కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కేబినెట్ ఆమోదం తర్వాత రూ.2,632 కోట్ల ఆర్థిక కేటాయింపుతో ఆధునీకరణను వేగవంతం చేసిన ఇండియా పోస్ట్

దేశవ్యాప్తంగా తపాలా మౌలిక సదుపాయాల ఆధునీకరణ, రవాణా వ్యవస్థ బలోపేతం, పౌర కేంద్రీకృత సేవలను మెరుగుపరిచేందుకు పెట్టుబడులు

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికత, నిరంతర సహకారంతో ఆధునిక, సమర్థవంతమైన, పౌర కేంద్రీకృత ప్రజా రవాణా సంస్థగా ఇండియా పోస్టు: కేంద్రమంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా

నాడు పోస్టు చేయడమైనది: 26 NOV 2026 8:08PM by PIB Hyderabad

16వ ఆర్థిక సంఘం కాలపరిమితి (2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు)కి తపాలా కార్యకలాపాలు, ఎస్టేట్స్ నిర్వహణ పథకాలకు మొత్తం రూ. 2,632 కోట్ల ఆర్థిక కేటాయింపులతో ఆధునీకరణ ప్రక్రియను ఇండియా పోస్టు మరింత వేగవంతం చేయనుంది. ఇందులో ప్రతిపాదిత తపాలా కార్యకలాపాల పథకం కొనసాగింపు కోసం రూ. 1,141 కోట్లు, కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన ఎస్టేట్స్ నిర్వహణ పథకం కొనసాగింపు కోసం రూ. 1,491 కోట్లు కేటాయించారు.

కేంద్ర కమ్యూనికేషన్లు, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా, కమ్యూనికేషన్లు, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయమంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, తపాలా శాఖ కార్యదర్శి శ్రీ సుబ్రత్ దాస్, ఇతర సీనియర్ అధికారులతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

దేశవ్యాప్తంగా ఉన్న తపాలా కార్యాలయాలను ఆధునిక, పౌర-కేంద్రీకృత సేవా కేంద్రాలుగా తీర్చిదిద్దటంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వానికి, నిరంతర సహకారానికి కేంద్రమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. తపాలా కార్యాలయాల ఆధునీకరణకు సంబంధించిన ఆర్థిక కేటాయింపులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపటంతో ప్రధానమంత్రి అందించిన మద్దతును ప్రత్యేకంగా ప్రశంసించారు. పరివర్తనాత్మక ప్రయాణానికి ఇది కొత్త ఊపునిస్తుందని పేర్కొన్నారు.

ఉద్యోగులందరికీ కేంద్రమంత్రి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... "జాతీయ సరిహద్దులను దాటి అంతర్జాతీయ స్థాయికి విస్తరించగల సామర్థ్యం ఉన్న ఈ సంస్థను ఆధునీకరించేందుకు ఇండియా పోస్టులోని ప్రతి సభ్యుడు అచంచలమైన అంకితభావంతో, దృఢ సంకల్పంతో పనిచేశారు. నిబద్ధతను విజయాలుగా మలచాలనే ఉమ్మడి సంకల్పంతో ఏకమై, ఈ దార్శనికతను సాకారం చేసేందుకు ఉద్యోగులందరూ అవిశ్రాంతంగా కృషి చేశారు" అని అన్నారు.

వృద్ధి రేటు, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక, వివిధ అభివృద్ధి రంగాలకు బడ్జెట్ కేటాయింపుల విభజనను తపాలా శాఖ కార్యదర్శి వివరణాత్మక ప్రజెంటేషన్ ద్వారా తెలిపారు. సమగ్ర బీమా నిర్వహణ వ్యవస్థ (ఐఎంఎస్) తీసుకువచ్చిన సమూల మార్పులను ప్రముఖంగా ప్రస్తావించారు. దీని ద్వారా పీఎల్ఐ పాలసీని కొనుగోలు చేసే ప్రక్రియను ప్రారంభం నుంచి చివరి వరకు సుమారు 20 నిమిషాల్లోనే పూర్తి చేయవచ్చు. ఈ విధానం ద్వారా ఇప్పటికే సుమారు 2 లక్షల మంది వినియోగదారులకు ప్రీమియం చెల్లింపుల లావాదేవీలు సులభతరం కాగా సుమారు రూ. 60 కోట్ల ఆదాయం సమకూరింది.

ఆవిష్కరణలు, వృద్ధి విషయంలో శాఖ అనుసరిస్తున్న సంస్థాగత విధానాన్ని తపాలా శాఖ కార్యదర్శి మరింత వివరంగా తెలిపారు. ఈ క్రమంలో డేటా అనలిటిక్స్ బృందం, సిక్స్ సిగ్మా బృందం, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ పాత్రలను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. ఆరు ప్రధాన వ్యాపార విభాగాలతో సన్నిహిత సమన్వయంతో నూతన ఉత్పత్తులు, సేవలను అభివృద్ధి చేయటం, ఆదాయ ఆర్జన అవకాశాలను గుర్తించటం, సేవల నాణ్యతను నిరంతరం మెరుగుపరచటంపై ఈ బృందాలు దృష్టి సారిస్తాయి.

ఈ సమగ్ర సంస్థాగత విధానం ఇండియా పోస్టు పరివర్తనకు కీలకమైనదని, ఆరు సేవా విభాగాలు దానికి ఆత్మ వంటివని కేంద్రమంత్రి పేర్కొన్నారు. అత్యున్నత నాణ్యత, సామర్థ్యం, వినియోగదారుల సంతృప్తికి భరోసా కల్పిస్తూ, ఉత్పత్తులు, సేవలను నిరంతరం ఆధునీకరించటం, మెరుగుపరచటం ఈ సమీకృత విధాన ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు.

శాఖ వృద్ధి లక్ష్యాలను స్పష్టం చేస్తూ... కార్యకలాపాల సామర్థ్యం, పార్శిల్, లాజిస్టిక్స్ సేవల విస్తరణ, సాంకేతికత వినియోగం, మెరుగైన వినియోగదారుల అనుసంధానం ద్వారా 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఇండియా పోస్టు వార్షిక ఆదాయాన్ని సుమారు రూ.19,803 కోట్లకు చేర్చాలనే దార్శనికతను తపాలా శాఖ కార్యదర్శి వివరించారు.

కార్యకలాపాల బలోపేతం, మౌలిక సదుపాయాల ఆధునీకరణ

తపాలా కార్యకలాపాల పథకం రూ. 1,141 కోట్ల వ్యయంతో ఆరు ప్రధాన అంశాలపై దృష్టి సారిస్తుంది. వీటిలో గ్రామీణ తపాలా సేవలను అందుబాటులో ఉంచటం, మెయిల్ నెట్‌వర్క్ ఆప్టిమైజేషన్, పార్శిల్ నెట్‌వర్క్ ఆప్టిమైజేషన్, అంతర్జాతీయ తపాలా మౌలిక సదుపాయాలు, మార్కెటింగ్ - సేవా నాణ్యత, తపాలా బిళ్లల సేకరణ కార్యకలాపాలున్నాయి.

తపాలా భవనాల ఆధునీకరణ, వినియోగదారులకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనపై రూ. 1,491 కోట్లతో ఎస్టేట్స్ మేనేజ్‌మెంట్ పథకం ప్రధానంగా దృష్టి సారిస్తుంది. ఇందులో భాగంగా 190 కొత్త డిపార్ట్‌మెంటల్ తపాలా భవనాల నిర్మాణం, 50 భవనాల పునర్నిర్మాణం, 2,550 డిపార్ట్‌మెంటల్ సబ్-పోస్టాఫీసుల నవీకరణ - బ్రాండింగ్, 2,500 అద్దె పోస్టాఫీసుల ఆధునీకరణ, 20 వారసత్వ తపాలా భవనాల పరిరక్షణ వంటి ముఖ్య కార్యక్రమాలు చేపడతారు. 150 నివాస కాలనీల పునరుద్ధరణకు, బెంగళూరులోని సెంటర్ ఫర్ సీఈపీటీ కోసం శాశ్వత ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ సెంటర్ అభివృద్ధికి ఈ పథకం తోడ్పడుతుంది.

సరికొత్త పెట్టుబడులు, సాంకేతికత ఆధారిత ఆధునీకరణ, స్పష్టమైన వృద్ధి దార్శనికతతో ఇండియా పోస్టు దేశవ్యాప్త నెట్‌వర్క్‌ను విస్తరణ, అత్యుత్తమ సేవల తదుపరి దశలోకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతోంది.

***


(రిలీజ్ ఐడి: 2342564) సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Bengali , Gujarati