• Skip to Content
  • Sitemap
  • Advance Search
Social Welfare

సంస్కృతి, భాషల కోసం కృత్రిమ మేధ

Posted On: 09 FEB 2026 5:39PM

కీల‌కాంశాలు
- భాషిణి , అనువాదిని, జ్ఞాన భారతం, ఆది వాణి వంటి జాతీయ వేదిక‌ల ద్వారా సంస్కృతి, భాషల కోసం భార‌త్‌ ఏఐని వ్యవస్థీకృతం చేస్తోంది.
- పురాతన తాళపత్రాల డిజిటలీక‌ర‌ణ‌, విద్యా సంబంధిత విషయాల అనువాదం, గిరిజన లేదా అంతరించిపోతున్న భాషలను చేర్చడం ద్వారా సాంస్కృతిక, జ్ఞాన సంపదను అందరికీ అందుబాటులోకి తెస్తోంది.
- కళాకారులను డిజిటల్ వేదిక‌లు, కొత్త అవకాశాలతో అనుసంధానిస్తూ, సాంస్కృతిక, సృజనాత్మక రంగాలను డిజిటల్ విలువ గొలుసులలో విలీనం చేయడానికి ఏఐ వాడుతోంది.

సాంస్కృతిక పరిరక్షణ నుంచి సాంస్కృతిక భాగస్వామ్యం వరకు
భారతదేశ సాంస్కృతిక వారసత్వం, భాషా వైవిధ్యం మన సామాజిక గుర్తింపును, భాగ‌స్వామ్య‌ జ్ఞాన వ్యవస్థలకు రూపాన్ని ఇస్తాయి. తాళపత్రాలు, కట్టడాలు, ప్రదర్శించే కళలు, చేతివృత్తుల నుంచి జానపద కథలు, మౌఖిక సంప్రదాయాలు, దేశీయ జ్ఞానం వరకు భారతదేశంలో సంస్కృతి అనేది అనేక భాషలు, లిపులు, మాండలికాల ద్వారా ఏర్ప‌డి తరతరాలకు అందుతోంది.

2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ భాషా వ్యవస్థలో 22 షెడ్యూల్డ్ భాషలు, 99 నాన్-షెడ్యూల్డ్ భాషలు ఉన్నాయి. ఇవి అనేక భాషా కుటుంబాలలో విస్తరించి ఉండటంతో పాటు వేలాది మాతృభాషలు, గిరిజన భాషలు ఉన్నాయి. మన భాషా వారసత్వాన్ని, అందులోని గొప్ప సంప్రదాయ జ్ఞానాన్ని కాపాడటానికి భారత ప్రభుత్వం నిరంతర విద్యాప‌ర‌మైన‌, డిజిటల్ ప్రయత్నాలను చేపట్టింది.

ఈ ప్రయత్నంలో ప్రధానమైనది ఏఐ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతను ఉపయోగించుకోవడం. సాంస్కృతిక వనరులను, సంప్రదాయ జ్ఞానాన్ని ప్రజలకు వారు అలవాటు పడిన భాషల్లో, రూపాల్లో అందుబాటులోకి తేవడమే దీని లక్ష్యం. దీనినే సాంకేతికత ప్రజాస్వామ్యీకరణ అంటారు. సాంస్కృతిక సంపదను డిజిటలీక‌రించ‌డంలో, బహుభాషా, వాయిస్ ఆధారిత సదుపాయాలను కల్పించడంలో ఏఐ ఒక కీలకమైన సాధనంగా మారింది. ఈ విధానం "అందరికీ సంక్షేమం, అందరికీ సంతోషం" అనే లక్ష్యంతో ఏఐని మానవత్వం కోసం పనిచేసే సాంకేతికతగా ప్ర‌తిబింబించేలా చేస్తోంది.

భాషను డిజిటల్ ప్ర‌జా మౌలిక స‌దుపాయంగా నిర్మించడం
సంస్కృతి, జ్ఞానం, ప్రభుత్వ సేవలను అందరికీ చేరవేసేందుకు భారత ప్రభుత్వం మౌలిక సదుపాయాల ఆధారిత విధానాన్ని అనుసరిస్తోంది.

ఈ భాషా మౌలిక సదుపాయాల ముఖ్య స్తంభాలు:

 



నేషనల్ లాంగ్వేజ్ ట్రాన్స్‌లేషన్ మిషన్(ఎన్ఎల్‌టీఎం) – భాషణి
2022లో ప్రారంభ‌మైన‌ భాషణి డిజిటల్ రంగంలో భారతదేశ భాషా వైవిధ్యానికి ప్రతిస్పందనగా అభివృద్ధి చేసిన సాధ‌నం. డిజిటల్ వ్యవస్థలలో నేరుగా భాషా, వాయిస్ సామర్థ్యాలను నిర్మించడంపై ఇది దృష్టి పెడుతుంది. దీనివల్ల ప్రభుత్వ వేదిక‌లు దేశంలోని అనేక భాషల్లో సమర్థవంతంగా పనిచేయగలుగుతాయి.

భాషణి మూడు ప్రధాన అడ్డంకులను ఒకేసారి పరిష్కరిస్తుంది:
- భాషా అడ్డంకి: స్థానిక భాషలు లేదా యాసలను అర్థం చేసుకోలేని వ్యవస్థలు.
- డిజిటల్ అడ్డంకి: వాడటానికి కష్టంగా ఉండే సంక్లిష్టమైన ఇంటర్‌ఫేస్‌లు.
- అక్షరాస్యత అడ్డంకి: కేవలం చదవడం, టైప్ చేయడంపైనే ఆధారపడటం.

వ్యవస్థ స్థాయిలో భాషణి జాతీయ డిజిటల్ ప్ర‌జా మౌలిక స‌దుపాయంగా బహుభాషా ఏఐని నిర్మిస్తోంది. ఇది అనువాదం, మాటను రాతగా మార్చడం, రాత‌ను మాట‌గా మార్చ‌డం, ట్రాన్స్‌లిట‌రేష‌న్‌, డాక్యుమెంట్ అవగాహన వంటి సేవలను అందిస్తుంది. దీనివల్ల వివిధ వేదిక‌లు తమ సొంతంగా భాషా ఫీచర్లను తయారు చేసుకోనవసరం లేకుండా వీటిని వాడుకోవచ్చు.

భాషణి ప్రస్తుతం ఈ స్థాయిలో పనిచేస్తోంది:
- 22 భాషల్లో వాయిస్ సేవలు, 36 భాషల్లో టెక్స్ట్ సేవలను అందిస్తోంది.
- 350కి పైగా ఏఐ మోడల్స్, డేటాసెట్‌లను కలిగి ఉంది.
- ఇప్పటివరకు 400 కోట్లకు పైగా భాషా అనువాద ప్రక్రియలను పూర్తి చేసింది.

దీని బలం సహకారంలో ఉంది. పరిశోధనా సంస్థలు, భాషా నిపుణులు, అంకుర సంస్థ‌లు, రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమ భాగస్వాములు కలిసి ఈ వేదిక‌కు సహకరిస్తున్నారు. ఒక పునాది వంటి భాషా పొరగా భాషణి భాషా వైవిధ్యానికి ఒక ప్ర‌యోగాత్మ‌క‌ డిజిటల్ రూపాన్ని ఇచ్చి ప్రజలు తమకు అర్థమయ్యే భాషల్లో సమాచారాన్ని పొందేలా చేస్తోంది.

భాషణి వాడకానికి కొన్ని ముఖ్య ఉదాహరణలు:

- కాశీ తమిళ సంగమం 2.0 ప్ర‌సంగ త‌క్ష‌ణ అనువాదం:
వారణాసిలో జ‌రిగిన కాశీ త‌మిళ సంగ‌మం కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ త‌న ప్ర‌సంగ స‌మ‌యంలో భాషిణి ఏఐ వేదిక‌ను ఉప‌యోగించారు. ఆయ‌న‌ ప్రసంగిస్తున్నప్పుడు ఆయన హిందీ ప్రసంగాన్ని ఏఐ ద్వారా అక్కడికక్కడే తమిళంలోకి అనువదించారు. దీనివల్ల తమిళం మాట్లాడే ప్రజలు నేరుగా తమ భాషలో ప్రసంగాన్ని వినగలిగారు. ఇది భాషిణి త‌క్ష‌ణ అనువాద సామ‌ర్థ్యాన్ని ప్ర‌త్య‌క్ష సాంస్కృతి వేడుక‌లో ప్ర‌ద‌ర్శించిన‌ట్ల‌య్యింది.

మహా కుంభమేళా 2025లో బ‌హుభాషా స‌హాయం:
భాషిణి ద్వారా ప‌నిచేసే 'కుంభ్ సహాయక్' అనే చాట్‌బాట్ ద్వారా భక్తులకు 11 భాషల్లో(హిందీ, ఆంగ్లం, మ‌రో తొమ్మిది భాష‌లు) సమాచారం, నావిగేషన్ సాయం అందించారు. అలాగే డిజిటల్ 'లాస్ట్ అండ్ ఫౌండ్' సొల్యూషన్ ద్వారా త‌క్ష‌ణ‌ అనువాదాన్ని వాడుతూ వివిధ భాషా నేపథ్యాల వారికి సాయం చేశారు.

ఒక ప్రాథమిక భాషా మౌలిక సదుపాయంగా భాషిణి భాషా వైవిధ్యాన్ని సౌకర్యంగా మారుస్తుంది. ప్రజలు సమాచారం, సంస్కృతి, ప్రభుత్వ సేవలతో తమ సొంత భాషల్లోనే అనుసంధానమయ్యేలా చేస్తుంది. ఇది అందరి భాగస్వామ్యానికి, సాధికారతకు ఒక కీలకమైన అడుగు.

భారతీయ భాషల కోసం సాంకేతిక అభివృద్ధి(టీడీఐఎల్‌)
టీడీఐఎల్‌ అనేది భారత ప్రభుత్వపు దీర్ఘకాలిక కార్యక్రమం. ఇది భారతీయ భాషల కంప్యూటింగ్ కోసం పునాది వేసింది. ఇది బహుళ భారతీయ భాషల్లోని లిపులు, మాట, రాతకు సంబంధించిన సాంకేతికతపై దృష్టి పెడుతుంది.

టీడీఐఎల్‌ ప్రధానంగా వీటి అభివృద్ధిపై దృష్టి పెడుతుంది:
- యంత్ర అనువాదం
- భారతీయ లిపుల కోసం ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్(ఓసీఆర్‌).
- స్పీచ్-టు-టెక్స్ట్, టెక్స్ట్-టు-స్పీచ్ వ్యవస్థలు
- చేతిరాతను గుర్తించే, ట్రాన్స్‌లిటెరేష‌న్ సాధనాలు

టీడీఐఎల్‌ ఉపయోగాలు:
- వివిధ వేదిక‌లలో వాడుకోదగ్గ భాషా వనరులు, డేటాను సృష్టించడం.
- వినియోగదారులు తమ స్వభాషలో సమాచారాన్ని పొందేలా బహుభాషా సదుపాయాన్ని కల్పించడం.
- అన్ని పరికరాల్లో భారతీయ భాషలు ఒకే రకమైన డిజిటల్ రూపంలో కనిపించేలా చూడటం.

భారతీయ భాషా యంత్ర అనువాద సాధనాల వంటి టీడీఐఎల్‌ మద్దతు ఉన్న వ్యవస్థలు.. పాలన, విద్య, సమాచార వ్యాప్తిలో బహుభాషా ప్రాప్తికి ప్రారంభం లాంటి అప్లికేష‌న్ల‌ను ప్రదర్శించాయి.

ఒక పునాది వంటి భాషా సాంకేతిక కార్యక్రమంగా టీడీఐఎల్‌ భారతదేశాన్ని భాషా పరిశోధన నుంచి విస్తరించదగిన భాషా మౌలిక సదుపాయాల వైపు మళ్లేలా చేసింది. ఇది చివరకు భాషిణి వంటి వేదిక‌లకు నేరుగా మద్దతునివ్వడమే కాకుండా.. డిజిటల్, సాంస్కృతిక, జ్ఞాన వ్యవస్థలు అందరికీ సమ్మిళితంగా అందుబాటులోకి వచ్చేలా బలోపేతం చేసింది.

అనువాదిని(ఏఐసీటీఈ)
అనువాదిని అనేది ఏఐ ఆధారిత బహుభాషా అనువాద వేదిక‌. దీనిని ఏఐసీటీఈ అభివృద్ధి చేసింది. విద్యాపరమైన, సాంకేతిక విషయాలను పెద్ద ఎత్తున భారతీయ భాషల్లోకి అనువదించడం దీని ప్రధాన ఉద్దేశ్యం.

ఇది భాషా ప్రాప్య‌త‌కు స‌హ‌క‌రిస్తుంది:
- పాఠ్యపుస్తకాలు, ఇతర విద్యా వనరులను ఏఐ ద్వారా అనువదించడం.
- రాత, పత్రాలు, మాట రూపంలో ఉండే సమాచారాన్ని అనువదించే సామర్థ్యం.
- 'ఈ-కుంభ్‌' వంటి జాతీయ రిపోజిటరీలతో అనుసంధానం కావడం వల్ల విద్యార్థులకు వారి ప్రాంతీయ భాషల్లోనే ఉన్నత విద్య, నైపుణ్య శిక్షణ అందుబాటులోకి వస్తుంది.

అనువాదిని ఇలాంటి ఆచరణాత్మక ఉపయోగాలను సాధ్యం చేస్తుంది:
- ప్రాంతీయ భాషల్లో విద్యార్థులకు ఉన్నత విద్య, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకు వ‌స్తుంది.
- అభ్యాస వనరులను స్థానిక భాషల్లో అందుబాటులో ఉంచడం ద్వారా నైపుణ్యాభివృద్ధి, సామర్థ్య పెంపుదలకు తోడ్ప‌డుతుంది.
- భారతీయ భాషలను కేవలం సమాచార మార్పిడికే కాకుండా, జ్ఞాన మాధ్యమాలుగా బలోపేతం చేస్తుంది.

ఒక ఏఐ-ఆధారిత భాషా ప్రాప్తి వేదిక‌గా అనువాదిని భారతీయ భాషలలో జ్ఞానం, నైపుణ్యాల లభ్యతను విస్తరిస్తుంది. విద్య, నైపుణ్యం, సాంస్కృతిక జ్ఞాన వ్యవస్థలలో భాగస్వామ్యాన్ని పెంపొందించడం ద్వారా ఇది సామాజిక సాధికారతకు, ఉపాధి అవకాశాలకు దోహదపడుతుంది.

 



సాంస్కృతిక వారసత్వం, జ్ఞాన వ్యవస్థలు, భాషా వైవిధ్యం కోసం ఏఐ
భారతదేశపు అపారమైన సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుతూనే ప్రజలకు విస్తృతమైన ప్రాప్తిని, భాగస్వామ్యాన్ని కల్పించడానికి భారత ప్రభుత్వం వారసత్వ పరిరక్షణ, సంప్రదాయ జ్ఞాన వ్యవస్థలు, భాషా వైవిధ్యం అంతటా ఏఐని ఉపయోగిస్తోంది. ఇక్కడ పరిమాణం, గుర్తింపు, సమ్మిళితత్వంపై ప్రత్యేక దృష్టి సారించింది.

జ్ఞాన భారతం మిషన్
భారతదేశ తాళపత్ర వారసత్వాన్ని, సంప్రదాయ జ్ఞాన వ్యవస్థలను సర్వే చేయడం, డాక్యుమెంట్ చేయడం, డిజిట‌లీక‌రించ‌డం, వ్యాప్తి చేయడం కోసం చేప‌ట్టిన ఒక జాతీయ మిషన్ ఇది. ఇందులో భాగంగా ఒక జాతీయ డిజిటల్ రిపోజిటరీని కూడా ఏర్పాటు చేస్తున్నారు.

ఇది ఇలాంటి ఏఐ-ఆధారిత సాధనాలను ఉపయోగిస్తుంది:
- పురాతన తాళపత్రాల కోసం చేతిరాత గుర్తింపు(హెచ్‌టీఆర్), ఓసీఆర్‌.
- వివిధ లిపులు, భాషలలో మెటాడేటా వెలికితీత, కేటలాగింగ్.
- డిజిటలైజ్ చేసిన వారసత్వ విషయాలను సులభంగా కనుగొనడం, పొందేలా చేయడం.

ముఖ్య విజయాలు:
- కృతి సంపద డిజిటల్ రిపోజిటరీలో 44 లక్షలకు పైగా తాళపత్రాలు డాక్యుమెంట్ అయ్యాయి.
- డిజిట‌లీక‌ర‌ణ‌, ప్రాప్తిని పెంచడానికి రూ.482.85 కోట్ల వ్యయంతో(2024–31) ఈ మిషన్ ఆమోదం పొందింది.

ఈ మిషన్ ద్వారా సాంస్కృతిక వారసత్వం భౌతిక ఆర్కైవ్‌ల నుంచి డిజిటల్ ప్రాప్తికి మారుతుంది. ఇది దీర్ఘకాలిక పరిరక్షణకు, ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడానికి తోడ్పడుతుంది.

జ్ఞాన-సేతు(జ్ఞాన భారతం కింద జాతీయ ఏఐ ఇన్నోవేషన్ ఛాలెంజ్)
తాళపత్రాల పరిరక్షణ, విశ్లేషణ, పునరుద్ధరణ, ప్రాప్తి కోసం ఏఐ-ఆధారిత పరిష్కారాలను రూపొందించడానికి జ్ఞాన-సేతు ఒక జాతీయ సవాలుగా ప్రారంభ‌మైంది.

ఇది ప్రధానంగా ఈ అంశాలపై దృష్టి పెట్టింది:
- కేటలాగింగ్, డేటాసెట్ తయారీ
- డిజిటలైజేషన్, ఆర్కైవింగ్
- లిపుల విశ్లేషణ, జ్ఞాన వ్యాప్తి

జ్ఞాన‌-సేతు కీల‌క విజ‌యాలు:
- దీని ద్వారా వారసత్వ అనువర్తనాల కోసం అవార్డు గెలుచుకున్న ఏఐ ప్రోటోటైప్‌లను గుర్తించారు.

ఈ చొరవ సాంస్కృతిక సంస్థలకు, ఏఐ వ్యవస్థలకు మధ్య సహకారాన్ని బలోపేతం చేసింది.

ఆది వాణి – గిరిజన భాషల కోసం ఏఐ వేదిక‌
భారతదేశ సాంస్కృతిక, మౌఖిక వారసత్వానికి మూలమైన గిరిజన భాషల పరిరక్షణ, ప్రచారం, పునరుద్ధరణ కోసం ఆది వాణి ఒక ఏఐ-ఆధారిత వేదిక‌.

ఇది వీటి ద్వారా ఉపయోగపడుతుంది:
- హిందీ, ఇంగ్లీష్, గిరిజన భాషల మధ్య త‌క్ష‌ణ‌ అనువాదం.
- మౌఖిక భాషల కోసం స్పీచ్-టు-టెక్స్ట్ ట్రాన్స్‌క్రిప్షన్.
- యువ తరాల కోసం భాషా అభ్యాస మాడ్యూల్స్.
- జానపద కథలు, మౌఖిక చరిత్రలు, సామాజిక కథనాల డిజిట‌లీక‌ర‌ణ‌.

ముఖ్య విజయాలు(బీటా దశ):
- సంతాలి, భిలి, ముండారి, గోండి వంటి గిరిజన భాషలతో ప్రారంభమై, మరింత విస్తరణ జరుగుతోంది.
- గిరిజన భాషలలో ప్రజా సందేశాలకు సబ్‌టైటిల్స్ ఇవ్వడానికి ఈ వేదిక‌ను ఉపయోగిస్తున్నారు.
- ఇది గిరిజన భాషలను డిజిటల్, విద్య, ప్రజా సమాచార రంగాల్లోకి తీసుకురావడం ద్వారా సమ్మిళితత్వాన్ని బలపరుస్తుంది.

ఏఐ ద్వారా భాగస్వామ్యం, అవకాశాల కల్పన
ఏఐ సాంకేతికత సంస్కృతి, భాష, జ్ఞానానికి ప్రాప్తిని పెంచుతున్నందున తదుపరి దశ ఈ సౌలభ్యాన్ని ఆర్థిక అవకాశాలుగా, సామాజిక సాధికారతగా మారుస్తుంది. సాంప్రదాయ నైపుణ్యాలు, స్థానిక జ్ఞానం, సమాజ ఆధారిత పద్ధతులపై ఆధారపడి జీవించే భారతదేశ సాంస్కృతిక, సృజనాత్మక రంగాలకు ఇది చాలా ముఖ్యం.

భారతదేశ అనధికారిక, సృజనాత్మక ఆర్థిక వ్యవస్థలో కళాకారులు, చేతివృత్తుల వారు, సాంస్కృతిక రంగ నిపుణులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఏఐని రూపొందించినప్పుడు అది వారి గుర్తింపును, ఉత్పాదకతను, నైపుణ్యాలను, డిజిటల్ మార్కెట్‌లలో భాగస్వామ్యాన్ని పెంచుతూనే.. వారి సాంస్కృతిక అస్తిత్వాన్ని కాపాడుతుంది.

కళాకారులు, సాంస్కృతిక కార్మికుల కోసం ఏఐ-ఆధారిత మార్గాలు:
- బహుభాషా వేదిక‌ల ద్వారా మెరుగైన మార్కెట్ ప్రాప్తి
- ఏఐ ఆధారిత అనువాద, అన్వేషణ సాధనాలు కళాకారులు తమ ఉత్పత్తులను, వాటి వెనుక ఉన్న కథలను, సాంస్కృతిక విలువలను వివిధ భాషలు, ప్రాంతాలలో ప్రదర్శించడానికి సహాయపడతాయి.
- బహుభాషా కేటలాగ్‌లు, ఇంటర్‌ఫేస్‌లు మధ్యవర్తులపై ఆధారపడటాన్ని తగ్గించి, మార్కెట్ పరిధిని విస్తరిస్తాయి.
- వాయిస్-ఫస్ట్, సమ్మిళిత డిజిటల్ భాగస్వామ్యం.
- పరిమిత అక్షరాస్యత లేదా డిజిటల్ పరిజ్ఞానం ఉన్న కళాకారులు కూడా వాయిస్-ఆధారిత ఇంటర్‌ఫేస్‌ల ద్వారా తమ సొంత భాషల్లో వేదిక‌లను, శిక్షణా మాడ్యూళ్లను, సేవలను పొందవచ్చు.
- ఇటువంటి ఇంటర్‌ఫేస్‌లు డిజిటల్ వ్యవస్థల్లో విస్తృత భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తాయి.
- నైపుణ్యం, ఉత్పాదకత, వ్యాపార మద్దతు.
- ఏఐ-ఆధారిత లెర్నింగ్ టూల్స్ నాణ్యత పెంపుదల, డిజిటల్ మార్కెటింగ్, ధరల నిర్ణయం, ఇన్వెంటరీ నిర్వహణ వంటి రంగాలలో ఎప్పటికప్పుడు శిక్షణను అందిస్తాయి.
- డేటా ఆధారిత విశ్లేషణలు కళాకారులు డిమాండ్‌ను అంచనా వేయడానికి, ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడానికి సహాయపడతాయి.
- నమ్మకం, మూలం, సాంస్కృతిక ప్రామాణికత:
- ఏఐ మద్దతు ఉన్న డాక్యుమెంటేషన్, ట్యాగింగ్ వ్యవస్థలు హెరిటేజ్, జీఐ-ట్యాగ్ ఉన్న ఉత్పత్తుల ప్రామాణికతను నిరూపించి వినియోగదారుల్లో నమ్మకాన్ని పెంచుతాయి.
- స్పష్టమైన, పారదర్శకమైన డిజిటల్ ప్రదర్శన వినియోగదారుల విశ్వాసాన్ని పెంచి, సాంస్కృతిక విలువలను కాపాడుతుంది.

భాషా ప్రాప్తిని, వాయిస్ సాధనాలను, సాంస్కృతిక అవగాహనను ఏఐ వ్యవస్థల్లో నిర్మించడం ద్వారా కళాకారులు, సాంస్కృతిక కార్మికులు కేవలం లబ్ధిదారులుగా మాత్రమే కాకుండా సాంకేతికతను చురుగ్గా ఉపయోగించే వినియోగదారులుగా మారుతారు. ఈ విధంగా ఏఐ పని గౌరవాన్ని, స్థిరమైన జీవనోపాధిని, భారతీయ సంప్రదాయాలను బలోపేతం చేస్తూ సామాజిక సాధికారతకు మద్దతు ఇస్తుంది.

సంస్కృతి, భాషలు, జీవనోపాధి కోసం సమ్మిళిత ఏఐ పురోగతి
ప్రభుత్వ వ్యవస్థలలో ఏఐ వినియోగాన్ని విస్తరిస్తున్న తరుణంలో సాంకేతికత మరింత సాంస్కృతిక భాగస్వామ్యానికి, స్థిరమైన జీవనోపాధికి దారితీసేలా చూడటమే ప్రధాన లక్ష్యం. నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం ప్రజా రంగంలో ఏఐని మెరుగ్గా ఉపయోగించడానికి ఈ క్రింది అంశాలు కీలకం:
- డిజిటల్ క్రెడెన్షియల్స్ ద్వారా నమ్మకాన్ని నిర్మించడం, శిక్షణ ఇచ్చేవారు, యజమానులు, ప్రభుత్వ సంస్థలు జారీ చేసే పని, నైపుణ్య ధృవీకరణ పత్రాలను సిస్టమ్‌లలో సులభంగా ధ్రువీక‌రించేలా చూడటం.
- ఏఐ మౌలిక సదుపాయాల బలోపేతం, భాషా ఆధారిత ఏఐ సాధనాలను విస్తరించడం, ఇంటర్నెట్ సరిగ్గా లేని ప్రాంతాల్లో కూడా పనిచేసే ఆఫ్‌లైన్ ఏఐ వ్యవస్థలను ప్రోత్సహించడం.
- స్థానిక స్థాయిలో ఆవిష్కరణలను ప్రోత్సహించడం, రాష్ట్ర, జిల్లా స్థాయి కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడం, స్థానిక కేంద్రాలను డిజిటల్ వర్క్ హబ్‌లుగా మార్చడం, సామాజిక సంస్థలతో కలిసి డిజిటల్ నైపుణ్యాలను పెంచడం.
- బహుళ వాటాదారుల సహకారం, ప్రభుత్వం, సాంకేతిక సంస్థలు, విద్యాసంస్థలు, పౌర సమాజాన్ని ఏకం చేసి సమ్మిళిత ఏఐ పరిష్కారాలను శాశ్వత ప్రాతిపదికన రూపొందించడం.

ఈ ప్రయత్నాలు ఏఐని కేవలం ఒక సాంకేతిక సాధనంగానే కాకుండా భారతదేశ సాంస్కృతిక, భాషా వైవిధ్యాన్ని ప్రతిబింబించే ప్రజా ప్రయోజనకర శక్తిగా నిలబెడతాయి. ఈ మానవ కేంద్రిత విధానం "మానవత్వం కోసం సాంకేతికత" అనే ఆలోచనను బలపరుస్తుంది. అందరినీ కలుపుకుపోయేలా ఏఐని అమలు చేయడం ద్వారా భారతదేశం తన సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకుంటూనే, తన సృజనాత్మక వర్గాలను డిజిటల్ భవిష్యత్తులో చురుకైన భాగస్వాములుగా మార్చగలదు.


***

(Explainer ID: 157342) आगंतुक पटल : 12
Provide suggestions / comments
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , हिन्दी , Manipuri , Bengali , Gujarati , Kannada , Malayalam
Link mygov.in
National Portal Of India
STQC Certificate