Social Welfare
సోమనాథ్: భారతదేశ అఖండ జ్యోతి
విశ్వాసం, ధైర్యం, సాంస్కృతిక వారసత్వ 75 ఏళ్ల వేడుక
Posted On:
08 MAY 2026 6:05PM
భారతదేశంలోని అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో సోమనాథ్ ఒకటి. పరమశివుడి పన్నెండు జ్యోతిర్లింగాలలో ఇది మొదటిది. క్రీ.శ. 1026 నుంచి పదేపదే దాడులు జరిగినప్పటికీ విశ్వాసం, పట్టుదల, సాంస్కృతిక నిరంతరాయతకు సోమనాథ్ చిహ్నంగా నిలిచింది. 1951లో జాతీయ నాయకత్వంలో పునర్నిర్మించిన ఈ ఆలయ పునఃప్రారంభం.. భారతదేశ నాగరికత పునరుజ్జీవనానికి గుర్తుగా నిలిచింది. సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ అనేది 1026లో ఆలయంపై జరిగిన మొదటి దాడికి 1000 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్నారు. ఇది మే 1951లో ఆలయం పునఃప్రారంభమై 75 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని కూడా సూచిస్తుంది. ఈ పర్వ్ ఆలయ చారిత్రక ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. ఈ ఆలయం ఘనమైన వారసత్వ వేడుకను జరుపుకుంటోంది. ఈ ఘట్టాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి మోదీ మే 11న సోమనాథ్ ఆలయాన్ని సందర్శిస్తున్నారు.
సోమనాథ్ పవిత్ర తీరాలు
గుజరాత్‌లోని సౌరాష్ట్ర తీరంలో ఉన్న ప్రభాస్ పటన్ వద్ద సోమనాథ్ కొలువై ఉంది. ఇది భారతదేశంలోని అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఒకటి. శివపురాణంలో పేర్కొన్న అత్యంత పవిత్రమైన జ్యోతిర్లింగాలలో ఒకటి ఇక్కడ ఉంది. ఇది శివుడు, శ్రీకృష్ణుడు, శక్తి ఆరాధనలకు ఎంతో గౌరవప్రదమైనది.
ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రంలో సోమనాథుడికి మొదటి స్థానం ఉంది. ఇది భారతదేశ ఆధ్యాత్మిక, నాగరిక వారసత్వంలో దానికి ఉన్న అగ్రస్థానాన్ని ప్రతిబింబిస్తుంది.
శతాబ్దాలుగా విదేశీ దురాక్రమణదారులు సోమనాథ్ ఆలయాన్ని పదేపదే ధ్వంసం చేసి కొల్లగొట్టారు; ప్రతిసారీ భక్తులు, పాలకులు దీనిని పునర్నిర్మించి, కోల్పోయిన వైభవాన్ని పునరుద్ధరించారు. అందువల్ల, శతాబ్దాల దాడుల తర్వాత కూడా విజయం సాధించిన భారతదేశ అచంచల విశ్వాసానికి సోమనాథ్ ఒక నిదర్శనంగా నిలుస్తుంది. ఇది మన నాగరికత కొనసాగింపునకు, మన లోతైన విశ్వాసాన్ని, మన సామూహిక సంకల్ప బలాన్ని ప్రతిబింబిస్తుంది.
అఖండ జ్యోతి: కాలపరీక్షలు, కష్టాల మధ్య సోమనాథ్

సోమనాథ్ మూలాలు ప్రాచీన భారతీయ సంప్రదాయాలలో లోతుగా పాతుకుపోయాయి. ఈ ప్రదేశం శివుడు, చంద్రుడి ఆరాధనతో దగ్గరి సంబంధం కలిగి ఉంది.
శతాబ్దాలుగా సోమనాథ్ అనేక నిర్మాణ దశలను చూసింది. పురాతన సంప్రదాయాల ప్రకారం.. వేర్వేరు పదార్థాలను ఉపయోగించి వరుసగా ఆలయాలు నిర్మితమయ్యాయి. ఇవి పునరుద్ధరణ మరియు నిరంతరాయతకు చిహ్నంగా ఉన్నాయి.
సోమనాథ్ చరిత్రలో అత్యంత క్లిష్టమైన దశ పదకొండో శతాబ్దంలో ప్రారంభమైంది. 1026 జనవరిలో సోమనాథ్ మొదటిసారిగా దండయాత్రకు గురైంది. ఈ ఆలయం పదేపదే ధ్వంసమైన పదకొండో, పద్దెనిమిదో శతాబ్దాల మధ్య కాలానికి అది ఆరంభం.
ఆలయం ధ్వంసమైన ప్రతిసారీ భక్తులు, రాజులు దానిని పునర్నిర్మించడానికి ముందుకు వచ్చారు. వీరిలో 12వ శతాబ్దంలో ఆలయాన్ని పునరుద్ధరించిన కుమారపాల రాజు ప్రముఖులు. 13వ శతాబ్దంలో జునాగఢ్ రాజు దీనిని పునర్నిర్మించారు. మరోసారి విధ్వంసం అయిన తర్వాత ఇండోర్ మరాఠా రాణి లోకమాత అహల్యాబాయి హోల్కర్ 18వ శతాబ్దంలో సోమనాథ్‌లో కొత్త ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నారు. ఇలా పదేపదే ధ్వంసమైనప్పటికీ సోమనాథ్ ప్రజల సామూహిక స్పృహ నుంచి ఎప్పుడూ కనుమరుగు కాలేదు.
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1947లో సర్దార్ వల్లభాయ్ పటేల్.. సోమనాథ్ శిథిలాలను సందర్శించి ఆలయాన్ని పునర్నిర్మించాలని నిశ్చయించుకున్నారు. సోమనాథ్ పునర్నిర్మాణం భారతదేశ సాంస్కృతిక ఆత్మవిశ్వాసాన్ని పునరుద్ధరించడానికి అత్యవసరమని ఆయన భావించారు. ప్రజా భాగస్వామ్యం, జాతీయ సంకల్పం ద్వారా ప్రస్తుత ఆలయం కైలాస మహమేరు ప్రసాద నిర్మాణ శైలిలో నిర్మితమైంది.
1951 మే 11న అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ఆలయ ప్రతిష్ఠాపన జరిగింది. 75 ఏళ్ల తర్వాత సోమనాథ్ జాతీయ గర్వానికి, ఆధ్యాత్మిక పట్టుదలకు చిహ్నంగా పునరుజ్జీవనం పొంది నిలిచింది.
వీర హమీర్జీ గోహిల్: చరిత్రకు మించిన జ్ఞాపకం
సోమనాథ్ కథ ధైర్యవంతులైన వ్యక్తుల సాహసాలతో రూపుదిద్దుకుంది. వారి ధైర్యం జ్ఞాపకాల ద్వారా ఇంకా సజీవంగా ఉంది. వీర హమీర్జీ గోహిల్ అటువంటి వ్యక్తులలో ఒకరు. ఆయన ఒక ప్రాంతీయ యోధుడు. క్రీ.శ. 1299లో జాఫర్ ఖాన్ దండయాత్ర సమయంలో సోమనాథ్ ఆలయాన్ని రక్షిస్తూ తన ప్రాణాలను అర్పించినందుకు గుర్తింపు పొందారు. అధికారిక చారిత్రక రికార్డుల కంటే స్థానిక సంప్రదాయాలు, సామూహిక జ్ఞాపకాల ద్వారా ఆయన చరిత్రకెక్కారు. విజయం అనిశ్చితంగా ఉన్నా లేదా మద్దతు పరిమితంగా ఉన్నా పవిత్ర స్థలాలను, సమాజాన్ని, సాంస్కృతిక వారసత్వాన్ని రక్షించాలనే 'రాజధర్మ' భావనను ఆయన జీవితం ప్రతిబింబిస్తుంది.
సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్
సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ సోమనాథ్ ఆలయం చిరస్థాయి వారసత్వాన్ని గౌరవిస్తుంది. ఇది 1026లో సోమనాథ్ ఆలయంపై జరిగిన మొదటి దాడికి వెయ్యి ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని సూచిస్తుంది. మే 11, 2026 నాటికి 1951లో సోమనాథ్ ఆలయాన్ని తిరిగి తెరిచి 75 ఏళ్లు పూర్తవుతాయి, అప్పుడు దీనిని భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ జాతికి అంకితం చేశారు. ఆయన సోమనాథ్‌ను భారతదేశ ఆధ్యాత్మిక బలానికి, సాంస్కృతిక పునరుజ్జీవనానికి చిహ్నంగా వర్ణించారు. ఆలయ పునఃప్రారంభం ఆలయ పునరుద్ధరణ కంటే ఎంతో గొప్పది. ఇది శతాబ్దాల పోరాటం తర్వాత భారతదేశ నాగరికత ఆత్మవిశ్వాసం పుంజుకోవడానికి ప్రతినిధిగా నిలిచింది.

సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ భారతదేశ చరిత్రలోని రెండు ముఖ్యమైన మైలురాళ్లను పక్కపక్కన ఉంచుతుంది. మొదటి మైలురాయి విధ్వంసాన్ని సూచిస్తుంది. రెండో విధ్వంసంపై విజయం సాధించడంలో దేశం లోతైన విశ్వాసాన్ని, పట్టుదలను సూచిస్తుంది.

సోమనాథ్ ట్రస్ట్ అధ్యక్షుడైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలయ పునఃప్రారంభ 75వ వార్షికోత్సవం సందర్భంగా మే 11న సోమనాథ్ ఆలయాన్ని సందర్శిస్తారు.
తన పర్యటనకు ముందు ప్రధాని సోమనాథ్ ఆలయంపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. శిథిలాల నుంచి పునరుద్ధరణ వరకు దాని ప్రయాణాన్ని ఆయన వివరించారు. దీనిని 'భారతదేశ అజేయ స్ఫూర్తి'కి చిహ్నంగా పిలిచారు. శతాబ్దాలుగా ఆలయాన్ని రక్షించి పునర్నిర్మించిన వారికి ఆయన నివాళులర్పించారు. వారసత్వ పరిరక్షణతో పాటు అభివృద్ధిపై దృష్టి సారించే "వికాస్ బీ, విరాసత్ బీ" విధానాన్ని ప్రధాని ప్రత్యేకంగా నొక్కి చెప్పారు. సోమనాథ్‌లో రాబోయే 1,000 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు. ఇది దాని చరిత్రను గౌరవిస్తుంది. ఈ ముఖ్యమైన కాలంలో సోమనాథ్‌ను సందర్శించాలని ఆయన ప్రజలను కోరారు.
అంతకుముందు 2026 జనవరిలో ప్రధాని మోదీ జనవరి 10-11 తేదీల్లో ఆలయంలో జరిగిన సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 72 గంటల పాటు ఓంకార మంత్ర పఠనం, దేశ సంక్షేమం, శ్రేయస్సు కోసం పవిత్ర ఆచారాలు, ప్రార్థనలు నిర్వహించారు. ప్రభాస్ పటన్ వద్ద ఒక భారీ శౌర్య యాత్ర కూడా జరిగింది. శతాబ్దాలుగా సోమనాథ్‌ను రక్షించిన యోధులకు నివాళిగా 108 గుర్రాలతో ప్రతీకాత్మక ఊరేగింపు నిర్వహించారు.
సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ యాత్ర
"చలో చలేం సోమనాథ్" ప్రచారంలో భాగంగా నిర్వహించిన సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ యాత్ర 2026 ఏప్రిల్ 30న ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమైంది. 1,300 మందికి పైగా భక్తులతో కూడిన ప్రత్యేక రైలు సోమనాథ్ వరకు ప్రయాణించింది. ఇది ఆలయ విశ్వాసం, పట్టుదల 1,000 ఏళ్ల వేడుకలో భాగంగా జరిగింది.
ఈ యాత్ర మే 1వ తేదీన సోమనాథ్ చేరుకుంది. ఆ తర్వాత హారతి, ఆలయ సందర్శనలు, లైట్ అండ్ సౌండ్ షో వంటి ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి.
సోమనాథ్ ఆలయం: వైభవం, భక్తి, సజీవ వారసత్వం
శివుని పన్నెండు ఆది జ్యోతిర్లింగాలలో మొదటిదిగా సోమనాథ్‌కు పవిత్రమైన స్థానం ఉంది. ఆలయ సముదాయంలో గర్భగుడి, సభామండపం, నృత్యమండపం ఉన్నాయి. ఇది అరేబియా సముద్ర తీరంలో ఎంతో వైభవంగా వెలిసింది.
ఆలయ శిఖరం 150 అడుగుల ఎత్తు కలిగి ఉండగా, దానిపై 10 టన్నుల బరువున్న కలశం ఉంటుంది. 27 అడుగుల ధ్వజదండం ఆలయ నిరంతర ఆధ్యాత్మిక ఉనికిని సూచిస్తుంది. ఈ సముదాయంలో 1,666 బంగారు పూత పూసిన కలశాలు, 14,200 ధ్వజాలు ఉన్నాయి. ఇవి శతాబ్దాల భక్తి, శిల్పకళను ప్రతిబింబిస్తాయి.
సోమనాథ్ ఆరాధన, తీర్థయాత్రలకు శక్తివంతమైన కేంద్రంగా ఉంది. ఇక్కడికి ఏటా 92 నుంచి 97 లక్షల మంది భక్తులు వస్తుంటారు. బిల్వ పూజ వంటి ఆచారాలు ఏటా 13.77 లక్షల మంది భక్తులను ఆకర్షిస్తాయి. సాంస్కృతిక కార్యక్రమాలు సోమనాథ్ వారసత్వంతో ప్రజల అనుబంధాన్ని పెంచాయి. 2003లో ప్రారంభమైన లైట్ అండ్ సౌండ్ షోను 2017లో ఆధునీకరించారు. ఇందులో ఇప్పుడు 3డీ లేజర్ సాంకేతికతను ఉపయోగిస్తున్నారు.
'వందే సోమనాథ్ కళా మహోత్సవం' వంటి కార్యక్రమాలు 1,500 ఏళ్ల నాటి నృత్య సంప్రదాయాలను పునరుద్ధరించాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో సోమనాథ్ కొత్త సాంస్కృతిక అభివృద్ధిని చూసింది. పాలన సంస్కరణలు, వారసత్వ పరిరక్షణ దాని ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాముఖ్యతను బలోపేతం చేశాయి.
శ్రీ సోమనాథ్ ట్రస్ట్ సామాజిక, సంక్షేమ కార్యకలాపాలు
విద్యా అభివృద్ధి, నైపుణ్య శిక్షణ
విద్య, ఉపాధి ఆధారిత నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలను ట్రస్ట్ చురుకుగా ప్రోత్సహిస్తుంది. వృత్తి విద్యా శిక్షణ కార్యక్రమాలు సమీప ప్రాంతాల్లోని యువతకు, మహిళలకు అవకాశాలను మెరుగుపరుస్తాయి. ఈ కోర్సులలో కంప్యూటర్ విద్య, టైలరింగ్, బ్యూటీ సర్వీసెస్, డిజిటల్ అక్షరాస్యత శిక్షణ ఉన్నాయి. 10, 12వ తరగతుల తర్వాత విద్యను అభ్యసించే విద్యార్థులకు స్కాలర్‌షిప్ సహాయం అందుతుంది.
"స్కూల్ ఆన్ వీల్స్" చొరవ గ్రామాలలో మొబైల్ డిజిటల్ లెర్నింగ్‌ను అందిస్తుంది. గ్రామీణ విద్యార్థులకు ప్రాక్టికల్ కంప్యూటర్ శిక్షణ, ప్రాథమిక డిజిటల్ అక్షరాస్యత విద్య లభిస్తుంది. విద్యాపరమైన పోటీలు పరిశుభ్రత, నీటి సంరక్షణపై అవగాహనను పెంచుతాయి. విద్యార్థులు, స్థానిక వర్గాల కోసం క్రమం తప్పకుండా పర్యావరణ బాధ్యత కార్యక్రమాలు కూడా జరుగుతాయి.
అన్నదానం, సామాజిక సంక్షేమం
ట్రస్ట్ భక్తులు, అవసరార్థుల కోసం క్రమం తప్పకుండా అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తుంది. సామాజిక మద్దతు ఉన్న ఆహార సహాయ కార్యక్రమాల ద్వారా ప్రతిరోజూ ఉచిత భోజనం అందిస్తోంది.
దాతల భాగస్వామ్యం ఏడాది పొడవునా ఈ సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించడానికి సహాయపడుతుంది. అత్యవసర సమయాల్లో ప్రభావిత వర్గాలకు ట్రస్ట్ మానవతా సహాయం అందిస్తుంది. సహాయక చర్యల్లో ఆహార పంపిణీ, వైద్య సహాయం మరియు నిత్యావసర వస్తువుల సరఫరా ఉంటాయి. సామాజిక కార్యక్రమాల ద్వారా వెనుకబడిన కుటుంబాలకు కూడా సంక్షేమ పథకాలు అందుతాయి.
ఆరోగ్యం, విద్య, సామాజిక సంక్షేమ కార్యక్రమాలు
ఆరోగ్య సంరక్షణ, సామాజిక సంక్షేమ కార్యక్రమాలకు శ్రీ సోమనాథ్ ట్రస్ట్ తన మద్దతును కొనసాగిస్తోంది. సోమనాథ్-ప్రభాస్ పటన్ సమీపంలోని ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు వైద్య సహాయ కార్యక్రమాలు అందుతున్నాయి. స్థానిక ప్రజలకు ఫిజియోథెరపీ సౌకర్యాలు తక్కువ ధరలో పునరావాసం, కోలుకోవడానికి మద్దతునిస్తాయి. సమీప వర్గాల కోసం క్రమం తప్పకుండా ఉచిత దంత, కంటి చికిత్స శిబిరాలు జరుగుతాయి.
వైద్య సహాయ శిబిరాల ద్వారా వికలాంగుల సంక్షేమ కార్యక్రమాలు కూడా కొనసాగుతున్నాయి. ఈ సహాయ కార్యక్రమాలలో చక్రాల కుర్చీలు, వినికిడి యంత్రాలు, క్రచెస్ పంపిణీ చేస్తారు.
శ్రీ సోమనాథ్ ట్రస్ట్ ద్వారా కోవిడ్-19 సేవలు
కోవిడ్-19 మహమ్మారి సమయంలో శ్రీ సోమనాథ్ ట్రస్ట్ ఆర్థిక సాయం, ఆహార పంపిణీ, వైద్య మౌలిక సదుపాయాలు, నిత్యావసర వస్తువులతో సహా పెద్ద ఎత్తున సహాయం అందించింది. మహమ్మారి రెండు దశల్లోనూ ఫ్రంట్‌లైన్ కార్మికులకు, వలస కూలీలకు, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు సహాయం అందించబడింది.
మొదటి వేవ్‌లో రూ.8.73 కోట్ల సహాయం
రెండో వేవ్‌లో రూ.2.21 కోట్ల సహాయం
ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.1 కోటి విరాళం
ఆక్సిజన్ ప్లాంట్లు, కాన్సంట్రేటర్లకు సహాయం
పర్యావరణ, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు
పర్యావరణ పరిరక్షణకు ట్రస్ట్ ప్రాధాన్యతను ఇస్తోంది. పెద్ద ఎత్తున చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమాలు చుట్టుపక్కల ప్రాంతాల్లో పచ్చదనాన్ని పెంచడానికి సహాయపడతాయి. బిల్వ మొక్కలు నాటే కార్యక్రమాలు సోమనాథ్ సమీపంలో పర్యావరణ అవగాహనను ప్రోత్సహిస్తాయి.
పర్యావరణ అనుకూల వ్యర్థాల నిర్వహణ పద్ధతులు ఆలయ, సేంద్రీయ వ్యర్థాలను బాధ్యతాయుతంగా రీసైకిల్ చేస్తాయి. సేంద్రీయ వ్యర్థాలను కంపోస్ట్ మరియు సహజ ఎరువుగా మార్చి ఉపయోగిస్తారు. ప్రజా పారిశుధ్య కార్యక్రమాలు పర్యావరణ బాధ్యత కలిగిన యాత్రా స్థలానికి మద్దతునిస్తాయి.
శ్రీ సోమనాథ్ ట్రస్ట్ సంక్షేమ కార్యక్రమాలు కేవలం సాధారణ సామాజిక, విద్యా, ఆరోగ్య సేవలకు మాత్రమే పరిమితం కాకుండా అత్యవసర స్పందన, విపత్తు సహాయక చర్యల వరకు విస్తరించాయి. సమాజ శ్రేయస్సు కోసం నిరంతర అభివృద్ధి పనులతో పాటు ప్రకృతి వైపరీత్యాలు, మానవతా సంక్షోభాల సమయంలో కూడా ట్రస్ట్ చురుకుగా ముందుకు వస్తుంది.
సోమనాథ్‌లో మహిళా సాధికారత, స్థిరత్వం
2018లో "స్వచ్ఛ ఐకానిక్ ప్లేస్"గా ప్రకటించిన సోమనాథ్ వినూత్నమైన స్థిరత్వ పద్ధతులను అవలంబించింది. ఆలయ పుష్పాలను వర్మీ కంపోస్ట్‌గా మార్చి 1,700 బిల్వ వృక్షాలకు పోషణగా ఉపయోగిస్తున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలను మిషన్ లైఫ్ కార్యక్రమం కింద పేవర్ బ్లాకులుగా మారుస్తున్నారు. నెలకు 4,700 బ్లాకులు తయారవుతున్నాయి.
వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థలు నెలకు దాదాపు 30 లక్షల లీటర్ల మురుగునీటిని శుద్ధి చేస్తాయి. 72,000 చదరపు అడుగులలో విస్తరించి ఉన్న 7,200 చెట్లతో కూడిన మియావాకి అడవి ఏటా సుమారు 93,000 కిలోల కార్బన్ డయాక్సైడ్‌ను గ్రహిస్తుంది. శుద్ధి చేసిన అభిషేక జలాన్ని 'సోమగంగా జల' పేరుతో బాటిళ్లలో నింపి అందిస్తున్నారు, డిసెంబర్ 2024 నాటికి దీనివల్ల 1.13 లక్షల కుటుంబాలు ప్రయోజనం పొందాయి.
సోమనాథ్ మహిళా సాధికారతకు బలమైన కేంద్రంగా కూడా ఎదిగింది. సోమనాథ్ ఆలయ ట్రస్ట్‌లోని 906 మంది ఉద్యోగులలో 262 మంది మహిళలు ఉన్నారు. బిల్వ వనాన్ని పూర్తిగా మహిళలే నిర్వహిస్తున్నారు. ప్రసాదం పంపిణీలో 65 మంది మహిళలు, ఆలయ భోజన సేవల్లో 30 మంది మహిళలు నిమగ్నమై ఉన్నారు. మొత్తం మీద 363 మంది మహిళలు ప్రత్యక్ష ఉపాధిని పొందుతూ ఏటా సుమారు రూ.9 కోట్లు ఆర్జిస్తున్నారు. ఇది ఆర్థిక స్వాలంబనను, గౌరవాన్ని ప్రతిబింబిస్తుంది.
సోమనాథ్: కాలాన్ని తట్టుకుని నిలిచిన విశ్వాసం
సోమనాథ్ భారతదేశ విశ్వాసం, పట్టుదల, నాగరికత నిరంతరాయతకు శాశ్వత చిహ్నంగా నిలుస్తుంది. ఇది పదేపదే విధ్వంసాన్ని, పునరుద్ధరణను ఎదుర్కొంది. ఇది శతాబ్దాలుగా భక్తికి ఉండే అజేయ శక్తిని ప్రతిబింబిస్తుంది.
దాని పురాణ ప్రాముఖ్యత నుంచి 1951లో జరిగిన చారిత్రక పునర్నిర్మాణం వరకు సోమనాథ్ కేవలం ఒక పవిత్ర ఆలయంగా మాత్రమే కాకుండా సాంస్కృతిక గర్వం, జాతీయ పునరుజ్జీవన సామూహిక వ్యక్తీకరణగా నిలుస్తుంది. ఈ ఏడాది ఆలయ పునఃప్రారంభ 75వ వార్షికోత్సవం. ఈ వేడుక ఆలయ ఆధునిక వారసత్వంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. భారతదేశ ఉమ్మడి వారసత్వంలో దాని స్థానాన్ని పునరుద్ఘాటిస్తుంది.
సోమనాథ్ ఆరాధన, సాంస్కృతిక పునరుద్ధరణ, స్థిరత్వం, సమగ్ర అభివృద్ధికి సజీవ కేంద్రంగా అభివృద్ధి చెందుతూనే ఉంది. నిజమైన వారసత్వం కేవలం పరిరక్షణ ద్వారా మాత్రమే కాకుండా, నిరంతర పునరుద్ధరణ, సామూహిక విశ్వాసం ద్వారానే మనుగడ సాగిస్తుందని ఇది శక్తిమంతమైన గుర్తుగా నిలుస్తుంది.
***
(Explainer ID: 158572)
आगंतुक पटल : 145
Provide suggestions / comments