57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో (ఇఫీ) భాగంగా పనాజీలోని కళా అకాడమీలో నిర్వహించిన ప్రారంభ స్క్రిప్ట్ పిచింగ్ ల్యాబ్ ‘పేజ్ సే పిచ్ తక్’ విజేతలను ప్రసార భారతి ఈ రోజు ప్రకటించింది. ప్రసార భారతి ఛైర్మన్ శ్రీ ప్రసూన్ జోషి రూపొందించిన ఈ కార్యక్రమం.. ఫీచర్ ఫిల్మ్‌లు, డాక్యుమెంటరీలు, లఘు చిత్రాల విభాగాల్లో పది భారతీయ భాషల్లో సొంత కథలను ప్రదర్శించేందుకు వర్ధమాన రచయితలకు ఒక వార్షిక జాతీయ వేదికను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ కార్యక్రమానికి అపూర్వ స్పందన లభించింది. ప్రకటన వెలువడిన కేవలం పది రోజుల్లోనే దాదాపు 1,000 స్క్రిప్టులు వచ్చాయి. ఇది దేశవ్యాప్తంగా ఉన్న యువ రచయితల అపారమైన కథా రచనా ప్రతిభను, సృజనాత్మక ఆకాంక్షలను తెలియజేస్తోంది.
‘మిర్చి కేక్’ స్క్రిప్టునకు గాను అవిశేష్ ఝా మొదటి బహుమతి విజేతగా నిలిచి రూ. 5 లక్షల నగదు పురస్కారాన్ని అందుకున్నారు. ‘సంహార్’ స్క్రిప్టుకు గాను సత్య వ్యాస్ ద్వితీయ బహుమతిని సొంతం చేసుకొని రూ. 3 లక్షలు పొందారు. ‘శరద్ పూర్ణిమ’ స్క్రిప్టుకు జితేష్ ఠాకూర్ తృతీయ బహుమతి గెలుచుకుని రూ. 2 లక్షల నగదు పురస్కారాన్ని అందుకున్నారు.
సమాచార- ప్రసార మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ పృథుల్ కుమార్, జాతీయ చలనచిత్ర అభివృద్ధి సంస్థ (ఎన్‌ఎఫ్‌డీసీ) కార్యనిర్వాహక డైరెక్టర్ శ్రీ ధీరజ్ సింగ్ హాజరైన ఒక కార్యక్రమంలో ఈ పురస్కారాలను ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి శ్రీ పృథుల్ కుమార్ మాట్లాడుతూ.. వర్ధమాన కథా రచనా ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం ఎంతో ముఖ్యమని చెప్పారు. యువ భారతదేశంలోని సృజనాత్మక సామర్థ్యాన్ని వెలికితీయడం, దేశ యువత చెప్పాలని ఆకాంక్షిస్తున్న కథలను గుర్తించడం అత్యవసరమని ఆయన అన్నారు. చలనచిత్ర నిర్మాణంలో స్క్రిప్ట్ రచన ప్రాముఖ్యతను వివరిస్తూ.. సినిమా నిర్మాణ ప్రక్రియలో స్క్రిప్ట్‌ను రూపొందించడం మొదటి అడుగు అని, సినిమా తీయడానికి లప్రణాళిక అనేది ప్రాథమిక అంశమని ఆయన పేర్కొన్నారు. స్క్రిప్ట్‌ను ప్రణాళికకు పర్యాయపదంగా అభివర్ణించిన ఆయన.. ఆకట్టుకునే స్క్రిప్ట్, బలమైన కథ విజయవంతమైన చిత్ర నిర్మాణానికి పునాదిగా నిలుస్తాయని ఉద్ఘాటించారు.
దూరదర్శన్ డైరెక్టర్ జనరల్ శ్రీమతి రీనా సోనోవాల్ కౌలి స్వాగత ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా భారతదేశ భాషా, సృజనాత్మక వైవిధ్యాన్ని వెలుగులోకి తీసుకురావడంలో ఈ కార్యక్రమానికి ఉన్న పాత్రను ఆమె వివరించారు. వర్ధమాన రచయితలు తమ సొంత ఆలోచనలను జాతీయ వేదికపై ప్రదర్శించేందుకు అవకాశాలను కల్పించడం ఎంతో అవసరమని ఆమె చెప్పారు.
ఈ పిచింగ్ సెషన్లలో ఎంపికైన పది మంది అభ్యర్థులు ప్రముఖ జ్యూరీ ముందు తమ సొంత స్క్రిప్టులను వివరించారు. ఈ జ్యూరీలో నటుడు, ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ చలనచిత్ర పురస్కార గ్రహీత శ్రీ మనోజ్ జోషి.. భారతీయ చరిత్ర, సంస్కృతి, సాహిత్య రంగాలలో రచయిత, సంపాదకులు, స్వతంత్ర పరిశోధకులు శ్రీ సందీప్ బాలకృష్ణ.. ‘టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ’, ‘బత్తీ గుల్ మీటర్ చాలూ’ వంటి చిత్రాలకు ప్రసిద్ధి చెందిన చిత్ర నిర్మాత, ఎడిటర్ శ్రీ శ్రీ నారాయణ్ సింగ్.. జాతీయ చలనచిత్ర పురస్కార గ్రహీతైన పాత్రికేయుడు, రచయిత, చలనచిత్ర విమర్శకుడు, పుణెలోని ఎఫ్‌టీఐఐ (ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా) పాలక మండలి ఉపాధ్యక్షుడు శ్రీ అనంత్ విజయ్ సభ్యులుగా ఉన్నారు.
తుది ఎంపికకు అర్హత సాధించిన వాటి ప్రత్యేకతను గుర్తిస్తూ.. ఈ కార్యక్రమంలో భాగంగా నాలుగు, ఐదు, ఆరో స్థానాల్లో నిలిచిన విజేతలకు ఒక్కొక్కరికి రూ. 50,000 చొప్పున ప్రత్యేక ప్రశంసా పురస్కారాలను అందజేశారు. ఏడు, ఎనిమిది, తొమ్మిది, పదో స్థానాల్లో నిలిచిన వారికి ప్రశంసా పత్రాలను ఇచ్చారు. అత్యుత్తమంగా నిలిచిన 30 మంది షార్ట్‌లిస్ట్ రచయితలకు భాగస్వామ్య ధ్రువీకరణ పత్రాలను (పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్) అందజేశారు.
2026 నవంబర్ 21 నుంచి 23 వరకు జరిగిన ‘పేజ్ సే పిచ్ తక్’.. వర్ధమాన రచయితలు, చలనచిత్ర పరిశ్రమ మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది; దీని ద్వారా సొంత ఆలోచనలు వెండితెరపైకి వచ్చేందుకు ఒక వేదికను కల్పిస్తోంది. ప్రతిభావంతులైన కథా రచయితలను పరిశ్రమ నిపుణులతో అనుసంధానించడం.. వారి స్క్రిప్టులు ఫీచర్ ఫిల్మ్‌లు, డాక్యుమెంటరీలు, లఘు చిత్రాలుగా రూపుదిద్దుకునే అవకాశాలను సృష్టించాలని ఈ వార్షిక కార్యక్రమం లక్ష్యంగా పెట్టుకుంది.
ఇఫీలోయిడ్ ఇక్కడ చదవండి: https://www.pib.gov.in/iffi/57/iffiLoid.aspx?yr=2026&lang=1®=48