• Sitemap
  • Advance Search
Others

జాతీయ వినియోగ‌దారుల హెల్ప్‌లైన్‌

వినియోగ‌దారుల ర‌క్ష‌ణ‌లో ముందున్న భార‌త్‌

Posted On: 16 OCT 2025 12:41PM

కీల‌కాంశాలు


- 2025 జూన్‌లో జాతీయ వినియోగ‌దారుల హెల్ప్‌లైన్‌ 7,256 ఫిర్యాదుల‌ను ప‌రిష్క‌రించి, రూ.2.72 కోట్లు వాప‌సు వ‌చ్చేలా చేసింది.
- అత్య‌ధికంగా ఈ-కామర్స్ ఫిర్యాదులకు సంబంధించి రూ.1.34 కోట్లు వాప‌సు వ‌చ్చేలా చేసింది.
- 2025 జీఎస్టీ సంస్క‌ర‌ణ‌ల‌కు సంబంధించి జాతీయ వినియోగ‌దారుల హెల్ప్‌లైన్ 3,981 కాల్స్ అందుకుంది. వీటిల్లో 31% సందేహాలు, 69% ఫిర్యాదుల‌కు సంబంధించిన‌వి.
- 2015 డిసెంబ‌ర్‌లో 12,553 కాల్స్ రాగా, 2024 డిసెంబ‌ర్ క‌ల్లా ప‌దింత‌లు పెరిగి 1,55,138 కాల్స్ వ‌చ్చాయి.
- నెల‌వారీ న‌మోదైన ఫిర్యాదుల స‌గ‌టు సంఖ్య 2017లో 37,062 ఉండ‌గా, 2025 క‌ల్లా 1,70,585కి పెరిగింది.
- భాగ‌స్వామ్య సంస్థ‌ల సంఖ్య 2017లో 263 ఉండ‌గా, 2025 సెప్టెంబ‌ర్ నాటికి 1,142కి పెరిగింది.

ప‌రిచ‌యం


బిహార్‌లోని న‌లంద‌కు చెందిన ఒక వినియోగ‌దారు స‌రైన రేష‌న్‌కార్డు ఉన్న‌ప్ప‌టికీ నాలుగు నెల‌లుగా రేష‌న్ అంద‌క ఇబ్బంది ప‌డుతున్నారు. సహాయం కోసం స్థానికంగా చేసిన ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌లేదు. దీంతో జాతీయ వినియోగ‌దారుల హెల్ప్‌లైన్‌ను సంప్ర‌దించ‌గా రేష‌న్ స‌ర‌ఫ‌రా తిరిగి ప్రారంభ‌మైంది. దీంతో స‌ద‌రు వినియోగ‌దారు త‌న సంతోషాన్ని వ్య‌క్తం చేశారు. ''మీకు ఏ ర‌కంగా ధ‌న్య‌వాదాలు తెల‌ప‌గ‌ల‌ను స‌ర్‌. మీ ద్వారా నా స‌మ‌స్య ప‌రిష్కార‌మవ‌డం నాకు చాలా సంతోషంగా ఉంది. మీకు, జాతీయ వినియోగ‌దారుల హెల్ప్‌లైన్ బృందానికి కృత‌జ్ఞ‌త‌లు.'' అంటూ త‌న సంతోషాన్ని వ్య‌క్తం చేశారు.

మ‌రో సంఘ‌ట‌న‌లో హ‌రియాణాలోని గుర్‌గావ్‌కు చెందిన వినియోగ‌దారు ఒక‌రు గ్యాస్ ఏజెన్సీ నుంచి తీసుకున్న గ్యాస్ సిలిండ‌ర్ ఉండాల్సిన దాని క‌న్నా త‌క్కువ బ‌రువు ఉంది. గ్యాస్ ఏజెన్సీ ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌క‌పోవ‌డంతో జాతీయ వినియోగ‌దారుల హెల్ప్‌లైన్‌ను స‌ద‌రు వినియోగ‌దారు సంప్ర‌దించారు. దీంతో ఈ స‌మ‌స్య ప‌రిష్కార‌మైంది. ''స‌మ‌స్య ప‌రిష్కారం కావ‌డం చాలా మంచి విష‌యం. మీరు స‌రైన చ‌ర్య‌లు తీసుకొని స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించారు'' అంటూ స‌ద‌రు వినియోగ‌దారు త‌న సంతోషాన్ని వ్య‌క్తం చేశారు.

ఇవి కేవ‌లం ఎక్క‌డో జ‌రిగిన విజ‌య‌గాథ‌లు మాత్ర‌మే కాదు, సాధార‌ణ పౌరుల‌కు జాతీయ వినియోగ‌దారుల హెల్ప్‌లైన్ ఎలా స‌హాయ‌కారిగా ఉంటోందో చెప్పేందుకు స్ప‌ష్ట‌మైన ఉదాహ‌ర‌ణ‌లు. వినియోగ‌దారుల‌కు వారి హ‌క్కుల‌పై అవ‌గాహ‌న క‌ల్పించేందుకు, వారి స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకు, అవ‌స‌ర‌మైన సూచ‌న‌లు చేసేందుకు వినియోగ‌దారుల వ్య‌వ‌హారాల శాఖ జాతీయ వినియోగ‌దారుల హెల్ప్‌లైన్ అనే ప్ర‌తిష్ఠాత్మ‌క వ్య‌వ‌స్థ‌ను తీసుకొచ్చింది. consumerhelpline.gov.in పోర్ట‌ల్ ద్వారా స‌మీకృత ఫిర్యాదుల ప‌రిష్కార వ్య‌వ‌స్థ‌గా ఇది ప‌ని చేస్తుంది. వినియోగ‌దారులు, ప్ర‌భుత్వ సంస్థ‌లు, నియంత్ర‌ణ సంస్థ‌లు, స్వ‌తంత్ర న్యాయాధికారులు, సంస్థ‌లతో పాటు కాల్ సెంట‌ర్ల‌ను ఒకే వ్య‌వ‌స్థ‌లోకి ఈ వేదిక తీసుకువ‌చ్చింది.

ఈ వ్య‌వ‌స్థ ద్వారా వివాదానికి ముందే వినియోగ‌దారులు ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేసి ప‌రిష్కారాన్ని ఆశించ‌వ‌చ్చు. అప్ప‌టికీ అసంతృప్తిగా ఉండే వారు వినియోగ‌దారుల క‌మిష‌న్ల‌ను ఆశ్ర‌యించే అవ‌కాశం కూడా ఉంటుంది. వినియోగ‌దారుల హ‌క్కుల‌ను ర‌క్షిస్తూనే పౌరుల‌కు వారి బాధ్య‌త‌లను తెలియ‌జేసే వేదిక‌గా ఈ పోర్ట‌ల్ ప‌ని చేస్తుంది.

 


 


వినియోగ‌దారుల ఫిర్యాదుల ప‌రిష్కారంలో పురోగ‌తి


సాంకేతిక‌త‌ను అందిపుచ్చుకోవ‌డం ద్వారా హెల్ప్‌లైన్ సామ‌ర్థ్యం, ప్ర‌జ‌ల‌కు చేరువ‌కావ‌డం గ‌ణ‌నీయంగా పెరిగింది. కాల్స్ సంఖ్య ప‌దింత‌లుకు పైగా పెరిగింది. 2015 డిసెంబ‌ర్‌లో 12,553 కాల్స్ రాగా, 2024 డిసెంబ‌ర్‌లో 1,55,138 కాల్స్ వ‌చ్చాయి. ప్ర‌స్తుతం హెల్ప్‌లైన్‌కు ప్ర‌తి నెల ల‌క్ష‌కు పైగా ఫిర్యాదులు వ‌స్తున్నాయి. ఇది వినియోగ‌దారుల విశ్వాసాన్ని ప్ర‌తిబింబిస్తోంది. నెల‌వారీ స‌గ‌టు ఫిర్యాదుల సంఖ్య 2017లో 37,062 ఉండ‌గా 2025 క‌ల్లా 1,70,585కి పెరిగింది. డిజిట‌ల్ ప‌ద్ధ‌తుల‌ను ప‌రిచ‌యం చేయ‌డంతో దాదాపు 65% వినియోగ‌దారుల ఫిర్యాదులు ఆన్‌లైన్‌, డిజిట‌ల్ మార్గాల ద్వారా హెల్ప్‌లైన్‌లో న‌మోద‌వుతున్నాయి. వాట్సాప్ ద్వారా ఫిర్యాదుల న‌మోదు సైతం గ‌ణ‌నీయంగా పెరిగింది. వాట్సాప్ ద్వారా 2023 మార్చిలో 3% ఫిర్యాదులు న‌మోదు కాగా 2025 మార్చిలో 20% ఫిర్యాదులు న‌మోద‌య్యాయి.

 



2025 ఏప్రిల్‌లో జాతీయ వినియోగ‌దారుల హెల్ప్‌లైన్ 1,079 ఫిర్యాదులు ప‌రిష్క‌రించి, రూ.62 ల‌క్ష‌లు వాప‌సు వ‌చ్చేలా చేయ‌గా, 2025 జూలైలో 27 విభిన్న రంగాల‌కు చెందిన 7,256 వినియోగ‌దారుల ఫిర్యాదుల‌ను ప‌రిష్క‌రించి, రూ.2.72 కోట్లు వాప‌సు వ‌చ్చేలా చేసింది. 2025 జూలైలో అత్య‌ధికంగా ఈ-కామ‌ర్స్ రంగానికి సంబంధించి 3,594 ఫిర్యాదుల‌ను ప‌రిష్క‌రించి రూ.1.34 కోట్లు వాప‌సు ఇప్పించింది. ఆ త‌ర్వాత ప‌ర్యాట‌క రంగానికి సంబంధించి రూ.31 ల‌క్ష‌లు వాప‌సు ఇప్పించింది.

వినియోగ‌దారుల ఫిర్యాదులు వేగంగా, స‌ఖ్య‌త‌తో ప‌రిష్కార‌మ‌య్యేందుకు వీలుగా వివిధ సంస్థ‌లు స్వ‌చ్ఛందంగా, ఉచితంగా జాతీయ వినియోగ‌దారుల హెల్ప్‌లైన్‌తో జ‌త‌క‌డుతున్నాయి. ఫిర్యాదుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ఆయా సంస్థ‌ల‌కు పంపిస్తుండ‌గా, సంస్థ‌లు 30 రోజుల్లోగా స్పందిస్తుంటాయి.

జాతీయ వినియోగ‌దారుల హెల్ప్‌లైన్‌తో జ‌త‌క‌ట్టిన సంస్థ‌ల సంఖ్య 2017లో 263 ఉండ‌గా, 2025 సెప్టెంబ‌ర్ క‌ల్లా 1,142కు పెరిగింది. త‌ద్వారా వేగంగా ఫిర్యాదుల ప‌రిష్కారానికి సహ‌కార వ్య‌వ‌స్థ‌లు బ‌లోపేత‌మ‌య్యాయి.

ఎన్‌సీహెచ్‌తో భాగ‌స్వామ్యం వ‌ల్ల అనేక ప్రయోజ‌నాలు
- వివాదాలు పెర‌గ‌కుండా సంస్థ‌లు ముందుగానే వినియోగ‌దారుల ఫిర్యాదుల‌ను ప‌రిష్క‌రించ‌వ‌చ్చు.
- వినియోగ‌దారులు, సంస్థ‌ల‌కు ప్ర‌యోజ‌నం క‌లిగేలా వేగంగా, ఇరువైపులా సంతృప్తి పొందే ప‌రిష్కారాల‌ను పొందొచ్చు.
- మెరుగైన సేవ‌లు అందించ‌డం ద్వారా వినియోగ‌దారుల్లో విశ్వాసాన్ని నిర్మించుకోవ‌డంతో పాటు వారు వినియోగ‌దారులుగా కొన‌సాగేలా చూసుకోవ‌చ్చు.
- కార్పొరేట్ పాల‌న‌ను బ‌లోపేతం చేసుకోవ‌డంతో పాటు సామాజిక బాధ్య‌త ప‌ట్ల నిబద్ధ‌త‌ను చాటుకోవ‌చ్చు.

ఎక్కువ‌గా ఫిర్యాదులు అందుతున్న‌ప్ప‌టికీ క‌న్వ‌ర్జెన్స్ ఇనిషియేటీవ్ కింద భాగంగా లేని సంస్థ‌ల‌ను వినియోగ‌దారుల వ్య‌వ‌హారాల శాఖ గుర్తించింది. స్వ‌చ్ఛందంగా క‌న్వ‌ర్జెన్స్ ఇనిషియేటీవ్‌లో చేరేలా చ‌ర్చ‌లు జ‌రుపుతోంది. భాగ‌స్వామ్య సంస్థ‌ల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు ఫిర్యాదుల స‌మాచారం అందిస్తోంది. త‌ద్వారా ఈ సంస్థ‌లు వేగంగా, న్యాయంగా ఫిర్యాదుల‌ను ప‌రిష్క‌రించి, పార‌ద‌ర్శ‌క‌త‌, జ‌వాబుదారీత‌నం, వినియోగ‌దారుల విశ్వాసాన్ని పెంచుకోవ‌చ్చు. సుల‌భంగా ఉప‌యోగించ‌గ‌లిగే, పూర్తిగా ఆన్‌లైన్ విధానం ద్వారా వేగంగా చ‌ర్య‌లు తీసుకునేందుకు వీలుగా ఫిర్యాదుల‌ను క్ర‌మ‌బ‌ద్ధంగా సంస్థ‌ల‌కు చేర‌వేస్తోంది. త‌ద్వారా న్యాయ‌ వ్య‌వ‌స్థ‌ల‌పై భారం త‌గ్గ‌డంతో ప‌రిశ్ర‌మ భాగ‌స్వామ్యం విస్తృత‌మ‌వుతుంది.

డ‌బ్బుల వాప‌సు వివాదాల్లో విద్యార్థుల‌కు అండ‌గా జాతీయ వినియోగ‌దారుల హెల్ప్‌లైన్‌

సివిల్ స‌ర్వీసులు, ఇంజినీరింగ్‌, ఇత‌ర కోర్సుల్లో చేరిన విద్యార్థుల‌కు డ‌బ్బులు వాప‌సు ఇవ్వ‌డంలో శిక్ష‌ణా సంస్థ‌లు మాట నిలుపుకోని సంద‌ర్భాల్లో విద్యార్థులు డ‌బ్బులు వాప‌సు పొందేలా జాతీయ వినియోగ‌దారుల హెల్ప్‌లైన్ చ‌ర్య‌లు తీసుకుంటోంది. 2025 ఫిబ్ర‌వ‌రి వ‌ర‌కు 600 మంది విద్యార్థులు రూ.1.56 కోట్లు వాప‌సు పొందేలా చ‌ర్య‌లు తీసుకుంది. త‌ర‌గ‌తులు ర‌ద్దు కావడం, చెప్పిన‌ సేవ‌లు అందివ్వ‌క‌పోవ‌డం, అన్యాయ‌మైన ప‌ద్ధ‌తులు అవ‌లంభించ‌డం వంటి స‌మ‌స్య‌ల‌ను వెంట‌నే ప‌రిష్క‌రించ‌డానికి జాతీయ వినియోగ‌దారుల హెల్ప్‌లైన్ చ‌ర్య‌లు దోహ‌ద‌ప‌డుతున్నాయి. దీంతో పాటు శిక్ష‌ణ సంస్థ‌లు పార‌ద‌ర్శ‌క‌మైన‌, విద్యార్థుల‌కు అనుకూల‌మైన డ‌బ్బులు వాప‌సు ఇచ్చే విధానాల‌ను పాటించ‌డానికి కార‌ణ‌మ‌వుతున్నాయి.

జంషేద్‌పూర్‌కు చెందిన జీఈఈ విద్యార్థి ఫీజు చెల్లించిన‌ట్టు ఆధారం ఉన్నా కూడా కోర్సులో చేర్చుకునేందుకు శిక్ష‌ణ సంస్థ నిరాక‌రించిందనే ఫిర్యాదు జాతీయ వినియోగ‌దారుల హెల్ప్‌లైన్‌కు అందింది. దీంతో విద్యార్థికి డ‌బ్బు వాప‌సు అందింది. స‌మ‌స్య‌కు వేగంగా ప‌రిష్కారం రావ‌డంతో.. ''డ‌బ్బులు వాప‌సు వ‌చ్చాయి, కృత‌జ్ఞ‌త‌లు'' అంటూ స‌ద‌రు విద్యార్థి ధ‌న్య‌వాదాలు తెలిపారు.

త‌ర్వాతి-త‌రం జీఎస్టీ సంస్క‌ర‌ణ‌లు-2025తో అనుసంధాన‌మైన ఎన్‌సీహెచ్‌
ప్ర‌ధాన‌మంత్రి త‌న స్వాతంత్య్ర దినోత్స‌వ ప్ర‌సంగంలో ప్ర‌స్తావించిన‌, 2025 సెప్టెంబ‌ర్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నేతృత్వంలో జ‌రిగిన 56వ జీఎస్టీ కౌన్సిల్ ఆమోదించిన త‌ర్వాతి-త‌రం జీఎస్టీ సంస్క‌ర‌ణ‌ల‌-2025తో జాతీయ వినియోగ‌దారుల హెల్ప్‌లైన్‌ను వినియోగ‌దారుల వ్య‌వ‌హారాల శాఖ అనుసంధానం చేసింది.

2025 సెప్టెంబ‌ర్ 22 నుంచి అమ‌లులోకి వ‌చ్చిన‌ స‌వ‌రించిన జీఎస్టీ చార్జీలు, ధ‌ర‌లు, మిన‌హాయింపుల‌పై వినియోగ‌దారుల సందేహాలు, ఫిర్యాదులు పెరుగుతాయ‌నే అంచ‌నాతో ఇన్‌గ్రామ్ పోర్ట‌ల్‌లో ప్ర‌త్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటుచేసింది. ఆటోమొబైల్స్‌, బ్యాంకింగ్‌, క‌న్జూమ‌ర్ డ్యూర‌బుల్స్‌, ఈ-కామ‌ర్స్‌, ఎఫ్ఎంసీజీ త‌దిత‌ర అన్ని ప్ర‌ధాన రంగాల‌కు సంబంధించిన వినియోగ‌దారులు నేరుగా జీఎస్టీ సంబంధిత ఫిర్యాదుల‌ను ఈ విభాగంలో చేయ‌వ‌చ్చు.

త‌ర్వాతి-త‌రం జీఎస్టీ సంస్క‌ర‌ణ‌ల‌-2025 అమ‌లు నుంచి ఆక్టోబ‌ర్ 2, 2025 వ‌ర‌కు జీఎస్టీకి సంబంధించి జాతీయ వినియోగ‌దారుల హెల్ప్‌లైన్‌కు 3,981 ఫిర్యాదులు అందాయి. వీటిల్లో 31% సందేహాల‌కు సంబంధించిన‌వి కాగా 69% ఫిర్యాదులు.

 



వీటిలో 1,992 ఫిర్యాదుల‌ను సెంట్ర‌ల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ క‌స్ట‌మ్స్‌(సీబీఐసీ)కి పంపించ‌గా, 761 ఫిర్యాదుల‌ను నేరుగా ప‌రిష్క‌ర‌మ‌య్యేందుకు వీలుగా సంబంధిత భాగ‌స్వామ్య సంస్థ‌ల‌కు పంపించింది.

జీఎస్టీ మార్పుల త‌ర్వాత ప‌లు కీల‌క రంగాల‌కు సంబంధించి వినియోగ‌దారులు వివ‌ర‌ణ‌, చ‌ర్య‌లు కోరారు:
- పాల ధ‌ర‌ల‌కు సంబంధించి ఎక్కువ‌గా ఫిర్యాదులు వ‌చ్చాయి. స‌వ‌రించిన జీఎస్టీ ప్ర‌కారం పాల సంస్థ‌లు పాల ధ‌ర‌లు త‌గ్గించాల‌ని వినియోగ‌దారులు జాతీయ వినియోగ‌దారుల హెల్ప్‌లైన్‌ను సంప్ర‌దించారు. కాగా, తాజా పాల‌పై ఇప్ప‌టికే జీఎస్టీ మిన‌హాయించ‌గా, యూహెచ్‌టీ పాల‌పై ఇప్పుడు జీఎస్టీని మిన‌హాయించిన‌ట్టు వివ‌రించ‌డం జ‌రిగింది.
- ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన ఎల‌క్ట్రానిక్ వ‌స్తువుల‌కు సంబంధించి కూడా ఎక్కువ‌గా ఫిర్యాదులు అందాయి. జీఎస్టీ త‌గ్గిన త‌ర్వాత కూడా ఈ వ‌స్తువుల‌పై త‌మ‌కు ప్ర‌యోజ‌నం ల‌భించ‌లేద‌ని వినియోగ‌దారులు ఆరోపించారు. అయితే, టీవీలు, ఏసీలు, మానిట‌ర్లు, డిష్‌వాష‌ర్లు వంటి వ‌స్తువుల‌కే జీఎస్టీ త‌గ్గింపు(28% నుంచి 18%) వ‌ర్తిస్తుంది. ల్యాప్‌టాప్‌లు, రీఫ్రిడ్జిరేట‌ర్లు, వాషింగ్ మిష‌న్లు వంటివి ఇప్ప‌టికే 18% పన్ను ప‌రిధిలో ఉన్నాయనే అంశాన్ని తెలియ‌జేయ‌డం జ‌రిగింది.
- గృహ ఎల్‌పీజీ సిలిండ‌ర్ల ధ‌ర‌లు త‌గ్గ‌లేద‌ని సైతం ప‌లు ఫిర్యాదులు అందాయి. అయితే, గృహ ఎల్‌పీజీపై 5% జీఎస్టీ కొన‌సాగుతోంద‌ని వివ‌రించ‌డం జ‌రిగింది.
- పెట్రోల్ ధ‌ర‌లు త‌గ్గుతాయ‌ని ఆశిస్తూ ప‌లువురు ఫిర్యాదులు చేశారు. అయితే, పెట్రోల్ జీఎస్టీ ప‌రిధిలోకి రాదు.

జీఎస్టీ అమ‌లులోకి వ‌చ్చాక మొద‌టి వారం వినియోగ‌దారులు చురుగ్గా ప‌రిష్కార వ్య‌వ‌స్థ‌ను వినియోగించారు. ఇది వినియోగ‌దారుల వ్య‌వ‌హారాల శాఖ ఏర్పాటు చేసిన వ్య‌వ‌స్థల‌పై విశ్వాసం, అవ‌గాహ‌న‌ను ప్ర‌తిబింబిస్తోంది.

ఫిర్యాదుల‌ను ఎలా న‌మోదు చేసుకోవాలి?
వినియోగ‌దారులు జాతీయ వినియోగ‌దారుల హెల్ప్‌లైన్ ద్వారా బ‌హుళ మాధ్య‌మాల్లో ఫిర్యాదుల‌ను న‌మోదుచేయ‌వ‌చ్చు:
- టోల్ ఫ్రీ నెంబ‌రు 1800 11 4000కు ఫోన్ చేసి నేరుగా ఏజెంట్‌తో మాట్లాడ‌వ‌చ్చు. టోల్ ఫ్రీ నెంబ‌ర్ 1915 ద్వారా 17 భాష‌ల్లో ఫిర్యాదుల‌ను న‌మోదు చేయ‌వ‌చ్చు.
consumerhelpline.gov.in పోర్ట‌ల్‌లో వ‌న్‌-టైమ్ సైన్అప్‌, ఈమెయిల్ ధ్రువీక‌ర‌ణ ద్వారా యూజ‌ర్ ఐడీ, పాస్‌వ‌ర్డ్ సృష్టించుకొని ఫిర్యాదును న‌మోదు చేయ‌వ‌చ్చు. ఇందులో వినియోగ‌దారులు త‌మ ఫిర్యాదుల‌కు ఆధారంగా ఉండే ప‌త్రాల‌ను కూడా అప్‌లోడ్ చేయ‌వ‌చ్చు.
- 8800001915 నెంబ‌రుకు ఎస్ఎంఎస్ పంపిస్తే వినియోగ‌దారుల‌ను ఎన్‌సీహెచ్ బృందం సంప్ర‌దిస్తుంది.
- వాట్సాప్ ద్వారా ఫిర్యాదును న‌మోదు చేయ‌వ‌చ్చు.
- ఎన్‌సీహెచ్ మొబైల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయ‌వ‌చ్చు.
- ఉమాంగ్ యాప్ ద్వారా కూడా ఈ సేవ‌లు పొంద‌వ‌చ్చు.
ఆ త‌ర్వాత వినియోగ‌దారులు https://consumerhelpline.gov.in/public/feedback ద్వారా వారి సూచ‌న‌లు అందించేందుకు వీలుగా నిర్దిష్ట ఫీడ్‌బ్యాక్ వ్య‌వ‌స్థ‌ను అమ‌లులోకి తీసుకువ‌చ్చింది. ఈ ఫీడ్‌బ్యాక్‌ను క్ర‌మ‌బ‌బ‌ద్ధంగా విశ్లేషించడం జ‌రుగుతోంది. త‌ద్వారా వినియోగ‌దారుల అవ‌స‌రాల మేర‌కు వ్య‌వ‌స్థ‌ను మెరుగుప‌రిచేందుకు దోహ‌ద‌ప‌డుతోంది.

 


ముగింపు
వినియోగ‌దారుల హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ‌కు, న్యాయ‌మైన వ్యాపార విధానాలు పాటించేలా చూసేందుకు జాతీయ వినియోగ‌దారుల హెల్ప్‌లైన్ కీల‌క‌మైన వేదిక‌గా మారింది. స‌మ‌యానుగున ఫిర్యాదుల ప‌రిష్కారం, వినియోగ‌దారులు, కంపెనీలు, అధికారిక వ్య‌వ‌స్థ‌ల న‌డుమ స‌మ‌న్వ‌యం, సాంతికేతిక‌త‌ను స‌మ‌ర్థంగా వినియోగించడం ద్వారా వినియోగ‌దారులు సుదీర్ఘ‌మైన న్యాయ ప్ర‌క్రియ అవ‌స‌రం లేకుండానే న్యాయాన్ని పొందేందుకు ఎన్‌సీహెచ్ అవ‌కాశం క‌ల్పిస్తోంది. ఈ సానుకూల విధానం పార‌ద‌ర్శ‌క‌త‌ను పెంపొందించ‌డంతో పాటు వ్య‌వ‌స్థ‌పై విశ్వాసాన్ని నెల‌కొల్పుతోంది. జ‌వాబుదారీత‌నాన్ని ప్రోత్స‌హిస్తోంది. భార‌త‌దేశ వినియోగ‌దారుల ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌కు కీల‌క ప‌రిక‌రంగా మారింది.

రిఫ‌రెన్స్‌లు
వినియోగ‌దారుల వ్య‌వ‌హారాలు, ఆహార‌, ప్ర‌జా పంపిణీ మంత్రిత్వ శాఖ‌
జాతీయ వినియోగ‌దారుల హెల్ప్‌లైన్‌
https://consumerhelpline.gov.in/public/about

https://consumerhelpline.gov.in/public/convergenceprogram

https://consumerhelpline.gov.in/public/dashboard/refundReport?from=2025-04-01&to=2025-04-30

పీఐబీ ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌లు
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2159698

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2168858

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2105466

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2174242

 

 

***

 

(Explainer ID: 155640) आगंतुक पटल : 83
Provide suggestions / comments
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Nepali , हिन्दी , Hindi_Ddn , Marathi , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Kannada , Malayalam
National Portal Of India
STQC Certificate