Infrastructure

ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్‌ లాజిస్టిక్స్ అథారిటీ (ఐటీఎల్‌ఏ)

प्रविष्टि तिथि: 06 OCT 2026 19:09 PM

సమగ్ర జాతీయ రవాణా మాస్టర్ ప్లాన్

విస్తరిస్తున్న భారత రవాణా, లాజిస్టిక్స్ వ్యవస్థ
భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతున్న కొద్దీ దేశవ్యాప్తంగా వస్తువులను సమర్థంగా రవాణా చేయ‌గ‌లిగిన వ్య‌వ‌స్థ‌ అవసరం కూడా పెరుగుతోంది. ఈ అవసరాన్ని తీర్చాలంటే రవాణా వ్యవస్థల మధ్య మెరుగైన అనుసంధానం ఉండటంతో పాటు వాటిని సమగ్రంగా ప్రణాళిక చేయాలి. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్‌ లాజిస్టిక్స్ అథారిటీ (ఐటీఎల్‌ఏ) ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం 2026 అక్టోబర్ 6న ఆమోదం తెలిపింది. రవాణా, లాజిస్టిక్స్ రంగాల్లో పరిశోధన, ప్రణాళిక, ప్రాజెక్టుల మదింపు, పర్యవేక్షణ, ప్రభావ అంచనా కోసం ప్రత్యేక సంస్థాగత వ్యవస్థగా ఐటీఎల్‌ఏ పనిచేస్తుంది.

రవాణా, లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌లు విస్తరిస్తున్న నేపథ్యంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు సంబంధించిన దీర్ఘకాలిక సమగ్ర ప్రణాళిక, అమలు అనంతర ప్రభావ అంచనాకు ఐటీఎల్‌ఏ సహకరిస్తుంది. పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్, జాతీయ లాజిస్టిక్స్ విధానం వంటి ప్రస్తుత కార్యక్రమాలకు అనుబంధంగా పనిచేస్తుంది.

పాత్రలు, బాధ్యతలు
సమగ్ర ప్రణాళిక, ప్రాజెక్టుల మదింపు, పర్యవేక్షణ, డేటా విశ్లేషణ, లాజిస్టిక్స్ విధానం, సామర్థ్య నిర్మాణం, పరిశోధన వంటి విభాగాల్లో ఐటీఎల్‌ఏ విస్తృత బాధ్యతలు చేపడుతుంది. ప్రధాన బాధ్యతలు ఇవీ:
- జాతీయ అత్యున్నత సంస్థ: సమగ్ర రవాణా, లాజిస్టిక్స్ ప్రణాళిక, పరిశోధన, ప్రాజెక్టుల మదింపు, పర్యవేక్షణకు ఐటీఎల్‌ఏ అత్యున్నత సంస్థగా పనిచేస్తుంది. రవాణా రంగంలో సమన్వయంతో నిర్ణయాలు తీసుకునే వ్యవస్థను బలోపేతం చేసేందుకు విధానపరమైన సహాయం, డేటా విశ్లేషణ అందిస్తుంది.
- దీర్ఘకాలిక జాతీయ రవాణా మాస్టర్ ప్లాన్: కనీసం పదేళ్ల కాలపరిమితితో సమగ్ర జాతీయ రవాణా మాస్టర్ ప్లాన్‌ను ప్రాధికార సంస్థ రూపొందిస్తుంది. రహదారులు, రైల్వేలు, నౌకాశ్రయాలు, నౌకాయానం, పౌర విమానయానం, అంతర్గత జలమార్గాలు, తీరప్రాంత నౌకాయానం, పట్టణ రవాణా, లాజిస్టిక్స్ రంగాలను ఇందులో చేర్చుతుంది.
- సమగ్ర ప్రణాళిక విధానం: దాదాపు ఐదేళ్ల కాలపరిమితితో రూపొందించే స్వల్పకాలిక రంగాల ప్రణాళికలు, రవాణా మంత్రిత్వ శాఖల వార్షిక ప్రణాళికలను ఐటీఎల్‌ఏ మదింపు చేస్తుంది. వాటిని జాతీయ రవాణా మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా తీర్చిదిద్దడంతో పాటు బహుళ రవాణా మార్గాల మౌలిక సదుపాయాల అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది.
- భారీ ప్రాజెక్టులకు సాంకేతిక మదింపు: ₹500 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ వ్యయంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ఐటీఎల్‌ఏ సాంకేతికంగా పరిశీలిస్తుంది. ఆర్థిక మదింపు మాత్రం ప్రస్తుతం అమల్లో ఉన్న విధానాల ద్వారానే కొనసాగుతుంది.
- పర్యవేక్షణ, ప్రభావ అంచనా: ₹500 కోట్లకు పైగా వ్యయమయ్యే రవాణా, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను పర్యవేక్షిస్తుంది. సమస్యల పరిష్కారానికి సమన్వయ వ్యవస్థను అందిస్తుంది. ప్రాజెక్టుల ఫలితాలు, పనితీరును తెలుసుకునేందుకు అమలు అనంతర ప్రభావ అంచనాలను కూడా నిర్వహిస్తుంది.
- నేష‌న‌ల్ ట్రాన్స్‌పోర్ట్ డాటా రిపాజిట‌రీ (ఎన్‌టీడీఆర్): వివిధ వనరుల్లోని రవాణా, లాజిస్టిక్స్ సమాచారాన్ని సమీకరించి ఏకీకృత డేటా భాండాగారాన్ని ప్రాధికార సంస్థ అభివృద్ధి చేస్తుంది. జీఎస్‌టీఎన్ ఈ-వే బిల్లులు, ఫాస్టాగ్, వాహన్, జీపీఎస్ ఆధారిత వ్యవస్థలు, పట్టణ ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థలు ఇందులో భాగంగా ఉంటాయి. సరకు రవాణా ప్రవాహం, ప్రారంభ–గమ్యస్థానాల విశ్లేషణకు ఈ సమాచారం ఉపయోగపడుతుంది. ప్రణాళిక, పర్యవేక్షణ, ప్రభావ అంచనాలోనూ తోడ్పడుతుంది.
- లాజిస్టిక్స్ విధానానికి సహకారం: జాతీయ లాజిస్టిక్స్ విధానం–2022 సమీక్ష, నవీకరణకు సలహాలు, సహాయం అందిస్తుంది.
- సామర్థ్య నిర్మాణం: లాజిస్టిక్స్ రంగంలో సామర్థ్య నిర్మాణం, శిక్షణ, నైపుణ్యాభివృద్ధికి తోడ్పడుతుంది.
- పరిశోధన, ఆవిష్కరణలు: రవాణా, లాజిస్టిక్స్ రంగాల్లో పరిశోధన, ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుంది.

 



ప్రధాన ప్రయోజనాలు
రవాణా, లాజిస్టిక్స్ వ్యవస్థలో సమగ్ర ప్రణాళిక, సమన్వయం, డేటా వినియోగం, సంస్థాగత సామర్థ్యాన్ని ఐటీఎల్‌ఏ బలోపేతం చేస్తుంది.
- కేంద్ర స్థాయి సంస్థాగత వ్యవస్థ: రవాణా, లాజిస్టిక్స్ రంగాల్లో పరిశోధన, ప్రణాళిక, మదింపు, పర్యవేక్షణ, ప్రభావ అంచనాకు కేంద్ర స్థాయి సంస్థాగత వ్యవస్థగా ఐటీఎల్‌ఏ పనిచేస్తుంది. కొరియా, జపాన్, అమెరికా, చైనా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో అమలవుతున్న అంతర్జాతీయ విధానాలకు అనుగుణంగా ఈ వ్యవస్థను రూపొందించారు.
- ఏకీకృత మౌలిక సదుపాయాల ప్రణాళిక: సమగ్ర మౌలిక సదుపాయాల ప్రణాళికకు ఐటీఎల్‌ఏ అత్యున్నత సమన్వయ సంస్థగా వ్యవహరిస్తుంది. సమగ్ర జాతీయ రవాణా మాస్టర్ ప్లాన్‌ను కూడా సిద్ధం చేస్తుంది.
- మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయం: రవాణా, లాజిస్టిక్స్ వ్యవహారాలను పర్యవేక్షించే వివిధ మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయాన్ని ఐటీఎల్‌ఏ మెరుగుపరుస్తుంది. మౌలిక సదుపాయాల ప్రణాళిక, మదింపు, పర్యవేక్షణ, ఫలితాల పరిశీలనను ఈ పరిధిలోకి తీసుకువస్తుంది.
- ఏకీకృత సమాచార భాండాగారం: సమగ్ర రవాణా సమాచార భాండాగారాన్ని ఐటీఎల్‌ఏ ఏర్పాటు చేస్తుంది. ఆధారాలతో కూడిన ప్రణాళిక, పరిశోధన, ఆవిష్కరణలకు ఇది తోడ్పడుతుంది.
- సంస్థాగత సామర్థ్య నిర్మాణం: పరిశోధన, ప్రణాళిక, భారీ డేటా సమీకరణ, ప్రాజెక్టుల పర్యవేక్షణ, మదింపు రంగాల్లో సామర్థ్యాన్ని ఐటీఎల్‌ఏ పెంచుతుంది. అంతర్జాతీయంగా అనుసరిస్తున్న ఉత్తమ విధానాల అమలును కూడా ప్రోత్సహిస్తుంది.

భారత విజన్–2047కు తోడ్పాటు
దేశ రవాణా, లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌లు నిరంతరం విస్తరిస్తున్న నేపథ్యంలో అంతరాయం లేని బహుళ రవాణా అనుసంధానం, సమర్థమైన మౌలిక సదుపాయాలు మరింత కీలకం కానున్నాయి. రవాణా, లాజిస్టిక్స్ వ్యవస్థలో సమగ్ర ప్రణాళిక, ప్రాజెక్టుల మదింపు, పర్యవేక్షణ, డేటా ఆధారిత నిర్ణయాలను ఐటీఎల్‌ఏ బలోపేతం చేస్తుంది. మౌలిక సదుపాయాల సామర్థ్యాన్ని పెంచడం, బహుళ రవాణా అనుసంధానానికి తోడ్పాటు అందించడం, సంస్థాగత సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడం ద్వారా భారత విజన్–2047 సాధనకు, మరింత పోటీతత్వంతో కూడిన లాజిస్టిక్స్ వ్యవస్థ నిర్మాణానికి ఐటీఎల్‌ఏ దోహదం చేస్తుంది.

 

References

Cabinet

https://www.pib.gov.in/PressReleasepage.aspx?PRID=2319529&reg=48&lang=1

Please See PDF

PIB Research

***

(तथ्य सामग्री आईडी: 151103) आगंतुक पटल : 4


Provide suggestions / comments
इस विश्लेषक को इन भाषाओं में पढ़ें : English , Bengali , हिन्दी , Kannada , Assamese , Malayalam