• Sitemap
  • Advance Search
Infrastructure

పీఎంఏవై-జీ: గ్రామీణ భారతంలో అందరికీ గృహావ‌స‌తి దిశగా ముందడుగు

Posted On: 31 MAR 2026 11:23AM

కీల‌కాంశాలు
- పీఎంఏవై-గ్రామీణ్ 1, 2వ ద‌శ‌ల‌ కింద రాష్ట్రాలకు 4.15 కోట్ల ఇళ్ల‌ కేటాయింపు జ‌రిగింది. 3.90 కోట్ల ఇళ్లు మంజూరయ్యాయి. 2.99 కోట్ల ఇళ్లు పూర్తయ్యాయి.
- 2029 సంవత్సరం నాటికి 4.95 కోట్ల గ్రామీణ గృహాలను నిర్మించాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం పెట్టుకుంది.
- లబ్ధిదారులకు మొత్తం రూ.4,03,886.12 కోట్లు బదిలీ అయ్యాయి. ఇది దేశవ్యాప్తంగా సకాలంలో నిర్మాణానికి సహాయం అందుతోంది.
- జియో-ట్యాగింగ్, అనోమలీ డిటెక్షన్(వైరుధ్యాల గుర్తింపు), ఆధార్ ముఖ ధ్రువీక‌ర‌ణ‌ వంటి ఏఐ-ఆధారిత పర్యవేక్షణ సాధనాలు పారదర్శకతను, విశ్వసనీయతను పెంచాయి.
- స్వచ్ఛ భారత్ మిషన్-గ్రామీణ్, జల్ జీవన్ మిషన్, పీఎం ఉజ్వల యోజన, పీఎం సూర్య ఘర్: ముఫ్త్ బిజిలీ యోజనలతో అనుసంధానం చేయడం వల్ల గ్రామీణ జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి.

పరిచయం
గత దశాబ్ద కాలంలో భారతదేశంలో గ్రామీణ గృహనిర్మాణ ప్రయాణం పరివర్తన, గౌరవానికి చిహ్నంగా నిలిచింది. ప్రతి గ్రామీణ కుటుంబానికి సురక్షితమైన ఇల్లు ఉండాలనే ఆశయంతో ప్రారంభమైన ఈ దార్శనికత నేడు లక్షలాది మంది జీవితాలను స్పృశించే దేశవ్యాప్త ఉద్యమంగా ఎదిగింది. శాశ్వత(ప‌క్కా) ఇల్లు అనేది కేవలం ఆశ్రయం మాత్రమే కాదు - ఇది స్థిరత్వం, అవకాశం, భవిష్యత్తుపై ఆశకు పునాది.

2016 ఏప్రిల్ 1 నుంచి అమల‌వుతున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన - గ్రామీణ్.. దేశంలోని అతిపెద్ద సామాజిక సంక్షేమ కార్యక్రమాలలో ఒకటిగా క్రమంగా అభివృద్ధి చెందింది. ఇల్లు లేని కుటుంబాలకు, తాత్కాలిక(కచ్చా) లేదా శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివసిస్తున్న వారికి ప్రాథమిక సౌకర్యాలతో కూడిన శాశ్వత గృహాలను అందించడం దీని ఉద్దేశ్యం. గ్రామీణ గృహాల కొరతను తీర్చడం ద్వారా "అందరికీ ఇల్లు" అనే లక్ష్యాన్ని సాధించడంలో ఈ పథకం కీలక పాత్ర పోషిస్తోంది. పీఎంఏవై-జీ కింద ఇళ్ల కనీస పరిమాణం 25 చదరపు మీటర్లు. ఇందులో పరిశుభ్రంగా వంట చేసుకునేలా ప్రత్యేక స్థలం ఉంటుంది. ఈ పథకం తన లక్ష్యాలను దశలవారీగా సాధించడానికి బహుళ దశల్లో అమల‌వుతోంది.

గృహనిర్మాణంతో పాటు మరుగుదొడ్లు, స్వచ్ఛ వంట గ్యాస్, విద్యుత్, తాగునీటి సదుపాయాలను కలపడం ద్వారా ఇది భారతదేశంలోని గ్రామాలలో జీవన నాణ్యతను మెరుగుపరిచింది. ఇన్నేళ్లలో ఈ పథకం సాంకేతికత, పారదర్శకత, ఇతర జాతీయ కార్యక్రమాలతో అనుసంధానాన్ని పెంచుకుంటూ సమగ్ర వృద్ధికి, గ్రామీణ సాధికారతకు చిహ్నంగా మారింది.



ప్రతిదీ మార్చేసిన ఇల్లు: భద్రత, స్థిరత్వం వైపు తాయిద్ ప్రయాణం
అస్సాంలోని జోర్హాట్ జిల్లా టిటాబోర్ ప్రాంతానికి చెందిన తాయిద్ అనే వితంతువు వరద ప్రభావిత ప్రాంతంలో తన బలహీనమైన ఇంట్లో ఎన్నో ఏళ్లుగా రక్షణ లేకుండా గడిపారు. జీవితం అనిశ్చితంగా ఉండేది. కానీ 2016–17లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన - గ్రామీణ్(పీఎంఏవై-జీ) ద్వారా శాశ్వత ఇల్లు కావాలనే ఆమె కల నిజమైంది. ప్రభుత్వ మద్దతుతో ఆమె తన కుటుంబానికి భద్రత, గౌరవాన్ని ఇచ్చే బలమైన ఇంటిని నిర్మించుకున్నారు. నేడు ఆమె శాశ్వత ఇల్లు స్థితిస్థాపకతకు చిహ్నంగా నిలుస్తోంది. వరదల నుంచి ఆమె కుటుంబాన్ని కాపాడుస్తోంది. భవిష్యత్తుకు స్థిరత్వాన్ని అందిస్తోంది. అత్యంత దుర్బలమైన కుటుంబాలు కూడా ఉజ్వలమైన భవిష్యత్తులోకి అడుగుపెట్టేలా పీఎంఏవై-జీ గ్రామీణ జీవితాలను ఎలా మారుస్తుందో తాయిద్ ప్రయాణం ప్రతిబింబిస్తుంది.

 



దశాబ్ద కాలపు పురోగతి, విజయాలు
గత పదేళ్లలో పీఎంఏవై-జీ క్రమంగా తన పరిధిని విస్తరించ‌డంతో పాటు పెద్ద ఎత్తున ఇళ్లను అందించింది. వివిధ దశలలో స్థిరమైన పురోగతిని కొనసాగించడంలో ఈ పథకం తన సామర్థ్యాన్ని నిరూపించుకుంది. విక‌సిత్ భారత్-గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్(గ్రామీణ్) (గతంలో ఎంజీన‌రేగా), స్వచ్ఛ భారత్ మిషన్ - గ్రామీణ్, స్వయం సహాయక బృందాలు, జల్ జీవన్ మిషన్, పీఎం-సూర్య ఘర్: ముఫ్త్ బిజిలీ యోజన వంటి పథకాలతో అనుసంధానం ద్వారా పీఎంఏవై-జీ లబ్ధిదారులకు సాధికారత కల్పించింది.

కేటాయించిన లక్ష్యం, విజయాలు
2026 మార్చి 26 నాటికి తొలి, రెండో ద‌శ‌ల కింద 4.15 కోట్ల ఇళ్ల లక్ష్యం పెట్టుకోగా 3.90 కోట్ల ఇళ్లు మంజూరయ్యాయి. 2.99 కోట్ల ఇళ్లు పూర్తయ్యాయి. ఈ భారీ ప‌థ‌కం అమలు కోసం రూ.4,03,886.12 కోట్ల నిధుల బదిలీ జరిగింది. ఇది అన్ని రాష్ట్రాల్లో నిర్మాణం, లబ్ధిదారులకు సకాలంలో వనరులను అందిస్తోంది.

 



మొత్తంగా చూస్తే ఈ మైలురాళ్లు పీఎంఏవై-జీ స్థిరమైన వేగాన్ని, విస్తృత ప్రభావాన్ని ప్రతిబింబిస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లో సార్వత్రిక గృహనిర్మాణం వైపు పయనించడంలో దాని ప్రభావాన్ని చాటి చెప్తాయి.

అమలు చ‌ట్రం, సంస్కరణలు
పీఎంఏవై-జీ లబ్ధిదారుల నేతృత్వంలోని కార్యక్రమంగా రూపొందింది. ఇక్కడ కుటుంబాలు తమ ఇళ్లను నిర్మించుకోవడంలో యజమాన్య బాధ్యత తీసుకుంటాయి. ఇన్నేళ్లలో అమలులో పారదర్శకత, సామర్థ్యం, నాణ్యతను బలోపేతం చేయడానికి అనేక సంస్కరణలు ప్రవేశపెట్టారు.

- డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్(డీబీటీ): ఆర్థిక సహాయం నేరుగా లబ్ధిదారుని బ్యాంక్ ఖాతాలోకి విడుదల అవుతాయి. దీనివల్ల నిధులు ఎటువంటి జాప్యం లేదా అవినీతి లేకుండా కుటుంబాలకు చేరుతాయి. ఇది ఆర్థిక చేరికను బలోపేతం చేస్తుంది.

- ఇళ్ల జియో-ట్యాగింగ్: నిర్మాణంలోని ప్రతి దశలో సమయం, తేదీ ముద్రించిన ఫొటోలు అప్‌లోడ్ చేస్తారు. ఈ డిజిటల్ రికార్డు పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి, మార్గదర్శకాల ప్రకారం ఇళ్లు నిర్మిత‌మ‌వుతున్నాయని నిర్ధారించడానికి అనుమతిస్తుంది.

- గ్రామ స్థాయి కార్యకర్తలు: మంజూరైన ప్రతి ఇంటిని ఒక స్థానిక కార్యకర్తకు జ‌త‌ చేస్తారు. వారు లబ్ధిదారుడిని అనుసరిస్తారు. ఈ వ్యవస్థ క్షేత్రస్థాయిలో మద్దతును అందిస్తుంది. నిర్మాణం సకాలంలో పూర్తయ్యేలా చూస్తుంది.

- బ్లాక్, జిల్లా తనిఖీలు: బ్లాక్ స్థాయి అధికారులు సుమారు 10% ఇళ్లను తనిఖీ చేస్తారు. జిల్లా అధికారులు ప్రతి నిర్మాణ దశలో 2% తనిఖీ చేస్తారు. ఈ తనిఖీలు నాణ్యత, పర్యవేక్షణకు అదనపు భద్రతను జోడిస్తాయి.

- సోషల్ ఆడిట్(సామాజిక తనిఖీ): ప్రతి గ్రామ పంచాయతీ ఏడాదికి కనీసం ఒకసారి అధికారిక సోషల్ ఆడిట్‌ను నిర్వహిస్తుంది. ఇందులో సమాజ భాగస్వామ్యం, పథకానికి సంబంధించిన‌ అన్ని అంశాల సమీక్ష ఉంటుంది. ఇది పారదర్శకతను, జవాబుదారీతనాన్ని పెంచుతుంది.

- జాతీయ స్థాయి పర్యవేక్షణ: గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు చెందిన అధికారులు, జాతీయ స్థాయి పర్యవేక్షకులు క్షేత్ర తనిఖీల సమయంలో ఇళ్లను సందర్శించి పురోగతిని అంచనా వేస్తారు. లబ్ధిదారుల ఎంపికను ధ్రువీకరించ‌డంతో పాటు విధానాలు సరిగ్గా పాటిస్తున్నారా లేదా అనేది ప‌రిశీలిస్తారు.

- ఆవాస్‌సాఫ్ట్ ఎంఐఎస్ వేదిక‌: ఆవాస్‌సాఫ్ట్ అనేది పీఎంఏవై-జీ అన్ని విధులను అనుసంధానించే ద్విభాషా, వెబ్-ఆధారిత వేదిక‌. లబ్ధిదారుల గుర్తింపు, మంజూరు ఉత్తర్వుల నుంచి నిధుల విడుదల, నిర్మాణ పర్యవేక్షణ వరకు, ఇది అందరు వాటాదారులకు సమాచార మూలంగా పనిచేస్తుంది.

ఈ సంస్క‌ర‌ణ‌లు సాంకేతిక‌త‌, స‌మాజ భాగ‌స్వామ్యం, సంస్థాగ‌త ప‌ర్య‌వేక్షణ‌తో కూడిన బ‌ల‌మైన చ‌ట్రాన్ని సృష్టించింది. ఇది పీఎంఏవై-జీ పార‌ద‌ర్శ‌కంగా, స‌మ‌ర్థ‌వంతంగా ఇళ్ల‌ను అందించేలా మార్చింది.

గ్రామీణ కుటుంబాలపై ప్రభావం
గ్రామీణ కుటుంబాలు సురక్షితమైన ఇళ్లు, మెరుగైన సేవలు, సాధికారతతో కూడిన లోతైన మార్పును చూస్తాయి. సామాజిక స‌మ్మిళిత‌త్వం, నిత్యావసరాల అందుబాటును బలోపేతం చేయడం ద్వారా పీఎంఏవై-జీ దీనిని సాధించింది.

- మెరుగైన జీవన పరిస్థితులు: కుటుంబాలు ఇప్పుడు మన్నికైన, సురక్షితమైన, వాతావరణ పరిస్థితులను తట్టుకోగల శాశ్వత ఇళ్లలో నివసిస్తున్నాయి. తాత్కాలిక గృహాల నుంచి శాశ్వత గృహాలకు మారడం వల్ల లక్షలాది కుటుంబాలకు భద్రత, గౌరవం పెరిగింది.

- పరిశుభ్రత సౌకర్యం: వివిధ పథకాలతో అనుసంధానం ద్వారా పీఎంఏవై-జీ లబ్ధిదారులు మరుగుదొడ్ల నిర్మాణం కోసం స్వచ్ఛ భారత్ మిషన్-గ్రామీణ్[ఎస్‌బీఎం(జీ)ఔ, ఎంజీన‌రేగా(ప్రస్తుతం వీబీ: జీరామ్‌జీ) లేదా ఇతర నిధుల నుంచి రూ.12,000 సహాయం పొందుతారు. ఇది పరిశుభ్రతను ప్రోత్సహించింది. ఆరోగ్య ప్రమాదాలను తగ్గించ‌డంతో పాటు గ్రామాల స్వచ్ఛతకు దోహదపడింది.

- ఉపాధికి మద్దతు: ఈ పథకం ఎంజీన‌రేగా (ఇప్పుడు వీబీ: జీ రామ్ జీ) కింద 90-95 రోజుల నైపుణ్యం లేని కార్మిక వేతనాలను అందిస్తుంది. ఇది గృహ నిర్మాణానికే కాకుండా గ్రామీణ కార్మికులకు ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తుంది.

- స్వచ్ఛమైన వంట ఇంధనం: ప్రధానమంత్రి ఉజ్వల యోజనతో అనుసంధానం కావడం వల్ల కుటుంబాలకు ఎల్‌పీజీ కనెక్షన్‌లు లభించాయి. ఇది సాంప్రదాయ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించి, ఆరోగ్యాన్ని మెరుగుపరిచింది.

- విద్యుత్, నీటి సరఫరా: అనుసంధానించిన ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా లబ్ధిదారులు విద్యుత్ కనెక్షన్లు, పైపుల ద్వారా తాగునీటిని పొందుతున్నారు. ఈ సదుపాయాలు దైనందిన జీవన ప్రమాణాలను మెరుగుపరిచాయి.

- పునరుత్పాదక ఇంధన ఎంపికలు: స్థిరమైన ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించడానికి సోలార్ లాంతర్లు, రూఫ్‌టాప్ వ్య‌వ‌స్థ‌లు ప్రవేశపెట్టారు. ఇది పర్యావరణ లక్ష్యాలకు మద్దతు ఇవ్వడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో నమ్మకమైన విద్యుత్తును అందిస్తుంది.

- నాణ్యమైన ఇళ్ల కోసం నైపుణ్యం: పీఎంఏవై-జీ కింద "రూరల్ మేసన్ ట్రైనింగ్" (గ్రామీణ మేస్త్రీ శిక్షణ) కార్యక్రమం నైపుణ్యం కలిగిన మేస్త్రీల కొరతను తీరుస్తుంది. నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(ఎన్ఎస్‌డీసీ) మద్దతుతో 25.11.2025 నాటికి 3,75,265 మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారు. 3,02,377 మంది మేస్త్రీలు ధ్రువీక‌ర‌ణ పొందారు.

- మహిళా సాధికారత: మహిళల పేరిట లేదా దంపతుల పేరిట ఉమ్మడిగా ఇంటి యాజమాన్యాన్ని ప్రోత్సహించడం ద్వారా పీఎంఏవై-జీ మహిళల ఆస్తి హక్కులను, సామాజిక హోదాను పెంచుతుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ & పాలసీ(ఎన్ఐపీఎఫ్‌పీ) అధ్య‌య‌న నివేదిక (2019) ప్రకారం.. ఈ విధానం భారతదేశ సుస్థిర అభివృద్ధి లక్ష్యాల(ఎస్‌డీజీ) సాధనకు, ముఖ్యంగా లింగ సమానత్వం, నిరంతర సాధికారతకు(ఎస్‌డీజీ 5ఏ) దోహదపడుతోంది.

గ్రామీణ గృహనిర్మాణంలో ఏఐ-ఆధారిత పర్యవేక్షణ
ఆధునిక సాంకేతికత గ్రామీణ గృహాల పంపిణీకి కొత్త కోణాన్ని జోడించింది. కృత్రిమ మేధ‌, మెషిన్ లెర్నింగ్ సాధనాలను ఉపయోగించడం ద్వారా పర్యవేక్షణ మరింత పదునుగా మారింది. మోసాల నివారణ బలోపేత‌మ‌వ‌డంతో పాటు అమలుపై విశ్వసనీయత పెరిగింది.

- సిఫార్సు వ్యవస్థ: అప్‌లోడ్ చేసిన ఫొటోల నుంచి గోడలు, పైకప్పులు, తలుపులు, కిటికీలు వంటి ఇంటి లక్షణాలను ఏఐ మోడల్స్ గుర్తిస్తాయి. వీటి ఆధారంగా, సిస్టమ్ ఆమోదం కోసం అత్యంత సరైన ఫొటోను సిఫార్సు చేస్తుంది.

- పోలిక‌ల‌ గుర్తింపు, మోసాల నివారణ: మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్‌లు ఒక ఇంటి ఫోటోలను అదే ప్రాంతంలోని ఇతర ఫోటోలతో పోలుస్తాయి. ఏవైనా పోలికలు గుర్తిస్తే, మోసపూరిత నివేదికలను నిరోధించడానికి సిస్టమ్ హెచ్చరికలను జారీ చేస్తుంది.

- ముఖ గుర్తింపు, ఇ-కేవైసీ: ఆధార్ ఆధారిత ఏఐ ముఖ గుర్తింపు ద్వారా లబ్ధిదారులను ధ్రువీకరిస్తారు. అర్హులు మాత్ర‌మే స‌హాయం పొందేలా, స‌మాచారంలోని విశ్వ‌స‌నీయ‌త‌ను బ‌లోపేతం చేసేందుకు ఇది దోహ‌ద‌ప‌డుతోంది. ఆధార్ ముఖ గుర్తింపును జోడించ‌డం ద్వారా ల‌బ్ధిదారుల గుర్తింపు, సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ సహకారంతో అభివృద్ధి చేసిన 3డీ హౌస్ డిజైన్‌ల వంటి వినూత్న ఫీచర్లతో కూడిన ఆవాస్+ 2024 మొబైల్ యాప్ లబ్ధిదారుల గుర్తింపులో పారదర్శకతను మరింత పెంచుతుంది. సాంకేతిక‌త‌, ప‌రిశోధ‌న జోడీ ప్ర‌యోజ‌నాల‌ను క‌ల్పించ‌డంలో క‌చ్చిత‌త్వాన్ని, పార‌ద‌ర్శ‌క‌త‌ను, జ‌వాబుదారీత‌నాన్ని పెంచుతుంది.

వాస్త‌విక‌త నిర్ధార‌ణ‌: లబ్ధిదారుల ధ్రువీకరణ సమయంలో కనురెప్పలు ఆర్పడం, కదలిక గుర్తింపు వంటి అధునాతన ఫీచర్లు ఉపయోగిస్తారు. ధ్రువీకరణ ప్రక్రియ ప్రత్యక్షంగా, వాస్తవంగా జరుగుతోందని ఇది నిర్ధారిస్తుంది.

భవిష్యత్ మార్గం
రానున్న‌ కొన్నేళ్లు సార్వత్రిక గ్రామీణ గృహనిర్మాణాన్ని సాధించడంలో నిర్ణయాత్మక దశగా నిలుస్తాయి. మొద‌టి, రెండో ద‌శ‌ల‌ కింద మంజూరైన 3.90 కోట్ల ఇళ్లలో ఇప్పటికే 2.99 కోట్లు పూర్తి కాగా, 2029 నాటికి 4.95 కోట్ల ఇళ్ల లక్ష్యం వైపు ఈ కార్యక్రమం స్థిరంగా సాగుతోంది. ఈ పురోగ‌తి అర్హులంద‌రికీ స‌హాయం అందేలా వేదిక‌ను ఏర్పాటు చేయ‌డంతో పాటు ప్ర‌తి అర్హుడికి శాశ్వ‌త గృహం ఉండేలా చూస్తుంది.

పీఎంఏవై-జీ భారతదేశంలోని అత్యంత ప్రభావవంతమైన గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలలో ఒకటిగా ఎదిగింది. గృహనిర్మాణాన్ని గౌరవం, సాధికారత, మౌలిక సదుపాయాల అనుసంధానంతో కలపడం ద్వారా ఇది లక్షలాది మంది జీవితాలను మార్చింది. 2029 నాటికి స్పష్టమైన ప్రణాళికతో, గ్రామీణ భారతంలో "అందరికీ ఇల్లు" అనే దార్శనికతను ఈ పథకం కొనసాగిస్తోంది.

 

***

(Explainer ID: 157986) आगंतुक पटल : 20
Provide suggestions / comments
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Gujarati , हिन्दी , Bengali , Kannada
National Portal Of India
STQC Certificate