• Skip to Content
  • Sitemap
  • Advance Search
Economy

లోక్ అదాలత్‌లు: ప్రజల ప‌క్షాన మాట్లాడే న్యాయం

ప్రతి పౌరుడికి అందుబాటులో, కరుణతో, సకాలంలో పరిష్కారం చూపే వేదిక

Posted On: 13 DEC 2025 1:46PM

కీల‌కాంశాలు
- లోక్ అదాలత్‌లు స్నేహపూర్వకమైన, అనధికారిక వేదికలు, ఇక్కడ వివాదాలు పోటీతో కాకుండా పరస్పర అంగీకారంతో పరిష్కార‌మ‌వుతాయి.
- జాతీయ స్థాయి నుంచి తాలూకా స్థాయి వరకు భారతదేశ‌వ్యాప్తంగా సకాలంలో, స్థానికంగా అందుబాటులో ఉండే వివాద పరిష్కారాన్ని అందిస్తాయి.
- జాతీయ, ఈ-లోక్ అదాలత్‌లు ప్రతి సంవత్సరం లక్షలాది కేసులను పరిష్కరిస్తూ, వేగవంతమైన, తక్కువ ఖర్చుతో పరిష్కారాలను అందిస్తాయి. కోర్టుల్లో పేరుకుపోయిన కేసుల సంఖ్యను తగ్గిస్తాయి.
- శాశ్వత లోక్ అదాలత్‌లు రాజీ, తీర్పు ద్వారా ముఖ్యమైన సేవలపై వచ్చే వివాదాలను పరిష్కరిస్తాయి. పౌరులకు సకాలంలో, నిష్పక్షపాత ఫలితాలను అందిస్తాయి.

ప‌రిచ‌యం: న్యాయం ప్రజలను కలుసుకునే చోట, ఆశకు ఒక గొంతు
ఒక చిన్న జిల్లా కేంద్రంలో నిశ్శబ్దమైన శనివారం ఉదయం సాధారణంగా నిశ్శబ్దంగా ఉండే కోర్టు ప్రాంగణం ఒక విధమైన ఉత్సాహంతో సందడిగా ఉంది. బయట భూమి తగాదాలున్న రైతులు, డబ్బుల చెల్లింపు సమస్యలు పరిష్కరించుకుంటున్న దుకాణదారులు, చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యల ప‌రిష్కారానికి ఎదురుచూస్తున్న కుటుంబాలు, ఫైళ్ల‌ను పరిశీలిస్తున్న బ్యాంక్ ఉద్యోగులు ఈరోజు తమకు న్యాయం జరుగుతుందనే ఆశతో గుమిగూడారు. ఇక్కడ ఉత్కంఠభరితమైన కోర్టు సన్నివేశాలు లేవు. కఠినమైన న్యాయ ప‌రిభాష లేదు. బదులుగా చర్చలు, సంభాషణలు, న్యాయం చాలా సులభంగా లభిస్తుందనే భావనతో ఉపశమనం కనిపిస్తుంది.

ఇది లోక్‌ అదాలత్‌ స్ఫూర్తి. భారతదేశంలోని ప్రజల-కేంద్రీకృత వేదిక ఇది. ఇక్కడ వివాదాలు పోటీ ద్వారా కాకుండా పరస్పర అంగీకారంతో పరిష్కార‌మ‌వుతాయి. లోక్‌ అదాలత్‌లు భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన ప్రత్యామ్నాయ వివాద పరిష్కార యంత్రాంగాలలో ఒకటిగా గుర్తింపు పొందాయి. కోర్టు ప్రాంగణాలలో, కమ్యూనిటీ భవనాలలో లేదా ఈ-లోక్‌ అదాలత్‌ల ద్వారా వర్చువల్‌గా పౌరులకు న్యాయాన్ని చేరువ చేస్తాయి. సమయాన్ని ఆదా చేస్తాయి. ఖర్చులను తగ్గిస్తాయి. కోర్టులపై భారాన్ని తగ్గిస్తాయి. సాధారణ న్యాయస్థానాలలా కాకుండా లోక్‌ అదాలత్‌లు అనధికారికంగా, స్నేహపూర్వక వాతావరణంలో నడుస్తాయి. ఇక్కడ పార్టీలు కలిసి కూర్చుని ఇద్దరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాలను కనుగొంటాయి. ఇక్కడ కోర్టు ఖర్చులు ఉండ‌వు. సంక్లిష్టమైన ప్రక్రియలు లేవు. గెలుపు ఓటములు ఉండవు. ఎవరు న్యాయంగా ఉన్నారో నిర్ణయించడం కంటే, తమ జీవితాలను ముందుకు నడిపించడానికి ప్రజలకు ఆచరణాత్మక, న్యాయమైన, వేగవంతమైన పరిష్కారాన్ని కనుగొనడంలో సహాయపడటమే వీటి ప్రధాన లక్ష్యం.

చట్టపరమైన పునాది: న్యాయ సేవల అధికారాల చట్టం-1987

లోక్ అదాలత్‌లను 1987 నాటి న్యాయ సేవల చట్టంలో భాగంగా చేర్చడం ద్వారా భారతదేశం చట్టబద్ధమైన, మానవత్వంతో కూడిన న్యాయ విధానాన్ని పటిష్టం చేస్తోంది.

లోక్‌ అదాలత్‌లు ఎక్క‌డో ఏర్పడలేదు. ఆదాయం, నేపథ్యం ఏదైనా, ప్రతి ఒక్కరూ గౌరవంగా న్యాయం పొందేలా చూడాలనే జాతీయ నిబద్ధత నుంచి ఇవి రూపుదిద్దుకున్నాయి. ఈ నిబద్ధతకు 1987 నాటి లీగల్ సర్వీసెస్ అథారిటీస్ చట్టం ఒక చట్టబద్ధమైన పునాది వేసింది. ఉచిత న్యాయ సహాయం, ప్రత్యామ్నాయ వివాద పరిష్కార పద్ధతులను చిన్నచిన్న కార్యక్రమాల నుంచి ఒక వ్యవస్థీకృత, దేశవ్యాప్త వ్యవస్థగా మార్చిన ఒక ముఖ్యమైన చట్టం ఇది.

- ఈ చట్టం లోక్‌ అదాలత్‌ల నిర్మాణం, అధికారాలు, విధులు నిర్దేశిస్తూ రాజీ ద్వారా కుదిరిన పరిష్కారాలు కోర్టు తీర్పులతో సమానమైన చట్టబద్ధతను కలిగి ఉంటాయని నిర్ధారిస్తోంది.

- శాశ్వత చట్టపరమైన మద్దతు లోక్ అదాల‌త్‌ల‌ విశ్వసనీయతను పెంచడమే కాకుండా, సాంప్రదాయ కోర్టుల వెలుపల సామరస్యంగా వివాదాలను పరిష్కరించుకోవడానికి పౌరులకు, సంస్థలకు మరింత నమ్మకాన్ని ఇస్తుంది.

- లోక్‌ అదాలత్‌లో కేసు దాఖలు చేసినప్పుడు కోర్టు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.


లీగల్ సర్వీసెస్ అథారిటీస్ చట్టం-1987లోని ముఖ్యమైన నిబంధనలు

వివిధ స్థాయిలలో(రాష్ట్రం, జిల్లా, తాలూకా, హైకోర్టు, సుప్రీంకోర్టు) లోక్‌ అదాలత్‌లు ఏర్పాట‌య్యాయి. ఇవి దేశవ్యాప్తంగా అందుబాటులో ఉండే వివాద పరిష్కార వ్యవస్థగా ఉన్నాయి.

కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను, న్యాయస్థానానికి వెళ్లకుండా పరిష్కరించుకోగల విషయాలను లోక్‌ అదాలత్‌లకు పంపడం ద్వారా ఎక్కువ కాలం న్యాయ పోరాటం లేకుండా త్వరగా పరిష్కారమ‌య్యే అవకాశాన్ని అందిస్తాయి.

లోక్‌ అదాలత్‌లు రాజీ కుదిర్చే నమూనాలో పని చేస్తాయి. ఇవి సహకారంతో, పోటీతత్వం లేని విధానాన్ని కలిగి ఉంటాయి.

కేసు పరిష్కారమైనప్పుడు చెల్లించిన కోర్టు ఫీజులు వాపసు వ‌స్తాయి. ఇది పరిష్కారాలను ప్రోత్సహించడంతో పాటు న్యాయం కోరుతున్నవారికి ఉపశమనం కలిగిస్తుంది.

లోక్‌ అదాలత్ అవార్డు తుది నిర్ణ‌యంగా, సివిల్ కోర్టు డిక్రీగా పరిగణిస్తారు. వేగవంతమైన పరిష్కారం, అమలుకు వీలుగా అప్పీలు అనుమతి ఉండ‌దు.

ప్రజా వినియోగ సేవల కోసం శాశ్వత లోక్‌ అదాలత్‌ల స్థాపన, అధికార పరిధి వేగవంతమైన పరిష్కారాలను అందిస్తోంది.

సంస్థాగత నిర్మాణం: జాతీయ స్థాయి నుంచి తాలూకా స్థాయి వరకు నిర్మాణం

నాలుగు-స్థాయిల సంస్థాగత నమూనా లోక్‌ అదాలత్‌లు ప్రధాన నగరాల్లోని ఆర్భాట కార్యక్రమాలకు మాత్రమే పరిమితం కాకుండా పట్టణాలు, చిన్న నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా పనిచేసే, అందుబాటులో ఉండే వ్యవస్థగా ప‌నిచేస్తోంది.

లోక్‌ అదాలత్‌ వ్యవస్థ బలం దాని నాలుగు-స్థాయిల నిర్మాణంలోనే ఉంది. ఇది సుప్రీంకోర్టు నుంచి తాలూకా కోర్టుల వరకు ప్రతి స్థాయి పరిపాలనలో ఉన్న పౌరులకు అందుబాటులో ఉంటుంది. ఈ సంస్థాగత నిర్మాణం ప్రతి ఒక్కరికీ త్వరితగతమైన, ఆర్థికంగా భరించగలిగే, రాజీతో కూడిన న్యాయం అందుబాటులో ఉండేలా చూస్తుంది. దేశవ్యాప్తంగా ఒకే విధమైన విధానాన్ని కొనసాగిస్తూ, స్థానిక అవసరాలకు అనుగుణంగా పనిచేసే న్యాయ సేవల ప్రాధికార సంస్థ‌ల‌ సమన్వయంతో ఇది కొనసాగుతుంది.

నాలుగు-స్థాయిల వ్యవస్థాగత నిర్మాణం

స్థాయి & నాయకత్వం

కీలక విధులు

భారతదేశ ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో జాతీయ న్యాయ సేవల సంస్థ(ఎన్ఏఎల్ఎస్ఏ)
విధానపరమైన దిశానిర్దేశం, నిబంధనలు, జాతీయ లొక్‌ అదాలత్ క్యాలెండర్, పర్యవేక్షణ, సమన్వయం.


హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, కార్యనిర్వాహక అధ్యక్షుని ఆధ్వర్యంలో రాష్ట్ర న్యాయ సేవల‌ సంస్థ(ఎస్ఎల్ఎస్ఏ).
ఎన్ఏఎల్ఎస్ఏ విధానాన్ని అమలు చేయడం, లోక్‌ అదాలత్‌లను నిర్వహించడం(హైకోర్టు వ్యవహారాలతో సహా), న్యాయ సహాయం అందించ‌డం, నివారణాత్మక న్యాయ సేవలను అందించ‌డం.

జిల్లా, సెషన్స్‌ న్యాయమూర్తి పరిధిలోని జిల్లా న్యాయ సేవల‌ సంస్థ(డీఎల్ఎస్ఏ)
తాలూకా న్యాయ సేవా కమిటీలతో(టీఎల్ఎస్ఏ) సమన్వయం చేసుకుని జిల్లా స్థాయి లోక్‌ అదాలత్‌లను ఏర్పాటు చేయడం, న్యాయ సహాయం అందించడం, స్థానిక స్థాయిలో అమలు చేయడం.

సీనియర్ జ్యుడీషియల్ అధికారి ఆధ్వ‌ర్యంలో తాలుకా న్యాయ సేవల సంస్థ(టీఎల్ఎస్ఏ).
తాలూకా/మండల స్థాయిలో లోక్‌ అదాలత్‌ల నిర్వహణ, క్షేత్ర‌స్థాయి స్థాయి న్యాయ సహాయం అందించ‌డం, పౌరులకు మొదటి ప్రాధాన్యతలో న్యాయం పొందే అవకాశం కల్పించడం.

సులభంగా, సకాలంలో, ప్రజలకు చేరువ‌లో న్యాయం అందించాల‌నే ఆశ ఈ నిర్మాణంతో లక్షలాది మందికి నిజమయ్యే అవకాశం ఉంది.

జాతీయ లోక్‌ అదాలత్‌లు(ఎన్ఎల్ఏ): లక్ష్యం ఆధారిత అమలు విధానం

మీకు తెలుసా?
ప్రతి సంవత్సరం ఎన్ఏఎల్ఎస్ఏ జాతీయ లోక్‌అదాలత్ క్యాలెండర్‌ను విడుదల చేస్తుంది. అన్ని కోర్టులలో ఏకకాలంలో జరిగే సమావేశాల తేదీలను ఇది ముందస్తుగా ప్రకటిస్తుంది.

ముందస్తుగా నిర్ణయించిన తేదీల వ‌ల్ల‌ కోర్టులు, న్యాయవాదులు, ప్రభుత్వ శాఖలు కేసులను గుర్తించి, ఫైళ్లను సిద్ధం చేసుకుని, వేగంగా పరిష్కారానికి ప్రయత్నించడానికి వీలవుతుంది.

లోక్ అదాలత్‌లు వివిధ అధికార పరిధులలో ఏడాది పొడవునా కొనసాగుతూ ఉంటాయి. జాతీయ లోక్ అదాలత్‌లు ఈ వ్యవస్థను మరింత విస్తృతం చేస్తూ దేశవ్యాప్తంగా అన్ని స్థాయిల న్యాయస్థానాల్లో ఒకే రోజున ఏకకాలంలో విచారణలను నిర్వహిస్తాయి. తద్వారా నిర్ణీత సమయంలో ఎక్కువ సంఖ్యలో కేసులను పరిష్కరించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంటాయి. జాతీయ లోక్ అదాలత్ సాధారణ ప్రక్రియలో కేసును రెఫర్ చేసే ముందు సంబంధిత ప‌క్షాలకు తమ వాదనలు వినిపించేందుకు తగిన అవకాశం ఇస్తుంది. కోర్టు లేదా న్యాయ సేవల సంస్థ(ఎస్ఎల్ఎస్ఏ లేదా డీఎల్ఎస్ఏ) ద్వారా కేసులను(ముందస్తుగా దాఖలైనవి, పెండింగ్‌లో ఉన్నవి) లోక్ అదాలత్‌లకు పంపుతారు. రెండు పార్టీల అంగీకారంతో లేదా ఒక పార్టీ అభ్యర్థన మేరకు రాజీ కుదిరే అవకాశం ఉందని కోర్టు భావిస్తే పెండింగ్‌లో ఉన్న కేసును కోర్టు సిఫార్సు చేయవచ్చు. అలాగే, కోర్టు స్వయంగా కూడా కేసును పరిష్కరించడానికి అనుకూల‌మ‌ని భావిస్తే సిఫార్సు చేయవచ్చు. ఏదైనా ప‌క్షం దాఖలు చేసిన అభ్యర్థన ద్వారా ముందస్తు వివాదాలను కూడా పంపవచ్చు.

కరోనా మహమ్మారి సమయంలో కూడా ఈ క్యాలెండరు ఆధారిత వ్యవస్థ ప‌నిచేసింది. ఇందుకుగానూ ఈ-లోక్‌ అదాలత్‌లు ప్రారంభ‌మ‌య్యాయి. ఇవి సుదూరంగా ఉండి పాల్గొనేందుకు, న్యాయాన్ని ప్రజల ఇళ్ల‌కు చేరవేసేందుకు దోహదపడ్డాయి.

ప్రపంచ న్యాయ వ్యవస్థలో ఇంతటి స‌మ‌న్వ‌యం, స‌మీక‌ర‌ణ‌ ఎన్నడూ లేదు. వేలాది బెంచ్‌లు ఒకే రోజు పని చేస్తాయి. న్యాయాధికారులు, రాజీమార్గాలను సూచించేవారు, పారా లీగల్ వాలంటీర్లు, సిబ్బంది సహాయంతో సాధారణ కోర్టు సముదాయాలు పరిష్కారాలు, రాజీ కుదిర్చే కేంద్రాలుగా మారుతున్నాయి.

యుద్ధ‌ప్రాతిప‌దిక‌న జ‌రిగే ఈ ప్రయత్నాల ఫలితాలు అద్భుతమైనవి. ఇవి కేవలం గణాంకాలు మాత్రమే కాదు, కుటుంబాలకు ఉపశమనం కలిగించడాన్ని, చిన్న వ్యాపారులు వివాదాలను పరిష్కరించుకోవడాన్ని, ప్రమాద బాధితులకు నష్టపరిహారం అందజేయడాన్ని సుల‌భ‌త‌రం చేస్తున్నాయి. సంవత్సరాల తరబడి పెండింగ్‌లో ఉన్న కేసుల వల్ల సమయం, వనరులు, మానసిక శక్తిని కోల్పోయిన ఎందరో బయటపడటాన్ని ఉప‌యోగ‌ప‌డుతున్నాయి.

జాతీయ లోక్‌ అదాలత్‌లు న్యాయవ్యవస్థ ఒక ప్రచార ధోరణిని అనుసరించినప్పుడు,  వేగంతో పాటు సున్నితత్వం, న్యాయం, కరుణతో కూడిన సామర్థ్యం ప్ర‌ద‌ర్శించిన‌ప్పుడు ఎలాంటి ఫ‌లితాలు సాధ్యమో చూపిస్తున్నాయి.

జాతీయ లోక్‌ అదాలత్‌: విధానం
- లీగల్ సర్వీసెస్ అథారిటీస్ చట్టం-1987లో నిర్దేశించిన ప్రక్రియ ప్రకారం కేసులను సూచిస్తాయి.
- జాతీయ లోక్ అదాలత్ షెడ్యూల్ చేసిన తేదీకి ముందు రాజీ కుదిర్చే అవకాశాలు ఉండేలా ముందస్తు లోక్ అదాలత్ లేదా ముందస్తు సయోధ్య విచారణలు నిర్వహించడానికి అవసరమైన ఆదేశాలు జారీ చేస్తాయి.
- లోక్ అదాలత్‌లో పరిష్కార‌మైన‌ పెండింగ్ కేసుల వివరాలను నేషనల్ జ్యుడిషియల్ డేటా గ్రిడ్(ఎన్‌జేడీజీ)లో నమోదు చేస్తారు. తద్వారా సాంకేతికత లేదా డిజిటల్ వేదికల వినియోగాన్ని ప్రోత్సహిస్తాయి. బాధిత పక్షాల భాగస్వామ్యాన్ని పెంచడానికి విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాయి.

శాశ్వత లోక్‌ అదాలత్‌లు(పీఎల్ఏ): ప్రజా వినియోగ సేవలలో వేగవంతమైన ఉపశమనం కల్పిస్తున్నాయి.

విస్తృతి
ప్రజా వినియోగ సేవలు(రవాణా, విద్యుత్, నీరు, తపాల, టెలికాం మొదలైనవి).

అధికార ప‌రిధి: రూ. 1 కోటి వరకు

ప్యానెల్ కూర్పు: ఛైర్మన్ + ఇద్ద‌రు సభ్యులు(త‌గు నైపుణ్యం ఉన్నవారు)

శాశ్వత లోక్‌ అదాలత్‌లు(పీఎల్ఏ) లీగ‌ల్ స‌ర్వీసెస్ అథారిటీస్‌ చట్టం-1987లోని సెక్షన్లు 22బీ-22ఈ ప్రకారం రవాణా, టెలికమ్యూనికేషన్లు, విద్యుత్‌, నీటి సరఫరా, పోస్టల్‌ సేవలు వంటి ప్రజా వినియోగ సేవల సంబంధిత వివాదాలను పరిష్కరించే ఒక ముఖ్యమైన యంత్రాంగంగా అవతరించాయి. ఇవి, న్యాయస్థానానికి వెళ్లకుముందు రాజీ, పరిష్కారానికి అంకితమైన ప్రత్యేక వేదికలుగా పనిచేస్తాయి.

సాధారణ లోక్‌ అదాలత్‌లలా కాకుండా ఈ సంస్థలు శాశ్వత వేదికలుగా కొనసాగుతాయి. రాజీ కుదరని పక్షంలో వివాదాలను పరిష్కరించే అధికారం వీటికి ఉంది. దీని ద్వారా క‌చ్చితమైన పరిష్కారం లభిస్తుంది. శాశ్వత లోక్‌ అదాలత్ ఇచ్చే తీర్పు అన్ని ప‌క్షాల‌ వారికి వ‌ర్తిస్తుంది.

ప‌నితీరు: ల‌క్ష‌ల‌ మంది జీవితాలు, లెక్క‌కు మించిన‌ పరిష్కారాలు
భారతదేశంలోని లోక్‌ అదాలత్‌లు ఇటీవలి సంవత్సరాలలో వేగవంతమైన, తక్కువ ఖర్చుతో కూడిన‌, సులభంగా అందుబాటులో ఉండే న్యాయాన్ని అందించడంలో నిరంతరం కృషి చేస్తూ వస్తున్నాయి. జాతీయ, రాష్ట్ర, శాశ్వత లోక్‌ అదాలత్‌లతో పాటు డిజిటల్ ఈ-లోక్‌ అదాలత్‌లు కలిసి పనిచేస్తూ దావా వేయడానికి ముంద‌స్తు ద‌శ‌లో ఉన్న కేసుల నుంచి పెండింగ్‌లో ఉన్న కోర్టు వ్యవహారాల వరకు వివిధ రకాల వివాదాలను పరిష్కరిస్తున్నాయి. ఈ ప్రయత్నాల ద్వారా సాంప్రదాయ కోర్టులపై భారం గణనీయంగా తగ్గడమే కాకుండా పౌరులకు సకాలంలో పరిష్కారాలు, తీర్పులు లభించాయి. ప్రత్యామ్నాయ వివాద పరిష్కార పద్ధతులపై ప్రజలకు నమ్మకం పెరగడానికి, న్యాయవ్యవస్థతో పాటు వాదించేవారికి సమయం, వనరులు గణనీయంగా ఆదా అవ్వడానికి ఇది సహాయపడింది. పెద్ద సంఖ్య కేసుల ప‌రిష్కార‌మే ఇందుకు నిదర్శనం.

ముగింపు: వివాదాల పరిష్కారం, నమ్మకం తిరిగి నెలకొల్పడం, జీవితాలకు కొత్త‌ ఊపిరి
దేశవ్యాప్తంగా ఉన్న కోర్టులలో బిజీగా సాగిన లోక్‌ అదాలత్‌ల‌ ముగింపుతో నిశ్శబ్దమైన సంతృప్తి నెలకొంటుంది. లోక్‌ అదాలత్‌లు, శాశ్వత లోక్‌ అదాలత్‌లు, ఈ-లోక్‌ అదాలత్‌లతో కలిసి న్యాయం అందుబాటులో ఉండాలని, భయపెట్టేలా కాదని చాటి చెబుతున్నాయి. న్యాయం అనేది ప్రజల పట్ల దయతో, వారికి సాధికారికత కల్పించేలా ఉండాలి. ప్రతి పరిష్కారం ఒక అవగాహనతో ముడిపడి ఉంటుంది. ప్రతి పరిష్కారమైన కేసు పౌరులకు, వ్యవస్థకు మధ్య నమ్మకాన్ని పునరుద్ధరిస్తుంది. లోక్‌ అదాలత్‌ వ్యవస్థ నిశ్శబ్దంగా, నిరంతరం న్యాయం అంటే కేవలం చట్టాలు, కోర్టులు మాత్రమే కాదని, ప్రజల గౌరవం, న్యాయంగా, ఆశతో జీవితంలో ముందుకు సాగే హక్కు గురించి గుర్తు చేస్తుంది.

 

***

(Backgrounder ID: 156509) आगंतुक पटल : 4
Provide suggestions / comments
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Bengali , Gujarati , Kannada
Link mygov.in
National Portal Of India
STQC Certificate