రయోగాలు, వర్క్‌షాప్‌లు, నిరంతర మద్దతు ద్వారా స్టెమ్ సబ్జెక్టులపై ఆసక్తిని పెంపొందిస్తోంది. 2019 డిసెంబర్‌లో ప్రారంభమైన ఈ పథకం 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని 300 జిల్లాలలో 1.12 లక్షల మందికి పైగా ఆడపిల్లలకు చేరువైంది.

ప్రతిష్టాత్మక సంస్థలలో ప్రవేశాలు కూడా మెరుగయ్యాయి. ఐఐటీలు, ఎన్‌ఐటీలలో అదనపు (సూపర్‌న్యూమరరీ) సీట్లను కేటాయించడం వల్ల మహిళల భాగస్వామ్యం 10% లోపు నుంచి 20% పైగా పెరిగింది. అలాగే 2024-25 లో స్టెమ్ సబ్జెక్టులలో యూజీసీ నెట్-జేఆర్‌ఎఫ్ సాధించిన వారిలో 53% పైగా మహిళలే ఉన్నారు.

 

 


నైపుణ్యాలు, డిజిటల్ సమ్మేళనం
2014 నుంచి విస్తరిస్తున్న నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు, పెరుగుతున్న అంకుర సంస్థ‌ల‌ వ్యవస్థ మద్దతుతో ఎక్కువ మంది మహిళలు ఆధునిక రంగాలలోకి ప్రవేశిస్తున్నారు.

నైపుణ్యాలు, ఉపాధి: ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన(పీఎంకేవీవై)
విద్య మహిళలకు అవకాశాలను విస్తృతం చేసినప్పటికీ, ఆ అవకాశాలను జీవనోపాధిగా మార్చడం అనేది సరైన నైపుణ్యాలు, పరిశ్రమల అవగాహనపై ఆధారపడి ఉంటుంది. 2015లో ప్రారంభమైన ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన(పీఎంకేవీవై) ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో ముడిపడి ఉన్న స్వల్పకాలిక, పరిశ్రమల అవసరాలకు అనుగుణమైన శిక్షణను అందించడం ద్వారా ఈ మార్పులో కీలక పాత్ర పోషించింది. పీఎంకేవీవై లబ్ధిదారులలో దాదాపు 45% మంది మహిళలే ఉన్నారు.

ఈ కార్యక్రమం వివిధ దశల్లో నిరంతరాయంగా విస్తరించింది:
- పీఎంకేవీవై 1.0: 19 లక్షల మందికి పైగా అభ్యర్థులకు శిక్షణ
- పీఎంకేవీవై 2.0: 1.10 కోట్లకు పైగా అభ్యర్థులకు శిక్షణ
- పీఎంకేవీవై 3.0: దాదాపు 7.35 లక్షల మంది అభ్యర్థులకు శిక్షణ

ప్రస్తుత దశ అయిన పీఎంకేవీవై 4.0 ప్రాక్టికల్, భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడే నైపుణ్యాలపై దృష్టి పెట్టింది. ఈ శిక్షణలో ప్రత్యక్ష పని అనుభవంతో పాటు కృత్రిమ మేధ‌, డ్రోన్లు, గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్ వంటి ఆధునిక రంగాలు ఉన్నాయి. గత మూడేళ్లలోనే పిఎమ్‌కెవివై 4.0 కింద 27 లక్షల మందికి పైగా అభ్యర్థులు శిక్షణ పొందగా, 18.79 ల‌క్ష‌ల‌ మంది ధ్రువీకరణ పత్రాలు అందుకున్నారు.

యువతుల కోసం ప్రత్యేక నైపుణ్య శిక్షణ: నవ్య
నవ్య(నర్చరింగ్ ఆస్పిరేషన్స్ త్రూ వొకేషనల్ ట్రైనింగ్ ఫర్ యంగ్ అడోలసెంట్ గర్ల్స్) కార్యక్రమం పీఎంకేవీవై 4.0 కింద 16-18 సంవత్సరాల వయస్సు గల బాలికలపై దృష్టి పెడుతుంది. 2025లో ప్రారంభమైన ఈ కార్యక్రమం యువతులకు డిజిటల్ మార్కెటింగ్, సైబర్ సెక్యూరిటీ, ఏఐ ఆధారిత సేవలు, పర్యావరణ అనుకూల ఉద్యోగాలపై అవగాహన కల్పిస్తుంది. ఇది జీవిత నైపుణ్యాలను, ఆర్థిక పరిజ్ఞానాన్ని పెంపొందించడానికి కూడా సహాయపడుతుంది.

ఈ చొరవ 19 రాష్ట్రాలలోని 27 ఆశావ‌హ‌, ఈశాన్య జిల్లాలలో అమలు అవుతోంది. దీని ద్వారా 3,850 మంది బాలికలకు శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

2025 డిసెంబర్ నాటికి:
1,295 మంది బాలికల నమోదు
671 మంది బాలికలకు శిక్షణ పూర్తి

గౌరవప్రదమైన ఆరోగ్యం, పోషకాహారం, సంక్షేమం
మహిళల ఆరోగ్యం కోసం చేపట్టిన జీవితకాల విధానంలో భాగంగా భారతదేశం మానసిక ఆరోగ్యంతో సహా సరసమైన ధరల్లో వైద్య సేవలను విస్తరిస్తోంది, పోషకాహార మద్దతును బలోపేతం చేస్తోంది. స్వచ్ఛమైన వంట గ్యాస్ వంటి సౌకర్యాల ద్వారా దైనందిన జీవితంలో వారి ఆత్మగౌరవాన్ని పెంపొందిస్తోంది. ఈ ప్రయత్నాలు మహిళలు, వారి కుటుంబాల కోసం ఆరోగ్యకరమైన, మరింత సమానత్వంతో కూడిన సమాజాన్ని నిర్మించాలనే విస్తృత నిశ్చయానికి ప్రతిబింబంగా నిలుస్తున్నాయి.

ఆయుష్మాన్ భారత్
ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకమైన ఆయుష్మాన్ భారత్ 2018లో ప్రారంభమైంది. ఇది దేశవ్యాప్తంగా మహిళలకు సరసమైన ధరల్లో, నాణ్యమైన ఆరోగ్య సేవలను అందించడంలో గణనీయమైన మార్పు తీసుకువచ్చింది. ఈ సమగ్ర పథకంలోని నాలుగు విభాగాలు కలిసి ప్రాథమిక, ద్వితీయ, తృతీయ స్థాయిలలో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా చూస్తాయి.

ఆయుష్మాన్‌ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన(ఏబీ-పీఎంజేఏవై) నగదు రహిత ద్వితీయ, తృతీయ స్థాయి వైద్య సేవలను అందిస్తూ ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల భారాన్ని తగ్గిస్తుంది. 2026 ఫిబ్రవరి నాటికి దేశవ్యాప్తంగా ఏబీ-పీఎంజేఏవై కింద 43.52 కోట్లకు పైగా ఆయుష్మాన్ కార్డులు మంజూర‌య్యాయి. వీటిలో మహిళల వాటా దాదాపు 49% అంటే 21 కోట్లుగా ఉంది.

ఈ పథకం కింద మొత్తం 36,229 ఆసుపత్రులు నమోదయ్యాయి. వీటిలో 19,483 ప్రభుత్వ, 16,746 ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయి. ఆసుపత్రి ప్రవేశాలలో సుమారు 48% మంది మహిళా లబ్ధిదారులే ఉన్నారు. ఇప్పటివరకు ఈ పథకం కింద 4.97 కోట్లకు పైగా మహిళలు ఆసుపత్రులలో చేరి ఉచిత వైద్య చికిత్స పొందారు.

ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్(ఏఏఎం) అనేవి గ్రామీణ, పట్టణ, గిరిజన ప్రాంతాలలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు. ఇవి ప్రజలు నివసించే ప్రాంతాలకు సమీపంలోనే సమగ్రమైన, ఉచిత సేవలను అందిస్తాయి. దేశవ్యాప్తంగా 1.84 లక్షలకు పైగా ఆయుష్మాన్ ఆరోగ్య‌ మందిరాలు అందుబాటులో ఉన్నాయి(2026 ఫిబ్రవరి 27 నాటికి).

ఈ కేంద్రాలు మహిళలకు ప్రసూతి సంరక్షణ, అంటువ్యాధులు కాని రోగాల నిర్ధారణ పరీక్షలు, పునరుత్పత్తి ఆరోగ్య సంరక్షణ, ముందస్తు ఆరోగ్య రక్షణ సేవలను అందిస్తాయి.

పీఎం-ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్(పీఎం-అభిమ్) అనేది క్షేత్రస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి ఉద్దేశించిన భారతదేశ అతిపెద్ద కార్యక్రమాలలో ఒకటి. ఇది ప్రతి జిల్లాలో ఆయుష్మాన్ ఆరోగ్య‌ మందిరాలు, బ్లాక్, జిల్లా ప్రజారోగ్య కేంద్రాలు, ల్యాబ్‌లు, క్రిటికల్ కేర్ హాస్పిటల్ బ్లాక్‌లను స్థాపించడం, అప్‌గ్రేడ్ చేయడంపై దృష్టి పెడుతుంది.

ఇది వైద్య సదుపాయాలు సరిగ్గా లేని ప్రాంతాలలోని మహిళలకు సకాలంలో ఆరోగ్య సేవలు అందేలా చేస్తుంది. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్(ఏబీడీఎం) దేశవ్యాప్తంగా ఒక ఉమ్మడి డిజిటల్ ఆరోగ్య వ్యవస్థను సృష్టిస్తుంది. ఇది రోగులు తమ వైద్య రికార్డులను ఆభా ఖాతాల ద్వారా డిజిటల్ రూపంలో సురక్షితంగా దాచుకోవడానికి, చూసుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఇది దూర ప్రాంతాల వైద్యులతో సంప్రదింపులు జరపడానికి టెలి-కన్సల్టేషన్ సదుపాయాన్ని అందిస్తుంది. దేశవ్యాప్తంగా 95 కోట్లకు పైగా ఆరోగ్య రికార్డులను డిజిటల్ పద్ధతిలో అనుసంధానించారు. ఈ ఖాతాలలో మహిళలు 49.75% మంది ఉన్నారు. ఈ డిజిటల్ ఆరోగ్య వ్యవస్థ రికార్డులను సులభంగా పొందేలా చేస్తూ ముఖ్యంగా మహిళలకు ఎంతో మేలు చేస్తోంది.

సక్షమ్ అంగన్‌వాడీ, పోషణ్ 2.0
ప్రారంభ దశలో లభించే పోషకాహారం, సంరక్షణ పిల్లలు, తల్లుల దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని, అభ్యసన ఫలితాలను ప్రభావితం చేస్తాయి. సక్షమ్ అంగన్‌వాడీ, పోషణ్ 2.0 పథకాలు పిల్లలు (0-6 సంవత్సరాలు), యుక్తవయస్సు బాలికలు, గర్భిణులు, పాలిచ్చే తల్లులకు సమగ్ర పోషకాహారం, ఆరోగ్యం, బాల్యదశ సంరక్షణ సేవల ద్వారా ఈ మద్దతు వ్యవస్థను బలోపేతం చేస్తాయి.

ఈ కార్యక్రమాలు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అనుబంధ పోషకాహారం, ప్రీ-స్కూల్ విద్య, రోగనిరోధక టీకాలు, ఆరోగ్య పరీక్షలు, నిపుణుల వద్దకు పంపే సేవలను అందిస్తాయి. క్షేత్రస్థాయిలో ఈ సేవలను మరింత బలోపేతం చేయడానికి మౌలిక సదుపాయాలు, క్షేత్రస్థాయి సిబ్బందిపై పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు.

ముఖ్యమైన చర్యలు:
- 1.03 ల‌క్ష‌ల‌ అంగన్‌వాడీ కేంద్రాలను మెరుగైన మౌలిక సదుపాయాలు, ఆడియో విజువల్ పరికరాలు, స్మార్ట్ లెర్నింగ్ సాధనాలతో సక్షమ్ అంగన్‌వాడీలుగా ఆధునికీక‌రించారు.
- 10.58 ల‌క్ష‌ల‌ మంది అంగన్‌వాడీ కార్యకర్తలకు పోషకాహారం, ప్రారంభ బాల్యదశ సంరక్షణ, విద్య(ఈసీసీఈ)లో శిక్షణ ఇచ్చారు.
- తల్లి పోషకాహారం, శిశువులకు పాలు పట్టడం, తీవ్రమైన పోషకాహార లోపం(ఎస్ఏఎం), మధ్యస్థ పోషకాహార లోపం(ఎంఏఎం) ఉన్న పిల్లల చికిత్సపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు.
- సమతుల్య ఆహారం, ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, సూక్ష్మపోషకాలను ప్రోత్సహించేలా పోషకాహార నిబంధనలను సవరించారు.
- జాతీయ విద్యా విధానం 2020కి అనుగుణంగా ఆటల ఆధారిత ప్రారంభ అభ్యసనాన్ని ప్రోత్సహించే ‘పోషణ్ భీ పఢాయ్ భీ’ కార్యక్రమం తెచ్చారు.
- అంగన్‌వాడీ కేంద్రాలలో డిజిటల్ లెర్నింగ్ కంటెంట్, ఈసీసీఈ వనరుల వినియోగాన్ని పెంచారు.

మిషన్ ఇంద్రధనుష్
2014 డిసెంబర్‌లో ప్రారంభమైన మిషన్ ఇంద్రధనుష్, తీవ్రమైన ప్రమాదాలు ఉన్న జిల్లాలు, పట్టణ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెడుతూ టీకాలు తీసుకోని లేదా పాక్షికంగా తీసుకున్న జనాభాను లక్ష్యంగా చేసుకుంది.

ఈ కార్యక్రమం సార్వత్రిక రోగనిరోధక కార్యక్రమం కింద క్రమబద్ధమైన టీకాలను బలోపేతం చేస్తూ ప్రాణాంతక వ్యాధుల నుండి రక్షణ కల్పిస్తుంది. యు-విన్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు లబ్ధిదారులు, వ్యాక్సినేషన్ స్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి వీలు కల్పిస్తాయి. 2026 మార్చి 18 వరకు 11.87 కోట్లకు పైగా పిల్లలు, 3.96 కోట్ల మంది గర్భిణులు ఈ పోర్టల్‌లో నమోదయ్యారు. 5.46 కోట్ల మంది పిల్లలు, 1.32 కోట్ల మంది గర్భిణులు వ్యాక్సిన్ల ద్వారా నివారించదగిన వ్యాధులకు టీకాలు తీసుకున్నారు. 2026 ఫిబ్రవరి 17 నాటికి 8.73 కోట్ల మంది మహిళలకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పరీక్షలు నిర్వహించారు.

ఆర్థిక సమ్మేళనం, ఆర్థిక సాధికారత
గత 12 ఏళ్లలో ప్రభుత్వం మహిళల ఆర్థిక సమ్మేళనం, సాధికారతను పెంపొందించడంపై గట్టి శ్రద్ధ పెట్టింది, ఎందుకంటే ఆర్థిక వనరులు అందుబాటులో ఉండటం ప్రాథమిక హక్కు అని గుర్తించింది. వివిధ రకాల ఆర్థిక కార్యక్రమాలు మహిళలకు బ్యాంక్ ఖాతాలు, రుణాలు, పొదుపు, వ్యాపార మద్దతును విస్తృతం చేస్తూ లక్షలాది మందిని అధికారిక ఆర్థిక వ్యవస్థలోకి తీసుకువచ్చాయి.

సుకన్య సమృద్ధి యోజన
సుకన్య సమృద్ధి యోజన ఆడపిల్లల భవిష్యత్తు కోసం పొదుపు చేయడాన్ని మరింత క్రమబద్ధంగా, సురక్షితంగా మార్చింది. బేటీ బచావో బేటీ పడావో ప్రచారంలో భాగంగా ప్రభుత్వం 2015 లో ఈ పథకాన్ని ప్రారంభించింది. కుటుంబాలు 10 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న ఆడపిల్లల కోసం పోస్టాఫీసులు, అధీకృత బ్యాంకులలో ఖాతాలను తెరవవచ్చు.

కనీసం రూ.250 డిపాజిట్‌తో ప్రారంభమయ్యే ఈ ఖాతా వార్షికంగా 8.2% వడ్డీని పొందుతుంది. సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపులు కూడా ఉన్నాయి. ఉన్నత విద్య, వివాహం కోసం పాక్షికంగా డబ్బు విత్‌డ్రా చేసుకోవడానికి కూడా అనుమతిస్తారు.

గడిచిన సంవత్సరాలలో ఈ పథకం కింద ఖాతాలు, డిపాజిట్లు రెండూ బలంగా పెరిగావు. ఇది అధికారిక పొదుపు మార్గాల ద్వారా ఆడపిల్లల విద్య, భవిష్యత్తు కోసం పెరుగుతున్న ఆర్థిక ప్రణాళికను ప్రతిబింబిస్తుంది.

డీఏవై-ఎన్‌ఆర్‌ఎల్‌ఎం(స్వయం సహాయక సంఘాల వ్యవస్థ)
గ్రామీణ ప్రాంతాలలో మహిళలకు అధికారిక రుణాలు, మార్కెట్లు, ఆర్థిక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు తక్కువగా ఉండేవి. స్వయం సహాయక సంఘాలు(ఎస్‌హెచ్‌జీలు) ఉమ్మడి పొదుపు, రుణ సదుపాయం, పరస్పర మద్దతు ద్వారా ఈ సమస్యను పరిష్కరించడానికి సహాయపడ్డాయి.

గత దశాబ్ద కాలంలో దీన్‌దయాళ్ అంత్యోదయ యోజన - జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్(డీఏవై-ఎన్ఆర్ఎల్ఎం) ఈ నమూనాను మహిళల నేతృత్వంలోని ఆర్థిక భాగస్వామ్య జాతీయ వేదికగా విస్తరించింది. ఈ కార్యక్రమం ఇప్పుడు దేశవ్యాప్తంగా 7,627 బ్లాకులను కవర్ చేస్తూ 1.51 కోట్ల మంది కమ్యూనిటీ క్యాడర్ సభ్యులను తయారు చేసింది.

డీఏవై-ఎన్ఆర్ఎల్ఎం
విస్తరణతో పాటు ఆర్థిక సమ్మేళనం కూడా పెరిగింది. స్వయం సహాయక సంఘాలు ₹12.18 లక్షల కోట్లకు పైగా బ్యాంక్ రుణాలను పొందాయి. 50,548 మందికి పైగా శిక్షణ పొందిన బ్యాంక్ సఖీలు మహిళలకు బ్యాంకింగ్ సేవలు, లావాదేవీలు, రుణాల లభ్యతలో మద్దతు ఇస్తున్నారు.

కృషి సఖీలు, పశు సఖీల వంటి కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్ల ద్వారా జీవనోపాధి మద్దతు కూడా విస్తరించింది, వీరు వ్యవసాయ, పశుసంవర్ధక కార్యకలాపాలలో సహాయం అందిస్తారు. అదే సమయంలో, స్టార్టప్ విలేజ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్(ఎస్‌వీఈపీ) కింద 5.88 లక్షలకు పైగా పరిశ్రమలకు మద్దతు లభించింది. ఇది మహిళలు మరింత స్థిరమైన ఆదాయాన్ని ఇచ్చే కార్యకలాపాల వైపు సాగడానికి సహాయపడింది.

లఖ్‌పతి దీదీ పథకం
గత దశాబ్ద కాలంలో మహిళల నేతృత్వంలోని స్వయం సహాయక సంఘాలు(ఎస్‌హెచ్‌జీలు) గ్రామీణ ఆర్థిక భాగస్వామ్యంలో ఒక ప్రధాన శక్తిగా మారాయి. లఖ్‌పతి దీదీ కార్యక్రమం మహిళలు కనీసం ₹1 లక్ష స్థిరమైన వార్షిక ఆదాయాన్ని సాధించడంలో సహాయపడటంపై దృష్టి పెడుతుంది.

దీనిని మరింత ముందుకు తీసుకెళ్తూ ఈ కార్యక్రమం ఇప్పుడు 34 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు, 757 జిల్లాలు, 7,193 బ్లాకులు, 2.56 లక్షల పంచాయతీలు, 5.94 లక్షల గ్రామాలకు విస్తరించింది. ఈ విస్తృత ఉనికికి 10.07 కోట్ల మంది సభ్యులతో కూడిన 93.85 లక్షల ఎస్‌హెచ్‌జీల బలమైన వ్య‌వ‌స్థ‌ మద్దతు ఇస్తోంది. ప్రభుత్వం 6 కోట్ల మంది లఖ్‌పతి దీదీలను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ సంఘాలు పొదుపు, రుణాలు, జీవనోపాధి, సామాజిక మద్దతును విస్తృతం చేశాయి, దీనివల్ల మహిళలు స్థానిక ఆర్థిక వ్యవస్థలలో, కుటుంబ నిర్ణయాలలో మరింత చురుకుగా పాల్గొనగలుగుతున్నారు.

ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన
గతంలో బ్యాంక్ ఖాతా కలిగి ఉండటం అందరికీ, ముఖ్యంగా మహిళలకు సాధ్యమయ్యేది కాదు. పొదుపు మొత్తాలు తరచుగా నగదు రూపంలో అధికారిక వ్యవస్థకు వెలుపలే ఉండిపోయేవి, ప్రాథమిక ఆర్థిక సేవలు అందేవి కావు. ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన బ్యాంకింగ్‌ను సరళంగా, అందరికీ అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఈ పరిస్థితిని మార్చింది.

2014 లో ప్రారంభమైన ఈ పథకం జీరో-బ్యాలెన్స్ ఖాతాలను తెరవడం, కుటుంబాలను అధికారిక బ్యాంకింగ్‌తో అనుసంధానించడంపై దృష్టి పెట్టింది. కాలక్రమేణా ఇది ఆర్థిక సమ్మేళనానికి పునాదిగా మారింది, పొదుపు, రుణాలు, భీమా, ప్రత్యక్ష నగదు బదిలీల లభ్యతను సులభతరం చేసింది.

ప్రధానమంత్రి ముద్రా యోజన (పీఎంఎంవై)
చాలామంది మహిళా వ్యవస్థాపకులకు అధికారిక రుణాలు లభించకపోవడమే వ్యాపారాన్ని ప్రారంభించడానికి లేదా విస్తరించడానికి అతిపెద్ద అడ్డంకిగా ఉండేది. 2015లో ప్రారంభమైన ప్రధానమంత్రి ముద్రా యోజన (పీఎంఎంవై) ఈ లోటును తీరుస్తుంది. సూక్ష్మ, చిన్న పరిశ్రమల కోసం ఈ పథకం శిశు, కిషోర్, తరుణ్, తరుణ్ ప్లస్ వంటి విభాగాల ద్వారా పూచీకత్తు లేని రుణాలను అందిస్తుంది. ఈ వర్గీకరణ పరిశ్రమల వివిధ వృద్ధి దశలు, ఆర్థిక అవసరాలను తీరుస్తుంది.

మంజూరైన మొత్తం రుణాలు 2015-16 లో రూ.3.49 కోట్లు ఉండగా, 2026 మార్చి నాటికి అవి రూ.57.79 కోట్లకు పెరిగాయి. అలాగే మంజూరైన మొత్తం సొమ్ము 2015-16 లో రూ.1.37 లక్షల కోట్లు ఉండగా, 2026 మార్చి నాటికి రూ.40.07 ల‌క్ష‌ల కోట్ల‌కు చేరింది.
గత కొన్నేళ్ల‌లో ఈ పథకం మహిళల నేతృత్వంలోని వ్యవస్థాపకతకు ప్రధాన చోదక శక్తిగా అవతరించింది.

ప్రధానమంత్రి వీధి వ్యాపారుల ఆత్మనిర్భర్ నిధి(పీఎం స్వనిధి) పథకం
పట్టణ ప్రాంతాలలోని చాలా మంది మహిళా వీధి వ్యాపారులకు కోవిడ్ మహమ్మారి ఆదాయాన్ని దెబ్బతీసింది. చిన్న వ్యాపారాలను ప్రమాదంలో పడేసింది. వర్కింగ్ క్యాపిటల్(పనిచేసే మూలధనం) మద్దతు ద్వారా వారు తమ వ్యాపారాలను తిరిగి ప్రారంభించడానికి, స్థిరపడటానికి 2020 జూన్‌లో పీఎం స్వనిధిని ప్రవేశపెట్టారు. ఈ పథకం పూచీకత్తు లేని వర్కింగ్ క్యాపిటల్ రుణాలు, అధికారిక ఆర్థిక సేవలను కల్పిస్తూ వీధి వ్యాపారులకు మద్దతు ఇస్తుంది.

ఈ పథకం మొదటి విడతలో రూ.15,000 వరకు రుణాలు అందిస్తుంది, సకాలంలో తిరిగి చెల్లిస్తే రూ.25,000, రూ.50,000 వరకు ఎక్కువ రుణ అర్హత లభిస్తుంది. వ్యాపారులకు 7% వడ్డీ రాయితీ, డిజిటల్ క్యాష్‌బ్యాక్ ప్రోత్సాహకాలు, యూపీఐ ఆధారిత రూపే క్రెడిట్ కార్డులు కూడా లభిస్తాయి.

గత ఆరేళ్లలో 1.15 కోట్లకు పైగా రుణాలు మంజూరు కాగా, దాదాపు 74.9 లక్షల మంది వీధి వ్యాపారులు లబ్ధి పొందారు. ఈ పథకం లబ్ధిదారులలో మహిళలు 46% మంది ఉన్నారు.

స్టాండ్-అప్ ఇండియా
2016 ఏప్రిల్‌లో ప్రారంభమైన స్టాండ్-అప్ ఇండియా మహిళలు కొత్త పరిశ్రమలను స్థాపించడానికి అధికారిక రుణాలను పొందేలా చేస్తుంది. ఇది వివిధ రంగాలలో చిన్న కార్యకలాపాల నుండి పెద్ద, క్రమబద్ధమైన వ్యాపారాల వైపు వారి మార్పుకు మద్దతు ఇస్తుంది. మహిళలు రూ.10 లక్షల నుంచి రూ.కోటి వరకు రుణాలు పొందవచ్చు. స్వతంత్ర వ్యాపారాలను ప్రారంభించడం లేదా విస్తరించడం సులభతరం చేయడానికి మొరటోరియం కాలంతో సహా ఏడేళ్ల వరకు తిరిగి చెల్లించే గడువు ఉంటుంది.

స్టాండ్-అప్ ఇండియా పోర్టల్ దరఖాస్తు మార్గదర్శకత్వం, శిక్షణ అనుసంధానాలు, మార్గదర్శకత్వంతో మహిళలకు మద్దతు ఇస్తుంది. ఈ పథకం కింద మహిళల నేతృత్వంలోని పరిశ్రమల స్థాపన క్రమంగా విస్తరించింది.
ఈ పథకం 2025 మార్చి వరకు అమలులో ఉంది. ఆ సమయానికి ఇది 2.05 లక్షల మందికి పైగా మహిళా వ్యవస్థాపకులకు మద్దతు ఇచ్చింది. మహిళల ఖాతాలు 2018లో 55 వేల పైచిలుకు నుంచి 2024 నాటికి 1.90 లక్షలకు పెరిగాయి. అదే సమయంలో మంజూరైన మొత్తం రూ.12 కోట్ల పైచిలుకు నుంచి దాదాపు రూ.44 కోట్లకు చేరింది.

నమో డ్రోన్ దీదీ యోజన
ఆధునిక వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుకోవడంలో నమో డ్రోన్ దీదీ పథకం ద్వారా మహిళలు ఇప్పుడు ముందు వరుసలో ఉంటున్నారు. 2023 నవంబర్‌లో ప్రారంభమైన ఈ పథకం స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీలు) మహిళల చేతుల్లోకి నేరుగా అధునాతన సాధనాలను అందిస్తుంది.

ఎరువులు, పురుగుమందులు చల్లడం వంటి పనుల కోసం డ్రోన్లను నడపడంలో మహిళలకు శిక్షణ ఇస్తారు. ఇది వ్యవసాయ పనులలో సామర్థ్యాన్ని పెంచడంతో పాటు వారికి కొత్త ఆదాయ వనరును సృష్టిస్తుంది.
ప్రభుత్వం 2023-24 నుంచి 2025-26 కాలానికి రూ.1,261 కోట్ల వ్యయంతో ఈ పథకానికి ఆమోదం తెలిపింది. ఇది మహిళా ఎస్‌హెచ్‌జీలకు 15,000 డ్రోన్లను అందించడం ద్వారా మహిళల నేతృత్వంలోని వ్యవసాయ సేవల వ్య‌వ‌స్థ‌ను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2023-24లో ఎస్‌హెచ్‌జీల డ్రోన్ దీదీలకు 1094 డ్రోన్లను పంపిణీ చేశారు. ఎంపికైన మహిళలందరికీ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) అధీకృత రిమోట్ పైలట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్లలో శిక్షణ ఇచ్చారు. ఇది వ్యవసాయంలో మహిళల పాత్రలో ఒక పెద్ద మార్పును సూచిస్తుంది.

వుమనియా(జీఈఎం)
మహిళా వ్యవస్థాపకులకు, ముఖ్యంగా ఎస్‌హెచ్‌జీలు లేదా చిన్న పరిశ్రమల ద్వారా పనిచేసే వారికి మార్కెట్ సదుపాయాలు చాలా పరిమితంగా ఉండేవి. వుమనియా చొరవ గవర్నమెంట్ ఇ-మార్కెట్‌ప్లేస్(జీఈఎం) ద్వారా మహిళలను నేరుగా ప్రభుత్వ కొనుగోళ్లతో అనుసంధానించడం ద్వారా ఈ సమస్యను పరిష్కరిస్తుంది.

2019లో ప్రారంభమైన ఈ చొరవ మహిళలు తమ హస్తకళలు, చేనేత వస్త్రాలు, గృహ అలంకరణ వస్తువుల వంటి ఉత్పత్తులను ప్రదర్శించడానికి, విక్రయించడానికి ప్రత్యేక డిజిటల్ వేదికను సృష్టిస్తుంది. ఈ వస్తువులను భారతదేశంలో ఎక్కడైనా కేంద్ర మంత్రిత్వ శాఖలు, పీఎస్‌యూలు నేరుగా కొనుగోలు చేయవచ్చు. ఇది దళారులను తొలగించి అధికారిక మార్కెట్లలో ప్రత్యక్ష భాగస్వామ్యానికి వీలు కల్పిస్తుంది.

ఈ పథకం విస్తృతి మహిళల బలమైన ఆదరణను ప్రతిబింబిస్తుంది:
- జీఈఎంలో 2.1 లక్షలకు పైగా మహిళల నేతృత్వంలోని పరిశ్రమల నమోదు
- 2025-26 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 13.7 లక్షల ఆర్డర్లు
- 2024-25 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 27.60% వృద్ధితో మహిళల నేతృత్వంలోని పరిశ్రమలకు రూ.28,000 కోట్లకు పైగా కాంట్రాక్ట్ విలువ కేటాయింపు
వుమనియా ఒక బలమైన వ్యవస్థగా ఎదిగింది. జీఈఎం మొత్తం ఆర్డర్ విలువలో 5.6% వాటాను సాధించి, నిర్దేశిత 3% కొనుగోలు లక్ష్యాన్ని అధిగమించింది.

సెల్ఫ్ హెల్ప్ ఎంటర్‌ప్రెన్యూర్ మార్ట్(షీ-మార్ట్)
రుణాలు, నైపుణ్యాలు అందుబాటులో ఉన్నప్పటికీ చాలా మంది గ్రామీణ మహిళలు ఇప్పటికీ తమ ఉత్పత్తులను విక్రయించడంలో సవాళ్లను ఎదుర్కొంటున్నారు. కేంద్ర బడ్జెట్ 2026-27లో ప్రకటించిన షీ-మార్ట్స్ పథకం ఎస్‌హెచ్‌జీ వ్యవస్థ కింద మహిళల కోసం ప్రత్యేక రిటైల్ విక్రయ కేంద్రాలను సృష్టించడం ద్వారా ఈ సమస్యను పరిష్కరిస్తుంది.

ఇవి ఎస్‌హెచ్‌జీ ఫెడరేషన్ల ద్వారా నిర్వహించే సామాజిక యాజమాన్య కేంద్రాలుగా ప్రణాళిక చేశారు. ఇవి మహిళలు నేరుగా వినియోగదారులకు విక్రయించడానికి, వారి ఉత్పత్తుల గుర్తింపును మెరుగుపరచడానికి, దళారులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి అనుమతిస్తాయి.

ఈ చొరవ ద్వారా కోటి మంది మహిళలకు లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రయత్నం మహిళలు చిన్న తరహా జీవనోపాధి కార్యకలాపాల నుండి స్థిరమైన పరిశ్రమల యాజమాన్యం, నిర్వహణ వైపు సాగడానికి వీలు కల్పిస్తుంది.

రక్షణ, భద్రత, గౌరవం, జీవన ప్రమాణాలు
2014 నుంచి ప్రభుత్వం భద్రత, గౌరవాన్ని దైనందిన జీవన నాణ్యతతో ముడిపెడుతూ మహిళా సాధికారతకు మరింత విస్తృతమైన విధానాన్ని అవలంబించింది. గృహ వసతి, పారిశుధ్యం, స్వచ్ఛమైన నీరు, ఇతర అవసరమైన సేవలను విస్తరిస్తూనే వ్యవస్థాగత మద్దతును బలోపేతం చేయడంపై దృష్టి పెట్టారు.

ఈ చర్యలు భద్రతను మెరుగుపరిచాయి, దైనందిన కష్టాలను తగ్గించాయి. ముఖ్యంగా వెనుకబడిన వర్గాల మహిళలకు మరింత అనుకూలమైన పరిస్థితులను సృష్టించాయి.

మిషన్ శక్తి: ఒక సమగ్ర చట్రం
2022 ఏప్రిల్ నుంచి అమలులో ఉన్న మిషన్ శ‌క్తి.. దేశవ్యాప్తంగా మహిళల భద్రత, రక్షణ, సాధికారతను నిర్ధారించడానికి వ్యవస్థలను బలోపేతం చేస్తోంది. ఇది సంబల్(భద్రత), సమర్థ్య(సాధికారత) అనే రెండు విభాగాల ద్వారా తక్షణ మద్దతును, దీర్ఘకాలిక సామర్థ్య పెంపొందింపును మిళితం చేస్తుంది.
సంబల్ కింద ఉన్న ముఖ్యమైన విభాగాలు:
వన్ స్టాప్ సెంటర్లు(ఓఎస్సీలు)
మహిళా హెల్ప్‌లైన్(181)
నారీ అదాలత్

సమర్థ్య కింద ఉన్న కొన్ని ముఖ్యమైన విభాగాలు:
శక్తి సదన్
సఖి నివాస్
జాతీయ క్రెచ్ పథకం(పాలనా)
సంకల్ప్: హెచ్‌ఈడబ్ల్యూ(మహిళా సాధికార‌ కేంద్రం)

క్షేత్రస్థాయి మద్దతును బలోపేతం చేయడం:
- దేశవ్యాప్తంగా 973 వన్ స్టాప్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయి
- ఈ కేంద్రాల ద్వారా 14.49 లక్షలకు పైగా మహిళలకు సహాయం
- 24 గంటల సహాయాన్ని అందించే మహిళా హెల్ప్‌లైన్(181) ద్వారా 3 కోట్లకు పైగా మహిళలకు మద్దతు
- వేగవంతమైన స్పందన కోసం అత్యవసర స్పందన మద్దతు వ్యవస్థ(112)తో అనుసంధానం

న్యాయం, పోలీసు సేవలను సులభతరం చేయడం:
- భారతదేశంలోని పోలీసు స్టేషన్లలో 15,000 కి పైగా మహిళా సహాయక డెస్క్‌ల ఏర్పాటు. దీనివల్ల అందుబాటులో ఉండ‌టం, నమ్మకం పెరిగాయి
- అత్యవసర స్పందన వ్యవస్థ(112) సాంకేతిక పరిజ్ఞానం ద్వారా తక్షణ సహాయాన్ని నిర్ధారిస్తుంది

సామాజిక, డిజిటల్ వేదిక‌లు:
- మధ్యవర్తిత్వం ద్వారా స్థానిక వివాదాల పరిష్కారం కోసం గ్రామ పంచాయతీ స్థాయిలో నారీ అదాలత్‌లు
- కార్యాలయాల్లో వేధింపులపై ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయడానికి వీలు కల్పించే షీ-బాక్స్ పోర్టల్
- సమస్యల పరిష్కారాన్ని వేగవంతం, సులభతరం చేస్తున్న డిజిటల్ వేదిక‌లు

ఈ ఉమ్మడి చర్యలు మహిళలకు సకాలంలో సహాయం అందేలా చూస్తూ, వ్యవస్థలపై నమ్మకాన్ని పెంచుతూ, వారికి సురక్షితమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి.

స్వచ్ఛ భారత్ మిషన్(ఎస్‌బీఎం)
స్వచ్ఛ భారత్ మిషన్ సురక్షితమైన పారిశుద్ధ్య‌ సదుపాయాలను మెరుగుపరచడం ద్వారా మహిళల ఆరోగ్యం, రక్షణ, ఆత్మగౌరవంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది. 2014 అక్టోబర్‌లో ప్రారంభమైన ఈ కార్యక్రమం గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో బహిరంగ మలవిసర్జనను నిర్మూలించడం, వ్యర్థాల నిర్వహణను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టింది.

కీలక విజయాలు:
- 2019 అక్టోబర్‌లో దేశవ్యాప్తంగా బహిరంగ మలవిసర్జన రహిత (ఓడీఎఫ్) స్థితి విజయవంతంగా సాధన
- స్వచ్ఛ భారత్ మిషన్ (పట్టణ) కింద 6.3 లక్షలకు పైగా సామూహిక, ప్రజా మరుగుదొడ్ల నిర్మాణం
- స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ) కింద 2.7 లక్షలకు పైగా సామూహిక పారిశుధ్య కాంప్లెక్స్‌ల నిర్మాణం
- గ్రామీణ ప్రాంతాలలోని ప్రతి మహిళ, ప్రతి కుటుంబ ఆరోగ్యం, సంక్షేమాన్ని పెంపొందిస్తూ దాదాపు 16 కోట్ల కుటుంబాలకు స్వచ్ఛమైన తాగునీటి కొళాయిల సౌకర్యం కల్పన
- 12 కోట్లకు పైగా వ్యక్తిగత గృహ మరుగుదొడ్ల నిర్మాణం
- 5 లక్షలకు పైగా గ్రామాలు ఓడీఎఫ్ ప్లస్ (మోడల్) గ్రామాలుగా ప్రకటన. ఓడీఎఫ్ ప్లస్ గ్రామమంటే తన బహిరంగ మలవిసర్జన రహిత స్థితిని కొనసాగిస్తూ, ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణను నిర్ధారిస్తూ, దృశ్యపరంగా శుభ్రంగా ఉండే గ్రామమని అర్థం.
- ఘన వ్యర్థాల నిర్వహణ ఏర్పాట్లు కలిగిన గ్రామాలు 5.3 లక్షలకు పైగా, ద్రవ వ్యర్థాల నిర్వహణ ఏర్పాట్లు కలిగిన గ్రామాలు 5.4 లక్షలకు పైగా ఉన్నాయి.

ప్రధానమంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై)
ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్హులైన గ్రామీణ, పట్టణ కుటుంబాలకు ప్రాథమిక వసతులతో కూడిన పక్కా ఇళ్లను అందించడం ద్వారా "అందరికీ ఇల్లు" లక్ష్యాన్ని సాధించాలని నిర్దేశించుకుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన-పట్టణ (పీఎంఏవై-యు) 2015లో ప్రారంభమైంది. దీనిని అనుసరిస్తూ 2016లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ(పీఎంఏవై-జీ) ప్రారంభమైంది.

ప్రధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ కింద 2026 మార్చి నాటికి 4.15 కోట్ల ఇళ్లు కేటాయించగా, 3.90 కోట్ల ఇళ్లకు ఆమోదం లభించింది. రూ.4.03 లక్షల కోట్లకు పైగా ఆర్థిక సహాయంతో 2.99 కోట్ల ఇళ్ల నిర్మాణం పూర్తయింది.

కీలక విజయాలు:
- పీఎంఏవై-యు 2.0 కింద 96% ఇళ్లు మహిళలకే కేటాయింపు
- మంజూరైన మొత్తం ఇళ్లు – 125.31 లక్షలు
- నిర్మాణ పనులు ప్రారంభమైన ఇళ్లు – 119.35 లక్షలు
- పూర్తయిన మొత్తం ఇళ్లు – 98.10 లక్షలు

ప్రధానమంత్రి ఉజ్వల యోజన(పీఎంయూవై)
2016 మే నెలలో ప్రారంభమైన ఈ పథకం పేద కుటుంబాల మహిళలకు డిపాజిట్ లేని ఎల్‌పీజీ కనెక్షన్లను అందిస్తూ, స్వచ్ఛమైన వంట గ్యాస్ వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. ఇది గృహాల లోపల వాయు కాలుష్యాన్ని తగ్గించి మహిళల ఆరోగ్యం, రక్షణ, మొత్తం జీవన ప్రమాణాలను మెరుగుపరచాలని లక్ష్యంగా పెట్టుకుంది. దశాబ్ద కాలంలో ఈ పథకం దేశవ్యాప్తంగా లక్షలాది మంది జీవితాలను మార్చివేసింది. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలలో ఎల్‌పీజీ నిరంతర వినియోగాన్ని నిర్ధారించడానికి ఈ పథకం రీఫిల్ మద్దతును, లక్ష్యిత సబ్సిడీలను కూడా అందిస్తుంది.
- పీఎంయూవై కింద మంజూరు చేసిన మొత్తం ఎల్‌పీజీ కనెక్షన్లు (2026 మే 14 నాటికి): 10.55 కోట్లు
- పీఎంయూవై కింద అదనంగా నిర్దేశించిన 25 లక్షల ఎల్‌పీజీ కనెక్షన్ల లక్ష్యంలో భాగంగా, 22.42 లక్షల కనెక్షన్లు మంజూరయ్యాయి (2026 మే 4 నాటికి).

జల్‌జీవన్ మిషన్(జేజేఎం)
2019 ఆగస్టులో ప్రారంభమైన జల్‌జీవన్ మిషన్ ప్రతి ఇంటికీ పనిచేసే తాగునీటి కుళాయి కనెక్షన్లను (హర్ ఘర్ జల్) అందించడం ద్వారా మహిళల దైనందిన జీవితాన్ని గణనీయంగా మెరుగుపరిచింది. అనేక ఏళ్లుగా నీటిని సేకరించే బాధ్యతను మహిళలు, ఆడపిల్లలే మోస్తున్నారు. దీనికోసం వారు తరచుగా సుదూర ప్రాంతాలకు ప్రయాణిస్తూ రోజుకు కొన్ని గంటల సమయాన్ని కేటాయించాల్సి వచ్చేది.

గ్రామీణ ప్రాంతాలలోని ప్రతి మహిళ, ప్రతి కుటుంబ ఆరోగ్యం, సంక్షేమాన్ని పెంపొందిస్తూ దాదాపు 15.84 కోట్ల కుటుంబాలకు స్వచ్ఛమైన తాగునీటి కుళాయిల సౌకర్యం లభించింది. జల్‌జీవన్ మిషన్ ఈ శారీరక శ్రమను తగ్గించింది. దీనివల్ల మహిళలు విద్యాభ్యాసం, ఆదాయాన్ని ఇచ్చే కార్యకలాపాలు, కుటుంబ సంరక్షణ కోసం తమ సమయాన్ని తిరిగి పొందే వీలు కలిగింది. గ్రామీణ ప్రాంతాలలో 100% తాగునీటి కుళాయి కనెక్షన్లను సాధించాలనే లక్ష్యంతో ఈ మిషన్‌ను 2028 వరకు పొడిగించారు.

సుదూర ప్రయాణాల నుంచి శాశ్వత మార్పు వైపు: తాగునీటి కుళాయి ద్వారా రక్షణ పొందిన లక్ష్మి ముర్ము ప్రయాణం
పశ్చిమబెంగాల్‌లో గ్రామీణ ప్రాంతానికి చెందిన లక్ష్మి ముర్ము విజయగాథ. మహిళల జీవితాలపై ఈ మిషన్ చూపిన విప్లవాత్మక ప్రభావాన్ని వివరిస్తుంది. గతంలో లక్ష్మి నీటిని సేకరించడానికి ప్రతిరోజూ చాలా దూరం నడవాల్సి వచ్చేది. ఇది శారీరకంగా ఎంతో శ్రమతో కూడుకున్నది. ఎక్కువ సమయం తీసుకునే పని కావడంతో ఆమె ఆరోగ్యాన్ని దెబ్బతీసింది. ఆదాయాన్ని ఇచ్చే పనులలో పాల్గొనే అవకాశాలను పరిమితం చేసింది. ఈ మిషన్ కింద ఇంటికే పనిచేసే తాగునీటి కుళాయి కనెక్షన్(ఎఫ్‌హెచ్‌టీసీ) రావడంతో, ఇప్పుడు ఆమె కుటుంబానికి సురక్షితమైన తాగునీరు అందుబాటులోకి వచ్చింది. ఇది ఆమె దైనందిన శ్రమను గణనీయంగా తగ్గించింది. ఆరోగ్యాన్ని, సంక్షేమాన్ని మెరుగుపరిచింది. ఉత్పాదక పనుల కోసం సమయాన్ని ఆదా చేసింది. నీరు వంటి ప్రాథమిక వసతులు అందుబాటులోకి రావడం వల్ల ఎలాంటి అర్ధవంతమైన సామాజిక, ఆర్థిక సాధికారత సాధ్యమవుతుందో ఈ మార్పు నిరూపించింది.

భాగస్వామ్యం, ప్రాతినిధ్యం, నిర్ణయాధికారం
గత దశాబ్ద కాలంలో పాలన, ప్రజా జీవితంలో మహిళల భాగస్వామ్యం నిరంతరం విస్తరించింది. ఈ మార్పు కేవలం ఓటింగ్ సరళిలోనే కాకుండా అన్ని రంగాలు, సంస్థలలో నాయకత్వం, ప్రాతినిధ్యం, నిర్ణయాధికార పాత్రలలో స్పష్టంగా కనిపించింది.

2024లో 47 కోట్లకు పైగా నమోదైన ఓటర్లతో మహిళలు మొత్తం ఓటర్లలో 48.62%గా ఉన్నారు. వారి ఓటింగ్ శాతం 65.78%గా నమోదైంది. ఇది పురుషుల కంటే కొంచెం ఎక్కువ. ఎన్నికల బరిలో అభ్యర్థులుగా మహిళల భాగస్వామ్యం కూడా పెరిగి, 2024 లో దాదాపు 10% కి చేరింది.

చట్టసభలలో మహిళల ఉనికి కాలక్రమేణా మరింత స్పష్టంగా మారింది. 2024 లో 75 మంది మహిళలు లోక్‌సభకు ఎన్నికయ్యారు. రాజ్యసభ సభ్యులలో కూడా మహిళలు దాదాపు 17% మంది ఉన్నారు.

అత్యంత స్పష్టమైన మార్పు క్షేత్రస్థాయిలో జరిగింది. ఇప్పుడు 14.5 లక్షలకు పైగా మహిళలు పంచాయతీరాజ్ సంస్థలలో ఎన్నికైన ప్రజాప్రతినిధులుగా సేవలందిస్తున్నారు. ఇది మొత్తం సభ్యులలో దాదాపు 46% కి సమానం. వారి నాయకత్వం తాగునీరు, పారిశుధ్యం, పోషకాహారం, పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ వంటి సమస్యలపై ప్రత్యేక శ్రద్ధను బలోపేతం చేసింది.

2023లో తెచ్చిన నారీ శక్తి వందన్ అధినియమం మరొక ముఖ్యమైన అడుగు. ఈ చట్టం లోక్‌సభ, రాష్ట్ర విధానసభలలో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించింది. ఇది చట్టసభలలో మహిళల ప్రాతినిధ్యానికి బలమైన చట్రాన్ని సృష్టించింది.

జాతీయ సంస్థలలో కూడా మహిళల భాగస్వామ్యం విస్తరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. 2025లో 17 మంది మహిళా క్యాడెట్ల మొదటి బ్యాచ్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ(ఎన్‌డీఏ) నుంచి విద్యను పూర్తి చేసుకుని ఉత్తీర్ణులయ్యారు. ఇది సాయుధ దళాలలో ఒక చరిత్రాత్మక మైలురాయి. 2022లో మహిళలు ఎన్‌డీఏలోకి ప్రవేశించినప్పటి నుంచి వచ్చిన పెద్ద మార్పు ఆధారంగా ఈ చేరిక సాధ్యమైంది. 2026 ప్రారంభం నాటికి మొత్తం 158 మంది మహిళా క్యాడెట్లు అకాడమీలో చేరారు.

ఈ మార్పులన్నీ కలిసి ఒక విస్తృత పరిణామాన్ని ప్రతిబింబిస్తున్నాయి. మహిళలు కేవలం భాగస్వామ్యం వహించే స్థాయి నుంచి ప్రాతినిధ్యం, నాయకత్వం వహించే స్థాయికి ఎదిగారు. ఇది పాలనను మరింత సమగ్రంగా, దైనందిన వాస్తవాలకు ప్రతినిధిగా మార్చింది.

వికసిత్ భారత్‌కు పునాదిగా నారీశక్తి
గత 12 ఏళ్లలో మహిళా సాధికారతపై ప్రభుత్వం నిరంతరం పెట్టిన శ్రద్ధ సామాజిక సంక్షేమాన్ని ఒక ప్రాథమిక రక్షణ వలయం నుండి నాయకత్వం, ఆత్మగౌరవం, అవకాశాలను పెంపొందించే వేదికగా మార్చింది.

భారతదేశం 2047 నాటికి వికసిత్ భారత్(అభివృద్ధి చెందిన భారతదేశం) లక్ష్యం వైపు సాగుతున్న తరుణంలో ఈ ప్రయాణంలో మహిళల పాత్ర మరింత కీలకమవుతోంది. అన్ని రంగాలలో మహిళలు కార్మికులుగా, వ్యవస్థాపకులుగా, రైతులుగా, ఆవిష్కర్తలుగా, నాయకులుగా తమ సహకారాన్ని అందిస్తున్నారు. వారి భాగస్వామ్యం స్థానిక ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేస్తోంది, కుటుంబాల స్థితిస్థాపకతను మెరుగుపరుస్తోంది. సామాజిక నిర్ణయాలను ప్రభావితం చేస్తోంది.

మహిళలకు విద్య, ఆదాయం, నిర్ణయాధికార అవకాశాలు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చూసింది. ఈ ప్రభావం వారి కుటుంబాలు, సమాజాలు, భావి తరాలకు విస్తరిస్తోంది.

వ్యవస్థాపకత నుంచి క్షేత్రస్థాయి పాలన వరకు, ఇళ్ల నుంచి కార్యాలయ బోర్డు రూమ్‌ల వరకు, నారీశక్తి మరింత బలం, స్వేచ్ఛ, స్పష్టమైన సంకల్పంతో ముందుకు సాగుతోంది. వికసిత్ భారత్ ఈ దేశ మహిళలకు సేవ చేయడమే కాకుండా, వారి నేతృత్వంలో న‌డుస్తోంది.

 

***

(Explainer ID: 158860) आगंतुक पटल : 34
Provide suggestions / comments
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , हिन्दी , Marathi , Assamese , Bengali , Gujarati , Tamil , Kannada , Malayalam