Technology
పరిశోధన, ఆవిష్కరణల్లో భారత్ ముందడుగు
రూ.లక్ష కోట్ల ఆర్డీఐ పథకంతో భారతదేశ పరిశోధన, ఆవిష్కరణలకు బలం
Posted On:
04 NOV 2025 5:13PM
కీలకాంశాలు
- రూ.లక్ష కోట్ల ఆర్డీఐ పథకం ప్రారంభంతో ప్రైవేటు నేతృత్వంలోని ఆవిష్కరణలకు బలం.
- ఆర్&డీపై భారతదేశ వ్యయం 2010-11లో రూ.60,196 కోట్లు ఉండగా, 2020-21కి రూ.1.27 కోట్లకు పెరిగింది.
- ఆర్&డీపై మొత్తం వ్యయంలో కేంద్ర ప్రభుత్వ వాటా 43.7%.
పరిచయం
భారతదేశ పరిశోధన, అభివృద్ధి(ఆర్&డీ) వ్యవస్థ వేగంగా మారుతోంది. ఆవిష్కరణల ఆధారిత వృద్ధిపై దేశం బలంగా దృష్టి సారించడం ఇందుకు దోహదపడుతోంది. శాస్త్ర, సాంకేతికతపై పెట్టుబడి స్థిరంగా పెరగడానికి తోడుగా స్పష్టమైన విధాన మార్గదర్శకం, వ్యూహాత్మకంగా నిధుల కేటాయింపు, సంస్థాగతమైన సంస్కరణలు జరుగుతున్నాయి. పరిశోధన, ఆవిష్కరణల ద్వారా కీలకమైన సవాళ్లను ఎదుర్కొనేలా దృఢమైన, విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థను నిర్మించాలనే భారతదేశ ఆశయాన్ని ప్రతిబింబిస్తోంది.

వికసిత్ భారత్@2047 దిశగా ప్రయాణంలో ఆర్&డీని ప్రభుత్వం కేంద్రంగా ఉంచింది. ఆరోగ్య, ఇంధన, డిజిటల్ పరివర్తన, తయారీ రంగాల పురోగతికి శాస్త్ర, సాంకేతికత దోహదపడతాయని ప్రభుత్వం గుర్తించింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యాన్ని మరింత పెంచేందుకు, విద్యాసంస్థలు, పరిశ్రమ మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు, సరికొత్త సాంకేతికతలను ప్రోత్సహించేందుకు చేస్తున్న ప్రయత్నాలు క్రియాశీల ఆవిష్కరణల వ్యవస్థను రూపుదిద్దాయి. భారత్ ముందుకు సాగుతున్న దిశలో స్థిరమైన, సమ్మిళిత వృద్ధి సాధించడంలో పరిశోధన, ఆవిష్కరణలు కీలకంగా ఉంటాయి.
భారతదేశ ఆర్&బీ వ్యయం, వృద్ధిలో ధోరణులు
గత దశాబ్దకాలంగా పరిశోధన, ఆవిష్కరణల పట్ల భారతదేశ నిబద్ధత స్థిరంగా బలోపేతమైంది. ప్రభుత్వ నిరంతర విధానపరమైన దృష్టి, సంస్థాగత సంస్కరణలు ఆర్&డీ వ్యయంలో స్థిరమైన పెరుగుదలకు దోహదపడ్డాయి.

కీలక ధోరణులు, గణాంకాలు
- భారతదేశ పరిశోధన, అభివృద్ధిపై స్థూల వ్యయం(జీఈఆర్‌డీ) పదేళ్లలో రెట్టింపు కంటే ఎక్కువైంది. ఇది 2010-11లో రూ.60,196.75 కోట్లు ఉండగా 2020-21కి రూ.1,27,380.96కి పెరిగింది.
- ఆర్&డీపై తలసరి వ్యయం కూడా స్థిరమైన వృద్ధిని కనబరిచింది. 2007-08లో 29.2 డాలర్లుగా ఉన్న పీపీపీ 2020-21లో 42 డాలర్లకు పెరిగింది.(పీపీపీ అంటే కొనుగోలు శక్తి సమానత్వం. దేశాల మధ్య ధరల స్థాయిల్లో తేడాలను ఇది సర్దుబాటు చేస్తుంది. ఖర్చు చేసే సామర్థ్యాన్ని కచ్చితత్వంతో పోల్చేందుకు ఇది అవకాశం కల్పిస్తుంది.)
- జీఈఆర్‌డీలో ప్రభుత్వ రంగ వాటా దాదాపు 64% కాగా, ప్రైవేటు రంగం వాటా దాదాపు రూ.36%.
- అమెరికాలోని ఎన్ఎస్ఎఫ్ ఇచ్చిన సైన్స్ అండ్ ఇంజినీరింగ్(ఎస్&ఈ) సూచీ-2022 ప్రకారం 2018-19లో భారత్ 40,813 డాక్టరేట్లు ప్రదానం చేయగా, ఇందులో 24,474(60%) శాస్త్ర, సాంకేతికతకు చెందినవి. ఎస్&ఈ పీహెచ్‌డీల్లో అమెరికా(41,071), చైనా(39,768) తర్వాత భారత్ ప్రపంచంలో 3వ స్థానంలో నిలిచింది.
- భారత్‌లో పేటెంట్‌ల దాఖలు సంఖ్య 2021-24లో 24,326 ఉండగా 2024-25 కల్లా మూడు రెట్లు పెరిగి 69,176కు చేరుకుంది. దేశీయ ఆవిష్కరణల్లో గణనీయ పెరుగుదలను ఇది సూచిస్తోంది.
రీసెర్చ్ డెవెలప్‌మెంట్ అండ్ ఇన్నోవేషన్(ఆర్డీఐ) పథకం
రూ.లక్ష కోట్ల వ్యయంతో 2025 నవంబర్ 3న ప్రారంభమైన రీసెర్చ్ డెవెలప్‌మెంట్ అండ్ ఇన్నోవేషన్(ఆర్డీఐ) పథకం భారతదేశ పరిశోధన మరియు అభివృద్ధి వ్యవస్థను బలోపేతం చేసేందుకు చరిత్రాత్మక అడుగు. దేశ శాస్త్రీయ, సాంకేతిక పురోగతిని నడిపించే ప్రైవేటు రంగ ఆధారిత ఆవిష్కరణల వాతావరణాన్ని నిర్మించడం ఈ పథకం లక్ష్యం.
ఆవిష్కరణలు, పరిశోధనల వాణిజ్యీకరణ దిశగా ప్రైవేటు రంగ కీలకపాత్రను గుర్తిస్తూ ఆర్డీఐ పథకం కాలపరిమితిని పొడిగిస్తూ తక్కువ లేదా సున్నా వడ్డీ రేటుకు దీర్ఘకాల ఫైనాన్సింగ్, రీఫైనాన్సింగ్ అందిస్తుంది. వేగంగా వృద్ధి చెందుతున్న, వ్యూహాత్మక రంగాలు సహా వివిధ రంగాల్లో భారీగా ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించడం ఈ పథకం లక్ష్యం.
గ్రోత్, రిస్క్ క్యాపిటల్‌ను అందించడం ద్వారా ప్రైవేటు పరిశోధనలకు నిధుల విషయంలో ఉన్న ప్రస్తుత సవాళ్లను ఈ పథకం పరిష్కరిస్తుంది. ఆవిష్కరణలకు సులభతరం చేయడం, సాంకేతికత స్వీకరణను ప్రోత్సహించడం, నూతన రంగాల్లో పోటీతత్వాన్ని ప్రోత్సహించడంపై ఈ పథకం దృష్టి సారిస్తుంది.
ఆర్డీఐ పథకం కీలక లక్ష్యాలు ఇవి:
ప్రైవేటు రంగ భాగస్వామ్యానికి ప్రోత్సాహం: ఆర్థిక భద్రత, వ్యూహాత్మక అవసరాలు, స్వయం సమృద్ధి కోసం కీలకమైన వేగంగా అభివృద్ధి చెందున్న సన్‌రైజ్ సెక్టార్‌తో పాటు ఇతర రంగాల్లో పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణలను పెంచడం.
మార్పు తెచ్చే ప్రాజెక్టులకు నిధుల సమీకరణ: ఆలోచన నుంచి విపణికి వేగంగా తీసుకురావడానికి అధిక సాంకేతికత కలిగిన ప్రాజెక్టులకు సహకరించడం.
క్లిష్టమైన సాంకేతికతల సముపార్జనకు సహకారం: వ్యూహాత్మకంగా అధిక ప్రాధాన్యత కలిగిన సాంకేతికతలను పొందేందుకు అవకాశం కల్పించడం.
డీప్-టెక్ సాంకేతికతకు నిధులు: డీప్ టెక్నాలజీ అంకుర సంస్థలు, ఆవిష్కరణల ఆధారిత సంస్థలకు నిధులు అందించే వ్యవస్థను బలోపేతం చేయడం.
ఈఎస్‌టీఐసీ 2025
ఎమర్జింగ్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నొవేషన్ కాంక్లేవ్(ఈఎస్‌టీఐసీ) 2025 ప్రారంభం సందర్భంగా 2025 నవంబర్ 3న రీసెర్చ్, డెవెలప్‌మెంట్ అండ్ ఇన్నొవేషన్(ఆర్డీఐ) పథకం ప్రారంభమైంది.
2025 నవంబర్ 3 నుంచి 5వ తేదీల మధ్య న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఈఎస్‌టీఐసీ-2025 జరిగింది. ఇది భారత్‌లో శాస్త్రీయ సహకారాన్ని, ఆవిష్కరణలను ముందుకు తీసుకెళ్లేందుకు ఉద్దేశించిన వార్షిక ప్రధాన కార్యక్రమం. నోబెల్ పురస్కార గ్రహీతలు, ప్రఖ్యాత శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలు, విధాననిర్మాతలు సహా విద్యా, పరిశోధన సంస్థలు, పరిశ్రమ, ప్రభుత్వానికి చెందిన దాదాపు 3,000 మందిని ఈ కార్యక్రమం ఒకే వేదికపైకి తీసుకొచ్చింది.

“వికసిత్ భారత్ 2047 - స్థిరమైన ఆవిష్కరణలు, సాంకేతిక పురోగతి, సాధికారత” అనే ఇతివృత్తంతో జరిగిన ఈఎస్‌టీఐసీలో నోబెల్ గ్రహీతలు, ప్రపంచ ఆలోచనాపరుల ప్లీనరీ ప్రసంగాలతో పాటు 11 ఇతివృత్తం ఆధారిత సాంకేతిక సమావేశాలు, ప్యానెల్ చర్చలు, 35కు పైగా డీప్-టెక్ అంకుర సంస్థలు, స్పాన్సర్ స్టాళ్ల ప్రదర్శనలు, యువ శాస్త్రవేత్తల ద్వారా పోస్టర్ ప్రజెంటేషన్లు వంటి అనేక కీలక కార్యక్రమాలు భాగం. ఆవిష్కరణలకు స్ఫూర్తినివ్వడం, సహకారాన్ని ప్రోత్సహించడం, వికసిత్ భారత్@2047 దిశగా భారతదేశ శాస్త్ర, సాంకేతికతకు మార్గాన్ని రూపొందించడం ఈ కార్యక్రమాల లక్ష్యం.
ఆవిష్కరణల కోసం సంస్థాగత, విధానపరమైన చట్రం
భారతదేశ ఆవిష్కరణల ప్రయాణం బలమైన సంస్థాగత చట్రం, ముందుచూపు విధాన చర్యల మార్గనిర్దేశంతో సాగుతోంది. శాస్త్రీయ పరిశోధనను బలోపేతం చేసేందుకు, ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు, సాంకేతికత ఆధారిత వృద్ధికి అనుకూల వాతావరణాన్ని తయారుచేసేందుకు గత కొన్నేళ్లుగా ప్రభుత్వం అనేక సంస్కరణలను తీసుకువచ్చింది. సరికొత్తగా ఉద్భవిస్తున్న రంగాల్లో పరిశోధన, ఆవిష్కరణలు, వ్యాపారంలో భారత్‌ను ప్రపంచ కేంద్రంగా మార్చడం ఈ కార్యక్రమాల లక్ష్యం.
అనుసంధాన్ నేషనల్ రిసెర్చ్ ఫౌండేషన్(ఏఎన్ఆర్ఎఫ్)
అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ చట్టం, 2023(25 ఆఫ్ 2023) ద్వారా ఏర్పాటైన అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్(ఏఎన్ఆర్ఎఫ్) 2024 ఫిబ్రవరి 4 నుంచి అమలులోకి వచ్చింది. ఇది శాస్త్ర, సాంకేతికతలో పరిశోధన, ఆవిష్కరణలు, వ్యవస్థాపకత కోసం ఉన్నత స్థాయి వ్యూహాత్మక మార్గనిర్దేశం చేస్తుంది.
ఏఎన్ఆర్ఎఫ్ నిధి, ఆవిష్కరణల నిధి, సైన్స్ అండ్ ఇంజినీరింగ్ పరిశోధన నిధి, ప్రత్యేక అవసరాల నిధులు లాంటి వివిధ మార్గాల ద్వారా 2023-28 మధ్యకాలంలో రూ.50,000 కోట్ల నిధులను సమీకరించడం ఈ ఫౌండేషన్ లక్ష్యం. ఇందులో రూ.14,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తాయి. మిగతా సహకారం పారిశ్రమలు, సేవా సంస్థలు వంటి ప్రభుత్వేతర మార్గాల ద్వారా సమకూరుతుంది. విద్యాసంస్థలు, పరిశ్రమ మధ్య బంధాన్ని బలోపేతం చేయడం, జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా అధిక ప్రభావం గల పరిశోధనలను ప్రోత్సహించడం కోసం ఏఎన్ఆర్ఎఫ్‌ను రూపొందించారు.
జాతీయ జియోస్పేషియల్ పాలసీ, 2022
జియోస్పేషియల్ రంగంలో 2035 కల్లా భారత్‌ను ప్రపంచ అగ్రగామిగా నిలిపే లక్ష్యంతో 2022 డిసెంబర్ 28న జాతీయ జియోస్పేషియల్ పాలసీ వచ్చింది. ఈ పాలసీ జియోస్పేషియల్ సమాచారం వినియోగాన్ని సులభతరం చేయడంతో పాటు పరిపాలన, వ్యాపారం, పరిశోధనల్లో ఈ సమాచార వినియోగాన్ని ప్రోత్సహించింది. జాతీయ, ఉప-జాతీయ స్థాయిల్లో జియోస్పేషియల్ మౌలిక సదుపాయాలు, సేవలు, వేదికల అభివృద్ధిని ఈ పాలసీ ప్రోత్సహిస్తోంది.
2030 కల్లా అధిక-నిర్దిష్టత కలిగిన టోపోగ్రాఫికల్ సర్వే, మ్యాపింగ్ వ్యవస్థ, యావత్ దేశానికి సమగ్ర డిజిటల్ ఎలివేషన్ నమూనా ఏర్పాటు చేయడం ఈ పాలసీ ప్రధాన లక్ష్యం. ఈ పాలసీ పౌరుల-కేంద్రీకృత విధానంతో రూపొందింది. తద్వారా ప్రజల డబ్బులతో ఉత్పత్తి చేసిన సమాచారం అందరికీ బహిరంగంగా, వాటాదారులు అందరికీ అందుబాటులో ఉండేలా చూస్తోంది.
భారత అంతరిక్ష విధానం, 2023
2023లో ఆమోదం పొందిన భారత అంతరిక్ష విధానం భారతదేశ అంతరిక్ష రంగానికి ఏకీకృత, ముందుచూపుతో కూడిన చట్రాన్ని అందిస్తోంది. అంతరిక్ష రంగంలో ప్రభుత్వేతర సంస్థల పూర్తిస్థాయి భాగస్వామ్యాన్ని అవకాశం కల్పించిన 2020లో వచ్చిన అంతరిక్ష సంస్కరణలపై ఈ విధానాన్ని రూపొందించారు. అంతరిక్ష సామర్థ్యాలను పొంపొందించడంతో పాటు, వాణిజ్య అంతరిక్ష పరిశ్రమ అభివృద్ధిని ప్రోత్సహించడం, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల మధ్య సహకారాన్ని మెరుగుపర్చడం ఈ విధానం లక్ష్యాలు. సామాజిక-ఆర్థిక అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, శాంతియుతంగా బాహ్య అంతరిక్ష అన్వేషణను ఈ విధానం మద్దతు ఇస్తోంది.
స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రభుత్వ సంస్థ ఇన్-స్పేస్ ఏర్పాటు ఈ పాలసీలో కీలకం. అంతరిక్ష కార్యకలాపాల ప్రోత్సాహం, మార్గదర్శకం, అనుమతి ఇవ్వడం ఈ సంస్థ బాధ్యత. అంతరిక్ష వ్యవస్థలో సరళీకృత వ్యాపారాన్ని ప్రోత్సహించేందుకు, భాగస్వాములు అందరికీ సమాన అవకాశాలు దక్కేలా ఇన్‌స్పేస్ మార్గదర్శకాలను జారీ చేస్తోంది.
బయోఈ3 విధానం, 2024
2024 ఆగస్టులో ఆమోదం పొందిన బయోఈ3 విధానం భారతదేశ బయోటెక్నాలజీ రంగంలో ప్రధాన సంస్కరణ. బయోఈ3 అంటే ఆర్థిక వ్యవస్థ, పర్యావరణ, ఉపాధి కోసం బయోటెక్నాలజీ అని అర్థం. ఆరు రంగాల్లో ఆవిష్కరణల ఆధారిత పరిశోధన, వ్యవస్థాపకతను ఈ విధానం ముందుకు తీసుకెళ్తోంది. సాంకేతిక అభివృద్ధి, వాణిజ్యీకరణకు వీలుగా జాతీయ బయోఫౌండ్రీ నెట్‌వర్క్‌తో పాటు బయోమ్యానుఫాక్చరింగ్, బయో-ఏఐ కేంద్రాల ఏర్పాటును ఈ విధానం ప్రోత్సహిస్తుంది.
స్థిరమైన, సర్క్యులర్ ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా జీవశాస్త్ర పారిశ్రామికీకరణను ఈ విధానం ప్రోత్సహిస్తోంది. అధునాతన జీవ ఆధారిత ఆవిష్కరణలతో కూడిన దృఢమైన బయోమ్యానుఫ్యాక్చరింగ్ వ్యవస్థ నిర్మాణం ద్వారా వాతావరణ మార్పు, ఆహార భద్రత, ప్రజారోగ్యం వంటి జాతీయ సవాళ్లను ఈ విధానం పరిష్కరిస్తోంది.
అటల్ ఇన్నోవేషన్ మిషన్(ఎయిమ్) 2.0
భారతదేశ వ్యాప్తంగా ఆవిష్కరణలు, వ్యవస్థాపకతను ప్రోత్సహించడంలో 2016లో నీతి ఆయోగ్ కింద ప్రారంభమైన అటల్ ఇన్నోవేషన్ మిషన్ ప్రతిష్ఠాత్మక కార్యక్రమంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమం పాఠశాలల్లో సమస్యలను పరిష్కరించగలిగే వినూత్న ఆలోచనాసరళిని, విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు, ప్రైవేటు, ఎంఎస్ఎంఈ రంగంలో వ్యవస్థాపకత వ్యవస్థను తయారుచేస్తోంది. పాఠశాలల్లో అటల్ టింకెరింగ్ ల్యాబ్‌లు, విశ్వవిద్యాలయాలు, సంస్థల్లో అటల్ ఇంక్యుబేషన్ సెంటర్‌ల ఏర్పాటు కూడా ఈ మిషన్‌లో భాగం. రూ.2,750 బడ్జెట్ కేటాయింపుతో ఈ కార్యక్రమాన్ని 2028 వరకు పడిగించేందుకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థలు, పరిశ్రమల్లో సమస్యలు పరిష్కరించే, ఆవిష్కరణల సంస్కృతిని పెంపొందించడానికి ఎయిమ్ ఒక సమగ్ర విధానాన్ని చేపట్టింది.
ఎయిమ్ 2.0 కింద ఈ కార్యక్రమాన్ని విస్తరించడంతో పాటు, ప్రస్తుత ఇంక్యుమేషన్ వ్యవస్థలను బలోపేతం చేయడం, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలతో భాగస్వామ్యాన్ని మరింత పెంచడాన్ని లక్ష్యం. యువ ఆవిష్కర్తలను పెంచడం, కొత్త అంకుర సంస్థలను ప్రోత్సహించే సమ్మిళిత వ్యవస్థను తయారుచేయడం ద్వారా అభివృద్ధి చెందిన భారత్ అనే సంకల్పానికి అనుగుణంగా ఈ కార్యక్రమం పని చేస్తుంది.
అగ్రశ్రేణి పరిశోధనలను ముందుకు నడిపిస్తున్న జాతీయ కార్యక్రమాలు
సరికొత్త, అత్యధిక ప్రభావం చూపే రంగాలే లక్ష్యంగా చేపడుతున్న జాతీయ కార్యక్రమాల శ్రేణి శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ప్రపంచ అగ్రగామిగా నిలవాలనే భారతదేశ ప్రయత్నాన్ని నడిపిస్తోంది. దేశీయ ఆర్&డీ సామర్థ్యాలను బలోపేతం చేయడం, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం, ఆగ్రశ్రేణి రంగాల్లో ఆధునిక మౌలిక సదుపాయాలను నిర్మించడం కోసం ఈ కార్యక్రమాలను రూపొందించడం జరిగింది. స్వయం సమృద్ధ ఆవిష్కరణ వ్యవస్థ నిర్మాణం, తర్వాతి తరం సాంకేతికతల్లో భారత్‌ను కీలకంగా నిలబెట్టడానికి ఈ కార్యక్రమాలు దోహదపడుతున్నాయి.
జాతీయ క్వాంటమ్ మిషన్(ఎన్‌క్యూఎం)
2023 ఏప్రిల్ 19న జాతీయ క్వాంటమ్ మిషన్‌ను కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. క్వాంటమ్ సాంకేతికతలో భారత్ పాత్రను మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా ఇది కీలక అడుగు. 2023-24 నుంచి 2030-31 మధ్యకాలంలో రూ.6,003.65 కోట్ల కేటాయింపుతో క్వాంటమ్ కంప్యూటర్లు, సురక్షిత సమాచార వ్యవస్థలు, ఆధునిక సదుపాయాల అభివృద్ధికి ఈ కార్యక్రమం ప్రయత్నిస్తోంది. క్వాంటమ్ పరిశోధన మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, విద్యాసంస్థలు, అంకుర సంస్థలు, పరిశ్రమల మధ్య సహకారాన్ని ప్రోత్సహించడం ద్వారా భారత్‌ను క్వాంటమ్ ఆవిష్కరణల్లో ప్రపంచ కేంద్రంగా నిలపడంపై ఈ మిషన్ దృష్టి సారిస్తోంది.
నేషనల్ మిషన్ ఆన్ ఇంటర్‌డిసిప్లేనరీ సైబర్-ఫిజికల్ సిస్టమ్స్(ఎన్ఎం-ఐసీపీఎస్)
ఎన్ఎం-ఐసీపీఎస్‌ను 2018 డిసెంబర్ 6న కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. రూ.3,660 కోట్ల వ్యయంతో కేంద్ర శాస్త్ర, సాంకేతిక విభాగం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. కృత్రిమ మేధ, రోబోటిక్స్, ఇన్‌టెర్నెట్ ఆఫ్ థింగ్స్, సైబర్‌సెక్యూరిటీ వంటి కొత్తగా ఉద్భవిస్తున్న రంగాల్లో అభివృద్ధికి ఈ మిషన్ సహాయపడుతుంది.
ప్రముఖ విద్యాసంస్థల్లో ఇప్పటివరకు 25 సాంకేతిక ఆవిష్కరణ కేంద్రాలను స్థాపించడం జరిగింది. ఇవి ఒక్కోటి ఒక్కో కీలక సాంకేతిక రంగంలో ప్రత్యేకత కలిగి ఉన్నాయి. లక్షిత మానవ వనరుల కార్యక్రమాల ద్వారా నిపుణులైన మానవవనరులను తయారుచేయడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుంది. ప్రపంచ సాంకేతిక మార్పులకు అనుగుణంగా భారత్ ఉండేలా వ్యవస్థాపకతను, అంతర్జాతీయ సహకారాన్ని ప్రోత్సహిస్తుంది.
జాతీయ సూపర్‌కంప్యూటింగ్ మిషన్(ఎన్ఎస్ఎం)
2015లో జాతీయ సూపర్‌కంప్యూటింగ్ మిషన్ ప్రారంభమైంది. అధిక పనితీరు కలిగిన కంప్యూటింగ్ రంగంలో భారత్ స్వయం సమృద్ధి సాధించడం ఈ మిషన్ లక్ష్యం. నేషనల్ నాలెడ్జ్ నెట్‌వర్క్‌ను అనుసంధానం చేయడం ద్వారా విశ్వవిద్యాలయాలు, పరిశోధన, ప్రభుత్వ సంస్థలను అధునాతన సూపర్‌కంప్యూటింగ్ వ్యవస్థలతో ఈ కార్యక్రమం శక్తివంతం చేస్తుంది.
హార్డ్‌వేర్ మాత్రమే కాకుండా పుణె, ఖరగ్‌పూర్, చెన్నై, పాలక్కడ్, గోవాలోని ఐదు నిర్దిష్ట శిక్షణ కేంద్రాల ద్వారా నిపుణులైన మానవవనరులను నిర్మించడంపై ఈ మిషన్ పెట్టుబడి పెడుతోంది. విద్యార్థులు, పరిశోధకులకు అధిక పనితీరు గల కంప్యూటింగ్ అప్లికేషన్లపై శిక్షణ ఇవ్వడం ద్వారా ప్రపంచ శాస్త్రీయ పురోగతిలో భారత్ భాగస్వామ్యానికి భరోసానిస్తోంది.
ఇండియా సెమీకండక్టర్ మిషన్(ఐఎస్ఎం)
2021లో స్థాపించిన ఇండియా సెమీకండక్టర్ మిషన్ సెమికండక్టర్, డిస్‌ప్లే మ్యానుఫ్యాక్చరింగ్‌కు సంబంధించి దృఢమైన వ్యవస్థ నిర్మాణానికి ప్రయత్నిస్తోంది. రూ.76,000 కోట్ల ప్రొడక్షన్ లింక్‌డ్ ఇన్‌సెంటీవ్ పథకంతో కూడిన ఈ మిషన్‌లో ఇప్పటికే రూ.65,000 కోట్ల కేటాయింపు జరిగింది. చిప్ డిజైన్, ఫ్యాబ్రికేషన్, అధునాతన ప్యాకేజింగ్‌లో పెట్టుబడులకు ఈ మిషన్ సహకరిస్తుంది.
భారత్ ఇప్పటికే ఒడిశాలో తొలి వాణిజ్య సిలికాన్ కార్బైడ్ ఫ్యాబ్రికేషన్ కేంద్రం సహా ఆరు రాష్ట్రాల్లో 10 సెమీకండక్టర్ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. రూ.1.60 లక్షల కోట్ల పెట్టుబడులతో భారత్‌ను ప్రపంచ సెమీకండక్టర్ సరఫరా గొలుసులో కీలక భాగంగా, ఎలక్ట్రానిక్స్ తయారీలో కీలక గమ్యస్థానంగా ఐఎస్ఎం మారుస్తోంది.
డీప్ ఓషియన్ మిషన్(డీఓఎం)
డిప్ ఓషియన్ మిషన్‌ను కేంద్ర భూశాస్త్ర మంత్రిత్వ శాఖ 2021 సెప్టెంబర్ 7న ప్రారంభించింది. సముద్ర వనరుల వెలికితీత, వినియోగాన్ని సుస్థిరం చేయడం ఈ కార్యక్రమ లక్ష్యం. ఐదేళ్లకు రూ.4,077 కోట్ల పెట్టుబడితో ఈ కార్యక్రమం భారతదేశ నీలి ఆర్థిక వ్యవస్థ సంకల్పం కింద బహుళ రంగాలను సమ్మిళితం చేస్తోంది.
సముద్ర గర్భాన్ని లోతుగా అన్వేషించడం, వనరులను గుర్తించడం, సముద్ర జీవవైవిధ్యాన్ని పరిరక్షించేందుకు అవసరమైన సాంకేతికతల అభివృద్ధిపై ఈ మిషన్ దృష్టిసారించింది. భారత్‌కు 7,517 కిలోమీటర్ల విస్తారమైన తీరం ఉండటం, సముద్రంలో వ్యూహాత్మక ప్రదేశంలో ఉండం వల్ల ఈ మిషన్ సుస్థిరాభివృద్ధి కోసం ఐక్యరాజ్యసమితి సముద్ర శాస్త్ర దశాబ్దం(2021-2030) కింద ప్రపంచ ప్రయత్నాలకు సైతం దోహదపడుతోంది.
ఇండియా ఏఐ మిషన్
రూ.10,371.92 కోట్ల బడ్జెట్ అంచనాతో 2024 మార్చిలో కేంద్ర మంత్రివర్గం ఇండియా ఏఐ మిషన్‌కు ఆమోదం తెలిపింది. “భారత్‌లో ఏఐ రూపకల్పన, భారత్ కోసం ఏఐ పనిచేయడం” అనే సంకల్పంతో కూడిన మిషన్ ఇది. ఈ మిషన్ వేగంగా పురోగతి సాధిస్తోంది. 10,000 జీపీయూల ప్రారంభ లక్ష్యం నుంచి 38,000 జీపీయూల వరకు కంప్యూటింగ్ సామర్థ్యాన్ని ఇప్పటికే పెంచింది. తద్వారా అంకుర సంస్థలు, పరిశోధకులు, పరిశ్రమలకు ఏఐ మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తెస్తోంది. ఏఐ ఆవిష్కరణలు, ప్రభుత్వ విధివిధానాలు, నైపుణ్యాభివృద్ధిపైనా ఈ మిషన్ దృష్టిసారిస్తూ కృత్రిమ మేధ రంగంలో భారత్ ప్రపంచ అగ్రగామిగా అవతరించేందుకు వేదికను సిద్ధం చేస్తోంది.
డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్(డీపీఐ): భారతదేశ ఆర్&డీ సంకల్పం వేగవంతం
భారతదేశ పరిశోధన, ఆవిష్కరణల వ్యవస్థకు డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బలమైన ప్రేరణశక్తిగా నిలుస్తోంది. సాంకేతికతను అందుబాటులో ఉంచడం, పారదర్శకతను, సామర్థ్యాన్ని జోడించడం ద్వారా జ్ఞానాన్ని పెంచుకోవడం, డేటా ఆధారిత పరిశోధనను, డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో సమ్మిళిత భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తోంది. శాస్త్రీయ, సాంకేతిక, వ్యవస్థాపకత పురోగతికి అవసరమైన పునాదిని డీపీఐ వేస్తోంది.
బహుళ విభాగాలు వాడుకోగలిగిన వేదికలపై, ఎవరైనా వాడుకోగలిగేలా నిర్మించిన భారతదేశ డీపీఐ ఆవిష్కర్తలు, పరిశోధకులు, పరిశ్రమలు కలిసి పనిచేయడానికి, విస్తృతస్థాయిలో నిర్మాణానికి శక్తినిస్తోంది. నిరంతరాయ ఆర్థిక లావాదేవల నుంచి సురక్షిత గుర్తింపు ధ్రువీకరణ, సామర్థ సేవలు అందించడం వరకు డిజిటల్ పరిపాలన శాస్త్రీయ, ఆర్థిక పురోగతికి ఏ విధంగా దోహదపడగలదో ఈ వేదికలు ప్రదర్శిస్తాయి.
భారత్‌లో పలు కీలక డీపీఐలు:
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్(యూపీఐ)
2016లో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రారంభించిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ దేశంలో డిజిటల్ లావాదేవాలను సమూలంగా మార్చేసింది. ఒకే యాప్‌కు బహుళ బ్యాంక్ అకౌంట్లను అనుసంధానం చేయడం ద్వారా తక్షణ నగదు బదిలీ, వ్యాపార చెల్లింపులకు అవకాశం కల్పించింది. 2025 ఆగస్టులో రూ.24.85 లక్షల కోట్ల మేర 20 బిలియన్ లావాదేవీలు యూపీఐ ద్వారా జరిగాయి. ప్రస్తుతం భారతదేశ డిజిటల్ చెల్లింపుల్లో 85 శాతం యూపీఐ ద్వారా జరుగుతున్నాయి. ప్రతినెల 18 బిలియన్ లావాదేవీలు యూపీఐ ద్వారా అవుతున్నాయి.
యూపీఐ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా విస్తరించింది. యూఏఈ, సింగపూర్, భూటాన్, నేపాల్, శ్రీలంక, ఫ్రాన్స్, మారిషస్‌లోనూ ఇప్పుడు యూపీఐ అందుబాటులోకి వచ్చింది. ఫ్రాన్స్‌లోకి ప్రవేశించడం ద్వారా యూరోపియన్ చెల్లింపుల రంగంలోకి భారత్ మొదటి అడుగు వేసింది. ఇది భారతదేశ డిజిటల్ ఆవిష్కరణల విస్తరణ సామర్థ్యం, ప్రపంచ ప్రాముఖ్యతను చాటుతోంది.
కొ-విన్ వేదిక
పెద్ద ఎత్తున సమన్వయం చేయడంలో డిజిటల్ సాధనాలను అమలు చేయగలిగే భారతదేశ సామర్థ్యాన్ని కొ-విన్(కొవిడ్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్) వేదిక ప్రదర్శించింది. 220 కోట్లకు పైగా డోసులను అందించడం ద్వారా ప్రపంచంలో అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమాల్లో ఒక దానినిని భారత్ నిర్వహించింది. ప్రజారోగ్యంలో పారదర్శకత, సమర్థత, తక్షణ డేటా నిర్వహణను కొ-విన్ తీసుకువచ్చింది. ఈ విజయం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అనేక దేశాలు వాటి సొంత ఆరోగ్య వ్యవస్థల కోసం ఈ విధానాన్ని పరిశీలిస్తున్నాయి.
డిజిలాకర్
డిజిటల్ ఇండియా కార్యక్రమం కింద 2015లో అమలులోకి వచ్చిన డిజిలాకర్ పౌరులు సురక్షితంగా పత్రాలను ధ్రువీకరించుకునే అవకాశాన్ని కల్పించింది. వివిధ శాఖలు జారీచేసే ధ్రువపత్రాలు, అధికారిక రికార్డులు భద్రపరుచుకునేందుకు ఇది డిజిటల్ నిల్వ స్థలాన్ని అందిస్తోంది. 2025 అక్టోబర్ నాటికి 60.35 కోట్ల మంది వినియోగదారులు ఈ వేదికపై నిమోదయ్యారు. డిజిటల్ సాధికారత, విద్య, ఉపాధి, పరిశోధన అవసరాలకు సులువుగా డాక్యుమెంటేషన్ చేసుకునేందుకు డిజిలాకర్ ఒక విశ్వసనీయమైన సాధనంగా మారింది.
ఆధార్, ఈ-కేవైసీ వ్యవస్థ
ఆధార్ ఆధారిత ఈ-కేవైసీ సదుపాయం వివిధ రంగాల్లో ధ్రువీకరణను సులువు, వేగవంతంగా, మరింత విశ్వసనీయంగా మార్చింది. ఇది ధ్రువీకరణ ప్రక్రియను క్రమబద్ధీకరించడంతో పాటు కాగితపు పనిని తగ్గిస్తోంది. పారదర్శకతను పెంచుతోంది. 2025 అక్టోబర్ నాటికి భారత్ 143 ఆధార్ ఐడీలను రూపొందించడం ద్వారా భారత్ దాదాపు ప్రతి పౌరుడికి సురక్షిత డిజిటల్ గుర్తింపును అందిస్తోంది. సంక్షేమ, బ్యాంకింగ్, ఆవిష్కరణల ఆధారిత వేదికల సులభతర వినియోగానికి అవకాశం కల్పించడం ద్వారా సేవలు అందించడం, డిజిటల్ పద్ధతుల వినియోగానికి వెన్నెముకగా మారింది.
డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్(డీబీటీ)
పరిపాలనా సామర్థ్యాన్ని డిజిటల్ వేదికలు ఎలా పెంపొందించగలవో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ వ్యవస్థ చాటుతోంది. ఆధార్ అథెంటికేషన్ సహాయంతో పౌరులకు సబ్సిడీలు, సంక్షేమ చెల్లింపులు నేరుగా చేరేందుకు, వృథా, నకిలీని తగ్గించేందుకు డీబీటీ ఉపయోగపడుతోంది. 2015 నుంచి 2023 మార్చి మధ్య ప్రభుత్వానికి రూ.3.48 లక్షల కోట్లను ఇది ఆదా చేసింది. 2025 మే వరకు డీబీటీ ద్వారా లావాదేవీలు రూ.43.95 లక్షల కోట్లు దాటింది. తద్వారా ప్రజలకు సేవలు అందించడంలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని బలోపేతం చేస్తోంది.
ముగింపు
పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణల్లో పెరుగుతున్న భారతదేశ దృష్టి విజ్ఞానం, సాంకేతికతలో ప్రపంచ కేంద్రంగా మారాలనే సంకల్పాన్ని ప్రతిబింబిస్తోంది. సాహసోపేత విధానపరమైన చర్యలు, వ్యూహాత్మక నిధుల కేటాయింపు, బలమైన సంస్థాగత మద్దతుతో వికసిత్ భారత్@2047కు దేశం బలమైన పునాది వేస్తోంది. ఏఎన్ఆర్ఎఫ్, ఆర్డీఐ పథకం, కీలకమైన జాతీయ కార్యక్రమాల మధ్య సమన్వయంతో, విద్యాసంస్థలు-పరిశ్రమ మధ్య సహకారాన్ని బలోపేతం చేయడం ద్వారా అగ్రశ్రేణి సాంకేతికతల పురోగతికి సంకల్పాన్ని ప్రదర్శిస్తోంది. పరిపాలన, డేటా వ్యవస్థలను మరింత అందుబాటులోకి తేవడం, సమర్థతను పెంచడం ద్వారా డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ భారతదేశ ఆవిష్కరణల సామర్థ్యాన్ని మరింత విస్తరించింది. ఈ కార్యక్రమాలు భారతదేశ ఆర్&డీ ముఖచిత్రంలో మార్పు తీసుకురావడంతో పాటు సమ్మిళిత, భవిష్యత్తుకు తగ్గట్టుగా, ప్రపంచంతో పోటీపడేలా, సుస్థిర అభివృద్ధి దిశగా నడిపిస్తున్నాయి. తద్వారా శాస్త్ర, సాంకేతిక, ఆవిష్కరణల రంగాల్లో భారత్‌ను అగ్రశ్రేణి శక్తిగా నిలుపుతున్నాయి.
***
(Explainer ID: 155972)
आगंतुक पटल : 102
Provide suggestions / comments