Technology
భారతదేశ బహుళ-విపత్తు ముందస్తు హెచ్చరిక నిర్ణయ సహాయక వ్యవస్థ
వాతావరణ అంచనా, విపత్తు ముప్పు తగ్గింపు దిశగా డిజిటల్ పరివర్తన
Posted On:
02 APR 2026 11:17AM
కీలకాంశాలు
- భారతదేశ బహుళ-విపత్తుల ముందస్తు హెచ్చరిక నిర్ణయ సహాయక వ్యవస్థ(మల్టీ-హజార్డ్ ఎర్లీ వార్నింగ్ డెసిషన్ సపోర్ట్ సిస్టమ్(ఎంహెచ్ఈడబ్ల్యూ-డీఎస్ఎస్) విడివిడిగా ఉన్న వాతావరణ అంచనా నుంచి సమగ్రమైన, స్వయంచాలక అంచనా వైపు పూర్తి డిజిటల్ మార్పును సాధ్యం చేస్తుంది.
- ప్రభావ-ఆధారిత, ప్రాంతీయ-నిర్దిష్ట హెచ్చరికలు ఇప్పుడు భారతదేశం, పొరుగు ప్రాంతాలలోని దాదాపు 80% జనాభాకు చేరుతున్నాయి.
- రియల్ టైమ్ అంచనాలు, ప్రభావ-ఆధారిత హెచ్చరికలు అంచనా తయారీ సమయాన్ని 50% తగ్గించాయి. అంచనా కచ్చితత్వాన్ని 30% మెరుగుపరిచాయి.
- ఐఎండీ జారీ చేసే 3-5 రోజుల ముందస్తు అంచనాలలో తుఫాను తీరం దాటే ప్రదేశం అంచనా లోపం తగ్గడం వల్ల, ఎంహెచ్ఈడబ్ల్యూ-డీఎస్ఎస్ అమలు చేయడం 1999 నుంచి 2024 మధ్య కాలంలో తరలింపు ఖర్చులను మూడింట ఒక వంతుకు తగ్గించింది.
పరిచయం
భారతదేశం తన వైవిధ్యభరితమైన భౌగోళిక స్థితి, సుదీర్ఘ తీరప్రాంతం, రుతుపవనాలపై ఆధారపడిన వాతావరణం కారణంగా తుఫానులు, వరదలు, వడగాల్పులు, కరువులు, కొండచరియలు విరిగిపడటం వంటి తీవ్రమైన వాతావరణ సంఘటనలకు ఎక్కువగా గురవుతుంది. భారత వాతావరణ శాఖ(ఐఎండీ), భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ ప్రకారం.. భారతదేశం ప్రతి సంవత్సరం వందలాది తీవ్ర వాతావరణ సంఘటనలను ఎదుర్కొంటుంది. ఇందులో వరదలు దాదాపు 40 మిలియన్ హెక్టార్ల భూమిని ప్రభావితం చేస్తాయి. ఇటీవలి దశాబ్దాలలో వడగాల్పులు మరింత తరచుగా సంభవిస్తున్నాయి. కౌన్సిల్ ఆన్ ఎనర్జీ, ఎన్విరాన్‌మెంట్ అండ్ వాటర్(సీఈఈడబ్ల్యూ) ప్రకారం.. భారతదేశంలోని 75% కంటే ఎక్కువ జిల్లాలు బహుళ వాతావరణ ముప్పులకు గురవుతున్నాయి. అయితే తుఫానులు, వరదలు మాత్రమే విపత్తు సంబంధిత నష్టాలలో మెజారిటీ వాటాను కలిగి ఉన్నాయి. ఈ నేపథ్యంలో, మల్టీ-హజార్డ్ ఎర్లీ వార్నింగ్ డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ స్వదేశీ అభివృద్ధి ఒక సమయానుకూల, వ్యూహాత్మక అడుగు. కచ్చితమైన అంచనా, సమగ్ర ముప్పు విశ్లేషణ విపత్తు నష్టాలను గణనీయంగా తగ్గిస్తాయి. ముందస్తు తరలింపు మరియు సంసిద్ధత చర్యలను సాధ్యం చేస్తాయి. సంక్లిష్టమైన వాతావరణ డేటాను ప్రభుత్వాలు, సమాజాలు, అత్యవసర స్పందన దళాల కోసం ఉపయోగపడే హెచ్చరికలుగా మార్చడం ద్వారా ప్రజల భద్రతను బలోపేతం చేస్తాయి.
ఎంహెచ్ఈడబ్ల్యూ-డీఎస్ఎస్ ప్రధాన లక్ష్యాలు
ఎంహెచ్ఈడబ్ల్యూ-డీఎస్ఎస్ అనేది ఓపెన్ సోర్స్ టెక్నాలజీ. స్వదేశీ నైపుణ్యాన్ని ఉపయోగించి ఐఎండీ అభివృద్ధి చేసిన ఒక అధునాతన డిజిటల్ అంచనా వేదిక. మిషన్ మౌసమ్ కింద ఒక మైలురాయి వంటి డిజిటల్ పరివర్తన చొరవగా ప్రవేశపెట్టిన ఈ వ్యవస్థ.. భారతదేశపు రియల్ టైమ్ వాతావరణ పర్యవేక్షణ, ముందస్తు హెచ్చరిక సామర్థ్యాలను బలోపేతం చేస్తుంది.
ఎంహెచ్ఈడబ్ల్యూ-డీఎస్ఎస్ అధికారికంగా జనవరి 2024లో ప్రారంభమైంది. జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(జీఐఎస్) మ్యాప్స్ వంటి సాధనాలను ఉపయోగించి రియల్ టైమ్‌లో పనిచేస్తుంది. ఇది వాతావరణాన్ని అంచనా వేసేవారికి వాతావరణ సమాచారాన్ని త్వరగా సేకరించడానికి, విశ్లేషించడానికి, స్పష్టమైన, వినియోగదారు-స్నేహపూర్వక రీతిలో వ్యాప్తి చేయడానికి వీలు కల్పిస్తుంది. ఉపగ్రహ, రాడార్ డేటాతో సహా వివిధ పరిశీలనా డేటాను, ఆధునిక అంచనా సాధనాలను ఏకీకృతం చేయడం ద్వారా ఈ వ్యవస్థ వేగవంతమైన, విశ్వసనీయమైన ముందస్తు హెచ్చరికలను అందిస్తుంది. రైతులు, రవాణా సేవలు, మత్స్యకారులు, విద్యుత్ సరఫరాదారులు, పర్యాటక రంగం కోసం రంగాల వారీగా ప్రత్యేక హెచ్చరికలను అందిస్తుంది.

ఎంహెచ్ఈడబ్ల్యూ-డీఎస్ఎస్ ప్రాథమిక లక్ష్యం భారతదేశం అంతటా కచ్చితమైన, రియల్ టైమ్, ప్రభావ-ఆధారిత బహుళ-విపత్తు అంచనాలను అందించగల సమగ్ర, స్వదేశీ అంచనా వ్యవస్థను నిర్మించడం. సమాచార ప్రవాహాన్ని మెరుగుపరచడం, సకాలంలో ముందస్తు హెచ్చరికలను సాధ్యం చేయడం ద్వారా అంచనా వేసేవారికి, నిర్ణయాధికారులకు, సమాజాలకు సాధికారత కల్పించేలా ఈ వ్యవస్థ రూపొందింది. ఈ సామర్థ్యాల ద్వారా ఈ వ్యవస్థ ప్రభావ-ఆధారిత అంచనా, ముప్పు-ఆధారిత హెచ్చరికలకు మద్దతు ఇస్తుంది. ఇది ఐఎండీలోని వాతావరణాన్ని అంచనా వేసేవారు సంక్లిష్ట వాతావరణ డేటాను వినియోగదారుల కోసం ఉపయోగపడే సమాచారంగా మార్చడానికి అనుమతిస్తుంది. ఈ విధానం విపత్తు సంసిద్ధతను బలపరుస్తుంది. ముందస్తు హెచ్చరిక సమాచారం వివిధ రంగాలు, సమాజాలకు అందుబాటులో ఉండేలా, విశ్వసనీయమైనదిగా, సంబంధితంగా ఉండేలా చూడటం ద్వారా ప్రజల భద్రతను మెరుగుపరుస్తుంది.
ఎంహెచ్ఈడబ్ల్యూ-డీఎస్ఎస్ విశిష్ట లక్షణాలు
ఆటోమేటెడ్ వాతావరణ డేటా ప్రాసెసింగ్: 90% కంటే ఎక్కువ వాతావరణ డేటా సేకరణ, నాణ్యత తనిఖీలు, ఏకీకరణ ఆటోమేట్ అయ్యాయి. ఇది వాతావరణ వ్యవస్థలను, వాటి వల్ల కలిగే ప్రభావాలను వేగంగా గుర్తించడానికి వీలు కల్పిస్తుంది.
అంచనా నమూనాల మెరుగైన వినియోగం: ఇప్పుడు వాతావరణాన్ని అంచనా వేయడంలో 95% కంటే ఎక్కువ సంఖ్యాపరమైన వాతావరణ అంచనా నమూనా ఇన్‌పుట్‌లు ఉపయోగిస్తున్నారు. ఇది వివిధ వాతావరణ ప్రమాదాల ముప్పు అంచనాను మెరుగుపరుస్తుంది.
పునర్నిర్మించిన అంచనా వ్యవస్థ: మొత్తం అంచనా, హెచ్చరికల తయారీ ప్రక్రియ పునర్నిర్మితమైంది. ఇది ఎప్పటికప్పుడు హెచ్చరికలు, వేగంగా నిర్ణయం తీసుకోవడాన్ని సాధ్యం చేస్తుంది.
సుదీర్ఘ అంచనా ముందస్తు సమయం: అంచనా ముందస్తు సమయం 5 రోజుల నుంచి 7 రోజులకు పెరిగింది. ఇది అధికారులు, ప్రజలు ముందుగానే సిద్ధమవ్వడానికి అనుమతిస్తుంది.
వేగవంతమైన అంచనా తయారీ: అంచనాలను సిద్ధం చేయడానికి అవసరమైన సమయం 6 గంటల నుంచి సుమారు 3 గంటలకు తగ్గింది. ఇది హెచ్చరికలను వేగంగా పంపడానికి వీలు కల్పిస్తుంది.
ఖర్చు ఆదా, స్వయం సమృద్ధి: ఈ వ్యవస్థ సుమారు రూ.250 కోట్ల ఖర్చును ఆదా చేసింది. విదేశీ విక్రేతలపై ఆధారపడటాన్ని తొలగించింది. భారతదేశ సాంకేతిక స్వయం సమృద్ధిని బలోపేతం చేసింది.
సమర్థవంతమైన తుఫాను అంచనా: బిపర్‌జోయ్ తుఫాను, దానా తుఫానుల సమయంలో కచ్చితమైన అంచనాలు సకాలంలో తరలింపును సాధ్యం చేశాయి. ఫలితంగా గుజరాత్, ఒడిశాలో ఎలాం ప్రాణనష్టం నమోదుకాలేదు.
తగ్గిన తరలింపు ఖర్చులు: మెరుగుపరచిన ముందస్తు హెచ్చరికలు ఐఎండీ జారీ చేసే 3-5 రోజుల ముందస్తు అంచనాలలో తుఫాను తీరం దాటే పాయింట్ అంచనా లోపం తగ్గడం వల్ల 1999 నుంచి 2024 వరకు తరలింపు ఖర్చులను మూడింట ఒక వంతుకు తగ్గించడంలో సహాయపడ్డాయి.
ఎంహెచ్ఈడబ్ల్యూ-డీఎస్ఎస్ భారత ప్రభుత్వ "వాతావరణానికి సిద్ధంగా ఉన్న, వాతావరణాన్ని పసిగట్టగలిగే దేశం" అనే దార్శనికతను ప్రతిబింబిస్తుంది. "హర్ హర్ మౌసమ్, హర్ ఘర్ మౌసమ్" అనే తత్వాన్ని కలిగి ఉంది. ఇది ప్రతి ఇంటికి, రంగానికి, ప్రాంతానికి సకాలంలో, ఉపయోగపడే వాతావరణ సమాచారం చేరుతుందని నిర్ధారిస్తుంది.
ఎంహెచ్ఈడబ్ల్యూ-డీఎస్ఎస్‌కి మద్దతు ఇచ్చే సంస్థాగత నిర్మాణం
మల్టీ-హజార్డ్ ఎర్లీ వార్నింగ్ డెసిషన్ సపోర్ట్ సిస్టమ్(ఎంహెచ్ఈడబ్ల్యూ-డీఎస్ఎస్) అనేది మిషన్ మౌసమ్ చొరవ కింద భారత వాతావరణ శాఖ ద్వారా దేశీయంగా అభివృద్ధి చేసినన అత్యాధునిక అప్లికేషన్. ఇది వాతావరణ అంచనాలను రూపొందించడానికి, భారీ పరిమాణంలో వాతావరణ డేటాను నిర్వహించడానికి, సకాలంలో వాతావరణ హెచ్చరికలను అందించడానికి రూపొందించిన వెబ్‌జీఐఎస్-ఆధారిత డిజిటల్ వేదిక. ఈ వ్యవస్థలో భాగంగా అనేక రంగాలవారీగా జియోస్పేషియల్ అప్లికేషన్లు అభివృద్ధి చేశారు. అటువంటి ఒక అప్లికేషన్ మౌసమ్‌గ్రామ్. హైపర్-లోకల్ వాతావరణ అంచనాల చివరి మైలు వ్యాప్తిని సాధ్యం చేస్తుంది. ఇది ముఖ్యమైన వాతావరణ సమాచారం పౌరులకు, వాతావరణంపై ఆధారపడిన రంగాలకు సమర్థవంతంగా చేరేలా చేస్తుంది.
భూవిజ్ఞాన మంత్రిత్వ శాఖ(ఎంఓఈఎస్):
ఎంఓఈఎస్ అనేది భారత ప్రభుత్వ నోడల్ మంత్రిత్వ శాఖ. ఇది ప్రజల భద్రత, జాతీయ అభివృద్ధి కోసం వాతావరణ, సముద్ర ప్రక్రియలను పర్యవేక్షించడానికి, అంచనా వేయడానికి, అర్థం చేసుకోవడానికి కార్యాచరణ సేవలు, శాస్త్రీయ పరిశోధనలను అందిస్తుంది. ఇది భారత వాతావరణ శాఖ, దేశవ్యాప్తంగా వాతావరణ, శీతోష్ణస్థితి సేవలకు మద్దతు ఇచ్చే ఇతర అంచనా, పరిశోధనా కేంద్రాలను పర్యవేక్షిస్తుంది.
భారత వాతావరణ శాఖ(ఐఎండీ):
1875లో స్థాపించిన ఐఎండీ వాతావరణ శాస్త్రం, అనుబంధ శాస్త్రాలకు బాధ్యత వహించే ప్రధాన ప్రభుత్వ సంస్థగా పనిచేస్తుంది. ఇది క్రమబద్ధమైన వాతావరణ పరిశీలనలను నిర్వహిస్తుంది. విపత్తు ముప్పు తగ్గింపు, వ్యవసాయం, విద్యుత్, పునరుత్పాదక ఇంధనం, పర్యావరణం, ఆరోగ్యం, నీరు, నీటిపారుదల, భూరవాణా, షిప్పింగ్, విమానయానం, ఆన్‌షోర్, ఆఫ్‌షోర్ పరిశ్రమలు, పర్యాటకం మొదలైన వాతావరణ-సున్నిత రంగాలకు మద్దతుగా ప్రస్తుత, అంచనా వాతావరణ సమాచారాన్ని అందిస్తుంది. ఎంహెచ్ఈడబ్ల్యూ-డీఎస్ఎస్ కింద సమగ్ర డిజిటల్ వ్యవస్థల ద్వారా రియల్ టైమ్ అంచనాలు, హెచ్చరికలను రూపొందించడం ద్వారా ఐఎండీ కేంద్ర కార్యాచరణ పాత్రను పోషిస్తుంది.
మిషన్ మౌసమ్:
2024 సెప్టెంబర్‌లో కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన మిషన్ మౌసమ్.. దేశవ్యాప్తంగా వాతావరణ అంచనా, ముందస్తు హెచ్చరిక సామర్థ్యాలను బలోపేతం చేసే లక్ష్యంతో పనిచేసే ఒక ప్రతిష్టాత్మక చొరవ. ఈ మిషన్ తుఫానులు, భారీ వర్షపాతం, వడగాల్పుల వంటి తీవ్రమైన వాతావరణ సంఘటనల అంచనాల కచ్చితత్వం, రిజల్యూషన్, ముందస్తు సమయాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఎంహెచ్ఈడబ్ల్యూ-డీఎస్ఎస్ లోపల ఈ మిషన్ పరిశీలనా వ్యవస్థలు, డేటా అసిమిలేషన్, మోడలింగ్ సామర్థ్యాలను మెరుగుపరచడం ద్వారా అంచనా వేయడంలో శాస్త్రీయ, సాంకేతిక వెన్నెముకను బలపరుస్తుంది. సమర్థవంతమైన విపత్తు సంసిద్ధత కోసం సకాలంలో వాతావరణ హెచ్చరికలను సాధ్యం చేస్తుంది.
మీకు తెలుసా?
2024 జనవరిలో ప్రారంభించిన మౌసమ్‌గ్రామ్ అనేది ఎంఓఈఎస్ కింద ఐఎండీ అభివృద్ధి చేసిన వెబ్ ఆధారిత, హైపర్-లోకల్ వాతావరణ అంచనా పోర్టల్. ఈ వేదిక భారతదేశం అంతటా 1.5 లక్షలకు పైగా పిన్ కోడ్‌లు, 5,700 బ్లాక్‌లు, 6.2 లక్షలకు పైగా గ్రామాలను కవర్ చేస్తూ 10 రోజుల వరకు ప్రాంతీయ-నిర్దిష్ట అంచనాలను అందిస్తుంది. ఐఎండీ వెబ్‌సైట్, మౌసమ్ మొబైల్ యాప్, సాచెట్ వేదిక, ఇ-పంచాయత్ సేవ, ఏపీఐల ద్వారా అందుబాటులో ఉన్న ఈ పోర్టల్ విస్తృత ప్రజల, సంస్థాగత ప్రాప్యతను నిర్ధారిస్తుంది. ఇది 36 గంటల వరకు గంటగంటకూ అంచనాలను, 5 రోజుల వరకు ప్రతి 3 గంటల అంచనాలను, 10 రోజుల వరకు ప్రతి 6 గంటల అంచనాలను అందిస్తుంది. ఇది వాతావరణ సంఘటనల ప్రణాళిక, సంసిద్ధత, ముందస్తు స్పందనను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మౌసమ్‌గ్రామ్ ఆధారంగా.. వాతావరణాన్ని అంచనా వేసేవారు దేశంలోని ఎవరికైనా, ఉత్తర హిందూ మహాసముద్ర ప్రాంతంలోని వారికి, కేంద్ర, రాష్ట్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖల సహకారంతో మత్స్యకారులు, రైతులు, గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ ద్వారా కృషి సఖీ, పశు సఖీలకు, పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ద్వారా వార్డు సభ్యులు, సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులకు చేరుకుంటారు.
ఈ సంస్థలు, వేదికలు కలిసి ఎంహెచ్ఈడబ్ల్యూ-డీఎస్ఎస్ పర్యావరణ వ్యవస్థ కార్యాచరణ వెన్నెముకను ఏర్పరుస్తాయి. పరిశీలన, మోడలింగ్, డిజిటల్ వ్యాప్తిలో వాటి మిశ్రమ సామర్థ్యాలు కచ్చితమైన, ప్రాంతీయ-నిర్దిష్ట అంచనాలను, సకాలంలో ముందస్తు హెచ్చరికలను అందించే భారతదేశ సామర్థ్యాన్ని బలపరుస్తాయి. విపత్తు సంసిద్ధతను మెరుగుపర్చడంతో పాటు దేశవ్యాప్తంగా వాతావరణ-సున్నిత రంగాలకు మద్దతు ఇస్తాయి.
ఎంహెచ్ఈడబ్ల్యూ-డీఎస్ఎస్ కార్యాచరణ నిర్మాణం
ఎంహెచ్ఈడబ్ల్యూ-డీఎస్ఎస్ పెద్ద మొత్తంలో వాతావరణ డేటాను మిళితం చేస్తుంది. మొత్తం పని ప్రక్రియను పునర్నిర్మించడం ద్వారా అంచనా వేయడాన్ని స్వయంచాలితం చేస్తుంది.
రాడార్లు, స్వయంచాలిత వాతావరణ కేంద్రాలు, ఉపగ్రహాలు, ఓడలు, సముద్రపు బోయ్‌లు వంటి బహుళ మూలాల నుంచి ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించడం ద్వారా సమర్థవంతమైన డేటా సేకరణను సాధ్యం చేస్తుంది. ఈ వ్యవస్థ సమాచారాన్ని ఒక ఏకీకృత వేదికపై ప్రామాణికం చేయడంతో పాటు ప్రాసెస్ చేస్తుంది. వాతావరణ నమూనాలను మెరుగ్గా అర్థం చేసుకోవడానికి అధునాతన డేటా విశ్లేషణ, డేటా విజువలైజేషన్‌కు మద్దతు ఇస్తుంది. మల్టీ-మోడల్ ఇంటిగ్రేషన్, ఏకాభిప్రాయ అంచనా ద్వారా, ఇది మోడల్ అవుట్‌పుట్‌లను పరిశీలనలతో పోలుస్తుంది. ఉత్తమంగా పనిచేసే మోడళ్లను ఎంచుకుంటుంది. ముఖ్యంగా తీవ్రమైన సంఘటనల సమయంలో కచ్చితత్వాన్ని మెరుగుపరచడానికి ఎంసెంబుల్ టెక్నిక్‌లు, బయాస్ కరెక్షన్‌ను వర్తింపజేస్తుంది. ఇవి సకాలంలో నిర్ణయం తీసుకోవడానికి మద్దతు ఇస్తాయి. వేగవంతమైన హెచ్చరిక తయారీని సాధ్యం చేయడంతో పాటు వాటాదారులకు, ప్రజలకు సమర్థవంతమైన సమాచార వ్యాప్తిని నిర్ధారిస్తాయి.
ఈ వ్యవస్థకు ప్రధానమైనది వెదర్ అనాలిసిస్ అండ్ ఫోర్కాస్ట్ ఎనేబ్లింగ్ సిస్టమ్(డబ్ల్యూఏఎఫ్ఈఎస్). ఇది అంచనా వేసేవారికి డేటాను విశ్లేషించడానికి, చార్ట్‌లను రూపొందించడానికి, జీఐఎస్-ఆధారిత మ్యాప్‌ల ద్వారా వాతావరణ పరిస్థితులను దృశ్యమానం చేయడానికి సహాయపడుతుంది. ఎంహెచ్ఈడబ్ల్యూ-డీఎస్ఎస్ మునుపటి మాన్యువల్ అంచనా విధానాన్ని భర్తీ చేసింది. కచ్చితమైన వాతావరణ అంచనాలను సిద్ధం చేయడానికి వాతావరణ శాస్త్రవేత్తలను రియల్ టైమ్ పరిశీలనలను మోడల్ అవుట్‌పుట్‌లతో పోల్చడానికి అనుమతిస్తుంది.
ఎంహెచ్ఈడబ్ల్యూ-డీఎస్ఎస్ మరొక ముఖ్య లక్షణం ప్రభావ-ఆధారిత అంచనా, ముప్పు-ఆధారిత హెచ్చరికలపై దాని దృష్టి. వాతావరణ పరిస్థితులను మాత్రమే అంచనా వేయడానికి బదులుగా, తీవ్రమైన వాతావరణం.. వ్యవసాయం, ఆరోగ్యం, ఇంధనం, రవాణా, మౌలిక సదుపాయాలు మొదలైన రంగాలను ఎలా ప్రభావితం చేస్తుందో కూడా ఎంహెచ్ఈడబ్ల్యూ-డీఎస్ఎస్ అంచనా వేస్తుంది. ఈ వ్యవస్థ వివిధ స్థాయిల ముప్పును సూచించడానికి సులభంగా అర్థమయ్యే రంగుల ద్వారా అర్థమయ్యే హెచ్చరికలను అందిస్తుంది. జీఐఎస్-ప్రారంభిత వేదిక ద్వారా ఇది తుఫాను, భారీ వర్షపాతం, వడగాల్పులు, ఉరుములు/మెరుపులు, సముద్ర పరిస్థితులు వంటి బహుళ ప్రమాదాల కోసం అలర్ట్‌లను ఒకచోట చేర్చుతుంది. అంచనాలు సిద్ధమైన తర్వాత, డిజిటల్ వేదికలు, ఎస్ఎంఎస్‌లు, ఇమెయిల్‌లు, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్‌ఫేస్(ఏపీఐ), మొబైల్ యాప్(మౌసమ్), కామన్ అలర్టింగ్ ప్రోటోకాల్(సీఏపీ), గ్రాఫికల్ బులెటిన్ల ద్వారా హెచ్చరికలు అధికారులతో, ప్రజలతో పంచుకుంటుంది. ఇది సకాలంలో చర్య తీసుకోవడానికి, విపత్తు సంసిద్ధతను మెరుగుపరచడానికి వీలు కల్పిస్తుంది.
రియల్ టైమ్ పరిశీలనలను అధునాతన మోడలింగ్ సాధనాలతో కలపడం ద్వారా ఈ వేదిక వాతావరణ అంచనాలు, హెచ్చరికల కచ్చితత్వం, వేగం, స్పష్టతను మెరుగుపరుస్తుంది. శాస్త్రీయ డేటాను ముప్పు-ఆధారిత సలహాలుగా మార్చగల దాని సామర్థ్యం అధికారులు, రంగాల వారీ ఏజెన్సీలు, సమాజాలు సకాలంలో నివారణ చర్యలు తీసుకోవడానికి వీలు కల్పిస్తుంది. విపత్తు సంసిద్ధతను బలపరుస్తుంది. తీవ్రమైన వాతావరణ సంఘటనల ప్రభావాన్ని తగ్గిస్తుంది.
నిరంతర వాతావరణ అంచనాను సాధ్యం చేసే ఎంహెచ్ఈడబ్ల్యూ-డీఎస్ఎస్ వ్యవస్థ కీలక లక్షణాలు
ఎంహెచ్ఈడబ్ల్యూ-డీఎస్ఎస్ సమర్థవంతమైన ముందస్తు హెచ్చరిక సేవలను అందించడానికి సాంకేతికత, డేటా, సంస్థాగత సమన్వయాన్ని ఏకీకృతం చేసే బలమైన, భవిష్యత్తు-సిద్ధమైన వ్యవస్థగా రూపొందింది. దీని నిర్మాణం స్కేలబిలిటీ, ఇంటర్‌ఆపరేబిలిటీ, వినియోగదారు-కేంద్రీకృత డెలివరీపై దృష్టిని ప్రతిబింబిస్తుంది. ఇది రంగాలు, భౌగోళిక ప్రాంతాలలో అతుకులు లేని కార్యకలాపాలను సాధ్యం చేస్తుంది.
- ఇంటర్‌ఆపరేబుల్: ఉమ్మడి ప్రమాణాలను ఉపయోగించి వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, రంగాల మధ్య డేటాను సులభంగా పంచుకోవడానికి అనుమతిస్తూ, ఒకే వేదికపై వివిధ మాడ్యూల్స్ కలిసి పనిచేస్తాయి.
- స్కేలబుల్: ఈ వ్యవస్థ కాలక్రమేణా సులభంగా ఎదగగలదు. పెద్ద మార్పులు లేకుండానే కొత్త డేటా, సాంకేతికతలు, ప్రాంతాలు, విపత్తుల రకాలను జోడించవచ్చు.
- రెప్లికబుల్: ఇది ప్రామాణిక పద్ధతులను ఉపయోగించి నిర్మితమైంది. దీనివల్ల ఇతర రంగాలలో, ఇతర దేశాలలో కూడా ఉపయోగించడం సులభం అవుతుంది.
- సమర్థవంతమైనది: రియల్ టైమ్ అంచనాలు, ప్రభావ-ఆధారిత హెచ్చరికలు తయారీ సమయాన్ని 50% తగ్గించాయి. కచ్చితత్వాన్ని 30% మెరుగుపరిచాయి.
- స్పందనాత్మక: ఈ వ్యవస్థ వినియోగదారు-స్నేహపూర్వకమైనది, వైవిధ్యమైనది. ఎస్ఎంఎస్, ఏపీఐలు, మొబైల్ యాప్‌లు, వెబ్‌సైట్‌ల వంటి బహుళ ఛానెల్‌ల ద్వారా సమాచారాన్ని పంచుకుంటుంది.
- పారదర్శకమైనది: స్పష్టమైన డేటా ప్రక్రియలు, ఓపెన్ సిస్టమ్‌లు పర్యవేక్షించడం, ధ్రువీకరించడం, జవాబుదారీతనాన్ని నిర్ధారించడం సులభం చేస్తాయి.
- సుస్థిరమైనది: దీర్ఘకాలిక ప్రణాళిక, సాధారణ శిక్షణ, వ్యవస్థ ఆధునికీకరణ నిరంతర జ్ఞాన మార్పిడి ద్వారా మద్దతు ఇస్తుంది.
మొత్తంగా ఈ వ్యవస్థ లక్షణాలు ఎంహెచ్ఈడబ్ల్యూ-డీఎస్ఎస్‌ను విపత్తు సంసిద్ధతను మెరుగుపరిచే, మెరుగైన నిర్ణయం తీసుకోవడానికి మద్దతు ఇచ్చే ఒక ఆచరణాత్మక, భవిష్యత్తు-సిద్ధమైన వ్యవస్థగా మారుస్తాయి.
ఎంహెచ్ఈడబ్ల్యూ-డీఎస్ఎస్ ప్రభావం: సంసిద్ధత ద్వారా ప్రాణాలు, జీవనోపాధిని రక్షించడం
ఎంహెచ్ఈడబ్ల్యూ-డీఎస్ఎస్ ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను బలపరుస్తుంది. అధికారులు, సమాజాలు, పరిశ్రమలు తీవ్రమైన వాతావరణ పరిస్థితుల కోసం సిద్ధమవ్వడానికి సహాయపడే రంగాల వారీ సలహాలను అందిస్తుంది. శాస్త్రీయ అంచనాలను ఆచరణాత్మక హెచ్చరికలుగా మార్చడం ద్వారా ఈ వ్యవస్థ భద్రత, ప్రజారోగ్యం, వ్యవసాయం, ఇంధన నిర్వహణ, విపత్తు సంసిద్ధతకు మద్దతు ఇస్తుంది.
తుఫాను, సముద్ర భద్రత:
- తుఫానులు, అలల ఉధృతి, భారీ వర్షపాతం, సముద్రపు అల్లకల్లోలం గురించి ముందస్తు హెచ్చరికలను అందిస్తుంది.
- గాలి వేగం 45 కి.మీ/గం మించినప్పుడు, సముద్రాలు చాలా అల్లకల్లోలంగా మారినప్పుడు లేదా తుఫాను వాతావరణం అంచనా వేసినప్పుడు మత్స్యకారుల కోసం ప్రత్యేక హెచ్చరికలను జారీ చేస్తుంది.
- ఎస్ఎంఎస్, వాట్సాప్, మొబైల్ యాప్‌లు, ఆకాశవాణి, దూరదర్శన్, అధికారిక వెబ్‌సైట్ల ద్వారా హెచ్చరికలు పంచుకుంటారు.
- తుఫానుల సమయంలో తరచుగా వచ్చే అప్‌డేట్లు తీరప్రాంత ప్రజలు, మత్స్యకారులు సకాలంలో భద్రతా చర్యలు తీసుకోవడానికి సహాయపడతాయి.
మానవ ఆరోగ్యం:
- వేడి సంబంధిత అనారోగ్య సమస్యలను తగ్గించడానికి వడగాల్పుల అంచనాలు, వేడిని ఎదుర్కొనే కార్యచరణ ప్రణాళికకు మద్దతు ఇస్తుంది.
- విపత్తుల సమయంలో ముఖ్యంగా మహిళలు, పిల్లలు, గర్భిణులు వంటి బలహీన వర్గాల కోసం కూలింగ్ సెంటర్లు, ఆసుపత్రి సంసిద్ధత, అత్యవసర ఆరోగ్య స్పందనలను సిద్ధం చేయడానికి అధికారులకు సహాయపడుతుంది.
- వాతావరణ డేటా డెంగ్యూ, మలేరియా వంటి వాహక-జనిత వ్యాధుల అంచనాకు మద్దతు ఇస్తుంది. సమాజ ఆరోగ్యం, పోషణ, స్థితిస్థాపకత కార్యక్రమాలను బలపరుస్తుంది.
- గాలి నాణ్యత, ఉష్ణోగ్రత సలహాలు బలహీన జనాభా నివారణ చర్యలు తీసుకోవడానికి సహాయపడతాయి.
ఇంధన రంగం:
- పునరుత్పాదక ఇంధన ప్రణాళిక కోసం సోలార్ రేడియేషన్, గాలి, వర్షపాతం, ఉష్ణోగ్రత అంచనాలను అందిస్తుంది.
- సౌర, గాలి, జలవిద్యుత్ ఉత్పత్తి నిర్వహణకు మద్దతు ఇస్తుంది.
- తీవ్రమైన వాతావరణం నుంచి విద్యుత్ మౌలిక సదుపాయాలను రక్షించడానికి ముందస్తు హెచ్చరికలు సహాయపడతాయి.
- ఆటోమేషన్ మౌలిక సదుపాయాల ఖర్చులను తగ్గించింది. ఏటా సుమారు 210,240 కేడబ్ల్యూహెచ్ విద్యుత్తును ఆదా చేస్తుంది.
నీటి వనరుల నిర్వహణ:
- కచ్చితమైన వర్షపాత అంచనాలు, రుతుపవనాల అంచనా, కరువు హెచ్చరికలను సాధ్యం చేస్తుంది.
- రిజర్వాయర్ కార్యకలాపాలు, వరద నియంత్రణ, నీటిపారుదల ప్రణాళిక మరియు భూగర్భ జలాల నిర్వహణకు మద్దతు ఇస్తుంది.
- అగ్రోమెట్ సలహాల ద్వారా రైతులు నీటిని మరింత సమర్థవంతంగా ఉపయోగించడంలో సహాయపడుతుంది.
డిజిటల్ వర్క్‌ఫ్లోలు పేపర్ చార్ట్ తయారీని తొలగించడం ద్వారా ఏటా సుమారు 63 కిలోలీటర్ల నీటిని ఆదా చేశాయి.
పర్యావరణ పరిరక్షణ:
- శీతోష్ణస్థితి పర్యవేక్షణ, గాలి నాణ్యత అంచనా, సహజ వనరుల నిర్వహణకు మద్దతు ఇస్తుంది.
- డిజిటల్ అంచనా 40 ఐఎండీ కార్యాలయాల్లో మాన్యువల్ చార్ట్ ప్లాటింగ్‌ను తొలగించింది.
- ఏటా 23.4 టన్నుల కాగితాన్ని ఆదా చేస్తుంది, పర్యావరణ ప్రభావాన్ని తగ్గిస్తుంది.
- ఫలితంగా ఏటా సుమారు రూ.1.40 కోట్ల ఆదా, 2.57 టన్నుల కార్బన ఉద్గారాల నివారణ జరుగుతోంది.
విద్య, సామర్థ్య పెంపు:
- డిజిటల్ అంచనా సాధనాలపై వాతావరణ శాస్త్రవేత్తలు, వాటాదారుల కోసం శిక్షణా కార్యక్రమాలను అందిస్తుంది.
- బులెటిన్లు, మ్యాప్‌లు, ఆన్‌లైన్ వనరుల ద్వారా వాతావరణ, శీతోష్ణస్థితి అక్షరాస్యతను ప్రోత్సహిస్తుంది.
- శీతోష్ణస్థితి డేటా, వాతావరణ సమాచారాన్ని అందించడం ద్వారా పరిశోధన మరియు ఉన్నత విద్యకు మద్దతు ఇస్తుంది.
- మెరుగైన నిర్ణయం తీసుకోవడం, సంసిద్ధత కోసం అంచనాలను అర్థం చేసుకోవడానికి వాటాదారులకు సహాయపడుతుంది.
సుస్థిర వ్యవసాయం:
- రైతుల కోసం వారానికి రెండుసార్లు అగ్రోమెట్ సలహాలను, పంట-నిర్దిష్ట మార్గదర్శకాలను అందిస్తుంది.
- వాతావరణ పరిస్థితుల ఆధారంగా విత్తడం, నీటిపారుదల, కోత ప్రణాళికలను సిద్ధం చేసుకోవడానికి రైతులకు సహాయపడుతుంది.
- సలహాలను ఉపయోగిస్తున్న రైతులు, వాటిని పాటించని వారి కంటే 52.5% అధిక వార్షిక ఆదాయాన్ని నివేదించారు.
- వర్షాధార జిల్లాల్లో పంట వాతావరణ సలహాలు అటువంటి రైతులకు చేరి, వారు ఉపయోగిస్తే ఆర్థిక ప్రయోజనాలు ఏటా రూ.13,331 కోట్లుగా అంచనా వేయడమైంది.
జీవనోపాధి రక్షణ:
- రైతులు, మత్స్యకారులు, రవాణా కార్మికులు, రోజువారీ కూలీలకు సకాలంలో వాతావరణ సమాచారాన్ని అందిస్తుంది.
- సమాజాలు ఆస్తులను రక్షించుకోవడానికి, కార్యకలాపాలను సురక్షితంగా ప్లాన్ చేసుకోవడానికి, వాతావరణ సంబంధిత నష్టాలను నివారించడానికి సహాయపడుతుంది.
- వ్యవసాయం, మత్స్య సంపద, పర్యాటకం, రవాణా రంగాలలో జీవనోపాధి భద్రతను బలపరుస్తుంది.
పాలనను బలోపేతం చేయడం:
- డేటా సేకరణ, విశ్లేషణ, హెచ్చరిక వ్యాప్తి కోసం పూర్తి డిజిటల్ అంచనా వర్క్‌ఫ్లోను పరిచయం చేస్తుంది.
- అంచనా కచ్చితత్వం, డేటా భాగస్వామ్యం, ఏజెన్సీల మధ్య సమన్వయాన్ని మెరుగుపరుస్తుంది.
- 40 అంచనా కార్యాలయాల్లో మాన్యువల్ పనిని తగ్గిస్తుంది. మానవ వనరులను ఆప్టిమైజ్ చేస్తుంది.
- డిజిటల్ పరివర్తన ఫలితంగా ఏటా సుమారు రూ.57.6 కోట్ల మానవ వనరుల ఆదా జరిగింది.
- నీతి ఆయోగ్, నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ(ఎన్‌డీఎంఏ)తో సహా 200 కంటే ఎక్కువ సంస్థలు ఐఎండీ అప్లికేషన్‌ను ఉపయోగిస్తున్నాయి.
సకాలంలో అంచనాలు, ముప్పు-ఆధారిత హెచ్చరికలు, రంగాల వారీ సలహాల ద్వారా ఎంహెచ్ఈడబ్ల్యూ-డీఎస్ఎస్ సమాజాలు, సంస్థలలో సంసిద్ధతను మెరుగుపరుస్తుంది. దీని ప్రభావం విపత్తుల సమయంలో ప్రాణాలను రక్షించడం నుంచి జీవనోపాధికి మద్దతు ఇవ్వడం, సమర్థవంతమైన వనరుల నిర్వహణ, సమాచారంతో కూడిన పాలన వరకు విస్తరించి ఉంది. ఈ వ్యవస్థ మరింత స్థితిస్థాపకత కలిగిన, వాతావరణానికి సిద్ధంగా ఉన్న భారతదేశం వైపు ఒక అడుగును సూచిస్తుంది.
ఎంహెచ్ఈడబ్ల్యూ-డీఎస్ఎస్‌కి జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు
ఎంహెచ్ఈడబ్ల్యూ-డీఎస్ఎస్ విపత్తు ముప్పు నిర్వహణలో భారతదేశ విధానంలో ఒక గణనీయమైన పురోగతిని సూచిస్తుంది. ఇది సాంకేతికత, డేటా, సంస్థాగత సమన్వయాన్ని మిళితం చేస్తుంది. దీని ప్రభావం కేవలం దేశీయ సంసిద్ధతను బలోపేతం చేయడమే కాకుండా ప్రపంచ ముందస్తు హెచ్చరిక వ్యవస్థలకు భారతదేశ సహకారాన్ని పెంచడంలో కూడా ప్రతిబింబిస్తుంది. దాని జాతీయ ప్రభావానికి మించి ఈ వ్యవస్థ ప్రాంతీయ సహకారాన్ని, అంతర్జాతీయ వాతావరణ శాస్త్ర సహకారాన్ని, సాంకేతిక-ఆధారిత ముందస్తు హెచ్చరిక సేవలను మెరుగుపరిచింది. ప్రపంచ విపత్తు ముప్పు తగ్గింపులో భారతదేశ పాత్రను బలోపేతం చేసింది.
అంతర్జాతీయ స్థాయిలో ఎంహెచ్ఈడబ్ల్యూ-డీఎస్ఎస్ ప్రాంతీయ, ప్రపంచ విపత్తు ముప్పు తగ్గింపు చట్రాలలో భారతదేశ పాత్రను బలపరిచింది. వరల్డ్ మెటియోరోలాజికల్ ఆర్గనైజేషన్(డబ్ల్యూఎంఓ), ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఆసియా అండ్ ది పసిఫిక్(ఎస్‌క్యాప్)/డబ్ల్యూఎంఓ ప్యానెల్ ఆన్ ట్రాపికల్ సైక్లోన్స్ కింద మెరైన్ సలహాలు, ఏవియేషన్ మెటియోరాలజీ, ట్రాపికల్ తుఫానుల అంచనాలతో సహా ఉత్తర హిందూ మహాసముద్రం, ఆసియా-పసిఫిక్ ప్రాంతం అంతటా వాతావరణ, శీతోష్ణస్థితి సేవలకు ఈ వ్యవస్థ మద్దతు ఇస్తుంది. రీజినల్ స్పెషలైజ్డ్ మెటియోరోలాజికల్ సెంటర్(ఆర్ఎస్ఎంసీ)గా ఐఎండీ.. బంగ్లాదేశ్, మాల్దీవులు, మయన్మార్, ఒమన్, పాకిస్థాన్, ఖతార్, శ్రీలంక, థాయిలాండ్, యూఏఈ, యెమెన్ వంటి దేశాలకు కీలకమైన ఎంహెచ్ఈడబ్ల్యూ-డీఎస్ఎస్ అంచనా మద్దతును, తీవ్ర వాతావరణ సలహాలను అందిస్తుంది. ప్రాంతీయ సమన్వయం, డేటా భాగస్వామ్యాన్ని బలపరుస్తుంది.
జాతీయ స్థాయిలో విపత్తు సంసిద్ధత, స్పందన యంత్రాంగాలను గణనీయంగా ఎంహెచ్ఈడబ్ల్యూ-డీఎస్ఎస్ మెరుగుపరిచింది. ప్రస్తుతం 200కు పైగా సంస్థలు ఐఎండీ అప్లికేషన్‌ను ఉపయోగిస్తున్నాయి. ఇందులో నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ(ఎన్‌డీఎంఏ), నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(ఎన్‌డీఆర్ఎఫ్), స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీలు(ఎస్‌డీఎంఏ) వంటి కీలక సంస్థలు ఉన్నాయి. ఈ వ్యవస్థ సకాలంలో అంచనాలను, ప్రభావ-ఆధారిత హెచ్చరికలను సాధ్యం చేస్తుంది. అదే సమయంలో పట్టణ ప్రణాళికా సంస్థలు, విద్యుత్ సంస్థలు, ఆరోగ్య సేవలు, విమానయానం వంటి రంగాల వాటాదారులకు మెరుగైన నిర్ణయం తీసుకోవడం కోసం ఉపయోగపడే వాతావరణ సమాచారంతో మద్దతు ఇస్తుంది.
ఈ వ్యవస్థ చెప్పుకోదగ్గ జాతీయ గుర్తింపును పొందింది. ఇందులో ఇ-గవర్నెన్స్ నేషనల్ అవార్డ్ 2025, ఐఎండీ డైరెక్టర్ జనరల్ మిస్టర్ మృత్యుంజయ్ మహాపాత్రకు విపత్తు ముప్పు తగ్గింపు(2025) కోసం లభించిన యూఎన్ ఆఫీస్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్(యూఎన్‌డీఆర్ఆర్) ససాకావా అవార్డు, ప్రజా సేవల అందజేతలో ఐఎండీ ఆవిష్కరణను గుర్తిస్తూ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ సమ్మిట్ 2026లో అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్‌కు "డిజాస్టర్ మేనేజ్‌మెంట్ & పబ్లిక్ సేఫ్టీ టెక్ అవార్డ్" విభాగంలో ది ఎకనామిక్ టైమ్స్ గవ్‌టెక్ అవార్డ్ 2026 కూడా లభించింది.
మొత్తంగా ఈ గుర్తింపులు ఎంహెచ్ఈడబ్ల్యూ-డీఎస్ఎస్ కార్యాచరణ విజయాన్ని, విపత్తు ముప్పు నిర్వహణలో జాతీయ స్థితిస్థాపకత, అంతర్జాతీయ సహకారం రెండింటినీ బలోపేతం చేయడంలో దాని పెరుగుతున్న పాత్రను చాటిచెప్తున్నాయి.
ముగింపు
మల్టీ-హజార్డ్ ఎర్లీ వార్నింగ్ డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ వాతావరణ అంచనా, విపత్తు ముప్పు తగ్గింపులో భారతదేశ విధానంలో ఒక నిర్ణయాత్మక పరివర్తనను సూచిస్తుంది. రియల్ టైమ్ పరిశీలనలు, అధునాతన మోడలింగ్, జీఐఎస్-ఆధారిత విశ్లేషణ, క్రమబద్ధమైన వ్యాప్తిని ఒకే డిజిటల్ ఫ్రేమ్‌వర్క్‌లో ఏకీకృతం చేయడం ద్వారా ఈ వ్యవస్థ వాతావరణ, శీతోష్ణస్థితి సమాచారాన్ని సకాలంలో, నివారణ చర్యలుగా మారుస్తుంది.
ఎంహెచ్ఈడబ్ల్యూ-డీఎస్ఎస్ పర్యావరణం, ఇంధనం, ఆరోగ్యం, వ్యవసాయం, జీవనోపాధి, పాలన అంతటా సంసిద్ధతను బలపరిచింది. ఇది ప్రాణనష్టాన్ని తగ్గించింది. ఆర్థిక నష్టాన్ని పరిమితం చేసింది. సేవలు అందించడాన్ని మెరుగుపరిచింది. స్థిరమైన, ప్రభావ-కేంద్రీకృత హెచ్చరికల ద్వారా ప్రజల విశ్వాసాన్ని పెంచింది. ఈ వ్యవస్థ సాంకేతిక-ఆధారిత ముందస్తు హెచ్చరిక జాతీయ స్థాయిలో కొలవగల ప్రజా విలువను ఎలా అందిస్తుందో ప్రదర్శిస్తుంది. బహుళ-ముప్పు ముందస్తు హెచ్చరిక వ్యవస్థలలో భారతదేశాన్ని ప్రపంచ అగ్రగామిగా నిలుపుతుంది.
***
(Explainer ID: 158068)
आगंतुक पटल : 151
Provide suggestions / comments