నాడు పోస్టు చేయడమైనది:
26 NOV 2026 7:43PM by PIB Hyderabad
రాబోయే 2027-28 కేంద్ర బడ్జెట్టు రూపకల్పనకు ఉద్దేశించిన ముందస్తు సంప్రదింపు సమావేశాలను కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 2026 నవంబర్ 16, 26 తేదీల మధ్య నిర్వహించారు.
ఈ రోజు నిర్వహించిన 13వ తుది ప్రీబడ్జెట్టు సంప్రదింపుల సమావేశానికి కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ అధ్యక్షత వహించారు.
ఈ సంప్రదింపులలో 13 రంగాలు, ఆసక్తిదారు బృందాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 200 మందికి పైగా పాల్గొన్నారు. వారిలో పరిశ్రమ సంఘాలు, డొమైన్ నిపుణులు, భారతదేశ కార్పొరేట్ రంగ ప్రముఖులు, విద్యారంగ ప్రముఖులు, యువత ప్రతినిధులే కాక, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, తయారీ, సూక్ష్మ చిన్న మధ్యతరహా వాణిజ్య సంస్థలు (ఎమ్ఎస్ఎమ్ఈస్), అంకుర సంస్థలు, పెట్టుబడి మార్కెట్లు, బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా, సమాచార సాంకేతికత, మౌలిక సదుపాయాలు, ఇంధనం, సుస్థిరత్వం, ఉపాధి, కార్మిక, గృహనిర్మాణ, పట్టణీకరణ, సంస్కృతి, ఆరోగ్యం, సామాజిక అంశాలు, పరిశోధన, అభివృద్ధి, ఉన్నత విద్య, పాఠశాల విద్య, వృత్తి విద్య, నైపుణ్యాలు, క్రీడలు, యువజన వ్యవహారాలు, అర్థశాస్త్ర రంగాలకు చెందిన వారు ఉన్నారు. ఈ సంవత్సరం కొత్తగా యువతరం ప్రతినిధులతో కూడా సంప్రదింపుల సమావేశాన్ని నిర్వహించారు.
చర్చలలో ఆర్థిక వ్యవహారాల విభాగ కార్యదర్శి అనురాధా ఠాకుర్, ముఖ్య ఆర్థిక సలహాదారు డాక్టర్ వి. అనంత నాగేశ్వరన్, ఆర్థిక శాఖకు చెందిన సీనియర్ అధికారులతో పాటు వేర్వేరు మంత్రిత్వ శాఖలు, విభాగాల కార్యదర్శులు పాలుపంచుకున్నారు.
ఈ సంప్రదింపులలో భారత మానవ వనరులు, నూతన ఆవిష్కరణల విస్తారిత అనుబంధ వ్యవస్థ, తయారీ రంగంలో పోటీతత్వం, వ్యవసాయ రంగంలో ఉత్పాదకత, గృహ సురక్ష, విద్యారంగాలను బలోపేతం చేసే ఉద్దేశంతో దూరదృష్టి కలిగిన అనేక సిఫారసులు, ప్రతిపాదనలు అందాయి. సమ్మిళిత, బహుళ రంగ అభివృద్ధికి ఊతాన్ని అందిస్తూ, ఆర్థిక వృద్ధిని మరింత పెంపొందింప చేయగల సంస్కరణలను తీసుకురావలసిన అవసరం ఎంతైనా ఉందని ఆసక్తిదారులు స్పష్టం చేశారు.
బయోఫర్టిలైజర్లను, ఆధునిక బయోటెక్నాలజీ ఆధారిత వ్యావసాయిక ఇన్‌పుట్స్‌ను దేశీయంగా తయారు చేయడాన్ని ప్రోత్సహించడం, సాధ్యమైనంతవరకు స్థానికంగా అందుబాటులో ఉన్న హార్డ్‌వేర్‌కు ఉపయోగపడే రంగం- వారీ కృత్రిమ మేధ (ఏఐ) నమూనాల్ని రూపొందించి ఏఐలో భారత పోటీతత్వాన్ని మెరుగుపరచడానికి సంబంధించిన ఆలోచనలు, ఎమ్ఎస్ఎమ్ఈ, చిన్న ఆర్థిక సహాయ సంస్థల మధ్య సైబర్ స్వచ్ఛత సంబంధిత అవగాహనను పటిష్టపరిచే కార్యక్రమాలు, గ్రామీణ యువత, కార్మికులకు ఉత్పాదక వ్యవసాయేతర ఉపాధి రంగాలు, సుస్థిర వాణిజ్య సంస్థల్లోకి మారడానికి సాయపడే నిర్దిష్ట చర్యలు వంటివి ప్రభుత్వం అందుకున్న కీలక సూచనలు, సలహాలలో ఉన్నాయి.
ప్రతి విద్యార్థి అయిదో తరగతి చివరికల్లా ఒక వార్తాపత్రికను చదువగలిగి, అందులోని విషయాలను అర్థం చేసుకోగలిగేలా దేశవ్యాప్తంగా ఒక పఠన ఉద్యమాన్ని ప్రారంభించాలని కూడా సమావేశాలలో పాల్గొన్న వారు సిఫారసు చేశారు. గృహనిర్మాణ రంగంలో, పట్టణ ప్రాంతాల్లో తక్కువ ధరల నివాసాల నిర్మాణాన్ని విస్తరించడానికి గాను అద్దె ఇళ్ల పద్ధతిని ప్రోత్సహించడానికి ప్రాధాన్యాన్ని ఇవ్వాలని ఆసక్తిదారు వర్గాల ప్రతినిధులు ప్రస్తావించారు. యువతీయువకులు విద్యాభ్యాసం నుంచి ఉద్యోగాలు చేయడం, సొంతగా వాణిజ్య సంస్థలను నెలకొల్పగలిగే దశకు చేరుకొనే క్రమంలో వారికి మద్దతివ్వడానికి రెండో అంచె, మూడో అంచె నగరాల అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని కూడా సూచనలు అందాయి.
నూతన ఆవిష్కరణలు ప్రధాన పాత్రను పోషించే రీతిన అభివృద్ధిని ప్రోత్సహించడం, ఉద్యోగకల్పనను విస్తరించడం, సామాజిక ఆర్థిక మౌలిక స్వరూపాన్ని బలోపేతం చేయడంతో పాటు, ఆటుపోటులకు తట్టుకొని నిలిచేలా, భావికాలపు అవసరాలను తీర్చడానికి సన్నద్ధంగా ఉండేలా ఆర్థిక వ్యవస్థను పటిష్ఠపరచడం.. ఇవి మొత్తంమీద సిఫారసుల ముఖ్య ఉద్దేశాలుగా ఉన్నాయి.
బడ్జెట్టు సమర్పణకు ముందు జరిపిన ఈ సంప్రదింపులు బడ్జెట్టు రూపకల్పనలో ప్రభుత్వం అనుసరించే ప్రాతినిధ్యపూర్వక, సంప్రదింపుల విధానంలో ఓ ముఖ్య భాగం. ఈ ప్రక్రియ దేశ అభివృద్ధి ప్రాధాన్యాలకు, వృద్ధి అజెండాకు రూపురేఖలను కల్పించడంలో తోడ్పడటానికి వేరు వేరు ఆసక్తిదారులకు అవకాశాల్ని అందిస్తుంది.
***