Rural Prosperity
భారత వ్యవసాయ రంగాన్ని మార్చేస్తున్న కృత్రిమ మేధ(ఏఐ)
Posted On:
23 FEB 2026 1:45PM
|
కీలకాంశాలు
* డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ కింద భారతదేశం వ్యవసాయం కోసం ఒక పెద్ద డిజిటల్ పునాదిని సృష్టించింది. ఇందులో 7.63 కోట్లకు పైగా రైతు ఐడీలు, 23.5 కోట్ల పంట భూములను సర్వే చేశారు.
* జాతీయ చీడపీడల నిఘా వ్యవస్థ 66 రకాల పంటలు, 432కు పైగా రకాల తెగుళ్లను గుర్తిస్తుంది. ఇది తెగుళ్లను ముందుగానే గుర్తించి, 10,000 మందికి పైగా వ్యవసాయ విస్తరణ కార్యకర్తలకు ఎప్పటికప్పుడు సలహాలను అందిస్తుంది.
* డిసెంబర్ 2025 నాటికి 'కిసాన్ ఇ-మిత్ర' చాట్‌బాట్ 11 ప్రాంతీయ భాషల్లో రోజుకు 8,000కు పైగా రైతుల సందేహాలను తీరుస్తూ మొత్తం 93 లక్షలకు పైగా ప్రశ్నలకు సమాధానమిచ్చింది.
* ఖరీఫ్ 2025 కోసం స్థానిక రుతుపవనాల రాకను అంచనా వేయడానికి ఏఐ ఆధారిత పైలట్ ప్రాజెక్ట్ 13 రాష్ట్రాల్లోని 3.88 కోట్ల మంది రైతులకు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం అందించింది. సర్వే చేసిన రైతులలో 31-52% మంది ఈ అంచనాల ఆధారంగా విత్తనాలు వేయడం, భూమిని సిద్ధం చేసుకోవడం వంటి నిర్ణయాలు మార్చుకున్నారు.
* యెస్-టెక్, క్రాపిక్, పీఎంఎఫ్‌బీవై వాట్సాప్ చాట్‌బాట్ వంటి ఏఐ పరికరాలు పీఎంఎఫ్‌బీవై కింద పంట బీమాను రైతులకు మరింత వేగంగా, పారదర్శకంగా, కొత్త పద్ధతుల్లో అందుబాటులోకి తెస్తున్నాయి.
* కేంద్ర బడ్జెట్ 2026-27లో 'భారత్-విస్తార్' అనే బహుభాషా ఏఐ పరికరాన్ని ప్రతిపాదించారు. ఇది అగ్రిస్టాక్ పోర్టళ్లు, ఐసీఏఆర్ సమాచారాన్ని ఏఐ వ్యవస్థతో అనుసంధానిస్తుంది.
|
పరిచయం

స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయ 2025 గ్లోబల్ ఏఐ వైబ్రెన్సీ టూల్ ప్రకారం కృత్రిమ మేధ రంగంలో భారతదేశం ప్రపంచంలోనే మూడో స్థానంలో నిలిచి ప్రపంచంలోనే అగ్రగామిగా ఎదుగుతోంది. 2017 నుంచి 2024 మధ్య కాలంలో కనిపించిన ఈ వేగవంతమైన వృద్ధి, భారతదేశ డిజిటల్ సామర్థ్యాన్ని, ఏఐ ప్రతిభను, పెట్టుబడులను ప్రతిబింబిస్తుంది. కృత్రిమ మేధ(ఏఐ) ఇప్పుడు వ్యవసాయంలో ఒక గొప్ప మార్పును తెచ్చే శక్తిగా మారుతోంది. ఇది సాగులో ఉత్పాదకతను, స్థిరత్వాన్ని పెంచడానికి కొత్త మార్గాలను చూపుతోంది. ఉపగ్రహాలు, సెన్సార్లు, డ్రోన్లు, వాతావరణ కేంద్రాలు, వ్యవసాయ యంత్రాల నుంచి వచ్చే డేటాను ఉపయోగించి.. ఏఐ పరికరాలు వ్యవసాయంలోని ప్రతి దశలోనూ సరైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడతాయి.
కృత్రిమ మేధ అంటే ఏమిటి?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) అంటే సాధారణంగా మనుషులు చేసే పనులను యంత్రాలు చేయగలగడం. ఇది అనుభవం నుంచి నేర్చుకోవడానికి, కొత్త పరిస్థితులకు అనుగుణంగా మారడానికి, క్లిష్టమైన సమస్యలను స్వతంత్రంగా పరిష్కరించడానికి వ్యవస్థలకు శక్తినిస్తుంది. ఏఐ పెద్ద మొత్తంలో సమాచారాన్ని, అల్గారిథమ్స్ ఉపయోగించి నమూనాలను గుర్తించడంతో పాటు స్పందిస్తుంది. కాలక్రమేణా, ఈ వ్యవస్థలు తమ పనితీరును మెరుగుపరుచుకుంటూ, మనుషులలాగే ఆలోచించడం, నిర్ణయాలు తీసుకోవడం, మాట్లాడటం చేస్తాయి.
ఇండియా-ఏఐ ఇంపాక్ట్ సదస్సు 2026: అందరి అభివృద్ధి కోసం ఏఐ
'ఇండియా-ఏఐ ఇంపాక్ట్ సదస్సు 2026' ఏఐని అందరికీ సమానంగా ఉపయోగపడే పరికరంగా చూపిస్తోంది. ముఖ్యంగా వెనుకబడిన వర్గాలకు సాంకేతికతను తక్కువ ధరకే అందుబాటులోకి తేవడంపై ఇది దృష్టి పెడుతుంది. 'అందరి సంక్షేమం, అందరి సంతోషం' అనే లక్ష్యంతో ఏఐని మానవతా దృక్పథంతో పాలన మెరుగుపరచడానికి, సుస్థిర అభివృద్ధి కోసం వాడుతున్నారు. ఈ నేపథ్యంలో భారత వ్యవసాయ రంగం ఒక ముఖ్యమైన మలుపులో ఉంది. ఇక్కడ రైతులకు అండగా ఉండటానికి, ఉత్పాదకతను పెంచడానికి ఏఐని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
వ్యవసాయంలో కృత్రిమ మేధ, దాని ఉపయోగాలు
వ్యవసాయంలో ఏఐ అనేది సంక్లిష్టమైన డేటాను రైతులు రోజువారీ పనుల్లో ఉపయోగించుకోగల సరళమైన సలహాలుగా మారుస్తుంది. శాటిలైట్ చిత్రాలు, వాతావరణ అంచనాలు, నేల సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా రైతులు ఏ పంట వేయాలి, ఎప్పుడు వేయాలి, ఎంత ఎరువులు వాడాలి, ఎప్పుడు కోత కోయాలి అనే విషయాల్లో ఏఐ సహాయం చేస్తుంది. తెగుళ్ల గురించి ముందస్తు హెచ్చరికలు ఇవ్వడం నుంచి నీటి పారుదల ప్రణాళిక వరకు ఏఐ వ్యవసాయాన్ని మరింత కచ్చితమైనదిగా, తక్కువ నష్టంతో కూడినదిగా చేస్తోంది. వ్యవసాయంలో ఏఐ ఉపయోగాలను ఇలా వర్గీకరించవచ్చు:
- నేల ఆరోగ్యాన్ని పరీక్షించడం
ఏఐ సాంకేతికత శాటిలైట్ చిత్రాలు, డ్రోన్ల ద్వారా నేల ఆరోగ్యాన్ని గమనిస్తుంది. దీనివల్ల ప్రయోగశాలలకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేకుండానే నేలలోని పోషకాల లోపాలను గుర్తించవచ్చు. రైతులు వెంటనే స్పందించి నేల సారాన్ని పెంచే చర్యలు తీసుకోవచ్చు.
- వాతావరణానికి అనుగుణంగా పంట పర్యవేక్షణ, సలహాలు
భారతీయ వ్యవసాయం వర్షంపై ఎక్కువగా ఆధారపడుతుంది కాబట్టి వాతావరణ మార్పుల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. ఏఐ వాతావరణ డేటాను విశ్లేషించి వర్షపాతం, ఉష్ణోగ్రత మార్పులను ముందుగానే ఊహిస్తుంది. విత్తనాలు వేయడం, నీటి సరఫరా, తెగుళ్ల నిర్వహణపై రైతులకు ఎప్పటికప్పుడు సలహాలిస్తుంది. శాటిలైట్లు, డ్రోన్ల సాయంతో తెగుళ్లను ముందుగానే గుర్తించి పంట నష్టాన్ని తగ్గిస్తుంది. ఈ అన్ని ఉపకరణాలు రైతులకు, ముఖ్యంగా వర్షాధార ప్రాంతాల్లో వాతావరణ సమస్యలు, పంట నష్టపోయే మప్పులను తగ్గించడంలో సమష్టిగా ఉపయోగపడతాయి.
- వ్యవసాయ యంత్రీకరణ సామర్థ్యం పెంపు
డ్రోన్లు, సెన్సార్లతో కూడిన ఏఐ పరికరాలు వ్యవసాయ యంత్రాల వాడకాన్ని మరింత సమర్థవంతంగా చేస్తాయి. కలుపు తీయడం, వ్యాధులను గుర్తించడం, ఆటోమేటిక్ కోతలు, పంటను గ్రేడింగ్ చేయడం వంటి పనులను ఇవి సులభతరం చేస్తాయి.
తోటల పెంపకంలో ఏఐ ఆధారిత వ్యవస్థలు పంటలను 24 గంటలూ పర్యవేక్షించడం ద్వారా కూలీల అవసరం తగ్గుతుంది. పంట నాణ్యత పెరుగుతుంది.
- రైతులకు మంచి ధర లభించేలా చేయడం
పండ్లు, కూరగాయలు పండించే రైతులు సరైన మార్కెట్ సమాచారం లేక, సరఫరా గొలుసులో సమస్యలు, సమాచారలోపం వంటి కారణాలతో తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తుంది. మార్కెట్ డిమాండ్, సరఫరాను అంచనా వేయడం, మార్కెట్ ఇంటెలిజెన్స్, వ్యవసాయ విలువ గొలుసుల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడం ద్వారా ఏఐ ఈ సమస్యను పరిష్కరిస్తుంది.
ఏఐ-ఆధారిత అంచనా విశ్లేషణలు ధరల మార్పులు, మార్కెట్‌కు పంట వచ్చే పోకడలు, ప్రాంతీయ డిమాండ్ నమూనాలను అంచనా వేయడానికి ఈ-నామ్, అగ్‌మార్కెట్, వ్యవసాయ గణన, భూసార పరీక్షల కార్యక్రమం వంటి వేదికల నుంచి పెద్దఎత్తున సమాచారాన్ని ఉపయోగించుకుంటాయి. దేశీయ, ప్రపంచవ్యాప్త వస్తువుల సంకేతాలను విశ్లేషించడం ద్వారా ఈ సాధనాలు పంట ఎంపిక, విక్రయ సమయం, మార్కెట్ ఎంపికపై మరింత మెరుగైన నిర్ణయాలు తీసుకోవడంలో మద్దతునిస్తాయి. తద్వారా రైతులకు మంచి ధర లభించేలా చేస్తాయి. తక్కువ ధరకే అమ్ముకోవాల్సిన ఒత్తిడిని తగ్గిస్తాయి. వ్యవసాయంలో ఏఐ అమలు అనేది ఈ రంగం అంతటా క్షేత్రస్థాయి నుంచి జరుగుతున్న మార్పుల వ్యాప్తిని చాటిచెప్తుంది. ఏఐ-ఆధారిత వ్యవసాయ వ్యవస్థలు 12 రాష్ట్రాల్లోని సుమారు 18 లక్షల మంది రైతులకు మార్కెట్ ప్రాప్తిని, ధరను గుర్తించడాన్ని, రవాణా సామర్థ్యాన్ని మెరుగుపరిచాయి.
కచ్చితమైన వ్యవసాయానికి ప్రధాన శక్తిగా ఏఐ
జీపీఎస్, సెన్సార్లు, ఉపగ్రహాలు, డ్రోన్ల నుంచి వచ్చే సమాచారాన్ని పొలంలో ఉపయోగపడే సలహాలుగా మార్చడం ద్వారా ఏఐ కచ్చితత్వంతో కూడిన వ్యవసాయానికి మార్గం సుగమం చేస్తుంది. ఇది నేల స్వభావం, తేమ శాతం, పంట ఆరోగ్యం వంటి వివరాలను అత్యంత కచ్చితంగా సేకరిస్తుంది. దీనివల్ల నీరు, ఎరువులు, పురుగుమందులను ఎక్కడ, ఎప్పుడు, ఎంత అవసరమో అంతే వాడేలా చేస్తుంది. ఈ విధానం వల్ల దిగుబడి పెరగడమే కాకుండా, వనరుల వృధా తగ్గుతుంది. పర్యావరణానికి మేలు జరుగుతుంది.

ఏఐ ఆధారిత కచ్చితమైన వ్యవసాయం: సుస్థిర వ్యవసాయ మార్పునకు నమూనా
తమిళనాడుకు చెందిన రాజరత్నం కనకరాజన్ అనుభవం భారత వ్యవసాయంలో ఏఐ ఏ విధంగా ఉపయోగపడుతుందో నిరూపిస్తుంది. 'ఫామ్ ఎగైన్' అనే స్టార్టప్ అభివృద్ధి చేసిన ఏఐ వ్యవస్థను ఉపయోగించి, ఆయన తన మొబైల్ ద్వారానే నేలలోని తేమ, నీటి పారుదల, ఎరువుల వాడకాన్ని పర్యవేక్షించారు. ఈ ఆటోమేటిక్ వ్యవస్థ వల్ల నీటి వృధా తగ్గి, కొబ్బరి దిగుబడి రెట్టింపు అయింది.
ఈ విధానం ప్రస్తుతం తమిళనాడులో 3,500 మంది రైతులకు, 4,000 ఎకరాలలో ప్రయోజనం చేకూరుస్తోంది. విదేశీ పరికరాల ధర(రూ.25 లక్షలు)తో పోలిస్తే, మన దేశంలో తయారైన ఈ పరికరాల ధర(రూ.2.5 లక్షలు) చాలా తక్కువ కావడంతో రైతులు వీటిని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దీనివల్ల ఏటా 4,00,000 క్యూబిక్ మీటర్ల నీరు, 1,75,000 యూనిట్ల విద్యుత్ ఆదా అవ్వడమే కాకుండా, దాదాపు 20,000 టన్నుల కార్బన్ ఉద్గారాలు తగ్గడం విశేషం. ఈ పరిష్కార మార్గం బహుళ దేశాలకు విస్తరించడం ద్వారా స్థానికంగా అభివృద్ధిచేసిన ఏఐ ఆవిష్కరణలు వ్యవసాయ ఉత్పాదకతను, వనరుల పరిరక్షణను ఎలా మెరుగుపరచగలవో, సుస్థిర వ్యవసాయాభివృద్ధికి ఎలా దోహదపడగలవో ప్రదర్శిస్తున్నాయి.

ఏఐ ఆధారిత వ్యవసాయంపై ప్రభుత్వ కార్యక్రమాలు
వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించడానికి ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా ఏఐని వాడుతోంది. ప్రభుత్వ విధానాలలో వచ్చిన మార్పులకు కింది కార్యక్రమాలే నిదర్శనం:
కేంద్ర బడ్జెట్ 2026-27: ఏఐ ఆధారిత వ్యవాసయ సూచనల కోసం భారత్-విస్తార్
కేంద్ర బడ్జెట్ 2026-27లో 'భారత్-విస్తార్' అనే బహుభాషా ఏఐ సాధనాన్ని ప్రతిపాదించారు. ఇది అగ్రిస్టాక్ పోర్టళ్లు, ఐసీఏఆర్ సాగు పద్ధతులను ఏఐ వ్యవస్థతో కలుపుతుంది. ఇది రైతులకు వ్యక్తిగత సలహాలను అందించడం ద్వారా ఉత్పాదకతను పెంచుతుంది. సాగులో నష్టపోయే ముప్పును తగ్గిస్తుంది.

రైతుల కోసం ఏఐ ఆధారిత సలహా, నిర్ణయం తీసుకునేందుకు ఉపయోగపడే సేవలు
కిసాన్ ఇ-మిత్ర:


2023లో ప్రారంభమైన 'కిసాన్ ఇ-మిత్ర' ఒక ధ్వని ఆధారిత ఏఐ చాట్‌బాట్. ఇది పీఎం కిసాన్, కిసాన్ క్రెడిట్ కార్డ్, పంట బీమా వంటి ప్రభుత్వ పథకాలపై రైతుల ప్రశ్నలకు 11 ప్రాంతీయ భాషల్లో సమాధానాలిస్తుంది. డిసెంబర్ 2025 నాటికి ఇది 93 లక్షలకు పైగా ప్రశ్నలకు పరిష్కారం చూపింది. తద్వారా పథకాలకు సంబంధించిన సమాచారాన్ని దేశవ్యాప్తంగా రైతులకు అందుబాటులో ఉంచడాన్ని మెరుగుపరిచింది.
జాతీయ చీడపీడల నిఘా వ్యవస్థ(ఎన్‌పీఎస్ఎస్):
2024లో ప్రారంభమైన జాతీయ చీడపీడల నిఘా వ్యవస్థ(ఎన్‌పీఎస్ఎస్) వ్యవస్థ ఏఐ, మెషీన్ లెర్నింగ్ ఉపయోగించి పంటలకు పట్టే తెగుళ్లను ముందుగానే గుర్తిస్తుంది. రైతులు తమ పంటకు సోకిన తెగుళ్ల ఫోటోలను మొబైల్ యాప్ ద్వారా అప్‌లోడ్ చేయవచ్చు.
ఇమేజ్ అనలిటిక్స్‌ను ఉపయోగించి ఎన్‌పీఎస్ఎస్ వెంటనే వ్యాధిని గుర్తించి నివారణకు తీసుకోవాల్సిన చర్యలను, వ్యాధి నిర్వహణ పద్ధతులను సూచిస్తుంది. పంట నష్టాన్ని తగ్గిస్తుంది. ప్రస్తుతం ఇది 66 రకాల పంటలకు, 432 రకాల తెగుళ్లకు సంబంధించి రైతులకు, 10 వేల మంది వ్యవసాయ విస్తరణ సిబ్బందికి సేవలను అందిస్తోంది.
ఖరీఫ్ విత్తన నిర్ణయాల కోసం ఏఐ-ఆధారిత స్థానిక రుతుపవన రాక అంచనాలు:
13 రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలలో స్థానిక రుతుపవనాల రాకను అంచనా వేయడానికి 2025 ఖరీఫ్ సమయంలో ఒక ఏఐ-ఆధారిత పైలట్ ప్రాజెక్ట్ అమలయ్యింది. ఈ కార్యక్రమం భారత వాతావరణ శాఖ(ఐఎండీ), డెవలప్‌మెంట్ ఇన్నోవేషన్ ల్యాబ్-ఇండియా సహకారంతో జరిగింది. ఈ ప్రాజెక్ట్ న్యూరల్‌జీసీఎం, యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం-రేంజ్ వెదర్ ఫోర్కాస్ట్స్(ఈసీఎండబ్ల్యూఎఫ్) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్(ఏఐఎఫ్ఎస్), ఐఎండీ నుంచి సేకరించిన 125 సంవత్సరాల చారిత్రక వర్షపాత డేటాను కలిపి ఒక ఓపెన్-సోర్స్ బ్లెండెడ్ మోడలింగ్ విధానాన్ని ఉపయోగించింది. స్థానిక రుతుపవనాల రాకపై దృష్టి సారించి, సరైన విత్తన నిర్ణయాలు తీసుకోవడంలో మార్గనిర్దేశం చేయడానికి, ఎంకిసాన్ పోర్టల్ ద్వారా ఎస్ఎంఎస్ రూపంలో 13 రాష్ట్రాల్లోని 3.88 కోట్లకు పైగా రైతులకు ఐదు ప్రాంతీయ భాషల్లో ఈ అంచనాలను పంపారు. మధ్యప్రదేశ్, బీహార్‌లలో నిర్వహించిన తదుపరి సర్వేలు 31-52 శాతం మంది రైతులు ఈ అంచనాల ఆధారంగా తమ సాగు నిర్ణయాలను మార్చుకున్నారని వెల్లడించాయి. వీరు ప్రధానంగా భూమిని సిద్ధం చేసుకోవడం, విత్తనాలు వేసే సమయం, పంట రకం, ఎరువుల ఎంపిక వంటి విషయాల్లో మార్పులు చేసుకున్నారు.
డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ ద్వారా డేటా ఆధారిత పాలన
2024లో ప్రారంభించిన డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ రూ.2,817 కోట్ల మొత్తం వ్యయంతో, 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ.54.972 కోట్ల కేటాయింపుతో, వ్యవసాయ రంగంలో వినూత్నమైన, రైతు కేంద్రిత డిజిటల్ పరిష్కారాలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మిషన్ రైతులు, భూయజమానులు, పంటలపై ధ్రువీకరించిన డేటా సెట్‌లను ఉపయోగించి, డేటా అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రిమోట్ సెన్సింగ్ వంటి అధునాతన డిజిటల్ సాంకేతికతలతో పాటు పంట సంబంధిత సమాచారాన్ని రైతులకు సకాలంలో అందించేలా చూస్తుంది.
డేటా ఆధారితంగా నిర్ణయాలు తీసుకోవడాన్ని బలోపేతం చేయడం ద్వారా వ్యవసాయ సేవల సామర్థ్యాన్ని, పారదర్శకతను, బాధ్యతను పెంపొందించడానికి ఈ మిషన్ రూపొందింది. ఇది భారతదేశంలో పటిష్టమైన, విస్తరించదగిన డిజిటల్ వ్యవసాయ వ్యవస్థకు పునాది వేస్తూ అగ్రిస్టాక్, కృషి డెసిషన్ సపోర్ట్ సిస్టమ్(కేడీఎస్ఎస్) వంటి వేదికలతో పాటు సమగ్ర భూసారం, ప్రొఫైల్ మ్యాప్‌ను కలిగి ఉన్న డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్(డీపీఐ)ను అభివృద్ధి చేయాలని భావిస్తోంది.
అగ్రిస్టాక్:
అగ్రిస్టాక్ అనేది డిజిటల్ అగ్రికల్చర్ మిషన్‌లో ప్రధాన భాగం. ఇది రైతులకు భూమి రికార్డులు, పశువుల యాజమాన్యం, సాగు చేసే పంటలు, పొందుతున్న ప్రయోజనాలతో అనుసంధానమైన ఒక ప్రత్యేక డిజిటల్ గుర్తింపు(ఫార్మర్ ఐటీ)ని అందిస్తుంది. తద్వారా వ్యవసాయ సేవలను సురక్షితంగా పొందేందుకు వీలు కల్పిస్తుంది. 2026–27 నాటికి 11 కోట్ల రైతు ఐడీలు సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకాగా, 27 నవంబర్ 2025 నాటికి 7.63 కోట్లకు పైగా ఐడీలు రూపొందాయి. ఇందులో 1.93 కోట్ల ఐడీలు మహిళా రైతులకు చెందినవి. వీటి సృష్టి, ధ్రువీకరణను వేగవంతం చేయడానికి పీఎం-కిసాన్ పరిపాలనా నిధుల నుంచి ఒక్కో రైతు ఐడీకి రూ.10 కేటాయించారు. అగ్రిస్టాక్ మొబైల్ ఆధారిత డిజిటల్ క్రాప్ సర్వేకు కూడా మద్దతు ఇస్తుంది. ఇది పంట రకం, సాగు విస్తీర్ణంపై తక్షణ సమాచారాన్ని సేకరిస్తుంది. ఈ సర్వే రబీ 2024–25 సమయంలో 492 జిల్లాలు, 23.5 కోట్లకు పైగా ప్లాట్‌లను కవర్ చేసింది. ప్రణాళిక, విధాన అమలును బలోపేతం చేయడానికి 2025–26 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో దీనిని అమలు చేయాలని నిర్ణయించారు.
కృషి డెసిషన్ సపోర్ట్ సిస్టమ్(కేడీఎస్ఎస్):
కృషి డెసిషన్ సపోర్ట్ సిస్టమ్(కేడీఎస్ఎస్) శాటిలైట్ చిత్రాలు, వాతావరణ సమాచారం, నేల, నీటి వనరులు, పంట డేటా, ప్రభుత్వ పథకాల సమాచారం వంటి బహుళ వనరుల నుంచి సమాచారాన్ని ఏకీకృతం చేస్తుంది, తద్వారా డిజిటల్ పంట మ్యాప్‌లు, నేల మ్యాప్‌లు, దిగుబడి అంచనాలు, కరువు, వరద పర్యవేక్షణ అంచనాల వంటి సమగ్ర విశ్లేషణలను రూపొందిస్తుంది. ఈ వ్యవస్థ పంట వైవిధ్యీకరణ సలహాలను అందించడం ద్వారా సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడానికి మద్దతు ఇస్తుంది. పంట బీమా పరిష్కారం కోసం సాంకేతిక, మోడల్ ఆధారిత దిగుబడి అంచనాలను సులభతరం చేస్తుంది. అదే సమయంలో ప్రభుత్వ సంస్థలకు నమ్మదగిన, తక్షణ వివరాలను అందించడం ద్వారా సాక్ష్యం ఆధారిత విధాన రూపకల్పన, కార్యక్రమ అమలును కేడీఎస్ఎస్ బలోపేతం చేస్తుంది.
నేల ప్రొఫైల్ మ్యాప్‌లు:
సాయిల్ అండ్ ల్యాండ్ యూజ్ సర్వే ఆఫ్ ఇండియా(ఎస్ఎల్‌యూఎస్ఐ) చేపట్టిన దేశవ్యాప్త నేల వనరుల మ్యాపింగ్ ప్రాజెక్ట్, హై-రిజల్యూషన్ శాటిలైట్ చిత్రాలను క్షేత్రస్థాయి పరిశీలనలతో అనుసంధానించడం ద్వారా 1:10,000 హై-స్పేషియల్ రిజల్యూషన్‌లో సమగ్ర గ్రామ స్థాయి నేల జాబితాను రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీని ఫలితంగా వచ్చే ప్రామాణిక నేల మ్యాప్‌లు భూ వినియోగ ప్రణాళిక, పంట ఎంపిక, సుస్థిర వ్యవసాయ పద్ధతుల ప్రచారం కోసం శాస్త్రీయ ప్రాతిపదికను అందిస్తాయి. సెప్టెంబర్ 2024 నాటికి 14.2 కోట్ల హెక్టార్ల వ్యవసాయ భూమి మిషన్ లక్ష్యానికి గానూ సుమారు 2.9 కోట్ల హెక్టార్లను మ్యాపింగ్ చేశారు. ఈ మిషన్ అమలు కోసం ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఎంపికయ్యాయి. ఇందుకు 1,076 కోట్ల నిధుల కేటాయింపునకు ఆమోదం లభించింది. అలాగే, స్థానిక యంత్రాంగాన్ని సమీకరించేందుకు, క్షేత్రస్థాయి శిబిరాలను నిర్వహించేందుకు క్యాంప్-మోడ్ విధానాన్ని అనుసరించాలని రాష్ట్రాలను ప్రోత్సహిస్తూ ఒక్కో క్యాంపునకు రూ.15,000 కేటాయించారు.
స్థితిస్థాపక వ్యవసాయం కోసం ఏఐ-ఆధారిత, సాంకేతికతతో కూడిన పంట బీమా
తక్కువ, స్థిరమైన ప్రీమియం రేట్ల ద్వారా సరసమైన పంట బీమాను అందించడం ద్వారా ఊహించని సంఘటనల వల్ల కలిగే పంట నష్టాల నుంచి రైతులను రక్షించడానికి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన(పీఎంఎఫ్‌బీవై) ప్రారంభమైంది. ఖరీఫ్ ఆహార, నూనెగింజల పంటలకు రైతులు కేవలం 2 శాతం, రబీ ఆహార, నూనెగింజల పంటలకు 1.5 శాతం, వాణిజ్య, ఉద్యానవన పంటలకు 5 శాతం మాత్రమే చెల్లిస్తారు. మిగిలిన ప్రీమియంను ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తుంది. ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్‌లలో బలహీన వర్గాల రైతులకు రక్షణ కల్పించడానికి పూర్తి ప్రీమియంను ప్రభుత్వమే భరిస్తుంది.
ఈ పథకం సామర్థ్యాన్ని, పారదర్శకతను పెంచడానికి క్రమంగా ఏఐ-ఆధారిత సాంకేతికతలను అనుసంధానించింది.
యస్-టెక్(సాంకేతికత ఆధారిత దిగుబడి అంచనా వ్యవస్థ) కచ్చితమైన దిగుబడి అంచనాలను రూపొందించడానికి రిమోట్ సెన్సింగ్, ఏఐ-ఆధారిత విశ్లేషణలను ఉపయోగిస్తుంది. ఖరీఫ్ 2023లో వరి, గోధుమల కోసం ప్రవేశపెట్టిన ఈ విధానం ఖరీఫ్ 2024లో సోయాబీన్‌కు విస్తరించారు. యస్-టెక్ సాంకేతిక ఆధారిత అంచనాలకు కనీసం 30 శాతం వెయిటేజీని ఇస్తుంది. జనవరి 2025 నాటికి దీనిని తొమ్మిది రాష్ట్రాలు అనుసరించాయి, మధ్యప్రదేశ్ పూర్తిగా సాంకేతిక ఆధారిత దిగుబడి అంచనాకు మారింది. తద్వారా సకాలంలో నష్టాన్ని అంచనా వేయడం, వేగంగా క్లెయిమ్ సెటిల్‌మెంట్ చేయడం సాధ్యమవుతుంది.
క్రాపిక్(పంటల నిజ-సమయ పరిశీలనలు, ఫోటోగ్రాఫ్‌ల సేకరణ) అనేది పంట ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి, పంట నష్టాన్ని అంచనా వేయడానికి ఉపయోగించే ఏఐ-ఆధారిత సాధనం. మొబైల్ అప్లికేషన్ ద్వారా రైతులు, ఫీల్డ్ కోఆర్డినేటర్లు స్మార్ట్‌ఫోన్ల నుంచి జియో-ట్యాగ్ చేసిన, సమయ ముద్రతో కూడిన పంట చిత్రాలను అప్‌లోడ్ చేస్తారు. ఈ ఫోటోలు బీమా చేసిన పంటలను సరిచూసుకోవడానికి, స్థానిక ప్రకృతి వైపరీత్యాల సమయంలో కచ్చితమైన నష్టాన్ని అంచనా వేయడానికి సహాయపడతాయి. క్రాపిక్ ఒక పారదర్శకమైన, తక్షణ, సాక్ష్యం-ఆధారిత వ్యవస్థను అందిస్తుంది. ఇది పంట బీమా అమలును, విపత్తు ప్రతిస్పందనను, డేటా ఆధారిత నిర్ణయాధికారాన్ని బలోపేతం చేస్తుంది.
పీఎంఎఫ్‌బీవై వాట్సాప్ చాట్‌బాట్ అనేది పీఎంఎఫ్‌బీవై పథకంపై సమాచారంతో రైతులకు సహాయం చేయడానికి వాట్సాప్ ద్వారా అందుబాటులో ఉన్న ఏఐ-ఆధారిత చాట్‌బాట్.
విండ్స్(వెదర్ ఇన్ఫర్మేషన్ అండ్ నెట్‌వర్క్ డేటా సిస్టమ్) 2023లో ప్రారంభమైంది. ఇది తక్షణ, నమ్మదగిన వాతావరణ డేటాను అందించడానికి బహుళ వాతావరణ వ్యవస్థలను అనుసంధానించే జాతీయ వేదిక. ఇది వ్యవసాయంలో కచ్చితమైన వాతావరణ పర్యవేక్షణ, ప్రణాళిక, ప్రమాద అంచనాను సాధ్యం చేస్తుంది.
పీఎంఎఫ్‌బీవై భారతదేశపు అత్యంత విస్తృతమైన పంట బీమా కార్యక్రమంగా అవతరించింది. పీఎంఎఫ్‌బీవైతో పాటుగా ప్రవేశపెట్టిన రీస్ట్రక్చర్డ్ వెదర్-బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్(ఆర్‌డబ్ల్యూబీసీఐఎస్) అనేది దిగుబడి ఆధారిత కవరేజీని పూర్తి చేసే వాతావరణ సూచిక ఆధారిత బీమా పథకం. 2016–17, 2024–25(అక్టోబర్ 2025 నాటికి) మధ్య పీఎంఎఫ్‌బీమై, ఆర్‌డబ్ల్యూబీసీఐఎస్ కలిసి 78.51 కోట్లకు పైగా రైతు దరఖాస్తులను కవర్ చేశాయి. ఈ కాలంలో రైతులు రూ.35,919 కోట్ల ప్రీమియంను అందించగా రూ.1,90,374 కోట్ల విలువైన క్లెయిమ్‌లు పంపిణీ అయ్యాయి. దీనివల్ల 23 కోట్లకు పైగా రైతు దరఖాస్తులు ప్రయోజనం పొందాయి. 2020–21 నుంచి 2024–25 వరకు ఉన్న ఇటీవలి కాలాన్ని పరిశీలిస్తే(31 అక్టోబర్ 2025 నాటికి) ఈ పథకాలు 55.28 కోట్లకు పైగా దరఖాస్తులను కవర్ చేశాయి. రూ.93,891 కోట్ల క్లెయిమ్‌లను చెల్లించాయి. దీని ద్వారా 14.97 కోట్లకు పైగా రైతు దరఖాస్తులు ప్రయోజనం పొందాయి. ఉత్పత్తి నష్టాల నుంచి వ్యవసాయ జీవనోపాధిని రక్షించడంలో పీఎంఎఫ్‌బీవై పెరుగుతున్న పరిధిని, విశ్వసనీయతను, ప్రభావాన్ని ఈ వాస్తవాలు నొక్కిచెబుతున్నాయి.
ఏఐ-ఆధారిత అగ్రి-టెక్ అంకురాలు, అభివృద్ధి చెందుతున్న వ్యవసాయ ఆవిష్కరణలు
భారత ప్రభుత్వం 2018–19 నుంచి రాష్ట్రీయ కృషి వికాస్ యోజన(ఆర్‌కేవీవై) కింద ఇన్నోవేషన్ అండ్ అగ్రి-ఎంట్రప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ ద్వారా అగ్రి-టెక్ అంకురాల వేగవంతమైన వృద్ధిని ప్రోత్సహిస్తోంది. దీనికి సమాంతరంగా ఈ కార్యక్రమం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), మెషిన్ లెర్నింగ్, ప్రిసిషన్ ఫార్మింగ్, డ్రోన్లు, క్లైమేట్-స్మార్ట్ అగ్రికల్చర్ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల అవలంబనకు మద్దతు ఇస్తుంది. అగ్రి-టెక్ స్టార్టప్‌లు భారతీయ వ్యవసాయానికి ఒక కొత్త యుగాన్ని తీసుకువస్తున్నాయి. వ్యవసాయ పద్ధతులను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో అనుసంధానిస్తున్నాయి. 'ఆశ కిరణం' గా పిలిచే ఈ స్టార్టప్‌లు దేశవ్యాప్తంగా ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూ వ్యవసాయ కార్యకలాపాలను మారుస్తున్నాయి.
ఈ కార్యక్రమం కింద నాలెడ్జ్ పార్ట్‌నర్స్(కేపీ), ఆర్‌కేవీవై అగ్రిబిజినెస్ ఇంక్యుబేటర్లు(ఆర్-ఏబీఐ), అగ్రి-స్టార్టప్‌లకు ఐడియా లేదా ప్రీ-సీడ్ దశలో(రూ.5 లక్షల వరకు), సీడ్ దశలో(రూ.25 లక్షల వరకు) సాంకేతిక, ఆర్థిక సహాయాన్ని అందిస్తాయి. తద్వారా వారు వినూత్న ఉత్పత్తులు, సేవలను అభివృద్ధి చేయడానికి, విస్తరించడానికి వీలు కలుగుతుంది. జనవరి 2026 నాటికి 6,000 కంటే ఎక్కువ అగ్రి-స్టార్టప్‌లు శిక్షణ పొందాయి. 2019–20 నుంచి 2025–26 ఆర్థిక సంవత్సరాల మధ్య మొత్తం 2,282 స్టార్టప్‌లకు ఆర్థిక, సాంకేతిక సహాయం అందింది. వీటికి మొత్తం రూ.186.55 కోట్ల గ్రాంట్లు మంజూరు అయ్యాయి.
మద్దతు పొందిన ఈ అంకుర సంస్థలు ప్రిసిషన్ అగ్రికల్చర్, ఏఐ, ఐఓటీ ఆధారిత పరిష్కారాలు, వ్యవసాయ యంత్రీకరణ, కోత అనంతర, ఆహార సాంకేతికతలు, సరఫరా గొలుసు నిర్వహణ, వేస్ట్-టు-వెల్త్ కార్యక్రమాలు, సేంద్రీయ వ్యవసాయం వంటి కీలక రంగాలలో పనిచేస్తున్నాయి. తద్వారా వ్యవసాయం, అనుబంధ రంగాలలో ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూ సామర్థ్యాన్ని పెంచుతున్నాయి.
వ్యవసాయ కార్యకలాపాలను మారుస్తున్న ఏఐ-ఆధారిత రోబోటిక్స్:
ఐసీఏఆర్–ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(ఐఏఆర్ఐ) అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ విభాగం నేల నమూనాల సేకరణ, విత్తనాలు వేయడం, కోత, పంట పర్యవేక్షణ వంటి అనేక వ్యవసాయ కార్యకలాపాల కోసం వ్యవసాయ రోబోటిక్స్‌ను అభివృద్ధి చేయడంలో చురుకుగా నిమగ్నమై ఉంది. ఈ ప్రయత్నాలకు తోడుగా, భారతదేశపు వ్యవసాయ రోబోటిక్స్ రంగం అటానమస్ ట్రాక్టర్లు, రోబోటిక్ హార్వెస్టింగ్ సిస్టమ్స్, పంట పర్యవేక్షణ కోసం ఏఐ-ఆధారిత సాధనాలతో గణనీయమైన పురోగతిని సాధించింది. ఇది వ్యవసాయ పద్ధతులలో ఆటోమేషన్, ఇంటెలిజెంట్ టెక్నాలజీల పెరుగుతున్న ఏకీకరణను ప్రతిబింబిస్తుంది.
భారతదేశంలో భవిష్యత్తు వ్యవసాయం: ఇంపాక్ట్ ఏఐ చట్రం
భారత ప్రభుత్వం 22 అక్టోబర్ 2025న “భారతదేశంలో భవిష్యత్తు వ్యవసాయం: వ్యవసాయం కోసం ఏఐ ప్లేబుక్” అనే ప్రచురణను విడుదల చేసింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్, భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయం, ఇండియా-ఏఐ(ఎంఈఐటీవై), బీసీజీ ఎక్స్ సహకారంతో ఒక అంతర్దృష్టి నివేదికగా రూపొందిన ఈ ప్లేబుక్.. భారతీయ వ్యవసాయంలో, ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతుల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)ను బాధ్యతాయుతంగా, భారీ స్థాయిలో అమలు చేయడానికి ఒక విధానపరమైన రోడ్‌మ్యాప్‌ను అందిస్తుంది.
విచ్ఛిన్నమైన డేటా వ్యవస్థలు, పరిమిత డిజిటల్ మౌలిక సదుపాయాలు, ధరల అడ్డంకులు, క్షేత్రస్థాయి డెలివరీ సవాళ్లు వంటి కీలక పరిమితులను పరిష్కరించడం ద్వారా ఏఐ అనువర్తనాలను పైలట్ దశ నుంచి భారీ స్థాయి అమలుకు తీసుకువెళ్లడం ఈ ప్లేబుక్ లక్ష్యం. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను రోజువారీ వ్యవసాయ కార్యకలాపాలలో డేటా ఆధారిత నిర్ణయాధికారానికి ఒక సాధనంగా నిలుపుతుంది. ఇది ఉత్పాదకతను పెంచడానికి, వాతావరణ మార్పులను తట్టుకునే శక్తిని బలోపేతం చేయడానికి, వనరుల వినియోగాన్ని మెరుగుపరచడానికి, మార్కెట్ ప్రాప్తిని మెరుగుపరచడానికి సంభావ్యతను కలిగి ఉంది.
ఈ నివేదిక వ్యవసాయ విలువ గొలుసు అంతటా ప్రాధాన్యత కలిగిన ఏఐ వినియోగ సందర్భాలను ప్రధానంగా సూచిస్తుంది. ఇందులో ఏఐ-ఆధారిత పంట ప్రణాళిక, వేగవంతమైన నేల-ఆరోగ్య విశ్లేషణ, తెగుళ్ల అంచనా, నియంత్రణ, స్మార్ట్ డిజిటల్ మార్కెట్ ప్లేస్‌లు ఉన్నాయి. ఇంపాక్ట్ ఏఐ చట్రం ఈ ప్లేబుక్ ప్రధాన సహకారంగా నిలిచింది. ఇది పర్యావరణ వ్యవస్థ వ్యాప్త చర్యలకు మార్గనిర్దేశం చేయడానికి, వాటాదారుల పాత్రలను స్పష్టం చేయడానికి, ఏఐ పరిష్కారాల ప్రభావవంతమైన విస్తరణకు మద్దతు ఇవ్వడానికి కింది స్తంభాలపై నిర్మితమైంది:
ప్రారంభం: ఈ స్తంభం వ్యవసాయంలో ఏఐని విస్తరించడానికి అవసరమైన ప్రాథమిక వ్యవస్థలను సృష్టించడంపై దృష్టి పెడుతుంది. స్పష్టమైన ఏఐ వ్యూహాలు, సహాయక విధానాలు, డేటా-షేరింగ్ ఫ్రేమ్‌వర్క్‌లు, డిజిటల్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం వంటి ప్రభుత్వం నేతృత్వంలోని చర్యలను ఇది నొక్కి చెబుతుంది.
సృష్టి: ఈ స్తంభం వ్యవసాయం కోసం ఏఐ పరిష్కారాలను అభివృద్ధి చేయడం, పరీక్షించడంపై దృష్టి పెడుతుంది. ఏఐ అప్లికేషన్‌లను రూపొందించడానికి, ధ్రువీకరించడానికి, మెరుగుపరచడానికి అంకుర సంస్థలు, సాంకేతిక ప్రదాతలు, పరిశోధనా సంస్థల మధ్య సహకారాన్ని ఇది ప్రధానంగా సూచిస్తుంది.
అందించడం: ఈ స్తంభం ఏఐ పరిష్కారాలు రైతులకు సమర్థవంతంగా చేరేలా చూడటంపై దృష్టి పెడుతుంది. ఇది ఎక్స్‌టెన్షన్ వ్యవస్థలను బలోపేతం చేస్తుంది. సలహా సేవల్లో ఏఐని అనుసంధానిస్తుంది. ఫలితాలను మెరుగుపరచడానికి క్షేత్రస్థాయి అభిప్రాయాలను ఉపయోగిస్తుంది.
ముగింపు
సాంప్రదాయ పద్ధతుల నుంచి డేటా ఆధారిత, కచ్చితత్వ ఆధారిత వ్యవస్థకు మారడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని ఉపయోగించుకుంటూ భారతదేశం వ్యవసాయంలో లోతైన సాంకేతిక మార్పును తీసుకువస్తోంది. ఈ మార్పు డిజిటల్ అగ్రికల్చర్ మిషన్, అగ్రిస్టాక్ వంటి భారీ డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సృష్టి ద్వారా స్థిరపడింది. ఇది లక్షలాది మంది రైతులకు లక్ష్యిత సేవలను అందించడానికి ఒక ధ్రువీకరించిన పునాదిని అందిస్తుంది. ఏఐ ఏకీకరణ మొత్తం వ్యవసాయ విలువ గొలుసు అంతటా స్పష్టమైన ప్రయోజనాలను అందిస్తోంది.
భారత్-విస్తార్, కిసాన్ ఇ-మిత్ర వంటి సాధనాలు బహుభాషా, తక్షణ సలహా సేవలను అందిస్తాయి. నిపుణుల జ్ఞానాన్ని మారుమూల ప్రాంతాలకు కూడా అందుబాటులోకి తెస్తాయి. నిర్ణయాధికారాన్ని మరింత మెరుగుపరుస్తాయి. రుతుపవనాల అంచనా, తెగుళ్ల నిఘా(ఎన్‌పీఎస్ఎస్) కోసం ఏఐ-ఆధారిత వ్యవస్థలు రైతులు వాతావరణ, జీవసంబంధమైన ప్రమాదాలను ముందుగానే నిర్వహించడానికి అనుమతిస్తాయి. తద్వారా సంభావ్య నష్టాలను గణనీయంగా తగ్గిస్తాయి. తట్టుకునే శక్తిని పెంచుతాయి. ప్రిసిషన్ ఫార్మింగ్, అగ్రి-రోబోటిక్స్, యస్-టెక్, క్రాపిక్ ద్వారా ఏఐ-ఆధారిత పంట బీమాలో ఆవిష్కరణలు, వనరుల వినియోగాన్ని ఆప్టిమైజ్ చేస్తున్నాయి. వేగవంతమైన, పారదర్శకమైన క్లెయిమ్ సెటిల్‌మెంట్‌లను నిర్ధారిస్తున్నాయి. ఏఐ-ఆధారిత విశ్లేషణలు సరఫరా గొలుసులోని నిర్మాణపరమైన పరిమితులను పరిష్కరించడానికి, చిన్న, సన్నకారు రైతులకు ధర గుర్తింపు, మార్కెట్ ప్రాప్తిని మెరుగుపరచడానికి ప్రయత్నిస్తాయి. మొత్తంగా ఈ కార్యక్రమాలు సాంకేతికత పట్ల మానవ-కేంద్రీకృత విధానాన్ని ప్రతిబింబిస్తాయి. సమగ్ర అభివృద్ధికి, రైతు సమాజ సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చే సుస్థిర వ్యవసాయ వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నాయి.
***
(Explainer ID: 157565)
आगंतुक पटल : 67
Provide suggestions / comments