• Sitemap
  • Advance Search
Technology

ఇండియా ఏఐ స్టాక్: భారీ స్థాయిలో మేధస్సును అందించడం

డేటా, కంప్యూటింగ్‌ను వాస్త‌వ‌ ప్రపంచ ప్రభావంగా మార్చడం

Posted On: 04 FEB 2026 4:12PM

పరిచయం
భారతదేశంలో సాంకేతికత భవిష్యత్తు ఒక సరళమైనదే అయినా శక్తివంతమైన ఆలోచనతో నడుస్తోంది: అదే కృత్రిమ మేధ అందరికీ అందుబాటులో ఉండటం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కేవలం కొన్ని కంపెనీలకు, సంస్థలకు లేదా దేశాలకు మాత్రమే పరిమితం కాకూడదు. ఇది ప్రతి పౌరుడికి ప్రయోజనం చేకూర్చేలా, ప్రజల సంక్షేమానికి తోడ్పడేలా అభివృద్ధి చెందాలి. అంద‌రూ కృత్రిమ మేధ‌ను ఉపయోగించాలి. "మానవాళి కోసం ఏఐ" అనే ఈ దార్శనికత సాంకేతిక పురోగతిలో ప్రజలను కేంద్రంగా ఉంచుతుంది, ఆవిష్కరణలు సమాజానికి సేవ చేసేలా చూస్తుంది.

ఈ లక్ష్యాన్ని సాధించాలంటే ఏఐ అనేది ఆరోగ్య సంరక్షణ, విద్య, వ్యవసాయం, ఆర్థిక రంగం, ప్రభుత్వ సేవల్లో నమ్మదగ్గ రీతిలో పని చేయాలి. ఇటువంటి భారీ స్థాయి ప్రభావాన్ని సాధించడానికి ఒక బలమైన, సమగ్రమైన ఏఐ స్టాక్ అవసరం. ఇది ఏఐ అప్లికేషన్‌లను సమర్థవంతంగా నిర్మించడానికి, అమలు చేయడానికి, నిర్వహించడానికి అవసరమైన సాధనాలు, వ్యవస్థలు, మౌలిక సదుపాయాలను అందిస్తుంది.

ఏఐ స్టాక్: వినియోగం, విస్తరణను సాధ్యం చేసే ద‌శ‌లు

 


ఏఐ స్టాక్ అనేది ఏఐ అప్లికేషన్‌లను రూపొందించడానికి, నడపడానికి కలిసి పనిచేసే సాధనాలు, వ్యవస్థల పూర్తి సముదాయం. ఈ అప్లికేషన్‌లు సిరి, అలెక్సా వంటి వర్చువల్ అసిస్టెంట్‌ల నుంచి, నెట్‌ఫ్లిక్స్, స్పాటిఫై వంటి వేదిక‌లలో వ్యక్తిగత సిఫార్సుల వరకు ఉంటాయి. అంతేకాకుండా ఆరోగ్య సంరక్షణలో వ్యాధి నిర్ధారణ, ఆర్థిక మోసాల గుర్తింపు, రవాణా వంటి అధునాతన వ్యవస్థల్లో కూడా ఇవి ఉపయోగపడతాయి. ఏఐ స్టాక్ అనేది హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్, డేటాను సేకరించడానికి, ఏఐ మోడళ్లకు శిక్షణ ఇవ్వడానికి, వాటిని వాస్త‌వ‌ జీవితంలో ఉపయోగించడానికి సహాయపడే వేదిక‌లను ఒకచోట చేర్చుతుంది.

ఏఐ స్టాక్ ఐదు స్థాయిల‌తో రూపొందింది. ఇందులో ప్రతి స్థాయి కీలకపాత్ర పోషిస్తుంది. ప్రజలు ప్రతిరోజూ ఉపయోగించే యాప్‌ల నుంచి వాటి వెనుక పనిచేసే డేటా, కంప్యూటింగ్ శక్తి, నెట్‌వర్క్‌లు, శక్తి వరకు ఏఐ వాస్త‌వ‌ ప్రపంచంలో పనిచేసేలా ఈ స్టాక్ చూస్తుంది. ఈ ద‌శ‌లన్నీ కలిసి ఏఐ పరిష్కారాలు నమ్మదగ్గవిగా, దేశవ్యాప్తంగా ప్రభావం చూపేవిగా ఉండేలా చేస్తాయి.

1. అప్లికేషన్ స్థాయి
అప్లికేషన్ స్థాయి అనేది ఏఐ స్టాక్‌లో వినియోగదారులకు నేరుగా కనిపించే భాగం. ఇందులో హెల్త్ డయాగ్నస్టిక్ టూల్స్, వ్యవసాయ సలహా వేదిక‌లు, చాట్‌బాట్‌లు, భాషా అనువాద యాప్‌ల వంటి ఏఐ ఆధారిత సేవలు ఉంటాయి. ఈ లేయర్ సంక్లిష్టమైన ఏఐ ప్రక్రియలను సామాన్య ప్రజలు సులభంగా ఉపయోగించగల సేవలుగా మారుస్తుంది.

అధిక-ప్రభావ అప్లికేషన్ల ద్వారా భారతదేశంలో ఏఐ వినియోగం
భారతీయ అంకుర సంస్థ‌లు స్థానిక భాషలు, పరిస్థితులు, రంగాల అవసరాలకు అనుగుణంగా ఏఐ అప్లికేషన్‌లను అభివృద్ధి చేస్తున్నాయి. ఇది ఆర్థిక వ్యవస్థ అంతటా ఏఐ వినియోగాన్ని వేగవంతం చేస్తోంది.

వ్యవసాయంలో: ఏఐ ఆధారిత సలహా సాధనాలు విత్తనాలు వేయడం, పంట దిగుబడి, వనరుల వినియోగంపై సరైన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో వీటిని వాడటం వల్ల ఉత్పాదకత 30-50% వరకు పెరిగినట్లు సమాచారం.

ఆరోగ్య సంరక్షణలో: క్షయవ్యాధి, క్యాన్సర్, నరాల సంబంధిత వ్యాధులు, ఇతర సమస్యలను ముందుగానే గుర్తించడానికి ఏఐ అప్లికేషన్‌లు సహాయపడుతున్నాయి. తద్వారా నివారణ, నిర్ధారణ చికిత్సలు మెరుగుపడుతున్నాయి.

విద్యలో: జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం సీబీఎస్ఈ పాఠ్యప్రణాళికలు, దీక్ష వేదిక‌లు, యువఏఐ వంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు ఆచరణాత్మక ఏఐ నైపుణ్యాలను నేర్పిస్తున్నారు.

న్యాయ వ్యవస్థలో: ఈ-కోర్టుల మూడో ద‌శ‌లో అనువాదం, కేసు నిర్వహణ, షెడ్యూలింగ్ కోసం ఏఐ, మెషీన్ లెర్నింగ్‌ను ఉపయోగిస్తున్నారు. ఇది స్థానిక భాషల్లో సేవలను అందుబాటులోకి తెస్తూ పారదర్శకతను పెంచుతోంది.

వాతావరణం, విపత్తు నిర్వహణలో: భారత వాతావరణ శాఖ వర్షపాతం, తుఫానులు, పొగమంచు, పిడుగులు, మంటలను ముందుగానే అంచనా వేయడానికి ఏఐని ఉపయోగిస్తోంది. మౌసమ్ జీపీటీ వంటి సాధనాలు రైతులు, విపత్తు సహాయక చర్యలకు తోడ్పడుతున్నాయి.

క్లుప్తంగా చెప్పాలంటే, అప్లికేషన్ లేయర్ అనేది అధునాతన సాంకేతికతను సామాన్యులకు అందుబాటులోకి తెచ్చే చోటు. ప్రాధాన్యత గల రంగాలలో దీనిని విస్తృతంగా వాడటం వల్ల ఏఐ అనేది కేవలం ప్రయోగాలకే పరిమితం కాకుండా రోజువారీ నిర్ణయాల్లో భాగంగా మారుతుంది. ఈ విస్తృత వినియోగమే చివరికి ఏఐ సామాజిక, ఆర్థిక ప్రభావాన్ని నిర్ణయిస్తుంది.

ఏఐ అప్లికేషన్ వినియోగంలో సాధారణ ధోరణి
ఇంటర్నెట్, మొబైల్ సాంకేతిక‌త‌ల‌ల లాగానే ఏఐ అప్లికేషన్‌లను భారీ స్థాయిలో ఉపయోగించినప్పుడు అవి విప్లవాత్మక మార్పులను తెస్తాయి. వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, తయారీ, రవాణా, పాలన, వాతావరణ మార్పుల రంగాలలో ఏఐ అప్లికేషన్‌లు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. భారతదేశం ఏఐ విస్తరణ వ్యూహాన్ని అనుసరిస్తూ దేశవ్యాప్తంగా ఏఐని అందుబాటులోకి తెస్తోంది. దేశవ్యాప్తంగా ఏఐ అప్లికేషన్‌లు రైతులు సరైన నిర్ణయాలు తీసుకోవడంలో, వైద్యులు ముందుగా వ్యాధి నిర్ధారణ చేయడంలో, ప్రభుత్వ సేవల సామర్థ్యాన్ని పెంచడంలో సహాయపడుతున్నాయి. వాస్తవ అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా అప్లికేషన్ లేయర్ ప్రజల జీవితాలను నేరుగా మెరుగుపరుస్తోంది.

 



2. ఏఐ న‌మూనా స్థాయి
ఇది ఏఐ వ్యవస్థలకు మెదడు లాగా పనిచేస్తుంది. నమూనాలను(ప్యాట‌ర్న్‌) గుర్తించడానికి, అంచనాలు వేయడానికి, నిర్ణయాలు తీసుకోవడానికి ఏఐ మోడళ్లకు డేటాతో శిక్షణ ఇస్తారు. ఉదాహరణకు, ఇవి ఎక్స్-రేల నుంచి వ్యాధులను గుర్తించడంలో, పంట దిగుబడిని అంచనా వేయడంలో, భాషలను అనువదించడంలో లేదా చాట్‌బాట్‌ల ద్వారా ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంలో సహాయపడతాయి. ఈ మోడల్స్ అప్లికేషన్‌లకు తెలివితేటలను అందిస్తాయి.

భారతదేశంలో ఏఐ న‌మూనా స్థాయి అభివృద్ధి
- ఇండియా ఏఐ మిషన్ కింద భారతదేశానికి సంబంధించిన ప్రత్యేక అవసరాల కోసం 12 స్వదేశీ ఏఐ మోడళ్లను అభివృద్ధి చేస్తున్నారు.
- స్వదేశీ మోడల్ అభివృద్ధికి మద్దతుగా అంకుర సంస్థ‌లకు సబ్సిడీతో కూడిన కంప్యూట్ సదుపాయం కల్పిస్తున్నారు. కంప్యూట్ ఖర్చులలో 25% వరకు గ్రాంట్లు, ఈక్విటీ రూపంలో ప్రభుత్వం భరిస్తుంది.
- భారత్ జెన్ అనేది పరిశోధనలు, స్టార్టప్‌లు, ప్రభుత్వ రంగ అప్లికేషన్‌ల కోసం బిలియన్ల నుంచి ట్రిలియన్ల పారామితులను కలిగి ఉన్న భార‌త కేంద్రీకృత‌ ఫౌండేషన్ మోడళ్లను అభివృద్ధి చేస్తోంది.
- ఇండియా ఏఐ కోష్ అనేది డేటాసెట్‌లు, మోడళ్లు, టూల్స్ కోసం ఒక జాతీయ ఖాజానాగా పనిచేస్తుంది. డిసెంబర్ 2025 నాటికి ఇందులో 20 రంగాలకు చెందిన 5,722 డేటాసెట్‌లు, 251 ఏఐ మోడళ్లు ఉన్నాయి.
- భారతీయ స్టార్టప్‌లు భారతీయ భాషలు, ఆరోగ్య అవసరాలు, ప్రభుత్వ సేవలకు అనుగుణంగా ప్రత్యేకమైన ఏఐ మోడళ్లను నిర్మిస్తున్నాయి.
- సర్వం ఏఐ అనేది భారతీయ భాషల కోసం పెద్ద భాషా, వాయిస్ మోడళ్లను అభివృద్ధి చేస్తోంది.
- భాషిణి: నేషనల్ లాంగ్వేజ్ ట్రాన్స్‌లేషన్ మిషన్ కింద వాయిస్ రికగ్నిషన్, అనువాదం వంటి సేవలను అందించే 350 కంటే ఎక్కువ ఏఐ మోడళ్లను కలిగి ఉంది.

ఏఐ మోడల్ లేయర్ అనేది వాస్త‌వ‌ ప్రపంచ అవసరాలను ఎంత సమర్థవంతంగా అర్థం చేసుకుంటుందో నిర్ణయించే ప్రధాన మేధస్సు. స్వదేశీ మోడళ్లను బలోపేతం చేయడం ద్వారా మన అవసరాలకు తగ్గట్టుగా విశ్వ‌స‌నీయ‌మైన ఏఐని రూపొందించుకోవచ్చు. ఇతర దేశాల వ్యవస్థలపై ఆధారపడటాన్ని తగ్గించుకోవచ్చు.

ఏఐ మోడల్ వినియోగంలో సాధారణ ధోరణి


ఏఐ మోడళ్లలో ప్రారంభ పురోగతి అనేది భారీ స్థాయిలో కంప్యూటింగ్ సదుపాయం ఉన్న కొద్దిమంది సాంకేతికంగా ముందున్న వారి ద్వారా మాత్రమే నడిచింది. కానీ ఓపెన్-సోర్స్ మోడళ్ల ఆవిర్భావం ఈ రంగంలోకి ప్రవేశించే అడ్డంకులను తగ్గించింది. ఖర్చులను తగ్గించ‌డంతో పాటు పారదర్శకతను మెరుగుపరిచింది. వివిధ భాషలు, సందర్భాలలో స్థానికీకరణను సాధ్యం చేసింది. ఈ మార్పు ఆధారంగా, భారతదేశం జాతీయ ప్రాధాన్యతలు, జనాభా స్థాయి అవసరాలపై దృష్టి సారించి సార్వభౌమ, సమగ్ర, అప్లికేషన్-ఆధారిత ఏఐ మోడల్ వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది. ఇది ముఖ్యంగా ప్రభుత్వ సేవలు, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, పరిపాలనలో, స్థానిక భాషలు, నియంత్రణ చట్రాలు, సాంస్కృతిక వైవిధ్యానికి అనుగుణంగా ఉంటూ, సాంకేతిక స్వయం సమృద్ధిని బలోపేతం చేస్తుంది. అన్ని రంగాలలో వాస్త‌వ‌ ప్రపంచ ప్రభావాన్ని అందిస్తుంది.

3. కంప్యూట్ స్థాయి
ఇది ఏఐకి కండరం లాంటిది; ఏఐ మోడళ్లకు శిక్షణ ఇవ్వడానికి, వాటిని నడపడానికి అవసరమైన కంప్యూటింగ్ శక్తిని ఇది అందిస్తుంది. శిక్షణ సమయంలో కంప్యూట్ భారీ మొత్తంలో డేటాను ప్రాసెస్ చేస్తుంది. తద్వారా మోడల్ నేర్చుకోగలదు. మెరుగుపడగలదు. నేడు, ఈ శక్తి ఎన్‌విడియాకు చెందిన బ్లాక్‌వెల్‌ గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్(జీపీయూ), గూగుల్ టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్లు(టీపీయూ), న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్లు(ఎన్‌పీయూ) వంటి అధునాతన ప్రాసెసింగ్ చిప్‌ల నుంచి వస్తుంది. ఇవి ఏఐ వ్యవస్థలు సమర్థవంతంగా, భారీ స్థాయిలో పనిచేయడానికి అనుమతిస్తాయి.

భారతదేశంలో కంప్యూట్ సామర్థ్యం, ఏఐ మౌలిక సదుపాయాలు
- ఇండియా ఏఐ మిషన్ కోసం ఐదేళ్ల కాలానికి రూ.10,300 కోట్లకు పైగా కేటాయించ‌డ‌మైంది.
- ఇండియా ఏఐ కంప్యూట్ పోర్టల్ 'కంప్యూట్-యాజ్-ఏ-సర్వీస్' నమూనాపై పనిచేస్తుంది. ఇది 38,000 జీపీయూలు, 1,050 టీపీయూలకు సబ్సిడీ ధరలతో.. గంటకు రూ.100 కంటే తక్కువతో క్లౌడ్-ఆధారిత యాక్సెస్‌ను అందిస్తుంది. ఇది అంకుర‌, చిన్న సంస్థలకు ప్రవేశ అడ్డంకులను గణనీయంగా తగ్గిస్తుంది.
- సార్వభౌమ, వ్యూహాత్మక ఏఐ అప్లికేషన్‌ల కోసం 3,000 త‌ర్వాతి తరం జీపీయూలతో కూడిన సురక్షితమైన జాతీయ జీపీయూ క్లస్టర్ ఏర్పాట‌వుతోంది.
- రూ.76,000 కోట్ల వ్యయంతో ఇండియా సెమీకండక్టర్ మిషన్, చిప్ ఫ్యాబ్రికేషన్, ప్యాకేజింగ్ యూనిట్లతో సహా 10 సెమీకండక్టర్ ప్రాజెక్టులను ఆమోదించింది.
- శక్తి, వేగా ప్రాసెసర్‌ల వంటి స్వదేశీ చిప్ డిజైన్ కార్యక్రమాలు ఏఐ హార్డ్‌వేర్‌లో భారతదేశ సామర్థ్యాలను బలోపేతం చేస్తున్నాయి.
- ఫ్యాబ్స్, ఏటీఎంపీ యూనిట్లతో సహా 10 ఆమోదిత‌ సెమీకండక్టర్ ప్రాజెక్టులతో భారతదేశం కస్టమ్ ఏఐ చిప్‌లను అభివృద్ధి చేస్తోంది. దాని సెమీకండక్టర్ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేస్తోంది.
- నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ ఐఐటీలు, ఐఐఎస్ఈఆర్‌లు, జాతీయ పరిశోధనా సంస్థలలో 40 పెటాఫ్లాప్స్ కంటే ఎక్కువ కంప్యూటింగ్ సామర్థ్యాన్ని మోహరించింది.
- ప‌ర‌మ్ సిద్ధి-ఏఐ, ఐరావ‌త్‌ వంటి ప్ర‌తిష్టాత్మ‌క వ్య‌వ‌స్థ‌లు సహజ భాషా ప్రాసెసింగ్, వాతావరణ అంచనా, ఔష‌ద‌ ఆవిష్కరణ వంటి అప్లికేషన్‌ల కోసం ఏఐ-ఆప్టిమైజ్ చేసిన సూపర్ కంప్యూటింగ్‌ను అందిస్తాయి.

కంప్యూట్ లేయర్ అనేది ఏఐ ఆవిష్కరణల స్థాయి, వేగం, అధునాతనతను నిర్ణయించే కీలకమైన సాధనం. అధిక-పనితీరు గల కంప్యూటింగ్‌కు సరసమైన యాక్సెస్‌ను విస్తరించడం ద్వారా, అదే సమయంలో దేశీయ చిప్, సూపర్ కంప్యూటింగ్ సామర్థ్యాలను బలోపేతం చేయడం ద్వారా భారతదేశం ఏఐ అభివృద్ధికి ఉన్న నిర్మాణాత్మక అడ్డంకులను తగ్గిస్తోంది. ఈ విధానం కంప్యూట్ శక్తి కేవలం కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతం కాకుండా, పరిశోధనలు, స్టార్టప్‌లు, ప్రభుత్వ సంస్థలలో విస్తృతమైన ఆవిష్కరణలకు మద్దతు ఇచ్చేలా చూస్తుంది.

ఏఐ కంప్యూట్ వినియోగంలో సాధారణ ధోరణి
హై-ఎండ్ ఏఐ కంప్యూట్‌కు ప్రాప్యత అనేది చాలావరకు అధిక ఖర్చులు, కొన్ని సాంకేతిక సంస్థలు, దేశాల మధ్య అధునాతన హార్డ్‌వేర్ కేంద్రీకృతమై ఉండటం వల్ల చిన్న సంస్థల భాగస్వామ్యాన్ని పరిమితం చేసింది. దీనికి విరుద్ధంగా భారతదేశం ఇండియా ఏఐ మిషన్ కింద ప్రభుత్వం మద్దతు ఇచ్చే క్లౌడ్ మౌలిక సదుపాయాల ద్వారా కంప్యూట్‌కు సరసమైన, భాగస్వామ్య ప్రాప్యతను విస్తరిస్తోంది. ఇండియా ఏఐ కంప్యూట్ పోర్టల్ 38,000 కంటే ఎక్కువ జీపీయూలు, 1,050 టీపీయూలకు గంటకు రూ.100 కంటే తక్కువ సబ్సిడీ ధరలతో యాక్సెస్‌ను అందిస్తుంది. ఇది గ్లోబల్ రేట్లు రూ.200 కంటే ఎక్కువగా ఉన్న దానితో పోలిస్తే చాలా తక్కువ. క్లౌడ్-ఆధారిత వేదిక‌లు, జాతీయ మిషన్లు, ప్ర‌జా మౌళిక స‌దుపాయాల‌ను దేశీయ చిప్ డిజైన్, సెమీకండక్టర్ తయారీ, సూపర్ కంప్యూటింగ్ సామర్థ్యాలను నిర్మించే ప్రయత్నాలతో కలపడం ద్వారా భారతదేశం ప్రవేశ అడ్డంకులను తగ్గిస్తోంది. దీర్ఘకాలిక స్వయం సమృద్ధిని బలోపేతం చేస్తోంది. కంప్యూట్ లభ్యత వల్ల ఏఐ ఆవిష్కరణలు పరిమితం కాకుండా అన్ని రంగాలలో విస్తరించేలా చూస్తోంది.

4. డేటా సెంటర్లు, వ్య‌వ‌స్థ మౌళిక స‌దుపాయాల స్థాయి
ఈ ద‌శ ఏఐ నివాసం, రహదారులను ఏర్పరుస్తుంది. డేటా సెంటర్లు ఏఐ వ్యవస్థలు భద్రపరిచి, నిర్వహించే చోటు. అయితే ఇంటర్నెట్, బ్రాడ్‌బ్యాండ్, 5జీ వంటి నెట్‌వర్క్‌లు వినియోగదారులు, కంప్యూటర్లు, ఏఐ మోడళ్ల మధ్య డేటాను తరలిస్తాయి. ఇవి ఏఐ నమ్మదగ్గ రీతిలో, వేగంగా, వినియోగదారులు ఎక్కడ ఉన్నా వారిని చేరుకునేలా చూస్తాయి. బలమైన నెట్‌వర్క్‌లు, డేటా సెంటర్లు లేకుండా ఏఐ అప్లికేషన్‌లు సమర్థవంతంగా పనిచేయవు లేదా విస్తరించలేవు.

భారతదేశంలో డేటా సెంటర్లు, నెట్‌వర్క్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్
- దేశవ్యాప్త ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్ క్లౌడ్, ఏఐ సేవల కోసం హై-స్పీడ్ డేటాకు మద్దతు ఇస్తుంది.
- దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో 5జీ సేవలు ప్రారంభ‌మ‌య్యాయి. దేశంలోని 99.9% జిల్లాల్లో 85% జనాభాకు అందుబాటులో ఉన్నాయి.
- గ్లోబల్ డేటా సెంటర్ సామర్థ్యంలో భారతదేశం సుమారు 3% వాటాను కలిగి ఉంది. ప్రస్తుతం దాదాపు 960 ఎండబ్ల్యూ డేటా సెంటర్ సామర్థ్యం వ్యవస్థాపితమై ఉంది. ఏఐ, క్లౌడ్ వర్క్‌లోడ్‌ల పెరుగుదల కారణంగా 2030 నాటికి ఈ సామర్థ్యం 9.2 జీడ‌బ్ల్యూకు గణనీయంగా పెరుగుతుందని అంచనా.
- భారతదేశపు మొత్తం సామర్థ్యంలో 25% పైగా వాటాతో ముంబై–నవీ ముంబై అతిపెద్ద డేటా సెంటర్ హబ్‌గా ఉంది. ఇతర ముఖ్యమైన డేటా సెంటర్ హబ్‌లలో బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ ఎన్‌సీఆర్‌, పూణే, కోల్‌కతా ఉన్నాయి.
- భారతదేశ డిజిటల్ మౌలిక సదుపాయాలను వేగవంతం చేయడానికి ప్రపంచ సాంకేతిక దిగ్గజాలు పెట్టుబడులు పెడుతున్నాయి. వీటిలో మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్లు, ఏఐ శిక్షణ కోసం రూ.1.5 లక్షల కోట్లు, అమెజాన్ క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఏఐ ఆధారిత డిజిటలైజేషన్ కోసం 2030 నాటికి రూ.2.9 లక్షల కోట్లు, గూగుల్ వైజాగ్‌లో 1 జీడ‌బ్ల్యూ ఏఐ హబ్ కోసం రూ.1.25 లక్షల కోట్లు ప్రధానమైనవి.

డేటా సెంటర్లు, నెట్‌వర్క్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ స్థాయి ఏఐ వ్యవస్థలను భారీ స్థాయిలో, రియల్ టైమ్‌లో పనిచేయడానికి వీలు కల్పించే పునాది వంటి వెన్నెముకను అందిస్తుంది. కనెక్టివిటీని బలోపేతం చేయడం, దేశీయ డేటా సెంటర్ సామర్థ్యాన్ని విస్తరించడం ద్వారా ఏఐ సేవలు నమ్మదగ్గవిగా, వేగవంతంగా, విస్తృతంగా అందుబాటులో ఉండేలా భారతదేశం చూస్తోంది. ఈ సమగ్ర విధానం సురక్షితమైన ఏఐ విస్తరణకు మద్దతు ఇస్తుంది.

ఏఐ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో సాధారణ ధోరణి
మౌలిక సదుపాయాల లేయర్ అనేది ఏఐ విస్తరణకు వెన్నెముక. ప్రధాన సాంకేతిక కంపెనీలు అధిక-సామర్థ్యం గల డేటా సెంటర్లు, హై-స్పీడ్ నెట్‌వర్క్‌లలో భారీగా పెట్టుబడి పెడుతున్నాయి. డిజిటల్ కనెక్టివిటీ, దేశీయ డేటా సెంటర్ మౌలిక సదుపాయాల విస్తృత అభివృద్ధి ద్వారా భారతదేశం ఈ పునాదిని బలోపేతం చేస్తోంది. ప్రపంచ, భారతీయ సాంకేతిక కంపెనీల పెట్టుబడులు ఏఐ మోడల్‌లు, డేటా, ఆవిష్కరణ వ్యవస్థలు దేశంలోనే ఉండేలా చూస్తున్నాయి. కనెక్టివిటీని మెరుగుపరచడం, డేటా సెంటర్ సామర్థ్యాన్ని విస్తరించడం, డిజిటల్ మౌలిక సదుపాయాలను జాతీయ అధికార పరిధిలో ఉంచడం ద్వారా భారతదేశం అన్ని రంగాలలో ఏఐ వినియోగానికి స్థితిస్థాపకత కలిగిన, విస్త‌ర‌ణ‌కు వీలుండే వాతావరణాన్ని సృష్టిస్తోంది.

5. ఇంధ‌న స్థాయి
ఈ స్థాయి మొత్తం ఏఐ స్టాక్‌ను నడుపుతుంది. ఏఐ సిస్టమ్‌లకు శిక్షణ ఇవ్వడానికి, నిర్వహించడానికి శక్తివంతమైన కంప్యూటర్లు అవసరం కాబట్టి ఏఐ డేటా సెంటర్లు పెద్ద మొత్తంలో విద్యుత్తును వినియోగిస్తాయి. సాంకేతికత మరింత సమర్థవంతంగా మారుతున్నప్పటికీ ఏఐకి ఇప్పటికీ స్థిరమైన, నమ్మదగ్గ విద్యుత్ సరఫరా అవసరం. అందువల్ల ఏఐ మౌలిక సదుపాయాల స్థిరమైన వృద్ధికి స్వచ్ఛమైన, సరసమైన ఇంధనం అవసరం.

భారతదేశంలో సరసమైన, సురక్షితమైన, స్వచ్ఛమైన ఇంధనం
- భారతదేశం 2025–26 ఆర్థిక సంవ‌త్స‌రంలో 242.49 జీడ‌బ్ల్యూ రికార్డు స్థాయి గరిష్ట విద్యుత్ డిమాండ్‌ను తీర్చింది. జాతీయ ఇంధన కొరతను కేవలం 0.03 శాతానికి తగ్గించింది. ఏఐ డేటా సెంటర్లు, హై-పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ సౌకర్యాలకు అంతరాయం లేని విద్యుత్తును నిర్ధారిస్తుంది.
- మొత్తం వ్యవస్థాపిత విద్యుత్ సామర్థ్యం 509.7 జీడ‌బ్ల్యూకి చేరుకుంది (నవంబర్ 2025 నాటికి). ఇది ఇంధనం ఎక్కువ అవ‌స‌ర‌మ‌య్యే ఏఐ వర్క్‌లోడ్‌లకు అవసరమైన స్థాయిని అందిస్తుంది.
- శిలాజ రహిత ఇంధన వనరుల వాటా 256.09 జీడ‌బ్ల్యూగా ఉంది. ఇది మొత్తం వ్యవస్థాపిత సామర్థ్యంలో 51% కంటే ఎక్కువ. ఇది ఏఐ మౌలిక సదుపాయాల వృద్ధిని స్థిరత్వంతో అనుసంధానిస్తుంది. డేటా సెంటర్ల కార్బన్ ఉద్గారాల‌ను తగ్గిస్తుంది.
- భారతదేశం 2031–32 నాటికి 57 జీడ‌బ్ల్యూ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులను, 43,220 ఎండ‌బ్ల్యూహెచ్‌ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్‌ను సాధించాలని యోచిస్తోంది. ఇది గ్రిడ్ స్థిరత్వాన్ని మరింత పెంచుతుంది. పునరుత్పాదక ఇంధనంతో పనిచేసే ఏఐ డేటా సెంటర్లకు మద్దతు ఇస్తుంది.

దీంతో పాటు స‌స్టెయిన‌బుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ న్యూక్లియ‌ర్ ఎన‌ర్జీ(శాంతి) చట్టం అణుశక్తిని ఏఐ, డేటా సెంటర్ల కోసం స్థిరమైన, నిరంతర స్వ‌చ్ఛ‌ ఇంధన వనరుగా నిలుపుతుంది. ఈ చట్టం ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని అనుమతిస్తుంది. స్మాల్ మోడ్యులర్ రియాక్టర్ల మోహరింపును వేగవంతం చేస్తుంది.

ఎనర్జీ లేయర్ మొత్తం ఏఐ పర్యావరణ వ్యవస్థ విశ్వసనీయత, స్థిరత్వానికి ఆధారం. తగినంత, సరసమైన, స్వచ్ఛమైన విద్యుత్ సరఫరాను నిర్ధారించడం ద్వారా గ్రిడ్ స్థిరత్వాన్ని దెబ్బతీయకుండా ఏఐ మౌలిక సదుపాయాలను విస్తరించడానికి భారతదేశం వీలు కల్పిస్తోంది.

ఏఐ, ఇంధన డిమాండ్‌లో సాధారణ ధోరణి
ఏఐ, డేటా సెంటర్ల వేగవంతమైన విస్తరణ ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్‌లో గణనీయమైన పెరుగుదలకు దారితీస్తోంది. ప్రపంచ డేటా సెంటర్ విద్యుత్ వినియోగం 2030 నాటికి రెండింతల కంటే ఎక్కువ పెరుగుతుందని అంచనా. అంటే ఏటా సుమారు 945 టీడ‌బ్ల్యూహెచ్‌కి చేరుకుంటుంది. భారతదేశంలో విద్యుత్ రంగం చరిత్రాత్మక పరివర్తనకు లోనవుతున్న తరుణంలో ఈ ధోరణి కనిపిస్తోంది. దేశ మొత్తం వ్యవస్థాపిత విద్యుత్ సామర్థ్యం 500 జీడ‌బ్ల్యూ దాటింది. శిలాజ రహిత వనరులు ఆ సామర్థ్యంలో 51% కంటే ఎక్కువగా ఉన్నాయి. ఇది 2030 లక్ష్యం కంటే ముందే సాధించిన ప్రధాన స్వచ్ఛమైన ఇంధన మైలురాయి. ఈ విస్తరణ అధిక ఇంధ‌న‌, నిరంతరం పనిచేసే ఏఐ, డేటా-సెంటర్ వర్క్‌లోడ్‌లకు మద్దతు ఇచ్చే సామర్థ్యాన్ని బలపరుస్తుంది.

ముగింపు
బలమైన ఏఐ స్టాక్‌ను నిర్మించడం అనేది భారతదేశానికి సాంకేతిక ప్రాధాన్యతతో పాటు సామాజిక నిబద్ధత. అప్లికేషన్‌లు, ఏఐ మోడల్‌లు, కంప్యూట్, డిజిటల్ మౌలిక సదుపాయాలు, శక్తితో సహా ప్రతి స్థాయిని బలోపేతం చేయడం ద్వారా భారతదేశం ఏఐ ప్రజాస్వామ్యీకరణను సాధ్యం చేస్తోంది. దాని ప్రయోజనాలు జనాభా స్థాయిలో పౌరులకు చేరువయ్యేలా చూస్తోంది. వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, విద్య, న్యాయం, విపత్తు నిర్వహణలో వాస్త‌వ ప్రపంచ వినియోగ సందర్భాలపై దృష్టి సారించడం ద్వారా ఏఐ ఎలా సేవలు అందించ‌డాన్ని, ఉత్పాదకతను, ప్రజల సంక్షేమాన్ని నేరుగా మెరుగుపరుస్తుందో నిరూపిస్తుంది.

సరసమైన కంప్యూట్ యాక్సెస్, స్వదేశీ మోడల్ అభివృద్ధి, సురక్షిత డేటా మౌలిక సదుపాయాలు, స్థిరమైన ఇంధన వ్యవస్థల ద్వారా భారతదేశం విస్త‌రించ‌త‌గిన‌, స్థితిస్థాపకత కలిగిన, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న ఏఐ వ్యవస్థను సృష్టిస్తోంది. ఈ సమగ్ర విధానం ఏఐ ఆవిష్కరణలు ఖర్చు, మౌలిక సదుపాయాలు లేదా ఇంధన లభ్యత వల్ల పరిమితం కాకుండా చూస్తుంది. మానవాళి కోసం ఏఐ అనే దార్శనికతతో, భారతదేశపు ఏఐ స్టాక్ సాంకేతికతను సమగ్ర వృద్ధికి, సామాజిక సమానత్వానికి, సంక్షేమానికి ఒక సాధనంగా నిలుపుతోంది.

 

***

(Explainer ID: 157573) आगंतुक पटल : 49
Provide suggestions / comments
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: हिन्दी , Gujarati , English , Marathi , Assamese , Bengali , Manipuri , Punjabi , Odia , Kannada , Malayalam
National Portal Of India
STQC Certificate