57th International Film Festival of India 2026
20 – 28 Nov 2026

ప్రేక్షకులను నవ్వించడం సవాలుతో కూడిన సృజనాత్మక కృషి: ఇఫి 2026లో అనిల్ రావిపూడి

నాడు పోస్టు చేయడమైనది: 25 NOV 2026 3:47PMby PIB Hyderabadరిలీజ్ ఐడి: 2341334Views: 16

ప్రేక్షకులను నవ్వించడం ఒక సవాలుతో కూడిన సృజనాత్మక ప్రక్రియ అని జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత, దర్శకుడు అనిల్ రావిపూడి అన్నారు. గోవాలో జరుగుతున్న 57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫి)లో తన చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’పై నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. 164 నిమిషాల నిడివి గల ఈ తెలుగు చలనచిత్రం ఇఫి 2026లోని ఇండియన్ పనోరమా మెయిన్‌స్ట్రీమ్ సినిమా విభాగానికి ఎంపికైన ఐదు చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సమావేశంలో దర్శకుడితో పాటు నిర్మాతలు సాహు గారపాటి, కె. సుస్మిత, నటి కేథరిన్ థ్రెసా పాల్గొన్నారు.

“హాస్యం అనేది ఎప్పుడూ ఒక గంభీరమైన సృజనాత్మక ప్రక్రియే” అని అనిల్ రావిపూడి వ్యాఖ్యానించారు. కుటుంబ భావోద్వేగాలను సమతుల్యం చేస్తూ, చిరంజీవి వంటి సూపర్‌స్టార్‌పై ప్రేక్షకులు పెట్టుకునే అంచనాలకు అనుగుణంగా హాస్యాన్ని సృష్టించడం ఎంతో సవాలుతో కూడుకున్న విషయమని ఆయన వివరించారు. ఏ జోక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో, ఏది వారిని నవ్విస్తుందో ముందుగానే అంచనా వేయడం కష్టమని అభిప్రాయపడ్డారు. ఈ ప్రయత్నంలో తనకు అండగా నిలిచిన రచయితల బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. వయసుతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే కథలను రూపొందించడమే తన లక్ష్యమని అనిల్ రావిపూడి పేర్కొన్నారు.

 

అనిల్ రావిపూడి రచించి, దర్శకత్వం వహించిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రంలో కథానాయకుడు జాతీయ భద్రతా విభాగంలో పనిచేసే ఒక అధికారి. వృత్తిపట్ల ఆయనకున్న అంకితభావం కారణంగా భార్యాపిల్లలకు దూరమవుతాడు. కుటుంబ బంధాలు దెబ్బతిని భార్యాబిడ్డలతో విడిపోయి జీవిస్తుంటాడు. ఆరు సంవత్సరాల తర్వాత తిరిగి తన కుటుంబానికి దగ్గరవ్వాలనే ప్రయత్నం చేస్తాడు. అందుకోసం తన భార్యాపిల్లలు చదువుతున్న పాఠశాలలోనే ఒక ఉద్యోగంలో చేరతాడు. హాస్యం, యాక్షన్, కుటుంబ భావోద్వేగాలను మేళవిస్తూ రూపొందించిన ఈ చిత్రం, వృత్తిపరమైన బాధ్యతలకు, వ్యక్తిగత కుటుంబ బంధాలకు మధ్య ఏర్పడే సంఘర్షణను ఆవిష్కరిస్తుంది. అదే సమయంలో దూరమైన కుటుంబ సభ్యుల మధ్య తిరిగి అనుబంధాలు చిగురించే అవకాశాన్ని కూడా కథ చర్చిస్తుంది.

చిరంజీవికి దర్శకత్వం వహించిన అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ, చిన్నప్పటి నుంచి చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగానని ఆయన తెలిపారు. సంవత్సరాలుగా చిరంజీవి పోషించిన విభిన్న పాత్రలు, ఆయన నటనా వైవిధ్యంపై తనకున్న అవగాహన ఆధారంగా ఈ సరళమైన కుటుంబ కథను రూపొందించానని చెప్పారు. చిరంజీవిలోని ప్రత్యేకమైన నటనా ప్రతిభ, హాస్య చతురత, భావోద్వేగాలను పలికించే సామర్థ్యం వంటి ప్రత్యేకతలను తెరపై ఆవిష్కరించేలా ఈ కథను తీర్చిదిద్దినట్లు అనిల్ రావిపూడి వివరించారు.

సంక్రాంతి సందర్భంగా విడుదలయ్యే సినిమాలతో తనకున్న అనుబంధం గురించి మాట్లాడుతూ,  సంక్రాంతి పండుగ కుటుంబ సభ్యులందరూ ఒకచోట చేరి ఆనందంగా గడిపే సమయమని, ఈ సమయంలో కుటుంబమంతా కలిసి థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసేందుకు ఆసక్తి చూపుతారని ఆయన అన్నారు. అందువల్ల ఈ పండుగ వాతావరణం కుటుంబ ప్రేక్షకులను అలరించే వినోదాత్మక చిత్రాలకు సహజంగానే అనుకూలంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. రోజువారీ జీవితంలో ఎదురయ్యే ఒత్తిళ్లు, ఆందోళనల నుంచి కొంతసేపైనా ప్రేక్షకులకు సినిమాలు ఉపశమనాన్ని కలిగిస్తాయని ఆయన పేర్కొన్నారు. ప్రేక్షకుల ముఖాల్లో చిరునవ్వులు పూయించడం, వారికి ఆనందాన్ని పంచడమే తనకు ఎంతో సంతృప్తినిచ్చే విషయమని, అలాంటి సినిమాలు మరిన్ని రూపొందించడానికి అదే ప్రధాన ప్రేరణగా నిలుస్తోందని అనిల్ రావిపూడి తెలిపారు.

ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన కేథరిన్ ట్రెసా మాట్లాడుతూ, సీనియర్ నటుడు చిరంజీవితో కలిసి పనిచేయడాన్ని ఎంతో విలువైన అనుభవంగా అభివర్ణించారు. ఆయనతో పనిచేయడం ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకునే అవకాశం లభించిందని తెలిపారు. గతంలో గంభీరమైన పాత్రలు పోషించిన తాను ఇప్పుడు తేలికపాటి వినోదభరిత పాత్రల వైపు మళ్లడంపై మాట్లాడుతూ, నటీనటులకు విభిన్న పాత్రలు పోషించే సామర్థ్యం ఎంతో అవసరమని పేర్కొన్నారు. అలాగే దర్శకుడి ఆలోచనలను, కథ పట్ల ఆయనకున్న దృక్పథాన్ని అర్థం చేసుకుని నటించడం ముఖ్యమని వివరించారు. తాను నటించిన చిత్రం భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఐఎఫ్ఎఫ్ఐ)కు ఎంపిక కావడం పట్ల ఆమె ఆనందం వ్యక్తం చేశారు. వాణిజ్య వినోదాత్మక చిత్రం ద్వారా మరింత విస్తృతమైన ప్రేక్షకులకు చేరువ కావాలన్న తన ఆకాంక్ష ఈ ఎంపికతో నెరవేరుతున్నందుకు సంతోషంగా ఉందని కేథరిన్ ట్రెసా తెలిపారు.

చలనచిత్రోత్సవాల్లో ప్రధాన స్రవంతి వాణిజ్య సినిమాలకు కూడా గుర్తింపు లభించడాన్ని అనిల్ రావిపూడి స్వాగతించారు. విభిన్న రకాల సినిమాలకు చలన చిత్రోత్సవాల్లో చోటు కల్పించేందుకు జ్యూరీ సభ్యులు చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. కళాత్మక విలువలు, సాంకేతిక నైపుణ్యం కలిగిన చిత్రాలను మాత్రమే కాకుండా భారీ సంఖ్యలో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వాణిజ్యపరంగా విజయవంతమయ్యే సినిమాలను కూడా చలనచిత్రోత్సవాలు గుర్తించి ప్రోత్సహించాలని ఆయన అభిప్రాయపడ్డారు. సినిమా ఏ రూపంలో ఉన్నా, అది ప్రేక్షకులతో అనుసంధానమై వారిని ఆకట్టుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటే దానికి తగిన గుర్తింపు లభించాలని అనిల్ రావిపూడి పేర్కొన్నారు.

ఐఎఫ్ఎఫ్ఐ వేదికపై ఈ చిత్రాన్ని ప్రదర్శించడం విభిన్న చలనచిత్ర సంప్రదాయాలతో పాటు జనాదరణ పొందిన వాణిజ్య సినిమాలకు కూడా ఉన్న ప్రాధాన్యతను చాటిచెబుతోంది. హాస్యం, భావోద్వేగాలు, కుటుంబ అనుబంధాలు, ఉమ్మడి అనుభూతుల సమ్మేళనంతో కుటుంబ సభ్యులందరినీ ఒకచోట చేర్చి ఆనందాన్ని పంచే కథలకు కూడా చలనచిత్రోత్సవాల్లో తగిన స్థానం ఉందనే విషయాన్ని ఈ చిత్ర ప్రదర్శన మరోసారి గుర్తుచేస్తోంది.

ఈ కార్యక్రమానికి స్వాతి అగర్వాల్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

Watch full Press conference here:

Read IFFILOID here: https://www.pib.gov.in/iffi/57/iffiLoid.aspx?yr=2026&lang=1&reg=48

***


Great films resonate through passionate voices. Share your love for cinema with #IFFI2026 and #StoriesWithoutBorders. Tag us @pibindia on Instagram and @PIB_India on X, and we will help amplify your festival moments!

For accredited journalists, critics, bloggers, and vloggers seeking 1-on-1 interviews with filmmakers and festival juries, write to us at:
iffi.mediadesk@pib.gov.in with the subject line: Take One with PIB.


Official Release ID: 2341334
•
Media Centre: Goa
•
Festival Dates: Nov 20 – 28, 2026