Farmer's Welfare
భారతదేశ డెయిరీ రంగం డిజిటలీకరణ చురుకైన, పారదర్శక, రైతు-కేంద్రీకృత వ్యవస్థ నిర్మాణం
Posted On:
09 JAN 2026 10:37AM
కీలకాంశాలు
- జాతీయ డిజిటల్ పశుసంపద మిషన్(ఎన్‌డీఎల్ఎం) కింద 35.68 కోట్లకు పైగా జంతువులకు "పశు ఆధార్" జారీ అయింది. ఇది పశువుల నిర్వహణను సులభతరం చేస్తోంది.
- 54 పాల సంఘాలలోని 17.3 లక్షల మందికి పైగా పాలు ఉత్పత్తిదారులు ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ సిస్టమ్ (ఏఎంసీఎస్) ద్వారా ప్రయోజనం పొందుతున్నారు. ఇది పారదర్శక చెల్లింపులు, సమర్థవంతమైన కార్యకలాపాలకు దోహదపడుతోంది.
- సుమారు 198 పాల సంఘాలు, 15 ఫెడరేషన్లు డేటా ఆధారిత నిర్ణయాధికారం, పనితీరు అంచనా కోసం ఇంటర్నెట్ ఆధారిత డెయిరీ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(ఐ-డీఐఎస్)ను ఉపయోగిస్తున్నాయి.
- జీఐఎస్ సాంకేతికతను ఉపయోగించి పాల రవాణా మార్గాలను మెరుగుపరచడం అనేక రాష్ట్రాల్లోని సహకార సంఘాలు రవాణా ఖర్చులను గణనీయంగా ఆదా చేయడంలో, సరఫరా సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడింది.
పరిచయం
ప్రపంచ పాల ఉత్పత్తిలో 25% వాటాతో భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా ఉంది. ఈ రంగం విస్తరిస్తున్నా కొద్దీ ఉత్పాదకత, పారదర్శకత, రైతు సంక్షేమాన్ని పెంపొందించడంలో డిజిటల్ సాధనాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. జాతీయ పాడి పరిశ్రమాభివృద్ధి మండలి(ఎన్‌డీడీబీ) ఈ మార్పులో ముందంజలో ఉంది. రైతులు, సహకార సంఘాలు, డెయిరీ విలువ గొలుసులోని వాటాదారులను అనుసంధానించే డిజిటల్ వేదికలను అభివృద్ధి చేస్తోంది. ఈ చర్యలు కార్యకలాపాలను ఆధునికీకరించడం, అసమర్థతలను తగ్గించడం, ప్రపంచంలోనే అతిపెద్ద డెయిరీ వ్యవస్థను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాయి.
జాతీయ డిజిటల్ పశుసంపద మిషన్(ఎన్‌డీఎల్ఎం)
పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ(డీఏహెచ్‌డీ) సహకారంతో ఎన్‌డీడీబీ అమలు చేస్తున్న జాతీయ డిజిటల్ పశుసంపద మిషన్(ఎన్‌డీఎల్ఎం), "భారత్ పశుధన్" అనే ఏకీకృత డిజిటల్ పశుసంపద పర్యావరణ వ్యవస్థ వైపు ఒక ప్రధాన అడుగు.
డేటా ఆధారిత పశువుల నిర్వహణను మెరుగుపరచడానికి భారత్ పశుధన్ డేటాబేస్ సంతానోత్పత్తి, కృత్రిమ గర్భధారణ, ఆరోగ్య సేవలు, టీకాలు, చికిత్స వంటి క్షేత్ర కార్యకలాపాలను నమోదు చేస్తుంది. ఇందులో 84 కోట్లకు పైగా లావాదేవీలు నమోదయ్యాయి. పశువైద్యులు, విస్తరణ కార్యకర్తలతో సహా క్షేత్రస్థాయి సిబ్బంది.. రైతులు ఈ వ్యవస్థను ఉపయోగించడంలో సహాయపడతారు.
ఎన్‌డీఎల్ఎం పశువులకు ప్రత్యేక గుర్తింపు, డేటా అనుసంధానం, మొబైల్ అప్లికేషన్ వంటి డిజిటల్ సాధనాలను ఉపయోగించి రైతులకు సాధికారతను అందిస్తుంది. ఉత్పాదకతను మెరుగుపరుస్తుంది. భారతదేశంలోని ప్రతి జంతువుకు డిజిటల్ గుర్తింపు ఉండేలా దానిని ఆరోగ్య రికార్డులు, ఉత్పాదకత డేటాతో అనుసంధానించడం దీని లక్ష్యం. రాష్ట్రాల్లో ఈ మిషన్‌ను అమలు చేయడానికి ఎన్‌డీడీబీ సాంకేతిక, ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది.
అంతర్జాతీయ పద్ధతులకు అనుగుణంగా అన్ని పశువులకు చెవి ట్యాగ్ రూపంలో ప్రత్యేకమైన 12-అంకెల బార్ కోడ్‌తో కూడిన ట్యాగ్ ఐడీ జారీ చేస్తున్నారు. ఈ ప్రత్యేక కోడ్‌కు “పశు ఆధార్” అని పేరు పెట్టారు. ఇది టీకాలు, సంతానోత్పత్తి, చికిత్స మొదలైన విషయాలు నమోదు చేయడానికి ప్రాథమికంగా పనిచేస్తుంది. ఇవన్నీ ట్యాగ్ ఐడీ ద్వారా ఒకే చోట చూడవచ్చు. రైతులకు, క్షేత్ర స్థాయి పశువైద్యులకు, కార్మికులకు అందుబాటులో ఈ వివరాలు ఉంటాయి. నవంబర్ 2025 వరకు 35.68 కోట్లకుపైగా పశు ఆధార్‌ల కేటాయింపు జరిగింది.
జాతీయ డిజిటల్ పశుసంపద మిషన్ కింద 1962 యాప్ ఉత్తమ పద్ధతులు, ప్రభుత్వ పథకాలపై ప్రామాణిక సమాచారాన్ని అందిస్తోంది. అంతేకాకుండా రైతులు మొబైల్ వెటర్నరీ యూనిట్ల ద్వారా తమ ఇంటి వద్దనే పశువైద్య సేవలను పొందడానికి టోల్-ఫ్రీ నంబర్ 1962 అందుబాటులో ఉంది.
ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ సిస్టమ్
భారతదేశ సహకార డెయిరీ నమూనాలో మిలియన్ల మంది రైతుల నుంచి రోజువారీ పాలు సేకరించడం ప్రధాన అంశం. ఈ ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా, రైతు అనుకూలమైనదిగా చేయడానికి జాతీయ పాడి పరిశ్రమాభివృద్ధి మండలి(ఎన్‌డీడీబీ) ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ సిస్టమ్(ఏఎంసీఎస్)ను అభివృద్ధి చేసింది. ఇది డెయిరీ కోఆపరేటివ్ సొసైటీల(డీసీఎస్) కార్యకలాపాలలోని ప్రతి అంశాన్ని నిర్వహించడానికి ఒక బలమైన, ఏకీకృత సాఫ్ట్‌వేర్ వేదిక.
ఏఎంసీఎస్ పరిమాణం, నాణ్యత, కొవ్వు శాతం సహా ప్రతి లావాదేవీని డిజిటల్‌గా నమోదు చేయడం ద్వారా పాల సేకరణను ఆటోమేట్ చేస్తుంది. రైతుల బ్యాంక్ ఖాతాలకు తక్షణమే నగదును బదిలీ చేస్తుంది. ఓపెన్-సోర్స్ టెక్నాలజీని ఉపయోగించి ఈ వ్యవస్థ తప్పులను తొలగిస్తుంది. ప్రతి స్థాయిలో పారదర్శకతను ప్రోత్సహిస్తుంది. రైతులు తమ రోజువారీ అమ్మకాలు, చెల్లింపులపై ఎప్పటికప్పుడు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారాన్ని అందుకుంటారు. ఇదే సమయంలో సహకార సంఘాలు మెరుగైన సేకరణ, ఉత్పత్తి ప్రణాళిక కోసం డేటా ఆధారిత సూచనలను పొందుతాయి.
ఈ వ్యవస్థ పాల సంఘాలు, ఫెడరేషన్, జాతీయ స్థాయిలలో అనుసంధానించి ఉంది. ప్రస్తుతం 12 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో పని చేస్తున్న ఏఎంసీఎస్.. 26,000 కంటే ఎక్కువ పాల సహకార సంఘాలను కవర్ చేస్తోంది. 54 పాల సంఘాలలోని 17.3 లక్షల మందికి పైగా పాలు ఉత్పత్తిదారులకు ప్రయోజనం చేకూరుస్తోంది(అక్టోబర్ 22, 2025 నాటికి).
సమీకృత ఏఎంసీఎస్ కింద ఉండే ప్రధాన భాగాలు:
1. డీసీఎస్ అప్లికేషన్: విండోస్ / లైనక్స్, ఆండ్రాయిడ్ వేదికలలో పనిచేసే బహుభాషా అప్లికేషన్.
2. పోర్టల్ అప్లికేషన్: యూనియన్, ఫెడరేషన్, జాతీయ స్థాయిలలో సాధారణ కేంద్రీకృత ఏఎంసీఎస్ పోర్టల్స్.
3. ఆండ్రాయిడ్ యాప్స్: సంఘం కార్యదర్శి, డెయిరీ సూపర్‌వైజర్, రైతు కోసం ప్రత్యేక బహుభాషా మొబైల్ అప్లికేషన్లు.
ఈ ఆండ్రాయిడ్ ఆధారిత అప్లికేషన్ రైతులకు డిజిటల్ పాస్‌బుక్‌గా, డెయిరీ కార్యదర్శులు, సూపర్‌వైజర్లకు తక్షణ సమాచార వేదికగా పనిచేస్తుంది.
ఎన్‌డీడీబీ డెయిరీ ఈఆర్పీ(ఎన్‌డీఈఆర్‌పీ)
ఎన్‌డీడీబీ డెయిరీ ఈఆర్పీ(ఎన్‌డీఈఆర్‌పీ) అనేది డెయిరీ, వంట నూనెల పరిశ్రమల కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన వెబ్ ఆధారిత ఎంటర్‌ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ సిస్టమ్. ఇది ఓపెన్-సోర్స్ ప్లాట్‌ఫారమ్(ఫ్రాపీ ఈఆర్‌పీనెక్ట్స్)పై నిర్మితమైంది. ఎటువంటి సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాలేషన్ అవసరం లేకుండా కంప్యూటర్ లేదా మొబైల్ ద్వారా దీనిని వినియోగించవచ్చు. ఇది పంపిణీదారుల కోసం ఆండ్రాయిడ్, ఐఓఎస్(ఎంఎన్‌డీఈఆర్‌పీ)లలో కూడా అందుబాటులో ఉంది.
-------------బాక్స్---------------
ఐఎన్‌డీఈఆర్‌పీ పోర్టల్ అనేది పంపిణీదారుల కోసం ఒక ఆన్‌లైన్ వేదిక. ఇది ఆర్డర్లు, డెలివరీ చలాన్లు, ఇన్‌వాయిస్‌లు, చెల్లింపులను సమర్థవంతంగా నిర్వహించడానికి వీలు కల్పిస్తుంది. ఈ పోర్టల్ ద్వారా పంపిణీదారులు డెలివరీలను ట్రాక్ చేయవచ్చు. చెల్లించాల్సి ఉన్న మొత్తం చూడటంతో పాటు ఇన్‌వాయిస్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇది పాల సంఘాలు, ఫెడరేషన్‌లతో సహకారాన్ని మెరుగుపరుస్తుంది.
ఎంఎన్‌డీఈఆర్‌పీ మొబైల్ యాప్ పంపిణీదారులు ప్రయాణంలో ఉన్నప్పుడు తమ స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా ఆర్డర్‌లు చేయడానికి, ఇన్‌వాయిస్‌లు పొందడానికి, చెల్లింపులను పర్యవేక్షించడానికి అనుమతిస్తుంది. ఇది డెయిరీ కార్యకలాపాల్లో పారదర్శకత, సౌలభ్యాన్ని పెంపొందిస్తోంది.
-----------------------------------------------------------------------------
ఎన్‌డీడీబీ డెయిరీ ఈఆర్పీ(ఎన్‌డీఈఆర్‌పీ)
ఎన్‌డీఈఆర్‌పీలో ఫైనాన్స్, అకౌంట్స్, కొనుగోలు, సరుకు నిల్వ, సేల్స్, మార్కెటింగ్, తయారీ, హెచ్‌ఆర్, పేరోల్ వంటి అన్ని ప్రధాన కార్యకలాపాల మాడ్యూల్స్ ఉన్నాయి. ఇవన్నీ అధిక పారదర్శకత, నియంత్రణను నిర్ధారించడానికి అధునాతన వర్క్‌ఫ్లోలు, 'మేకర్-చెక్కర్' ఫీచర్‌లతో అనుసంధానించి ఉన్నాయి. ఈ వ్యవస్థలో డ్యాష్‌బోర్డ్‌లు, విశ్లేషణాత్మక సాధనాలు కూడా ఉన్నాయి. ఇవి మేనేజ్‌మెంట్ స్థాయిలలో డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడతాయి.
ముఖ్యంగా ఆవు నుంచి వినియోగదారుడి వరకు పాల సేకరణ, ప్రాసెసింగ్, పంపిణీని కవర్ చేస్తూ, ఎండ్-టు-ఎండ్ డిజిటల్ పరిష్కారాన్ని రూపొందించడానికి ఎన్‌డీఈఆర్‌పీ ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ సిస్టమ్(ఏఎంసీఎస్)తో అనుసంధానించి ఉంటుంది. సామర్థ్యాన్ని పెంపొందించడానికి, ఈ వేదిక ఉత్పత్తి మాడ్యూల్‌లో 'మాస్-బ్యాలెన్సింగ్' సాంకేతికతను కలిగి ఉంది. ఇది డెయిరీలకు ప్రాసెసింగ్ నష్టాలను తగ్గించడంలో సహాయపడుతుంది.
సెమెన్ స్టేషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్(ఎస్ఎస్ఎంఎస్)
సెమెన్ స్టేషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్(ఎస్ఎస్ఎంఎస్) అనేది శీతల పద్ధతుల్లో నిల్వ చేసిన వీర్యం మోతాదుల (ఎఫ్ఎస్‌డీ) ఉత్పత్తిని క్రమబద్ధీకరించడానికి భారత ప్రభుత్వం నిర్దేశించిన కనీస ప్రమాణాల ప్రోటోకాల్‌లు(ఎంఎస్‌పీ), ప్రామాణిక నిర్వహణ విధానాలను(ఎస్ఓపీ) పాటించేలా నిర్ధారించడానికి రూపొందించిన ఒక సమగ్ర డిజిటల్ వేదిక. ఈ వ్యవస్థ ఎద్దుల జీవనచక్ర నిర్వహణ, వీర్యం ఉత్పత్తి, నాణ్యత నియంత్రణ, జీవ భద్రత, ఫారమ్, పశుగ్రాసం నిర్వహణ, అమ్మకాల పర్యవేక్షణ సహా సెమెన్ స్టేషన్ల అన్ని ప్రధాన కార్యకలాపాలను కవర్ చేస్తుంది. ఇది కచ్చితమైన, సమర్థవంతమైన, గుర్తించదగిన కార్యకలాపాల కోసం ప్రయోగశాల పరికరాలు, ఆర్ఎఫ్ఐడీ బుల్ ట్యాగ్‌లతో అనుసంధానించి ఉంటుంది. ఉత్పత్తి నుంచి పంపిణీ వరకు ప్రతి దశను డిజిటల్‌గా పర్యవేక్షించేలా నిర్ధారిస్తుంది.
ఎస్ఎస్ఎంఎస్ అనేది ఇన్ఫర్మేషన్ నెట్‌వర్క్ ఫర్ సెమెన్ ప్రొడక్షన్ అండ్ రిసోర్స్ మేనేజ్‌మెంట్(ఐఎన్ఎస్‌పీఆర్ఎం)కు అనుసంధానించి ఉంటుంది. ఇది సెమెన్ స్టేషన్‌లు, ఐఎన్ఏపీహెచ్(ఇన్ఫర్మేషన్ నెట్‌వర్క్ ఫర్ యానిమల్ ప్రొడక్టివిటీ అండ్ హెల్త్) వంటి క్షేత్ర స్థాయి వ్యవస్థల మధ్య తక్షణ డేటా షేరింగ్‌ను ఎనేబుల్ చేసే జాతీయ పోర్టల్. ఈ అనుసంధానం దేశవ్యాప్తంగా సరఫరా చేసిన వీర్యం మోతాదులను పూర్తిగా గుర్తించడానికి అనుమతిస్తుంది. కేంద్రీకృత డేటాబేస్ ద్వారా సమన్వయ పర్యవేక్షణకు మద్దతు ఇస్తుంది. ప్రపంచ బ్యాంకు నిధుల సహకారంతో ఎన్‌డీడీబీ అమలు చేసిన నేషనల్ డెయిరీ ప్లాన్ 1(ఎన్‌డీపీ 1) కింద అభివృద్ధి చేసిన ఈ వ్యవస్థ దేశవ్యాప్తంగా సెమెన్ స్టేషన్‌లను ఆధునికీకరించింది. భారతదేశ కృత్రిమ గర్భధారణ నెట్‌వర్క్‌ను బలోపేతం చేసింది. మెరుగైన డెయిరీ ఉత్పాదకతకు దోహదపడింది. ప్రస్తుతం, భారతదేశం అంతటా 38 గ్రేడెడ్ సెమెన్ స్టేషన్లు వీర్యం ఉత్పత్తిలో నాణ్యత, పారదర్శకత, ప్రామాణీకరణను నిర్ధారించడానికి ఎస్ఎస్ఎంఎస్‌ని ఉపయోగిస్తున్నాయి.
-----------బాక్స్---------
ఐఎన్ఏపీహెచ్
ఇన్ఫర్మేషన్ నెట్‌వర్క్ ఫర్ యానిమల్ ప్రొడక్టివిటీ అండ్ హెల్త్(ఐఎన్ఏపీహెచ్) అనేది రైతు ముంగిట అందించే సంతానోత్పత్తి, పోషణ, ఆరోగ్య సేవలపై తక్షణ విశ్వసనీయ డేటాను సేకరించడానికి వీలు కల్పించే ఒక అప్లికేషన్. ఇది ప్రాజెక్టుల పురోగతిని అంచనా వేయడానికి, పర్యవేక్షించడానికి సహాయపడుతుంది.
----------------------------------------
ఇంటర్నెట్-ఆధారిత డెయిరీ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(ఐ-డీఐఎస్)
పాడి పరిశ్రమలో సాక్ష్యం ఆధారిత ప్రణాళిక, సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడానికి సమర్థవంతమైన డేటా నిర్వహణ కీలకం. జాతీయ పాడి పరిశ్రమాభివృద్ధి మండలి(ఎన్‌డీడీబీ) అభివృద్ధి చేసిన ఇంటర్నెట్-ఆధారిత డెయిరీ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(ఐ-డీఐఎస్), పాల సహకార సంఘాలు, మిల్క్ యూనియన్లు, ఫెడరేషన్లు, ఇతర అనుబంధ యూనిట్ల కోసం క్రమపద్ధతిలో డేటాను సేకరించడానికి, పంచుకోవడానికి, విశ్లేషించడానికి ఒక ఏకీకృత డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ను అందిస్తుంది. ఈ వ్యవస్థ పాల సేకరణ, అమ్మకాలు, ఉత్పత్తుల తయారీ, పంపిణీ, సాంకేతిక ఇన్‌పుట్‌ల సరఫరా వంటి పనితీరు సూచికలను పర్యవేక్షించడానికి వీలు కల్పిస్తుంది. అదే సమయంలో ప్రతి సంస్థ తన పనితీరును ఇతరులతో పోల్చుకోవడానికి అనుమతిస్తుంది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 198 పాల సంఘాలు, 29 మార్కెటింగ్ డెయిరీలు, 54 పశుగ్రాస ప్లాంట్లు, 15 ఫెడరేషన్లు ఐ-డీఐఎస్‌లో భాగంగా ఉన్నాయి. ఇవి విశ్వసనీయమైన, సమగ్రమైన జాతీయ సహకార డెయిరీ పరిశ్రమ డేటాబేస్ సృష్టికి దోహదపడుతున్నాయి. ఈ డేటా ఆధారిత పర్యావరణ వ్యవస్థ డెయిరీ రంగంలో వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడానికి, విధాన రూపకల్పనకు మద్దతు ఇస్తుంది. ఐ-డీఐఎస్‌ని సమర్థవంతంగా ఉపయోగించగల సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి, ప్రణాళిక, కార్యకలాపాల కోసం దాని సరైన వినియోగాన్ని నిర్ధారించడానికి ఎన్‌డీడీబీ పాల్గొనే యూనియన్ల అధికారుల కోసం క్రమం తప్పకుండా వర్క్‌షాప్‌లను కూడా నిర్వహిస్తోంది.
పాల రవాణా మార్గాల మెరుగుదల
భారతదేశ డెయిరీ సరఫరా గొలుసు విజయానికి సమర్థవంతమైన పాల సేకరణ, పంపిణీ చాలా ముఖ్యమైనవి. ఈ ప్రక్రియను మరింత పొదుపుగా, క్రమపద్ధతిలో చేయడానికి, జాతీయ పాడి పరిశ్రమాభివృద్ధి మండలి(ఎన్‌డీడీబీ) జీఐఎస్(జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్) సాంకేతికతను ఉపయోగించి పాల మార్గాల మెరుగుదల విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ డిజిటల్ విధానం పాల సేకరణ, పంపిణీ మార్గాలను డిజిటల్ మ్యాప్‌లపై మ్యాపింగ్ చేయడం ద్వారా మాన్యువల్ ప్రణాళికకు ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది. ఇది బహుళ మార్గాలను సులభంగా గుర్తించడానికి, డేటా ఆధారిత నిర్ణయాలకు మద్దతు ఇస్తుంది.
జీఐఎస్ ఆధారిత రూట్ ప్లానింగ్‌ను ఉపయోగించడం వల్ల రవాణా దూరం, ఇంధన ఖర్చులు, సమయం తగ్గుతాయి. దీనివల్ల పాల సేకరణ, సరఫరాలో సామర్థ్యం పెరుగుతుంది. ఎన్‌డీడీబీ ఆగస్టు 2022లో విదర్భ మరాఠ్వాడా డెయిరీ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు కింద ఈ ప్రక్రియను ప్రారంభించింది. అక్కడ నాలుగు పాల శీతలీకరణ కేంద్రాల మార్గాలను పునఃరూపకల్పన చేయడం వల్ల రవాణా ఖర్చులలో గణనీయమైన పొదుపు లభించింది. వారణాసి, అస్సాం, జార్ఖండ్, ఇండోర్ పాల సంఘాలలో కూడా ఇటువంటి ప్రయత్నాలు ప్రోత్సాహకరమైన ఫలితాలను ఇచ్చాయి.
సహకార సంఘాలు ఈ సాంకేతికతను అవలంబించడంలో సహాయపడటానికి ఎన్‌డీడీబీ వెబ్ ఆధారిత డైనమిక్ రూట్ ప్లానింగ్ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసింది. ఇది శాస్త్రీయ, వినియోగదారు అనుకూల పద్ధతిలో పనిచేస్తుంది. డెయిరీ సహకార సంఘాలకు ఉచితంగా అందుబాటులో ఉన్న ఈ సాధనం.. రియల్-టైమ్ రూట్ ప్లానింగ్‌ను అనుమతిస్తుంది. సాంకేతికతను సహకార సామర్థ్యంతో జోడించడం ద్వారా ఎన్‌డీడీబీకి చెందిన ఈ చొరవ భారతదేశ డెయిరీ రంగంలో సుస్థిరమైన, తక్కువ ఖర్చుతో కూడిన పాల రవాణాకు ఒక కొత్త ప్రమాణాన్ని నిర్దేశిస్తోంది.
ముగింపు
ప్రపంచ పాల ఉత్పత్తిలో నాలుగింట ఒక వంతు వాటాను కలిగి ఉన్న భారతదేశపు పాడి పరిశ్రమ జాతీయ పాడి పరిశ్రమాభివృద్ధి మండలి(ఎన్‌డీడీబీ) నేతృత్వంలో అద్భుతమైన డిజిటల్ మార్పు చెందుతోంది. ఎన్‌డీఎల్ఎం, ఏఎంసీఎస్, ఎన్‌డీఈఆర్‌పీ, ఎస్ఎస్ఎంఎస్, ఐ-డీఐఎస్, రూట్ ఆప్టిమైజేషన్ సాధనాల వంటి ఏకీకృత వేదికల ద్వారా ఈ రంగం మరింత సామర్థ్యం, పారదర్శకత, సమ్మిళితత్వం వైపు పయనిస్తోంది. ఈ వ్యవస్థలు కేవలం ఉత్పాదకతను పెంచడమే కాకుండా లక్షల మంది చిన్న, సన్నకారు పాల రైతులు ఆధునిక, సాంకేతిక ఆధారిత వ్యవస్థతో నేరుగా అనుసంధానమయ్యేలా చూస్తున్నాయి.
సహకార శక్తిని డిజిటల్ ఆవిష్కరణలతో కలపడం ద్వారా భారతదేశం సుస్థిర పాడి పరిశ్రమ అభివృద్ధిలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది. ఇక్కడ ప్రతి లీటరు పాలు, ప్రతి జంతువు అనుసంధానించిన, గుర్తించదగిన, సమర్థవంతమైన విలువ గొలుసులో భాగంగా ఉంటాయి. కొనసాగుతున్న ఈ ప్రయత్నాలు ఉత్పత్తిదారులు, వినియోగదారులిద్దరికీ సేవలందించే డిజిటల్ సాధికారత కలిగిన డెయిరీ రంగాన్ని సృష్టించాలనే ఎన్‌డీడీబీ విజన్‌ను ప్రతిబింబిస్తాయి. ఇది సురక్షితమైన, స్థిరమైన, సాంకేతికతతో కూడిన పాల ఉత్పత్తిలో భారతదేశాన్ని ప్రపంచ నాయకుడిగా నిలబెట్టే లక్ష్యం వైపు నడిపిస్తుంది.
***
(Explainer ID: 156955)
आगंतुक पटल : 16
Provide suggestions / comments