• Sitemap
  • Advance Search
Infrastructure

దేశ రహదారులకు సరికొత్త రూపు

ఆవిష్కరణలతో పయనిస్తూ, కనెక్టివిటీని అందించడం

Posted On: 11 NOV 2025 1:47PM

ముఖ్యాంశాలు

 

• భారతదేశ రహదారులు ప్రణాళికా దశ నుంచి టోల్ వసూలు వరకు అన్ని దశల్లో డిజిటల్ మార్పుకు గురవుతున్నాయి. ఇవి భౌతిక, డేటా ఆధారిత ఆస్తులుగా మారాయి.

 

• ఫాస్టాగ్ దేశ ఎలక్ట్రానిక్ టోల్ వసూలు వ్యవస్థను మార్చివేసింది. దీనికి దాదాపు 98 శాతం వ్యాప్తి, 8 కోట్ల మంది వినియోగదారులున్నారు. 

 

• రాజ్‌మార్గ్‌ యాత్రా అనే యాప్‌కు 15 లక్షలు పైగా డౌన్‌లోడ్‌లు వచ్చాయి. ఇది భారతదేశంలోని ఉత్తమ రహదారి ప్రయాణ యాప్. ప్రయాణికుల అనుభవాన్ని మెరుగుపరుస్తుంది.

 

కొత్త యుగ రహదారులకు మార్గం సుగమం

 

డిజిటల్ విప్లవ యుగంలో, భారతదేశంలోని రహదారులు ఇకపై కేవలం డాంబర్‌–కాంక్రీటుతో నిర్మించిన మార్గాలు మాత్రమే కావు; అవి ఇప్పుడు స్మార్ట్ మొబిలిటీ మరియు డేటా ప్రసరణకు పునాదిగా మారుతున్నాయి. ఈ "ఇంటెలిజెంట్ హైవేలు" నిరంతర రవాణా, రియల్‌టైమ్ సమాచారం, సులభమైన ప్రయాణం, సరుకుల రవాణా, టోల్ నిర్వహణ, ప్రయాణంలో ఇంటర్నెట్‌ యాక్సెస్ వంటి సేవలను సాధ్యమయ్యేలా మారుస్తున్నాయి. ఒకప్పుడు కేవలం నగరాలు, రాష్ట్రాలను కలిపే భౌతిక మార్గాలుగా ఉన్న రహదారులు, ఇప్పుడు "స్మార్ట్ కనెక్టివిటీ కారిడార్లు"గా రూపాంతరం చెందుతున్నాయి — ఇవి కేవలం వాహనాలకే కాదు, డేటా, కమ్యూనికేషన్, రియల్‌టైమ్ నిర్ణయాలకు కూడా ఆధారంగా పనిచేసే విధంగా రూపకల్పన చేయబడ్డాయి.

 

ఈ మార్పు పరిమాణం కూడా భారత రహదారి నెట్వర్క్‌లా విస్తారంగా ఉంది. 2025 మార్చి నాటికి, భారతదేశ రహదారి నెట్‌వర్క్ మొత్తం 63 లక్షల కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉంది. ఇది ప్రపంచంలో రెండవ అతిపెద్ద నెట్‌వర్క్. ఇందులో జాతీయ రహదారుల పొడవు 1,46,204 కిలోమీటర్లకు పెరిగింది. 2013–14లో ఉన్న 91,287 కిలోమీటర్లతో పోలిస్తే ఇది సుమారు 60% పెరుగుదల. 2014 నుంచి 2025 మధ్యకాలంలోనే భారత్ 54,917 కిలోమీటర్ల కొత్త జాతీయ రహదారులను నిర్మించింది. ఇది కేవలం నిర్మాణ సామర్థ్యాన్ని మాత్రమే కాదు, ఇంత విస్తృతమైన ఆస్తిని డిజిటల్‌గా నిర్వహించడం, పర్యవేక్షించడం ఎంత అవసరమో కూడా తెలియజేస్తోంది. పనితీరు, సమర్థత, పారదర్శకతను పెంచే దిశగా ప్రభుత్వం హైవే ప్రాజెక్టుల మొత్తం జీవితచక్రంలో — ప్రణాళిక, సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధం, నిర్మాణం, నిర్వహణ, టోల్ సేకరణ, నెట్‌వర్క్ ఆధునీకరణ వరకు — సంపూర్ణ 360 డిగ్రీల డిజిటల్ మార్పు విధానాన్ని అవలంబించింది. ఈ డిజిటల్ సమీకరణతో ప్రాధాన్యమైన  ప్రక్రియలు సరళీకృతం అవుతూ, వ్యవస్థ పనితీరు మెరుగుపడటమే కాకుండా, “Ease of Doing Business” లక్ష్యాన్ని కూడా బలపరుస్తున్నాయి.




 

డిజిటల్ టోల్ వసూలు, చెల్లింపు మార్పులు

 

పేపర్ టిక్కెట్లు, నగదు కౌంటర్ ల కాలం ముగిసింది. ఇప్పుడు భారత జాతీయ రహదారులు సెన్సర్ ఆధారిత, నిరంతర ప్రయాణ వ్యవస్థల వైపు నిశ్శబ్ద విప్లవాన్ని కొనసాగిస్తున్నాయి. ప్రయాణికుల సమయనష్టం తగ్గించడం, ఇంధన వృథా నివారించడం, ఆదాయ లోపాలను అరికట్టడం వంటి లక్ష్యాలతో, భారత్ తన టోల్ వసూలు విధానాన్ని పూర్తిగా డిజిటల్ పద్ధతిలోకి మార్చే దిశగా ముందుకెళ్తోంది.

ఒక ట్యాగ్ – అన్ని రహదారులకు: FASTag, NETC విప్లవం

దేశవ్యాప్తంగా టోల్ సేకరణను సులభతరం చేయడానికి, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) రూపొందించిన నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ (NETC) కార్యక్రమం ఇప్పుడు టోల్ చెల్లింపుల కోసం ఏకైక, పరస్పర అనుకూలమైన డిజిటల్ ప్లాట్‌ఫారంగా మారింది. ఈ వ్యవస్థ ద్వారా కేంద్రకృత క్లియరింగ్ హౌస్ సదుపాయం కల్పించారు. దీంతో లావాదేవీలు సజావుగా జరుగుతూ, వివాద పరిష్కారం కూడా సమర్థవంతంగా జరుగుతోంది.

NETC వ్యవస్థలోని ప్రధాన భాగం FASTag. ఇది వాహన విండ్షీల్డ్‌పై అమర్చే RFID (Radio Frequency Identification) ఆధారిత పరికరం. దీనివల్ల ప్రయాణికుడు టోల్ ప్లాజాలో ఆగకుండానే, తన లింక్ చేసిన ఖాతా నుంచి టోల్ చెల్లింపులు ఆటోమేటిక్‌గా జరిపించవచ్చు. ఒకే రకమైన సాంకేతిక ప్రమాణాలతో రూపొందించినందు వల్ల దేశంలోని ఏ టోల్ ప్లాజాలో అయినా, ఎలాంటి ఆపరేటర్‌ ఉన్నా ఒకే FASTag‌తో చెల్లింపు చేయడం సాధ్యం.

ప్రస్తుతం FASTag వినియోగం సుమారు 98% స్థాయికి చేరింది, దేశవ్యాప్తంగా 8 కోట్లకు పైగా వినియోగదారులు ఈ సదుపాయం ఉపయోగిస్తున్నారు. దీంతో భారతదేశం అంతటా టోల్ చెల్లింపు వ్యవస్థ పూర్తిగా ఇ-టోల్ కలెక్షన్ మోడల్‌గా మారిపోయింది.

ఫాస్టాగ్ వార్షిక పాసు – సౌకర్యవంతమైన నిరంతర ప్రయాణానికి కొత్త రూపం

ప్రయాణంలో అవాంతరాలు లేకుండా ఉండాలనుకునే ప్రైవేట్ వాహనదారుల కోసం ఫాస్టాగ్ వార్షిక పాస్‌ను ప్రవేశపెట్టారు. వాణిజ్యేతర వాహనాలు ఒకేసారి రూ.3,000 చెల్లింపుతో, ఒక సంవత్సరం లేదా 1,150 టోల్ ప్లాజాలలో 200 సార్లు ప్రయాణం వరకు ఈ పాస్ చెల్లుబాటు అవుతుంది. ఇది రాజమార్గయాత్ర యాప్ లేదా NHAI వెబ్‌సైట్ ద్వారా కేవలం రెండు గంటల్లోనే యాక్టివేట్ చేయవచ్చు. తద్వారా తరచూ రీచార్జ్ అవసరం లేకుండా, నిరంతర ప్రయాణ అనుభవం అందిస్తుంది.

2025 ఆగస్టు 15న ప్రారంభమైన ఈ పాస్, కేవలం రెండు నెలల్లోనే 25 లక్షల వినియోగదారుల మైలురాయిని దాటింది. అలాగే 5.67 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. ఇది దేశవ్యాప్తంగా అవాంతరరహిత టోల్ చెల్లింపులపై పెరుగుతున్న ప్రజా విశ్వాసాన్ని, డిమాండ్‌ను ప్రతిబింబిస్తోంది.





 

టోల్ ప్లాజాల్లో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించి, నగదు లావాదేవీలను తగ్గించేందుకు ప్రభుత్వం National Highways Fee Rules, 2008 ను సవరిస్తూ కొత్త నిబంధనలను 2025 నవంబర్ 15 నుంచి అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం FASTag లేని వాహనదారులు టోల్‌ను నగదుగా చెల్లిస్తే, వారికి సాధారణ రుసుము కంటే రెండింతలు వసూలు చేస్తారు, అదే యూపీఐ  ద్వారా చెల్లించే ప్రయాణికులు టోల్ మొత్తానికి 1.25 రెట్లు చెల్లించాల్సి ఉంటుంది. టోల్ సేకరణ ప్రక్రియను సరళీకరించడం, ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, అలాగే పారదర్శకతను, ప్రయాణ సౌలభ్యాన్ని పెంచడం దీని ముఖ్య ఉద్దేశ్యం.

2025 ఆగస్టులో, భారతదేశం తన మొదటి బహుళ లైన్ల అడ్డంకులు లేని ప్రయాణం (MLFF) టోల్ సిస్టమ్‌ను గుజరాత్‌లోని NH-48 పై ఉన్న చోరయాసి ఫీ ప్లాజాలో ప్రారంభించారు. ఇది ఎలాంటి అడ్డంకులు లేకుండా.. కెమెరా, RFID ఆధారిత ఆధునిక టోల్ సిస్టమ్. ఇది వాహనం ఆగకుండానే, దాని FASTag, నంబర్ ప్లేట్‌ను సెన్సర్ల ద్వారా గుర్తించి టోల్ వసూలు చేస్తుంది.

ఈ సాంకేతిక విధానం ద్వారా టోల్ చెల్లింపులు ఆపకుండా సజావుగా జరగడం, ట్రాఫిక్ రద్దీ తగ్గడం, ఇంధన వినియోగం ఆదా అవడం, ఉద్గారాలు తగ్గడం సాధ్యమవుతోంది. భారత రహదారి వ్యవస్థను పూర్తిగా డిజిటల్ వైపు మలుస్తున్న ఈ MLFF టెక్నాలజీ, భవిష్యత్తులో “స్మార్ట్ హైవేలు” రూపకల్పనలో కీలక పాత్ర పోషించనుంది.

రాజమార్గ యాత్ర: భారత హైవే ప్రయాణం స్మార్ట్‌గా, సులభంగా

భారతదేశంలోని రహదారి ప్రయాణాన్ని పూర్తిగా కొత్త రూపంలోకి తీసుకెళ్లే దిశగా, ప్రభుత్వం “రాజమార్గయాత్ర” అనే పౌర కేంద్రిత మొబైల్ యాప్‌ను ప్రారంభించింది. ఈ యాప్‌ ప్రధాన ఉద్దేశ్యం — జాతీయ రహదారులపై ప్రయాణించే ప్రజలకు అనుభవాన్ని మెరుగుపరచడం, సౌలభ్యాన్ని పెంచడం, సమస్యల పరిష్కారాన్ని వేగవంతం చేయడం.

రాజమార్గయాత్ర యాప్‌ వినియోగదారుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించారు. ఇది వెబ్‌ ఆధారిత రియల్‌టైమ్‌ అప్‌డేట్‌ వ్యవస్థతో సమన్వయం చేశారు. తద్వారా ప్రయాణికులు ఏ సమయంలోనైనా తాజా సమాచారం, ఫిర్యాదు పరిష్కార స్థితిని తెలుసుకోవచ్చు. 

ఈ యాప్‌ నిజమైన డిజిటల్ ప్రయాణ సహచరుడు లాంటిది. ఇది ప్రయాణికులకు రహదారుల వివరాలు, టోల్ ప్లాజాలు, సమీపంలోని పెట్రోల్ బంకులు, ఆసుపత్రులు, EV ఛార్జింగ్ స్టేషన్లు, లైవ్ వాతావరణ సమాచారం వంటి అనేక సేవలను అందిస్తుంది. ఈ సమగ్ర సమాచారం ద్వారా ప్రజలు తమ ప్రయాణాలను మరింత సమర్థవంతంగా ప్రణాళిక చేసుకోగలుగుతారు. 

సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభవం కోసం, రాజమార్గ యాత్ర యాప్‌ ఫాస్టాగ్ సేవలతో అనుసంధానించారు. దాంతో టోల్ చెల్లింపులు అవాంతరరహితంగా జరగుతాయి. అలాగే, ఈ యాప్‌ అనేక భారతీయ భాషలను మద్దతు ఇస్తుంది. అందువల్ల దేశవ్యాప్తంగా ఉన్న ప్రయాణికులందరికీ సులభంగా ఉపయోగపడుతుంది.

భద్రతపై దృష్టి సారిస్తూ, యాప్‌లో వేగ పరిమితి హెచ్చరికలు, వాయిస్ అసిస్టెన్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇవి ప్రయాణికులలో జాగ్రత్తగా డ్రైవింగ్ చేసే అలవాటును పెంపొందించేందుకు తోడ్పడతాయి.

ఈ ప్లాట్‌ఫారమ్‌లోని అత్యంత ఆకర్షణీయమైన అంశం — దాని ఫిర్యాదు వ్యవస్థ. ప్రయాణికులు రహదారులపై ఉన్న గోతులు, నిర్వహణ లోపాలు, అనధికార నిర్మాణాలు, భద్రతా సమస్యలు వంటి అంశాలను జియో-ట్యాగ్ ఫోటోలు, వీడియోలతో అప్‌లోడ్ చేసి నేరుగా నివేదించవచ్చు. అలాగే, తమ ఫిర్యాదుల పరిష్కారం ఏ దశలో ఉందో ట్రాక్ చేయడం కూడా సాధ్యం. ఈ విధంగా, రాజమార్గ యాత్ర యాప్‌ పారదర్శకతను, బాధ్యతను, ప్రజా భాగస్వామ్యాన్ని పెంపొందిస్తూ, భారత జాతీయ రహదారుల నిర్వహణను మరింత స్మార్ట్‌, సమర్థవంతమైన దిశగా నడిపిస్తోంది.

రాజమార్గయాత్ర యాప్‌ అందుబాటులోకి వచ్చిన కొద్దికాలంలోనే భారత ప్రయాణికులలో విపరీతమైన ఆదరణను పొందింది. ప్రస్తుతం ఇది గూగుల్ ప్లే స్టోర్‌లో మొత్తం ర్యాంకింగ్స్‌లో 23వ స్థానంలో, ట్రావెల్ కేటగిరీలో 2వ స్థానంలో నిలిచింది.

దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 15 లక్షలకు పైగా డౌన్‌లోడ్లు నమోదు కావడంతో పాటు, వినియోగదారుల నుంచి 4.5 స్టార్‌ల అద్భుత రేటింగ్‌ సాధించింది. దీని ద్వారా రాజమార్గ యాత్ర యాప్‌ భారత జాతీయ రహదారులపై ప్రయాణించే ప్రజలకు అత్యంత ప్రజాదరణ పొందిన డిజిటల్ సాధనంగా నిలిచింది.

ప్రత్యేకంగా, FASTag వార్షిక పాస్‌ ఫీచర్‌ ప్రారంభమైన నాలుగు రోజుల్లోనే, రాజమార్గ యాత్ర దేశంలోని అత్యుత్తమ పనితీరు కలిగిన ప్రభుత్వ యాప్‌గా అవతరించింది. ఈ విజయంతో, యాప్‌ స్వీకరణ, ప్రభావం పరంగా భారత డిజిటల్ ట్రాన్స్‌పోర్ట్‌ ఎకోసిస్టమ్‌లో ఒక ప్రధాన మైలురాయిని సాధించింది.

NHAI వన్: రహదారులకు డిజిటల్ మూలం

 

మౌలిక సదుపాయ ప్రాజెక్టుల సరైన సమయంలో పూర్తి చేసేందుకు, పనితీరును పెంచేందుకు భారతదేశ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) ‘NHAI వన్’ మొబైల్ యాప్‌ను ప్రారంభించింది.ఈ యాప్‌ ద్వారా NHAI లోని అంతర్గత ప్రక్రియలు సరళీకరించబడుతూ, దేశవ్యాప్తంగా ఉన్న రహదారులపై ఫీల్డ్ స్థాయి సమన్వయం మరింత సమర్థవంతంగా మారుతోంది. ఇది NHAI ప్రాజెక్టు పనుల్లోని ఐదు ముఖ్య భాగాలను కలిపింది. ఫీల్డ్ సిబ్బంది హాజరు, హైవే నిర్వహణ, రోడ్ సేఫ్టీ ఆడిట్లు, టాయిలెట్ నిర్వహణ, రోజువారీ నిర్మాణ పర్యవేక్షణ ద్వారా ఈ ఐదు విభాగాలను ఒకే ఇంటర్‌ఫేస్‌లో కలిపి, NHAI One యాప్‌ ఫీల్డ్ టీమ్‌లు, పర్యవేక్షణ సిబ్బంది తమ పనులను రియల్‌టైమ్‌లో సమర్థంగా నిర్వహించేందుకు సహాయపడుతోంది.

 

ప్రాంతీయ అధికారులు, ప్రాజెక్ట్ డైరెక్టర్లు, కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు, సేఫ్టీ ఆడిటర్లు, టాయిలెట్ సూపర్వైజర్లు వంటి ఫీల్డ్ స్థాయి సిబ్బంది ఈ యాప్ ద్వారా ప్రాజెక్ట్ సంబంధిత సమాచారం నివేదించవచ్చు, అప్‌డేట్ చేయవచ్చు, ట్రాక్ చేయవచ్చు. యాప్‌లోని జియో-ట్యాగింగ్, టైమ్‌-స్టాంపింగ్ ఫీచర్లు బాధ్యత, పారదర్శకత, రికార్డ్ ఖచ్చితత్వాన్ని గణనీయంగా పెంచుతున్నాయి.

అంతర్గత పనితీరు మెరుగుదలకే పరిమితం కాకుండా, NHAI One యాప్‌ ప్రాజెక్ట్ అమలు,  ప్రజా సేవల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గిస్తూ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సమస్యల పరిష్కారాన్ని వేగవంతం చేయడం, హైవే అభివృద్ధి ప్రణాళికలను సమర్థంగా అమలు చేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది.







 

భారత రహదారుల మ్యాపింగ్‌ (GIS) - పీఎమ్ గతి శక్తి పాత్ర

డిజిటల్ మ్యాప్స్‌, స్థల సమాచారం ఇప్పుడు భారత రహదారి నిర్మాణం, ప్రణాళిక, అమలును పూర్తిగా మారుస్తున్నాయి. ఈ విప్లవాత్మక మార్పుకు కేంద్రబిందువుగా ఉన్నది భూభౌగోళిక సమాచార వ్యవస్థ (GIS), ప్రభుత్వ ప్రధాన మౌలిక సదుపాయ కార్యక్రమం పీఎమ్ గతి శక్తి జాతీయ మాస్టర్ ప్లాన్‌ 

PM గతి శక్తి పోర్టల్‌ ప్రస్తుతం భారతదేశ మౌలిక వసతుల అభివృద్ధికి డిజిటల్ కమాండ్ సెంటర్ లా పనిచేస్తోంది. ఇది బహుముఖ కనెక్టివిటీని సాధించేందుకు సమగ్ర డిజిటల్ అట్లాస్‌ గా రూపొందించారు. ఈ ప్లాట్‌ఫారమ్‌ ఒక శక్తివంతమైన GIS ఆధారిత వ్యవస్థ ఆధారంగా పని చేస్తోంది. దీంట్లో 550కి పైగా లైవ్ డేటా లేయర్లు ఉన్నాయి. వీటిలో ఆర్థిక క్లస్టర్లు, లాజిస్టిక్స్ హబ్‌లు, సామాజిక మౌలిక వసతులు, పర్యావరణ అంశాలు వంటి వివిధ వివరాలు ఉంటాయి.

ఈ డేటా ద్వారా రహదారి మార్గాలను తక్కువ అంతరాయం, గరిష్ట సామర్థ్యం, వేగవంతమైన అనుమతులు కలిగేలా ప్రణాళిక చేయవచ్చు. ప్రధాన మైలురాయిగా, రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ మంత్రిత్వ శాఖ మొత్తం జాతీయ రహదారి నెట్‌వర్క్‌ (సుమారు 1.46 లక్షల కిలోమీటర్లు) ను GIS ఆధారిత పీఎమ్ గతి శక్తి పోర్టల్‌లో అప్‌లోడ్ చేసి ధృవీకరించింది. దీంతో భారతదేశ రహదారి ప్రణాళిక విధానం కాగితం ఆధారిత వ్యవస్థల నుంచి జియో-ఇంటెలిజెంట్ ప్రణాళికా విధానానికి మార్పు చెందింది. ఇది దేశవ్యాప్తంగా పారదర్శకత, సమర్థత, సమన్వయాన్ని గణనీయంగా పెంచుతోంది.

 

స్మార్ట్ రోడ్ల వెనుక సాంకేతిక శక్తి – Intelligent Transport System (ITS)

టెక్నాలజీ ఆధారిత రహదారులు అంటే కేవలం సులువైన చెల్లింపులు మాత్రమే కాదు. దానిలో సెన్స్ చేసే, విశ్లేషించే, అమలు చేసే, స్పందించే వ్యవస్థలు కూడా ఉంటాయి. ఇవన్నీ కలిపి Intelligent Transport System (ITS) అని పిలుస్తారు.

భారతదేశంలో ITS ప్రధానంగా Advanced Traffic Management System (ATMS) ద్వారా అమలు అవుతోంది. ఇది క్రమంగా Vehicle-to-Everything (V2X) కమ్యూనికేషన్‌ ఎకోసిస్టమ్‌లో భాగమవుతోంది. ఈ వ్యవస్థలు రోడ్ ప్రమాదాలు తగ్గించడం, ట్రాఫిక్ ఉల్లంఘనలను నియంత్రించడం, అత్యవసర సేవల ప్రతిస్పందన వేగాన్ని పెంచడం వంటి లక్ష్యాలతో రూపొందించబడ్డాయి.

ప్రస్తుతం దిల్లీ–మీరట్ ఎక్స్‌ప్రెస్‌వే, ట్రాన్స్-హరియాణా ఎక్స్‌ప్రెస్‌వే, తూర్పు పరిధీయ ఎక్స్‌ప్రెస్‌వే వంటి ప్రధాన ఎక్స్‌ప్రెస్‌వేలలో ATMS అమలు చేయడమైంది. దీని వల్ల ప్రమాదాలు త్వరగా గుర్తించడం, అత్యవసర సేవలు వేగంగా స్పందించడం సాధ్యమవుతోంది. ఇకపై ప్రతి కొత్త హై-స్పీడ్‌ జాతీయ రహదారి ప్రాజెక్ట్‌లో ATMS ఇన్‌స్టాలేషన్‌ తప్పనిసరి భాగంగా మారింది. అలాగే, ఇప్పటికే ఉన్న ప్రధాన కారిడార్లపై కూడా దీన్ని స్టాండ్‌అలోన్‌ సిస్టమ్‌గా అమలు చేస్తున్నారు.

బెంగళూరు–మైసూరు ఎక్స్‌ప్రెస్‌వేలో 2024 జూలైలో ATMS అమలైన తర్వాత జరిగిన విశ్లేషణలో, రోడ్డు ప్రమాదాల వల్ల జరిగే మరణాలు గణనీయంగా తగ్గినట్టు వెల్లడైంది. ఇది స్మార్ట్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (Smart Enforcement) ప్రాణాలను రక్షిస్తున్నదని స్పష్టంగా చూపిస్తోంది — అంటే భారత రహదారులు క్రమంగా ఇంటెలిజెంట్ హైవేలు వైపు అడుగులు వేస్తున్నాయన్న మాట.


 

జాతీయ రహదారులపై పారదర్శకతను, భద్రతను పెంచే దిశగా ప్రభుత్వం పలు సాంకేతిక చర్యలు చేపడుతోంది. ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్ సైన్ బోర్డులు ఇప్పుడు ప్రతి హైవే ప్రాజెక్టు వద్ద ఏర్పాటు అవుతున్నాయి. వీటిలో QR కోడ్‌లు ఉంటాయి. వీటి ద్వారా ప్రయాణికులు ప్రాజెక్టుకు సంబంధించిన తాజా వివరాలు, అత్యవసర హెల్ప్‌లైన్‌లు, సమీపంలోని ఆసుపత్రులు, పెట్రోల్ బంకులు, ఈ-చార్జింగ్ స్టేషన్ల వంటి సౌకర్యాల సమాచారం తక్షణం తెలుసుకోగలరు.

ఇదే సమయంలో, నెట్‌వర్క్ సర్వే వెహికిల్స్ (NSVs) అనే ఆధునిక వాహనాలను కూడా 23 రాష్ట్రాల్లో ప్రవేశపెడుతున్నారు. వీటిలో 3D లేజర్ వ్యవస్థలు, 360° కెమెరాలు తదితర సాంకేతిక పరికరాలు ఉంటాయి. వీటి సహాయంతో సుమారు 20,933 కిలోమీటర్ల రహదారులపై ఆటోమేటిక్‌గా లోపాలను గుర్తించడం సాధ్యమవుతుంది. దీంతో రహదారులు మరింత మృదువుగా, భద్రంగా, సమాచారపరంగా మారనున్నాయి.

 

పచ్చదన దిశగా ముందుకు — సస్టైనబుల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పట్ల నిబద్ధత

భారతదేశం సస్టైనబుల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పట్ల తన నిబద్ధతను గ్రీన్ హైవేస్ మిషన్ ద్వారా బలపరుస్తోంది. ఈ మిషన్ గ్రీన్ హైవేస్ పాలసీ (2015) కింద ప్రారంభమై, పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడం, శబ్ద కాలుష్యాన్ని నియంత్రించడం, నేల క్షీణతను నివారించడం మరియు ఉపాధి అవకాశాలను సృష్టించడం వంటి లక్ష్యాలను ముందుకు తెచ్చింది.

2023–24లో NHAI 56 లక్షల మొక్కలను నాటగా, 2024–25లో మరో 67.47 లక్షల మొక్కలు నాటింది. ఇప్పటివరకు 4.69 కోట్లకు పైగా మొక్కలు జాతీయ రహదారుల వెంట నాటబడ్డాయి.

అంతేకాకుండా, మిషన్ అమృత సరోవర్ (ఏప్రిల్ 2022లో ప్రారంభం) కింద దేశవ్యాప్తంగా 467 నీటి నిల్వలు (water bodies) పునరుద్ధరించబడ్డాయి. వీటివల్ల స్థానిక పర్యావరణ వ్యవస్థలు పునరుద్ధరించబడ్డాయి. అంతేకాక, ఈ నీటి నిల్వల తవ్వకాల ద్వారా సుమారు 2.4 కోట్లు క్యూబిక్ మీటర్ల మట్టి రహదారి నిర్మాణానికి లభించి, దాంతో ₹16,690 కోట్ల ఖర్చు ఆదా జరిగింది. 2023–24లో NHAI 631 లక్షల మెట్రిక్ టన్నుల రీసైకిల్ పదార్థాలను — ఫ్లై యాష్, ప్లాస్టిక్ వ్యర్థాలు, పునర్వినియోగ ఆస్ఫాల్ట్ వంటి వాటిని — ఉపయోగించి రహదారి నిర్మాణం చేపట్టింది. దీని ద్వారా పర్యావరణానికి మేలు చేసే, ఆర్థికంగా నిలకడైన నిర్మాణ విధానం సాధ్యమైంది.

 

సాంప్రదాయ రహదారుల దాటి — డిజిటల్ యుగంలోని నూతన మార్గాలు

ఇప్పటి భారత రహదారులు కేవలం రవాణా మార్గాలు మాత్రమే కావు; అవి రూపాంతరం దిశగా పయనించే ఇంజిన్లు అవుతున్నాయి. నగరాలను కలిపే మిషన్‌గా ప్రారంభమైన ఈ ప్రయత్నం, ఇప్పుడు ప్రజలను, డేటాను, నిర్ణయాలను అనుసంధానించే ఒక డిజిటల్, స్మార్ట్, పర్యావరణ స్నేహపూర్వక వ్యవస్థగా మారుతోంది.

GIS ఆధారిత ప్రణాళిక, ఇంటెలిజెంట్ ట్రాఫిక్ సిస్టమ్స్, డిజిటల్ టోలింగ్, రాజ్‌మార్గయాత్ర వంటి పౌర కేంద్రీకృత యాప్‌లు — ఇవన్నీ కలిపి దేశ హైవేలను సజీవ నెట్‌వర్క్‌లుగా మారుస్తున్నాయి. ప్రతి ఎక్స్‌ప్రెస్‌వే ఇప్పుడు కేవలం రవాణా మార్గం కాదు — అది భారత డిజిటల్ ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్‌లోని కీలక నోడ్, భద్రత, పారదర్శకత, పర్యావరణ సుస్థిరతకు ప్రతీకగా మారింది. ప్రతి కిలోమీటర్‌లో కేవలం వాహనాలు మాత్రమే కాకుండా — నమ్మకం, సాంకేతికత, రూపాంతరం కూడా ప్రయాణిస్తున్నాయి.


 

మూలాలు

 

రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ


 

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2174761

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2174411

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2159700

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2157694

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2156992

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2139029

https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=2115576

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2100383

https://www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=1945405

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2122700

https://www.pib.gov.in/PressReleseDetailm.aspx?PRID=2091508

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2111288

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2110972

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2081193

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2162163

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2122632

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2178596

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2144860

Press Information Bureau

https://www.pib.gov.in/PressNoteDetails.aspx?NoteId=154624&ModuleId=3

National Payments Corporation of India

https://www.npci.org.in/product/netc/about-netc

(Explainer ID: 158328) आगंतुक पटल : 9
Provide suggestions / comments
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Gujarati , Odia , Telugu , Kannada , Malayalam