Social Welfare
పీఎం స్వనిధి: మనుగడ నుంచి స్వావలంబన దిశగా శక్తివంతమైన అడుగు
Posted On:
30 MAY 2026 12:05PM
భారతదేశంలోని అసంఘటిత పట్టణ ఆర్థిక వ్యవస్థలోని వ్యాపారులకు మద్దతుగా పీఎం స్వనిధి ఒక ముఖ్య మద్దతు పథకం ఆవిర్భవించింది. ఈ పథకం పూచీకత్తు అవసరం లేని రుణాలను అందించడమే కాకుండా, డిజిటల్ వినియోగాన్ని ప్రోత్సహించింది. సంస్థాగత రుణాల లభ్యతను మెరుగుపరిచి, సామాజిక భద్రతా పరిధిని విస్తరించింది. 2020లో ప్రారంభమైనప్పటి నుంచి, ఇప్పటికే 1.12 కోట్లకు పైగా రుణాలను అందించింది. ఈ పథకం నగరాలు, పట్టణాలలో 75 లక్షలకు పైగా లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చింది. ఈ పథకం ద్వారా రూ. 17,800 కోట్లకు పైగా విలువైన రుణాలను అందించడం జరిగింది. దీని ప్రభావం కేవలం అధికారిక గణాంకాలలో మాత్రమే కాకుండా, మరింత పటిష్టమైన, స్థిరమైన జీవనోపాధిని నిర్మించుకుంటున్న వ్యాపారుల రోజువారీ ప్రయాణంలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది.

భారతదేశ వీధి వ్యాపారుల పరివర్తనాత్మక కథ
రద్దీగా ఉండే మార్కెట్లో కూరగాయలు అమ్మేవారు, బిజీగా ఉండే ఆఫీసు బయట టీ అమ్మేవారు భారతీయ నగరాల్లో మనకు సుపరిచితమైన దృశ్యాలు. వీధుల్లో తిరిగి బండి పై పండ్లు అమ్మేవారు, రోడ్డు పక్కన చెప్పులు కుట్టేవారు కూడా రోజువారీ పట్టణ జీవితంలో అంతే ముఖ్యమైనవారు. వీరంతా కలిసి ప్రతిరోజూ భారతదేశ పట్టణ ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపిస్తున్నారు. వీరంతా స్థానిక మార్కెట్లను, పరిసర ప్రాంతాల సరఫరా గొలుసులను నిలబెడుతూ, సరసమైన ధరలకు వస్తువులను, నిత్యావసర సేవలను అందిస్తున్నారు. అయితే, వీరికి అధికారిక రుణాలు పరిమితంగా అందుబాటులో ఉండటం కారణంగా చాలా వరకు వ్యాపారులు అధిక వడ్డీ రేట్లకు అనధికారిక రుణాలపై ఆధారపడవలసి వచ్చింది. వీరి సమస్యలను పరిష్కరించేందుకు, ప్రభుత్వ హామీతో కూడిన రుణ మద్దతుతో వీధి వ్యాపారులపై దృష్టి సారించిన మొట్టమొదటి సూక్ష్మ-రుణ పథకంగా ప్రధానమంత్రి వీధి వ్యాపారుల ఆత్మనిర్భర్ నిధి (పీఎం స్వనిధి)ని జూన్ 2020లో ప్రారంభించారు. వీధి వ్యాపారులకు “స్వరోజ్గార్, స్వావలంబన్, స్వాభిమాన్” అందించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ రోజు, పిఎం స్వనిధి ఒక సాధారణ రుణ పథకం స్థాయిని దాటి, భారతదేశ అసంఘటిత రంగంలోని లక్షలాది మందికి ఆర్థిక సాధికారతను, డిజిటల్ సమ్మిళితను, సామాజిక భద్రతను పెంపొందించే ఒక దేశవ్యాప్త ఉద్యమంగా పరిణామం చెందింది.
గడిచిన ఏళ్లుగా, ఈ పథకం 75.5 లక్షలకు పైగా లబ్ధిదారులకు రూ.17,800 కోట్లకు పైగా విలువైన 1.12 కోట్లకు పైగా రుణాలను అందించి, దేశవ్యాప్తంగా ఉన్న నగరాలు, పట్టణాలలో గణనీయమైన వృద్ధిని సాధించింది. ఈ పథకం కింద 55 లక్షలకు పైగా లబ్ధిదారులు డిజిటల్గా విధానంలో నమోదయ్యారు. వీరంతా దాదాపు రూ.8.96 లక్షల కోట్ల విలువైన 841 కోట్లకు పైగా డిజిటల్ లావాదేవీలను నిర్వహించారు. పీఎం స్వనిధి దారా డిజిటల్ క్యాష్బ్యాక్ ప్రోత్సాహకాలు, వడ్డీ రాయితీల ద్వారా సుమారు రూ.800 కోట్లను లబ్ధిదారులు అందుకున్నారు. సాధించిన బలమైన విజయాలు, కొలవదగిన ప్రభావాన్ని దృష్ట్యా, ఈ పథకాన్ని మార్చి 2030 వరకు పొడిగించారు.

పీఎం స్వనిధి పథక ముఖ్య లక్షణాలు
- మూలధన నిర్వహణ రుణాలు: పూచీకత్తు లేని రూ.15,000, రూ. 25,000, మరియు రూ.50,000 రుణాలను వడ్డీ రాయితీ, రుణ హామీ మద్దతుతో మూడు విడతలుగా అందిస్తారు.
- యూపీఐ-అనుసంధానిత రూపే క్రెడిట్ కార్డ్లు: రెండవ విడతను విజయవంతంగా తిరిగి చెల్లించిన విక్రేతలు రూ.30,000 వరకు పరిమితి గల యూపీఐ-అనుసంధానిత రూపే క్రెడిట్ కార్డ్లకు అర్హులు.
- డిజిటల్ స్వీకరణ: డిజిటల్ స్వీకరణ, ఆర్థిక అక్షరాస్యతను ప్రోత్సహించేందుకు, చిల్లర/మొత్త వ్యాపార డిజిటల్ లావాదేవీలపై వీధి వ్యాపారులకు రూ.1,600 వరకు క్యాష్బ్యాక్ ప్రోత్సాహకాలు అందిస్తున్నారు.
- స్వనిధి సే సమృద్ధి (SSS): లబ్ధిదారులను మరియు వారి కుటుంబాలను ఎంపిక చేసిన ఎనిమిది కేంద్ర సంక్షేమ పథకాలతో అనుసంధానించి, సమగ్ర సామాజిక భద్రతా అందించి, సామాజిక-ఆర్థిక భరోసాను కల్పిస్తున్నారు.
- సామర్థ్య నిర్మాణం మరియు వ్యవస్థాపకత అభివృద్ధి: ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సహకారంతో విక్రేతలకు ఆర్థిక, డిజిటల్ అక్షరాస్యత, మరియు ఆహార భద్రత, పరిశుభ్రత వంటి అంశాలలో శిక్షణ ఇస్తున్నారు.
పీఎం స్వనిధి పథకం ప్రభావం
2023 మరియు 2025లో పీఎం స్వనిధి పై స్వతంత్ర ప్రభావ అంచనాలను నిర్వహించారు. ఈ అధ్యయనాలు ఈ క్రింది ముఖ్యమైన మెరుగుదలలను తెలియజేస్తున్నాయి.
ఆర్థిక సాధికారత
ఈ పథకం దేశవ్యాప్తంగా వ్యాపారుల వ్యాపార స్థిరత్వాన్ని బలోపేతం చేసి, వారి ఆదాయాలను మెరుగుపరిచింది. పీఎం స్వానిధి కింద దాదాపు 95% లబ్ధిదారులు తొలిసారిగా అధికారిక సంస్థాగత రుణాన్ని పొందారు. వారిలో సుమారు 30% మంది ఆ తర్వాత స్వనిధి రుణాలకు మించి అదనపు రుణాన్ని కూడా పొందారు. ఇది వారి రుణ అర్హత మెరుగుపడటాన్ని, ఆర్థిక సమ్మిళితత్వాన్ని ప్రతిబింబిస్తోంది. లబ్ధిదారుల ఆదాయాలు కూడా సగటున దాదాపు 20% వార్షిక పెరుగుదలను నమోదు చేశాయి.
కుటుంబ సంక్షేమంలో మెరుగుదల
పీఎం స్వనిధి పథకం కింద లభించిన ఆర్థిక ప్రయోజనాలు లబ్ధిదారుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో గణనీయంగా దోహదపడ్డాయి. ఈ పథకం మెరుగైన కుటుంబ స్థిరత్వానికి, అలాగే పోషకాహారం, ఆరోగ్య సంరక్షణ, విద్య వంటి అంశాల అందుబాటుకు తోడ్పడ్డాయి.
పీఎం స్వనిధి పథకం బలహీన పట్టణ వర్గాలలో సామాజిక సమ్మిళితాన్ని కూడా బలోపేతం చేసింది. ఈ పథకం కింద లబ్ధిదారులలో దాదాపు 46% మంది మహిళలు ఉన్నారు. ఇది బలమైన లింగ సమానత్వాన్ని చాటుతుంది. సుమారు 70% మంది అట్టడుగు వర్గాలకు చెందినవారు, ఇది ఈ పథక సమ్మిళిత విస్తరణను ప్రముఖంగా తెలియజేస్తుంది.
స్థితిస్థాపకత మరియు సాధికారత స్వరాలు
గణాంకాలు, రుణ పంపిణీల వెనుక పట్టుదల, ధైర్యం, నూతన ఆకాంక్షల కథలు ఉన్నాయి. చాలా మంది వ్యాపారులకు, ఒకప్పుడు అసాధ్యంగా భావించిన స్థిరత్వం, వృద్ధి, అవకాశాలకు పీఎం స్వనిధి మార్గం సుగమం చేసింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఈ అనుభవాలు, సకాలంలో అందించే సహాయం చిన్న వ్యాపారాలు కోలుకోవడానికి, పరిస్థితులకు అనుగుణంగా మారడానికి, మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు ఏవిధంగా తోడ్పడుతుందో తెలియజేస్తున్నాయి.
చిన్న స్టాల్ నుంచి దుకాణం వరకు

బబితా శర్మ, ఘజియాబాద్లోని నందగ్రామ్కు చెందిన ఈమె ఒక స్థానిక ఆలయం వద్ద పూజా సామాగ్రిని అమ్మే ఒక చిన్న దుకాణాన్ని నిర్వహిస్తుంది. ప్రతిరోజూ ఇక్కడకు వచ్చే భక్తులు అగరబత్తులు, దీపాలు, పువ్వులు, కొబ్బరికాయలు, పూజకు అవసరమైన ఇతర వస్తువులను కొనేందుకు ఆమె దుకాణానికి వస్తుంటారు. ఈ వ్యాపారం ఆమె కుటుంబాన్ని పోషణకు సహాయపడినప్పటికీ, పరిమిత నిధుల కారణంగా ఆమె తన వ్యాపార విస్తరణకు, వినియోగదారుల డిమాండ్ను తీర్చడం తరచుగా కష్టంగా ఉండేది. జూలై 2020లో, పట్టణ స్థానిక సంస్థ అధికారుల ద్వారా ఆమెకు పీఎం స్వనిధి పథకం గురించి తెలిసింది. దీనిని తన జీవనోపాధిని మెరుగుపరుచుకునే అవకాశంగా ఆమె భావించి, ఈ పథకం కింద రుణం కోసం దరఖాస్తు చేసుకున్నారు. మొదటి పీఎం స్వనిధి రుణం పొందిన తర్వాత, ఆమె ఆ డబ్బుతో అదనపు సరుకును కొనుగోలు చేని, దుకాణంలో మరిన్ని ఉత్పత్తులను ప్రవేశపెట్టేందుకు పెట్టుబడిగా ఉపయోగించారు. ఈ ఉత్పత్తులు ఎక్కువ మంది వినియోగదారులను ఆకర్షించాయి. ఇది ఆమె రోజువారీ అమ్మకాలు, ఆదాయాన్ని పెంచడంలో సహాయపడింది. తన వ్యాపారంలో వచ్చిన మెరుగైన ప్రోత్సాహంతో ఆమె రుణాన్ని సకాలంలో చెల్లించి. రెండవ విడతకు అర్హతను సాధించింది. ఆమె ఈ రుణాన్ని ఒక బండిని కొనుగోలు చేసేందుకు, తన విక్రయ ఏర్పాట్లను మెరుగుపరిచేందకు ఉపయోగించుకున్నారు.
వ్యాపార పరిధులను విస్తరించడం

తిరువనంతపురానికి చెందిన శాంతి ఆర్, దశాబ్దానికి పైగా ఎండు చేపల వ్యాపారం ద్వారా తన కుటుంబానికి ప్రధాన పోషకురాలిగా ఉన్నారు. పీఎం స్వనిధికి ముందు, ఆమె అధిక వడ్డీతో కూడిన సూక్ష్మ రుణాలపై ఆధారపడుతూ, వాటి వారపు వాయిదాలను చెల్లించడం కూడా కష్టంగా ఉండేంది. ఈ ఆర్థిక ఇబ్బందులు ఆమె వ్యాపార వృద్ధిని పరిమితం చేసి, రోజువారీ కార్యకలాపాలను ప్రభావితం చేశాయి. పీఎం స్వనిధి ద్వారా సులభంగా అందుబాటులోకి వచ్చిన సంస్థాగత రుణం, శాంతికి తన కార్యకలాపాలను క్రమంగా బలోపేతం చేసుకోవడానికి సహాయపడింది. ఆమె వ్యాపారం స్థిరపడటంతో, వీధి వ్యాపారం నుంచి ఎండు చేపల ప్యాకింగ్ చేసి స్థానిక దుకాణాలకు సరఫరా చేసే స్థాయికి తన వ్యాపారాన్ని విస్తరించారు. ఈ పథకం కింద శాంతి మొదటి విడతగా రూ.10,000, ఆ తర్వాత మూడవ విడతగా వరకూ రూ.50,000 రుణం పొందారు. ఇది నగదు ప్రవాహాన్ని మెరుగుపరిచి, సరుకు నిల్వలను మరింత సమర్థవంతంగా నిర్వహించేలా ఆమెకు సహాయపడింది. ఆమెకు జనవరి 2026లో స్వనిధి క్రెడిట్ కార్డ్ కూడా లభించింది, ఇది ఆమె వృద్ది చెందుతున్న వ్యాపార కార్యకలాపాలను మరింత బలోపేతం చేసింది. మహిళా పారిశ్రామికవేత్తలు తమ వ్యాపారాలను విస్తరించుకోవడానికి మరియు స్థిరమైన జీవనోపాధిని సృష్టించుకోవడానికి పీఎం స్వనిధి ఎలా సహాయపడుతుందో ఆర్. శాంతి అనుభవం స్పష్టం చేస్తుంది.
సవాలును అవకాశంగా మార్చుకోవడం

గౌహతిలోని నూన్మతి రద్దీ వీధుల్లో, ఒకప్పుడు సెవాలి కలితా తన నలుగురు సభ్యులు గల కుటుంబాన్ని పోషించేందుక ఒక చిన్న పాన్ స్టాల్ నడిపేవారు. కష్టకాలంలో, జీవనం కోసం ఆమె పొరుగువారి దగ్గర కూడా రుణాన్ని తీసుకున్నారు. గౌహతి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో జరిగిన ఒక సంభాషణ వల్ల సెవాలికి పీఎం స్వానిధి గురించి తెలుసుకున్నారు. రూ.10,000 రుణంతో, సెవాలి తనలోని వ్యాపార స్ఫూర్తిని మేల్కొల్పారు. మహమ్మారి సమయంలో సేంద్రియ కూరగాయలకు పెరుగుతున్న డిమాండ్ను ఆమె గుర్తించారు. ఆమె స్థానికంగా తాజా ఉత్పత్తులను సేకరించి, తన పాన్ స్టాల్ పక్కనే వాటిని అమ్మడం ప్రారంభించారు. వ్యాపారం మెరుగుపడటంతో, సెవాలి తన పిల్లలను తిరిగి పాఠశాలలో చేర్పించి, క్రమంగా తన వ్యాపారాన్ని విస్తరించారు. ఆమె వరుసగా రూ.20,000 మరియు రూ.50,000 అదనపు రుణాలను కూడా పొందారు. ఈ ఆర్థిక సహాయం ఆమెకు రుణాలను తీర్చేందుకు, అదనపు సరుకు నిర్వహణకు, ప్రత్యేకంగా కూరగాయల స్టాల్ ప్రారంభించేందుకు వీలు కల్పించింది. నేడు, సెవాలి గౌహతిలో తన భర్తతో కలిసి ఒక విజయవంతమైన వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. ఆమె ఇప్పుడు తన అభివృద్ధి చెందుతున్న వ్యాపారం నుంచి నెలకు దాదాపు రూ.8,000 లాభాలను ఆర్జిస్తున్నారు. ఆమె సాధించిన ప్రగతి పట్టుదల, అవకాశానికి ఒక శక్తివంతమైన ఉదాహరణగా నిలుస్తుంది.
చిన్న రుణం, పెద్ద మార్పు: ఒక వీధి వ్యాపారి జీవితంలో పరివర్తన

30 ఏళ్ల బీ.కామ్ విద్యార్థి అయిన యోగరాజ్ మాలి, గాంధీనగర్లో చోళఫలి అమ్ముతూ వీధి ఆహార వ్యాపారం నడిపేవారు. దురదృష్టవశాత్తు, కోవిడ్-19 మహమ్మారి అతని వ్యాపారాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. అయితే, పీఎం స్వానిధి పథకం కింద అందిన రుణంతో అతనికి వ్యాపార ఆశలు చిగురించాయి. ఆ రుణం అతని వ్యాపారాన్ని పునరుద్ధరించడమే కాకుండా, వారు ఇకపై ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడటంతో అతనికి, అతని కుటుంబానికి అపారమైన ఆనందాన్ని ఇచ్చింది. ఆ రుణంతో, యోగరాజ్ డిజిటల్ చెల్లింపులను స్వీకరించి, క్యాష్బ్యాక్ రివార్డుల ప్రయోజనాన్ని పొందారు. అదనంగా, అతను ప్రధాన మంత్రి సురక్షా బీమా, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా, మరియు శ్రమ్యోగి మన్ ధన్ యోజన వంటి ఇతర ప్రభుత్వ పథకాలను కూడా ఉపయోగించుకున్నారు. లభించిన మద్దతుకు కృతజ్ఞతలు తెలుపుతూ, కష్టకాలంలో, ముఖ్యంగా తమను ఎవరూ పట్టించుకోవడం లేదని భావించే వారికి ప్రభుత్వం ఒక అండగా నిలుస్తుందని యోగరాజ్ అంగీకరించారు.
రుణానికి అతీతంగా: మారుతున్న పట్టణ దృశ్యం
రద్దీగా ఉండే మార్కెట్ల నుంచి ఇరుకైన రోడ్ల పక్క సందుల వరకు, పీఎం స్వనిధి పథకం దేశవ్యాప్తంగా లెక్కలేనన్ని రోజువారీ ప్రయాణాలను నిశ్శబ్దంగా మార్చివేసింది. ఈ పథకం వ్యాపారులు తిరిగి వారి వ్యాపారాలను ప్రారంభించడమే కాకుండా, చిన్న వ్యాపారాలను విస్తరించేందుకు అవకాశాన్ని కల్పించింది. ఇది డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడంతో పాటు, సురక్షితమైన, మరింత వ్యవస్థీకృతమైన వ్యాపార పద్ధతులను ముందుకు తెచ్చింది. అంతేకాకుండా, వెనుకబడిన వర్గాలకు సంస్థాగత రుణ మద్దతును పొందే అవకాశాన్ని కూడా ఇది పెంపొందించింది.
విస్తరిస్తున్న ఈ పథకం పరిధి అభివృద్ధి, సమ్మిళితత్వంలో వస్తున్న ఒక భారీ మార్పును ప్రతిబింబిస్తుంది. అసంఘటిత రంగంలోని లక్షలాది మందికి, ఒకప్పుడు అందని అవకాశాలకు మార్గాన్ని పీఎం స్వానిధి కల్పించింది. పలు విధాలుగా, ఈ కార్యక్రమం పట్టణ పరిపాలనపై మారుతున్న దృక్పథాన్ని ప్రతిబింబిస్తుంది. చిన్న వ్యాపారులు ఇకపై అట్టడుగు వర్గంగా పరిగణించబడటం లేదు. దానికి బదులుగా, వారు భారతదేశ ఆర్థిక వృద్ధి గాథలో కీలక పాత్ర పోషిస్తున్న వారిగా మరింత గుర్తింపు పొందుతున్నారు.
సూచనలు
గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
https://www.pmsvanidhi.mohua.gov.in/Home/PMSDashboard
https://www.facebook.com/pmsvanidhi/
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2225510®=3&lang=1
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2006580®=3&lang=2
సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ
https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=1984414®=3&lang=2
ప్రధానమంత్రి కార్యాలయం
https://www.pmindia.gov.in/en/news_updates/cabinet-approves-restructuring-extension-of-lending-period-beyond-31-12-2024-of-pm-street-vendors-atmanirbhar-nidhi-pm-svanidhi-scheme
******
(Explainer ID: 158731)
आगंतुक पटल : 31
Provide suggestions / comments