Infrastructure
భారత తొలి హైడ్రోజన్ రైలు: పర్యావరణహిత రైల్వే ప్రయాణం వైపు అడుగులు
प्रविष्टि तिथि:
16 JUL 2026 12:33 AM
హైడ్రోజన్ రైలు విప్లవం
భారతీయ రైల్వే స్వచ్ఛమైన, పర్యావరణహిత రవాణా రంగంలో ఒక కొత్త శకంలోకి అడుగుపెడుతోంది. శిలాజ ఇంధన ఆధారిత రైలు వ్యవస్థలకు ప్రత్యామ్నాయంగా ప్రపంచవ్యాప్తంగా హైడ్రోజన్ ఇంధన కణ(ఫ్యూయల్ సెల్) సాంకేతికత వేగంగా దూసుకుపోతోంది. భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ హైడ్రోజన్ రైలు ఈ అత్యాధునిక సాంకేతికతను అందుకోవడంలో ఒక కీలక మైలురాయి. ఈ రైలు ప్రయాణించేటప్పుడే సొంతంగా హైడ్రోజన్‌తో విద్యుత్‌ను తయారు చేసుకుంటుంది. 2026 జూలై 17న ప్రారంభం కానున్న ఈ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ రైలు త్వరలోనే పట్టాలెక్కనుంది. ఉత్తర రైల్వే పరిధిలోని జింద్-సోనిపట్ మార్గంలో ఇది నడుస్తుంది. ఈ ప్రాజెక్టు అత్యాధునిక చోదక(ప్రొపల్షన్) సాంకేతికతతో పాటు ప్రత్యేక హైడ్రోజన్ నిల్వ, రీఫ్యూయలింగ్, నిర్వహణ మౌలిక వసతులను కలిగి ఉంటుంది. భారతదేశంలో పర్యావరణహిత రైలు రవాణా సాధ్యమేనని ఇది నిరూపించనుంది. ఒక పైలట్ ప్రాజెక్టుగా రూపుదిద్దుకున్న ఈ కార్యక్రమం రైల్వే రంగంలో కొత్త ఆవిష్కరణల పట్ల భారతీయ రైల్వేకు ఉన్న అంకితభావాన్ని చాటుతోంది. ఇది ఇంధన సామర్థ్యాన్ని పెంపొందించడంతో పాటు పర్యావరణ అనుకూల రవాణాను ప్రోత్సహిస్తుంది.
దీనితో హైడ్రోజన్ ఆధారిత రైలు రవాణాను పరీక్షిస్తున్న జర్మనీ, జపాన్, చైనా, అమెరికా వంటి దేశాల సరసన భారత్ కూడా చేరింది. ఈ సాంకేతికత ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నందున, ఈ ప్రాజెక్టు ద్వారా లభించే అనుభవం భవిష్యత్తు నిర్వహణకు ఎంతో ఉపయోగపడుతుంది. రైల్వే రంగంలో మున్ముందు హైడ్రోజన్ రవాణా విస్తరణకు ఇది ఎంతగానో తోడ్పడుతుంది.
దేశపు తొలి హైడ్రోజన్ రైలు విశేషాలు
రిసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్(ఆర్‌డీఎస్ఓ) రూపొందించిన డిజైన్ ఆమోదం, సాంకేతిక ప్రమాణాల ఆధారంగా ఈ హైడ్రోజన్ రైలు ప్రాజెక్టును సిద్ధం చేశారు. పూర్తిగా భారతదేశంలోనే రూపకల్పన చేసి, అభివృద్ధి చేసిన ఈ ప్రాజెక్టు 'ఆత్మనిర్భర్ భారత్' సంకల్పాన్ని ప్రతిబింబిస్తోంది.
జింద్-సోనిపట్ మార్గంలో నడిచే హైడ్రోజన్ రైలు ప్రధాన ముఖ్యాంశాలు
* 10 కోచ్‌లు కలిగిన హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఆధారిత రైలు.
* 1200 కేడబ్ల్యూ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ చోదక వ్యవస్థతో నడుస్తుంది.
* గరిష్టంగా గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా దీనిని రూపొందించగా, ప్రస్తుతం గంటకు 75 కిలోమీటర్ల వేగంతో నడపడానికి అనుమతి లభించింది.
* దాదాపు 2,600 మంది ప్రయాణికులను తీసుకెళ్లగల సామర్థ్యం ఉంది.
* రూపకల్పన దశ నుంచి నమూనా(ప్రోటోటైప్) తయారీ వరకు అంతా స్వదేశీ పరిజ్ఞానంతోనే సాగింది.
* ఇది జింద్ జంక్షన్, గోహనా జంక్షన్, సోనిపట్‌లను అనుసంధానిస్తూ మధ్యలో ఉండే స్టేషన్ల ప్రయాణికులకు సేవలు అందిస్తుంది.
* ఈ రైలు జింద్ సిటీ, పాండు పిండారా జంక్షన్, లలిత్ ఖేరా హాల్ట్, భంబేవా, ఇసాపూర్ ఖేరీ హాల్ట్, బుటానా హాల్ట్, ఖాండ్రాయ్ హాల్ట్, రబ్రా హాల్ట్, లాత్ హాల్ట్, మోహన, బర్వాస్ని హాల్ట్, సోనిపట్ న్యూ స్టేషన్లలో ఆగుతుంది.

రైలు వెనుక ఉన్న సాంకేతికత
హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ సాంకేతికత రసాయన చర్య ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ప్రధాన ఇంధన వనరు 'ప్రోటాన్ ఎక్స్ఛేంజ్ మెంబ్రేన్ ఫ్యూయల్ సెల్'(పీఈఎంఎఫ్‌సీ). ఇది ప్రోటాన్లను ప్రసరింపజేసే 'పెర్‌ఫ్లోరోసల్ఫోనిక్ యాసిడ్'(పీఎఫ్ఎస్ఏ) పాలిమర్ పొర గుండా హైడ్రోజన్, ఆక్సిజన్ల మధ్య చర్య జరిపి విద్యుత్‌ను తయారు చేస్తుంది. ఈ ప్రక్రియలో కేవలం నీటి ఆవిరి, వేడి మాత్రమే ఉప-ఉత్పత్తులుగా వస్తాయి. డీజిల్ శక్తి సామర్థ్యం 43 ఎంజే/కేజీ(మెగాజూల్స్/కిలోగ్రామ్) కాగా, హైడ్రోజన్ అత్యంత ఎక్కువ శక్తిని ఇచ్చే ఇంధనం. దీని సామర్థ్యం 120 ఎంజే/కేజీగా ఉంటుంది. ఇది తక్కువ నిర్వహణ ఖర్చుతో పాటు అతి తక్కువ కార్బన్ ఉద్గారాలను విడుదల చేస్తుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రైల్వే చోదక సాంకేతికతల్లో హైడ్రోజన్ అత్యంత స్వచ్ఛమైనది. దీని కోసం భారతీయ రైల్వే ప్రత్యేక మౌలిక వసతులను ఏర్పాటు చేసింది.

హైడ్రోజన్ మౌలిక వసతులు
హర్యానాలోని జింద్‌లో దేశంలోనే అతిపెద్ద రైల్వే హైడ్రోజన్ నిల్వ, రీఫ్యూయలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. స్వదేశీ సాంకేతికతతో నిర్మించిన ఈ కేంద్రంలో ఒకేసారి దాదాపు 3,000 కిలోల హైడ్రోజన్‌ను నిల్వ చేయవచ్చు. ఇది హైడ్రోజన్ రైలు నడవడానికి తోడ్పడుతుంది. పెట్రోలియం అండ్ ఎక్స్‌ప్లోజివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్(పీఈఎస్ఓ) దీనికి అవసరమైన అనుమతులు మంజూరు చేసింది. ఈ అనుమతి ప్రకారం ఇక్కడ కంప్రెస్డ్ హైడ్రోజన్ గ్యాస్ నిల్వ, పంపిణీ చేయవచ్చు. ఈ హైడ్రోజన్ వ్యవస్థను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించారు. ఇందులో ఎన్ఎఫ్‌పీఏ-2 (నేషనల్ ఫైర్ ప్రొటెక్షన్ అసోసియేషన్), ఐఎస్ఓ(ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్) 19880 సిరీస్ ప్రమాణాలను పాటించారు. ప్రపంచ ప్రసిద్ధ జర్మన్ సాంకేతిక తనిఖీ సంస్థ 'టవ్ సడ్' ఈ మొత్తం వ్యవస్థకు స్వతంత్ర భద్రతా పరీక్షలు నిర్వహించింది.
ఈ రైలులో రెండు హైడ్రోజన్ డ్రైవింగ్ పవర్ కార్లు(డీపీసీలు), ఎనిమిది ట్రైలర్ కోచ్‌లు(టీసీలు) ఉన్నాయి. ప్రతి పవర్ కార్‌లో ఫ్యూయల్ సెల్స్, లిథియం ఐరన్ ఫాస్ఫేట్(ఎల్ఎఫ్‌పీ) బ్యాటరీలు, హైడ్రోజన్ నిల్వ సిలిండర్లు అమర్చారు. నమ్మకమైన సేవల కోసం ఈ కింది సదుపాయాలు కల్పించారు:
* రీఫ్యూయలింగ్ ప్రక్రియ కోసం హైడ్రోజన్ కంప్రెషన్ వ్యవస్థ.
* నిరంతర పనితీరు కోసం సాంకేతిక సహాయం, కీలకమైన అదనపు విడిభాగాలు.
* అడ్డంకులు లేని రీఫ్యూయలింగ్ కోసం ప్రత్యామ్నాయ కంప్రెసర్ సౌకర్యం.
ఈ సమీకృత మౌలిక వసతులు హైడ్రోజన్ రైలు సురక్షితంగా, సమర్థవంతంగా నడవడానికి తోడ్పడతాయి.

సురక్షిత ప్రయాణానికి భద్రతా చర్యలు
హైడ్రోజన్ రైలు ప్రయాణం కోసం భారతీయ రైల్వే సమగ్రమైన కార్యాచరణ, భద్రతా నియమావళిని రూపొందించింది. హైడ్రోజన్ నిల్వ, బదిలీ, వినియోగంలో ప్రతి దశను వివిధ స్వతంత్ర భద్రతా వ్యవస్థలు నిరంతరం పర్యవేక్షిస్తూ రక్షణ కల్పిస్తాయి.
కార్యాచరణ సన్నద్ధత
* ప్రామాణిక నిర్వహణ పద్ధతులు, క్రమబద్ధమైన తనిఖీలు, కఠినమైన భద్రతా నిబంధనలను సిద్ధం చేశారు.
* ఢిల్లీలోని శకూర్ బస్తీలో ఉన్న నిర్వహణ కేంద్రాన్ని హైడ్రోజన్ రైలు సేవలకు సిద్ధం చేశారు.
* ప్రత్యేక శిక్షణ పొంది, ధ్రువీకరణ పత్రాలు సాధించిన సిబ్బంది మాత్రమే కీలకమైన పనులను పర్యవేక్షిస్తారు.
* ప్రారంభ దశలో సాంకేతిక సిబ్బంది రైలు ప్రయాణంలో వెంట ఉంటారు.
* హైడ్రోజన్ రీఫ్యూయలింగ్ వ్యవస్థ నిరంతరం నిఘాలో ఉంటుంది.
రక్షణ చర్యలు
* ఉత్పత్తి, నిల్వ, పంపిణీ కేంద్రాలలో హైడ్రోజన్ లీకేజీలను గుర్తించే పరికరాలను అమర్చారు.
* నిరంతర పర్యవేక్షణ కోసం మంటలను గుర్తించే సెన్సార్లను కూడా ఏర్పాటు చేశారు.
* భద్రతా సెన్సార్లను క్రమం తప్పకుండా తనిఖీ చేస్తూ శుభ్రపరుస్తారు.
* రైలు లోపల నిరంతరం గాలి ప్రసరించేలా వెంటిలేషన్ సౌకర్యం ఉంటుంది.
* వేడి, మంట లేదా పొగ వంటి అసాధారణ పరిస్థితులను గుర్తిస్తే, ఈ వ్యవస్థ స్వయంచాలకంగా హైడ్రోజన్ సరఫరాను నిలిపివేస్తుంది.
* అత్యవసర పరిస్థితుల్లో రైలును సురక్షిత ప్రాంతానికి తరలించడానికి లోకో పైలట్ క్యాబిన్‌లో ప్రత్యేక సదుపాయాన్ని కల్పించారు.
* లోకో పైలట్‌కు రైలు వ్యవస్థ పనితీరును నిరంతరం చూపించే ఒక ప్రత్యేక స్క్రీన్ ఉంటుంది.
* సురక్షిత ప్రయాణం కోసం క్రమబద్ధమైన తనిఖీ, నిర్వహణ సమయ పట్టికలను రూపొందించారు.
పర్యావరణహిత రైల్వే ప్రయాణం దిశగా..
ఈ హైడ్రోజన్ రైలు కేవలం ఒక కొత్త రైలును ప్రవేశపెట్టడం మాత్రమే కాదు. భవిష్యత్తులో నడిచే హైడ్రోజన్ రైళ్లకు అవసరమైన వ్యవస్థలు, మౌలిక వసతులు, సామర్థ్యాన్ని ఇది నిర్మిస్తుంది. సాంకేతికతను, నిర్వహణ పద్ధతులను, సేవా విధానాలను పరీక్షించడానికి ఈ ప్రాజెక్టు సహాయపడుతుంది. భవిష్యత్తులో పెద్ద ఎత్తున హైడ్రోజన్ రైళ్లను నడపడానికి అవసరమైన సాంకేతిక నైపుణ్యాన్ని ఇది బలోపేతం చేస్తుంది. ఇది జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్, పర్యావరణ కాలుష్య రహిత(నెట్-జీరో కార్బన్ ఉద్గారాలు) లక్ష్యాలకు మద్దతుగా నిలుస్తుంది. భారతీయ రైల్వే ఆధునికీకరణలో భాగంగా చేపట్టిన ఈ ప్రయత్నం భవిష్యత్తులో విస్తృత వినియోగానికి బలమైన పునాది వేస్తుంది. అత్యంత దృఢమైన, పర్యావరణహిత రవాణా వ్యవస్థను నిర్మించడంలో ఈ ప్రాజెక్టు ఒక కీలకమైన అడుగు.
References
Ministry of Railways
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2201556®=48&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2265781®=3&lang=1
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2285240®=48&lang=1
https://rdso.indianrailways.gov.in/railwayboard/uploads/directorate/stat_econ/2024/Indian%20Railways%20Annual%20Report%20%26%20Accounts%202022-23%20ENGLISH.pdf
Ministry of Information and Broadcasting
https://www.facebook.com/inbministry/videos/indias-first-hydrogen-powered-train-is-set-to-redefine-rail-travel-clean-green-a/813246554362679/
Click here to see pdf
***
(तथ्य सामग्री आईडी: 150784)
आगंतुक पटल : 6
Provide suggestions / comments