నాడు పోస్టు చేయడమైనది:
23 NOV 2026 12:12PM by PIB Hyderabad
నలభై అయిదో ‘భారత అంతర్జాతీయ వాణిజ్య మేళా- 2026’ (ఐఐటీఎఫ్)ను ఈ నెల 13 నుంచి 27 వరకు న్యూఢిల్లీలోని భారత్ మండపం 2వ నంబరు హాలులో నిర్వహిస్తున్నారు. దీనిలో ఆయుష్ మంత్రిత్వ శాఖ భారత్‌కు చెందిన వివిధ సాంప్రదాయిక ఆరోగ్య సంరక్షణ పద్ధతులను ప్రదర్శిస్తోంది. సందర్శకులకు ఆరోగ్య సంరక్షణ సంప్రదింపులు, చర్చలు, సాంప్రదాయిక ఆహార పదార్థాల తయారీ, ఔషధీయ మొక్కల ప్రదర్శనతో పాటు విద్యాసంబంధిత ప్రజెంటేషన్ల ద్వారా ఆరోగ్యదాయక జీవనశైలిని ప్రోత్సహించడంలో, వ్యాధులు రాకుండా శరీరాన్ని కాపాడుకోవడానికి తీసుకోవలసిన జాగ్రత్త చర్యలను తెలియజేయడంలో ఆయుష్ చికిత్సా పద్ధతులకు ఉన్న సందర్భశుద్ధిని, ప్రాధాన్యాన్ని ఆయుష్ పెవిలియన్ స్పష్టం చేస్తూ, విశేష అనుభవాన్ని పంచుతున్నది.

ఆయుష్ మంత్రిత్వ శాఖలో భాగమైన వివిధ సంస్థలు, పరిశోధన మండలులు ఈ మండపంలో స్టాల్స్‌ను ఏర్పాటు చేశాయి. ఇక్కడ సాంప్రదాయిక జ్ఞానాన్ని నిత్య జీవితంలో ఆరోగ్య సంబంధిత అలవాట్లతో జోడిస్తూ, వేరువేరు కార్యకలాపాలను, సేవలను ప్రదర్శిస్తున్నారు. సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రిసర్చ్ ఇన్ ఆయుర్వేదిక సైన్సెస్- సెంట్రల్ ఆయుర్వేద రిసర్చ్ ఇనిస్టిట్యూట్ (సీసీఆర్ఏఎస్-సీఏఆర్ఐ) ద్వారా ఆయుర్వేద తాలూకు అవుట్‌పేషెంట్ విభాగం (ఓపీడీ) సేవలతో పాటు ‘ప్రకృతి పరీక్ష’ సదుపాయాన్ని అందిస్తున్నారు. దీంతో పాటు నివారణ ప్రధాన ఆరోగ్యసంరక్షణ, ఆరోగ్యకర జీవనశైలులు, ఆయుర్వేద సంబంధిత వెల్నెస్ సమాచారాన్ని కూడా అందిస్తున్నారు. సాధారణంగా ఉపయోగించదగ్గ ఔషధీయ మూలికలు, మసాలా దినుసులను న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న అఖిల భారత ఆయుర్వేద సంస్థ (ఏఐఐఏ) ప్రదర్శిస్తోంది. వీటిలో అశ్వగంధ, శతావరి, అర్జున, ఉసిరి, పసుపు, గుడూచీ వంటివి ఉన్నాయి. వాటి సాంప్రదాయిక ఆయుర్వేద ఉపయోగాలతో పాటు ఆరోగ్యాన్ని పెంపొందింపచేయడంలో వీటి ప్రాసంగికతను గురించి కూడా వివరిస్తున్నారు. ఔషధీయ మూలికలను ఉపయోగించడానికన్నా ముందు వాటిని ఎంత మోతాదుల్లో వాడాలి, వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితులు, వృత్తినిపుణుల సలహాలకు ఉన్న ప్రాధాన్యాన్ని గురించి కూడా సందర్శకులకు సమాచారాన్ని అందిస్తున్నారు.
జైపూర్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న జాతీయ ఆయుర్వేద సంస్థ (ఎన్ఐఏ) తరఫున ఆయుష్ ఆహార ఉత్పాదనలను ప్రదర్శనకు పెట్టారు. వాటిలో రాగి కుకీస్, త్రిఫల జామ్, ఎలో వెరా జెల్, హెర్బల్ లిప్‌బామ్ వంటివి ఉన్నాయి. ఇక్కడ ఆహారం, జీవనశైలి ఆధారిత ఆయర్వేదిక సర్పాలు, నిచ్చెనల ఆటతో పాటు, మానవ శరీరంలో విభిన్న వ్యవస్థలను దృశ్య రూపంలో వివరించే వర్చువల్ రియాలిటీ అనుభవం సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. వీటినికి అదనంగా ప్రకృతి, పంచకర్మ, ఆయుర్వేదిక వంటకాలు, దైనందిన జీవితంలో ఆయుర్వేద పోషించగల పాత్ర పట్ల అవగాహనను పెంపొందింప చేయడానికి సూచనలు, విద్య, కమ్యూనికేషన్ (ఈఐసీ) సామగ్రిని కూడా ప్రదర్శిస్తున్నారు.
ఆయుర్వేద ఆధారిత ఆహార నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి పోషక్ కుకీస్, ఆయుర్వేదిక్ బ్రెడ్, సాంప్రదాయిక పానీయమైన ‘పానకం’ను రాష్ట్రీయ ఆయుర్వేద విద్యాపీఠ్ (ఆర్ఏవీ) వారు ప్రదర్శిస్తున్నారు. ‘దాదీ సే పూఛో’, ‘మిలెట్స్ ఆన్ ద వీల్’ వంటి కార్యకలాపాల ద్వారా సందర్శకులకు సాంప్రదాయిక అన్నపానాల అలవాట్లు, సిరిధాన్యాల పోషక సంబంధిత ప్రయోజనాలతో పాటు ఆరోగ్య జీవన శైలి పట్ల అవగాహనను పెంపొందింపచేస్తున్నారు.
మురార్జీ దేశాయి జాతీయ యోగా సంస్థ (ఎమ్డీఎన్ఐవై) ఆధ్వర్యంలో ఆయుష్ మండపంలో ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక వేదికపై యోగా ప్రదర్శన, యోగా కార్యక్రమాలను తరచు నిర్వహిస్తున్నారు. సందర్శకుల వయసును, ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలను, జీవనశైలిని పరిశీలించి వాటికి అనుగుణంగా ఉండే వ్యక్తిగత యోగా సంప్రదింపుల సేవలను కూడా సమకూరుస్తున్నారు. వీటికి తోడు, యోగాకు సంబంధించిన ప్రశ్నలు-జవాబుల పోటీలు, ఆసనాల పోటీలను నిర్వహించడం ద్వారా ప్రజలు ఆ పోటీలలో పాలుపంచుకోవడానికి ముందుకు వచ్చేటట్లు చూస్తూ వారి భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తున్నారు. వీటిలో సందర్శకులు చురుకుగా పాల్గొంటున్నారు. యోగాను తమ దినచర్యలో ఒక భాగంగా చేర్చుకోవడానికి పలువురు మొగ్గు చూపుతున్నారు.

యునానీ స్టాలును కేంద్రీయ యునానీ వైద్య పరిశోధన మండలి (సీసీఆర్యూఎమ్) ఆధీనంలో న్యూఢిల్లీ ప్రధానకేంద్రంగా పనిచేస్తున్న రీజనల్ రిసర్చ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యునానీ మెడిసిన్ (ఆర్ఆర్ఐయూఎమ్) నడుపుతోంది. దీనిలో సాంప్రదాయిక యునానీ ఆహారాన్ని, ఆరోగ్య సంరక్షణ పద్దతులను ప్రదర్శిస్తున్నారు. ఇక్కడ సందర్శకులకు యునానీ కహవా, హరీరా, హల్వా ఘీకావర్, గుల్కంద్, మురబ్బా ఆమ్లా వంటి సాంప్రదాయిక ఆహార, పానీయాలను రుచి చూసేందుకు అనుమతిస్తున్నారు. మార్పుచేర్పులు చేసిన డిజిటల్ మిజాజ్ మూల్యాంకన కియోస్కును ఉపయోగించి సందర్శకులకు తమ స్వస్థతను మదింపు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. దీంతో వారు తమ వ్యక్తిగత ఆహార సంబంధిత సూచనలను కూడా అందుకోగలుగుతున్నారు. ఈ స్టాలులో యునానీ వైద్య పద్ధతికి సంబంధించిన డిజిటల్ ప్రజెంటేషన్లు, డాక్యుమెంటరీలను కూడా ప్రదర్శిస్తున్నారు. ఈ నెల 18, 19వ తేదీల్లో యునానీ ఓపీడీ ద్వారా 151 మంది రోగులకు ఉచితంగా సంప్రదింపులతో పాటు, మందులను కూడా అందజేశారు.

ఒక స్టాలును చెన్నయి ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న కేంద్రీయ సిద్ధ పరిశోధన మండలి (సీసీఆర్ఎస్), జాతీయ సిద్ధ సంస్థ (ఎన్ఐఎస్) ఏర్పాటు చేశాయి. ఈ స్టాలులో ‘సిద్ధ’ వైద్య సిద్ధాంతాలను, నివారణ ప్రధానంగా ఉండే ఆరోగ్యసంరక్షణ పద్ధతులతో పాటు చికిత్సకు ఉపయోగించవలసిన విధానాలను తెలియజేస్తున్నారు. ‘సిద్ధ’ ఆహారం, పోషణ, జీవనశైలిలో మార్పులు, రోగ నిర్ధారణ పద్ధతులు, సాంప్రదాయిక ఔషధీయ చిట్కాలు, ‘వర్మ చికిత్స’ సహా చికిత్స పద్ధతులను గురించిన సమాచారాన్ని కూడా దీనిలో అందిస్తున్నారు. సందర్శకులను ఆకర్షించడానికి డిజిటల్ ప్రెజెంటేషన్లు, డాక్యుమెంటరీలు, సూచన విద్య, కమ్యూనికేషన్ (ఐఈసీ) సామగ్రిని ఉపయోగిస్తున్నారు. వీటికి అదనంగా జాతీయ సిద్ధ చికిత్స సంస్థకు చెందిన విద్యా, పరిశోధన కార్యకలాపాలను కూడా ఈ స్టాలులో వివరిస్తున్నారు. వాటిలో బీఎస్‌ఎమ్‌ఎస్, ఎమ్డీ (సిద్ధ), పీహెచ్డీ పాఠ్యక్రమాలు ఉన్నాయి. వీటి సమాచారాన్ని తెలుసుకోవడం వల్ల సిద్ధ చికిత్సను అధ్యయనం చేసే, ఈ రంగంలో ఉద్యోగ అవకాశాలను గుర్తించే ప్రక్రియలపై విద్యార్థులకు పట్టు చిక్కుతున్నది.

డిజిటల్ ఆడియో, విజువల్ సామగ్రి, ఐఈసీ సామగ్రిలతో పాటు ఆయుష్ ఆహార ప్రదర్శన ద్వారా యోగా, నేచరోపతి గురించి ప్రచారాన్ని యోగ, నేచరోపతిలలో పరిశోధనకు ఉద్దేశించిన కేంద్రీయ మండలి (సీసీఆర్‌వైఎన్) నిర్వహిస్తోంది. ఇందులో మఖానా లడ్డూ, వేరుసెనగ లడ్డూ, నువ్వుల లడ్డూ, ఖారా వంటి ఆరోగ్య వర్ధక అల్పాహారాన్ని సందర్శకులకు పరిచయం చేస్తున్నారు. వీటికి తోడు ఈ నెల 17, 18వ తేదీలలో యోగా, నేచరోపతి, ఆహారపుటలవాట్లు, జీవనశైలిలో మార్పులకు సంబంధించిన ఉచిత వైద్య సంప్రదింపులను కూడా అందజేశారు.
సోవా-రిగ్పా జాతీయ సంస్థ హిమాలయ ప్రాంత ప్రాచీన చికిత్స పద్ధతిపై సందర్శకులకు అవగాహనను పెంచుతున్నది. సోవా-రిగ్పా ఆహారం, చికిత్స పద్ధతులు, మూలికా ఫార్ములేషన్ల గురించి విస్తృత సమాచారాన్ని ఈ స్టాలులో అందజేస్తున్నారు. నిపుణులు సోవా-రిగ్పా శాస్త్రీయ గ్రంథాల ఆధారంగా సందర్శకులకు వ్యక్తిగత మార్గదర్శకత్వాన్ని కూడా సమకూరుస్తున్నారు.
ప్రత్యక్ష ప్రదర్శనలు, సమాచార సామగ్రి, శతావరీ రంగానికి చెందిన ఔషధీయ మొక్కల పంపిణీ ద్వారా ఆ మొక్కలకు ఉన్న ప్రాధాన్యాన్ని జాతీయ వైద్య మొక్కల మండలి (ఎన్‌ఎమ్‌పీబీ) చాటిచెబుతోంది. సందర్శకులకు క్యూఆర్ కోడ్ కలిగివున్న మొక్కల సహాయంతో వాటిని గురించిన సమాచారాన్ని తెలుసుకొనేందుకు వీలు కల్పించారు. అలాగే ఔషధీయ మొక్కలు, వాటి ఉపయోగాల గురించి అవగాహన ఏర్పడటానికి చిన్న పుస్తకాలను, కరపత్రాలను, ‘‘ప్రొఫెసర్ ఆయుష్మాన్’’ పేరుతో ఒక కామిక్ బుక్‌ను పంచిపెడుతున్నారు.

‘భారత అంతర్జాతీయ వాణిజ్య మేళా- 2026’ (ఐఐటీఎఫ్)లో ఆయుష్ మండపాన్ని ఏర్పాటు చేసి వివిధ ప్రదర్శనలు, ఆకర్షణీయ కార్యకలాపాల సాయంతో సందర్శకులకు భారతదేశ సాంప్రదాయిక ఆరోగ్యసంరక్షణ వ్యవస్థల గురించి తెలుసుకొని, నివారణ ప్రధాన ఆరోగ్యసంరక్షణ, పోషణ, వెల్నెస్ పరంగా అవి పోషించగల పాత్రను ఆకళింపు చేసుకొనేందుకు అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఆయుష్ పద్ధతుల పట్ల ప్రజలలో స్పృహను కలిగించి, సులభ, ఆకర్షణీయ కార్యకలాపాలు, విద్యా కార్యక్రమాల ద్వారా ఆయుష్ వైద్యాన్ని సాధారణ ప్రజానీకం చెంతకు చేర్చాలన్న లక్ష్యంతో ఆయుష్ మంత్రిత్వ శాఖ నిరంతరంగా చేస్తున్న కృషికి ఈ మండపం అద్దం పడుతోంది.
***