Social Welfare
జనగణన 2027: భారతదేశపు మొట్టమొదటి డిజిటల్ గణన ప్రక్రియ
Posted On:
25 APR 2026 10:55AM
కీలకాంశాలు
- జనగణన 2027 భారతదేశపు మొట్టమొదటి డిజిటల్ గణనగా గుర్తింపు పొందనుంది. ఇది దేశవ్యాప్త డేటా లభ్యతను వేగంగా, మరింత సమర్థవంతంగా చేయడానికి మొబైల్ ఆధారిత డేటా సేకరణను ఉపయోగించుకుంటుంది.
- 2025 ఏప్రిల్ 30న జరిగిన సమావేశంలో రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ జనగణన 2027లో కులగణనను చేర్చాలని నిర్ణయించింది.
- బలమైన సంస్థాగత చట్రం, రూ.11,718.24 కోట్ల వ్యయంతో దేశవ్యాప్తంగా సాఫీగా అమలయ్యేలా శిక్షణ, ముందస్తు పరీక్ష, పరిపాలనాపరమైన సన్నద్ధతతో సహా విస్తృతమైన ముందస్తు చర్యలు చేపట్టడమైంది.
- సురక్షితమైన క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్(సీఐఐ)-నిర్దేశిత డేటా సెంటర్లు, భారీగా సిబ్బందితో - జనగణన 2027 లక్షిత, సమగ్ర విధాన రూపకల్పన కోసం విశ్వసనీయమైన డేటాను అందిస్తుంది.
పరిచయం
జనగణన అనేది దేశంలోని లేదా ఒక నిర్దిష్ట ప్రాంతంలోని వ్యక్తులందరికీ సంబంధించిన జనాభా, సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక గణాంకాలను సేకరించే, క్రోడీకరించే, విశ్లేషించే, ప్రచురించే ప్రక్రియ. జనగణన ద్వారా సేకరించిన సమాచార సంపద ప్రణాళికాకర్తలు, నిర్వాహకులు, పరిశోధకులు, ఇతర డేటా వినియోగదారులకు అత్యంత సంపన్నమైన వనరుగా మారుతుంది. జనగణన పాలనకు కీలకమైన పునాదిగా పనిచేస్తుంది. రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాలలో సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడానికి వీలు కల్పిస్తుంది. జనగణన డేటా సమగ్రమైన, లక్షిత, జనాభా విభిన్న అవసరాలకు అనుగుణంగా ఉండే సమాచారంతో కూడిన విధాన రూపకల్పనకు వీలు కల్పిస్తుంది.
దేశంలో జనగణన నిర్వహణకు సంబంధించిన తొలి ప్రస్తావనలు కౌటిల్యుని అర్థశాస్త్రంలో(క్రీ.పూ. 321-296), తర్వాత అక్బర్ చక్రవర్తి కాలంలో అబుల్ ఫజల్ రాసిన ‘అయిన్-ఇ-అక్బరీ’లో కనిపిస్తాయి. భారతదేశంలో మొదటి ఆధునిక జనగణన 1865-1872 మధ్య జరిగింది. అయితే ఇది అన్ని ప్రాంతాలలో ఏకకాలంలో జరగలేదు. భారతదేశం తన మొదటి సమకాలీన జనగణనను 1881లో నిర్వహించింది. అప్పటి నుంచి ప్రతి 10 ఏళ్లకు ఒకసారి జరిగే విస్తృత ప్రక్రియల ద్వారా భారతీయ జనగణన.. జనాభా, వివిధ అంశాలపై విశ్వసనీయమైన, కాలపరీక్షకు నిలిచిన డేటాను అందిస్తోంది. ప్రతి తదుపరి గణన తన పద్ధతులను మెరుగుపరుచుకుంటూ, కవరేజీని పెంచుకుంటూ, జనాభాను మెరుగ్గా అర్థం చేసుకోవడానికి ప్రశ్నలను సవరించుకుంటూ వచ్చింది.
2027 జనగణన భారతీయ జనాభా గణనల వరుసలో 16వది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఎనిమిదవది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గణన ప్రక్రియ అవుతుంది. డిజిటల్ ఏకీకరణ, బలమైన డేటా భద్రత, క్రమబద్ధీకరించిన ప్రక్రియలతో సాక్ష్య ఆధారిత విధాన రూపకల్పనను బలోపేతం చేస్తూ ఒక ప్రధాన అడుగుగా మారుతుంది. ఇది మొబైల్ ఆధారిత డేటా సేకరణ, సెన్సస్ మేనేజ్‌మెంట్ & మానిటరింగ్ సిస్టమ్(సీఎంఎంఎస్) పోర్టల్ ద్వారా నిరంతర పర్యవేక్షణ, ఐచ్ఛిక స్వీయ-గణన సౌకర్యం, జియో-రిఫరెన్స్‌డ్ పరిధుల విస్తృత వినియోగంతో సహా పలు మార్గదర్శక ఫీచర్లను పరిచయం చేస్తుంది. జనాభా లెక్కింపు దశలో సమగ్ర కుల గణన జరుగుతుంది.
అధునాతన డిజిటల్ సాధనాల మద్దతుతో ఈ ప్రక్రియ డేటా భద్రత, ప్రజల భాగస్వామ్య అత్యున్నత ప్రమాణాలను నిర్ధారిస్తూనే, వేగవంతమైన, మరింత కచ్చితమైన, లోతైన డేటాను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
భారత జనగణన చారిత్రక నేపథ్యం
భారతదేశ జనగణన ప్రపంచంలోనే అతిపెద్ద పరిపాలనా, గణాంక ప్రక్రియగా పరిణామం చెందింది. మొదటి జనాభా లెక్కింపు 1865-1872 కాలంలో జరిగింది ఆ తర్వాత 1881లో మొదటి సమకాలీన దేశవ్యాప్త గణన జరిగింది. అప్పటి నుంచి భారత జనగణన ప్రతి పదేళ్లకు ఒకసారి జరుగుతోంది. అయితే, 2021లో జరగాల్సిన జనగణన కోవిడ్-19 మహమ్మారి కారణంగా నిర్ణీత సమయంలో జరగలేదు. అందువల్ల జనగణన 2027 ఈ క్రమంలో తదుపరి గణనను సూచిస్తుంది. ఇది మొత్తం మీద 16వ భారతీయ జనగణన, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఎనిమిదవది.
జనగణన 2027 సంస్థాగత, చట్టపరమైన నిర్మాణం
జనగణన 2027 డేటా సేకరణలో స్థిరత్వం, విశ్వసనీయత, దేశవ్యాప్త ఏకరూపతను నిర్ధారించే పటిష్టమైన సంస్థాగత, పరిపాలనా చట్రంతో కూడినది. స్వాతంత్య్రం తర్వాత జనగణన సెన్సస్ యాక్ట్-1948, సెన్సస్ రూల్స్-1990 ద్వారా జరుగుతోంది. ఇది బలమైన చట్టపరమైన, సంస్థాగత చట్రాన్ని అందిస్తుంది. జనగణన అనేది రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్(జాబితాలో వరుస సంఖ్య 69) కింద ఉన్న కేంద్ర పరిధిలోని అంశం. యూనియన్ సబ్జెక్ట్‌గా ఈ ప్రక్రియ కేంద్రం ద్వారా సమన్వయం జరుగుతుంది. అయితే రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాల సన్నిహిత సహకారంతో అమలవుతుంది. ఇది విభిన్న ప్రాంతాలలో అంతరాయం లేని నిర్వహణకు దోహదపడుతుంది.
ఈ చట్రం వ్యక్తిగత డేటా కచ్చితమైన గోప్యతకు హామీ ఇస్తుంది. తద్వారా ప్రజల విశ్వాసాన్ని, భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తుంది. సెన్సస్ చట్టం సెక్షన్ 15 అనే ఒక ముఖ్యమైన నిబంధనను కలిగి ఉంది. దీని కింద ప్రజలు అందించిన వ్యక్తిగత సమాచారం కచ్చితంగా గోప్యంగా ఉంటుంది. దీనిని ఆర్టీఐ చట్టం కింద బహిరంగపరచడం సాధ్యం కాదు. ఏ కోర్టులోనూ సాక్ష్యంగా ఉపయోగించలేరు లేదా ఏ సంస్థతోనూ పంచుకోలేరు.
జనగణన 2027 నిర్వహించాలనే ప్రభుత్వ ఉద్దేశ్యం 16 జూన్, 2025న గెజిట్ ఆఫ్ ఇండియాలో నోటిఫై అయ్యింది. దీని అమలు కోసం కేంద్ర మంత్రివర్గం రూ.11,718.24 కోట్ల ఆర్థిక వ్యయానికి ఆమోదం తెలిపింది.
రెండు దశల గణన వ్యూహం, ప్రక్రియ
దేశవ్యాప్తంగా సమగ్రమైన, క్రమబద్ధమైన డేటా సేకరణను నిర్ధారించడానికి జనగణన 2027 నిర్మాణాత్మక రెండు దశల ఫార్మాట్‌లో జరుగుతుంది.
తొలి దశ: ఇళ్ల జాబితా, గృహ గణన(హోచ్ఎల్ఓ) 2026 ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య షెడ్యూల్ అయ్యింది. ఇది రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాల సౌలభ్యం మేరకు ప్రతి రాష్ట్రం/యూటీలో 30 రోజుల వ్యవధిలో జరుగుతుంది. ఇంటింటికీ వెళ్లే 30 రోజుల హెచ్ఎల్ఓ పనికి ముందు 15 రోజుల వ్యవధిలో స్వీయ-గణన చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ దశ గృహ పరిస్థితులు, సౌకర్యాల లభ్యత, గృహాలు కలిగి ఉన్న ఆస్తులపై వివరణాత్మక సమాచారాన్ని సేకరిస్తుంది. అదే సమయంలో తదుపరి దశ కోసం అవసరమైన ఫ్రేమ్‌ను కూడా సృష్టిస్తుంది.
రెండో దశ: జనగణన ఫిబ్రవరి 2027కి షెడ్యూల్ అయ్యింది. ఇది గృహాలలోని వ్యక్తుల వివరణాత్మక జనాభా, సామాజిక-ఆర్థిక, సాంస్కృతిక, వలస, సంతానానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించడంపై దృష్టి పెడుతుంది. సీసీపీఏ నిర్ణయించిన ప్రకారం.. జనగణన రెండవ దశలో కులాల గణన కూడా జరుగుతుంది. కేంద్రపాలిత ప్రాంతం లడఖ్, జమ్మూ కాశ్మీర్‌లోని మంచుతో నిండిన ప్రాంతాలు, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల కోసం రెండో దశ 2026 సెప్టెంబర్‌లో జరుగుతుంది. జనగణన, ప్రశ్నల కచ్చితమైన తేదీలు తగిన సమయంలో నోటిఫై అవుతాయి.
ఇళ్ల జాబితా, గృహ గణన కోసం ప్రశ్నలు
ప్రభుత్వం 2026 జనవరిలో మొదటి దశ లేదా ఇళ్ల జాబితా, గృహ గణన దశ కోసం సమగ్రమైన ప్రశ్నల సెట్‌ను ఇప్పటికే నోటిఫై చేసింది.
జనగణన 2027 కోసం రిఫరెన్స్ తేదీని మార్చి 1, 2027 అర్ధరాత్రి 00:00 గంటలుగా నిర్ణయించారు. కేంద్రపాలిత ప్రాంతం లడఖ్, జమ్మూ కాశ్మీర్‌లోని మంచు ప్రాంతాలు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు, రిఫరెన్స్ తేదీ అక్టోబర్ 1, 2026 అర్ధరాత్రి 00:00 గంటలుగా ఉంటుంది. ఈ సమయాన్ని 'సెన్సస్ మూమెంట్' అని కూడా పిలుస్తారు.
జనగణనలో ఎవరిని చేర్చాలనేది నిర్ణయించుకోవడానికి ఎన్యుమరేటర్లకు సెన్సస్ మూమెంట్ ఉపయోగపడుతుంది.
జనగణన 2027 విశిష్ట లక్షణాలు
గణన ప్రక్రియ కచ్చితత్వం, సామర్థ్యం, పారదర్శకత, వేగాన్ని పెంపొందించడానికి జనగణన 2027 అనేక ముఖ్యమైన పరిపాలనా, సాంకేతిక పురోగతులను ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉంది. ఈ కార్యక్రమాలు జనగణన కార్యకలాపాలను ఆధునీకరిస్తాయి. సాక్ష్య ఆధారిత విధాన రూపకల్పన కోసం మరింత సమగ్రమైన, సమయానుకూలమైన జనాభా గణాంకాలను రూపొందిస్తాయి.
కుల గణన
భారత జనగణన 2027లో కుల గణన ఒక ప్రధాన అంశంగా ఉద్భవించింది. 2011 జనగణన వరకు ఈ ప్రక్రియ కేవలం షెడ్యూల్డ్ కులాలు(ఎస్సీలు), షెడ్యూల్డ్ తెగల(ఎస్టీలు) క్రమబద్ధమైన లెక్కింపును మాత్రమే కలిగి ఉండేది. అయితే, 30 ఏప్రిల్ 2025 నాటి రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయాన్ని అనుసరించి, జనగణన 2027 కుల గణనను కూడా చేపడుతుంది.
డిజిటల్ పద్ధతిలో మొదటి జనగణన
జనగణన 2027 డిజిటల్ పద్ధతిలో భారతదేశం నిర్వహించే మొదటి జనాభా గణనను సూచిస్తుంది మరియు దీని విజయవంతమైన అమలు కోసం ప్రభుత్వం ఇప్పటికే విస్తృతమైన ఏర్పాట్లు ప్రారంభించింది.
సెన్సస్ మేనేజ్‌మెంట్, మానిటరింగ్ సిస్టమ్(సీఎంఎంఎస్) పోర్టల్
ఈ ప్రయత్నాలలో భాగంగా మొత్తం జనగణన ప్రక్రియను నిరంతర ప్రాతిపదికన నిర్వహించడానికి, పర్యవేక్షించడానికి సెన్సస్ మేనేజ్‌మెంట్, మానిటరింగ్ సిస్టమ్(సీఎంఎంఎస్) అనే ప్రత్యేక పోర్టల్‌ను అభివృద్ధి చేశారు. ఉప-జిల్లా, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలోని అధికారులు సమగ్ర డ్యాష్‌బోర్డ్ ద్వారా గణన పురోగతిని, క్షేత్రస్థాయిలో పనితీరును, కార్యాచరణ సంసిద్ధతను పర్యవేక్షించవచ్చు.
ఇళ్ల జాబితా, గృహ గణన(హెచ్ఎల్ఓ) మొబైల్ అప్లికేషన్
ఇది ఎన్యుమరేటర్లు ఇళ్ల జాబితా డేటాను సేకరించడానికి, అప్‌లోడ్ చేయడానికి ఉపయోగించే సురక్షితమైన ఆఫ్‌లైన్ యాప్. ఇది సీఎంఎంఎస్ పోర్టల్‌లో నమోదైన వారికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇది నేరుగా ఫీల్డ్-టు-సర్వర్ డేటా బదిలీని అనుమతిస్తుంది. దీనివల్ల కాగితపు పని తొలగిపోతుంది. ఇది ఆండ్రాయిడ్, ఐఓఎస్ వేదికలలో 16 ప్రాంతీయ భాషలలో పనిచేస్తుంది.
హౌస్‌లిస్టింగ్ బ్లాక్ క్రియేటర్(హెచ్ఎల్‌బీసీ) వెబ్ మ్యాపింగ్ అప్లికేషన్
జనగణన 2027 కోసం మరొక ఆవిష్కరణ హెచ్ఎల్‌బీ క్రియేటర్ వెబ్ మ్యాపింగ్ అప్లికేషన్. దీనిని ఛార్జ్ అధికారులు ఉపయోగిస్తారు. ఇది శాటిలైట్ చిత్రాలను ఉపయోగించి హౌస్‌లిస్టింగ్ బ్లాక్‌ల డిజిటల్ సృష్టిని సులభతరం చేస్తుంది. తద్వారా దేశవ్యాప్తంగా ఎక్కడా వదిలివేయకుండా లేదా డూప్లికేషన్ లేకుండా భౌగోళిక కవరేజీ ఉంటుంది.
స్వీయ-గణన పోర్టల్
ఇంటింటికీ వెళ్లే క్షేత్ర పర్యటనకు ముందు ఐచ్ఛికంగా 15 రోజుల స్వీయ-గణన వ్యవధి ఉంటుంది. స్వీయ-గణన పోర్టల్ అనేది ఒక సురక్షితమైన వెబ్ ఆధారిత సౌకర్యం. ఇది గృహంలోని అర్హులైన ప్రతివాదులు క్షేత్ర కార్యకలాపాలకు ముందే వారి గృహ సమాచారాన్ని ఆన్‌లైన్‌లో సమర్పించడానికి అనుమతిస్తుంది. విజయవంతంగా సమర్పించిన తర్వాత, ఒక ప్రత్యేక స్వీయ-గణన ఐడీ(ఎస్ఈ ఐడీ) సృష్టిస్తారు.. ఈ ఎస్ఈ ఐడీని ఎన్యుమరేటర్‌తో పంచుకోవాలి. దాని ఆధారంగా ఎన్యుమరేటర్ సమాచారాన్ని ధ్రువీకరించగలరు.
స్వీయ-గణన సౌకర్యం
జనగణన 2027లో ఒక ప్రధాన పౌర-కేంద్రీకృత ఆవిష్కరణ స్వీయ-గణన సౌకర్యం పరిచయం. ఇది కింది లక్షణాలను కలిగి ఉంటుంది:
- ఈ సౌకర్యం ప్రత్యేక ఆన్‌లైన్ పోర్టల్ - https://se.census.gov.in/ ద్వారా అందుబాటులో ఉంటుంది;
- ఇది 16 భాషలలో అందుబాటులో ఉంటుంది (తెలుగు, అస్సామీ, బెంగాలీ, ఇంగ్లీష్, గుజరాతీ, హిందీ, కన్నడ, కొంకణి, మలయాళం, మణిపురి, మరాఠీ, నేపాలీ, ఒడియా, పంజాబీ, తమిళం, ఉర్దూ);
- ప్రతివాదులు స్వతంత్రంగా వివరాలను పూరించవచ్చు. ఆ తర్వాత ఒక ప్రత్యేక స్వీయ-గణన(ఎస్ఈ ఐడీ) వస్తుంది;
- డేటా కచ్చితత్వాన్ని నిర్ధారించడానికి యూజర్ గైడ్, ఫ్లో చార్ట్, ఎఫ్ఏక్యూలు, అవసరమైన ‘టూల్ టిప్స్’, ట్యుటోరియల్ వీడియో, ప్రశ్నల కోసం ధ్రువీకరణ తనిఖీలు స్వీయ-గణన పోర్టల్‌లోనే ఉన్నాయి.
-క్షేత్ర పర్యటనల సమయంలో ఎన్యుమరేటర్లు డేటాను ధ్రువీకరించడంతో పాటు ఏకీకృతం చేస్తారు.
అతి తక్కువ సమయంలో నిర్వహణ
సేకరణ నుంచి డేటా ప్రాసెసింగ్ వరకు ప్రతి దశలో సాంకేతికతను ఉపయోగించడం ద్వారా దేశవ్యాప్తంగా అతి తక్కువ సమయంలో జనగణన డేటాను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతోంది. జనగణన ఫలితాలను మరింత అనుకూలీకరించిన విజువలైజేషన్ సాధనాలతో ప్రచారం చేయడానికి కూడా ప్రయత్నాలు జరుగుతాయి.
అంతరాయం లేని అమలు కోసం సమగ్ర ముందస్తు చట్రం
జనగణన కార్యకలాపాలకు స్థిరమైన చట్రాన్ని అందించడానికి 1 జనవరి 2026 నాటికి పరిపాలనా విభాగాలు గడువును నిర్దేశించుకున్నాయి. పద్ధతి, డిజిటల్ సాధనాలు, శిక్షణా వ్యవస్థలను ధ్రువీకరించడానికి సుమారు 5,000 సెన్సస్ బ్లాక్‌లను కవర్ చేస్తూ తొలి దశ కోసం దేశవ్యాప్త ముందస్తు పరీక్ష 2025 నవంబర్‌లో జరిగింది.
సమన్వయం, పర్యవేక్షణను బలోపేతం చేయడానికి, చీఫ్ సెక్రటరీలు, రాష్ట్ర నోడల్ అధికారులు, సెన్సస్ అధికారులతో కూడిన ఉన్నత స్థాయి సమావేశాలు 2026 జనవరిలో జరిగాయి. అలాగే జిల్లా, ఛార్జ్ స్థాయిలలో సెన్సస్ సిబ్బంది నియామకాలు పూర్తయ్యాయి. అమలులో ఏకరూపతను నిర్ధారించడానికి 19 భాషలలో వివరణాత్మక ఇన్స్‌ట్రక్షన్ మాన్యువల్స్ సిద్ధమయ్యాయి.
నిరంతర పర్యవేక్షణ, సమయానుకూల నిర్వహణకు వీలు కల్పించేలా కార్యకలాపాల సమయబద్ధమైన క్యాలెండర్ అమలులోకి తీసుకురావడమైంది. తద్వారా జనగణన ప్రక్రియ మొత్తం సంసిద్ధత, పరిపాలనా సామర్థ్యం బలోపేతమైంది.
పటిష్టమైన డేటా భద్రత, గోప్యతా నిర్మాణం
ప్రతి దశలో సమాచార సమగ్రతను, గోప్యతను కాపాడటానికి జనగణన 2027 కోసం ఒక సమగ్ర, బహుళ-స్థాయి డేటా భద్రతా చట్రాన్ని ఏర్పాటు చేశారు. ఇది కింది వాటిని కలిగి ఉంటుంది:
- అనధికార ప్రాప్యతను నిరోధించడానికి సురక్షిత ప్రసార ప్రొటోకాల్‌లతో పాటు డేటా సేకరణ, ప్రసారం, నిల్వను కవర్ చేసే ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ ఉంటుంది.
- డేటా ధ్రువీకరించిన, సురక్షితమైన డేటా సెంటర్లలో నిల్వ చేస్తారు. ఇవి క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్(సీఐఐ)గా గుర్తింపు పొందాయి. ఇది ఉన్నత స్థాయి రక్షణ ప్రమాణాలను నిర్ధారిస్తుంది.
- ఈ వ్యవస్థలు అంతర్జాతీయంగా గుర్తించిన ISO/IEC 27001:2022 ప్రమాణాలకు అనుగుణంగా ఉంటాయి. ప్రసిద్ధ సంస్థల ద్వారా క్రమం తప్పకుండా భద్రతా ఆడిట్‌లకు లోబడి ఉంటాయి.
- మొత్తంగా ఈ చర్యలు జనగణన ప్రక్రియ కోసం ఒక బలమైన, సురక్షితమైన డేటా వ్యవస్థను అందిస్తాయి.
సామర్థ్య పెంపుదల, మానవ వనరుల సంసిద్ధత
శిక్షణ, సామర్థ్య పెంపుదలపై విస్తృతమైన ప్రయత్నాలతో మానవ వనరుల సంసిద్ధత జనగణన 2027 కీలకమైన స్తంభంగా నిలుస్తుంది. ఈ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించడానికి సుమారు 31 లక్షల మంది ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లు, లక్ష మందికి పైగా సెన్సస్ సిబ్బందిని సమీకరించారు. వారికి అవసరమైన నైపుణ్యాలను అందించడానికి, ప్రతి దశ కోసం 80,000కు పైగా శిక్షణ బ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు. ఈ నిర్మాణాత్మక విధానం జనగణన ప్రక్రియ అంతటా డేటా నాణ్యత, కచ్చితత్వం, కార్యాచరణ సామర్థ్య ఉన్నత ప్రమాణాలను నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకుంది.
జనగణన 2027 విజయవంతంగా నిర్వహించడానికి వివిధ పనులను పూర్తి చేయడానికి, స్థానిక స్థాయిలలో సుమారు 550 రోజుల పాటు సుమారు 18,600 మంది సాంకేతిక సిబ్బంది నిమగ్నమై ఉంటారు. మరో మాటలో చెప్పాలంటే సుమారు 1.02 కోట్ల మ్యాన్-డేస్ ఉపాధి లభిస్తుంది.
ముగింపు: భవిష్యత్ పాలనకు పునాదిగా జనగణన
సమాచారంతో కూడిన విధాన రూపకల్పన, సమగ్ర అభివృద్ధికి విశ్వసనీయమైన, సమగ్రమైన డేటాను అందిస్తూ జనాగణన పాలనకు మూలస్తంభంగా కొనసాగుతోంది. ఇది జనాభా ధోరణుల కచ్చితమైన అంచనాను అందిస్తుంది. ఆహారం, నీరు, ఇంధనం, మౌలిక సదుపాయాల వంటి రంగాలలో సమర్థవంతమైన ప్రణాళికలు రూపొందించే వీలు కల్పిస్తుంది. స్థానిక స్థాయిలో వివరణాత్మక లెక్కలు అందించడం ద్వారా ఇది ప్రభుత్వ పథకాల లక్షిత పంపిణీకి, సరైన వనరుల కేటాయింపునకు సహాయపడుతుంది.
జనగణన 2027 నవీకరించిన, వివరణాత్మక సమాచారాన్ని అందించడం ద్వారా ఈ చట్రాన్ని మరింత బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు. ఇది మరింత కచ్చితమైన, డేటా-ఆధారిత ప్రణాళికకు మద్దతు ఇస్తుంది. వేగంగా మారుతున్న సామాజిక-ఆర్థిక దృశ్యంలో ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించడంలో సహాయపడుతుంది.
***
(Explainer ID: 158386)
आगंतुक पटल : 249
Provide suggestions / comments