Social Welfare
పోషణ్ ట్రాకర్
प्रविष्टि तिथि:
08 JUL 2026 15:11 PM
భారతదేశ పోషకాహార నిరంతర పర్యవేక్షణ వేదిక
పోషణ్ ట్రాకర్: సాంకేతిక ఆధారిత పోషకాహార విధానానికి ఊతం
పోషకాహార లోపాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా వివిధ విభాగాల సమన్వయం, సాంకేతికత, ప్రజల భాగస్వామ్యంతో ఫలితాలను సాధించేందుకు భారత ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక జాతీయ పోషకాహార మిషన్ 'పోషణ్ అభియాన్' (ప్రధానమంత్రి సమగ్ర పోషకాహార పథకం). 2018 మార్చి 8న ప్రారంభమైన ఈ బహుళ-మంత్రిత్వ శాఖల మిషన్.. నిర్దేశిత కాలపరిమితి లక్ష్యాలు, డిజిటల్ పర్యవేక్షణ, 'జన్ ఆందోళన్' (ప్రజా ఉద్యమం) విధానంతో ఒకే సమగ్ర కార్యాచరణ కింద పనిచేస్తుంది. కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ(ఎంఓడబ్ల్యూసీడీ) ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ మిషన్.. పోషకాహారాన్ని కేవలం ఒక సంక్షేమ అంశంగా కాకుండా జాతీయ అభివృద్ధి ప్రాధాన్యతగా మార్చింది.
ఆ తర్వాత 2021-22 బడ్జెట్లో పోషకాహారానికి సంబంధించిన మూడు పథకాలను - పోషణ్ అభియాన్, అంగన్వాడీ సేవలు, కౌమార బాలికల పథకం - విలీనం చేసి 'మిషన్ పోషణ్ 2.0' (మిషన్ సక్షమ్ అంగన్వాడీ, పోషణ్ 2.0)గా రూపొందించారు.
పోషణ్ అభియాన్‌కు డిజిటల్ వెన్నెముకగా నిలుస్తున్న మొబైల్ ఆధారిత పాలనా అప్లికేషన్ 'పోషణ్ ట్రాకర్'. ఈ అభియాన్ కింద డిజిటల్ పర్యవేక్షణను బలోపేతం చేయడానికి ఇది ప్రధాన పాలనా సాధనంగా పనిచేస్తుంది. మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, జాతీయ ఇ-గవర్నెన్స్ డివిజన్(ఎన్ఈజీడీ) సంయుక్తంగా 'సక్షమ్ అంగన్వాడీ, పోషణ్ 2.0' కింద 2021 మార్చిలో దీనిని ప్రారంభించాయి. ఇది ఒకే డిజిటల్ వేదిక ద్వారా అంగన్వాడీ సేవల పరిధిలోని పోషకాహారం, సేవల పంపిణీని దాదాపు నిరంతరం పర్యవేక్షించేందుకు వీలు కల్పిస్తుంది.
అంగన్వాడీల మౌలిక సదుపాయాలు, సేవల పంపిణీ, లబ్ధిదారుల పరిధి, ఎదుగుదల పర్యవేక్షణ వంటి డేటాను పోషణ్ ట్రాకర్ నమోదు చేస్తుంది. స్మార్ట్ఫోన్లు, ఇంటర్నెట్ సౌకర్యం ద్వారా అంగన్వాడీ కార్యకర్తలు ఎలాంటి ఇబ్బంది లేకుండా సమాచారాన్ని నమోదు చేస్తున్నారు. నిరంతర డ్యాష్‌బోర్డ్‌లు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలలో పారదర్శకమైన, ఆధారాలతో కూడిన నిర్ణయాలు తీసుకోవడానికి తోడ్పడుతున్నాయి. పోషణ్ ట్రాకర్ అంగన్వాడీ కార్యకర్తలకు ఒక సహాయకారిగా పనిచేస్తూ, పిల్లలలో వయసుకు తగ్గ ఎదుగుదల లేకపోవడం, బరువు తక్కువగా ఉండటం, తీవ్రమైన పోషకాహార లోపం వంటి సమస్యలను గుర్తించడానికి, చివరి లబ్ధిదారుని వరకు పోషకాహార సేవలను పర్యవేక్షించడానికి ఉపయోగపడుతోంది.
మీకు తెలుసా?
భారత ప్రభుత్వానికి చెందిన 'సక్షమ్ అంగన్వాడీ మరియు పోషణ్ 2.0' సమగ్ర కార్యక్రమం పోషకాహార లోపాన్ని నివారిస్తూ ఆరోగ్యం, శ్రేయస్సు, రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. పునర్వ్యవస్థీకరించిన ఈ మిషన్ పిల్లలు, గర్భిణులు, పాలిచ్చే తల్లులు, కౌమార బాలికలకు పోషకాహార మద్దతును; పూర్వ ప్రాథమిక విద్య (3-6 సంవత్సరాలు), ప్రారంభ ప్రేరణ (0-3 సంవత్సరాలు) మరియు అంగన్వాడీ కేంద్రాలను 'సక్షమ్ అంగన్వాడీలు'గా ఆధునీకరించడంతో సహా మౌలిక సదుపాయాల అభివృద్ధిని విలీనం చేసింది. సక్షమ్ అంగన్వాడీ చొరవ కింద ప్రస్తుతం ఉన్న అంగన్వాడీ కేంద్రాలను ఎల్ఈడీ స్క్రీన్లు, వాటర్ ప్యూరిఫైయర్లు, స్మార్ట్ లెర్నింగ్ ఎయిడ్స్, పోషణ్ వాటికలు(పోషక తోటలు) వంటి ఆధునిక సౌకర్యాలతో ఆధునీకరించి సేవల నాణ్యతను పెంచుతున్నారు.
పోషణ్ ట్రాకర్ అధునాతన ఫీచర్లు
పోషణ్ ట్రాకర్ రాకముందు అంగన్వాడీ కార్యకర్తలు 11 మాన్యువల్ రిజిస్టర్లను నిర్వహించాల్సి వచ్చేది. దీనివల్ల నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యమై, సేవల పంపిణీలో లోపాలు తలెత్తేవి. గృహ సందర్శనలు ఎక్కువగా వ్యక్తిగత అవగాహన, అనుభవంపైనే ఆధారపడి సాగడం వల్ల అంచనాలలో స్థిరత్వం ఉండేది కాదు. లబ్ధిదారుల ధ్రువీకరణ వ్యవస్థ గానీ, రాష్ట్ర, కేంద్ర పథకాలతో అనుసంధానం గానీ లేకపోవడంతో పోషకాహార లోపాన్ని అరికట్టడంలో సమర్థత తగ్గేది.
పోషణ్ ట్రాకర్ సాంకేతిక ఆధారిత ఫీచర్ల ద్వారా ఈ లోపాలను సరిదిద్దింది:
* ఆధార్ ఆధారిత ధ్రువీకరణ: నిధుల దుర్వినియోగాన్ని అరికడుతుంది. నకిలీ నమోదులను తొలగిస్తుంది. కేవలం అర్హులైన లబ్ధిదారులకే ప్రయోజనాలు అందేలా చూస్తుంది.
* ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్(ఎఫ్ఆర్ఎస్): చివరి లబ్ధిదారుని వరకు సేవల పంపిణీ పారదర్శకతను ట్రాక్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది.
* ఐటీ ఆధారిత గృహ సందర్శన షెడ్యూలర్: స్వయంచాలక షెడ్యూలింగ్, వయసుకు తగిన కౌన్సిలింగ్ సూచనలతో 23 నిర్మాణాత్మక గృహ సందర్శనలకు మద్దతు ఇస్తుంది. వీటిలో గర్భధారణ సమయంలో 4 సందర్శనలు, ప్రసవం తర్వాత మొదటి నెలలో 4, 2 నెలల నుంచి 1 సంవత్సరం వరకు 7, 1-2 సంవత్సరాల మధ్య 5, 2-3 సంవత్సరాల మధ్య 3 సందర్శనలు ఉంటాయి.
* ఈసీసీఈ కంటెంట్ డెలివరీ: 3-6 సంవత్సరాల పిల్లల కోసం 'ఆధార్శిల' ఆధారంగా 249 వీడియోలు, 190 వాయిస్ నోట్స్, 159 ఈసీసీఈ యాక్టివిటీ పీడీఎఫ్‌లను అందిస్తుంది.
మీకు తెలుసా?
2024 మార్చిలో ప్రారంభమైన ఆధార్శిల... 3-6 సంవత్సరాల పిల్లల కోసం రూపొందించిన ప్రారంభ బాల్య సంరక్షణ, విద్య(ఈసీసీఈ) జాతీయ పాఠ్యప్రణాళిక. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అమలువుతున్న ఈ కార్యక్రమం బొమ్మలు, కళలు, సంగీతం, కథల ద్వారా ఆటపాటల అభ్యాసాన్ని ప్రోత్సహిస్తుంది. "పునాది రాయి" అనే అర్థం వచ్చే ఆధార్శిల, పిల్లల మేధో, సామాజిక, భావోద్వేగ, శారీరక ఎదుగుదలకు తోడ్పడుతూ వారిని ఒకటో తరగతికి సిద్ధం చేస్తుంది.
* పోషణ్ కాలిక్యులేటర్: పిల్లల వయసు, లింగం ఆధారంగా ఎత్తు, బరువులను అంచనా వేయడానికి డబ్ల్యూహెచ్ఓ శిశు ఎదుగుదల ప్రమాణాలను ఉపయోగిస్తుంది. దీని ద్వారా పిల్లల ఎదుగుదల లోపం, తక్కువ బరువు, తీవ్రమైన పోషకాహార లోపం(ఎస్ఏఎం/ఎంఏఎం), అధిక బరువు/స్థూలకాయాన్ని కచ్చితంగా పర్యవేక్షించవచ్చు.
* పోషణ్ హెల్ప్‌లైన్: ఫిర్యాదుల నమోదు కోసం టోల్ ఫ్రీ నంబర్ 1515 అందుబాటులో ఉంది.
* స్మార్ట్‌ఫోన్, కనెక్టివిటీ: అంగన్వాడీ కార్యకర్తలందరికీ స్మార్ట్ఫోన్లు అందించారు. ఇంటర్నెట్ కనెక్టివిటీ ఛార్జీల కోసం ఒక్కో కార్యకర్తకు ఏడాదికి రూ.2,000 చెల్లిస్తున్నారు. ప్రతి అంగన్వాడీ కేంద్రానికి ఎదుగుదల పర్యవేక్షణ పరికరాలను(జీఎండీ) సమకూర్చారు.
ఈ అధునాతన ఫీచర్లు క్షేత్రస్థాయిలో పోషకాహార కార్యక్రమాల సమర్థతను, స్థిరత్వాన్ని, స్పందనా గుణాన్ని పెంపొందించాయి.
మెరుగైన పోషక భారత్ దిశగా ప్రగతి పర్యవేక్షణ
పోషణ్ ట్రాకర్‌ను దేశవ్యాప్తంగా విస్తరించడానికి ముందు పైలట్ ప్రాజెక్టుల ద్వారా దశలవారీగా అమలు చేశారు. క్లౌడ్ మౌలిక సదుపాయాలను ఉపయోగించుకోవడం వల్ల ఈ ప్లాట్‌ఫారమ్ భారీ డేటాను, ఏకకాల వినియోగదారులను సమర్థవంతంగా నిర్వహిస్తూ విస్తరణకు అనువుగా మారింది. అధునాతన డ్యాష్‌బోర్డ్‌లు నిజసమయ దృశ్య విశ్లేషణలను అందిస్తూ, పోషకాహార లోపాలను వెంటనే సరిదిద్దేందుకు భాగస్వాములకు సహాయపడుతున్నాయి. రాష్ట్ర స్థాయి కోఆర్డినేటర్లు, నిరంతర వర్చువల్ సమావేశాల మద్దతుతో కూడిన 'ట్రైన్ ది ట్రైనర్' నమూనా నిరంతర శిక్షణకు తోడ్పడుతోంది. నిరంతర పర్యవేక్షణ, కాలపరిమితితో కూడిన ఆదేశాలు నిబంధనల అమలును నిర్ధారిస్తున్నాయి.

* 2026 మే నాటికి భారత ప్రభుత్వం దేశంలోని అన్ని 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలలో పోషణ్ ట్రాకర్ పరిధిని విస్తరించింది.
* 2026 మే నాటికి పోషణ్ ట్రాకర్‌లో 8.93 కోట్లకు పైగా లబ్ధిదారులు నమోదయ్యారు. ఈ వేదిక బాల్యం, కౌమారం నుంచి గర్భధారణ, మాతృత్వం వరకు జీవిత చక్రంలోని ఆరు లబ్ధిదారుల వర్గాలను కవర్ చేస్తూ పోషణ్ అభియాన్ సమగ్ర, అందరినీ కలుపుపోయే విధానాన్ని ప్రతిబింబిస్తుంది.
* అంగన్వాడీ సేవల పరిధిలోని అనుబంధ పోషకాహార కార్యక్రమాన్ని(ఎస్ఎన్పీ) డైనమిక్‌గా పర్యవేక్షించడానికి పోషణ్ ట్రాకర్ వీలు కల్పిస్తుంది. 2026 మే డేటా ప్రకారం 5.5 కోట్లకు పైగా లబ్ధిదారులు కనీసం 15 రోజుల పాటు 5.17 కోట్ల మంది లబ్ధిదారులు కనీసం 21 రోజుల పాటు అనుబంధ పోషకాహారాన్ని అందుకున్నారు.

మీకు తెలుసా?
మహిళలు, పిల్లల పోషకాహార ప్రమాణాలను మెరుగుపరచడానికి సమగ్ర శిశు అభివృద్ధి సేవల(ఐసీడీఎస్) పథకం కింద మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ అనుబంధ పోషకాహార కార్యక్రమాన్ని(ఎస్ఎన్పీ) అమలు చేస్తోంది. ఈ కార్యక్రమం 6 నెలల నుంచి 6 సంవత్సరాల పిల్లలు, గర్భిణులు, పాలిచ్చే తల్లులు, ఈశాన్య రాష్ట్రాలు, ఆశావహ జిల్లాలకు చెందిన 14-18 సంవత్సరాల కౌమార బాలికలకు వర్తిస్తుంది.
* 2026 మే నాటికి పోషణ్ ట్రాకర్ ఆధార్ ధ్రువీకరించిన సమాచారం ఆధారంగా 7.7 కోట్లకు పైగా పిల్లల పోషకాహార సూచీలను పర్యవేక్షిస్తూ నెలవారీ ప్రత్యక్ష డేటాబేస్‌ను నిర్వహిస్తోంది. ఈ వేదిక నిరంతర పర్యవేక్షణ డ్యాష్‌బోర్డ్‌లు, హీట్ మ్యాప్‌లు, ఆధారాలతో కూడిన విధాన రూపకల్పనకు వీలు కల్పిస్తుంది.
* ఈ ట్రాకర్ 0-5 సంవత్సరాల వయసు గల 6.3 కోట్లకు పైగా పిల్లల ఎదుగుదలను పర్యవేక్షించింది. ఇది 2026 మే నాటికి నమోదైన లబ్ధిదారులలో దాదాపు 94 శాతానికి సమానం. ఈ అప్లికేషన్ పిల్లల ఎదుగుదల లోపం, తక్కువ బరువు, తీవ్రమైన పోషకాహార లోపం(ఎస్ఏఎం/ఎంఏఎం), అధిక బరువు/స్థూలకాయం సూచీలను ట్రాక్ చేస్తుంది.

పోషణ్ ట్రాకర్: డిజిటల్ ఇండియా విజయగాథ
భారీ స్థాయిలో ప్రజలకు సేవలను అందించడంలో సాంకేతికతను ప్రభుత్వం విజయవంతంగా ఉపయోగించడాన్ని పోషణ్ ట్రాకర్ నిరూపిస్తుంది. ఇది కాగితపు నివేదికల విధానాన్ని మార్చి, నిరంతర, ఆధారాలతో కూడిన పోషకాహార విధానాన్ని తీసుకువచ్చింది. ఈ వేదిక సకాలంలో లభించే క్షేత్రస్థాయి డేటా ద్వారా పారదర్శకమైన, జవాబుదారీతనంతో కూడిన నిర్ణయాలకు బలాన్ని ఇస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) దీనిని ఒక ఆదర్శవంతమైన పోషకాహార డేటా వ్యవస్థగా పేర్కొంది. ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ అత్యవసర నిధి (యూనిసెఫ్) అంగన్వాడీ కార్యకర్తల కోసం దీనికున్న సరళతను, లబ్ధిదారుల ట్రాకింగ్ ఫీచర్లను అభినందించింది. 2023లో జరిగిన మహిళా సాధికారత జీ20 మంత్రివర్గ సదస్సులో పోషణ్ ట్రాకర్‌ను ప్రదర్శించారు. పోషకాహార పర్యవేక్షణ, ఈసీసీఈ సేవల పంపిణీలో దీని పాత్రను అధ్యక్ష ప్రకటన గుర్తించింది. 2025 ఏప్రిల్‌లో పోషణ్ ట్రాకర్ ప్రజా పరిపాలనలో విశిష్టతకు గానూ ప్రధానమంత్రి అవార్డును అందుకుంది. అలాగే 2024 సెప్టెంబర్‌లో జరిగిన 27వ జాతీయ ఇ-గవర్నెన్స్ కాన్ఫరెన్స్‌లో పోషణ్ ట్రాకర్ జాతీయ ఇ-గవర్నెన్స్ అవార్డు(గోల్డ్) గెలుచుకుంది. పోషణ్ ట్రాకర్ డిజిటల్ ఇండియా విజన్ కింద భారతదేశ పెరుగుతున్న డిజిటల్ సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుంది. సుపోషిత వికసిత్ భారత్ నిర్మాణంలో ఇది కీలక పాత్ర పోషిస్తూనే ఉంటుంది.
References:
Ministry of Women and Child Development
Poshan Tracker
Digital India Corporation
DD News
Click here to see pdf
***
(तथ्य सामग्री आईडी: 150777)
आगंतुक पटल : 53
Provide suggestions / comments