• Sitemap
  • Advance Search
Culture & Tourism

జాతీయ చలనచిత్ర పురస్కారాలు

प्रविष्टि तिथि: 20 SEP 2026 12:49 AM

భారతీయ సినిమా మాయాజాలానికి దేశం అందించే గౌరవం

 

జాతీయ చలనచిత్ర పురస్కారాలు

 

సినిమా రంగంలో ప్రతిభకు అందించే దేశ అత్యున్నత గౌరవాల్లో జాతీయ చలనచిత్ర పురస్కారాలు అగ్రస్థానంలో నిలుస్తాయి. 1954లో ప్రారంభమైన ఈ పురస్కారాలను కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రతి ఏటా అందిస్తోంది. ఏడు దశాబ్దాలుగా భారతీయ సినిమా రంగంలో అత్యుత్తమ సృజనాత్మక, సాంకేతిక ప్రతిభను ఇవి గుర్తిస్తున్నాయి. కథా చిత్రాలు, కథేతర చిత్రాలు, సినిమాపై రచనలు అనే మూడు విభాగాల్లో పురస్కారాలు అందిస్తారు.

 

72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు 2024లో భారతీయ సినిమా సాధించిన విజయాలను గౌరవిస్తున్నాయి. మూడు జ్యూరీల అధ్యక్షులు 2026 జులై 18న విజేతలను ప్రకటించారు. గుజరాత్‌లోని ఏక్తా నగర్‌(గతంలో కేవడియా)లో 2026 సెప్టెంబర్‌ 22న జరిగే కార్యక్రమంలో భారత రాష్ట్రపతి పురస్కారాలు ప్రదానం చేస్తారు.

 

దేశవ్యాప్తంగా సినిమా నిర్మాణంలో కనిపించే భాషా, సాంస్కృతిక, ప్రాంతీయ వైవిధ్యాన్ని ఈ పురస్కారాలు ప్రతిబింబిస్తాయి. భారీ వాణిజ్య చిత్రాలతో పాటు చిన్న స్వతంత్ర చిత్రాలకు ఒకే జాతీయ వేదికపై స్థానం కల్పిస్తాయి. ఈ విస్తృత పరిధే సినీ కళాకారులు, ప్రేక్షకుల్లో పురస్కారాలకు ప్రత్యేక గౌరవాన్ని తెచ్చింది.

 

మీకు తెలుసా?

జాతీయ చలనచిత్ర పురస్కారాల కార్యక్రమాన్ని దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించాలని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కీలక విధాన నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తు పురస్కార కార్యక్రమాలు దేశ రాజధానికే పరిమితం కాకుండా వివిధ రాష్ట్రాలు, నగరాల్లో జరుగుతాయి. ఏక్తా నగర్‌లో జరిగే కార్యక్రమం దేశం నలుమూలల నుంచి సినీ ప్రతిభను ఒకే వేదికపైకి తీసుకురానుంది. ఇది ఏక్‌ భారత్‌, శ్రేష్ఠ భారత్‌ స్ఫూర్తిని చాటుతుంది.

 

1954 నుంచి వారసత్వం, పరిణామం

భారతీయ సినిమా ప్రయాణం 1913లో దాదాసాహెబ్‌ ఫాల్కే రూపొందించిన రాజా హరిశ్చంద్ర చిత్రంతో ప్రారంభమైంది. 1949లో ఏర్పాటైన చలనచిత్ర విచారణ కమిటీ ‘సినిమాలకు ప్ర‌భుత్వ‌ పురస్కారాలు’ ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. భారతీయ సినిమాలో కళాత్మక, సాంకేతిక ప్రతిభను గౌరవించి, ప్రోత్సహించేందుకు వీటిని ఏర్పాటు చేశారు. 1954లో పురస్కారాలను ప్రారంభించగా, తొలి విడతలో 1953 నాటి చిత్రాలను గౌరవించారు.

 

జాతీయ చలనచిత్ర పురస్కారాల తొలి విడత

తొలి విడతలో కథా చిత్రాలు, డాక్యుమెంటరీలు, బాలల చిత్రాలు అనే మూడు విభాగాలు ఉన్నాయి. మరాఠీ చిత్రం శ్యామ్చీ ఆయీ ఉత్తమ అఖిల భారత కథా చిత్రంగా రాష్ట్రపతి స్వర్ణ పతకం గెలుచుకుంది. మహాబలిపురం ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రంగా రాష్ట్రపతి స్వర్ణ పతకం అందుకుంది. దో బీఘా జమీన్‌ ప్రతిభా ధ్రువపత్రం పొందింది. ఏడు పురస్కారాలతో మొదలైన ఈ ప్రయాణం భారతీయ సినిమాకు ఏడు దశాబ్దాల జాతీయ గుర్తింపునకు బాటలు వేసింది.

 

విస్తరించిన పురస్కారాల పరిధి

1967 నాటి చిత్రాల నుంచి కళాకారులు, సాంకేతిక నిపుణులకు ప్రత్యేక పురస్కారాలు ప్రవేశపెట్టారు. 1968లో ఉత్తమ్‌ కుమార్‌, నర్గీస్‌ తొలి ఉత్తమ నటుడు, ఉత్తమ నటి పురస్కారాలు అందుకున్నారు. అప్పట్లో ఉత్తమ నటుడి పురస్కారాన్ని భరత్‌, ఉత్తమ నటి పురస్కారాన్ని ఊర్వశి అని పిలిచేవారు. దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారాన్ని 1969లో ప్రారంభించి, తొలిసారిగా దేవికారాణికి ప్రదానం చేశారు. భారతీయ సినిమా విస్తరించిన కొద్దీ కొత్త విభాగాలు, సాంకేతిక కళలకు సంబంధించిన పురస్కారాలను చేర్చారు.

 

సంవత్సరం

మైలురాయి

1913

భారతీయ సినిమా చరిత్రలో మైలురాయిగా నిలిచిన ‘రాజా హరిశ్చంద్ర’ చిత్రాన్ని దాదాసాహెబ్‌ ఫాల్కే పూర్తి చేశారు.

1954

సినిమాలకు రాష్ట్ర పురస్కారాల పేరుతో అవార్డులు ప్రారంభమయ్యాయి. తొలి పురస్కారాలను 1953 నాటి చిత్రాలకు అందించారు.

1967–68

కళాకారులు, సాంకేతిక నిపుణులకు పురస్కారాలు ప్రారంభమయ్యాయి. ఉత్తమ్‌ కుమార్‌, నర్గీస్‌ తొలి నటన పురస్కారాలు అందుకున్నారు.

1969

దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారం ప్రారంభమైంది. దేవికారాణి తొలి గ్రహీతగా నిలిచారు.

1973

చలనచిత్రోత్సవాల డైరెక్టరేట్‌ పురస్కారాల నిర్వహణ బాధ్యతలు చేపట్టింది.

2022

చలనచిత్రోత్సవాల డైరెక్టరేట్‌ ఎన్‌ఎఫ్‌డీసీలో విలీనమైంది. ప్రస్తుతం ఎన్‌ఎఫ్‌డీసీ పురస్కారాల అమలు సంస్థగా వ్యవహరిస్తోంది.

2026

72వ పురస్కారాలను జులైలో ప్రకటించారు. గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో ప్రదానోత్సవాన్ని నిర్వహించనున్నారు.

 

లక్ష్యం, ప్రాధాన్యం

జాతీయ చలనచిత్ర పురస్కారాల లక్ష్యాలను అధికారిక నిబంధనలు స్పష్టంగా పేర్కొంటున్నాయి. న‌ట‌న‌, సాంకేతిక నైపుణ్యం, సామాజిక ప్రాధాన్యం కలిగిన చిత్రాల నిర్మాణాన్ని ఇవి ప్రోత్సహిస్తాయి. దేశంలోని వివిధ ప్రాంతాల సంస్కృతులను ప్రేక్షకులు తెలుసుకుని, ఆదరించేందుకు సహాయపడతాయి. తద్వారా దేశ సమైక్యత, సమగ్రతకు తోడ్పడతాయి.

 

సినిమాను ఒక కళారూపంగా అధ్యయనం చేసి, అభినందించేందుకు కూడా ఈ పురస్కారాలు ప్రోత్సాహం అందిస్తాయి. పుస్తకాలు, వ్యాసాలు, సమీక్షల ద్వారా సినిమాపై విమర్శనాత్మక విశ్లేషణ విస్తృత పాఠకులకు చేరుతుంది.

 

ఈ గుర్తింపు ఎందుకు ముఖ్యం?

ఒక చిత్రం దేశం నిర్దేశించిన అత్యున్నత ప్రమాణాలను చేరుకుందని జాతీయ పురస్కారం ధ్రువీకరిస్తుంది. కొద్దిమంది ప్రేక్షకులకే పరిమితమయ్యే అవకాశం ఉన్న చిత్రాలను విస్తృత ప్రేక్షకులకు చేరువ చేస్తుంది. ఈ గౌరవం సినీ రూపకర్తకు కొత్త గుర్తింపు తెచ్చి, తదుపరి ప్రాజెక్టులకు అవకాశాల ద్వారాలు తెరుస్తుంది.

 

పురస్కారాల నిర్మాణం

జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో మూడు ప్రధాన విభాగాలతో పాటు జీవితకాల గౌరవం ఉంటుంది. పూర్తి నిడివి సినిమాలకు కథా చిత్రాల విభాగం వర్తిస్తుంది. డాక్యుమెంటరీలు, లఘు చిత్రాలు, యానిమేషన్‌, అనుబంధ రూపాలకు కథేతర చిత్రాల విభాగం ఉంటుంది. ఉత్తమ పుస్తకం, ఉత్తమ సినీ విమర్శకుడిని సినిమాపై ఉత్తమ రచన విభాగంలో గౌరవిస్తారు. భారతీయ సినిమా రంగంలో అత్యున్నత గౌరవంగా దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారం ప్రత్యేకంగా నిలుస్తుంది.

విభాగం

కేటగిరీలు

పతకం

నగదు బహుమతి

కథా చిత్రాలు

26—ప్రత్యేక ప్రస్తావనలతో కలిపి

స్వర్ణ కమలం, రజత కమలం

₹3,00,000; ₹2,00,000

కథేతర చిత్రాలు

16—ప్రత్యేక ప్రస్తావనలతో కలిపి

స్వర్ణ కమలం, రజత కమలం

₹3,00,000; ₹2,00,000

సినిమాపై ఉత్తమ రచన

2

స్వర్ణ కమలం

₹1,00,000

దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారం

1

స్వర్ణ కమలం, శాలువా

72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ₹10,00,000

 

కథా చిత్రాల విభాగంలో ఉత్తమ కథా చిత్రం, ఉత్తమ దర్శకత్వం, ప్రధాన పాత్రలో ఉత్తమ నటుడు సహా పలు పురస్కారాలు ఉన్నాయి. ఉత్తమ బాలల చిత్రం, ఉత్తమ ఛాయాగ్రహణం, ఉత్తమ సంగీత దర్శకత్వం, ఉత్తమ దుస్తుల రూపకల్పన కూడా ఈ విభాగంలోకి వస్తాయి. కథేతర చిత్రాల విభాగంలో ఉత్తమ డాక్యుమెంటరీ, ఉత్తమ లఘు చిత్రం, ఉత్తమ యానిమేషన్‌ చిత్రం ఉన్నాయి. ఉత్తమ కళలు, సంస్కృతి చిత్రం, ఉత్తమ వ్యాఖ్యానం లేదా గాత్రం, ఉత్తమ స్క్రిప్ట్‌ వంటి విభాగాలు కూడా ఇందులో భాగం.

 

ప్రతి భాషకూ చోటు

రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌లో పేర్కొన్న ప్రతి భాషలో ఉత్తమ కథా చిత్రానికి పురస్కారం అందిస్తారు. షెడ్యూల్‌లో లేని భాషల చిత్రాలకు ప్రత్యేక పురస్కారాలు ఇస్తారు. 72వ విడతలో గఢ్వాలీ చిత్రం ధోలి, తుళు చిత్రం ఇంబు ఈ నిబంధన కింద గుర్తింపు పొందాయి.

 

పురస్కారాలను ఎలా ఎంపిక చేస్తారు?

గత క్యాలెండర్‌ సంవత్సరంలో ధ్రువీకరణ పొందిన చిత్రాల నుంచి ప్రతి ఏటా దరఖాస్తులను ఆహ్వానిస్తారు. మూడు పురస్కార విభాగాలకు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ వేర్వేరు జ్యూరీలను ఏర్పాటు చేస్తుంది. సినిమా, అనుబంధ కళారూపాలు, మానవీయ శాస్త్రాల్లో పేరొందిన వారిని జ్యూరీ సభ్యులుగా ఎంపిక చేస్తారు.

 

ఫీచ‌ర్‌ చిత్రాలకు రెండంచెల పరిశీలన

57వ విడత నుంచి ఫీచ‌ర్‌ చిత్రాలను రెండు అంచెల ప్రక్రియలో పరిశీలిస్తున్నారు. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన చిత్రాలను ఐదు ప్రాంతీయ కమిటీలు తొలుత వడపోస్తాయి. ఫీచ‌ర్‌ చిత్రాల విభాగంలో విజేతలను కేంద్ర కమిటీ నిర్ణయిస్తుంది. నాన్‌-ఫీచ‌ర్‌ చిత్రాలు, సినిమాపై ఉత్తమ రచన విభాగాలకు వేర్వేరు జ్యూరీలు ఉంటాయి. దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారానికి దరఖాస్తులను ఆహ్వానించరు. ప్రముఖ సినీ వ్యక్తులతో ప్రత్యేకంగా ఏర్పాటైన కమిటీ గ్రహీత పేరును సిఫార్సు చేస్తుంది.

 

72వ విడత జ్యూరీలు

72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ఫీచ‌ర్‌ చిత్రాల జ్యూరీకి శ్రీ జయరాజ్‌ అధ్యక్షత వహించారు. నాన్‌-ఫీచ‌ర్‌ చిత్రాల జ్యూరీకి శ్రీ అసీమ్‌ సిన్హా, సినిమాపై ఉత్తమ రచన జ్యూరీకి శ్రీ ఎ. చంద్రశేఖర్‌ అధ్యక్షత వహించారు.

 

అర్హతల సంక్షిప్త వివరణ

పురస్కార సంవత్సరంలో కేంద్ర చలనచిత్ర ధ్రువీకరణ మండలి (సీబీఎఫ్‌సీ) ధ్రువీకరించిన చిత్రాలకు ఆంగ్ల ఉపశీర్షికలు తప్పనిసరి. ఫీచ‌ర్‌ చిత్రం నిడివి 72 నిమిషాలకు పైగా ఉండాలి. గతంలో సమర్పించిన చిత్రాల అనువాద రూపాలు, పునర్నిర్మాణాలు, తిరిగి ఎడిట్‌ చేసిన రూపాలకు అర్హత ఉండదు.

 

భారతీయ సినిమా అంతటా గుర్తింపు

దేశంలోని ప్రతి ప్రాంతంలో రూపొందే సినిమాలను జాతీయ చలనచిత్ర పురస్కారాలకు పరిశీలిస్తారు. 72వ విడతలో మరాఠీ, సంతాలీ, తమిళం, మలయాళం, తెలుగు, కన్నడ చిత్రాలు గౌరవం పొందాయి. వీటితో పాటు తుళు, గఢ్వాలీ సహా పలు భాషల చిత్రాలకు గుర్తింపు లభించింది. నాన్‌-ఫీచ‌ర్‌ చిత్రాల విభాగంలో తొలిసారిగా ఒక సంతాలీ చిత్రానికి పురస్కారం దక్కింది.

 

శ్రీ రవి రాజ్‌ ముర్ము దర్శకత్వం వహించిన అంగెన్‌ దర్శకుడి ఉత్తమ తొలి చిత్రంగా ఎంపికైంది. ఇలాంటి తొలి గుర్తింపు భారతీయ సినిమా పరిధిని మరింత విస్తరించింది.

 

ఈ విడత—ప్రధాన విశేషాలు

72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు 2024లో ధ్రువీకరణ పొందిన భారతీయ చిత్రాలకు వర్తిస్తాయి. ఈ విడతలో ఆర్టికల్‌ 370 ఉత్తమ కథా చిత్రంగా ఎంపికైంది. అదే చిత్రానికి యామీ గౌతమ్‌ ప్రధాన పాత్రలో ఉత్తమ నటి పురస్కారం గెలుచుకున్నారు. భ్రమయుగం, చందు ఛాంపియన్‌ చిత్రాలకు మమ్ముట్టి, కార్తిక్‌ ఆర్యన్‌ ప్రధాన పాత్రలో ఉత్తమ నటుడు పురస్కారాన్ని సంయుక్తంగా గెలుచుకున్నారు.

 

తమిళ చిత్రం అమరన్‌కు శ్రీ రాజ్‌కుమార్‌ పెరియసామి ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యారు. కల్కి 2898 ఏడీ సంపూర్ణ వినోదాన్ని అందించిన ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా నిలిచింది. స్వాతంత్య్ర‌ వీర్‌ సావర్కర్‌ చిత్రానికి శ్రీ రణదీప్‌ హుడా ఉత్తమ తొలి చిత్ర దర్శకుడి పురస్కారం గెలుచుకున్నారు. భంగార్‌ ఉత్తమ నాన్‌-ఫీచ‌ర్‌ చిత్రంగా, రామ్‌–నామీ ఉత్తమ డాక్యుమెంటరీగా ఎంపికయ్యాయి.

 

 

 

72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు—ప్రధాన విజేతలు

72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లోని ప్రధాన విభాగాల వివరాలు ఈ పట్టికలో ఉన్నాయి. భాషా పురస్కారాలు, సాంకేతిక కళలు, ప్రత్యేక ప్రస్తావనలకు సంబంధించిన వివరాలు పూర్తి జాబితాలో విడిగా ఉన్నాయి.

పురస్కారం

చిత్రం–భాష

గ్రహీత

ఉత్తమ కథా చిత్రం

ఆర్టికల్‌ 370–హిందీ

నిర్మాతలు: జియో స్టూడియోస్‌, బీ62 స్టూడియోస్‌; దర్శకుడు: ఆదిత్య సుహాస్‌ జంభాలే

ఉత్తమ దర్శకత్వం

అమరన్‌–తమిళం

రాజ్‌కుమార్‌ పెరియసామి

ప్రధాన పాత్రలో ఉత్తమ నటుడు

భ్రమయుగం–మలయాళం; చందు ఛాంపియన్‌–హిందీ

మమ్ముట్టి, కార్తిక్‌ ఆర్యన్‌–సంయుక్తంగా

ప్రధాన పాత్రలో ఉత్తమ నటి

ఆర్టికల్‌ 370–హిందీ

యామీ గౌతమ్‌

ఉత్తమ సహాయ నటుడు

భక్షక్‌–హిందీ

సంజయ్‌ మిశ్రా

ఉత్తమ సహాయ నటి

మహారాజా–తమిళం; మిథ్యా–కన్నడ

సచనా నమిదాస్‌, రూపశ్రీ వర్కాడి–సంయుక్తంగా

దర్శకుడి ఉత్తమ తొలి చిత్రం

స్వాతంత్ర్య వీర్‌ సావర్కర్‌–హిందీ

రణదీప్‌ హుడా

సంపూర్ణ వినోదాన్ని అందించిన ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం

కల్కి 2898 ఏడీ–తెలుగు

నిర్మాత: వైజయంతీ మూవీస్‌; దర్శకుడు: నాగ్‌ అశ్విన్‌ సింగిరెడ్డి

జాతీయ, సామాజిక, పర్యావరణ విలువలను ప్రోత్సహించిన ఉత్తమ కథా చిత్రం

కెప్టెన్‌ మిల్లర్‌–తమిళం

నిర్మాత: సత్యజ్యోతి ఫిల్మ్స్‌; దర్శకుడు: అరుణ్‌ మాథేశ్వరన్‌

ఉత్తమ బాలల చిత్రం

35–చిన్న కథ కాదు–తెలుగు

నిర్మాతలు: ఎస్‌ ఒరిజినల్స్‌, వాల్తేరు ప్రొడక్షన్స్‌; దర్శకుడు: నందకిశోర్‌ ఈమని

ఉత్తమ సంగీత దర్శకత్వం

ఆర్టికల్‌ 370–హిందీ; అమరన్‌–తమిళం

శాశ్వత్‌ సచ్‌దేవ్‌–పాటలు; జి.వి. ప్రకాశ్‌కుమార్‌–నేపథ్య సంగీతం

ఉత్తమ కథేతర చిత్రం

భంగార్‌–మరాఠీ, ఆంగ్లం

నిర్మాత, దర్శకురాలు: సుమీరా రాయ్‌

దర్శకుడి ఉత్తమ తొలి చిత్రం–కథేతర విభాగం

అంగెన్‌–సంతాలీ

దర్శకుడు: రవి రాజ్‌ ముర్ము

ఉత్తమ డాక్యుమెంటరీ

రామ్‌–నామీ–హిందీ

నిర్మాత: బీబీపీ స్టూడియో వర్చువల్‌ భారత్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌; దర్శకుడు: భారత్‌బాల గణపతి

ఉత్తమ దర్శకత్వం–కథేతర విభాగం

స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ–ఏక్తా కా ప్రతీక్‌–హిందీ

ఆనంద్‌ ఎల్‌. రాయ్‌

సినిమాపై ఉత్తమ పుస్తకం

నానిరువుదే నిమగాగి నాడిరువుదే ననగాగి–కన్నడ

రచయిత: కెంచనూరు ప్రదీప్‌ కుమార్‌ శెట్టి; ప్రచురణకర్త: మిర్రర్‌ పుస్తక

ఉత్తమ సినీ విమర్శకుడు

హిందీ

సంజీవ్‌ శ్రీవాస్తవ

 

దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారం

భారతీయ సినిమా రంగంలో దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారం అత్యున్నత గౌరవం. 1969లో ప్రారంభమైన ఈ పురస్కారాన్ని తొలిసారిగా దేవికారాణికి అందించారు. 1913లో రాజా హరిశ్చంద్ర చిత్రానికి దర్శకత్వం వహించిన దాదాసాహెబ్‌ ఫాల్కే జ్ఞాపకార్థం దీన్ని ఏర్పాటు చేశారు. భారతీయ సినిమా ప్రగతి, అభివృద్ధికి విశేష సేవలు అందించిన వారిని ఈ పురస్కారంతో గౌరవిస్తారు.

 

మీకు తెలుసా?

 

 

దాదాసాహెబ్‌ ఫాల్కేగా ప్రసిద్ధి చెందిన ధుండిరాజ్‌ గోవింద్‌ ఫాల్కే (1870–1944), 1913లో భారత్‌ తొలి పూర్తి నిడివి ఫీచ‌ర్‌ చిత్రం రాజా హరిశ్చంద్రకు దర్శకత్వం వహించారు. ఆ తర్వాత 94 ఫీచ‌ర్‌ చిత్రాలు, 27 లఘు చిత్రాలు రూపొందించారు. భారతీయ సినిమా పితామహుడిగా గౌరవం పొందిన ఆయన జ్ఞాపకార్థం కేంద్ర ప్రభుత్వం 1969లో దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారాన్ని ప్రారంభించింది.

 

2024 దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారం

2024 సంవత్సరానికి దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారాన్ని శ్రీ అనంత్‌ నాగ్‌కు ద‌క్కింది. కేంద్ర ప్రభుత్వం 2026 సెప్టెంబర్‌ 16న ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. ఆయన 1948 సెప్టెంబర్‌ 4న కర్ణాటకలో జన్మించారు. 1970వ దశకం ప్రారంభంలో నటనా ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. కన్నడ కథా చిత్రం సంకల్ప్‌తో సినీ రంగ ప్రవేశం చేసి, అంకుర్‌తో హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టారు.

 

ఆరు భారతీయ భాషల్లో 300కు పైగా చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించారు. విశేష ఆదరణ పొందిన మాల్గుడి డేస్‌ ధారావాహికలోనూ నటించారు. ఐదు ఫిల్మ్‌ఫేర్‌ పురస్కారాలు, ఐదు కర్ణాటక రాష్ట్ర ఉత్తమ నటుడు పురస్కారాలు గెలుచుకున్నారు. కేంద్ర ప్రభుత్వం 2025లో ఆయనను పద్మభూషణ్‌తో గౌరవించింది. ఐదు దశాబ్దాలకు పైగా సాగిన ఆయన సినీ ప్రయాణం తరతరాల కళాకారులకు స్ఫూర్తినిచ్చింది.

 

ఇటీవలి పురస్కార గ్రహీతలు

2023 సంవత్సరానికి శ్రీ మోహన్‌లాల్‌, 2022కు శ్రీ మిథున్‌ చక్రవర్తి, 2021కు శ్రీమతి వహీదా రెహమాన్‌ దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారాలు అందుకున్నారు. ఆయా సంవత్సరాలకు సంబంధించిన జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవంలో వీటిని అందించారు.

 

భారతీయ సినిమా: సంస్కృతి, గుర్తింపు, ప్రభావం

సినిమా భారత్‌లో అత్యంత భావవ్యక్తీకరణ కలిగిన కళారూపాల్లో ఒకటి. దేశానికి శక్తిమంతమైన సాంస్కృతిక సంపదగా నిలుస్తోంది. సృజనాత్మకత, సంస్కృతి, కొత్త ఆవిష్కరణలకు సినిమా ప్రభావవంతమైన మాధ్యమమని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పేర్కొంటోంది. కళాత్మక వ్యక్తీకరణతో పాటు విస్తృత సృజనాత్మక ఆర్థిక వ్యవస్థకు కూడా ఇది ఆధారం. భారత మీడియా, వినోద రంగం ప్రస్తుతం ప్రపంచంలో ఐదో అతిపెద్ద రంగంగా ఉంది. 20 లక్షల నుంచి 25 లక్షల మంది డిజిటల్‌ సృష్టికర్తలు దీనికి అండగా ఉన్నారు. యానిమేషన్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌ సేవల్లో భారత్‌కు 40 నుంచి 60 శాతం వ్యయ ప్రయోజనం ఉంది. భారతీయ చిత్రాలు ప్రపంచ ప్రేక్షకుల ముందుకు దేశ సాంస్కృతిక ప్రభావాన్ని తీసుకెళ్తున్నాయి. వివిధ భాషలు, ప్రాంతాల్లో జీవనోపాధి అవకాశాలను సృష్టిస్తూ సాంస్కృతిక వారసత్వాన్ని బలోపేతం చేస్తున్నాయి.

 

భారతీయ సినిమాకు నిరంతర సహకారం

భారతీయ సినిమా గతంలో ఎన్నడూ లేనన్ని భాషలు, రూపాల్లో ప్రేక్షకులను చేరుతోంది. సినీ ప్రతిభకు దేశ ప్రధాన ప్రమాణంగా జాతీయ చలనచిత్ర పురస్కారాలు కొనసాగుతున్నాయి. వాణిజ్య స్థాయితో సంబంధం లేకుండా నైపుణ్యం, సాహసం, స్పష్టమైన సృజనాత్మక దృష్టిని ఇవి గౌరవిస్తాయి.

 

ఏక్తా నగర్‌కు ప్రదానోత్సవాన్ని తీసుకెళ్లడం ద్వారా రాజధానికి వెలుపల ఉన్న ప్రేక్షకులకు పురస్కారాలు మరింత చేరువవుతున్నాయి. భవిష్యత్తు కార్యక్రమాలు దేశంలోని వివిధ రాష్ట్రాలు, నగరాల్లో జరుగుతాయి. పెద్ద స్టూడియోలకు దూరంగా అభివృద్ధి చెందుతున్న సినీ సంస్కృతులకు జాతీయ వేదిక లభిస్తుంది.

 

72వ విడత ఇప్పటికే ఈ ఆశయాన్ని పలు రూపాల్లో చాటుతోంది. సంతాలీ చిత్రం తొలిసారిగా పురస్కార జాబితాలో చోటు సంపాదించింది. కన్నడ సినీ రంగానికి చెందిన దిగ్గజ నటుడు అత్యున్నత గౌరవాన్ని అందుకోనున్నారు. ఈ విధంగా జాతీయ చలనచిత్ర పురస్కారాలు కళకు, దేశానికి సేవ చేస్తూనే ఉన్నాయి.

References

Ministry of Information & Broadcasting (MIB)

Ministry of Commerce and Industry (Department of Commerce)

Click here to see PDF

 

****

(तथ्य सामग्री आईडी: 151047) आगंतुक पटल : 6


Provide suggestions / comments
इस विश्लेषक को इन भाषाओं में पढ़ें : English , Urdu , हिन्दी , Bengali , Malayalam , Assamese , Marathi , Kannada