Technology
మానస్: మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ఒక డిజిటల్ కవచం
प्रविष्टि तिथि:
02 JUL 2026 11:27 AM
జాతీయ మాదకద్రవ్యాల హెల్ప్లైన్, నషా ముక్త్ భారత్ కోసం పౌరులను శక్తివంతం చేయడం
మానస్: పౌరులకు శక్తిని అందించే వ్యవస్థ

భారత ప్రభుత్వం మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణాను ఒక ప్రధాన సామాజిక మరియు ప్రజారోగ్య సమస్యలుగా గుర్తించింది. ఈ సమస్యలు వ్యక్తులకే కాకుండా, కుటుంబాలు, సమాజాలు, ప్రజా భద్రతపై కూడా ప్రభావం చూపుతాయి. పౌరుల భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు, సహాయ సేవల లభ్యతను మెరుగుపరిచేందుకు, మాదకద్రవ్యాలకు సంబంధించిన కార్యకలాపాలను నివేదించడానికి, సహాయం కోరెందుకు అందుబాటులో ఉండే, గోప్యమైన వేదిక అవసరాన్ని ప్రభుత్వం గుర్తించింది.
ఈ అవసరాన్ని తీర్చేందుకు, భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబి) ఆధ్వర్యంలో, డిజిటల్ ఇండియా కార్పొరేషన్ (డీఐసీ) సహకారంతో 18 జూలై 2024న జాతీయ మాదకద్రవ్యాల హెల్ప్లైన్ మానస్ ( మడక్ పదార్థ నిషెధ్ ఆసూచనా కేంద్ర ) ను ప్రారంభించారు. సురక్షితమైన, సాంకేతికత ఆధారిత వేదికగా ‘మానస్’ను నిర్మించారు. పౌరులు మాదకద్రవ్యాలకు సంబంధించిన కార్యకలాపాలను నివేదించడానికి, కౌన్సెలింగ్ కోరడానికి, ఎప్పుడైనా పునరావాస సహాయాన్ని పొందడానికి వీలు కల్పిస్తుంది.
డిజిటల్ ఇండియా దార్శనికతను, నషా ముక్త్ భారత్ లక్ష్యాన్ని “మానస్” ఒకటిగా చేస్తుంది. ఈ ప్లాట్ఫారమ్ జాతీయ హెల్ప్లైన్ నంబర్ 1933, అధికారిక పోర్టల్, ఇమెయిల్ మరియు ఉమాంగ్ యాప్ ద్వారా అందుబాటులో ఉంది. ఈ ప్లాట్ఫారమ్ల ద్వారా కావాల్సిన మద్దతును అందుబాటులోకి తీసుకొచ్చి మానస్ పౌరులను నిశ్శబ్ద ప్రేక్షకులుగా ఉండేలా కాకుండా, మాదకద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో వారిని పాల్గొనేలా చేస్తుంది.
|
మీకు తెలుసా?
భారతదేశంలో మాదకద్రవ్యాల దుర్వినియోగ తీవ్రత గురించి భారతదేశ మొట్టమొదటి సమగ్ర నివేదిక (2019) వాటి సమస్య వాస్తవ స్థాయిని వెల్లడించింది.
- సుమారు 16 కోట్ల మంది మద్యం సేవిస్తుండగా, వీరిలో 5.7 కోట్లకు పైగా ప్రజలు తీవ్రంగా ప్రభావితమవుతున్నారు.
- 3.1 కోట్ల మంది గంజాయిని, 2.26 కోట్ల మంది ఓపియాయిడ్లను, సుమారు 1.18 కోట్ల మంది మత్తుమందులను వినియోగిస్తున్నారు.
- సుమారు 2.8 కోట్ల మంది కేవలం ఓపియాయిడ్ల నే వినియోగిస్తున్నారు. వీరిలో సుమారు 28 లక్షల మందికి తక్షణ చికిత్స చాలా అవసరం.
|

మానస్ అందించేవి
మానస్ అనేది పౌరుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని... రిపోర్టింగ్, కౌన్సెలింగ్, అవగాహన వంటి సేవలను ఒకే వేదికలో కలిపి రూపొందించారు.

- పౌరులు వారి గుర్తింపును వెల్లడించకుండానే మాదకద్రవ్యాల అక్రమ రవాణా, అమ్మకం, అక్రమ సాగు వంటి సంబంధిత కార్యకలాపాల గురించి గోప్యంగా నివేదించవచ్చు.
- వ్యసనాల బారినపడి బాధపడుతున్న వ్యక్తులు కౌన్సెలింగ్ మరియు సహాయాన్ని పొందవచ్చు. వారి కాల్స్ సామాజిక న్యాయ మరియు సాధికారత మంత్రిత్వ శాఖ హెల్ప్లైన్ 14446కు బదిలీ అవుతాయి.
- 1933 హెల్ప్లైన్, వెబ్ పోర్టల్, ఉమాంగ్ అప్లికేషన్ ద్వారా ఈ సేవలు ఎప్పుడైనా అందుబాటులో ఉంటాయి. తద్వారా దేశవ్యాప్త ఈ సేవలను పొందవచ్చు.
- డిజిటల్ టికెట్ జనరేషన్, వర్క్ఫ్లో మేనేజ్మెంట్ సంబంధిత ఏజెన్సీలతో వేగవంతమైన సమాచార మార్పిడికి వీలు కల్పిస్తాయి. తద్వారా సమన్వయ, ప్రతిస్పందన సమయం మెరుగుపడతాయి.
- ఈ సేవల అందుబాటును మరింత విస్తృతం చేసేందుకు బహుభాషా కాల్ మద్దతు, స్మార్ట్ ఐవిఆర్ఎస్, చాట్బాట్ అనుసంధానం, ప్రాంతీయ భాషా సహాయం వంటి సమగ్ర ఫీచర్లును అభివృద్ధి చేస్తున్నారు.
|
మత్తుపదార్థాలకు బానిసైన వ్యక్తికి నేను ఎలా సహాయం చేయగలను?
మత్తుపదార్థాలకు బానిసైన వ్యక్తి, వాటి సరఫరా మరియు గిరాకీ అనే ఒక క్రూరమైన వలయంలో బాధితుడు. వారిని గౌరవిస్తూ, సమీపంలోని ప్రభుత్వ వ్యసన విముక్తి కేంద్రంలో వృత్తిపరమైన, వైద్యపరమైన సహాయాన్ని పొందేలా ప్రోత్సహించాలి. కౌన్సెలింగ్, థెరపీని వారిని తీసుకునేలా ప్రోత్సహించాలి.
|
ప్రభావం: క్రమంగా పెరుగుతున్న ప్రజా విశ్వాసం

ప్రారంభమైనప్పటి నుంచి, మానస్ పౌరులకు చేరువైంది. ప్రజా సేవల పంపిణీని బలోపేతం చేసింది. మాదకద్రవ్యాల చట్ట అమలు సంస్థల మధ్య సమన్వయాన్ని మెరుగుపరిచింది. సురక్షితమైన మార్గాల ద్వారా మాదకద్రవ్యాలకు సంబంధించిన కార్యకలాపాలను మరింత సులభంగా నివేదించేలా పౌరులకు ఈ వేదిక వీలు కల్పించింది. ఇది పౌరులు మరియు చట్ట అమలు సంస్థల మధ్య సమాచార మార్పిడిని కూడా బలోపేతం చేసింది. మాదకద్రవ్యాల అక్రమ రవాణా మరియు వ్యసనానికి వ్యతిరేకంగా ప్రతిస్పందన యంత్రాంగాలను మెరుగుపరిచింది.
దేశవ్యాప్తంగా కౌన్సెలింగ్, పునరావాసం, అవగాహన సేవల అందుబాటును కూడా మెరుగుపరిచింది. పెరుగుతున్న వృత్తిపరమైన కౌన్సెలింగ్ మద్ధతు మాదకద్రవ్యాల దుర్వినియోగ సమస్యలకు సహాయాన్ని కోరెందుకు పౌరులలో అధిక సుముఖతను ప్రతిబింబిస్తుంది. ఆన్లైన్ వేదికల ద్వారా జరిగే అవగాహన కార్యక్రమాలు మాదకద్రవ్య వ్యతిరేక ప్రచారాలలో విస్తృత ప్రజానీకం, యువత భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాయి. ఈ వేదిక ద్వారా పూర్తిగా డిజిటలైజ్ చేసిన కార్యచరణ విధానాల సమన్వయం మరియు సేవల పంపిణీని మెరుగుపరిచాయి. ఇది సాంకేతికత ఆధారిత పౌర భాగస్వామ్యం ద్వారా 'నషా ముక్త్ భారత్' అనే బృహత్ లక్ష్యానికి కూడా మద్దతు ఇస్తోంది .
మానస్ డిజిటల్ ఇండియా వాగ్దానాన్ని ఎలా బలపరుస్తుంది

పౌరులను రక్షించేందుకు, ప్రజా సేవలను అందించేందుకు సాంకేతికతను ఎలా ఉపయోగించుకోవచ్చో చెప్పడానికి మానస్ ఒక ప్రత్యక్ష ఉదాహరణ. ఇది మిషన్ ఆశయాన్ని స్పష్టమైన, ఆచరణాత్మక మార్గాల్లో ముందుకు తీసుకువెళుతుంది:
- మానస్ ఇరవై నాలుగు గంటలూ పనిచేస్తూ, భారతదేశంలో ఎక్కడి నుంచైనా దీనిని సంప్రదించవచ్చు.
- ఇది ప్రజల అప్రమత్తతను ఉపయోగకరమైన, రికార్డు చేయబడిన సమాచారంగా మారుస్తుంది. తద్వారా ప్రజలు సేవలను నిష్క్రియాత్మకంగా స్వీకరించేవారిగా కాకుండా పరిపాలనలో చురుకైన భాగస్వాములుగా మారతారు.
- డిజిటలైజ్డ్ వర్క్ఫ్లోల ద్వారా ప్రతి నివేదికను లాగ్, నమోదు, ట్రాక్ చేయవచ్చు మరియు పరిష్కరించవచ్చు. వేగం, పారదర్శకత, జవాబుదారీతనాన్ని తీసుకొస్తుంది.
- ఇది ప్రజలను 30 ఎన్సిబి జోనల్ యూనిట్లు, 36 రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల మాదకద్రవ్యాల నిరోధక టాస్క్ ఫోర్స్‌ల (ఎఎన్టీఎఫ్) తో నేరుగా అనుసంధానిస్తుంది.
- ఈ పోర్టల్ ను ఏకీకృత, సురక్షితమైన, ద్విభాషా వేదికగా రూపొందించారు.
- ఇది దేశవ్యాప్తంగా ఉన్న టీనేజర్లు, యువతను భాగస్వామ్యం చేసేందుకు, మైగవ్ పోర్టల్లో క్విజ్లు, పోస్టర్స్, రీల్-మేకింగ్ పోటీల ద్వారా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తుంది .
- సమాచారం డిజిటల్గా సేకరించబడుతుంది కాబట్టి, ఆ డేటాను నమూనాలు మరియు పోకడల కోసం అధ్యయనం చేయవచ్చు. ఇది సమస్యలు ఎక్కడ తలెత్తుతున్నాయో గుర్తించి, వాటికి తగిన ప్రతిస్పందనను ప్రణాళిక చేసుకోవడానికి సంస్థలకు సహాయపడుతుంది.
నషా ముక్త్ భారత్ దిశగా
పౌర సంరక్షణ, సామాజిక శ్రేయస్సు కోసం డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (డిపిఐ)ను ఎలా ఉపయోగించవచ్చో మానస్ తెలుపుతుంది. సాంకేతికత, పౌర భాగస్వామ్యం, కౌన్సెలింగ్, అనలిటిక్స్, సురక్షితమైన రిపోర్టింగ్లను అనుసంధానించడం ద్వారా ఈ ప్లాట్ఫారమ్ ఒక్కో నివేదిక, ఒక్కో పిలుపుతో సురక్షితమైన, ఆరోగ్యకరమైన, మాదకద్రవ్య రహిత భారతదేశాన్ని నిర్మించడంలో సహాయపడుతోంది. దీని పరిధి విస్తరిస్తూ, సాధనాలు పరిపక్వం చెందుతున్న కొద్దీ, డిజిటల్ మరియు మానవతా దృక్పథం రెండింటినీ కలిగి ఉన్న పరిపాలనకు మానస్ ఒక స్పష్టమైన ఉదాహరణగా నిలుస్తుంది.
సూచనలు
హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ
పిడిఎఫ్ చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి
****
(तथ्य सामग्री आईडी: 150775)
आगंतुक पटल : 36
Provide suggestions / comments