సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

74,636 మంది ప్రజల భాగస్వామ్యంతో ముగిసిన ‘నషా ముక్త్ యువ, వికసిత్ భారత్ క్విజ్’

20 ప్రశ్నలకు గాను 13.82గా నమోదైన సగటు స్కోరు.. అత్యధిక స్కోరు 20గా నమోదు

క్విజ్ పూర్తి చేయడానికి వెచ్చించిన సగటు సమయం 4 నిమిషాలు

14.40 కోట్ల మంది యువత, 11.38 కోట్ల మంది మహిళలతో సహా 35.97 కోట్లకు పైగా ప్రజలకు చేరువైన ‘నషా ముక్త్ భారత్ అభియాన్’

విద్యా సంస్థల్లో నిర్వహించిన 34.40 లక్షలకు పైగా కార్యక్రమాలు.. సామాజిక న్యాయం, సాధికారత విభాగం (డీఓఎస్‌జేఈ) మద్దతుతో నడుస్తోన్న 755 కంటే ఎక్కువ గల వ్యసన విముక్తి కేంద్రాల ద్వారా చికిత్స, పునరావాసం పొందిన 39.91 లక్షల మంది

50.45 లక్షలకు పైగా ‘నషా ముక్త్’ ప్రతిజ్ఞలు.. 2 లక్షలకు పైగా ‘నషా ముక్తి మిత్రల’ నమోదు

నాడు పోస్టు చేయడమైనది: 26 NOV 2026 4:00PM by PIB Hyderabad

కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ (ఎన్ఎంబీఏ) కింద నిర్వహించిన ఆన్‌లైన్ ‘నషా ముక్త్ యువ, వికసిత్ భారత్ క్విజ్’.. దేశవ్యాప్తంగా ప్రజల ప్రోత్సాహకరమైన భాగస్వామ్యంతో 2026 నవంబర్ 25న ముగిసింది.

ఈ క్విజ్‌లో మొత్తం 74,636 మంది పాల్గొన్నారు. వీరంతా 20 ప్రశ్నలకు గాను 13.82 సగటు స్కోరు సాధించారు. అత్యధిక స్కోరు 20గా నమోదైంది. క్విజ్‌లో పాల్గొన్నవారు దానిని పూర్తి చేయడానికి సగటున సుమారు 4 నిమిషాలు వెచ్చించారు. మత్తుపదార్థాల వినియోగ నివారణపై అవగాహనను బలోపేతం చేసే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రజల చురుకైన భాగస్వామ్యాన్ని ఇది తెలియజేస్తోంది.

యువతలో మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన పెంపొందించడానికి, సరైన నిర్ణయాలు తీసుకునేలా ప్రోత్సహించడానికి 20 బహుళ ఐచ్ఛిక ప్రశ్నలతో రూపొందించిన ఈ క్విజ్‌ను 2026 అక్టోబర్ 26న ‘మై భారత్’ పోర్టల్ ద్వారా ప్రారంభించినట్లు మంత్రిత్వ శాఖలోని ఒక సీనియర్ అధికారి తెలిపారు.

క్విజ్‌ను విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత పాల్గొన్నవారికి భాగస్వామ్య ధ్రువీకరణ పత్రాలు జారీ చేసినట్లు.. మాదకద్రవ్యాల వినియోగ నివారణపై వారి అవగాహనను మరింత పెంపొందించడానికి సరైన సమాధానాలను కూడా అందుబాటులో ఉంచినట్లు ఆయన పేర్కొన్నారు.

2020 ఆగస్టు 15న ప్రారంభించిన ‘నషా ముక్త్ భారత్ అభియాన్’.. నివారణ విద్య, అవగాహన కల్పన, చికిత్స, పునరావాసం, సమాజ భాగస్వామ్యం ద్వారా మాదకద్రవ్యాల డిమాండ్ తగ్గింపు ప్రయత్నాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని ఆ అధికారి తెలిపారు.

మొదట్లో 272 ప్రభావిత జిల్లాలలో ప్రారంభించిన ఈ కార్యక్రమం.. తదనంతరం దేశంలోని అన్ని జిల్లాలకు విస్తరించి మాదకద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా ఒక దేశవ్యాప్త ప్రజా ఉద్యమంగా అవతరించిందని ఆయన పేర్కొన్నారు.

నషా ముక్త్ భారత్ అభియాన్ 14.40 కోట్ల మంది యువత, 11.38 కోట్ల మంది మహిళలతో సహా 35.97 కోట్లకు పైగా ప్రజలకు చేరువైందని.. దీనికున్న విస్తృత వ్యాప్తిని, పెరుగుతున్న ప్రజా భాగస్వామ్యాన్ని ఇది తెలియజేస్తోందని ఆ అధికారి తెలిపారు.

నషా ముక్త్ భారత్ అభియాన్ విద్యార్థులు, యువతలో అవగాహన పెంపొందించడానికి.. సరైన నిర్ణయాలు తీసుకునేలా ప్రోత్సహించడానికి విద్యా సంస్థల్లో 34.40 లక్షలకు పైగా కార్యకలాపాలు నిర్వహించినట్లు ఆయన చెప్పారు.

సామాజిక న్యాయం, సాధికారత విభాగం (డీఓఎస్‌జేఈ) మద్దతుతో దేశవ్యాప్తంగా పనిచేస్తున్న 755 కంటే ఎక్కువ వ్యసన విముక్తి కేంద్రాల నెట్‌వర్క్ ద్వారా 39.91 లక్షల మందికి చికిత్స, పునరావాసం కల్పించినట్లు ఆ అధికారి తెలిపారు.

నషా ముక్త్ భారత్ అభియాన్‌కు సమాజ భాగస్వామ్యం ఒక ప్రధాన అంశంగా కొనసాగుతోందన్న ఆయన.. ప్రజలు 50.45 లక్షలకు పైగా ‘నషా ముక్త్’ ప్రతిజ్ఞలు చేశారని తెలిపారు. క్షేత్రస్థాయిలో అవగాహన కల్పన, ప్రజల సమీకరణ, నివారణ కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడానికి 2 లక్షలకు పైగా ‘నషా ముక్తి మిత్రలు’ నమోదు చేసుకున్నారని ఆ అధికారి వివరించారు.

మత్తుపదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజా అవగాహనను మరింత పెంపొందించడానికి, సరైన నిర్ణయాలు తీసుకునేలా ప్రోత్సహించడానికి, యువతను అవగాహన- నివారణ ప్రచారకర్తలుగా తీర్చిదిద్దడానికి ‘నషా ముక్త్ యువ, వికసిత్ భారత్ క్విజ్’ కీలక పాత్ర పోషించింది. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడానికి అవసరమైన పునాదిగా ఆరోగ్యకరమైన, సాధికారత కలిగిన, వ్యసన రహిత సమాజం అనే దార్శనికతను ఈ కార్యక్రమం మరింత బలోపేతం చేస్తోంది.

ఇటువంటి క్విజ్ కార్యక్రమాల ద్వారా సమాజ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయాలని, బాధ్యతాయుతమైన నిర్ణయాలను ప్రోత్సహించాలని, మాదకద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా జరుగుతున్న దేశవ్యాప్త ఉద్యమంలో ప్రజలు, ముఖ్యంగా యువత అర్థవంతమైన సహకారం అందించేలా వారిని సమీకరించాలని మంత్రిత్వ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.

***


(రిలీజ్ ఐడి: 2342269) సందర్శకుల సూచీ సంఖ్య : : 22
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , हिन्दी , Urdu , Marathi , Tamil