Farmer's Welfare
భారతదేశ చక్కెర పరిశ్రమ
प्रविष्टि तिथि:
26 AUG 2026 14:03 PM
చెక్కర రంగం, విలువ శ్రేణి, ఇటీవలి ధరల పెరుగుదలపై అవగాహన
భారతదేశ చక్కెర పరిశ్రమపై ఓ పరిశీలన
భారత చక్కెర పరిశ్రమ వ్యవసాయం, పారిశ్రామిక రంగం, గ్రామీణ జీవనోపాధికి కీలక వ్యవస్థగా నిలుస్తోంది. చెరకు ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది. చెరకు రంగం దాదాపు 5 కోట్ల మంది రైతులతోపాటు చక్కెర కర్మాగారాలు, అనుబంధ పరిశ్రమల్లో సుమారు 5 లక్షల మంది కార్మికులకు ఆధారంగా నిలుస్తోంది.
* కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన మూడో ముందస్తు ఉత్పత్తి అంచనా ప్రకారం 2025–26లో భారత చెరకు ఉత్పత్తి 500 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేరింది. 2015–16లో నమోదైన 348.44 మిలియన్ మెట్రిక్ టన్నులతో పోలిస్తే గత పదేళ్లలో ఇది దాదాపు 43.5 శాతం వృద్ధిని సూచిస్తోంది.

* చెరకు సాగు విస్తీర్ణం కూడా 2015–16లో 49.27 లక్షల హెక్టార్ల నుంచి 2025–26లో 58.87 లక్షల హెక్టార్లకు పెరిగింది.
భారత్‌లో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర అత్యధికంగా చెరకు ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాలు.
* భారత్ 2016–17లో 0.47 లక్షల మెట్రిక్ టన్నుల చక్కెరను ఎగుమతి చేయగా, 2025–26లో 8 లక్షల మెట్రిక్ టన్నులను ఎగుమతి చేసింది.
* 2026–27 చక్కెర సీజన్(అక్టోబర్ నుంచి సెప్టెంబర్ వరకు) కోసం చెరకు న్యాయమైన, గిట్టుబాటు ధరను(ఎఫ్ఆర్పీ) క్వింటాలుకు ₹365గా ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి ప్రాథమిక చక్కెర రికవరీ రేటు 10.25 శాతంగా ఉంది. 9.5 శాతం ప్రాథమిక రికవరీ రేటుతో 2016–17 చక్కెర సీజన్‌కు నిర్ణయించిన క్వింటాలుకు ₹230 ధరతో పోలిస్తే ఇది ₹135 అధికం.

* భారత చక్కెరకు శ్రీలంక, పశ్చిమాసియా, తూర్పు ఆఫ్రికా ప్రధాన ఎగుమతి గమ్యస్థానాలుగా ఉన్నాయి.
* దేశంలో తగినంత చక్కెర నిల్వలు అందుబాటులో ఉన్నాయి. 2025–26లో ఉత్పత్తి కూడా అవసరాలకు సరిపోతుందని అంచనా.
ఇథనాల్ మిశ్రమాన్ని పెంచడంలో భారత చక్కెర పరిశ్రమ పాత్ర
శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించడం, ఇంధన భద్రతను పెంచడం లక్ష్యంగా పెట్రోలులో ఇథనాల్‌ను మిళితం చేస్తున్నారు. సుస్థిర ప్రత్యామ్నాయ ఇంధనాలకు ప్రోత్సాహం ఇవ్వాలన్న ప్రభుత్వ చర్యలకు ఇది అనుగుణంగా ఉంది. రైతులకు స్థిరమైన ఆదాయం అందించడంతోపాటు గ్రీన్‌హౌజ్ వాయు ఉద్గారాలను తగ్గించడానికి కూడా ఈ కార్యక్రమం తోడ్పడుతోంది. అయితే, ఇథనాల్ మిశ్రమం కారణంగా దేశీయ వినియోగానికి చక్కెర కొరత ఏర్పడుతుందని దీని అర్థం కాదు.
* ఇథనాల్ ఉత్పత్తికి మళ్లించిన చక్కెర వాటా 2022–23లో సుమారు 12 శాతం నుంచి 2025–26లో దాదాపు 9 శాతానికి తగ్గింది.
* అంతేకాకుండా దేశంలో ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న ఇథనాల్‌లో దాదాపు నాలుగింట మూడొంతులు ధాన్యాల నుంచి, ముఖ్యంగా మొక్కజొన్న నుంచి లభిస్తోంది.
వాస్తవానికి ఇథనాల్ కార్యక్రమం చెరకు రైతులకు ప్రయోజనం చేకూర్చి, చక్కెర కర్మాగారాలను బలోపేతం చేసింది:
* భారత్ ఏటా సగటున 300–340 లక్షల మెట్రిక్ టన్నుల చక్కెరను ఉత్పత్తి చేస్తోంది.
* దేశంలో ఏటా చక్కెర వినియోగం 280–290 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉంది.
* మిగులు ఉత్పత్తి నమోదైన సంవత్సరాల్లో అదనపు నిల్వల్లో చక్కెర కర్మాగారాల నిధులు చిక్కుకుపోతాయి. దీంతో చెరకు రైతులకు చెల్లింపుల్లో జాప్యం ఏర్పడుతుంది. అదనపు చక్కెరను ఇథనాల్ ఉత్పత్తికి మళ్లించడం ఈ నిర్మాణాత్మక సమస్య పరిష్కారానికి తోడ్పడి, చక్కెర కర్మాగారాల ఆర్థిక స్థితిని మెరుగుపరిచింది.
* 2026 ఆగస్టు 20 నాటికి 2025–26 చక్కెర సీజన్‌కు సంబంధించిన చెరకు బకాయిల్లో 97 శాతం ఇప్పటికే రైతులకు చెల్లించారు.
* చక్కెర కర్మాగారాల ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో ప్రభుత్వ సహాయంపై ఆధారపడటం తగ్గింది.
* అదే సమయంలో వినియోగదారులకు చక్కెర చిల్లర ధరలు కూడా చాలావరకు స్థిరంగా ఉన్నాయి. 2024 ఆగస్టు నుంచి 2026 జూలై మధ్య ఏటా దాదాపు 3 శాతం మాత్రమే పెరిగాయి.
ప్రస్తుత చక్కెర ధరల పెరుగుదలపై విశ్లేషణ
ఇటీవలి వారాల్లో చక్కెర ధరలు పెరిగాయి. 2026 జూలై 20న కిలో ₹48.18గా ఉన్న ధర ఆగస్టు 20 నాటికి కిలో ₹55.70కు చేరింది. నెల రోజుల్లో దాదాపు 15.6 శాతం పెరుగుదలను ఇది సూచిస్తోంది. అయితే, దీర్ఘకాలిక ధోరణి నుంచి ఇటీవలి ధరల కదలికను వేరుగా చూడాలి. ఇంతకుముందు పేర్కొన్నట్లుగా 2024 ఆగస్టు నుంచి 2026 జూలై మధ్య చక్కెర ధరలు ఏటా దాదాపు 3 శాతం మాత్రమే పెరిగాయి. ప్రాథమిక ధరల ధోరణిలో మార్పు కంటే స్వల్పకాలిక సరఫరా, మార్కెట్ పరిస్థితులే ప్రస్తుత పెరుగుదలకు ప్రధాన కారణాలని ఇది సూచిస్తోంది.
ప్రస్తుత చక్కెర ధరల పెరుగుదలకు పలు కారణాలు ఉన్నాయి:
* అంచనా కంటే తక్కువ దేశీయ ఉత్పత్తి,
* పండుగల సీజన్‌కు ముందు పెరిగిన గిరాకీ,
* వాతావరణ పరిస్థితులతో చెరకు పంటకు కలిగిన నష్టం,
* ప్రపంచవ్యాప్తంగా తగ్గుతున్న చక్కెర సరఫరా, పెరుగుతున్న ధరలు,
* పరిశ్రమలోని కొన్ని వర్గాలు చేపట్టిన ఊహాజనిత వ్యాపారం, అక్రమ నిల్వలు.
ప్రస్తుత సీజన్లో చక్కెర ఉత్పత్తి ప్రారంభ అంచనా 343 లక్షల మెట్రిక్ టన్నులతో పోలిస్తే దాదాపు 306 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉండవచ్చని అంచనా. ఎర్రకుళ్లు, టాప్ బోరర్ తెగుళ్లతోపాటు అధిక వర్షపాతం వల్ల ఏర్పడిన నీటి ముంపు ఉత్పత్తిని ప్రభావితం చేశాయి. అయితే, అంచనా కంటే ఉత్పత్తి తక్కువగా ఉన్నప్పటికీ దేశీయ గిరాకీని తీర్చేందుకు అవసరమైన చక్కెర నిల్వలు దేశంలో అందుబాటులో ఉన్నాయి. కొత్త క్రషింగ్ సీజన్ అక్టోబర్‌లో ప్రారంభం కానుంది.
చక్కెర సరఫరా తగ్గడం ప్రపంచవ్యాప్త పరిణామం. ఇది భారత్‌కే పరిమితం కాదు. 2026–27లో ప్రపంచ చక్కెర లోటు దాదాపు 33 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉంటుందని అంచనా. ఫలితంగా అంతర్జాతీయ చక్కెర ధరలు 2026 జూన్ 30న టన్నుకు 474 డాలర్ల నుంచి ఆగస్టు 20 నాటికి 552 డాలర్లకు భారీగా పెరిగాయి. రెండు నెలల కంటే తక్కువ వ్యవధిలో 16 శాతానికి పైగా పెరుగుదలను ఇది సూచిస్తోంది.
పట్టిక–1: పెరుగుతున్న చక్కెర ధరలు–అపోహలు, వాస్తవాలు
|
అపోహ
|
వాస్తవం
|
|
ఇథనాల్‌కు చక్కెరను మళ్లించడంతో ధరలు పెరిగాయి.
|
ఇథనాల్ ఉత్పత్తికి మళ్లించిన చక్కెర 2022–23లో 12 శాతం నుంచి 2025–26లో దాదాపు 9 శాతానికి తగ్గింది.
|
|
ఇథనాల్ తయారీ వల్ల వినియోగదారులకు చక్కెర అందుబాటులో ఉండటం లేదు.
|
భారత్‌లో ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న ఇథనాల్‌లో దాదాపు నాలుగింట మూడొంతులు ధాన్యాల నుంచి, ముఖ్యంగా మొక్కజొన్న నుంచి లభిస్తోంది.
|
|
భారత్ చక్కెర కొరతను ఎదుర్కొంటోంది.
|
కొత్త క్రషింగ్ సీజన్ ప్రారంభమయ్యే వరకు దేశీయ గిరాకీని తీర్చేందుకు తగిన నిల్వలు అందుబాటులో ఉన్నాయి.
|
|
ప్రపంచ చక్కెర ధరలు స్థిరంగా ఉన్నాయి.
|
అంతర్జాతీయ ధరలు టన్నుకు 474 డాలర్ల నుంచి 552 డాలర్లకు పెరిగాయి. రెండు నెలల కంటే తక్కువ వ్యవధిలో 16 శాతానికి పైగా పెరుగుదల నమోదైంది.
|
|
భారత చక్కెర ఉత్పత్తి పూర్తిగా పడిపోయింది.
|
ప్రారంభ అంచనా 343 లక్షల మెట్రిక్ టన్నుల కంటే తక్కువగా ప్రస్తుత ఉత్పత్తి 306 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉంటుందని అంచనా.
|
|
చక్కెర ధరలు నిరంతరం భారీగా పెరుగుతున్నాయి.
|
2024 ఆగస్టు నుంచి 2026 జూలై మధ్య దీర్ఘకాలిక ధరలు ఏటా దాదాపు 3 శాతం మాత్రమే పెరిగాయి. ప్రస్తుత ధరల పెరుగుదల స్వల్పకాలికం.
|
కొన్ని చక్కెర కర్మాగారాలు, వ్యాపారులు చేపట్టిన ఊహాజనిత వ్యాపారం, అక్రమ నిల్వలు కూడా ఇటీవలి ధరల పెరుగుదలకు కారణమైనట్లు ప్రభుత్వం గుర్తించింది.
చక్కెర అక్రమ నిల్వల నియంత్రణ, సరఫరా పెంపునకు ప్రభుత్వ చర్యలు
చక్కెర ధరల్లో స్వల్పకాలిక పెరుగుదలను నియంత్రించడానికి, కొనసాగుతున్న అక్రమ నిల్వలను అరికట్టడానికి ప్రభుత్వం కింది చర్యలు చేపట్టింది:
1. 2026 ఆగస్టు 1 నుంచి నవంబర్ 30 వరకు దేశవ్యాప్తంగా చక్కెర డీలర్లపై 400 టన్నుల నిల్వ పరిమితిని విధించింది.
2. 2026 సెప్టెంబర్ 1 నుంచి భారీ వినియోగదారులు 15 రోజుల వినియోగానికి మించిన చక్కెర నిల్వలను ఉంచడానికి అనుమతి ఉండదు.
3. అక్రమ నిల్వలు, కృత్రిమ కొరతను గుర్తించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కూడిన సంయుక్త బృందాలు చక్కెర కర్మాగారాల్లో నిల్వలను ప్రత్యక్షంగా తనిఖీ చేస్తున్నాయి.
4. దేశీయంగా చక్కెర లభ్యతను పెంచేందుకు ముందుజాగ్రత్త చర్యగా 10 లక్షల మెట్రిక్ టన్నుల ముడి చక్కెరను సుంకం లేకుండా దిగుమతి చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతించాలని నిర్ణయించింది.
5. 2026 అక్టోబర్ 15 నుంచి క్రషింగ్ ప్రారంభించాలని రాష్ట్రాలు, చక్కెర కర్మాగారాలకు సూచించింది. దీంతో అక్టోబర్‌లో సాధారణంగా నమోదయ్యే 3–4 లక్షల మెట్రిక్ టన్నుల చక్కెర ఉత్పత్తి 10 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా పెరుగుతుందని అంచనా. పండుగల సీజన్లో చక్కెర లభ్యతను ఇది మెరుగుపరుస్తుంది.
ప్రస్తుత ధరల పెరుగుదలకు అతీతంగా
భారతదేశ చక్కెర రంగం రైతులు, కర్మాగారాలు, ఇంధన ఉత్పత్తి, ప్రపంచ వాణిజ్యానికి మద్దతు ఇచ్చే వైవిధ్యభరిత పరిశ్రమగా పరిణామం చెందింది. తక్కువ ఉత్పత్తి, సీజనల్ గిరాకీ, ప్రపంచ సరఫరా పరిస్థితులు, మార్కెట్ విధానాలు ఇటీవలి ధరల ఒత్తిడికి కారణమయ్యాయి. అయితే, ఈ రంగ విస్తృత వృద్ధి, వైవిధ్యీకరణ నేపథ్యంలో ఈ ఒత్తిళ్లు తాత్కాలికమే. వినియోగదారుల ప్రయోజనాలు, రైతులకు సకాలంలో చెల్లింపులు, పరిశ్రమ స్థిరత్వం మధ్య సమతుల్యతను కొనసాగించడం ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యంగా ఉంది.
References
Ministry of Agriculture & Farmers Welfare
https://dfpd.gov.in/sugar-policy/en
https://www.nfsm.gov.in/BriefNote/BN_Sugarcane.pdf
https://sansad.in/getFile/annex/241/Au1986.pdf?source=pqars
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2258113®=3&lang=1
https://www.pib.gov.in/Pressreleaseshare.aspx?PRID=1555573®=48&lang=2
https://www.pib.gov.in/PressReleaseDetail.aspx?PRID=2302874®=48&lang=1
Ministry of Commerce & Industry
https://agriwelfare.gov.in/Documents/Time_Series_3rdAE_2025_26_En.pdf
https://agriexchange.apeda.gov.in/India/GenerateAPEDAProductReport/Index
https://www.ibef.org/blogs/from-fields-to-fuel-the-indian-sugar-industry-s-role-in-advancing-ethanol-blending
Ministry of Petroleum & Natural Gas
https://www.pib.gov.in/PressReleaseDetail.aspx?PRID=2249431®=3&lang=2
Ministry of Consumer Affairs, Food & Public Distribution
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2302018&lang=1®=3
PIB Backgrounder
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2245639®=3&lang=1
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2248987®=3&lang=1
Click to see pdf
***
(तथ्य सामग्री आईडी: 150982)
आगंतुक पटल : 86
Provide suggestions / comments