Economy
భారతదేశ చరిత్రాత్మక వాణిజ్య విజయం, కీలక రంగాల్లో ఎగుమతుల కోసం తెరుచుకున్న 30 ట్రిలియన్ డాలర్ల అమెరికా మార్కెట్ ద్వారాలు
Posted On:
09 FEB 2026 12:00PM
కీలకాంశాలు
- అమెరికాలోని 30 ట్రిలియన్ డాలర్ల మార్కెట్‌కు భారతదేశం ప్రాధాన్యతతో కూడిన ప్రవేశాన్ని పొందింది.
- టెక్స్‌టైల్స్, అపెరల్స్‌పై సుంకాలు 50% నుంచి 18 శాతానికి తగ్గాయి. 113 బిలియన్ డాలర్ల అమెరికా మార్కెట్‌లో పట్టు ఉత్పత్తులకు సున్నా సుంకంతో ప్రవేశం లభించింది.
- మెషినరీ ఎగుమతులపై సుంకాలు 18 శాతానికి తగ్గడం వల్ల 477 బిలియన్ డాలర్ల అమెరికా మార్కెట్‌లో అవకాశాలు పెరిగాయి.
- 1.36 బిలియన్ డాలర్ల విలువైన భారతీయ వ్యవసాయ ఎగుమతులకు అమెరికాలో అదనపు సుంకం లేకుండా ప్రవేశం లభించింది.
- మసాలా దినుసులు, టీ, కాఫీ, పండ్లు, నట్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ వంటి కీలక ఉత్పత్తులపై సున్నా సుంకం వర్తిస్తుంది.
- డెయిరీ, మాంసం, పౌల్ట్రీ, తృణధాన్యాలు వంటి అత్యంత సున్నితమైన రంగాలకు పూర్తి రక్షణ ఉంటుంది.
- భారతదేశానికి వచ్చేవి
a. 900 బిలియన్ డాలర్ల అమెరికా అంతర్జాతీయ దిగుమతులపై 18% సుంకం అనేది అత్యంత పోటీ రేటు.
b. 150 బిలియన్ డాలర్ల అమెరికా అంతర్జాతీయ దిగుమతులపై సున్నా సుంకం.
c. 720 బిలియన్ డాలర్ల అమెరికా అంతర్జాతీయ దిగుమతులపై అదనపు సుంకం లేదు.
d. 350 బిలియన్ డాలర్ల అమెరికా అంతర్జాతీయ దిగుమతులపై మినహాయింపు కొనసాగింపు.
e. 232 టారిఫ్‌లపై ప్రాధాన్యత
పరిచయం
భారత-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం భారతదేశ అంతర్జాతీయ వాణిజ్య ప్రయాణంలో ఒక ప్రధాన మైలురాయి. ఇది 30 ట్రిలియన్ డాలర్ల విలువైన అమెరికా మార్కెట్‌లో భారతీయ ఎగుమతులకు నిరంతర ప్రాధాన్యతను కల్పించింది. ఈ ఒప్పందం సమగ్ర సుంకాల హేతుబద్ధీకరణ, పెద్ద మొత్తంలో ఉత్పత్తులకు సున్నా-సుంకం ద్వారా ప్రవేశం, మెరుగైన డిజిటల్, సాంకేతిక సహకారాన్ని అందిస్తుంది. అలాగే భారతదేశ రైతులు, ఎంఎస్ఎంఈలు, దేశీయ పరిశ్రమలను రక్షించడానికి జాగ్రత్తగా రూపొందించిన ఫ్రేమ్‌వర్క్ ఇందులో ఉంది.
2024లో అమెరికాకు భారతదేశం చేసిన మొత్తం ఎగుమతులు 86.35 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఈ ఒప్పందం ద్వారా టెక్స్‌టైల్స్, లెదర్, రత్నాలు, ఆభరణాలు, వ్యవసాయం, యంత్రాలు, హోమ్ డెకర్, ఔషధ, సాంకేతిక ఆధారిత పరిశ్రమలలో పోటీతత్వం గణనీయంగా పెరుగుతుంది.
సుంకాల మార్పులతో భారతీయ ఎగుమతులకు ఎలా ప్రయోజనం?
2024లో అమెరికాకు భారత్ చేస్తున్న 86.35 బిలియన్ డాలర్ల ఎగుమతులపై ఇప్పుడు భారీ సుంకాల మార్పులు వర్తిస్తాయి.
రెసిప్రోకల్ టారిఫ్‌లపై భారీ ఉపశమనం
గతంలో పలు భారతీయ ఉత్పత్తులపై రెసిప్రోకల్ టారిఫ్‌లు(ఆర్‌టీ) 50% వరకు ఉండగా, ఇప్పుడు అవి గణనీయంగా తగ్గాయి. మొత్తం ఎగుమతులలో 40.96 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులపై రెసిప్రోకల్ టారిఫ్‌లు వర్తించేవి.
ఈ ఒప్పందం ప్రకారం 30.94 బిలియన్ డాలర్ల ఎగుమతులపై సుంకాలు 50% నుంచి 18 శాతానికి తగ్గాయి. మరో 10.03 బిలియన్ డాలర్ల ఎగుమతులపై సుంకాలు 50% నుంచి సున్నాకు తగ్గాయి. దీనివల్ల అమెరికా మార్కెట్‌లోకి ప్రవేశించే భారతీయ వస్తువులపై భారీగా తగ్గిన సుంకాలు లేదా పూర్తిగా పన్ను లేని ప్రవేశం లభిస్తుంది.
మినహాయింపు విభాగం – అదనపు సుంకం లేదు
మినహాయింపు విభాగం కింద 1.04 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులకు సున్నా రెసిప్రోకల్ సుంకం లభిస్తుంది. ఇందులో 1.035 బిలియన్ డాలర్ల విలువైన వ్యవసాయ ఉత్పత్తులకు అమెరికా సున్నా రెసిప్రోకల్ టారిఫ్‌ను హామీ ఇచ్చింది. ఇది భారతీయ వ్యవసాయ ఎగుమతిదారులకు స్థిరత్వాన్ని, నిరంతర మార్కెట్ అవకాశాలను కల్పిస్తుంది.
సెక్షన్ 232(తుది వినియోగం ఆధారంగా) కట్టుబాట్లు
సెక్షన్ 232(తుది వినియోగం ఆధారంగా) కింద 28.30 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులకు అదనపు సుంకం ఉపశమనం లభించింది. ఈ ఉత్పత్తులపై గతంలో 50% వరకు ఉన్న అదనపు సుంకాలు ఇప్పుడు సున్నాకు తగ్గాయి.

కీలక రంగాలలో నిర్మాణాత్మక పోటీ ప్రయోజనం
ఈ ఒప్పందం భారతదేశానికి అనుకూలంగా స్పష్టమైన సుంకాల వ్యత్యాసాన్ని సృష్టిస్తుంది. భారతీయ ఉత్పత్తులపై సుంకాలు తగ్గగా, చైనా(35%), వియత్నాం(20%), బంగ్లాదేశ్(20%), మలేషియా(19%), ఇండోనేషియా(19%), ఫిలిప్పీన్స్(19%), కంబోడియా(19%), థాయ్‌లాండ్(19%) వంటి పోటీ దేశాలు అమెరికా మార్కెట్‌లో అధిక సుంకాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఈ సుంకాల వ్యత్యాసం భారతదేశ ధరల పోటీతత్వాన్ని గణనీయంగా పెంచుతుంది. ఇది అమెరికా మార్కెట్‌లో భారతీయ వస్తువుల స్థానాన్ని మరింత బలోపేతం చేయడమే కాకుండా, ఎక్కువ మంది కార్మింకులు ఉండే పరిశ్రమలు, తయారీ రంగాలు, అధిక విలువ కలిగిన ఉత్పత్తి విభాగాలలో ఎగుమతి అవకాశాలను విస్తృతం చేస్తుంది.
రంగాల వారీగా లాభాలు:
టెక్స్‌టైల్స్, అపెరల్స్
టెక్స్‌టైల్ ఎగుమతులపై సుంకాలు 50% నుంచి 18 శాతానికి తగ్గాయి. పట్టు ఉత్పత్తులకు 0% సుంకం లభించింది. దీనివల్ల 113 బిలియన్ డాలర్ల అమెరికా మార్కెట్‌లో రెడీమేడ్ దుస్తులు, తివాచీలు, కాటన్ వస్త్రాలు, బెడ్‌షీట్లు, నూలు వంటి ఉత్పత్తులకు గొప్ప అవకాశం ఏర్పడింది. ఇది ఉపాధి కల్పనకు, భారతీయ సరఫరాదారుల బలానికి తోడ్పడుతుంది.
తోలు, పాదరక్షలు
ఈ ఒప్పందం భారతదేశ తోలు, పాదరక్షల రంగానికి గణనీయమైన లాభాలను అందిస్తుంది. అమెరికా మార్కెట్‌కు అత్యంత ప్రాధాన్యమైన సరఫరాదారుగా దేశాన్ని నిలబెడుతుంది. భారతదేశం నుంచి చేసే ఎగుమతులపై సుంకాలు 50% నుంచి 18శాతానికి తగ్గాయి. దీనివల్ల 42 బిలియన్ డాలర్ల విలువైన అమెరికా మార్కెట్‌లోకి మెరుగైన ప్రవేశం లభిస్తుంది.
దీనివల్ల ప్రధానంగా ఫినిష్డ్ లెదర్, తోలు పాదరక్షలు, పాదరక్షల విడిభాగాలు ప్రయోజనం పొందుతాయి. తగ్గిన సుంకాల నిర్మాణం తోలు పరిశ్రమలోని వాల్యూ-యాడెడ్ విభాగాలలో భారతదేశం తన ఉనికిని విస్తరించుకోవడానికి దోహదపడుతుంది.
తోలు, పాదరక్షల పరిశ్రమ శ్రమతో కూడినది కావడంతో ఈ మార్కెట్ ప్రవేశం తయారీ రంగ వృద్ధికి, ముఖ్యంగా ఎంఎస్ఎంఈలు, ప్రొడక్షన్ క్లస్టర్లలో ఉపాధి కల్పనకు మద్దతు ఇస్తుందని భావిస్తున్నారు.

రత్నాలు, ఆభరణాలు
రత్నాలు, ఆభరణాల ఎగుమతులపై సుంకాలు 50% నుంచి 18 శాతానికి తగ్గాయి. ఇది 61 బిలియన్ డాలర్ల విలువైన అమెరికా మార్కెట్‌కు ప్రాధాన్యతతో కూడిన ప్రవేశాన్ని కల్పిస్తుంది.
దీనికి అదనంగా, వజ్రాలు, ప్లాటినం, నాణేలు వంటి ప్రధాన ఉత్పత్తుల కోసం సున్నా సుంకంతో మార్కెట్ ప్రవేశం లభించింది. ఇది 29 బిలియన్ డాలర్ల అమెరికా మార్కెట్‌ను కవర్ చేస్తుంది. కట్ అండ్ పాలిష్డ్ డైమండ్స్, ల్యాబ్‌లో తయారుచేసిన సింథటిక్ వజ్రాలు, రంగు రత్నాలు, సింథటిక్ రాళ్లు, బంగారం, వెండి, ప్లాటినం వంటి విలువైన లోహాలతో చేసిన వస్తువులు దీనివల్ల లాభపడతాయి.
హోమ్ డెకర్
హోమ్ డెకర్ ఎగుమతులపై సుంకాలు 50% నుంచి 18 శాతానికి తగ్గాయి. ఇది 52 బిలియన్ డాలర్ల విలువైన అమెరికా మార్కెట్‌లో అవకాశాలను తెరుస్తుంది. కలప, ఫర్నిచర్ వస్తువులు, దిండ్లు, కుషన్లు, క్విల్ట్‌లు, కంఫర్టర్లు, నాన్-ఎలక్ట్రికల్ ల్యాంప్స్, ఇతర గృహాలంకరణ ఉత్పత్తులు ఈ తగ్గిన సుంకాల ద్వారా ప్రయోజనం పొందుతాయి.


అదనంగా, సీట్లు, షాండ్లియర్లు, ఇల్యూమినేటెడ్ సైన్స్, దీపాల విడిభాగాల వంటి 13 బిలియన్ డాలర్ల విలువైన అమెరికా మార్కెట్ ఉత్పత్తులకు సున్నా సుంకంతో ప్రవేశం లభించింది.
బొమ్మలు
భారతదేశం నుంచి బొమ్మల ఎగుమతులపై సుంకాలు 50% నుంచి 18 శాతానికి తగ్గాయి. ఇది 18 బిలియన్ డాలర్ల విలువైన అమెరికా మార్కెట్‌కు మెరుగైన ప్రవేశాన్ని కల్పిస్తుంది. అనుకూలమైన సుంకాల విధానంతో అమెరికా బొమ్మల మార్కెట్‌లో భారతదేశం నమ్మకమైన సరఫరాదారుగా ఎదగడానికి మంచి అవకాశం ఉంది. ఈ ఒప్పందం దేశీయ తయారీదారులు, ముఖ్యంగా ఎంఎస్ఎంఈలు ఉత్పత్తిని పెంచుకోవడానికి, అంతర్జాతీయ సరఫరా గొలుసులతో అనుసంధానం కావడానికి, ప్రపంచ మార్కెట్లలో తమ ఉనికిని విస్తరించుకోవడానికి కొత్త అవకాశాలను కల్పిస్తుంది.
యంత్రాలు, విడిభాగాలు(విమాన విడిభాగాలు మినహా) ప్రపంచంలోని అతిపెద్ద పారిశ్రామిక మార్కెట్లలో ఒకటైన అమెరికాలో ప్రవేశాన్ని మెరుగుపరచడం ద్వారా ఈ ఒప్పందం భారతదేశ యంత్రాలు, విడిభాగాల రంగానికి భారీ ఊతాన్ని ఇస్తుంది. మెషినరీ ఎగుమతులపై సుంకాలు 50% నుంచి 18%కి తగ్గాయి. దీనివల్ల 477 బిలియన్ డాలర్ల విలువైన అమెరికా మెషినరీ మార్కెట్‌లో మెరుగైన అవకాశాలు లభిస్తాయి.

ప్రస్తుతం ఈ విభాగంలో భారతదేశ ఎగుమతులు 2.35 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. తగ్గిన సుంకాల వల్ల వివిధ రకాల యంత్రాలు, భాగాల విభాగాలలో భారతీయ తయారీదారుల పోటీతత్వం పెరుగుతుంది. ఈ మెరుగైన ప్రవేశం భారతదేశ తయారీ లక్ష్యాలకు మద్దతు ఇస్తుంది. విలువ ఆధారిత పారిశ్రామిక ఎగుమతులను విస్తరించడానికి చేస్తున్న ప్రయత్నాలను బలోపేతం చేస్తుంది.
వ్యవసాయం: రైతులకు రక్షణ కల్పిస్తూనే ఎగుమతి అవకాశాల విస్తరణ
అమెరికాతో వ్యవసాయ వాణిజ్యంలో భారతదేశం 1.3 బిలియన్ డాలర్ల మిగులును కలిగి ఉంది. 2024లో భారతదేశం నుంచి 3.4 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరగగా, 2.1 బిలియన్ డాలర్ల దిగుమతులు జరిగాయి.
వ్యవసాయ ఎగుమతులకు సుంకం లేని ప్రవేశం:
1.36 బిలియన్ డాలర్ల విలువైన భారతీయ ఎగుమతులపై అమెరికా ఎటువంటి అదనపు పన్నులు వేయదు. దీనివల్ల ప్రయోజనం పొందే ఉత్పత్తులలో మసాలా దినుసులు; టీ, కాఫీ; కొబ్బరి నూనె; కూరగాయల మైనం; పోకచెక్కలు, జీడిపప్పు, బాదం వంటి గింజలు; అవకాడో, అరటి, మామిడి, కివీ, పైనాపిల్ వంటి పండ్లు మరియు కూరగాయలు; బార్లీ వంటి తృణధాన్యాలు; బేకరీ ఉత్పత్తులు; కోకో; నువ్వులు, గసగసాలు; పండ్ల రసాలు, జామ్ వంటి ప్రాసెస్ చేసిన ఉత్పత్తులు ఉన్నాయి.
వీటిలో 1.035 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులకు పరస్పర సుంకం ఉండదనే హామీ లభించింది. ఇది భారతీయ రైతులకు, ఎగుమతిదారులకు ఒక స్థిరమైన, భరోసాతో కూడిన మార్కెట్‌ను అందిస్తుంది.
పటిష్టమైన రక్షణతో కూడిన మార్కెట్ సరళీకరణ:
భారతదేశం తన మునుపటి వాణిజ్య ఒప్పందాల మాదిరిగానే ఉత్పత్తుల ప్రాముఖ్యతను బట్టి మార్కెట్ ప్రవేశాన్ని రూపొందించింది. కొన్ని ఉత్పత్తులపై పన్నులను తక్షణమే తొలగించడం, మరికొన్నింటిపై పది ఏళ్లలోపు దశలవారీగా తగ్గించడం వంటి పద్ధతులను అనుసరించింది.
చాలా కీలకమైన వ్యవసాయ రంగాలకు 'మినహాయింపు' విభాగం కింద పూర్తి రక్షణ కల్పించారు. వీటిలో మాంసం, కోడి మాంసం, పాల ఉత్పత్తులు; జీఎం ఆహార ఉత్పత్తులు; సోయా మీల్; మొక్కజొన్న; జొన్నలు, సజ్జలు, రాగులు వంటి చిరుధాన్యాలు; గ్రీన్ పీస్, కాబూలీ చనా, పెసర వంటి పప్పు ధాన్యాలు; పలు పశు దాణా ఉత్పత్తులు; వేరుశనగ; తేనె; మద్యపాన రహిత పానీయాలు; పిండి; స్టార్చ్; నూనెలు; ఇంధనం కోసం ఇథనాల్ మరియు పొగాకు వంటివి ఉన్నాయి.
కొన్ని సున్నితమైన ఉత్పత్తులపై ఉదాహరణకు: మొక్కలు, ఆలివ్స్, పైరెథరమ్, ఆయిల్ కేక్స్ వంటి వాటిపై పన్నుల రక్షణ కొనసాగుతుంది. మద్యం విషయంలో భారతదేశం ఇతర వాణిజ్య ఒప్పందాలలో అనుసరించిన విధంగానే కనీస దిగుమతి ధర ఆధారంగా పన్ను తగ్గింపును ఇచ్చింది.
షెల్ బాదం, వాల్‌నట్స్, పిస్తా వంటి కొన్ని వస్తువులకు నిర్ణీత పరిమితి వరకు మాత్రమే తక్కువ పన్నుతో అనుమతిస్తారు.
భారతదేశ ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమ ఉపయోగించే, పలు దేశాల నుంచి సేకరించే కొన్ని ఉత్పత్తుల కోసం పదేళ్ల వరకు దశలవారీగా టారిఫ్ తొలగింపు విధానం ఉంటుంది. వీటిలో అల్బుమిన్లు; కొబ్బరి నూనె, ఆముదం, పత్తి గింజల నూనె వంటి కొన్ని నూనెలు; హూఫ్‌మీల్; లార్డ్; స్టీరిన్; మార్పు చెందిన స్టార్చ్‌లు; పెప్టోన్లు, వాటి ఉత్పన్నాలు; మొక్కలు, మొక్కల భాగాలు మొదలైనవి ఉన్నాయి. ఈ సుదీర్ఘ కాలపరిమితి దేశీయ వాణిజ్యదారులకు సర్దుబాటు చేసుకోవడానికి తగినంత సమయాన్ని అందిస్తుంది.
తక్షణ సుంకం తొలగింపు అనేది ఇప్పటికే ఇతర ఒప్పందాల కింద సరళీకరించిన కొన్ని నాన్-సెన్సిటివ్ ఉత్పత్తులకు మాత్రమే ఇవ్వడమైంది.

38 బిలియన్ డాలర్ల పారిశ్రామిక ఎగుమతులకు సుంకం లేని ప్రవేశం
ఈ ఒప్పందం 38 బిలియన్ డాలర్ల విలువైన పారిశ్రామిక ఎగుమతులకు అదనపు సుంకం లేని ప్రవేశాన్ని ఖరారు చేస్తుంది.
'సెక్షన్ 232' నిబంధనల ప్రకారం.. విమాన విడిభాగాలు, యంత్రాలు, యంత్రాల భాగాలు, జెనరిక్ మందులు, ఫార్మాస్యూటికల్ పదార్థాలు, ప్రాథమిక ఆటో విడిభాగాలకు అదనపు సుంకం ఉండదు.
అదనంగా, రత్నాలు, వజ్రాలు, ప్లాటినం, నాణేలు, గడియారాలు, ఎసెన్షియల్ ఆయిల్స్, షాండ్లియర్లు, ఇల్యూమినేటెడ్ సైన్ బోర్డుల వంటి గృహ అలంకరణ వస్తువులు, ఐరన్, అల్యూమినియం ఆక్సైడ్లతో సహా అకర్బన రసాయనాలు, విలువైన లోహాల సమ్మేళనాలు, పరికరాలు, ఖనిజాలు, సహజ వనరులు, కాగితం, ప్లాస్టిక్, కలపతో చేసిన వస్తువులు, సహజ రబ్బరు వంటి ప్రధాన పారిశ్రామిక ఉత్పత్తులకు సుంకం లేని ప్రవేశం వర్తిస్తుంది.
పటిష్టమైన రక్షణలతో కూడిన వ్యవసాయేతర మార్కెట్ ప్రారంభం
మార్కెట్ ప్రవేశ ఫ్రేమ్‌వర్క్‌ను ఖరారు చేయడానికి ముందు ఉత్పత్తుల సున్నితత్వం, రంగాల వారీ అవసరాలను గుర్తించడానికి పరిశ్రమ సంస్థలు, అసోసియేషన్లు, సంబంధిత మంత్రిత్వ శాఖలతో విస్తృతమైన సంప్రదింపులను ఈ ఒప్పందం ప్రతిబింబిస్తుంది. పారిశ్రామిక వస్తువుల మార్కెట్ ప్రవేశం అనేది కచ్చితంగా ఉత్పత్తి సున్నితత్వం ఆధారంగా, తక్షణ టారిఫ్ తొలగింపు, దశలవారీ తగ్గింపు(పదేళ్ల వరకు), కోటా ఆధారిత ప్రవేశాన్ని కలిపి రూపొందించడమైంది.
ఆటోమొబైల్స్ వంటి సున్నితమైన రంగాలకు సంబంధించి కోటా, సుంకం తగ్గింపు పద్ధతుల ద్వారా సరళీకరణ జరిగింది. వైద్య పరికరాల అంశం సుదీర్ఘమైన, దశలవారీ షెడ్యూల్‌ల ద్వారా పరిష్కారమైంది. విలువైన లోహాలు, ఇతర సున్నితమైన పారిశ్రామిక ఉత్పత్తులపై కోటా ఆధారిత టారిఫ్ తగ్గింపు ఉంటుంది. ఈ జాగ్రత్తగా రూపొందించిన రక్షణలు, ఉత్పాదక సామర్థ్యం లేదా ఉపాధిపై రాజీ పడకుండా సరళీకరణ పోటీతత్వాన్ని బలపరుస్తుందని నిర్ధారిస్తాయి.
వాణిజ్య సౌలభ్యం, నాణ్యతా వ్యవస్థల బలోపేతం
సుంకాల సంస్కరణలకు అతీతంగా ఈ ఒప్పందం వాణిజ్య సౌలభ్యాన్ని పెంపొందిస్తుంది. సుంకేతర అడ్డంకులను పరిష్కరిస్తుంది. ఈ నిబంధనలు నియంత్రించే భారతదేశ హక్కును కాపాడుతూనే, వాణిజ్యానికి ఉన్న సాంకేతిక అడ్డంకులను తొలగిస్తూ మెరుగైన మార్కెట్ ప్రవేశాన్ని అందిస్తాయి.
అధిక సాంకేతికతతో కూడిన ఉత్పత్తులు, వైద్య పరికరాలు, ఐసీటీ వస్తువులు సహా ప్రాధాన్యత రంగాలలో నాణ్యతా ప్రమాణాలు, అక్రిడిటేషన్ వ్యవస్థలు, నిబంధనల పాటింపును సులభతరం చేయడంపై భారత్, అమెరికా కలిసి పనిచేస్తాయి.
కన్ఫర్మిటీ అసెస్‌మెంట్‌ల గుర్తింపు వల్ల రెండుసార్లు పరీక్షలు చేయాల్సిన అవసరం తగ్గుతుంది. దీనివల్ల ఎగుమతిదారులకు సమయం, ఖర్చు ఆదా అవుతుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో సమానంగా ఉండటం వల్ల ఎగుమతి సంసిద్ధత పెరుగుతుంది. భారతీయ తయారీదారులు ముఖ్యంగా అధునాతన యంత్రాలు, వైద్య పరికరాలు, ఎలక్ట్రానిక్స్‌లో నాణ్యతను పెంచుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఇది యూరోపియన్ యూనియన్, యునైటెడ్ కింగ్‌డమ్, జపాన్ వంటి అధునాతన మార్కెట్‌లతో సహా ప్రపంచ సరఫరా గొలుసులో లోతైన అనుసంధానాన్ని కూడా నిర్ధారిస్తుంది.
ఐసీటీ, సెమీకండక్టర్లు, డిజిటల్ ఇండియా
ఈ ఒప్పందం అధునాతన సెమీకండక్టర్ చిప్‌లు, సర్వర్ భాగాలు, కీలకమైన సాంకేతిక పరికరాల లభ్యతను సులభతరం చేయడం ద్వారా భారతదేశ డిజిటల్ వెన్నెముకను బలోపేతం చేస్తుంది. ఇవి భారతీయ డేటా సెంటర్‌ల విస్తరణకు, 'డిజిటల్ ఇండియా' కార్యక్రమానికి ఎంతో అవసరం. అత్యున్నత స్థాయి కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలు నిరంతరం అందుబాటులో ఉండటం వల్ల అంతర్జాతీయ డిమాండ్‌కు అనుగుణంగా భారతదేశ డిజిటల్ వ్యవస్థ విస్తరించడానికి వీలవుతుంది.
సరళీకరించిన లైసెన్సింగ్ విధానాలు దిగుమతి వ్యవస్థలో పారదర్శకతను, ముందస్తు అంచనా వేసే అవకాశాన్ని పెంచుతాయి. దీనివల్ల పరిపాలనాపరమైన ఇబ్బందులు తగ్గి, సరఫరా గొలుసు సామర్థ్యం మెరుగుపడుతుంది. ఇది సాంకేతిక సంస్థలు తమ వద్ద నిల్వలను తక్కువగా ఉంచుకుంటూనే, కొత్త ఉత్పత్తుల అభివృద్ధిని, వాటి మార్కెట్ ప్రవేశాన్ని వేగవంతం చేయడానికి సహాయపడుతుంది.
తర్వాతి-తరం సాంకేతికతలు అందుబాటులోకి రావడం వల్ల భారతీయ డేటా సెంటర్లు ప్రాసెసింగ్ పవర్, వేగం, సేవా ప్రమాణాలలో ప్రపంచ స్థాయి పోటీని ఎదుర్కోగలవు. అదే సమయంలో, ఈ నిబంధనలు దేశ భద్రతకు అవసరమైన రక్షణ కవచాలను కూడా కలిగి ఉన్నాయి. దీనివల్ల వ్యూహాత్మక ప్రయోజనాలకు ఎటువంటి హాని కలగకుండానే ఆవిష్కరణలు, సాంకేతిక పురోగతి నిరంతరం కొనసాగుతాయి.
ఆరోగ్యం, వైద్య మౌలిక సదుపాయాలు
వైద్య పరికరాల రంగంలో భారతదేశం, అమెరికా ఒకదానికొకటి తోడ్పడే బలమైన సామర్థ్యాలను కలిగి ఉన్నాయి. అత్యాధునిక రోగ నిర్ధారణ, శస్త్రచికిత్స పరికరాల లభ్యత పెరగడం వల్ల మన దేశంలో అధునాతన ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను విస్తరించడానికి తోడ్పడుతుంది.
ప్రాణ రక్షణ సాంకేతికతలు సులభంగా అందుబాటులోకి రావడం వల్ల ప్రత్యేక వైద్య సేవలు తక్కువ ఖర్చుతో సామాన్యులకు చేరువవుతాయి. ఇది రోగుల ఆరోగ్య ఫలితాలను మెరుగుపరచడమే కాకుండా భారతదేశ వైద్య వ్యవస్థను బలోపేతం చేస్తుంది.
భారత్-అమెరికా డిజిటల్ వాణిజ్య భాగస్వామ్యం
ప్రపంచ వాణిజ్యంలో డిజిటల్ వాణిజ్యం వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగంగా అవతరించింది. డబ్ల్యూటీఓ గణాంకాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ సేవలు 2023లో 4.35 ట్రిలియన్ డాలర్ల నుంచి 2024 నాటికి 4.78 ట్రిలియన్ డాలర్లకు పెరిగాయి. ఇది 9.8 శాతం వృద్ధిని సూచిస్తుంది.
డిజిటల్ ఎగుమతుల్లో భారతదేశం తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. 2024లో భారత డిజిటల్ సేవల ఎగుమతులు 0.28 ట్రిలియన్ డాలర్లుగా ఉండి, 10.3 శాతం వృద్ధిని సాధించాయి. డిజిటల్ సేవల ఎగుమతుల్లో భారత్ ప్రపంచవ్యాప్తంగా 5వ స్థానంలో, దిగుమతుల్లో 11వ స్థానంలో ఉంది. కాగా, అమెరికా ఎగుమతులు, దిగుమతులు రెండింటిలోనూ మొదటి స్థానంలో ఉంది.
పరస్పర బలాలు, ఉమ్మడి అవకాశాలు
డిజిటల్ వాణిజ్యంలో భారత్, అమెరికా ఒకదానికొకటి సంపూర్ణ బలాలు కలిగి ఉన్నాయి. అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ సేవల దిగుమతిదారు కాగా, ఐటీ సేవలు, డిజిటల్ పరిష్కారాలలో అపారమైన సామర్థ్యం ఉన్న భారతదేశం అగ్రశ్రేణి ఎగుమతిదారులలో ఒకటిగా ఉంది.
ఇరు దేశాల మధ్య నిర్మాణాత్మకమైన డిజిటల్ వాణిజ్య విధానం ఉండటం వల్ల నిబంధనల విషయంలో స్పష్టత వస్తుంది. పని భారం తగ్గుతుంది. సరిహద్దుల మధ్య సేవల మార్పిడి సులభతరం అవుతుంది. ఇది భారతీయ కంపెనీలకు మార్కెట్ అవకాశాలను విస్తరిస్తుంది.
ఎస్ఎంఈలు, ఆవిష్కరణలు, సాంకేతిక సహకారం: ఏకీకృత డిజిటల్ వాణిజ్య నిబంధనల వల్ల లావాదేవీల ఖర్చులు తగ్గుతాయి. దీనివల్ల ముఖ్యంగా చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు డిజిటల్ సేవల లభ్యత పెరుగుతుంది. ఇది విదేశీ వాణిజ్యంలో చిన్న పరిశ్రమల భాగస్వామ్యానికి గొప్ప అవకాశాలను కల్పిస్తుంది.
పరస్పర అంగీకారంతో కూడిన ఈ విధానం వల్ల భారతదేశ డిజిటల్ రంగంలో అమెరికా పెట్టుబడులు పెరుగుతాయని భావిస్తున్నారు. దీనివల్ల క్లౌడ్ కంప్యూటింగ్, కృత్రిమ మేధ, ఫిన్‌టెక్, హెల్త్-టెక్ వంటి రంగాల్లోని స్టార్టప్‌లు వేగంగా అభివృద్ధి చెందుతాయి.
అలాగే, జాతీయ భద్రత, నిబంధనలకు లోబడి రెండు ప్రధాన డిజిటల్ ఆర్థిక వ్యవస్థల మధ్య సాంకేతిక సహకారం బలపడుతుంది.

వినియోగదారుల సంక్షేమం: స్థానిక సరఫరాకు ఆటంకం లేకుండా దిగుమతుల పెంపు
ఈ ఒప్పందం వినియోగదారుల ప్రయోజనాలను కూడా కాపాడుతుంది. స్థానిక రైతులు లేదా ఉత్పత్తిదారులపై ఒత్తిడి లేకుండా, దేశీయంగా కొరత ఉన్న కొన్ని వస్తువులను మాత్రమే క్రమబద్ధంగా దిగుమతి చేసుకునే అవకాశం కల్పిస్తుంది.
ఈ పరిమిత దిగుమతులు స్థానిక ఉత్పత్తులకు ప్రత్యామ్నాయంగా కాకుండా, వాటికి అదనంగా తోడవుతాయి. దీనివల్ల ధరలు స్థిరంగా ఉండటమే కాకుండా వినియోగదారులకు మరిన్ని రకాల వస్తువులు అందుబాటులోకి వస్తాయి.
ముఖ్యమైన వినియోగదారు ఆధారిత ఉత్పత్తులు, ప్రధాన వినియోగదారు ఆధారిత ఉత్పత్తుల విభాగాలలో బాదం, వాల్‌నట్స్ వంటి గింజలు; బెర్రీలు వంటి తాజా, ప్రాసెస్ చేసిన పండ్లు; ప్రత్యేకమైన, అధిక నాణ్యత కలిగిన నూనెలు; ఈస్ట్, మార్గరీన్, అబలోన్ వంటి ప్రాసెస్ చేసిన ఆహార ఉత్పత్తులు; వైన్, ప్రీమియం పానీయాలు; ఎంపికచేసిన పెంపుడు జంతువుల ఆహార ఉత్పత్తులు; సాల్మన్, కాడ్, అలస్కా పొల్లాక్ వంటి శీతల వాతావరణంలో ఉంచే చేపల ఆహార పదార్థాలు ఉన్నాయి.
భారతీయ తయారీ, విలువ గొలుసులను బలోపేతం చేసే వస్తువులు
భారతదేశ ఎగుమతి రంగానికి అవసరమైన కీలకమైన ముడి పదార్థాల లభ్యతను ఈ ఒప్పందం సులభతరం చేస్తుంది. నాణ్యమైన ముడి పదార్థాలు, విడిభాగాలు సరసమైన ధరలకు లభించడం వల్ల, మన దేశంలో తయారీ రంగం బలోపేతం అవుతుంది. ప్రపంచ సరఫరా వ్యవస్థలో భారత్ స్థానం మెరుగుపడుతుంది.
వీటిలో ముడి వజ్రాలు; మందులు, వ్యవసాయ ప్రాసెసింగ్‌కు వాడే ప్రత్యేక రసాయనాలు; సెమీకండక్టర్ వేఫర్లు; సెన్సార్లు, మైక్రోకంట్రోలర్లు వంటి ఎలక్ట్రానిక్ విడిభాగాలు; కార్బన్ ఫైబర్స్; పారిశ్రామిక యంత్రాల భాగాలు; ఏరోస్పేస్ విడిభాగాలు; బ్యాటరీ తయారీకి వాడే లిథియం పదార్థాలు మరియు ఎరువుల తయారీకి అవసరమైన ఫాస్ఫేట్ రాక్ వంటివి ఉన్నాయి.
అత్యున్నత, అధునాతన సాంకేతిక దిగుమతులు
ఈ ఒప్పందం భారతదేశ సాంకేతిక పురోగతికి తోడ్పడుతుంది. దేశీయ సామర్థ్యాలను పెంచే వ్యూహాత్మక వస్తువులు, అత్యున్నత సాంకేతికత సులభంగా అందుబాటులోకి వచ్చేలా ఇది సహకరిస్తుంది. అధునాతన సాంకేతికతల లభ్యత భారతదేశ డిజిటల్, పారిశ్రామిక పరివర్తనను వేగవంతం చేయడమే కాకుండాస్వయం సమృద్ధి లక్ష్యాలను మరింత బలోపేతం చేస్తుంది.
కీలకమైన హై-టెక్నాలజీ విభాగాలలో ఇవి ఉన్నాయి: డయాగ్నస్టిక్ ఇమేజింగ్, సర్జికల్ రోబోటిక్స్ వంటి అధునాతన వైద్య పరికరాలు; ఏఐ చిప్స్, హై-పెర్ఫార్మెన్స్ ప్రాసెసర్లు; సెమీకండక్టర్ తయారీ పరికరాలు; క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ హార్డ్‌వేర్; టెలికాం, ఐసీటీ నెట్‌వర్క్ పరికరాలు; సైబర్ సెక్యూరిటీ హార్డ్‌వేర్; సాధారణ ఏరోస్పేస్ ఎలక్ట్రానిక్స్; స్మార్ట్ గ్రిడ్లు, మీటర్లతో కూడిన స్వచ్ఛ ఇంధన సాంకేతికతలు; ప్రిసిషన్ అగ్రికల్చర్ టెక్నాలజీ; బయోటెక్నాలజీ పరిశోధన పరికరాలు; క్వాంటం కంప్యూటింగ్ భాగాలు; అధునాతన ప్రయోగశాల, పరీక్షా పరికరాలు; శాటిలైట్, అంతరిక్ష సాంకేతిక భాగాలు; డేటా సెంటర్ మౌలిక సదుపాయాల పరికరాలు.
ముందుకు సాగే వ్యూహాత్మక భాగస్వామ్యం
భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం రెండు ప్రధాన ప్రపంచ ఆర్థిక వ్యవస్థల మధ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడంలో ఒక విప్లవాత్మక అడుగు.
30 ట్రిలియన్ డాలర్ల మార్కెట్‌కు తలుపులు తెరవడం ద్వారా ఎగుమతులపై పన్నులను క్రమబద్ధీకరించడం ద్వారా, భారీ పరిమాణంలో వస్తువులపై సుంకం లేని ప్రయోజనాలను పొందడం ద్వారా, డిజిటల్, వ్యూహాత్మక సాంకేతిక సహకారాన్ని బలోపేతం చేయడం ద్వారా, ఈ ఒప్పందం ప్రపంచ వాణిజ్యంలో భారతదేశ స్థానాన్ని గణనీయంగా మెరుగుపరుస్తుంది.
ఇదే సమయంలో ఉత్పత్తుల సున్నితత్వం ఆధారంగా రూపొందించిన ఈ విధానం రైతులను, ఎంఎస్ఎంఈలను, దేశీయ పరిశ్రమలను రక్షిస్తుంది. ఈ ఫ్రేమ్‌వర్క్ వృద్ధిని, రక్షణను, పోటీతత్వాన్ని, స్థితిస్థాపకతను, విస్తరణ, జాతీయ ప్రయోజనాలను సమతుల్యం చేస్తుంది. ఇది భారతదేశాన్ని స్థిరమైన ఎగుమతి ఆధారిత వృద్ధికి, లోతైన ప్రపంచ అనుసంధానానికి, దీర్ఘకాలిక ఆర్థిక బలోపేతానికి సిద్ధం చేస్తుంది.
***
(Explainer ID: 157300)
आगंतुक पटल : 22
Provide suggestions / comments