Farmer's Welfare
జాతీయ వ్యవసాయ మార్కెట్(ఈ-నామ్)
భారతదేశంలో వ్యవసాయ వాణిజ్యంలో డిజిటలీకరణ
Posted On:
13 APR 2026 4:37PM
కీలకాంశాలు
- 2026 మార్చి నాటికి 23 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాల్లో 1,656 మార్కెట్ల అనుసంధానం.
- 2026 మార్చి నాటికి ఈ-నామ్ వేదికలో 1.80 కోట్ల మంది రైతులు, 2.73 లక్షల వర్తకులు, 4,724 రైతు ఉత్పత్తిదారుల సంఘాలు నమోదయ్యాయి.
- 2016 నుంచి 2026 మార్చి మధ్యకాలంలో రూ.4.84 లక్షల కోట్ల విలువైన 13.25 కోట్ల మెట్రిక్ టన్నుల వాణిజ్యం జరిగింది.
- 2024లో రూ.3.19 లక్షల కోట్ల వాణిజ్యం జరగగా, 2026లో రూ.4.84 లక్షల కోట్ల వాణిజ్యం నమోదవడం మార్కెట్ విస్తరణను సూచిస్తోంది.
- 2026 మార్చి నాటికి ఇటీవలి కాలాల్లో 204.76 లక్షల మెట్రిక్ టన్నుల వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్యం జరగడం సుస్థిర కార్యకలాపాల నిర్వహణకు అద్దంపడుతోంది.
- ఈ-నామ్ యాప్ ద్వారా 247 ఉత్పత్తులకు మొబైల్ ఆధారిత ధరల సమాచార సేవలు అందుతున్నాయి.
పరిచయం
భారతదేశ వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థలో మార్పులు: ఈ-నామ్
భారతదేశ సామాజిక-ఆర్థిక నిర్మాణంలో వ్యవసాయం చాలా కాలంగా ఒక పునాది స్తంభంగా ఉంది. ఇది దేశంలోని దాదాపు సగం మంది శ్రామిక శక్తికి జీవనోపాధిని అందించడంతో పాటు అభివృద్ధి పథాన్ని తీర్చిదిద్దుతోంది. భారతదేశంలో వ్యవసాయ మార్కెటింగ్ చరిత్రాత్మకంగా అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ(ఏపీఎంసీ) చట్రం కింద ఏర్పాటు చేసిన నియంత్రిత మండీల వ్యవస్థ ద్వారా పరిణామం చెందింది. ఇది ప్రాంతాలవారీగా వ్యవసాయ వస్తువుల నిర్మాణాత్మక, వ్యవస్థీకృత వాణిజ్యాన్ని సులభతరం చేసింది.

2016 కంటే ముందు వ్యవసాయ వాణిజ్యం ఎక్కువగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని ఈ మండీ వ్యవస్థలకే పరిమితమై ఉండేది. ప్రతి మార్కెట్ దాని స్వంత నియంత్రణ ద్వారా నడిచేది. ఏపీఎంసీ ఒక వికేంద్రీకృత నమూనాగా బలమైన స్థానిక వ్యాపారాన్ని సులభతరం చేసింది. కానీ అంతర్రాష్ట్ర మార్కెట్ అనుసంధానం, విస్తృత మార్కెట్ ప్రాప్తిలో పరిమితులను కూడా కలిగి ఉంది. వ్యవసాయ ఉత్పత్తి విస్తరణ, వైవిధ్యీకరణతో మార్కెట్ ప్రాప్తిని పెంచే, సామర్థ్యాన్ని మెరుగుపరిచే, పారదర్శక ధరల గుర్తింపును నిర్ధారించే మరింత సమగ్రమైన మార్కెట్ నిర్మాణ అవసరం ఎక్కువగా కనిపించింది. ఈ నేపథ్యంలో వ్యవసాయ వస్తువుల కోసం ఏకీకృత జాతీయ మార్కెట్‌ను రూపొందించడానికి జాతీయ స్థాయిలో ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్‌గా 2016 ఏప్రిల్‌లో ప్రభుత్వం నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్(ఈ-నామ్)ను ప్రారంభించింది. ప్రస్తుతం ఉన్న మండీలను డిజిటల్‌గా అనుసంధానించడం ద్వారా ఈ-నామ్ దేశవ్యాప్తంగా ఉన్న రైతులు, వ్యాపారులు, కొనుగోలుదారుల కోసం అతుకులు లేని ఆన్‌లైన్ ట్రేడింగ్, పారదర్శక ధరల గుర్తింపు, విస్తృత మార్కెట్ ప్రాప్తికి అవకాశం కల్పిస్తుంది.
ఒకే దేశం, ఒకే మార్కెట్: ఈ-నామ్ చోదకశక్తి
ఈ-నామ్ డిజిటల్ వ్యవస్థలో వెబ్ పోర్టల్, మొబైల్ అప్లికేషన్, ప్రత్యేక హెల్ప్‌లైన్, మానవ మద్దతు గల మౌలిక సదుపాయాలు, ఏఐ-ప్రేరిత నాణ్యత అంచనా వ్యవస్థలతో కూడిన బహుళ-స్థాయిల నిర్మాణం ఉంటుంది. ఈ-నామ్ రైతులకు విస్తృతమైన, విభిన్నమైన కొనుగోలుదారుల సమూహాన్ని అందుబాటులోకి తెస్తుంది. తద్వారా మెరుగైన ధర లభించేందుకు అవకాశాలను బలోపేతం చేస్తుంది. ఇది అధికారిక డిజిటల్ చెల్లింపు వ్యవస్థల అవలంబనను ప్రోత్సహిస్తుంది. వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థలో గొప్ప ఆర్థిక చేరిక, లావాదేవీల సామర్థ్యానికి దోహదపడుతుంది.
ఈ-నామ్ వెబ్ పోర్టల్: పూర్తిస్థాయి డిజిటల్ వ్యవసాయ మార్కెటింగ్
ఈ-నామ్ పోర్టల్(enam.gov.in) వ్యవసాయ వస్తువుల ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ కోసం మార్కెట్లను ఏకీకృత జాతీయ మార్కెట్ వేదికకు సజావుగా అనుసంధానించడం ద్వారా పూర్తిస్థాయి డిజిటల్ వ్యవసాయ మార్కెటింగ్‌ను సులభతరం చేస్తుంది. దీని విస్తరిస్తున్న వ్యవస్థ.. పెరుగుతున్న మార్కెట్ అనుసంధానాన్ని ప్రతిబింబిస్తుంది. అనుసంధానించిన మార్కెట్ల సంఖ్య 2024లో 1,389 ఉండగా మార్చి 2026 నాటికి 1,656కు పెరిగింది. ఇవి 23 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాలలో విస్తరించి ఉన్నాయి.

2016లో ప్రారంభమైనప్పటి నుంచి ఈ-నామ్ వ్యవసాయ వాణిజ్యంలో గణనీయమైన వృద్ధిని సులభతరం చేసింది. 2016 నుంచి 2026 మార్చి వరకు ఈ వేదిక 13.25 కోట్ల మెట్రిక్ టన్నుల వస్తువుల వ్యాపారానికి అవకాశం కల్పించింది. దీని ద్వారా మొత్తం రూ.4.84 లక్షల కోట్ల వాణిజ్య విలువను సృష్టించింది. ఇది దాని విస్తరిస్తున్న స్థాయిని, పెరుగుతున్న భాగస్వామ్యాన్ని ప్రతిబింబిస్తుంది. మౌలిక సదుపాయాల అభివృద్ధికి మద్దతుగా, డిజిటల్ వ్యవస్థతో మార్కెట్ల అనుసంధానాన్ని బలోపేతం చేయడానికి, మొత్తం మార్కెట్ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ప్రభుత్వం ఒక్కో మార్కెట్‌కి రూ.75 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ వృద్ధి దాని పెరుగుతున్న వాటాదారుల సంఖ్యలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. మార్చి 2026 నాటికి ఈ వేదిక 1.80 కోట్లకు పైగా రైతులు, 2.73 లక్షల మంది వ్యాపారులు, 4,724 రైతు-ఉత్పత్తిదారుల సంఘాలను(ఎఫ్‌పీవోల) నమోదు చేసింది. ఇది దాని విస్తృత ప్రాప్తిని సూచిస్తుంది.

ఈ పోర్టల్ డిజిటల్ వ్యవస్థలోకి ప్రవేశం, ప్రత్యేక గుర్తింపుదారులతో లాట్ సృష్టి, నాణ్యత పరీక్ష, పోటీ ఆన్‌లైన్ బిడ్డింగ్, రియల్ టైమ్ బిడ్ ట్రాకింగ్, ధరల గుర్తింపు, నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకు ఎలక్ట్రానిక్ చెల్లింపులతో కూడిన మొత్తం వ్యవసాయ వాణిజ్య జీవనచక్రాన్ని సమర్థిస్తుంది.
ఇది వస్తువుల వారీగా వాణిజ్య పరిమాణాలు, మార్కెట్ స్థాయి ధరల ధోరణులు, వాటాదారుల నమోదులు, అంర్రాష్ట్ర వాణిజ్య ప్రవాహాలపై రియల్ టైమ్ అంతర్దృష్టులను అందించే ప్రత్యక్ష డాష్‌బోర్డ్‌ను కలిగి ఉంటుంది. తద్వారా పారదర్శకతను పెంచుతుంది, సమాచారంతో కూడిన నిర్ణయం తీసుకోవడానికి అవకాశం చేస్తుంది.
ఈ-నామ్ పోర్టల్-కీలక డిజిటల్ ఫీచర్లు
- సింగిల్-విండో సర్వీస్: వస్తువుల రాక, నాణ్యత పరీక్ష, బిడ్డింగ్, చెల్లింపు, అన్నీ ఒకే వేదికలో ఉంటాయి.
- విశిష్ట లాట్ ఐడీ పర్యవేక్షణ: ప్రతి లాట్ గేట్ ఎంట్రీ నుంచి తుది విక్రయం వరకు మొబైల్ ద్వారా పర్యవేక్షణ ఉంటుంది.
- లైవ్ ప్రైస్ డాష్‌బోర్డ్: ఎప్పటికప్పుడు వస్తువుల ధరలు, మార్కెట్‌లోకి ప్రవేశాలు, వాణిజ్య పరిమాణాలు బహిరంగంగా అందుబాటులో ఉంటాయి.
- 12-భాషల ఇంటర్‌ఫేస్: హిందీ, ఇంగ్లీష్, గుజరాతీ, మరాఠీ, తెలుగు, బెంగాలీ, తమిళం, ఒడియా, ఇతర భాషలు.
- సెకండరీ సేల్ మాడ్యూల్: ఈ వేదికలో ఇప్పటికే కొనుగోలు చేసిన లాట్‌లను మళ్లీ విక్రయించడానికి అనుమతిస్తుంది.
- అంతర్రాష్ట్ర వాణిజ్య సౌకర్యం: స్టేట్ యూనిఫైడ్ లైసెన్స్ వ్యాపారులను రాష్ట్ర సరిహద్దుల వెంబడి బిడ్ చేయడానికి అనుమతిస్తుంది.
క్లిక్స్ నుంచి పంటల వరకు: ప్రయాణంలో ఈ-నామ్
2016 అక్టోబర్‌లో ప్రారంభించిన ఈ-నామ్ మొబైల్ యాప్.. వాణిజ్యం, మార్కెట్ సంబంధిత సేవలను పొందడం కోసం సరళీకృతమైన, మొబైల్ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్‌ను అందించడం ద్వారా వెబ్ పోర్టల్‌ను పూర్తి చేస్తుంది. ఇది ప్లాట్‌ఫారమ్ పరిధిని స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు విస్తరిస్తుంది. రైతులు, వ్యాపారులు, ఇతర వాటాదారులు మార్కెట్ సమాచారాన్ని పొందడానికి, వాణిజ్య కార్యకలాపాల్లో సమయానుకూలంగా, ప్రాంతంతో సంబంధం లేకుండా పాల్గొనడానికి వీలు కల్పిస్తుంది. 2025 డిసెంబర్ నాటికి ఈ అప్లికేషన్ 247 గుర్తించిన వస్తువుల కోసం ఉచిత ధర సమాచారాన్ని అందిస్తుంది. ఇది సమాచారంతో కూడిన, సకాలంలో నిర్ణయం తీసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది.
14 జూలై 2022న ప్లాట్‌ఫారమ్ ఆఫ్ ప్లాట్‌ఫారమ్స్(పీఓపీ) పరిచయం చేయడం ప్లాట్‌ఫారమ్ పరిణామంలో ఒక కీలక పురోగతి. ఈ సాంకేతిక ఆధారిత చట్రం ఈ-నామ్ మొబైల్ అప్లికేషన్ ద్వారా అందుబాటులో ఉన్న ఏకీకృత డిజిటల్ ఇంటర్‌ఫేస్ ద్వారా విస్తృత శ్రేణి సేవలను అనుసంధానిస్తుంది. పీఓపీ ద్వారా వినియోగదారులు లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్, నాణ్యత హామీ, గ్రేడింగ్, ప్యాకేజింగ్, వ్యవసాయ ఇన్‌పుట్‌లు, ఆర్థిక, బీమా సేవలు, వాతావరణ సమాచారం, పంట అంచనా వంటి సలహా మద్దతుతో సహా వ్యవసాయ విలువ గొలుసు అంతటా సేవలను పొందవచ్చు.
ఇంకా ఈ వేదిక ఇ-కామర్స్ వేదికలు, ప్రైవేట్ అగ్రి-మార్కెట్ సంస్థలతో అనుసంధానానికి అవకాశం కల్పిస్తుంది. తద్వారా మార్కెట్ ప్రాప్తిని విస్తృతం చేస్తుంది. పూర్తిస్థాయి వాణిజ్య, అనుబంధ సేవలను బలోపేతం చేస్తుంది.
పరిష్కారాల వైపు గళాలు: ఈ-నామ్ వ్యవస్థలో వినియోగదారుల సాధికారత
రైతులు, వ్యాపారులు, ఇతర వాటాదారుల కోసం ప్రత్యేకమైన మద్దతు, ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని ఈ-నామ్ అందిస్తుంది. వినియోగదారులు టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్(1800 270 0224) ద్వారా సహాయం పొందవచ్చు. ఇది దేశవ్యాప్తంగా ప్రాథమిక మద్దతు ఛానెల్‌గా పనిచేస్తుంది. అలాగే nam@sfac.in, enam.helpdesk@gmail.com వంటి అధికారిక ఇమెయిల్ ఐడీల ద్వారా కూడా సంప్రదించవచ్చు.

ఈ వేదిక ఆన్‌లైన్ ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను అందిస్తుంది. ఇది వినియోగదారులు నేరుగా పోర్టల్ ద్వారా ప్రశ్నలు, ఫిర్యాదులను సమర్పించడానికి అనుమతిస్తుంది. ఈ సమగ్ర మద్దతు చట్రం సమస్యల సకాలంలో పరిష్కారాన్ని, నిరంతర సాంకేతిక సహాయాన్ని నిర్ధారిస్తుంది. ముఖ్యంగా డిజిటల్ మార్కెట్‌ప్లేస్‌ను ఉపయోగిస్తున్న రైతులు, మొదటిసారి వినియోగదారుల కోసం ఇది ఉపయోగకరంగా ఉంటుంది.
ఈ-నామ్ కింద ఈ-పేమెంట్: చెల్లింపులు, పారదర్శకత, చేరిక
ఈ-నామ్ కింద ఉన్న ఈ-పేమెంట్ సిస్టమ్ దాని డిజిటల్ నిర్మాణంలో ఒక కీలకమైన భాగం. ఇది వ్యవసాయ మార్కెట్లలో నిరంతరాయ ఆర్థిక లావాదేవీలకు అవకాశం కల్పిస్తుంది. వాణిజ్యం, చెల్లింపుల సెటిల్‌మెంట్‌ను ఏకీకృత ఎలక్ట్రానిక్ ప్రక్రియతో అనుసంధానించడం ద్వారా ఈ వేదిక సాంప్రదాయ మార్కెట్ కార్యకలాపాలను మార్చడంతో పాటు లావాదేవీల సామర్థ్యాన్ని పెంచుతుంది. ఈ వ్యవస్థ కింద వ్యాపారం పూర్తయిన తర్వాత విక్రయ ఆదాయం నేరుగా రైతుల నమోదిత బ్యాంకు ఖాతాలకు బదిలీ అవుతుంది. తద్వారా మధ్యవర్తులపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. సెటిల్‌మెంట్‌ను క్రమబద్ధం చేస్తుంది. చెల్లింపులు ఎలక్ట్రానిక్‌గా ప్రాసెస్ అవుతాయి. ఇవి సకాలంలో, సురక్షితమైన, పారదర్శకమైన లావాదేవీలను నిర్ధారిస్తాయి.
ఈ వేదిక నెఫ్ట్, ఆర్టీజీఎస్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐతో సహా బహుళ డిజిటల్ చెల్లింపు విధానాలను అనుసంధానిస్తుంది. ఇది రాష్ట్రాలవారీగా స్వీకరించడానికి వీలు కల్పిస్తుంది. ఈ-పేమెంట్ వ్యవస్థ లావాదేవీలను అధికారికం చేయడం, ధ్రువీకరించదగిన ఆర్థిక రికార్డులను సృష్టించడం ద్వారా ఆర్థిక చేరికను ప్రోత్సహిస్తుంది. ఈ రికార్డులు రైతులకు సంస్థాగత రుణ, ఇతర ఆర్థిక సేవలను పొందడాన్ని సులభతరం చేస్తాయి.
ఈ-ఎన్‌డబ్ల్యూఆర్, ఈ-నామ్ అనుసంధానం ద్వారా పంట అనంతర మౌలిక సదుపాయాల బలోపేతం
పంట అనంతర నిర్వహణను బలోపేతం చేయడంపై పెరుగుతున్న ప్రాధాన్యత.. శాస్త్రీయ నిల్వ వ్యవస్థలను సమర్థవంతమైన మార్కెట్ ప్రాప్తి యంత్రాంగాలతో అనుసంధానించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్తోంది. ఈ నేపథ్యంలో మరింత నిరంతరాయ, సమర్థవంతమైన వ్యవసాయ మార్కెటింగ్ చట్రాన్ని కల్పించడానికి ఎలక్ట్రానిక్ నెగోషియబుల్ వేర్‌హౌస్ రిసీప్ట్(ఈ-ఎన్‌డబ్ల్యూఆర్) వ్యవస్థ ఈ-నామ్‌తో అనుసంధానితమైంది. ఈ-ఎన్‌డబ్ల్యూఆర్ వ్యవస్థ నిల్వ చేసిన ఉత్పత్తుల డిజిటల్ డాక్యుమెంటేషన్, బదిలీ, మానిటైజేషన్‌కు అవకాశం కల్పించడం ద్వారా పంట అనంతర వ్యవసాయ నిర్వహణలో ఒక ముఖ్యమైన సంస్థాగత సంస్కరణగా నిలుస్తుంది. వేర్‌హౌసింగ్ (అభివృద్ధి, నియంత్రణ) చట్టం-2007 కింద ప్రవేశపెట్టిన ఈ వ్యవస్థ.. వేర్‌హౌసింగ్ డెవలప్‌మెంట్ అండ్ రెగ్యులేటరీ అథారిటీ(డబ్ల్యూడీఆర్ఏ) ద్వారా గుర్తింపు పొందిన గిడ్డంగులలో నిల్వ చేసిన వస్తువుల యాజమాన్యాన్ని ధ్రువీకరించే సురక్షితమైన ఎలక్ట్రానిక్ సాధనంగా పనిచేస్తుంది.

సాంప్రదాయ నెగోషియబుల్ వేర్‌హౌస్ రిసీప్ట్(ఎన్‌బ్ల్యూఆర్)పై నిర్మించిన ఈ-ఎన్‌డబ్ల్యూఆర్ వ్యవస్థ పారదర్శకత, ఆచూకీ గుర్తించడం, బదిలీ సౌలభ్యాన్ని పెంచుతుంది. తద్వారా భౌతిక కదలిక లేకుండా వస్తువుల వ్యాపారాన్ని సులభతరం చేస్తుంది. ఇది నిల్వ, మార్కెట్ ప్రాప్తి మధ్య కీలకమైన సంబంధాన్ని ఏర్పాటు చేస్తుంది. అందువల్ల, ఈ-ఎన్‌డబ్ల్యూఆర్ శాస్త్రీయ నిల్వ, యాజమాన్య ధ్రువీకరణను సులభతరం చేస్తుంది. అటువంటి నిల్వ చేసిన ఉత్పత్తుల సమర్థవంతమైన, పారదర్శక వ్యాపారం కోసం ఈ-నామ్ దేశవ్యాప్త డిజిటల్ వేదికను అందిస్తుంది.
ఈ సమీకృత చట్రంలో రైతులు, వ్యాపారులు, రైతు-ఉత్పత్తిదారుల సంఘాలు(ఎఫ్‌పీవో) తమ ఉత్పత్తులను డబ్ల్యూడీఆర్ఏ-గుర్తింపు పొందిన గిడ్డంగులలో నిల్వ చేయవచ్చు. ఈ-ఎన్‌డబ్ల్యూఆర్‌లను పొందవచ్చు. నేరుగా ఈ-నామ్ వేదికలో విక్రయించవచ్చు. ఇది మార్కెట్‌లకు భౌతిక రవాణాపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. తద్వారా రవాణా ఖర్చులు, పంట అనంతర నష్టాలను తగ్గిస్తుంది. అలాగే తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితిని కూడా తగ్గిస్తుంది.
ఈ-ఎన్‌డబ్ల్యూఆర్‌లను సంస్థాగత క్రెడిట్ పొందడానికి పూచీకత్తుగా ఉపయోగించవచ్చు. ఇది నగదు లభ్యతను పెంచడంతో పాటు వాటాదారులు విక్రయాల సమయాన్ని తగ్గించడానికి వీలు కల్పిస్తుంది. ఈ-నామ్ ధరల గుర్తింపు, పోటీ బిడ్డింగ్ యంత్రాంగాలతో కలిసినప్పుడు ఈ అనుసంధానం మార్కెట్ ప్రాప్తిని, మెరుగైన ధర సాక్షాత్కారాన్ని బలోపేతం చేస్తుంది.
ఈ వ్యవస్థ నిల్వ చేసిన ఉత్పత్తుల ప్రామాణిక గ్రేడింగ్, పరీక్షల ద్వారా నాణ్యత ఆధారిత వ్యాపారాన్ని కూడా ప్రోత్సహిస్తుంది. నాణ్యత హామీని మార్కెట్ ప్రాప్తితో సమలేఖనం చేయడం ద్వారా ఈ-ఎన్‌డబ్ల్యూఆర్, ఈ-నామ్ అనుసంధానం నమ్మకాన్ని పెంచుతుంది. ప్రామాణీకరణను ప్రోత్సహించడంతో పాటు మరింత సమర్థవంతమైన, పారదర్శకమైన వ్యవసాయ మార్కెట్లకు దోహదం చేస్తుంది.
ముగింపు
నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్(ఈ-నామ్) భారతదేశంలో వ్యవసాయ మార్కెటింగ్ పరివర్తనలో ఒక ముఖ్యమైన అడుగు. దేశవ్యాప్తంగా మార్కెట్లను డిజిటల్‌గా అనుసంధానించడం, పారదర్శకమైన, సాంకేతిక ఆధారిత వాణిజ్యాన్ని సులభతరం చేయడం ద్వారా ఈ వేదిక మార్కెట్ సంబంధాలను బలోపేతం చేసింది. రైతులు, ఇతర వాటాదారుల కోసం అవకాశాలను విస్తరించింది.
వెబ్ పోర్టల్, మొబైల్ అప్లికేషన్, ప్లాట్‌ఫారమ్ ఆఫ్ ప్లాట్‌ఫారమ్స్(పీఓపీ), అనుబంధ మద్దతు మౌలిక సదుపాయాలతో కూడిన దాని సమగ్ర డిజిటల్ వ్యవస్థ ధరల గుర్తింపును మెరుగుపరిచింది. మార్కెట్ ప్రాప్తిని విస్తృతం చేసింది. డిజిటల్ లావాదేవీల అవలంబనను ప్రోత్సహించింది. ఎలక్ట్రానిక్ నెగోషియబుల్ వేర్‌హౌస్ రిసీప్ట్(ఈ-ఎన్‌డబ్ల్యూఆర్) వంటి పరిపూరకరమైన కార్యక్రమాలు నిల్వ, ఆర్థికం, మార్కెట్ ప్రాప్తిని అనుసంధానించడం ద్వారా విలువ గొలుసును మరింత బలోపేతం చేశాయి.
విస్తరిస్తున్న స్థాయి, పెరుగుతున్న వాటాదారుల భాగస్వామ్యం, పెరుగుతున్న వాణిజ్య పరిమాణాలతో ఇ-నామ్ మరింత సమగ్రమైన, సమర్థవంతమైన, పారదర్శకమైన వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థ ఆవిర్భావానికి దోహదం చేస్తోంది. ప్లాట్‌ఫారమ్ అభివృద్ధి చెందుతూనే ఉన్నందున, మార్కెట్ అనుసంధానాన్ని మరింత బలోపేతం చేయడానికి, రైతులకు విలువ సాక్షాత్కారాన్ని పెంచడానికి, ఏకీకృత జాతీయ మార్కెట్ సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఇది సిద్ధంగా ఉంది.
***
(Explainer ID: 158279)
आगंतुक पटल : 11
Provide suggestions / comments